23, డిసెంబర్ 2016, శుక్రవారం

భాగ్యలక్ష్మి మళ్లీ పుట్టింది

‘‘మీ మెగాస్టార్ 150 సినిమాలో అమ్మడు కుమ్ముడు పాట నీకంత నచ్చిందా? ఎగిరిగంతేస్తున్నావ్’’
‘‘ అన్నగారు మూడు దశాబ్దాల క్రితమే ఆరు దశాబ్దాల వయసులో ఆకు మాటు పిందె తడిచే, ఆరేసుకోబోయి పారేసుకున్నావు అంటూ ఎప్పుడో కుమ్మేశాడు. ఇదేం కొత్త కాదు. చిన్ననాటి నా ప్రేమ, నాకల, నా సిద్ధాంతం ఈ దేశానికి ఇప్పుడు నచ్చడంతో ఈ సంతోషం. ’’
‘‘ఏమా సిద్ధాంతం?’’
‘‘చిన్నప్పుడు నిద్రలో భాగ్యలక్ష్మి ... భాగ్యలక్ష్మి అని కలవరించేవాన్ని’’
‘‘ఏంటీ తమరికి చిన్నప్పటి నుంచే లవ్ స్టోరీలు ఉన్నాయా? ’’
‘‘టీవి చర్చల్లో మీరు చెప్పదలుచుకున్నది ఇదే కదా? అని పక్కోడు చెప్పినట్టు- నువ్వోటి . నేను కలవరించిన భాగ్యలక్ష్మి క్లాస్‌మేట్ కాదు అంతకన్నా ఎక్కువ నా జీవిత భాగస్వామి.’’


‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్నావా?’’
‘‘జీవిత భాగస్వామి అంటే భార్య అనేనా? మన జీవితాన్ని వీడి ఉండలేనివన్నీ మన జీవిత భాగస్వాములే. దేవదాసుకు సీసా, రైటర్‌కు కలం, గాయకుడికి గానం, సన్నీ లియోన్‌కు ఆ... సినిమాలు, నటులకు మేకప్ అన్నీ జీవిత భాగస్వాములే. ’’
‘‘నాయకుల సంగతి వదిలేశావ్’’
‘‘నాయకులకు ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు జీవిత భాగస్వాములు- చస్తే నిజం చెప్పక పోవడం, అవినీతి వారి జీవిత భాగస్వాములే. భాగ్యలక్ష్మి భార్య, ప్రేయసినే కాదు. అంత కన్నా ఎక్కువ.’’
‘‘అంతేలే కట్టుకున్న వారి కన్నా కలలు ప్రేయసినే ఎక్కువ .. నీ మేయిల్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ భాగ్యలక్ష్మి కదూ’’
‘‘ ఆ తెలివి తేటలే వద్దు. చిన్నప్పటి ప్రేయసి పేరే చాలా మంది పాస్‌వర్డ్ అనేది సర్వేలో తేలి ఉండొచ్చు ..’’
‘‘ఊరించకు ఎవరా భాగ్యలక్ష్మి ? ఇప్పుడుందా లేదా? ఉంటే ఎక్కడుంది? లేకపోతే ఏమైంది?’’


‘‘అకారణంగా గొంతు నులిపి నా భాగ్యలక్ష్మిని చంపేశారు. చేసిన పాపం ఊరికే పోదు. మళ్లీ ఇప్పుడు భాగ్యలక్ష్మినే నమ్ముకున్నారు.’’
‘‘ శ్రీమతి భాగ్యలక్ష్మిగా మారి ఉంటుందనుకున్నా, కీ.శే.్భగ్యలక్ష్మి అవుతుందని అనుకోలేదు. రియల్లీ సారీ. అసలెలా జరిగింది? ’’
‘‘చిన్నప్పటి నుంచి నేను భాగ్యలక్ష్మిని ఎంత ప్రేమించానో మా నాన్న అంతగా ద్వేషించాడు. ఈ చదువులు నాకొద్దూ అన్నా... నేను ప్రేమించాను అన్నా ఏమీ అనేవాళ్లు కాదు. కానీ భాగ్యలక్ష్మి పేరు ఎత్తితే చాలు వీపు విమానం మోత మ్రోగించేవాళ్లు. పచ్చబొట్టును చెరిపేయగలరేమో కానీ మనసులో ముద్రించుకున్న రూపాన్ని చెరిపేయలేరు కదా? భాగ్యలక్ష్మి ముద్ర నా గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయింది.’’
‘‘ఆ భాగ్యలక్ష్మి సంగతి సరే. ఇంతకూ ఏదో సిద్ధాంతాన్ని కనిపెట్టాను. అది నిజమైంది అని అరుస్తున్నావ్ కదా? ముందా విషయం చెప్పు ’’
‘‘ అక్కడికే వస్తున్నాను. ఇంత కాలం నా గుండెల్లో నిద్ర పోయినా సిద్ధాంతానికి ప్రధానమంత్రి ప్రాణం పోశారు. దేశం మొత్తాం నా సిద్ధాంతాన్ని నమ్ముతోంది. అనివార్యంగా ఆచరిస్తోంది. ’’
‘‘సిగ్గులేక పోతే సరి మోదీ పెళ్లయిన బ్రహ్మచారి, నీ ప్రేమ సిద్ధాంతానికి ప్రాణం పోశాడా? ఏం మాట్లాడుతున్నావ్’’
‘‘భాగ్యలక్ష్మి  అంటే ఇంతకూ నువ్వేమనుకుంటున్నావ్. లాటరీ రా బాబు. నా చిన్నప్పుడు భాగ్యలక్ష్మి  బంపర్ లాటరీ ఒక ఊపు ఊపింది. ఈ లాటరీ ని ప్రభుత్వమే నిర్వహించేది .  నిజంగా లాటరీ తగిలి లక్ష రూపాయలు వచ్చినా ఏం చేసుకోవాలో తెలియని వయసు కానీ లాటరీ కొన్నప్పటి నుంచి డ్రా తీసేంత వరకు భాగ్యలక్ష్మి నన్ను కలల్లో విహరింపజేసేది. ఎవరన్నా ఆప్యాయంగా పలకరించినా నాకొచ్చే లాటరీ డబ్బు కోసం కాకా పడుతున్నారనుకునే వాణ్ణి. నా భాగ్యలక్ష్మి గొంతు నులిమేశారు. ఆ షాక్ నుంచి నేను తేరుకో లేదు. కొద్దిగా వయసు పెరిగాక సింగిల్ నంబర్ లాటరీలు వచ్చాయి.’’


‘‘ఆటో రిక్షా డ్రైవర్లు, పేదలు సింగిల్ నంబర్ లాటరీల్లో నిండా మునిగిపోయి అప్పుల్లోంచి తేరుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తలు వచ్చేవి అవేనా? ’’
‘‘పాజిటివ్‌గా ఆలోచించడం రాదా? నీకు. ఓ వంద మంది ఆత్మహత్యలు చేసుకుంటే అదే చెబుతావు కానీ సింగిల్ నంబర్‌లు కోట్లాది మందిని ఆశల్లో ముంచెత్తేవి అవి గుర్తు లేవా? ఈ విశ్వంలో లాటరీని మించిన సిద్ధాంతం లేదు. భూమి సూర్యుడి చుట్టు తిరిగితే, భూమిపై ఉన్న వాళ్లు లాటరీ చుట్టూ తిరుగుతారనే సిద్ధాంతాన్ని నేను చిన్నప్పుడే కనిపెట్టాను. మా అయ్య తంతాడని నా సిద్ధాంతాన్ని ప్రపంచానికి చెప్పలేదు. మోదీ ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తోంది. ’’


‘‘దీన్ని వ్యసనం అంటారు కానీ సిద్ధాంతం అంటారా? ఐనా మోదీకేం సంబంధం? ’’
‘‘మనిషన్నాక కాస్త పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. నగదు రహిత లావాదేవీలు పెరగాలంటే కరెన్సీ రద్దు చేయడమే మార్గం అని కనిపెట్టారు. డబ్బుతో మనం ఏం చేసినా లాటరీ తగులుతుంది. కొన్ని వందల కోట్లు ఈ లాటరీలకు ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు నెల కాగానే ఓనర్‌కు అద్దె ఇవ్వాలి, కరెంటు బిల్లు కట్టాలి, పన్ను కట్టాలి అంటూ అమ్మో ఒకటో తారీఖు అని భయపెట్టేది. మరిప్పుడు ఏ బిల్లులో ఏ లాటరీ ఉందో అని రోజూ లాటరీ డ్రా చూసుకుంటూ గడపడం అంటే ఆ మజానే వేరు. పాపం పాతిక శాతం చైనా వాడి పెట్టుబడి ఉన్నా పేటిఎం వాడు కూడా కోటి లాటరీ ప్రకటించాడు. సిక్కిం అనే ఒక చిన్న రాష్ట్రం భారీ లాటరీలు నిర్వహించి దేశంలోని కోట్లాది మందిని ఆశల్లో విహరింపజేసింది. లాటరీకి ఉన్న పవర్ అది. జీవితమే లాటరీ. చదువు ముగిశాక ఉద్యోగం వస్తుందా? రాదా? ఐదేళ్ల కోసం మనం ఎన్నుకున్న ప్రభుత్వం బాగుంటుందా? లేదా? పెళ్లవుతుందా? కాపురం సరిగా ఉంటుందా? అన్నీ లాటరీనే కదా? బాగుంటే లాటరీ తగిలినట్టు లేదంటే తగలనట్టు అంతే. ఈ లాటరీ తగలక పోతే మరో లాటరీ కొంటాం .. అచ్చం ఈ ప్రభుత్వం బాగా లేదని 5 ఏళ్ళు అయ్యాక మరో ప్రభుత్వం ఎన్నుకొంటాం ఇదీ అంతే . .లాటరీకి డబ్బులిచ్చి కొనాలి . ఓటుకు వాళ్ళే  డబ్బులిచ్చి కొంటారు అంతే 
కోరికలే దుఃఖానికి మూలం అని గౌతమ బుద్ధుడికి కలిగిన జ్ఞానోదయం. లాటరీలు మినహా కోట్లాది మంది ప్రజలను మరేదీ సంతోషపెట్టలేదు అని మోడీ ప్రభుత్వం గ్రహించిన జ్ఞానం. బుద్ధిని జ్ఞానోదయం కన్నా మోడీ లాటరీ జ్జ్ఞానం శాశ్వతం .   ప్రయోజనకరమైనది. ఇద్దరి భార్యల పేర్లు ఒకటే... ఇద్దరి పోలికలను ఊరకనే ప్రచారం చేయలేదు. నీకు లక్ష రూపాయల జీతం వచ్చినా, రెండో రోజు నుంచే దిగులు. లాటరీ అయితే డ్రా తీసేంత వరకూ సంతోషమే. అలాంటి శాశ్వత సంతోషం ప్రభుత్వమే ప్రసాదిస్తుంటే?’’


‘‘ఐతే ఈనెల జీతం లాటరీ టికెట్లు ఇస్తే తీసుకుంటావా?’’
‘‘మళ్లీ కలుద్దాం ఈ‘ కాలం ’సైజు ఇంతే.’’

-జనాంతికం - బుద్దా మురళి(23. 12. 2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం