6, జనవరి 2017, శుక్రవారం

కవిత్వంతో ఎన్‌కౌంటర్!

‘‘ఏంటీ.. అలా మెలికలు తిరిగిపోతున్నావ్..! ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావ్! చెప్పు.. ’’
‘‘మబ్బు అడ్డం వస్తే సూర్యుడు కనిపించడు
బస్సు అడ్డం వస్తే స్కూటర్ కనిపించదు
మనం కోరుకున్నప్పుడు బస్సు రాదు
వచ్చిన బస్సు మన ఇంటికి పోదు.. ఇదేరా జీవితం’’


‘‘ఏంటీ.. కవిత్వం మొదలు పెట్టావా? ఇలాంటి విషయాల్లో నేను చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాను. కాలేజీలో నేను విపరీతంగా ప్రేమించిన అనుపమతో రిలేషన్స్ కట్ అయింది ఈ కవిత్వం వల్లే. గిరిజతో కలిసి నక్సలైట్లతో కలిసిపోవడానికైనా సిద్ధమే.. కానీ నీతో కలిసి కవి సమ్మెళనాలకు రానంటే రానన్నాను. గిరిజ ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. అనుపమ మాత్రం ఇంకా కవి సమ్మేళనాల్లో తన కవిత్వంతో అమాయకులను ఎన్‌కౌంటర్ చేస్తూనే ఉంది.’’
‘‘చూడోయ్.. జీవితం అన్నాక కష్టాలు, దీర్ఘ కవిత లు వినాల్సి వస్తుంది.. తప్పుదు.. ‘ఇంటికి ఆలస్యంగా ఎందుకొచ్చావ్..?’- అంటే మనం చెప్పే కథలు భార్యలు వినకపోయినా మనం చెప్పడం మానం కదా? ఇదీ అంతే. పాలలో పెరుగుంటుంది కానీ అది మనకు కనిపించదు. జీవితమూ అంతే..’’
‘‘అలా తిక్కతిక్కగా మాట్లాడకు.. విషయం ఏంటో చెప్పు. పాలలో పెరుగుంటే- ఒక పాల ప్యాకెట్ తీసుకొని పాలకు, అందులో ఉన్న పెరుగుకు విడివిడిగా డబ్బులు ఇవ్వు’’
‘‘కవి హృదయాన్ని అర్థం చేసుకోవు. పాలలో కనిపించని పెరుగుంటుంది అని చెప్పగానే- ఎంతగా ఎదిగి పోయావురా! అని ఆకాశమంత ఎత్తు ఎదిగిన నన్ను చెమ్మగిల్లిన కళ్లతో చూస్తావనుకుంటే అలా మాట్లాడుతున్నావ్’’
‘‘పాలలో కనిపించని పెరుగే కాదు కళ్ల ముందే నీళ్లు కలపడం కూడా చూశాక ఈ ఉపమానాలు నన్ను కదిలించడం మానేశాయి. అప్పుడెప్పుడో నీకు మేధావి జబ్బు చేసిందని తెలుసు కానీ ఇప్పుడు ఇలా’’


‘‘గల్లీగల్లీకి వందమంది మేధావులు కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను మేధావి దశ దాటి ఆధ్యాత్మిక జ్ఞాని దశకు చేరుకున్నాను’’
‘‘జరిగితే జ్వరం అంత సుఖం లేదని అంటారు. నీకేంటిరా? నిరుద్యోగ జీవితం, ఉద్యోగం చేసే భార్య, తల్లిదండ్రులు సం పాదించిన సొంతిళ్లు. జ్ఞానికి కావలసిన అర్హతలన్నీ నీలో ఉన్నాయి.’’
‘‘నీకు వంద కోట్లు వస్తే ఏం చేస్తావురా..?’’
‘‘రోజంతా ఎటిఎంల ముందు నిలబడితే, రెండువేలు వస్తే సంబరపడ్డవాడ్ని , ఈరోజు ఎటిఎంల వద్ద జనం లేరు, పైగా రోజుకు నాలుగున్నర వేలు వస్తేనే ఏం చేసుకోవాలో తెలియడం లేదు. ఇక వంద కోట్లు అంటే గుండె ఆగిపోతుంది’’
‘‘దేనికైనా గుండె ధైర్యం ఉండాలి. నాకైతే వంద కోట్లకు మంచి ప్లాన్ ఉంది’’
‘‘క్యాష్‌లెస్ అని మోదీ, క్యాష్ ఇస్తేనే ఇంట్లో ఉండాలని ఇంటి ఓనర్ ఇద్దరి మధ్య నలిగిపోతూ ఈనెల కిరాయి ఎలారా భగవంతుడా? అని ఆలోచిస్తే, నువ్వోచ్చి వంద కోట్లు అంటే తల తిరుగుతోంది..’’
‘‘నేను వంద కోట్ల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇంటి అద్దె, కందిపప్పు ధర, కూరగాయల గురించి మాట్లాడతావ్! కాస్త ఎదుగు.. విశాలంగా ఆలోచించడం నేర్చుకో! దంగల్ సినిమా చూశావా? ’’
‘‘నాకు హిందీ రాదు’’
‘‘మా అబ్బాయిని ఎప్పుడైనా గమనించావా? తెలివి తేటల్లో వాడు నన్ను మించిపోతున్నాడు?’’
‘‘పువ్వు పుట్టగానే పరమళించినట్టు నీలానే వాడు కూడా నాలుగో తరగతి నుంచే అమ్మాయిలను ప్రేమించడం మొదలు పెట్టాడా? ఏంటి? ’’
‘‘నాది చిన్నప్పటి నుంచే కళాత్మక హృదయం.. నీలాంటి వాడికి అది అర్థం కాదు కానీ. మా ఆవిడ నాకు కనిపించకుండా పరుపుకింద, కారం పొడి డబ్బాలో డబ్బు దాచిపెడితే, మా వాడు ఎలా కనిపెడతాడో కానీ క్షణంలో మాయం చేస్తాడు. చేతికి కారం అంట కుండా ఆ డబ్బాలోని వంద నోటు లాగించేయడం అంటే మాటలా? వాడు ఎప్పటికైనా గొప్ప శాస్తవ్రేత్త అవుతాడని నాకు గట్టి నమ్మకం.’’
‘‘అలా డబ్బులు ఎత్తుకెళ్లేవాడు ఐతే దొంగోడు అవుతాడు. చదువుకుంటే ఆదాయం పన్ను శాఖలో  రాణిస్తాడు. కానీ- శాస్తవ్రేత్త ఎందుకవుతాడు?’’


‘‘అందుకే చెప్పాను కాస్త ఎదగమని. ఆపిల్ చెట్టు నుంచి పండు పడడం ఎందరో చూశారు. న్యూటన్  మాత్రమే అది చూసి భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు. నీలా సాధారణంగా ఆలోచిస్తే అలానే అనిపిస్తుంది. కానీ ఓ జ్ఞానిలా ఆలోచిస్తే.. ఎవరికీ కనిపించని వంద నోటు మా వాడికి కనిపించింది అంటే వాడు కచ్చితంగా సైంటిస్ట్ అవుతాడు. నీకు గుర్తుందా? మనం పరీక్షల్లో ఎన్ని చిట్టీలు పట్టుకుపోయినా ప్రశ్నాపత్రం చేతికి ఇవ్వగానే ఏ ప్రశ్నకు సమాధానం ఏ జెబులోని చిట్టీలో ఉందో క్షణంలో కనిపెట్టేవాడ్ని. ఈ తెలివి తేటలు మా వాడికి జీన్స్ ద్వారా అబ్బి ఉంటాయి. నేనో గొప్ప సైంటిస్ట్‌ను అవుతానని అప్పుడే అనిపించింది.. పరిస్థితుల వల్ల కాలేక పోయాను. నేను చేయలేకపోయిన దాన్ని మా అబ్బాయి చేస్తాడు.’’
‘‘ఏ ఒక్కదానికీ సంబంధం లేకుండా మాట్లాడుతున్నావ్! వంద కోట్లు అంటావ్, దంగల్ అంటావ్, అప్పుడే సైంటిస్ట్ అంటావు? ’’
‘‘అన్నింటికీ సంబంధం ఉంది. అందుకే దంగల్ గురించి అడిగా. బంగారు పతకం సాధించాలని కలలు కన్న హీరో అమీర్ ఖాన్ తాను చేయలేని పని తన కూతురు చేస్తుందని మల్లయోధురాలిగా తీర్చి దిద్దాడు. ఇదే స్ఫూర్తితో మా అబ్బాయిని సైంటిస్ట్‌ను చేస్తాను. వంద కోట్లు కొట్టేస్తాను’’
‘‘ఇప్పుడు అర్థమైంది.. నోబెల్ బహుమతి వస్తే వంద కోట్లు ఇస్తానని ఆ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై బాగానే ఆశలు పెట్టుకున్నావ్. అది సరే నిరుద్యోగ భృతి రెండువేలు వస్తుందన్నావు నీకు వచ్చిందా? ’’
‘‘నా టార్గెట్ వంద కోట్లు.. 2 వేల గురించి ఆలోచించను’’
‘‘బడుల్లో టీచర్లు లేరు. పిల్లలకు కనీసం టాయిలెట్స్, తాగడానికి మంచినీళ్లు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలకు చాలా సార్లు మొట్టికాయలు వేసింది. గడవు విధించింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సమస్య అలానే ఉంది. ఆ వంద కోట్లతో టాయ్‌లెట్స్, మంచినీళ్లు ఇవ్వవచ్చు కదా? ’’


‘‘మరదే.. గొప్ప వాళ్లకు గొప్ప ఆలోచనలు వస్తాయి, నీలాంటి వాడికి మంచినీళ్లు, స్కూల్‌లో సైన్స్ ల్యాబ్ అని చిన్నచిన్న ఆలోచనలు వస్తాయి.’’
‘‘అంతకుముందు ఉన్న దానినే  సైటింస్ట్‌లు కనిపెడతారు. ఏమీ లేకపోయినా ఏదో చేశామని కోట్లాది మందిని నమ్మించే పాలకులను మించిన సైంటిస్ట్‌లు ఎవరుంటారు? ఆ వంద కోట్లు అవార్డు పొందే అర్హత దేశంలోని పాలకులందరికీ ఉంది.’’

బుద్ధా మురళి ( జనాంతికం 6-1-2016)
*

2 కామెంట్‌లు:

  1. ‘‘ఆ వంద కోట్లు అవార్డు పొందే అర్హత దేశంలోని పాలకులందరికీ ఉంది.’’
    అక్షరకోట్లు పలికే వాక్యం.

    రిప్లయితొలగించండి
  2. ఐన్‌స్టీన్ కాదండి. న్యూటన్.
    ఈ మధ్య నోబుల్ ప్రైజ్ మీద రెండు జోకులు వచ్చాయి. ఒకటి 100 కోట్లు ఇస్తానని చంద్రబాబు అనడం అయితే, రెండోది జయలలితకి నోబుల్ ఇవ్వాలని తమిళులు తీర్మానం చెయ్యడం.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం