15, జనవరి 2017, ఆదివారం

నిజం ..అంతా అబద్ధం!..

‘‘యుద్ధం చూస్తాం అని పిల్లలు ఒకటే గోల..’’
‘‘శివ సినిమా చూసి వావ్ తెలివైన దర్శకుడు తెలుగునాట పుట్టాడు అని అనుకుంటే తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు థర్డ్ క్లాస్ సినిమాలతో పోటీ పడి అవే నయం అనిపించేంతగా వర్మ ఎదిగిపోయాడు. ఆ సినిమాలకు రానంటే రాను.. మీరు వెళ్లండి’’


‘‘పూర్తిగా వినకుండానే వర్మలానే తిక్కగా మాట్లాడకండి. పిల్లలు అడుగుతున్నది యుద్ధం సినిమా గురించి కాదు. రెండునెలల క్రితం మీరు యుద్ధానికి వెళుతున్నాను అని హడావుడిగా కెమెరా భుజాన వేసుకుని దేశ సరిహద్దుల్లోకి వెళ్లారు కదా? ఏ విషయంపైనైనా పిల్లలకు ఆశ కల్పించవద్దు. ఐతే అవుతుందని చెప్పాలి, లేదంటే లేదు. కానీ ఆశ పెట్టి వదిలేస్తే పిల్లలకు మీ మీద గౌరవం పోతుంది. మా డాడీ సినిమాల్లో మెగాస్టార్‌లా యుద్ధ రంగంలో ఎంట్రీ ఇస్తాడని పిల్లలు వాళ్ల ఫ్రెండ్స్‌కు చెప్పుకున్నారు. మీరేమో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీలా తుస్సు మనిపించారు.’’
‘‘ఆ యుద్ధం గురించి నాకేం తెలుసు?’’
‘‘ఇదిగో యుద్ధం, ఇదిగో ఆయుధాలు అంటూ బీభత్సమైన సౌండ్‌తో మీరు మిలట్రీ డ్రెస్‌లో దేశ సరిహద్దులో కంచె వద్ద ఉన్నట్టు టీవీలో కనిపించింది’’
‘‘ఏ టీవీ వాళ్లయినా చేసేది ఇదే.. తాము వెళ్లి యుద్ధానికి శ్రీకారం చుట్టినట్టు, యుద్ధ రంగంలో ఉన్నట్టు చెప్పాలి లేకపోతే ఇక్కడి నుంచి అంత దూరం వెళ్లి ఖర్చులు దండగ అని అంటారు కదా?’’


‘‘రెండు నెలల క్రితం యుద్ధ మేఘాలు వచ్చాయన్నారు. అవేమన్నా ఈశాన్య ఋతుపవనానాల దోబూచులాడేందుకు? ఆ మేఘాలు ఏమయ్యాయి? ’’
‘‘మనం వెళ్లినప్పుడే కాదు.. సరిహద్దుల్లో ఎప్పుడూ వాతావరణం అలానే ఉంటుంది. ఏదో డ్రమటైజ్ చేసేందుకు అదిగో యుద్ధ మేఘాలు మా కెమెరాలో పట్టేశాం అని ఏదో చెప్పాల్సి వస్తుంది. అర్థం చేసుకోరు’’
‘‘నిజం చెప్పండి.. మోదీ గారు యుద్ధమేఘాలను అరెస్టు చేశారా..?’’
‘‘ఒక రకంగా అదే అనుకో. కరెన్సీ రద్దుతో టీవీ చానల్స్ అన్నీ సరిహద్దుల నుంచి ఎటిఎంలపై వాలిపోయాయి. మేఘాల నుంచి తమ కెమెరాలను జనం వైపు ఫోకస్ చేశాయ. అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం జరగదు. జరిగినా ఎవరూ గెలవరు. ’’
‘‘అంటే- మరి అదంతా నిజం కాదా..? ’’
‘‘జీవితమే ఒక నాటకం. ఆ దేవదేవుడు ఆడించే నాటకంలో మనమంతా పాత్ర ధారులం అని పెద్దలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పారు కదా? మన పాత్ర నిడివి ఎంతో మనకే తెలియదు. కానీ- జీవితం శాశ్వతం అనుకుంటాం. ’’
‘‘మెట్ట వేదాంతం వద్దు. నిజం చెప్పండి.. అంతా అబద్ధం కదూ.’’

‘చూడు డియర్.. మధ్య తరగతి కుటుంబరావుల జీవితాల్లోనే క్షణక్షణం నటన ఉంటుంది. ఇంత పెద్ద దేశాలను నడపాలంటే ఎంతేసి నటనలు ఉండాలి. ’’
‘‘అంటే నా మీద మీ ప్రేమ, మీమీద నా ప్రేమ నటనేనా? ఇప్పుడే తేలాలి..’’
‘‘కరెన్సీ రద్దు గురించి ఆర్‌బిఐకి, దేశ ఆర్థిక మంత్రికే తెలియదు. ఇక తెలుగునాట ఉండే మామూలు టీవీ రిపోర్టర్‌ని నేను.. యుద్ధం ఎప్పుడో నాకేం తెలుస్తుంది? మన ప్రేమ గురించి అడిగావ్ బాగుంది. మన పెళ్లి రోజు గుర్తుందా? అదిగో అరుంధతి నక్షత్రం అని నీకు చూపించాను గుర్తుందా? ’’
‘‘అవును ఆ రోజుల్లో స్లిమ్‌గా ఎంత బాగుండేవారో, మా ఆయన టీవీలో కనిపిస్తారు అని బంధువులకు ఎంత మురిపెంగా చెప్పుకునే దాన్ని.. మీరు టీవీలో తప్ప ఇంట్లో కనిపించరని అప్పుడు నాకేం తెలుసు..?’’
‘‘ఆఫీసులో బాస్, ఇంట్లో నువ్వు చాన్స్ దొరికితే చాలు తిట్టేస్తారు. అరుంధతి నక్షత్రం సంగతి మాట్లాడుకుందాం. మా క్లాస్‌మెట్ విశాలాక్షిని చూపించినంత ఈజీగా ఆకాశంలోకి చూస్తూ అదిగో అరుంధతి నక్షత్రం అని నేను చూపించడం, కనిపించినట్టు నువ్వు తలూపడం అంతా నటన కాకుంటే మరేంటి డియర్? ఇంకో విషయం తెలుసా? అరుంధతి నక్షత్రాన్ని చూపించే పంతులుకు కూడా అదెక్కడుందో తెలియదు. ఆ పంతులేమీ ఖగోళ శాస్తవ్రేత్త కాదు. నేనూ కాదు. ఎవరి పాత్రలో వాళ్లు నటిస్తేనే ఆ పెళ్లి తంతు పూర్తవుతుంది. అది నిజం అందామా? అబద్ధం అందామా? అక్కడి నుంచే విజయవంతంగా అబద్ధాలు నేర్చుకుంటేనే మన కాపురం ఇలా కలకాలం ఉటుంది. దీన్ని అబద్ధం అందామా? నిజం అందామా? ’’


‘‘పెళ్లయిన కొత్తలో వడ్డాణం చేయిస్తానని మీరు చెప్పిన మాట ముమ్మాటికీ అబద్ధం. ’’
‘‘చేయిద్దామనే తొలుత ఆ హామీ ఇచ్చాను. ఆ తరువాతే పరిస్థితి మారి అబద్ధాలు చెప్పాను. దీన్ని నువ్వు అబద్ధం అంటావా? నిజం అంటావా? ఇంకో మాట చెప్పాలా? నిజం అబద్ధం విడదీయలేనంతగా కలిసిపోయి ఉంటాయి. ఆకాశం దించాలా? నెలవంకా తుంచాలా? అంటూ ప్రియుడు పాడే పాట అబద్ధం అని తెలిసినా, తెంచమంటే ప్రియుడు బేల చూపులు చూస్తాడని తెలిసినా అది నిజమే అని నమ్మినట్టుగా ప్రేయసి నటిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ’’
‘‘సినిమాలను మించిన నటన రాజకీయాల్లో ఉంటుందని అందుకే అంటారేమో?’’
‘‘చక్రి ఎందెందు వెదికినా అందందు ఉంటాడన్నట్టు- నటన లేని రంగం అంటూ ఉండదు. సినిమాల్లో కన్నా బయటే నటుల విశ్వరూప నటన కనిపిస్తుంది. మామను అధికారం నుంచి దించేసింది అబద్ధమా? గోదావరిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేవునిగా పూజలు జరిపిస్తున్నది అబద్ధమా? అంటే రెండూ నిజమే, రెండూ అబద్ధమే! పాలలో నీళ్లలా రెండూ కలిసిపోయి ఉంటాయి. అవిభక్త కవలల్లా అబద్ధం, నిజం రెండూ కలిసిపోయాయి. రెండింటిని విడదీసే ప్రయత్నం చేయడం కన్నా- నిజమే అని నమ్మినట్టు నటించి మనమూ ఎంజాయ్ చేస్తే జీవితం హాయిగా గడిచిపోతుంది. ఏమంటావు?’’
‘‘ఆలోచిస్తే భయమేస్తుంది. మీరు చెప్పే ప్రతి మాటా అబద్ధమే అనిపిస్తోంది’’


‘‘అన్నీ నిజమే అని నమ్ము.. జీవితం హాయిగా గడిచిపోతుంది. స్వర్ణాంధ్ర, స్వర్ణ తెలంగాణ, స్వర్ణ భారత్, సింగపూర్‌ను మించిపోతున్నాం, శాశ్వతంగా అధికారం మనదే... అని ఎవరు ఏం చెప్పినా హాయిగా నమ్మేస్తే ఇబ్బందే లేదు.’’
‘‘అదేదో క్రీమ్.. వారం రోజులు వాడితే తెల్లబడతారు.. అని టీవీలో ప్రకటనలు చూసి పనె్నండేళ్ల నుంచి వాడుతున్నా. తెల్లబడలేదు, క్రీమ్ వాడడం మానలేదు. నమ్మకం మాత్రం పోలేదు. ఏమో గుర్రం ఎగరా వచ్చు.. 


అన్నట్టు ఈ నమ్మకమే మనిషిని బతికిస్తుంది. ఇంత కన్నా పోయేదేముంది ఎవరేం చెప్పినా నమ్మేద్దాం ’’
-బుద్ధా మురళి (జనాంతికం 12.1. 2017) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం