20, జులై 2016, బుధవారం

హరిత రాజకీయం

ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా సచివాలయ ఉద్యోగులు తొలి రోజు స్వాగతం పలకడం, వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడడం ఆనవాయితీ. అదే విధంగా 2014 జూలై 2న ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసి పరెడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన తరువాత కెసిఆర్ నేరుగా సచివాలయానికి వచ్చి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభు త్వం, ఉద్యమ నాయకుడిని నుంచి ముఖ్యమంత్రిగా మారిన కెసిఆర్ తొలిసారి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడే సందర్భం ఎంత ఉద్వేగంగా సాగాల్సిన సభ. కానీ హైదరాబాద్‌లో గతంలో ఎప్పుడూ లేని వాతావరణం. వేదికపై కాదు కింద ఉన్న వారు కూడా భరించలేని ఉక్కపోత. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఇదే మాట చెప్పా రు. హైదరాబాద్ వాతావరణం ఇది కాదు. చెట్లతో ఏ కాలంలో నైనా చల్లని గాలులు వీచే హైదరాబాద్‌లో ఇలా ఉండడం తొలిసారి అంటూ సంక్షిప్తంగానే ప్రసంగం ముగించారు.
అప్పుడే ముఖ్యమంత్రి మనసులో రూపుదిద్దు కొన్న కార్యక్రమం హరిత హారం. ఐదేళ్లలో 240 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించారు. తొలి సంవత్సరం హరిత హారం ఉత్సాహంగా ప్రారంభించినా వర్షాలు లేక పోవడంతో హరిత హారంను మధ్యలోనే నిలిపివేశారు. అదృష్ట వశాత్తు ఈసారి వర్షాలు బాగుండడంతో గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఉద్యమ స్థాయిలో రాష్ట్రంలో హరిత హారం అమలు చేస్తున్నారు.
రాశుల ప్రకారం ఎవరు ఏ మొక్క పెం చాలో ప్రకటించడం ద్వారా హరిత హారం పై విస్తృత చర్చకు ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగానే తెర తీశారు. వినూత్న పంథాలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కెసిఆర్ చివరకు మీడియా పెద్దగా ఆసక్తి చూపే అవకాశం లేని మొక్కల పెంపకాన్ని సైతం చర్చనీయాంశంగా మార్చారు. ఒక రోజు జాతీయ రహదారిపై వరుసగా దాదాపు 160 కిలో మీటర్ల వరకు మొక్కలు నాటడం, హైదరాబాద్ నగరంలో ఒకే రోజు పాతిక లక్షల మొక్కలు నాటడం, డ్వాక్రా సంఘాలు ఒకే రోజు కోటి మొక్కలు నాట డం వంటివి వినూత్నంగా నిలిచేట్టు చేశారు. చివరకు ఎక్సైజ్ శాఖ సైతం ప్రత్యేకంగా ఒకే రోజు 55లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ఒక రోజు మహిళలు, మరో రోజు ప్రత్యేకంగా పట్టణ ప్రాం తాలు ప్రతి రోజు ఒక ప్రత్యేక హరిత హారంగా నిలిచేట్టు చేయడం ద్వారా హరిత హారం వార్తల్లో నిలిచేట్టు చేశారు.
ఉద్యమ కాలంలో వంటా వార్పు, సకల జనుల సమ్మె ఏ రీతిలో సాగిందో అధికారంలోకి వచ్చిన తరువాత హరితహారం వంటి పథకాన్ని అదే స్థాయిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే విధంగా సాగింది. మిషన్ కాకతీయను ఇదే విధంగా నిర్వహించినా అది పల్లెలకు, చెరువులు ఉన్న ప్రాంతాలకే పరిమితం అయింది. కానీ హరితహారం నగరంలో, పట్టణాల్లో, గ్రామాల్లో చివరకు అడవుల్లో సైతం నిర్వహించారు.
వన సంరక్షణ వారోత్సవాల పేరుతో చా లా కాలం నుంచి మొక్కల పెంపకం సాగుతున్నా మున్సిపాలిటీ వారికి మాత్రమే సంబంధించిన అంశంగా కనిపించేది. హరి తహారంను అలా కాకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యే విధంగా చేశారు. ఈసారి దాదాపు 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. మానవ ప్రయత్నం ఎలా ఉన్నా వర్షాలు కురుస్తున్నందున వీటిలో ఎక్కువ మొక్కలు నిలిచే అవకాశం ఉంది. తెలంగాణలో అడవులు 24శాతం విస్తీర్ణంలో ఉంటే 33శాతానికి పెంచాలనేది లక్ష్యం. మొత్తం 240 కోట్ల మొక్కల్లో 10 శాతం  మొక్కలు నిలిచినా 24 కోట్లు. ఒక్క శాతం అనుకున్నా 2. 4 కోట్ల మొక్కలు అంటే మాములు కాదు .  వాతావరణంలో ఇది పెద్ద మార్పునకు దోహదం చేస్తుంది. వరుసగా మూడేళ్ల పాటు ఇలానే వర్షాలు కురిసి నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం నిలబడితే తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. హరిత తెలంగాణగా మారుతుంది.
రాజకీయ పార్టీలు ఏం చేసినా అందులో రాజకీయం ఉంటుంది. అది మొక్కలు నాటడం  కావచ్చు, మొక్కల పెంపకాన్ని వ్యతిరేకించడం కావచ్చు. అయితే అది ప్రజలకు మేలు చేసే రాజకీయం కావాలి కానీ మంచిని అడ్డుకునే రాజకీయం కావద్దు. తమ పాలనలో అన్ని రంగాల్లో బలమైన ముద్ర వేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని సంపాదించి తిరిగి అధికారంలోకి రావాలని అధికార పక్షం కోరుకుంటే, ఆ చర్యల ద్వారా ప్రజలకు నష్టం కలిగించేదేమైనా ఉంటే దాన్ని ప్రజలకు వివరించి, తాము అధికారంలో ఉంటే అంతకన్నా మెరుగైన నిర్ణయాలు ఎలా తీసుకునే వాళ్ల మో అధికారంలోకి రావాలనుకుంటున్న వారు ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి. అధికార పక్షం ఏం చేసినా వ్యతిరేకించడమే మా లక్ష్యం అన్నట్టుగా చివరకు మొక్కలు నాటడాన్ని సైతం వ్యతిరేకించడం ద్వారా ప్రజల్లో చులకన అవుతారు కానీ ప్రయోజనం ఉండదు.


ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియాగాంధీ దృఢమైన నిర్ణయం వల్లనే తెలంగాణ కల సాకారం అయింది. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అభిమానం ఉండాలి. కానీ సోనియాగాంధీ వేరు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేరు అని ప్రజలు భావించుకునేట్టుగా కొందరు కాంగ్రెస్ నాయకుల వ్యవహారం సాగుతోంది. ఒక ఉద్యమంగా మొక్కలు నాటడాన్ని సి యల్ పి నేత  అభినందిస్తుంటే అదే పార్టీకి చెందిన నాయకులు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొందరు నా యకులు ఇదో పెద్ద కుంభకోణం అని విమర్శిస్తున్నారు. అధికార పక్షం చేసిన మంచిని మంచి అని చెబితే ఇక మేమెందుకు అనే ప్రశ్న రావచ్చు. అలాంటి సమయంలో హరితహారం వంటి వాటిపై వౌనంగా ఉండాలి తప్ప విమర్శించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది?


2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నేతృ త్వం వహించిన వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదని విస్తృతంగా ప్రచారం చేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉచిత విద్యుత్ పథకం విఫలమైందో వివరించారు. ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలు బట్టలు ఆరేయడానికి పనికి వస్తాయని చాలా బలంగా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఉచిత విద్యుత్ ప్రధానమైన ప్రచారం అంశంగా మారి వైఎస్‌ఆర్ విజయం సాధించారు. ఏడాది తర్వాత దీనిపై టిడిపిలో చర్చ జరిగింది. ఉచిత విద్యుత్ అంశంపై ఎంత కాలం చర్చ జరిగితే అంత కాలం టిడిపికి నష్టం ఈ చర్చ ఇంతటితో ముగియాలంటే అధికారంలోకి వస్తే మేమూ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పండి అని ఒకరు సలహా ఇవ్వడంతో చంద్రబాబు అదే చేశారు. బాబు యూ టర్న్ తీసుకున్నారు అంటూ వారం రోజుల పాటు పత్రికల్లో విమర్శలు. దీంతో 2009 ఎన్నికల్లో ఉచిత విద్యుత్ అసలు ప్రచార అంశమే కాకుండా పోయింది.
రాష్ట్రం మేలు కోరితే ఆ పథకానికి తమ వంతు సహాయం చేయాలి. అలా సహా యం చేయడం ద్వారా అధికార పక్షానికి మేలు జరుగుతుంది, తమ పార్టీకి నష్టం కలుగుతుంది అనుకుంటే వౌనంగా ఉం డాలి. అదంత ప్రాధాన్యత గల అంశం కాదు అన్నట్టుగా చూసీ చూడనట్టు వదిలేయాలి. కానీ అధికార పక్షం ఏ పథకానికి ఎక్కువ ప్రచారం లభించాలని కోరుకుంటుందో అదే అంశాన్ని తీవ్రంగా విమర్శించడం ద్వారా విపక్షం తమకు తెలియకుండానే అధికార పక్షానికి మద్దతుదారుగా మారిపోతోంది.


ఐదేళ్ల కాలంలో 240 కోట్ల మొక్కలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇదే మన్నా బోఫోర్స్ కుంభకోణమా దేశాన్ని అతలాకుతలం చేసిన 2జి స్కామా? మొక్కలు నాటడాన్ని కూడా విమర్శించడం ఎందుకు? ప్రభుత్వం విపక్షాల అనుబంధం అత్తా కోడళ్ల సంబంధం లాంటిది. ఇప్పుడు కాలం మారింది. అత్తా కోడళ్లు సైతం మంచి స్నేహితులుగా ఉంటున్నారు. కానీ రాజకీయాల్లోనే ఈ మార్పు కనిపించడం లేదు. ఇంకా పాత రాజకీయాలనే పట్టుకుని వేలాడితే జనానికి మరింత దూరం కావడం మినహా ప్రయోజనం లేదు.


దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు రాష్ట్రంలో లక్షలాది మంది పార్టీశ్రేణులు ఉన్నాయ. ఇదేదో టిఆర్‌ఎస్ కార్యక్రమం కాదు అందరిదీ అన్నట్టుగా అన్ని పార్టీలు హరిత హారంలో భాగస్వామ్యం అయితే బాగుండేది. ఇక సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినట్టు చివరకు హరిత హారాన్ని సైతం వ్యతిరేకించడం విచిత్రంగా ఉంది. మొక్కలను మేకలు, పశువులు తిన్నా అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. విజయవాడ కనక దుర్గఫ్లై ఓవర్ వంతెన పిల్లరే కుప్ప కూలింది. ఒక మొక్క వాలిపోవడం విచిత్రమా? ప్రజలు ఆసక్తి చూపిస్తున్న కొన్ని పథకాలను విమర్శించడం ద్వారా కాంగ్రెస్ ప్రజాభిమానానికి దూరం అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. అలాంటి పథకాల్లో హరితహారం ఒకటి.
బుద్ధా మురళి (ఎడిట్ పేజీ 20. 7.2016) 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం