31, జులై 2016, ఆదివారం

రాజకీయ నాటకాలు!

‘‘దీని వెనుక పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉంది?’’
‘‘ఏదీ మనం తినే పిజ్జా వెనుకనా? మన ఫుడ్ మనం మరిచిపోయి ఆరోగ్యం పాడు చేసే ఇలాంటి తిండి తినడానికి మనకు అలవాటు చేయడం వెనుక బహుళ జాతి కుట్రే కారణం’’
‘‘ఎప్పుడూ తిండి యావేనా? ఆంధ్రకు ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించక పోవడం వెనుక పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉందని తెలుగు నేత ఒకరు నాకు రహస్యంగా చెప్పారు’’‘‘80వ దశకంలో టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలానే తనను పదవి నుంచి దించేయడానికి విదేశీ హస్తం ఉందన్నారు. రష్యా అమెరికా ప్రపంచంలో ఏ దేశాన్నీ సుఖంగా బతక నివ్వడం లేదు. అన్నింటిలో వేలు పెడుతూనే ఉన్నాయి. కుట్ర ఉండే ఉంటుంది?’’

‘‘నేనో విషయం ప్రస్తావించానంటే, నువ్వు చెబితే వినాలని కాదు.’’
‘‘అలాగా అయితే అంతర్జాతీయ కుట్ర ఏంటో నువ్వే చెప్పు’’
‘‘ఏ హోదా ఇవ్వక ముందే బాబు రాజధాని నగర నిర్మాణానికి పిలుపు ఇస్తే, 200 దేశాలు పోటీ పడ్డాయి. ఇక ప్రత్యేక హోదా ఇస్తే’’


‘‘ఆగాగు ప్రపంచంలో ఉన్నవే 195 దేశాలు కదా? గూగుల్ ఇదే మాట చెబుతోంది. కావాలంటే ఇదిగో స్మార్ట్ఫోన్‌లో చూడు. నువ్వేంటి 200 దేశాలు పోటీ పడుతున్నాయని చెబుతున్నావ్’’
‘‘ఎదురుగా కనిపించే మనిషి కన్నా ప్రాణం లేని యంత్రం చెప్పే దానికే విలువ ఇవ్వడం వల్లనే ప్రపంచం ఇలా తయారైంది. ఉగ్రవాదం పెరిగిపోతోంది. ఇవేనా మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మాగాంధీ ప్రపంచానికి బోధించిన విలువలు? శ్రీశ్రీ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అని రాసింది ఇలాంటి మాటలు వినేందుకేనా? సత్యజిత్‌రాయ్ అవార్డు సినిమాలు తీసింది మన కోసం కాదా? బిస్మిల్లాఖాన్ షహనాయి వాయించింది దేని కోసం ? రాజ్‌కపూర్ మేరానామ్ జోకర్‌ను నువ్వు అర్ధం చేసుకున్నది ఇంతేనా? రాహుల్‌గాంధీ ఇంత వయసులోనూ పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఇందుకోసమే అనుకుంటున్నావా? ఇంటర్‌లో 70 శాతం మార్కులతో లోకేశ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఇందుకే అనుకుంటున్నావా? వీరందరి త్యాగాలు వృధానేనా? వీరి మాటల కన్నా నీకు ఆ స్మార్ట్ఫోన్‌లో గూగుల్ వాడు చెప్పిందే ముఖ్యమా? సాటి తెలుగు వాడి మాట కన్నా ప్రాణం లేని ఫోన్‌కు విలువ ఇస్తున్నావు. అందుకే తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టుకోవడానికి ఏ బ్యాంకు ముందుకు రావడం లేదు. కనీసం తెలుగు వాడి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు ఉన్నా బాగుండేది. సాటి తెలుగు వాడనే అభిమానంతో తెలుగు ఆత్మగౌరవాన్ని ఆ బ్యాంకన్నా తాకట్టు పెట్టుకునేదేమో!’’


‘‘సారీ నేనేమన్నానని  ఇన్నేసి  అంటున్నావు. చెప్పింది వింటాను. అంతర్జాతీయ కుట్ర ఏంటో చెప్పు’’
‘‘మోదీకి ఢిల్లీలో పెద్దగా అనుభవం లేదు. అదే బాబుగారికి ఢిల్లీలో చాలా స్పీడ్‌గా చక్రం తిప్పిన అనుభవం ఉంది. మోదీ ఇమేజ్ క్రమంగా సన్నగిల్లడం ఖాయం. దేశానికి ప్రత్యామ్నాయం థర్డ్ ఫ్రంట్. ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు బాబు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
బాబు ఏనాటికైనా మోదీకి థ్రెట్. బాబు అమెరికాకు అనుకూలం. దీని వల్ల చైనా రష్యాలకు పక్కలో బల్లెం. బాబు చాలా ముందు చూపుతో అంతర్జాతీయ దృక్ఫథంతో అమరావతిని జపాన్‌కు రెండవ రాజధాని, చైనాకు మూడవ రాజధానిగా భావించాలని కోరితే వారు సరేనన్నారు. ఇవన్నీ మోదీ వర్గీయులకు కంటగింపుగా మారాయి. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వడానికి మోదీ వణికిపోతున్నారు’’
‘‘మీకు ప్రత్యేక హోదా ఇస్తామంటే మాకేమీ అభ్యంతరం లేదు అని కెసిఆర్ కూడా ప్రకటించారు. అంతర్జాతీయ కుట్రలో కెసిఆర్? పాత్ర కూడా’’
‘‘మెల్లగా అడుగుతావేంటి బాబులా రోజుకు రెండు సార్లు ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు పెట్టి బయటపడే రకం కాదు కెసిఆర్. అమెరికా, చైనా, జపాన్, రష్యాలకు బాబు ఒకేసారి దగ్గరవుతున్నాడు. లోకేశ్‌ను చూసి ఒబామా బావోద్వేగానికి గురయ్యాడు. జాగ్రత్త అని మోదీ చెవిలో చెప్పిందే కెసిఆర్. బ్రదర్ అనిల్‌కుమార్ ద్వారా జగన్ అటు నుంచి నరుక్కొస్తూ ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా మోదీకి చెప్పించారు.’’



‘‘అంటే కేంద్రంలో రెండు పార్టీల బంధం వీడిపోయినట్టేనా?’’
‘‘విడిపోవాలంటే ఎంత సేపు రెండు నిమిషాల పని.. కానీ విడిపోరు’’
‘‘అంటే మోదీకి బాబు అంటే?’’
‘‘ఏ పార్టీ నాయకులైనా తనకు పోటీ వస్తారు అనుకున్నవారిని క్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తుంటారు. బయటకు పంపిస్తుంటారు. అంతెందుకు స్వయంగా బాబుగారు సైతం ఈ పని చేసిన వారే. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉపేంద్ర, రేణుకాచౌదరి, చివరకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటివారిని బయటకు పంపలేదా? ఇదీ అంతే బాబును ఇలానే వదిలేస్తే చివరకు బిజెపి ఎంపిలు తిరుగుబాటు చేసి మాకు మోదీ వద్దు బాబే ముద్దు అని అడుగుతారని ఆయన భయం.’’
‘‘దీంట్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల వైఖరి ఎలా ఉండొచ్చంటావ్’’
‘‘పైకి అలా కనిపిస్తారు కానీ వీళ్లంతా ఒకటే. ఇండియా- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఇలా ఉంటేనే అటు పాకిస్తాన్‌లోని పార్టీలకు ఇటు మోదీకి ప్రయోజనం అందుకే బాబును దెబ్బతీయడం కోసం వీళ్లంతా మోదీకి తెర వెనుక అండగా ఉంటారని నాకున్న కచ్చితమైన సమాచారం. ’’
 ‘‘ ప్రపంచాన్ని కదిపేసే ఇలాంటి అద్భుతమైన విషయాలు నీకెలా తెలుస్తాయి. కొంపతీసి వీకిలిక్స్ వాడితో సంబంధం లేదు కదా?’’
‘‘కాదోయ్ తెలుగు పార్టీ అభిమానుల నుంచి వచ్చిన సమాచారం. క్రాస్ చెక్ చేసుకున్నాను దాదాపు అభిమానులు అందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారని నిర్థారించుకున్నాను. బాబు సూపర్‌మ్యాన్ ఇమేజ్‌కు మోదీ భయపడుతూ హోదా ఇవ్వడం లేదు. గవర్నర్ మార్పు, మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి, ప్రత్యేక హోదా మూడు నిర్ణయాలు ఒకే రోజు తీసుకుంటారేమో’’
‘‘మరో మాట చెప్పు’’
‘‘అంతా నాటకాలు ఆడుతున్నారని బాబు చెప్పాక చెప్పేందుకు ఇంకేముంది? రాజకీయాలు అంటేనే నాటకాలు.’’  


24, జులై 2016, ఆదివారం

రజనీకాంత్- చిరంజీవి- కన్యాశుల్కం

‘‘అబ్బాయి కమల్ హాసన్ అంత అందగాడు. ఐటి కంపెనీలో  ఉద్యోగం
నెలకు లక్ష.. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ రెండు, బ్యాంకులో డిపాజిట్. ఐనా అమ్మాయి నో చెప్పింది’’
‘‘ఎందుకు? ’’
‘‘కబాలి మొదటి రోజు మొదటి ఆటకు టికెట్ సంపాదించగలవా? అని పెళ్లి చూపుల్లో అమ్మాయి అడిగితే  అబ్బాయి నా వల్ల కాదు అన్నాడట! దాంతో నన్నేం  సుఖపెడతావు సంబంధం క్యాన్సిల్ అంది’’
‘‘ బాబూ ఈ జోకు కబాలి విడుదలకు ముందుది తరువాత సీన్ మారింది’’
‘‘కబాలి ఎలా ఉందట!’’
‘‘అభిమానులను అలరించిందని కొందరు, కబాలి కాదు బలి అని మరి కొందరు పోటాపోటీగా సామాజిక మాధ్యమాల్లో రివ్యూలు రాసేస్తున్నారు. ’’
‘‘ఇంతకూ ఎలా ఉందో చెప్పలేదు’’
‘‘ఎలా ఉంటే మనకేంటి రివ్యూలు చదవడమే తప్ప సినిమాలు చూసే అలవాటు లేదు’’
‘‘ఓ పెద్దాయన్ని అడిగితే బలవంతంగా 30లక్షలకు కొన్న బిక్షగాడు సినిమా 18 కోట్లు వసూలు చేసి బయ్యర్‌ను కోటీశ్వరున్ని చేసింది. 11కోట్లకు కొన్న కబాలి బయ్యర్‌ను బికారిని చేసింది అని చెప్పాడు. ’’
‘‘లోకం తీరు అంతేనోయ్ అభిమానులు చూసిన కబాలి, విమర్శకులు చూసిన కబాలి ఒకటే.. కానీ ఎవరి కోణంలో వాళ్లు చూశారన్నమాట! సినిమానే కాదు ప్రతి దాన్ని ఎవరి కోణంలో వాళ్లు చూస్తారు. అనార్కలి అంత అందగత్తే ఏమీ కాదు అని తండ్రి మందలిస్తే నా కళ్లతో చూడు అని సలీమ్ అన్నాడట! ఏమైనా రజనీ ఎన్టీఆర్ కన్నా గ్రేట్’’
‘‘ఎన్టీఆర్ 60ఏళ్ల వరకు హీరోగా నటించవచ్చునని తెలుగునాట నిరూపిస్తే  రజనీ 65 ఏళ్ల వయసులో హీరోగా నటించడమే కాకుండా అనేక దేశాల్లో రజనీ మానియా సృష్టించవచ్చునని నిరూపించారు. రామకృష్ణ మఠంలో ఉపన్యాసాలు ఇవ్వాల్సిన వయసులో కబాలి అంటూ ఆ డైలాగులు చెప్పిన తీరు అభిమానులకు వెర్రెక్కించడం చిన్న విషయం కాదు. ఆ ఒక్క డైలాగు చాలు అంటున్నారు?’’
‘‘రాజకీయాల్లో కాకుండా సినిమాల్లో నటించే అల్లుడు దొరకడం రజనీకాంత్ అదృష్టం, ఎన్టీఆర్ దురదృష్టం ’’
‘‘ఎన్టీఆర్‌కు రజనీకాంత్‌కు పోలికేంటి? చిరంజీవి, రజనీకాంత్‌ను పోల్చాలి కానీ’’
‘‘ ఆ పోలికలు కూడా జరుగుతూనే ఉన్నాయి కదా? చిరంజీవి 150 సినిమా ఎలా ఉంటుందో? ఇంతకూ కథేంటో? ’’
‘‘ఇంత వరకు ప్రపంచంలో ఎవరూ టచ్ చేయని కథ తన వద్ద ఉందని చిన్నికృష్ణ చెబుతున్నాడు కదా? ’’
‘‘ అంటే ఆయన నమ్ముకున్న  ఇంగ్లీష్ సినిమా సిడి ఎవరి కళ్లల్లోనూ పడలేదని ఆయన ధీమా నేమో’’
‘‘చిరంజీవికి తమన్న హీరోయిన్ అట కదా? ’’
‘‘ఐతే కచ్చితంగా అది కన్యాశుల్కం అవుతుంది?’’
‘‘ఈరోజుల్లో కన్యాశుల్కం కథతో సినిమా తీసేవారెవరు? ఆ రోజుల్లో కన్యాశుల్కంలో గిరీశంగా నటించిన ఎన్టీఆరే ఇది నీ సినిమా, నేను నటించాల్సింది కాదని గిరీశంగా నాటకాల్లో నటించిన పాత తరం సినీ హీరో రమణమూర్తితో అన్నారట!. అలాంటిది ఇప్పుడు కన్యాశుల్కం కథతో చిరంజీవి సినిమా తీస్తారా?’’
‘‘అగ్ని హోత్రావధాని తన చిన్న కూతురును వయసు మళ్లిన లుబ్దావదాన్లకు ఇచ్చి పెళ్లి చేయాలనుకునే కథే కదా కన్యాశుల్కం. ఆ కాలంలో సమాజంలో వృద్ధులతో పిల్లలకు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కాలం మారింది షష్టిపూర్తి చేసుకున్న హీరోలతో కుర్ర హీరోయిన్ల జత. కన్యాశుల్యం తెలుగు సినిమా పెద్దగా హీట్ కాలేదు కానీ వృద్ధ హీరో కుర్ర హీరోయిన్‌గా కన్యాశుల్కం ఫార్ములా సినిమాల్లో నేటికీ సజీవంగా ఉంది. ’’
‘‘నీకు కుళ్లు అందుకే చిరంజీవితో తమన్న నటించడాన్ని జీర్ణం చేసుకోలేక పోతున్నావ్’’
‘‘అయ్యో రాజకీయాల్లో, సినిమాల్లో కుర్రాళ్ల కన్నా పెద్దలకే విజయావకాశాలు అని చెప్పదలుచుకున్నాను అంతే కానీ కుళ్లు నాకెందుకు? ప్రపంచంలో అత్యధిక శాతం యువత ఉన్న దేశం మనదేనట! మరి వీళ్లు యువతను పక్కను పెట్టి సినిమాల్లోనైనా, రాజకీయాల్లోనైనా వయసు మీరిన వారికే పెద్ద పీట ఎందుకు వేస్తారంటావు? శ్రీశ్రీ చెప్పిన కొంత  మంది యువకులు పుట్టుకతో వృద్ధులు అనే మాట గుర్తుకొస్తుంది’’
‘‘రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఇదే ట్రెండ్. మోదీ మోదీ అని దేశమంతా కుర్రాళ్లు ఊగిపోయి నాలుగు పదుల రాహుల్‌కు సరిగ్గా ఆయన వయస్సన్ని సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టి, ఆరు పదుల మోదీకి ఆరింతల సీట్లిచ్చి అధికారం అప్పగించారు. ఆంధ్రలోనూ డిటోనే కుర్ర నేతకు ఓదార్పు బాధ్యతలు అప్పగించి కొత్త రాష్ట్రాన్ని ఐదేళ్ల క్రితం షష్టిపూర్తికి చేరుకున్న నేతకు అప్పగించారు. వెనుకబడిందనుకున్న ఉత్తర ప్రదేశ్‌లో వయసు మీరిన ములాయంకు విశ్రాంతి ఇచ్చి కుర్ర ముఖ్యమంత్రిని ఏరికోరి ఎన్నుకున్నారు. తన వయసే తనకు ప్లస్ అనుకుని తమిళనాడులో కరుణానిధి కుర్చీమీదే కనులు మూయాలని కలలు కన్నారు. కుర్రాళ్లను పక్కన పెట్టి పెద్దలను ఆదరిస్తాం నిజమే కానీ మరీ ఇంత పెద్దలను కాదని కరుణపై ఏ మాత్రం జాలి చూపకుండా తమిళులు జయలలితకే మళ్లీ అధికారం అప్పగించారు. ఒకవేళ కరుణ గెలిచి ఉంటే దేశంలో ఎన్నో రికార్డులకు తమిళనాడు వేదిక అయి ఉండేది.’’
‘‘వామపక్షాల్లో 60-70 ఏళ్ల వయసు వాళ్ళు కుర్రాళ్ళు అన్నట్టు .  పై స్థాయికి వెళ్లాలంటే కనీస వయసు 80 ఏళ్లు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు క్రమంగా వామపక్షాలు కనుమరుగవుతున్నా, వయసు విషయంలో వారే రాజకీయ పక్షాలకు, సినిమాలకు అదర్శంగా మారుతున్నారు.’’
‘‘ఓ కుర్ర హీరో అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవడం బోలెడు మంది కుర్ర హీరోలు ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించి ఇటు అవకాశాలు లేక అటు మరో పని చేయలేక పాపం వాళ్ల పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది వీళ్లేమిటో 70 వరకు హీరో పాత్రలు వదలం అంటున్నారు . .’’
‘‘సినిమాకు పెట్టుబడి పెట్టే వారికి లేని దురద మనకెందుకు కానీ? పెద్దలంటే గౌరవం వల్ల అలా చేస్తున్నారేమో? ’’
‘‘ గౌరవమా ? తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపడంలో గ్రోత్ రేట్ ఘనంగా ఉన్నది మన దగ్గరే. ఇండియా ఎప్పటికీ ఎవరికీ అర్ధం కాదు’’
-బుద్ధా మురళి (జనాంతికం 24. 7. 2016)

20, జులై 2016, బుధవారం

హరిత రాజకీయం

ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా సచివాలయ ఉద్యోగులు తొలి రోజు స్వాగతం పలకడం, వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడడం ఆనవాయితీ. అదే విధంగా 2014 జూలై 2న ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసి పరెడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన తరువాత కెసిఆర్ నేరుగా సచివాలయానికి వచ్చి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభు త్వం, ఉద్యమ నాయకుడిని నుంచి ముఖ్యమంత్రిగా మారిన కెసిఆర్ తొలిసారి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడే సందర్భం ఎంత ఉద్వేగంగా సాగాల్సిన సభ. కానీ హైదరాబాద్‌లో గతంలో ఎప్పుడూ లేని వాతావరణం. వేదికపై కాదు కింద ఉన్న వారు కూడా భరించలేని ఉక్కపోత. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఇదే మాట చెప్పా రు. హైదరాబాద్ వాతావరణం ఇది కాదు. చెట్లతో ఏ కాలంలో నైనా చల్లని గాలులు వీచే హైదరాబాద్‌లో ఇలా ఉండడం తొలిసారి అంటూ సంక్షిప్తంగానే ప్రసంగం ముగించారు.
అప్పుడే ముఖ్యమంత్రి మనసులో రూపుదిద్దు కొన్న కార్యక్రమం హరిత హారం. ఐదేళ్లలో 240 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించారు. తొలి సంవత్సరం హరిత హారం ఉత్సాహంగా ప్రారంభించినా వర్షాలు లేక పోవడంతో హరిత హారంను మధ్యలోనే నిలిపివేశారు. అదృష్ట వశాత్తు ఈసారి వర్షాలు బాగుండడంతో గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఉద్యమ స్థాయిలో రాష్ట్రంలో హరిత హారం అమలు చేస్తున్నారు.
రాశుల ప్రకారం ఎవరు ఏ మొక్క పెం చాలో ప్రకటించడం ద్వారా హరిత హారం పై విస్తృత చర్చకు ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగానే తెర తీశారు. వినూత్న పంథాలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కెసిఆర్ చివరకు మీడియా పెద్దగా ఆసక్తి చూపే అవకాశం లేని మొక్కల పెంపకాన్ని సైతం చర్చనీయాంశంగా మార్చారు. ఒక రోజు జాతీయ రహదారిపై వరుసగా దాదాపు 160 కిలో మీటర్ల వరకు మొక్కలు నాటడం, హైదరాబాద్ నగరంలో ఒకే రోజు పాతిక లక్షల మొక్కలు నాటడం, డ్వాక్రా సంఘాలు ఒకే రోజు కోటి మొక్కలు నాట డం వంటివి వినూత్నంగా నిలిచేట్టు చేశారు. చివరకు ఎక్సైజ్ శాఖ సైతం ప్రత్యేకంగా ఒకే రోజు 55లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ఒక రోజు మహిళలు, మరో రోజు ప్రత్యేకంగా పట్టణ ప్రాం తాలు ప్రతి రోజు ఒక ప్రత్యేక హరిత హారంగా నిలిచేట్టు చేయడం ద్వారా హరిత హారం వార్తల్లో నిలిచేట్టు చేశారు.
ఉద్యమ కాలంలో వంటా వార్పు, సకల జనుల సమ్మె ఏ రీతిలో సాగిందో అధికారంలోకి వచ్చిన తరువాత హరితహారం వంటి పథకాన్ని అదే స్థాయిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే విధంగా సాగింది. మిషన్ కాకతీయను ఇదే విధంగా నిర్వహించినా అది పల్లెలకు, చెరువులు ఉన్న ప్రాంతాలకే పరిమితం అయింది. కానీ హరితహారం నగరంలో, పట్టణాల్లో, గ్రామాల్లో చివరకు అడవుల్లో సైతం నిర్వహించారు.
వన సంరక్షణ వారోత్సవాల పేరుతో చా లా కాలం నుంచి మొక్కల పెంపకం సాగుతున్నా మున్సిపాలిటీ వారికి మాత్రమే సంబంధించిన అంశంగా కనిపించేది. హరి తహారంను అలా కాకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యే విధంగా చేశారు. ఈసారి దాదాపు 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. మానవ ప్రయత్నం ఎలా ఉన్నా వర్షాలు కురుస్తున్నందున వీటిలో ఎక్కువ మొక్కలు నిలిచే అవకాశం ఉంది. తెలంగాణలో అడవులు 24శాతం విస్తీర్ణంలో ఉంటే 33శాతానికి పెంచాలనేది లక్ష్యం. మొత్తం 240 కోట్ల మొక్కల్లో 10 శాతం  మొక్కలు నిలిచినా 24 కోట్లు. ఒక్క శాతం అనుకున్నా 2. 4 కోట్ల మొక్కలు అంటే మాములు కాదు .  వాతావరణంలో ఇది పెద్ద మార్పునకు దోహదం చేస్తుంది. వరుసగా మూడేళ్ల పాటు ఇలానే వర్షాలు కురిసి నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం నిలబడితే తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. హరిత తెలంగాణగా మారుతుంది.
రాజకీయ పార్టీలు ఏం చేసినా అందులో రాజకీయం ఉంటుంది. అది మొక్కలు నాటడం  కావచ్చు, మొక్కల పెంపకాన్ని వ్యతిరేకించడం కావచ్చు. అయితే అది ప్రజలకు మేలు చేసే రాజకీయం కావాలి కానీ మంచిని అడ్డుకునే రాజకీయం కావద్దు. తమ పాలనలో అన్ని రంగాల్లో బలమైన ముద్ర వేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని సంపాదించి తిరిగి అధికారంలోకి రావాలని అధికార పక్షం కోరుకుంటే, ఆ చర్యల ద్వారా ప్రజలకు నష్టం కలిగించేదేమైనా ఉంటే దాన్ని ప్రజలకు వివరించి, తాము అధికారంలో ఉంటే అంతకన్నా మెరుగైన నిర్ణయాలు ఎలా తీసుకునే వాళ్ల మో అధికారంలోకి రావాలనుకుంటున్న వారు ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి. అధికార పక్షం ఏం చేసినా వ్యతిరేకించడమే మా లక్ష్యం అన్నట్టుగా చివరకు మొక్కలు నాటడాన్ని సైతం వ్యతిరేకించడం ద్వారా ప్రజల్లో చులకన అవుతారు కానీ ప్రయోజనం ఉండదు.


ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియాగాంధీ దృఢమైన నిర్ణయం వల్లనే తెలంగాణ కల సాకారం అయింది. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అభిమానం ఉండాలి. కానీ సోనియాగాంధీ వేరు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేరు అని ప్రజలు భావించుకునేట్టుగా కొందరు కాంగ్రెస్ నాయకుల వ్యవహారం సాగుతోంది. ఒక ఉద్యమంగా మొక్కలు నాటడాన్ని సి యల్ పి నేత  అభినందిస్తుంటే అదే పార్టీకి చెందిన నాయకులు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొందరు నా యకులు ఇదో పెద్ద కుంభకోణం అని విమర్శిస్తున్నారు. అధికార పక్షం చేసిన మంచిని మంచి అని చెబితే ఇక మేమెందుకు అనే ప్రశ్న రావచ్చు. అలాంటి సమయంలో హరితహారం వంటి వాటిపై వౌనంగా ఉండాలి తప్ప విమర్శించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది?


2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నేతృ త్వం వహించిన వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదని విస్తృతంగా ప్రచారం చేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉచిత విద్యుత్ పథకం విఫలమైందో వివరించారు. ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలు బట్టలు ఆరేయడానికి పనికి వస్తాయని చాలా బలంగా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఉచిత విద్యుత్ ప్రధానమైన ప్రచారం అంశంగా మారి వైఎస్‌ఆర్ విజయం సాధించారు. ఏడాది తర్వాత దీనిపై టిడిపిలో చర్చ జరిగింది. ఉచిత విద్యుత్ అంశంపై ఎంత కాలం చర్చ జరిగితే అంత కాలం టిడిపికి నష్టం ఈ చర్చ ఇంతటితో ముగియాలంటే అధికారంలోకి వస్తే మేమూ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పండి అని ఒకరు సలహా ఇవ్వడంతో చంద్రబాబు అదే చేశారు. బాబు యూ టర్న్ తీసుకున్నారు అంటూ వారం రోజుల పాటు పత్రికల్లో విమర్శలు. దీంతో 2009 ఎన్నికల్లో ఉచిత విద్యుత్ అసలు ప్రచార అంశమే కాకుండా పోయింది.
రాష్ట్రం మేలు కోరితే ఆ పథకానికి తమ వంతు సహాయం చేయాలి. అలా సహా యం చేయడం ద్వారా అధికార పక్షానికి మేలు జరుగుతుంది, తమ పార్టీకి నష్టం కలుగుతుంది అనుకుంటే వౌనంగా ఉం డాలి. అదంత ప్రాధాన్యత గల అంశం కాదు అన్నట్టుగా చూసీ చూడనట్టు వదిలేయాలి. కానీ అధికార పక్షం ఏ పథకానికి ఎక్కువ ప్రచారం లభించాలని కోరుకుంటుందో అదే అంశాన్ని తీవ్రంగా విమర్శించడం ద్వారా విపక్షం తమకు తెలియకుండానే అధికార పక్షానికి మద్దతుదారుగా మారిపోతోంది.


ఐదేళ్ల కాలంలో 240 కోట్ల మొక్కలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇదే మన్నా బోఫోర్స్ కుంభకోణమా దేశాన్ని అతలాకుతలం చేసిన 2జి స్కామా? మొక్కలు నాటడాన్ని కూడా విమర్శించడం ఎందుకు? ప్రభుత్వం విపక్షాల అనుబంధం అత్తా కోడళ్ల సంబంధం లాంటిది. ఇప్పుడు కాలం మారింది. అత్తా కోడళ్లు సైతం మంచి స్నేహితులుగా ఉంటున్నారు. కానీ రాజకీయాల్లోనే ఈ మార్పు కనిపించడం లేదు. ఇంకా పాత రాజకీయాలనే పట్టుకుని వేలాడితే జనానికి మరింత దూరం కావడం మినహా ప్రయోజనం లేదు.


దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు రాష్ట్రంలో లక్షలాది మంది పార్టీశ్రేణులు ఉన్నాయ. ఇదేదో టిఆర్‌ఎస్ కార్యక్రమం కాదు అందరిదీ అన్నట్టుగా అన్ని పార్టీలు హరిత హారంలో భాగస్వామ్యం అయితే బాగుండేది. ఇక సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినట్టు చివరకు హరిత హారాన్ని సైతం వ్యతిరేకించడం విచిత్రంగా ఉంది. మొక్కలను మేకలు, పశువులు తిన్నా అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. విజయవాడ కనక దుర్గఫ్లై ఓవర్ వంతెన పిల్లరే కుప్ప కూలింది. ఒక మొక్క వాలిపోవడం విచిత్రమా? ప్రజలు ఆసక్తి చూపిస్తున్న కొన్ని పథకాలను విమర్శించడం ద్వారా కాంగ్రెస్ ప్రజాభిమానానికి దూరం అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. అలాంటి పథకాల్లో హరితహారం ఒకటి.
బుద్ధా మురళి (ఎడిట్ పేజీ 20. 7.2016) 

17, జులై 2016, ఆదివారం

నగ్న సత్యం

‘‘నీకో నగ్న సత్యం చెప్పాలా?’’
‘‘సత్యం నగ్నంగా ఉండదు. సత్యానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన దస్తులు వేసి చూస్తుంటారు. సత్యమే దైవం. దైవం నిరాకారుడు. సత్యం కూడా ఆకారం లేనిది. చంద్రబాబుకు పచ్చగా కనిపించిన సత్యం జగన్‌కు అసత్యంగా కనిపించవచ్చు. కెసిఆర్‌కు సత్యం గులాబీ రంగులో కనిపిస్తే జానారెడ్డికి తెల్లగా కనిపించవచ్చు. భార్యాభర్తలిద్దరి దృష్టిలోనే సత్యం వేరువేరుగా ఉంటుంది. సత్యం అంటే నీ కోణంలో నువ్వు చూడడం. ఏదీ సంపూర్ణ సత్యం కాదు’’


‘‘ఇలాంటి మింగుడు పడని విషయాలు మనకెందుకు కానీ ఏంటీ వార్తలు?’’
‘‘మోడీ ప్రభుత్వంలో తమన్నా చేరే అవకాశం. మోడీ పాలనా తీరు బాగాలేదని వెంకయ్యనాయుడును ప్రధానమంత్రిని చేస్తే బాగుంటుందని వాజ్‌పాయి మనోగతం. కుష్బుకు జయలలిత మంత్రివర్గంలో చోటు. సినిమాలో హీరోగా నటించాలా? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా నటించాలో తేల్చుకోలేక పోతున్న అజహరుద్దీన్. హీరోగా ఒప్పుకో భవిష్యత్తు ఉంటుందని మాజీ హీరోయిన్, మాజీ భార్య సంగీతా బ్రిజ్‌లానీ సలహా. పిసిసి బాధ్యతలు తీసుకుంటే చరిత్ర తప్ప భవిష్యత్తు ఉండదని తాజా భార్య సలహా. కట్టప్పకు రాజవౌళికి మధ్య ఘర్షణ. ప్రభాస్‌ను అకారణంగా నాతో చంపించావు అని రాజవౌళిని నిలదీసిన కట్టప్ప. టిఆర్‌ఎస్‌లోకి ఇలియానా? బక్కగా ఉండడంలో భావసారూప్యత ఉందని అమెను పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కెసిఆర్ ప్రయత్నం. అడ్డుకుంటున్న హరీశ్‌రావు. చాలా ఇంకా ఆసక్తికరమైన వార్తలు చెప్పమంటావా?’’


‘‘ఇవన్నీ వెబ్‌సైట్స్‌లో పల్లీ బఠానీ వార్తలు. నేనడిగింది మీడియాలో వార్తల గురించి.’’
‘‘ పల్లీ బఠానీ వార్తలా?అదేంటి? ’’
‘‘రాసేవాళ్లు చదివే వాళ్లు ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కాలక్షేపం కోసం పాప్‌కార్న్ తిన్నట్టు అన్నమాట! నాకు పల్లీ బఠానీలే ఇష్టం అందుకే అలా అన్నాను’’
‘‘ఇప్పుడు అన్ని వార్తలు ఒకేలా ఉంటున్నాయి.’’
‘‘ఆ వార్తల్లో ఒక్కటన్నా నమ్మేట్టు ఉందా?’’
‘‘ హీరో వీరోచితంగా ఫైట్స్ చేస్తే చూసి కాసేపు సంతోషపడతాం అంతే కానీ నిజంగా అది సాధ్యమా? ఆని థియోటర్ నుంచి బయటకు వచ్చాక ఆలోచిస్తామా? కాలక్షేపానికి కాసేపు చదివి వదిలేస్తారు’’


‘‘ ముందు నీకే చెబుతున్నాను . బ్రహ్మాండమైన కుంభకోణం బద్ధలు కానుంది’’
‘‘ఏంటా కుంభకోణం బోఫోర్స్ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలేమైనా బయటపెడతావా? మరింకేంటి 2జి స్కామ్, యూరియా స్కామ్, బొగ్గు స్కామ్, చెక్కర స్కామ్, బెల్లం స్కామ్, గడ్డి స్కామ్’’
‘‘ అధికారంలో ఎవరున్నా ఇవి మామూలే. ఇలాంటి వాటిని లైట్‌గా తీసుకోవాలి.’’
‘‘నువ్వే చెప్పు ?’’
‘‘హరిత హారం ’’
‘‘ హరిత హారంలో వెయ్యి కోట్ల కుంభకోణం అని కాంగ్రెస్ నేతలు చెబితే ఇప్పటి వరకు ఖర్చు చేసిందే 250 కోట్లు అని ప్రభుత్వం చెబుతోంది . జానారెడ్డిగారు లెక్కల్లో ఎక్స్‌ఫర్ట్ . 250 కోట్లలో వెయ్యి కోట్ల కుంభకోణం ఎలా సాధ్యం?’’
‘‘చెబితే కళ్లు తిరుగుతాయి. లక్షల వేల కోట్ల కుంభకోణం. కుంభకోణాన్ని బయటపెడితే చరిత్రను తిరగ రాయాల్సి ఉంటుంది.
కమ్యూనిస్టు సానుభూతి పరులు రాసిన చరిత్రను అటకెక్కించి తమ భావ జాలంతో బిజెపి కొత్తగా రాయిస్తున్న చరిత్ర గురించి కాదు. దాదాపు రెండువేల ఏళ్ల నుంచి మనం గుడ్డిగా నమ్ముతున్న చరిత్ర కు సంబంధించిన  దాని గురించి చెప్ప బోతున్నాను ’’
‘‘జరుగుతున్న చరిత్రనే టీవిల్లో వాళ్ల వాళ్ల రంగులతో చూపిస్తున్నారు. ఇక రెండువేల ఏళ్ల క్రితం నాటి చరిత్రను నిస్పక్షపాతంగా చెప్పడం, ఊహించడం సాధ్యమా? చెప్పు ఏం చేస్తాం.’’
‘‘అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడు రెండువేల ఏళ్ల నుంచి చరిత్ర మనను మోసం చేస్తూ ఉంది కదా? ఇంతకూ అశోకుడు నాటించింది మొక్కలా? చెట్లా?’’
‘‘???’’
‘‘కళ్లు తిరుగుతున్నాయి కదూ? ఒక్క ప్రశ్నకే ఇలా ఐతే ఎలా? ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. హరిత హారం అంటూ కెసిఆర్ హడావుడి చేయడంతో కాంగ్రెస్‌లో ఎంతో మంది మేధావులు మేధోమథనం చేసి ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. మొక్కలు నాటితే వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మొక్కలు నాటితే వర్షాలు కురవవు. చెట్లు ఎక్కువగా ఉంటే వర్షాలు కురుస్తాయి కానీ కెసిఆర్ మొక్కలు నాటితే అని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే కదా? కోట్లది మొక్కల చెట్లయితే అవి పీల్చుకోవడానికి కార్బన్‌డై ఆక్సిడ్ ఎక్కడి నుంచి తెస్తారు. కోట్లాది కొత్త చెట్లు వదిలే ఆక్సిజన్‌కు ఇరుగు పొరుగు రాష్ట్రాల వాతావరణాన్ని ఉపయోగించుకుంటారా? దీనిపై ఒప్పందాలు జరిగితే బయటపెట్టాలి. టీవి చర్చల్లో ఈ ప్రశ్న అడిగితే సమాధానం చెప్ప లేక నీళ్లు నములుతున్నారు.’’
‘‘ఇది సరే భారీ కుంభకోణం అన్నావు.? ’’
‘‘ ఒక్క చెట్టు తన జీవిత కాలం దాదాపు మూడు లక్షల విలువైన గాలి, పండ్లు, కర్ర ఇస్తాయని ఆ మధ్య ఒక లెక్క తేల్చారు. అంటే 240 కోట్ల మొక్కలు చెట్లయితే వాటిని మూడు లక్షలతో భాగిస్తే, వచ్చే అంకె ఎంత? ఇది ఎవరికి చెంతుతుంది. ఈ మొక్కలు చెట్లయ్యాక ఇన్ని లక్షల కోట్లు ఎవరికి చెందుతాయి ? వీటి లెక్కలు తేలాలి? ’’


‘‘ ఆలెక్కలు సరే నువ్వేమయినా మొక్కలు నాటావా? ?’’
‘‘ నేనేమన్నా అమాయకున్నననుకున్నావా? మొక్కలు కనిపించగానే అధికార పక్షం గుర్తుకొస్తుంది.  టిఆర్ స్ రహిత తెలంగాణ మా  టార్గెట్ . మొక్కల రహిత తెలంగాణ మా లక్ష్యం. అందుకే మేం అధికారంలోకి రావడానికి మొక్కలకు దూరంగా ఉంటాం’’


‘‘ మీ తెలివి తేటలను చూస్తే మీపై ప్రజలకు జాలి కలగడం ఖాయం. అధికారం మాట ఎలా ఉన్నా అడవుల పాలవుతారనిపిస్తోంది. కెసిఆర్ పుట్టక ముందు నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమిపై చెట్లున్నాయి. మొక్కలను ఒక పార్టీ సింబల్‌గా మార్చి మీ రాజకీయ జీవితాన్ని ఎడారి పాలు చేసుకోకండి. వెళ్లి ఒక మొక్క నాటి ప్రాయశ్చిత్తం చేసుకో’’
‘‘నాకు కోపం వస్తే చెట్ల నుంచి వస్తుంది కాబట్టి ఆక్సిజన్ కూడా పీల్చను .’’ 
‘‘నీ ఇష్టమ్ కానీ నువ్వో నగ్న సత్యం చెప్పావు కదా .. నేనో నగ్న సత్యం చెప్పాలా ? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే అని ఒక వైపు ఒప్పుకొంటూ మరో వైపు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఎందుకు దూరం పెట్టారో తెలుసా ? ఇందుకే .. ’’
-బుద్ధా మురళి (జనాంతికం 17-7-2016)

10, జులై 2016, ఆదివారం

చలో హైకోర్ట్...కోర్ట్ నే కొట్టేద్దాం

‘‘ఏంటీ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’’
‘‘ఇంటికీ, గొడ్ల చావడికీ పై కప్పు గురించి మాత్రం కాదులే .. నువ్వూ చేతులు కలుపుతానంటే చెబుతాను. మనం ఇద్దరం కలిశామంటే మన ప్లాన్ ఫలిస్తే వందల కోట్ల రూపాయల స్థలం మనదవుతుంది’’


‘‘వంద గజాల ప్లాటే కొనలేకపోయాం. వందల కోట్ల స్థలం ఉచితంగా ఇచ్చినా తీసుకునేంత సీన్ మనకుందా? సక్సెస్ అయితే వందల కోట్లు, కాకపోతే జైలుకేనా?’’
‘‘కాదు రెండు రాష్ట్రాలను, దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’
‘‘చిత్రంగా ఉందే. మహా మహా భూ కబ్జాదారుల సంగతులెన్నో చూశాను. భూ కబ్జాలో సక్సెస్ అయితే భూమి దక్కుతుంది లేకపోతే కేసు అవుతుంది అంతే.. ఫెయిల్ అయినా లాభమే అంటున్నావ్’’
‘‘పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. జీరో పర్సంటేజ్ రిస్క్.. ఓడినా, గెలిచినా మనకే లాభం’’
‘‘ రాజకీయాల్లో ఆదాయం బాగున్నా పెట్టుబడి ఎక్కువే .. రిస్క్ ఎక్కువే .. ప్రభుత్వ ఉద్యోగం లో అయితే ఆదాయం ఉండొచ్చు కానీ ఈ వయసులో మనకు ఉద్యోగం రాదు .. అంత లాభ సాటి వ్యవహారం ఏంటో చెప్పేయ్ ఇంక ఊరించకు ఏంటో చెప్పేయ్ నీతో చేతులు కలిపేందుకు సిద్ధం’’


‘‘మూసీ ఒడ్డున మదీన వద్ద ఉన్న హైకోర్టు భవనం చూశావా? అది మనం కొట్టేసే చాన్స్ దక్కింది’’
‘‘???’’
‘‘ఆశ్చర్యపోకు జీవిత కాలంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం దక్కుతుంది. మనం కొంచం బుర్ర ఉపయోగిస్తే హైకోర్టును కొట్టేయెచ్చు’’
‘‘హైకోర్టును కొట్టేయడం ఏమిటిరా! నీకేమైనా పిచ్చా! జేబులు కొట్టేద్దాం అన్నంత ఈజీగా చెబుతున్నావ్! కొట్టేసిన వాళ్ల కేసులను అక్కడ విచారిస్తారు. నువ్వేమో ఏకంగా హైకోర్టునే కొట్టేద్దామంటున్నావ్!’’


‘‘నీకు తెలుసు కదా? చట్టమంటే నాకు చాలా భయం.. చట్టబద్ధంగానే హైకోర్టును కొట్టేద్దాం. హైకోర్టును కొట్టేయడం అంటే అక్కడున్న చెక్క బల్లలు, కళ్లకు గంతలు కట్టుకునే న్యాయమూర్తి విగ్రహాన్ని కాదు. హైకోర్టు స్థలాన్ని కొట్టేద్దాం. కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నాను అనుకోకు. హైకోర్టు భవనం ఎప్పుడు నిర్మించారు? ఎవరు నిర్మించారు. ఎంత వైశాల్యంలో ఉంది? ఇప్పుడక్కడ గజం ధర ఎంత? మొత్తం స్థలం అమ్ముకుంటే ఎంత వస్తుంది? అన్ని వివరాలున్నాయి నా వద్ద’’
‘‘నా కస్సలు అర్ధం కావడం లేదు’’
‘‘పత్రికలు చూస్తున్నావు కదా? ’’
‘‘ఎందుకు చూడను పత్రిక పేరు మొదలు కొని ప్రింటర్ అండ్ పబ్లిషర్ వరకూ అన్నీ చదువుతాను’’


‘‘హైకోర్టు విభజన కోసం రెండేళ్ల నుంచి ఏదో ఒక స్థాయిలో ఆందోళనలు సాగుతున్నాయి కదా? ఈ వార్తలు వరుసగా చదువుతుంటే నాకీ బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. హైకోర్టు విభజన వెంటనే జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెండేళ్ల నుంచి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నారు. అంటే హైకోర్టు తెలంగాణది కాదు అని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సదానందగారే హైకోర్టు సమస్యతో మాకు సంబంధం లేదు. మాకేలాంటి అధికారం లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే మాట చెప్పారు. అంటే హైకోర్టు తెలంగాణది కాదు, ఆంధ్రప్రదేశ్‌ది అసలే కాదు. కేంద్రానిది కానే కాదు. ఇంకెవరిది? ’’
‘‘నువ్వు చెప్పు?’’
‘‘ ప్రతి ఒక్కరు హైకోర్టు మాది కాదంటే మాది కాదని చెబుతున్నారు. ఇక్కడే మనం తెలివిగా వ్యవహరించాలి. హైకోర్టు మాదే అని మనం ప్రకటిద్దాం. అంతా మాది కాదంటున్నప్పుడు మాదే అని మనం ముందుకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని సంబరపడతారు కానీ కాదనేవారెవరు?’’


‘‘ఒకవేళ దేవుడిది కావచ్చు కదా? గవర్నర్ ఇదే మాట చెప్పారు. హైకోర్టు సమస్యను దేవుడు పరిష్కరిస్తాడని’’
‘‘ అదే జరిగితే మనంత అదృష్ట వంతులే ఉండరు . దేవుడు ఉన్నాడా ? లేడా ? అని ఆస్తికులు , నాస్తికులు వేల సంవత్సరాల నుంచి తేల్చుకోలేక పోతున్నారు .. హై కోర్ట్ కోసం దేవుడు రంగం లోకి దిగితే ... ఈ ప్రపంచానికి సమాధానం దొరకని ప్రశ్నను మనం మార్గం చూపినట్టు అవుతుంది .  మాది అని మనం క్లయిమ్ చేశాక, దేవుడు వచ్చి కాదు ఇది మాది అంటే అప్పుడు చూసుకుందాం. అప్పటి వరకైతే మనం ఓనర్లం అవుతాం కదా? ఎవరైనా కేసు వేసినా మాది అని కోర్టుకు వెళ్లే మనమే ఉంటాం కానీ వీళ్లది కాదు మాది అనే వాళ్లు ఒక్కరూ ఉండరు’’


‘‘తేడా వస్తే లోపలేస్తారేమో’’
‘‘పిచ్చోడా తేడా ఎందుకొస్తుంది? ఎక్కడొస్తుంది?’’
‘‘ఆ భవనం నిర్మించిన వాళ్లు మాదే అని ముందుకొస్తే’’
‘‘ముందే చెప్పాను. వివరాలు అన్నీ సేకరించే వచ్చాను అని హైకోర్టు భవనం ఎప్పుడైనా చూశావా? ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం రాజ్యాంలో అత్యున్నత న్యాయస్థానం కోసం 1915లో అద్భుతంగా ఈ భవనాన్ని నిర్మించారు. జైపూర్ ఆర్కిటెక్‌తో పాటు హైదరాబాద్ ఆర్కిటెక్‌లో భవన నిర్మాణంలో పాలు పంచుకున్నారు. నాలుగేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేశారు. 300 కిలోల వెండితో ఆకాలంలోనే హైకోర్టు భవన నమూనాను తయారు చేశారు. హైకోర్టు నమూనా పురానా హవేలీలోని ప్యాలెస్‌లో ఉంది. ఇప్పుడు నిజాం రాజ్యం లేదు. నిజాం వారసులూ లేరు. ఇప్పుడున్న రాష్ట్రాలు, కేంద్రం మాది కాదంటే మాది కాదని ప్రకటించేశాయి. చార్మినార్ వద్ద ఆ కాలం నాటి పాత డాక్యు మెంట్లు ఎన్నంటే అన్ని దొరుకుతాయి. నిజాం పోతూ పోతూ హైకోర్టు భవనాన్ని మా తాతలకు రాసిచ్చిండు ఇదిగో డ్యాకుమెంట్లు అని చూపిద్దాం’’
‘‘ఏమీ కాదా?’’
‘‘ఏమీ కాదు.. మన వాదన బలంగా వినిపిస్తే హైకోర్టు భవనం మనదవుతుంది. వందల కోట్ల రూపాయల స్థలానికి మనం ఓనర్లం అవుతాం’’


‘‘ఫెయిల్ అయితే?’’
‘‘ఫెయిల్ కావడం అంటే? హైకోర్టు ఓనర్లం మేమే అని మనం ప్రకటిస్తే, కాదు అని ఎవరో ఒకరు ముందుకు రావాలి? ఎవరొస్తారు? తెలంగాణ ప్రభుత్వమా? ఆంధ్ర ప్రభుత్వమా? కేంద్రమా? ఎవరూ ముందుకు రాకపోతే సంతోషం. వస్తే మరింత సంతోషం. మనది కాదు అని వచ్చిన వాళ్లు నిరూపించాలి. అలా నిరూపించేవాళ్లు ఈ హైకోర్టు ఎవరికి చెందుతుందో తేల్చాల్సి ఉంటుంది. అంటే రెండేళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు, వేలమంది న్యాయవాదులు ఉద్యమం ద్వారా పరిష్కారం లభించని సమస్యకు మనం పరిష్కారం చూపితే సంతోషమే కదా? ఏమంటావు?’’
‘‘ఆ భవనం మాదే .. నిజాం ఇచ్చి వెళ్లాడని ప్రకటిద్దాం. ఛలో హైకోర్ట్’’  


-బుద్ధా మురళి (జనాంతికం 10-7-2016)

3, జులై 2016, ఆదివారం

హీరోలు- మనుషులు

‘‘ఏదీ శాశ్వతం కాదు.’’
‘‘ఔను ఎప్పుడైనా అనుకున్నామా సికిందరాబాద్‌లో ఆనంద్ భవన్ మూసేస్తారని, జె రామచంద్రయ్య క్లాత్ స్టోర్‌ను కూల్చేస్తా
ని, నగరం రూపే మారిపోతోంది’’
‘‘అఫ్ఘానిస్తాన్‌లో అంత పెద్ద బుద్ధుని విగ్రహాన్ని , రష్యాలో ఎర్ర దేవుడు లెనిన్ విగ్రహాలను కూల్చేసినప్పుడు ఆనంద్‌భవన్‌ను కూల్చడం ఎంత సేపు.. నేనంటున్నది దాని గురించి కాదు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించనివి జరుగుతుంటాయి’’
‘‘ అదా సంగతి నిన్ననే పత్రికలో చదివాను. శ్రావణ సమీరాలు  టివి సీరియల్ అయిపోయిందట కదా? మన జీవిత కాలంలో ఆ సీరియల్ అయిపోతుందని ఊహించలేదు. అప్పుడు రుతురాగాలు, ఇప్పుడు శ్రావణ సమీరాలు ఏ సీరియల్ అయినా ఎనే్నళ్లు నడిచినా ఏదో ఒక రోజు అయిపోవలసిందే. పుట్టిన వాడు గిట్టక తప్పదు అని గీతకారుడు చెప్పినట్టు ప్రారంభం అయిన సీరియల్‌కు ఏదో ఒక నాడు ముగింపు పలకాల్సిందే. సృష్టి ఉన్నంత కాలం సీరియల్ ఉండాలని మనం కోరుకుంటాం. కానీ అది జరగదు. ముందూ వెనక అంతా ఎప్పుడో ఒకప్పుడు పోలసిందే అలానే సీరియళ్లు కూడా అంతే మహా అయితే పదేళ్లు ఇరవై ఏళ్లు.’’


‘‘సెక్రటేరియట్ నుంచి నన్ను ఎవడూ కదపలేడు అని సెక్షన్ ఆఫీసర్‌గా ఉన్న నా స్నేహితుడు గొప్పగా చెప్పేవాడు. యూనియన్ లీడర్ కూడా. ఏ సెక్షన్‌లోనైనా పైరవీలు చక చకా చేసుకుని వచ్చేవాడు. ప్రపంచం స్మార్ట్ ఫోన్‌లో, ఉంటే సచివాలయం నా మిత్రుడి జేబులో ఉన్నట్టు అనిపించేది. సెక్రటేరియట్‌లో ప్రార్థనాలయాలను, వీడ్ని ఎవరూ కదపలేరు అని గర్వంగా చెప్పుకునే వాళ్లం. సెక్రటేరియట్ నుంచి కదపలేదు కానీ సెక్రటేరియట్‌ను హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చారు. ఎక్కడైతేనేం ఇదైనా అదైనా సెక్రటేరియటే కదా? అని ఓదార్చాను. ప్రసూతి వైరాగ్యం బదిలీ వైరాగ్యం ఎన్ని రోజులుంటుందిలే? తన జాతకంలో బదిలీ లేదని జ్యోతీష్కుడు చెప్పాడట! ఉద్యోగి బదిలీ లేకపోవచ్చు కానీ రాజధాని బదిలీ గురించి ఆ జ్యోతీష్యుడ్ని అడగి ఉండడు కదా? ’’

‘ ఇంతకూ నీ వైరాగ్యానికి కారణం ఏమిటో చెప్పనే లేదు’’
‘‘వైరాగ్యం కాదు జీవిత సత్యం. కలికాలం కాకపోతే ఆ బాబు రైళ్లను కంటిచూపుతో వెనక్కి మళ్లించే వారు. ఒంటి చేత్తో సుమోలను గాల్లోకి లేపేవారు. కాలం కలిసి రాకపోతే అంతే మహాయోధుడు భీష్ముడి అంతటి వాడు. శిఖండిని చూసి ఆయుధాలు కింద పడేశాడు. అంతెందుకు 
సుదీప్   వంటి బయంకరమైన విలన్‌ను ఓ ఈగ ముప్పు తిప్పలు పెట్టింది కదా? కాలం కలిసిరాకపోతే అంతే’’
‘‘సస్పెన్స్‌లో ముంచకు. ఇంతకూ అంతగా వేదాంతాన్ని మాట్లాడుతున్నది ఎవరి గురించి? ’’


‘‘ఇంకెవరికో అయితే నేనేందుకు బాధపడతాను. యువరత్న గురించి. మాట మీద నిలబడే వంశం. చదువుకునే రోజుల్లో మొదలైన అభిమానం ఇప్పుడు రిటైర్‌మెంట్ వయసులో కూడా కొనసాగుతోంది అంటే యువరత్న అంటే నాకెంత అభిమానమో అర్ధం చేసుకో?
ఎన్నో సినిమాల్లో అవలీలగా రైళ్లను ఎత్తి అవతల పారేశాడు. శ్రీకృష్ణుడు గోవర్థన గిరి పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తినట్టు యువరత్న ఎన్నో బ్రిడ్జీలను చిటికెన వేలితో తోసేశాడు. హీరో కారుకు పూలమాల అడ్డం వచ్చి డివైడర్‌కు కొట్టుకోవడం ఏమిటి? కలికాలం కాకపోతే. కొంపదీసి ఆ డివైడర్ కాంట్రాక్టరో లేక మేస్ర్తి ఏమైనా పులివెందులకు చెందిన వాడేమో చూడాలి.’’
‘‘ఇందులో పెద్ద వింతేముంది.? మొన్న మా వాడు అర్థరాత్రి ఇంటికి వెళ్లి కంగారుగా ఫోన్ చేశాడు. వీడు లేని సమయం చూసి వీడి ఇంటిని ఎవడో పక్కకు జరిపాడట! ఇల్లు కనిపించడం లేదని కంగారు పడ్డాడు. సరే నేను వెళ్లి ఇల్లును మళ్లీ పాత ప్లేస్‌లోనే పెట్టి వాన్ని ఇంటిలోపలికి పంపి వచ్చాను. ఇలాంటివి మామూలే. బాధపడొద్దు’’


‘‘హీరోల విషయంలో, సామాన్యుల విషయంలో ఏదైనా ఒకటే అనేది నమ్మలేకపోతున్నాను. ’’
‘‘నువ్వు నమ్మాలి తప్పదు. పాతాళాభైరవి కాలం నుంచి అడవిరాముడు వరకు, కంచుకోట నుంచి గుళేభకావళి కథ వరకు మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు. వృద్ధ రాజును రాజనాల ఎన్నిసార్లు మోసం చేయలేదు. నమ్మించి మోసం చేసిన రాజనాల నుంచి రావుగోపాలరావు వరకు ఎంత మందికి ఎన్టీఆర్ బుద్ధి చెప్పి విజయం సాధించలేదు. చివరకు ఏమైంది ఎన్నో డజన్ల సినిమాల్లో విలన్ మోసం చేసినట్టే అల్లుడు అధికారం నుంచి దించేస్తే ఎన్టీఆర్ ఏం చేశాడు విలవిలలాడి... పోయారు.. జీవితం వేరు సినిమా వేరు అంతే’’


‘‘నిజమే ఆకాశంలోకి సుమోలను ఎగరేసిన హీరో చిన్న డివైడర్‌ను ఢీ కొని పడిపోవడం అంటే విధి రాత కాకుంటే ఇంకేంటి?’’
‘‘ విధిరాత కాదు. అది సహజం అంతే ప్రకృతి ధర్మం మనుషులందరికీ ఒకటే’’
‘‘వచ్చే ఏడాది నువ్వు రిటైర్ అవుతావు కదా? రిటైర్‌మెంట్ జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నావ్ చెప్పు’’
‘‘ఏముంది ఓ ఏడాది పుణ్యక్షేత్రాలు తిరుగుతాను. ఇంత కాలం బంధువుల ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా వెళ్లలేక పోయాను అందరి ఇళ్లకు వెళతాను. 60 ఏళ్లు వచ్చాక కృష్ణా రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తాను’’


‘‘మరి హీరోలు ఏం చేస్తారో తెలుసా? 60 ఏళ్ల వయసు వచ్చాక 100వ సినిమా,150వ సినిమాలో హీరోగా 18ఏళ్ల కొత్త హీరోయిన్‌తో నటిస్తారు. ఇప్పుడు తెలిసిందా ? మనుషులంతా ఒకటే కాదు మనుషుల్లో హీరోలు వేరు అని ఈ మాట నీతోనే చెప్పించడానికే నీ రిటైర్‌మెంట్ లైఫ్ గురించి అడిగాను. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా మనుషులు 60 ఏళ్లకు భక్తి బాట పడతారు. హీరోలు సినిమాల్లో విరహంతో విజృంభిస్తారు. మనుషులు వేరు హీరోలు వేరు. ప్రకృతి ధర్మాలు కూడా వారికి వేరుగా ఉంటాయి. మనను ఎవరైనా కొట్టినా, మననెవరైనా కొట్టినా కింద పడిపోతాం. అదే హీరోలు కొడితే గాలిలో ఎగిరిపోతారు. హీరోలు ఆకర్షణ శక్తికి భూమి సైతం తన ఆకర్షణ శక్తి కోల్పోతుంది. ఇంకెప్పుడూ మనుషులంతా ఒకటే అనకు. హీరోలు మనుషులు కాదు.’’
-జనాంతికం - బుద్దా మురళి(3-7-2016)