2, డిసెంబర్ 2016, శుక్రవారం

దేశ భక్తుడు - సబ్సిడీ - పెన్షన్

‘‘హలో... నేను బాగున్నా... అమెరికాలో నువ్వెలా ఉన్నావ్..? యూనివర్సిటీ నుంచి నేరుగా రూమ్‌కు వెళ్లు .. బయట ఎక్కువగా తిరగకు, దారిలో ‘ట్రంప్’ నిన్ను చూశాడనుకో.. ఇండియా నుంచి వచ్చావని తెలుసుకుని హైదరాబాద్‌కు తిరిగి పంపించేస్తాడు.. సరే మా సంగతికేం? మేం 30 రోజుల్లో తమిళం, నెలరోజుల్లో సినిమా డైరెక్షన్ అని అప్పుడెప్పుడో అంబాడిపూడి వారు పుస్తకాలు రాసినట్టు- ‘50 రోజుల్లో స్వర్గం’ అని ఆఫర్ ఇచ్చి జేబులో ఉన్నవి లాగేసుకున్నారు. మరో 26 రోజులు గడిస్తే స్వర్గానికి ఎగబాకుతామా? పాతాళంలో పడిపోతామో తేలుతుంది. ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉన్నాం. సరే ఉంటాను జాగ్రత్త’’
‘‘మా బంధువుల అబ్బాయి.. వద్దురా అంటే భూతల స్వర్గం అంటూ అమెరికా వెళ్లాడు. ఆ దేశపు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచాక- మా వాడిని వెనక్కి పంపించేస్తాడేమో అని భయం పట్టుకుంది. అదే రోజు నోట్ల రద్దుతో ఇండియా స్వర్గం కాబోతుందనే భ్రమలు పట్టుకున్నాయి. రెండూ నిజం కావురా!ట్రంప్‌కు వేరే పనులేమీ ఉండవా?’’
‘‘నీలో దేశభక్తి రోజురోజుకూ తగ్గిపోతుందోయ్! పాజిటివ్‌గా ఆలోచించలేవా?’’
‘‘సర్లే బాబాయ్.. ఇద్దరి మధ్య స్నేహం ఉండాలంటే ఇద్దరికీ నచ్చిన విషయాలు మాట్లాడుకోవడం మంచిది.. నీకో మంచికథ చెప్పాలా? ’’
‘‘చెప్పు’’
‘‘అర్ధరాత్రి అక్కడక్కడ మున్సిపల్ లైట్లు వెలుగుతున్నాయి. గల్లీల్లో చీకటి రాజ్యం ఏలుతోంది. జాతీయ రహదారిపై దూసుకువెళుతున్న లారీల శబ్దం దూరంగా వినిపిస్తోంది. చేయి చాచి డబ్బులు అడిగే పోలీసులు లేక పోవడం వల్ల అడ్డూఅదుపు లేకుండా లారీలు యమస్పీడ్‌గా వెళుతున్నాయి. చిమ్మచీకటి.. గడ్డకట్టే చలి.. నిర్మానుష్యంగా ఉన్న గల్లీలో నుండి చప్పుడు రాకుండా ఓ ఆగంతకుడు నడుచుకుంటూ వెళుతున్నాడు. మనిషో, దయ్యమో, స్ర్తినో, పురుషుడో, యువకుడో, వృద్ధుడో కూడా తెలియనంతగా నిండా ముసుగు. ముఖం ఏ మాత్రం కనిపించడం లేదు. తనను ఎవరైనా గమనిస్తున్నారా? వెంబడిస్తున్నారా? అని పదే పదే వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. ఊరకుక్కలు కూడా గాఢనిద్రలో ఉన్నాయి. వీధిమలుపు తిరిగి రోడ్డు మీదకు రాగానే అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నివ్వెరపోయాడు.’’


‘ఆగాగు.. రాంగోపాల్ వర్మ రేంజ్‌లో దయ్యం కథ చెబుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ పప్పులో కాలేశావు’’
‘‘ఎలా?’’
‘‘లారీల ముందు చేతులు చాచని పోలీసులున్న జాతీయ రహదారులు ఎక్కడైనా ఉంటాయా? కామెడీ కాకపోతే.. ’’
‘‘ఓహో అలా వచ్చావా? కాసేపు ఆగితే నేనే చెప్పేవాడిని కదా? భయపెట్టే వర్మ దయ్యాల కథ కాదు, ‘విఠలాచార్య మార్కు’ నవ్వించే భూతాల కథ అంతకన్నా కాదు. జీవితంలో ఒక రాత్రి జరిగిన సంఘటన. రోడ్డు మలుపు వద్ద ఎటిఎంలో డబ్బులు పెట్టారని తెలిసి, ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళదామని వెళ్లే సరికి అప్పటికే అక్కడ పెద్ద క్యూ ఉండడం, కాలనీ వాళ్లంతా అక్కడే ఉండడం చూసి మనవాడు నివ్వెర పోయాడన్నమాట. చిల్లర నోట్లు లేవుకదా.. అందుకే పోలీసులు చేయి చాచడం లేదు.’’
‘‘దేశమంటే కాసింత భక్తి ఉండాలి. నన్ను చూడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా ఈ వయసులో కూడా దేశభక్తిని చాటుకోవడానికి ఇష్టపడతాను. మార్నింగ్ వాక్‌లో దేశం కోసం ఎంతో మాట్లాడుకుంటాం. ‘గ్యాస్ సబ్సిడీ’ వదులుకోవాలని మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించి, దాన్ని వెంటనే వదులుకున్నాను. నీలోనూ ఇలాంటి దేశభక్తి ఉంటుందని అనుకున్నా కానీ.. ఈ కాలం పిల్లల్లో అది కనిపించడం లేదు. ఆ రోజులే వేరు ’’
‘‘నిజమే బాబాయ్.. ఆ రోజులే వేరు. మహాత్మాగాంధీ పిలుపు ఇస్తే చాలు.. ఉద్యోగాలను వదిలి స్వాతంత్య్ర పోరాటంలో దూకేవారు. బ్రిటీష్ వాడి లాఠీలకు,తూటాలకు ఎదురొడ్డారు. ఉరితాళ్లను కూడా పూల మాలలుగా ధరించే వారు. అంతగా కష్టపడితే కానీ ‘దేశభక్తుడు’ అనే వారు కాదు.. ఇప్పుడు అన్నీ ‘మేడ్ ఈజీ’ అయిపోయాయి. రెండు నెలలకు 136 రూపాయల గ్యాస్ సబ్సిడీ వదులుకుంటే చాలు దేశభక్తుడనే ముద్ర పడిపోతుంది. రాందేవ్ బాబా తయారుచేసిన లేహ్యం , బిస్కట్లు తినడం కూడా దేశభక్తే. అంతకన్నా ఇంకా ఈజీ.. ఎటిఎం క్యూలో వౌనంగా నిలబడ్డా దేశభక్తే. ఉరికంబాన్ని ముద్దాడడం నుంచి ఎటిఎం క్యూ కు ఎంత తేడా బాబాయ్... నిజంగా కాలం మారింది.’’


‘మనుషుల్లో దేన్నయినా సహించవచ్చు.. కానీ దేశభక్తి లేకపోవడం సహించలేను’’
‘‘సరే బాబాయ్.. నేను కూడా మీలా గ్యాస్ సబ్సిడీని త్యాగం చేస్తా కానీ- నాకో గొప్ప దేశభక్తి ఐడియా వచ్చింది మీ అభిప్రాయం చెబితే మోదీకి పంపిస్తాను.’’
‘‘నీలో నేను కోరుకున్న మార్పు ఇదే.. చెప్పు చెప్పు..’’
‘‘ 70 ఏళ్లలో ఈ దేశానికి ఎవరూ ఏమీ చేయలేదని ప్రస్తుత పాలకులే చెబుతున్నారు. మీరూ అది నిజమేనని అంటున్నారు. మీరు జీవిత కాలమంతా ఉద్యోగంలో అధికారం వెలగబెట్టారు. గతంలో అంటే- రిటైర్ అయిన కొద్దికాలానికి మరణించేవారు. ఇప్పుడు ఉద్యోగ జీవిత కాలం ఎంతో, రిటైర్‌మెంట్ అనంతర జీవిత కాలం కూడా అంతే ఉంటోంది. ఉద్యోగంలో ఉన్నపుడు జీతం కన్నా- రిటైర్‌మెంట్ తరువాత మీకు వచ్చే పెన్షన్ డబ్బు ఎక్కువగా ఉంటోంది. ఈ దేశంలో కోట్లాది మంది అన్నదాతలకు ఎలాంటి పెన్షన్ లేదు. వారెవరికీ లేనిది మీకు అవసరమా? కోట్లాది మందికి సరైన ఆహారమే లేదు. ఇది అన్యాయం కాదా? నిరుపేదలు కట్టే పన్నులతోనే కదా మీ పెన్షన్‌లు చెల్లించేది. గ్యాస్ సబ్సిడీ వదులుకున్నట్టు పెన్షన్ కూడా స్వచ్ఛందంగా వదులుకోవచ్చు కదా? మిమ్ములను చూసి దేశం గర్విస్తుంది. లక్షలాది మంది అనుసరిస్తారు. అరె ఏమైంది? బీపీ పెరిగిపోతోందా? ఏదో సరదాగా అన్నాను’’


‘ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? దుర్మార్గుడా! రేపటి నుంచి మార్నింగ్ వాక్‌లో నీలాంటి వాళ్లతో కబుర్లు చెప్పే ప్రసక్తే లేదు. నీ సలహా విని ఎవడైనా ప్రధానమంత్రికి ఓ ఉత్తరం పంపించాడనుకో.. అమ్మో.. ఇంకేమైనా ఉందా? పెన్షన్ లేని జీవితం కలలో కూడా ఊహించలేను. ’’
‘‘సర్లే బాబాయ్.. ఈ వయసులో నీకు బీపీ తెప్పించడం నాకు ఇష్టం లేదు. నా మాటలకే మీకు బీపీ వస్తే, నోట్లదెబ్బకు ఉపాధి పోయి రోడ్డున పడ్డ రోజుకూలీల మాటేంటి? ఒక వ్యక్తి బ్రహ్మచారిగా ఉండాలనుకుంటే అతనిష్టం. విడాకులు తీసుకోవాలనుకుంటే అది దంపతుల సమస్య, రెండు కుటుంబాల సమస్య. కోట్లాది మంది ప్రజల జీవితాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలని మాత్రమే చెప్పదలుచుకున్నా.

కాపురం చితికిపోతే ఆలుమగలిద్దరూ బాధపడతారు. దేశం చితికిపోతే కోట్లాది మంది రోడ్డున పడతారు...’’

జనాంతికం - బుద్దా మురళి (2.12.2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం