21, జనవరి 2017, శనివారం

నేరగాళ్ల సేఫ్ జోన్!

‘‘మొన్న సిటీలో మా బంధువుల ఇంటికి వెళ్లాను.. కాలనీలో రాత్రి దొంగతనం జరిగింది.’’
‘‘మీరో రాజరాజ నరేంద్రులు, మీ బోషాణంలో దొంగతనం జరిగితే దొంగలను పట్టుకునే బాధ్యత సైన్యాధ్యక్షుడైన నాకు అప్పగించినట్టు ఆ పోజులేంటి? ఈ రోజుల్లో దొంగతనాలు జరగని కాలనీలు ఉంటాయా? ఇది కామన్’’
‘‘జరిగిన సంఘటన చెబితే నువ్వు కూడా ఆశ్చర్యపోతావ్. అసలిలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అచ్చం విక్రమార్క బేతాళ కథలోలా సందేహాలున్నాయి. ’’


‘‘చెప్పు.. విక్రమార్కునిలా నేను సమాధానం చెబుతాను. శవంలా నువ్వు మారు మాట్లాడకుండా వెళ్లిపోతాను అంటే’’
‘‘ ముందు జరిగిందేమిటో విను.. తరువాత మనం పాత్రలను ఎంపిక చేసుకుందాం. దొంగతనం కామనే.. ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. కాలనీ సెక్రటరీ చలమేశ్వర్ ఫ్లాట్‌లో దొంగతనం జరిగింది. దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరవడంతో కాలనీ మొత్తం మేల్కొంది’’
‘‘ఇంకేం వాడ్ని తలా ఒకటి తగిలించి పోలీసులకు అప్పగించి ఉంటారు. ఇందలో కొత్తేముంది?’’
‘‘అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ దొంగను కొట్టడం కాదు. అందరినీ వాడే వణికించాడు.’’
‘‘ఎలా? ఎలా? ఆసక్తిగా ఉందే? ’’
‘‘ చలమేశ్వర్ అరుపులు వినగానే సెక్యూరిటీ వాడితో పాటు మేమంతా అక్కడికి చేరుకుని దొంగను ఉతికేందుకు సిద్ధమయ్యాయం. చలమేశ్వర్ ఇంట్లో దొంగతనం జరిగింది, పట్టుకున్నది చలమేశ్వరే కాబట్టి మొదటి చాన్స్ అతనికే అని తీర్మానించేశారు. చలమేశ్వర్ దొంగను కొట్టేందుకు చెయ్యి పై కెత్తే లోపే- ‘కబడ్డార్.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కటకటాల పాలవుతారు’ అంటూ దొంగ వార్నింగ్ ఇచ్చాడు. నేరం చేయడమే కాదు, నేరం చేసే వాడికి సహకరించిన వాళ్లు కూడా నేరస్తులే అవుతారు. నా ఒంటిపై చెయ్యి పడిందా? మీ అందరూ జైలులో ఉంటారు అని దొంగ బెదిరింపులతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డాం. మేం తేరుకోక ముందే ఆ దొంగోడు- ‘మాష్టారూ కాస్త సెల్‌ఫోన్ ఇస్తారా? పోలీసులను పిలవాలి’ అని అడిగే సరికి మాకు అంత చలిలోనూ మాకు చెమటలు పట్టాయి’’
‘‘నమ్మలేకపోతున్నాను.’’

‘‘అంతేనా.. ఇంకా విను’’


‘‘ఇంతోటి దానికి పోలీసుల దాకా ఎందుకులే .. నిన్ను క్షమించి వదిలేస్తున్నానంటూ చలమేశ్వర్ మర్యాదగానే చెప్పాడు. దానికి దొంగోడు- నా దగ్గరా మీ వెదవ్వేషాలు. నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. నమ్మకం ఉంది. అంతకన్నా ఎక్కువగా ఈ వ్యవస్థ గురించి అవగాహన ఉంది. దొంగ అని నా మీద ముద్ర వేసిన మీరు కోర్టులో నిరూపించాల్సిందే. పోలీస్ స్టేషన్‌కు రావలసిందే.. అని గద్దించాడు. మగాళ్ల వెనక చేరిన వాళ్ల వాళ్ల భార్యలు- అన్నయ్య గారూ ఈయన పొద్దునే్న ఆఫీసుకు వెళ్లాలి.. మేం ఇక ఇళ్లకు వెళతాం అంటూ ఒకరి తరువాత ఒకరు తమ భర్తలను తీసుకుని వెళ్లడానికి సిద్ధమయ్యారు. నన్నోక్కడిని ఇలా వదిలేసి వెళ్లడం మీకు ధర్మం కాదు అని కాళ్లా వేళ్లా పడి చలమేశ్వర్ వేడుకున్నాడు. కాలనీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అంతా కలిసే ఎదుర్కొన్నాం.. ఇప్పుడు నన్ను ఒంటరిని చేయవద్దని కన్నీళ్లు పెట్టుకునే సరికి అంతా సరే అన్నారు. నాకు న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది అని ఆ దొంగోడు మరోసారి అనగానే అంతా వణికిపోతుండగా- ‘చూడు బాబు నువ్వు దొంగతనానికి వస్తే ఏదో తెలియక పట్టుకున్నాం. నీకు కావలసింది తీసుకొని వెళ్లిపో’ అని చలమేశ్వర్ వేడుకున్నాడు. అంతా మద్దతుగా తలలూపారు. అంటే మీకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేదా? అని వాడు గద్దించాడు. ఆ మాట పదే పదే అనకు మా అందరికీ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది, అవగాహన ఉంది అని కోరస్‌గా పలికారు. సరే అని దొంగోడు క్షమిస్తున్నానని ప్రకటించాడు. దొంగతనానికి వచ్చి వట్టి చేతులతో వెళ్లడం మర్యాద కాదని చలమేశ్వర్ తన జేబులో ఉన్న మొత్తాన్ని దొంగోడి చేతిలో బలవంతంగా పెట్టాడు. దొంగోడు చలమేశ్వర్‌కు ఖాళీ పర్స్ ఇచ్చి, రేపు ఉదయం బస్సు చార్జీలకు ఇవి ఉంచుకో అని అందులో నుంచి పది రూపాయలు ఇచ్చి వెళ్లిపోయాడు. కాలనీ వాళ్లంతా బతుకు జీవుడా అనుకుని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయారు. నేను బయటి వాడిని కాబట్టి వాళ్ల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని వౌనంగా ఉన్నాను. ఎందుకిలా జరిగిందంటావ్?’’
‘‘ దొంగకు న్యాయవ్యవస్థపై నమ్మకమే కాదు, పూర్తి అవగాహన కూడా ఉంది. కాలనీ వాళ్లకు కూడా అవగాహన ఉంది. లేనిదల్లా నీ ఒక్కడికే?’’
‘‘అర్థం కాలేదు’’


‘‘ అర్థమయ్యేట్టు చెబుతా విను. ఆ దొంగ న్యాయవ్యవస్థను, చట్టాలను ఔపోసన పట్టిన వాడు. సల్మాన్‌ఖాన్ లాంటి స్టార్ హీరోల పుణ్యమాని కాలనీ వాసులకూ వ్యవస్థపై అవగాహన ఏర్పడింది. ఇందులో ఎవరి స్వార్థం వారిది. ఒక్క దొంగోడిది మాత్రమే సేఫ్ పొజీషన్ మిగిలిన అందరికీ రిస్క్. నువ్వనుకున్నట్టు మీ చలమేశ్వర్ వెర్రి బాగులోడేం కాదు. పోలీసులు వస్తే చలమేశ్వర్ ఇంట్లో దొంగ ఎత్తుకెళ్లిన విలువైన వస్తువులు వాళ్లు స్వాధీనం చేసుకుంటారు. కొనే్నళ్లపాటు కేసు సాగి పట్టు చీర కాస్తా, పీలికలుగా పది తులాల బంగారు ఆభరణం అర తులం గొలుసుగా తిరిగి వస్తుంది. కాలనీ వాళ్లంతా రోజూ కోర్టు చుట్టూ తిరగాలి. ఎవ్వరూ తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పరని దొంగకు స్పష్టమైన అవగాహన ఉంది. సాక్షిగా ఉంటే ఏమవుతుందో కాలనీ వాళ్లందరికీ వ్యవస్థ గురించి స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే దొంగను వేడుకున్నారు తమను వదిలేయమని. సల్మాన్ కారుతో గుద్ది రోడ్డుపక్క నిద్రిస్తున్న వారిని చంపిన కేసులో సాక్షంగా నిలిచిన బాడీగార్డ్ చివరకు ఉద్యోగం ఊడి, రోడ్డుమీద అనాథలా చనిపోయాడు. జింకల కేసూ అంతే. అందుకే అంతా సేఫ్ గేమ్ ఆడారు. దీంట్లో కాలనీ వాళ్లందరి కన్నా దొంగదే సేఫ్ పొజీషన్.’’
‘‘ఇంత కథ ఉందా? ’’


‘‘చూడోయ్.. ఆ చిన్న దోంగే కాదు.. రాజకీయాల్లో పెద్ద పెద్ద దొంగలు కూడా పట్టుపడగానే న్యాయవ్యవస్థపై మాకూ పూర్తి విశ్వాసం ఉందంటూ మీడియాలో వెంటనే ప్రకటిస్తారు. దానర్థం తెలుసా? ఎలా బయటపడాలో మాకు బాగా తెలుసు అని .. అది తెలియంది నీలాంటి అమాయకులకే.
*-
 - బుద్దా మురళి(జనాంతికం20-1-2017)