9, డిసెంబర్ 2016, శుక్రవారం

భలే మొనగాడు

‘‘అంతగా నవ్వొచ్చిన విషయం ఏంటో..? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. మాకు చెబితే మేమూ నవ్వుతాం..’’
‘‘అవినీతి తాట తీస్తా- ఇక అంతా ఆన్‌లైన్‌లోనే.. అని ప్రధానమంత్రి చెబుతున్నారు’’
‘‘దీనిలో నవ్వడానికేముంది..? 70 ఏళ్ల తరువాత దేశాన్ని ఒక మొనగాడు పాలిస్తున్నాడు. దానికి సంతోషపడాలి’’
‘‘అదేంటి వాజపేయిని, మోదీ రెండున్నరేళ్ల పాలనా కాలం కూడా కాంగ్రెస్‌లోనే కలిపేశావా? 70 ఏళ్ల లెక్క ఏంటి? ’’
‘‘ఏదో ఎమోషన్‌లో అలా అనేస్తాం. ప్రతి ఏడాదికి లెక్క చెప్పాలా? ’’
‘‘నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా మోదీ మొనగాడే.’’
‘‘ఇప్పటికైనా ఒప్పుకున్నావ్.. థ్యాంక్స్’’
‘‘ఎనిమిది శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న దేశాన్ని ఒంటి చేత్తో వెనక్కి లాగి, వంద కోట్ల మందిని ఎటిఎం క్యూలో నిల్చోబెట్టడం అంటే మా టలా? ’’
‘‘మళ్లీ వెటకారం. దేశం బాగుపడుతుంటే ఇదో పెద్ద సమస్యనా?’’
‘‘ ఒకందుకు మోదీ నిజంగానే మొనగాడు. నెహ్రూ పాలనా కాలాన్ని మన తరం చూడలేదు. ఆ తరువాత వచ్చిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులూ అంతా జనాకర్షణ పథకాలతో జనం మనసు దోచారు. ఎన్ని గొప్ప పథకాలు ప్రారంభించినా జనం ఇంకా ఏదో కావాలి అని అడిగేవారు. ’’


‘‘అన్నగారు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తా అంటే గెలిపించారు, ఇచ్చాక ఓడించారు. కొత్తగా వచ్చిన వాళ్లు ఇంకా ఏదైనా ఇస్తారని..’’
‘‘అన్న, అమ్మ, అల్లుడు అనే కాదు.. అందరికీ ఇలానే జరిగింది. గరీబీ హటావో అంటూ ఇందిరమ్మ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ గుర్తుండి పోతాయి కదా? అలాంటి ఇందిరమ్మేనే ఓడించారు. ధరలు తగ్గించిన జనతా పార్టీని మట్టి కరిపించారు.’’
‘‘నిజమే- కానీ- టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. జనాకర్షణ పథకాలు-నేతల సంగతి సరే.. దీనితో మోదీకి, నోట్ల రద్దుకు సంబంధం ఏంటి? చెప్పు ముందు ’’
‘‘అక్కడికే వస్తున్నాను. ఇందిరమ్మ కాలం నుంచి ‘తమిళ అమ్మ’ కాలం వరకు ప్రభుత్వాలు ఎన్ని ఉచిత పథకాలు ప్రవేశపెట్టినా ఈ ప్రభుత్వం ఇంకేమైనా ఇస్తుందా? లేక వచ్చే ప్రభుత్వం ఇంత కన్నా గొప్ప ఉచితాలు ఇస్తుందా? అనే ఎదురు చూపులు ఉండేవి. ఒకే ఒక మొనగాడు వచ్చాడు.. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ‘ప్రభుత్వం నుంచి ఇది కావాలి అని కాకుండా బ్యాంకులో మా డబ్బు మాకు ఇప్పించండి మహాప్రభో!’ అని కోట్లాది మంది ప్రజలు దీనంగా వేడుకునే పరిస్థితి కల్పించింది మాత్రం మోదీయే. అనుకూల వాదనలు, వ్యతిరేక వాదనలు అన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా-‘ఆ స్కీమ్ కావాలి, ఈ స్కీమ్ కావాలి. ఇంటికో ఉద్యోగం కావాలి, ఉండేందోకో ఇల్లు కావాలి..’ అంటూ అడగడాన్ని ఈ దేశం ఏడు దశాబ్దాల నుంచి చూస్తోంది. బ్యాంకులు, ఎటిఎంల నుంచి మా డబ్బు మేం తీసుకుంటాం. కనికరించండని ప్రజలు వేడుకోవడం తొలిసారిగా అనుభవమైంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గురించి కెసిఆర్‌ను, ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబును, విదేశాల నుంచి తెచ్చి ఇస్తానన్న 15 లక్షల గురించి మోదీని అడిగేవారే లేరు. ‘ఎటిఎంల్లో నోట్లకట్టలు పెట్టించండి.. మా డబ్బును మమ్మల్ని విత్ డ్రా చేసుకోనివ్వండి’- అనే మాట తప్ప మరో డిమాండ్ వినిపించకుండా చేశారు. ఇంతటి మహత్తర మార్పు ముమ్మాటికీ మోదీ వల్లనే సాధ్యం అయింది.’’
‘‘నీ మెచ్చుకోలు లో ఏదో వ్యంగ్యం ఉంది . నీ పై నాకు నమ్మకం కలగడం లేదు’’
‘‘మంత్రుల మీద, ఎంపిల మీద ప్రధానమంత్రికి నమ్మకం లేదు. ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రులకు నమ్మకం లేదు. ఈ దేశంలో ఎవరికీ ఎవరి మీద నమ్మకం లేదు. నువ్వు నన్ను నమ్మినా నమ్మక పోయినా నా అభిప్రాయం అంతే.’’
‘‘మహామహా మేధావులను పిచ్చివాళ్లు అనే అనుకున్నారు. ఏ సంస్కరణలకైనా మొదట హేళనలు తప్పలేదు’’
‘‘నువ్వు చెప్పింది అక్షర సత్యం. కానీ పిచ్చివాళ్లంతా మేధావులు కాదు. ప్రతి సంస్కరణా అద్భుతం అని మురిసిపోనవసరం లేదు.’’
‘‘నీ ఉద్దేశం? ’’


‘ప్రతి నేలకు ఓ స్వభావం ఉంటుంది. ఉష్ణమండలంలో ఆపిల్స్ పండించాలని ప్రయత్నిస్తే ఎలా? ’’
‘‘ప్రయోగం జరిపితేనే కదా? పండుతుందో లేదో తెలిసేది?’’
‘‘నిజమే! వరి పంట మొత్తం పీకి పారేసి ఆపిల్ విత్తనాలు నాటితే.. అటు ఆపిల్ పండక, ఇటు వరి పంట లేక జనం అన్నమో రామచంద్రా అని రోడ్డున పడతారు. ప్రయోగం ప్రయోగశాలలో చేయాలి, వంద కోట్ల మంది జీవితాలతో కాదు.. ’’
‘‘నేలకు ఓ స్వభావం ఉన్నట్టే దేశానికీ ఓ స్వభావం ఉంటుంది. ఆ విషయాన్ని వందేళ్ల క్రితమే టెక్నాలజీ లేని కాలంలోనే గాంధీజీ గుర్తించి స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటం చేయడం ఈ దేశ స్వభావం కాదని గుర్తించి అహింస అనే అయుధంతో స్వాతంత్య్ర పోరాటం చేశాడు. గాంధీ అలా చేయాల్సింది కాదు.. నెహ్రూ ఇలా చేయాల్సింది కాదు.. మా అప్పారావు అప్పుడు ఉండి ఉంటే కాశ్మీర్ సమస్యే తలెత్తేది కాదు.. అని మనం ఈ కాలం ఆలోచనలతో గొప్పగా చెప్పుకోవడం బాగానే ఉంది. కానీ ఆచరణకు వచ్చే సరికి- ఐదువందల నోట్లను సరిగా ప్రింట్ చేయలేక తిరిగి వెనక్కి తీసుకు వెళుతున్నారు. నోట్ల రద్దు పరిణామాలను ఊహించి ముందస్తు ఏర్పాటు చేయలేక చేతులెత్తేశారు. ఈ దేశ స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని చెబుతున్నా అంతే.


రాజధాని నగరంలో మరుగుదొడ్లు లేక అధికారులు బస్సెక్కి మరుగు దొడ్ల వేటకు వెళుతున్న పరిస్థితిలో పాలకుడు బుల్లెట్ ట్రైన్‌ల గురించి మాట్లాడితే ‘సిల్లీ’గా ఉంటుంది. అంతే కానీ- బుల్లెట్ ట్రైన్‌లను కోరుకోవడం తప్పనడం లేదు.’’
‘‘నల్లబడ్డ నీ ముఖం చూడగానే అర్థమైంది. నల్లడబ్బున్నవారికి అనుకూలంగా మాట్లాడుతున్నావ్’’
‘‘అమీర్ పేట నుంచి పంజాగుట్ట మీదుగా దిల్‌సుఖ్‌నగర్ బైక్ మీద వెళ్లి వస్తే నీకు నాకే కాదు. ఆ తెల్లవాడి ముఖం కూడా నల్లబడుతుంది. నల్లడబ్బుతో కాదు- హైదరాబాద్ కాలుష్యం జబ్బుతో’’
‘‘సంస్కరణలు అనివార్యం? ’’
‘‘పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో క్యూలు కనిపించకుండా చేస్తే మోదీ ఈ తరానికి భారీ క్యూలను పరిచయం చేశారు. ప్రచార ఆర్భాటం కోసం సంస్కరణలు కాదు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు సంస్కరణలు కావాలి’’
‘‘టాపిక్ మార్చు.. జయలలిత మరణంతో తమిళనాడు పరిస్థితి ఎలా ఉంటుందంటావ్..’’
‘‘నోట్ల రద్దు, తమిళనాడు భవిష్యత్తు.. ఏదైనా కాలమే చెబుతుంది. నేనైతే అమ్మ అంతిమయాత్రలో పన్నీర్ సెల్వంను చూస్తూ ఉండిపోయా. సిఎం పీఠాన్ని అధిష్టిస్తున్న సంతోషం, అమ్మ చనిపోయిందన్న బాధ అన్నీ కలగలిపి ఒకేసారి చూపించిన రాజకీయ మహానటుడు అతడిలో కనిపించాడు.’’
*
- బుద్దా మురళి(జనాంతికం 9 December 2016)

1 కామెంట్‌:

  1. ప్రయోగం ప్రయోగశాలలో చేయాలి, వంద కోట్ల మంది జీవితాలతో కాదు..

    well said.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం