27, మే 2017, శనివారం

వర్ణవివక్ష.. మేధావుల నిరసన

‘‘అంత ఆసక్తిగా చూస్తున్నావు.. ఎంసెట్ రిజల్ట్స్‌నా? ’’
‘‘ఎంసెట్, ఐఐటి రిజల్ట్స్‌లో ఆసక్తి ఏముంటుంది? ర్యాంకులన్నీ మనవాళ్లేకే కదా! జనసేన పార్టీ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఫలితాలు చూస్తున్నా. అందరికీ తెలిసిన ప్రశ్నలకు- పవన్‌కల్యాణ్ మదిలో ఉన్న సమాధానాలు ఏంటో ఊహించి రాయడం కష్టం ’’
‘‘ప్రశ్నించేందుకే పార్టీ.. అంటే ఇదేనా? మనమే అర్థం చేసుకోలేదు.’’
‘‘మన ఆరుగురు మేధావులం - వర్గ పోరాటానికి ఆస్కారం లేని వాటిపై మాట్లాడుకుందాం. ఇది కాలనీ పార్కు. న్యూస్ చానల్స్ చర్చలో అయితే ఎంత గట్టిగా చర్చించినా, కొట్టుకున్నా ఓకె ’’
‘‘ఆరుగురు మేధావులం అని మీకు మీరే చెప్పుకుంటే సరిపోదు. ఇక్కడున్న అందరం ఒప్పుకోవాలి. ఓ వార్త చెప్పనా?’’


‘‘నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. బాబు అమెరికాలో విస్తృతంగా తిరుగుతుంటే అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారా? అని అక్కడి వారు చినబాబు లోకేశ్‌ను అడిగిన విషయం గురించే కదా? సాటి తెలుగువాడు ఎదుగుతుంటే సహించలేవా? ఏం.. తెల్లవాడు వందల ఏళ్లు ప్రపంచాన్ని పాలిస్తే భరించవచ్చు కానీ ఓ తెలుగువాడు అమెరికా వెళ్లి ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైతే తప్పా? ఇదేం వివక్ష?’’
‘‘ట్రంప్.. తుంటరి తనం తగ్గించుకో.. నీకే ప్రమాదం- అని చెబుతూనే ఉన్నాం.. చెప్పంగ వినని వాడిని చెడంగ చూడాలి అంటారు. ఉంటే గింటే ట్రంప్‌కు భయం కానీ నాకెందుకు? ఆంధ్రకు లోకేశ్, తెలంగాణకు కెసిఆర్, దేశానికి మోదీ ఉన్నారు. తెంపరి ట్రంప్, తుంటరి కొరియా ప్రపంచాన్ని వణికిస్తున్నప్పుడు ఒక తెలుగువాడు అమెరికా పగ్గాలు చేపట్టి ప్రపంచాన్ని దారిన పెడితే సంతోషమే’’


‘‘ఇంతకాలం ప్రపంచంపై వాళ్లు పెత్తనం చేస్తే మనం సహించలేదా? ఇప్పుడు పెత్తనం చెలాయించే అవకాశం మాకొచ్చింది. ఖానూన్‌కే హాత్ బహత్ లంబే హోతా హై... అమెరికా తక్ బీ హోతాహై.. పితాశ్రీ పరంతూ..’’
‘‘దానికీ, దీనికి సంబంధం ఏంటి?’’
‘‘నాకూ తెలియదు. నాకు హిందీలో ఆ రెండు మూడు మాటలే వచ్చు. హిందీ సినిమాలు, మహాభారత్ సీరియల్ చూసి నేర్చుకున్నాను. కాస్త గంభీరమైన మాటలు కదా? అని వాడేశాను.’’
‘‘ఇక్కడ హిందీ ఎవరికీ రాదు. ఫరవాలేదు. ’’
‘‘హలో.. వౌనంగా ఉన్న నువ్వే కాదు.. ఇక్కడ మేం కూడా మేధావులమే. నువ్వొక్కడివి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు ఆ పోజు ఏంటి? ’’
‘‘మీ మాటలు చూస్తే మీరెవరూ అసలు విషయాన్ని గ్రహించలేదనిపిస్తోంది. తెలంగాణలో విప్లవం రాబోతుంది. ఇప్పటి వరకు వేరు. ఇక నుంచి వేరు. ఎపిటి మేధావి జెఎసి రంగంలోకి దిగనుంది. కెసిఆర్‌కు కష్టకాలం మొదలైంది.’’
‘‘ఎపిటి జెఎసినా? మొదటిసారి వింటున్నా?’’
‘‘ఇంకా ఇది బయటకు రాలేదు. ఆంధ్రా మేధావి సంఘం , తెలంగాణ మేధావి సంఘం ఈ రెండూ కలిస్తే ఒక్కసారి ఊహించుకో’’
‘‘అంతా అయిపోయిన తరువాత నువ్వు మళ్లీ సమైక్యాంధ్ర వాదం వినిపిస్తున్నట్టుగా ఉంది. రెండూ ఎలా కలుస్తాయి?’’
‘‘మొన్న ధర్నా చౌక్ వద్ద ధర్నాకు ఆంధ్రా మేధావి సంఘం నేత రాలేదా? ధర్నాలో ఆంధ్రా మేధావులు, తెలంగాణ మేధావులు కలిసి ఎపిటి మేధావి జెఎసి ఏర్పాటు చేస్తే అప్పుడుంటుంది సినిమా..’’
‘‘ఔను.. భయం పట్టుకుంది కాబట్టే పోలీసులతో పాలించాలని చూస్తున్నారు. పోలీసులకు వందల కోట్ల బహుమతులు ప్రకటిస్తున్నారు. వందల ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగిస్తున్న ఈ కాలంలో, అమెరికాలో ఐటి రంగం మొత్తం తెలుగు వారి చేతుల్లో ఉన్న ఈ రోజుల్లో ,ఒక తెలుగు సినిమా 15 వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ కాలంలో ఇంకా పోలీసులు అవసరం అంటారా? ’’


‘‘పోలీసులు గనుక లేకపోతే శాంతిభద్రతల బాధ్యత మావోస్టులదా? ’’
‘‘మన దేశ బడ్జెట్‌లో భారీ వాటా రక్షణ రంగానిదే. అసలు యుద్ధం వస్తుందో లేదో తెలియదు కానీ వేల కోట్ల రూపాయలు రక్షణ రంగానికి అవసరమా? అసలీ దేశానికి సైన్యం అవసరమా?’’
‘‘ బాగా చెప్పారు. నా రాష్ట్రం, నా దేశం, నా ఖండం అంటూ ఎక్కడికెళుతున్నాం? విశ్వమానవులుగా ఉండలేమా? దేశాల మధ్య గోడలను కూల్చేయండి’’
‘‘ఏదో కూల్చమంటున్నారు. మా అల్లుడు ఈ మధ్యనే ప్రొక్లెయిన్ కొన్నాడు. కూల్చివేత పనులు ఏవైనా మా అల్లుడికే ఇవ్వాలి.. అలా అయితేనే మీకు నా మద్దతు ఉంటుందని చెబుతున్నాను.’’
‘‘ఉండవయ్యా ప్రతి దానిలో నువ్వు వ్యాపారం వెతుకుతావు. అప్పుడెప్పుడో బెర్లిన్ గోడ కూల్చారని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటుక ముక్క జేబులో పెట్టుకుని తిరిగినట్టు. ఇక్కడ దేశాల మధ్య గోడలు కూల్చడం అంటే కవి హృదయం- అన్ని దేశాలూ ఒకటి కావాలని అంతే. నిజంగా కూల్చేందుకు గోడలేమీ లేవు.’’
‘‘మరి దేశ రక్షణ బాధ్యత టెర్రరిస్టులు చూసుకుంటారా? ’’
‘‘మరీ అంత సంకుచితంగా హిందుత్వ వాదంతో ఆలోచించకండి విశ్వమానవుడిగా ఆలోచించాలి. దేశానికి హద్దులే ఉండనప్పుడు సైన్యం అవసరమే ఉండదు’’


‘‘అడగడం మరిచిపోయాను. మీ ఇంటి కాంపౌడ్ వాల్ నిర్మాణం ఎంత వరకు వచ్చింది? ’’
‘‘దొంగలు ఎక్కువయ్యారు. ఒక్క పురుగు కూడా లోనికి రాకుండా కాంపౌడ్ వాల్, గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఖర్చు అయితే అయింది కానీ ’’
‘‘అది సరే.. ఏదో అద్భుతమైన సంగతి అన్న పెద్దాయన మళ్లీ వౌనంగా ఉండిపోయాడు, ఏంటో అది చెప్పండి’’
‘ ధర్నా చౌక్ 
వంటి చిన్నా చితక సమస్యలను పట్టుకొని ఎన్నాళ్లు రోడ్డున పడతారు. అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్శించే ఐడియా ఉంది’’
‘‘ప్లీజ్ చెప్పు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం బాధ చూడలేక పోతున్నాం.’’
‘‘చెబుతా చెబుతా.. వర్ణ వివక్ష తెలుసా? వర్ణవివక్షకు పాల్పడితే అంతర్జాతీయ సమాజం ముందు తల వంచుకోవాలి. ’’
‘‘తెలుసు? ఐతే ’’
‘‘కేసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకున్నారు?’’
‘‘తెలుపు’’
‘‘గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు..? ’’


‘‘అన్ని రోజులూ తెలుపే.. అయితే..?’’
‘‘సప్తవర్ణాలు ఉండగా, తెలుపు దుస్తులు మాత్రమే వేసుకోవడం అంటే వర్ణవివక్ష చూపడమే కదా? దీనిపై మనం కోర్టుకు వెళితే అంతర్జాతీయ సమాజం ముందు.. మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఇలాంటివి ఇంకా చాలా కనిపిస్తాయి. ’’
‘‘ నువ్వే కాదు .. నేను .. మనం అందరం మేధావులమేనని ఒప్పుకుంటున్నాం.’’

బుద్దా మురళి (జనాంతికం 26. 5. 2017)

19, మే 2017, శుక్రవారం

‘లో బడ్జెట్’ పార్టీ!లు

‘‘పార్టీ అన్నావు, పదిమందిని పిలిచావు. ఇక్కడ పార్టీకి కావలిసిన ఆయుధాలు ఏమీ కనిపించడం లేదు. ఇంతకూ పార్టీ ఉందా? లేదా?’’
‘‘పార్టీ ఉంది. కానీ- మీరనుకుంటున్న మందు పార్టీ కాదు, నాదగ్గరో బ్రహ్మాండమైన ఐడియా ఉంది. మందు పార్టీతో ఒక్క రోజు కిక్కు.. కానీ అదే కిక్కు ఏళ్ల తరబడి ఉండాలంటే రాజకీయ పార్టీ అవసరం. మనమంతా కలిసి ఓ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం. దాంతో మనకు రోజూ ఆరోగ్యకరమైన, ఆదాయకరమైన కిక్కు’’
‘‘రోజుకో పార్టీ పుడుతోంది. కోన్‌కిస్కా మనం పార్టీ పెడితే పట్టించుకునేదెవరు? మరీ జోక్ చేస్తున్నావ్’’
‘‘నువ్వు పంజాగుట్ట నుంచే వచ్చావు కదా? దారిలో అంబానీ రిలయన్స్ ప్రెష్, బాబు హెరిటేజ్ మాల్, బజాజ్ మోర్ కనిపించాయి కదా? మన గల్లీలోకి వచ్చాక సుబ్బయ్య కిరాణా షాపు ఉంది. అంబానీ రిలయన్స్‌లో ఆకుకూరలు అమ్ముతున్నారని- ఇంటింటికీ తిరిగి గంపలో ఆకుకూరలు అమ్మే మంగవ్వ భయపడి వ్యాపారం మానేసిందా? అంబానీ కస్టమర్లు అంబానీకి, మంగవ్వ కస్టమర్లు మంగవ్వకుంటారు. హెరిటేజ్ కస్టమర్లు హెరిటేజ్‌కు, సుబ్బయ్య తాత కిరాణా షాప్ కస్టమర్లు సుబ్బయ్య కుంటారు. అలానే పెద్ద పెద్ద పార్టీలకు వాళ్ల వ్యాపారం వాళ్లకుంటుంది. మనం పెట్టే చిన్న పార్టీ వ్యాపారం మనకుంటుంది.’’
‘‘అంత ఖర్చు మనం భరించగలమా? ’’
‘‘ఇంకా ఏ లోకంలో ఉన్నావురా? బాహుబలి సినిమా టికెట్ ఖరీదంత ఖర్చు కూడా కాదు పార్టీ పెట్టాలంటే. ఒక్క టికెట్ ఖర్చుతో మనం పది మందిమి కలిసి పార్టీని ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ చేయించుకోవచ్చు.’’
‘‘పార్టీ అంటే సొంత మీడియా ఉండాలి లేదా మీడియా మేనేజ్‌మెంట్ తెలియాలి కదా?’’
‘‘అవి అధికారంలో ఉన్న, అధికారంలోకి రావాలనుకున్న పార్టీలకు కనీస అవసరాలు. అవి బాహుబలి బడ్జెట్ పార్టీలు, మనది లో బడ్జెట్ పార్టీ. ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో ఏ ఖర్చూ లేకుండానే మన పార్టీ సిద్ధాంతాలను జనానికి చెప్పేయవచ్చు. మహా మహా పవర్ స్టార్లే ట్విట్టర్‌లో మూడేళ్ల నుంచి పార్టీ నడిపేస్తున్నాడు. మనం నడపలేమా? ’’
‘‘ఉద్యోగంలో ఉన్నప్పుడు నాలుగు చేతులా సంపాదించి వెనకేసుకున్నాం.. మనం పార్టీ పెడితే సిబిఐ దాడి జరిగే ప్రమాదం లేదంటా వా?’’
‘‘మరీ నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకోకు.. మోదీ పనీపాటా లేకుండా ఉన్నాడనుకున్నా వా? ఒక్క చోట కూడా డిపాజిట్ రాని మన పార్టీని పట్టించుకునేంత తీరిక ఆయనకు లేదు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు కొన ఊపిరితో ఉన్న విపక్షాలు ఏకం అవుదామనే ఆలోచన కూడా రాకుండా చేసేందుకే మమత,లాలూ,చిదంబరంలపై సిబిఐ దాడులు. వీరి కూటమిలోకి ఎవరు వచ్చే అవకాశం ఉంటే వాళ్లపైనా సిబిఐ దాడులు జరుగుతాయి.. కానీ- డిపాజిట్ రాని మనపై కాదు.’’
‘‘డిపాజిట్ కూడా రాదని నువ్వే గ్యారంటీ ఇస్తూ, పార్టీ పెడదామని కూడా నువ్వే అంటున్నావు.. ఇదేం డబుల్ స్టాండర్డ్?’’
‘‘పార్టీ పెడదాం అన్నాను.. కానీ అధికారంలోకి వస్తాం అని చెప్పానా? ఏదో కాలక్షేపం, రిటైర్‌మెంట్ తర్వాత కాసింత ఆదాయం, కాసింత గుర్తింపు కోసం పార్టీ కానీ, అధికారం కోసమా? తెలిసిన వాళ్లుంటే టీవీ చానల్‌లో చర్చలకు పిలుస్తారు . మనవలు, మనవరాళ్లు టీవీలో అదిగో.. మా తాతయ్య.. అని మురిపెంగా చెప్పుకుంటారు. అఖిలపక్ష సమావేశం అని పిలిస్తే మధ్యలో దూరిపోవచ్చు. ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ పిలుస్తుంది. జీడిపప్పు, స్వీట్, సమోసా అధికారులు అందిస్తుంటే తినడంలో ఆ మజానే వేరు.’’
‘‘అంటే జీడిపప్పు కోసం పార్టీనా?’’
‘‘అదొక్కటే కాదు.
రిటైర్ అయ్యాక ఇంట్లో భార్యా పిల్లలు కూడా మనను పట్టించుకోవడం లేదు
కానీ మనం టీవీ లో ట్రంప్ దుందుడుకు తనం కొరియా తెంపరి తనం మోదీ దూకుడు గురించి శూన్యం లోకి చూస్తూ గడ్డం నిమురుకుంటూ మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది ఓ సారి ఊహించుకో . ఎవరైనా చనిపోతే మనమూ సంతాప సందేశం పం పొచ్చు, దేశంలో ఎక్కడేం జరిగినా మనం ఖండిచవచ్చు. హర్షించవచ్చు. ఆ చాన్స్ పార్టీలకే ఉంటుంది. వందల కోట్ల అస్తి పరులకు ఉండదు. త్రిబులెక్స్ సబ్బులకు పట్టణాల వా రీగా డీలర్లను నియమించినట్టు మనం ఔత్సాహికులను పట్టణాల వారీగా నియమించవచ్చు. ’’
‘‘వాళ్లకు డబ్బులివ్వాలేమో అని అనుకోవద్దు.. ఆ అవసరం లేదు. మనం వాళ్లను వాటాలు అడక్క పోతే చాలు లెటర్ హెడ్‌తో వాళ్ల స్వయం ఉపాధి మార్గాలు వాళ్ళు వెతుక్కుంటారు.’’
‘‘ఈరోజుల్లో క్రిమినల్స్‌కు మంచి క్రేజ్ ఉంది కదా? మన పార్టీలోకి కనీసం లోకల్ రౌడీనైనా ఆహ్వానిస్తే బాగుంటుందేమో?’’
‘‘హాజీమస్తాన్ అని పెద్ద స్మగ్లర్. ఆయన ఆత్మకథలతో బాలివుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. నేర సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు. తన పాపులారిటీ చూసుకొని మురిసిపోయి రాజకీయ పార్టీ పెట్టి ఎందుకూ పనికి రాకుండా పోయాడు. అప్పటి వరకు ఆయనంటే భయంతో వణికిపోయిన వారు పట్టించుకోవడం మానేశారు. దీన్ని బట్టి నీకు అర్థం కావలసింది ఏమంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేరాలు చేస్తేనే క్రేజ్ ఏర్పడుంది. నేరాలు చేసి రాజకీయాల్లోకి వస్తే ఎవరూ పట్టించుకోరు. ’’
‘‘మీరంతా ఒప్పుకున్నట్టే కదా? అదే మేధావులు, మాజీ మావోయిస్టులు అయితే ఏకాభిప్రాయం కుదరక పార్టీ ఏర్పాటు వేదికపైనే భిన్నాభిప్రాయాలతో చీలిపోయి. వేదికను రెండు ముక్కలు చేసి చేరో ముక్కతో వెళ్లిపోతారు.’’
‘‘పార్టీ అన్నాక దానికో పేరుండాలి కదా?’’
‘‘బాగా ఆలోచించాను. ప్రజల పార్టీ అని పెడదాం తిరుగుండదు. కానీ- తెలంగాణ రాష్ట్ర సమితి టైటిల్ పక్క రాష్ట్రంలో పని చేయదు. తెలుగుదేశం తమిళనాడుకు విస్తరిద్దాం అంటే పేరే అడ్డంకిగా మారింది. ప్రజల పార్టీ అంటే దేశంలో ఎక్కడైనా బ్రాంచీలు ఏర్పాటు చేయవచ్చు. మహిళలు, పురుషులు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, ఓసి, బిసి, మైనారిటీలకు ప్రాధాన్యత మా పార్టీ సిద్ధాంతం అని ప్రకటించేద్దాం. ’’
‘‘అందరికీ ప్రాధాన్యత అన్నావు కదా ఇక మిగిలింది ఎవరు? ’’
‘‘పెద్ద పెద్ద పార్టీలన్నీ ఇలానే చెబుతాయి. అలా చెప్పడం ఓ ఆనవాయితీ’’
‘‘ పార్టీ రిజిస్ట్రేషన్ ఖర్చు అందరం సమానంగా భరిద్దాం. ఆదాయంలోనూ సమానంగా పంచుకుందాం.. ఈ ఉమ్మడి ప్రకటన మీద మీరంతా సంతకం చేయండి ’’
ఇంత కాలం రాజకీయ పార్టీలు తమ స్వార్థం చూసుకున్నాయి కానీ ప్రజలను పట్టించుకోలేదు. ప్రజల కోసం ప్రజల పార్టీ ఏర్పాటు చేస్తున్నాం అని సగర్వంగా ఉమ్మడి ప్రకటన చేస్తున్నాం. జై ప్రజల పార్టీ..
*బుద్దా మురళి (జనాంతికం 19. 5. 2017)

12, మే 2017, శుక్రవారం

జగన్ మోదీ జుగల్ బందీ

‘‘నీకీ విషయం తెలుసా..?’’
‘‘చెప్పదలుచుకున్న విషయం వాస్తవమే అనే నమ్మకం నీకుంటే చెప్పు..’’
‘‘ఏ కాలంలో ఉన్నావోయ్..? వాట్సప్‌లో వచ్చింది చెప్పడమే తప్ప నిజానిజాలు ఎవడిక్కావాలి? సరే ముందు విషయం విను. తనపై ఉన్న కేసుల విషయమే వైకాపా అధినేత జగన్ దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు’’
‘‘అంటే మోదీ కేసులను ఎత్తేసే దుకాణం పెట్టారా? మోదీ న్యాయమూర్తి కాదు, కనీసం న్యాయవాది కూడా కాదు, ప్రధానమంత్రి అయిన ఆయన కేసులెలా ఎత్తేస్తారు?’’
‘‘మరీ అమాయకంగా మాట్లాడకు.. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చు ’’
‘‘వామ్మో పెళ్లయిన బ్రహ్మచారి.. మిగిలిన నాయకుల్లా కాదు నిప్పులాంటి మనిషి అనుకున్నాం. ఈయనా అంతేనా? కేసులు ఎత్తెయడానికి తలూపడంపై మీరు ఉద్యమించాల్సిన అవసరం ఉంది’’
‘‘ఏయ్ ఆగు.. నేనేం చెబుతున్నాను.. నువ్వేమంటున్నావ్. కేసులు ఎత్తేయించుకోవడానికే మోదీ వద్దకు జగన్ వెళ్లాడంటున్నాం.. కానీ మోదీ కేసులు ఎత్తేశాడని చెప్పడం లేదు. మిత్రపక్షంగా ఉండి, అసలే కష్టాల్లో ఉన్న మేం మోదీని అంత మాటంటామా? ’’
‘‘ ఔను! అంటే ఊరుకోవడానికి ఆయనేమన్నా కాంగ్రెస్ నాయకుడా? అసలే గుజరాతీ.. ఆపై బిజెపి.. ఆయనతో వ్యవహారం అల్లాటప్పా కాదు. గోదాముల్లో బూజు పట్టిన కేసుల దుమ్ము దులిపి బయటకు తీస్తున్నారు. తమిళనాడులో పట్ట్భాషేకానికి సిద్ధమవుతున్న చిన్నమ్మ తలవంచక పోవడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదేదో ‘ప్రత్యామ్నాయ కూటమి’కి సిద్ధం అవుతుంటే బిహార్ మాజీ సిఎం, ఆర్‌జెడి పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చేత- ఎప్పుడో దశాబ్దాల క్రితం మింగిన గడ్డిని ఇప్పుడు కక్కిస్తున్నారు. దశాబ్దాల కేసులు బయటకు తీసే చాన్స్ ఉన్నప్పుడు- తాజా లైవ్ స్టోరీ ‘ఓటుకు నోటు’ కేసును బయటకు తీయడం పెద్ద కష్టమా?’’
‘‘మనలోమాట.. జగన్‌కు మోదీ అపాయింట్‌మెంట్ ఎందుకిచ్చినట్టు?’’
‘‘జగన్- చంద్రబాబుకు ప్రత్యర్థి కానీ మోదీకి కాదు. లాజిక్ అర్థం చేసుకోవాలి. మిత్రుడి శత్రువు శత్రువే అనేది రాజుల కాలం నాటి రాజకీయం. మిత్రుడి శత్రువు కూడా మిత్రుడే అనేది ప్రజాస్వామ్య రాజకీయం. త్వరలో రాష్టప్రతి ఎన్నికలూ ఉ న్నాయి. ఒక్కరిని నమ్ముకుని వారి చేతిలో మన జుట్టు ఉంచడం కన్నా ఇద్దరినీ చేరదీసి, ఇద్దరితో ఆడుకోవడం తెలివైన రాజకీయం. మోదీ తెలివైన నాయకుడు.’’

‘‘మోదీ సంగతి వదిలేయండి ! ‘పవన్ కళ్యాణా? ఆయనెవరు? ఆయన సినిమా ఒక్కటి కూడా చూడలేదం’టూ విజయనగరం రాజుగారు భలే దెబ్బకొట్టారు కదూ!’’
‘‘అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమ కాలంలో- తర్వాత ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ ఈ మాట అంటే ఓ అర్థం ఉంది. ఒకే డైలాగు అన్ని కాలాల్లో అందరికీ పని చేయదు. ఎన్టీఆర్‌కు ‘దాన వీర శూర కర్ణ’ లాంటి డైలాగులు బాగుంటాయి. మహేశ్ బాబుకు చిన్న చిన్న డైలాగులు సరిపోతాయి. వారి డైలాగు వీరికి, వీరి డైలాగు వారికి ఇస్తే సిల్లీగా ఉంటుంది.’’
‘‘కెసిఆర్ అంటే తప్పు కాదు కానీ రాజు అంటే తప్పా? ఇదేం న్యాయం ?’’
‘‘ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎలా పని చేస్తుందో ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి గవర్నర్‌కు నివేదిక ఇస్తారు. తెలుసా?’’
‘‘నాకెందుకు తెలియదు బాగా తెలుసు.’’
‘‘కానీ ఒక్క మీ ప్రభుత్వంలో మాత్రం నాయకులు పవన్ కళ్యాణ్‌కు క్రమం తప్పకుండా నివేదికలు ఇస్తుంటారు. అధికారంలోకి వచ్చాక కూడా నివేదికలు ఇస్తున్నారు. చివరకు రాజుగారు ఆ మాట అన్నరోజు కూడా టిటిడి ఇవో నియామకంపై ప్రభుత్వంలో పెద్దలు పవన్‌కు వివరణ ఇచ్చి వచ్చారని పార్టీ వారే చెప్పారు. ఓ వైపు సూపర్ గవర్నర్‌గా గౌరవిస్తూ, పాలనపై నివేదికలు ఇస్తూ మరోవైపు ఆయనెవరో నాకు తెలియదు అంటే అది ‘పంచ్ డైలాగు’ అని మీకు అనిపించవచ్చు కానీ వినేవారికి సిల్లీగా ఉంటుంది. ’’
‘‘తెలంగాణలో కొత్త పార్టీలు వస్తున్నాయి.. అప్పుడుంటుంది మజా. నెల రోజుల్లో తెలంగాణలో విప్లవం వస్తుంది చూడు’’
‘‘కొత్త పార్టీలు రావడం ఏంటి ?ఎప్పుడో వచ్చేశాయి. ఫేస్‌బుక్‌లోనే పుట్టాయి. అక్కడే చీలిపోయాయి. ఇన్నయ్య ఫేస్‌బుక్‌లో కొత్త పార్టీ ప్రకటన చేసి కోదండరామ్‌ను కలుపుకున్నారు. పోస్టు పెట్టిన వెంటనే జెఎసిలో కొందరు తీవ్రంగా ఖండించి అలాంటిదేమీ లేదని ఫేస్‌బుక్‌లోనే సమాధానం ఇచ్చారు. మరో గ్రూపునకు చెందిన చెరుకు సుధాకర్ ఫేస్‌బుక్‌లోనే పార్టీ ప్రకటన చేసి ఇన్నయ్యను, కోదండరామ్‌ను కలుపుకున్నారు. దెబ్బకు దెబ్బ అన్నట్టు సుధాకర్ ప్రకటనను ఇన్నయ్య ఫేస్‌బుక్‌లోనే ఖండించారు.’’
‘‘అంటే’’
‘‘వీళ్ల చిత్తశుద్ధిని తప్పు పట్టలేం. మేధావుల మధ్య ఏకాభిప్రాయం ఉండదు. ఫేస్‌బుక్‌లో ఒక ‘పోస్ట్’ జీవిత కాలం ఎంతో వీరు పెట్టే, పెట్టాలనుకునే పార్టీల జీవిత కాలం అంతే. త్వరలో సంచల ఛానల్ ప్రారంభం అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు కనిపించగానే ఉన్న ఉద్యోగం వదులుకొని వెళ్లవద్దు అని మన కుర్రాళ్లకు చెప్పు. ఆ ‘త్వరలో’ అనేది ఒక జీవిత కాలం గడిచిపోయినా రాదు. టీవిలు చూపించే వంటలు, ఫేస్‌బుక్ లో పుట్టే పార్టీలు చూసేందుకు బాగుంటాయి. దిగితే కానీ లోతు తెలియదు. తింటే కానీ రుచి తెలియదు.’’
‘‘ధర్నా  చౌక్ సంగతేమైంది?’’
‘‘ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చావడం అనే మాట విన్నావా? ’’
‘‘వినలేదు’’
‘‘వీర విప్లవ పార్టీ.. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన సిపిఎంకి పవన్ కళ్యాణ్ అండ దొరికింది. ధర్నా చౌక్ కోసం మా ఉద్యమానికి మీ మద్దతు కావాలని పవన్‌ను పోరాట యోధుడు తమ్మినేని అడిగితే పవన్ సరే అని అన్నారు. దాదాపు రెండు దశాబ్దాల్లో సిపిఎం సాధించిన పెద్ద విజయంగా దీన్ని చెప్పుకో వచ్చు.’’
‘‘జనంలో క్రేజ్ ఉన్న పవన్ మద్దతు వామపక్షాలకు దక్కినందుకు మీకు కుళ్లు..’’
‘‘పాలిటిక్స్‌లో హాస్యం కనుమరుగు కాకుండా కాపాడే వ్యక్తుల, శక్తుల పట్ల నేనేప్పుడూ అభిమానంగానే ఉంటాను. కుళ్లుకునే ప్రసక్తే లేదు.’’
‘‘ధర్నా  చౌక్ ఉద్యమం ఏమవుతుందంటావ్?’’
‘‘ఇంకో రెండేళ్ల పాటు ఈ పార్టీలన్నీ తమ శక్తియుక్తులు ధర్నా చౌక్‌కే పరిమితం చేసేట్టు కెసిఆర్ వ్యూహం పన్నారేమో అని -. రెండేళ్లు గడిస్తే విపక్షాలకు ధర్నా చౌక్, కెసిఆర్‌కు అధికారం ఖాయం . ఎవరు కోరుకున్నది వారికి దక్కుతాయి 
’’
*
-బుద్దా మురళి(జనాంతికం . 12. 5. 2017) 

5, మే 2017, శుక్రవారం

మాస్క్‌లు వేసుకున్నారా ?

‘‘ మోయ్.. ఆ బీరువాలో ఉన్న 12వ నంబర్ మాస్క్ తీసుకురా..! మనింటికి చిదంబరం వస్తున్నాడు’’
‘‘ఇదిగోండి’’
‘‘రెండు మాస్క్‌లు తెస్తున్నావేం?’’
‘‘ఇంకోటి నాకు. వనితగారింటికి వెళ్లి కాఫీ పౌడర్ తెస్తా. ఆమెకు నచ్చినట్టు మాట్లాడాలంటే నాలుగవ నంబర్ మాస్క్ బాగా సూటవుతుంది’’
‘‘రావోయ్ చిదరంబరం . రా..రా.. ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నాం. మాటల్లో నువ్వు వచ్చేశావ్.’’
‘‘ఎంతైనా ఈ దేశం బాగు పడాలి అంటే అన్ని రాష్ట్రాలకు యోగి లాంటి ముఖ్యమంత్రి కావాలి ’’
‘‘ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ మూడేళ్ల క్రితం ఈ దేశానికి ప్రధాని ఐతే కానీ ఈ దేశం బాగుపడదు అన్నావు. ఇప్పుడేమో అన్ని రాష్ట్రాలకు యోగులు, త్యాగులు సిఎంలు అయితే కానీ దేశం బాగుపడదంటున్నావ్. ఉన్నదాంట్లో అసంతృప్తి, కొత్తదేదో వస్తే ఏదో అయిపోతుందనే ఆశ మానవ సహజం’’


‘‘అది కాదురా! యోగి ఆదిత్యనాథ్ సిఎంగా వచ్చాక ఉత్తరప్రదేశ్ రూపురేఖలన్నీ మారిపోయాయట! ఆ రాష్ట్ర భూమి బరువు కూడా కొంత పెరిగిందట! స్కూల్‌కు వెళ్లం అని మారాం చేసే పిల్లలు బుద్ధిగా స్కూల్‌కు వెళుతున్నారట! దొంగలు చోరీలు మానేసి ఉపాధి హామీ పథకంలో కూలీలుగా మారిపోయారట! యోగి అందరినీ మార్చేస్తున్నాడట! ఇప్పుడు యూపిలో ఎవరూ ఇళ్లకు తాళాలు కూడా వేయడం లేదట! జైళ్లు ఖాళీగా ఉండడంతో గోదాములుగా మార్చే అవకాశం ఉందట. ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లాక వర్షం వస్తోంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సమయానికి వర్షం ఆగిపోతుందట! ఉద్యోగులే కాదు సూర్యచంద్రులు, వరుణుడు కూడా టైముకు వచ్చి వెళుతున్నారట!’’
‘‘ఔను.. మొన్న వాట్సప్‌లో చూశాను.. యోగి రిజర్వేషన్లు రద్దు చేశాడు! ఎవరి పిల్లలైనా గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చదవాలి అని ఆయన ఒక్క మాట చెప్పగానే మరుసటి రోజు నుంచే ఆదేశాలు అమలులోకి వచ్చాయట! కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు గోరక్ష కేంద్రాలుగా మారిపోయాయి. వాట్సప్‌కు మనం రుణపడి ఉండాలి.. ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకు వాట్సప్ లేకుంటే అసలు తెలిసేదే కాదు. నాకు తెలుసురా.. మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటుంటే నీ ముఖం వెలిగిపోతుందని ’’
‘‘ఔను.. నిజం.. యూపిలో ఆడపిల్లలు సెల్‌ఫోన్‌లో మాట్లాడవద్దని యోగి ఆదేశించగానే టెలికామ్ కంపెనీల వాళ్లు సెల్ టవర్లు పీక్కెళ్లి పాత సామాను వాడికి అమ్ముకున్నారు. నాయకుడంటే అలా ఉండాలి. ఇంట్లో ఆడవారు మాత్రమే వంట చేయాలి అనే జీవో జారీ చేశాడట! ఇలాంటివన్నీ మనకు వాట్సప్‌లోనే తెలుస్తున్నాయి.. టీవీలు, పత్రికలు మాత్రం వీటిని దాచిపెడుతున్నాయి’’
‘‘ఔను!’’
‘‘బాగా చెప్పావురా! నువ్వోక్కడివే నన్ను సరిగా అర్థం చేసుకున్నావ్! సరే ఇక వెళతారా? ఏరా.. నీదగ్గర సాంప్రదాయ బద్ధమైన మాస్క్ ఉందా? అబ్బాయికి పెళ్లి సంబంధం చూడ్డానికి వెళుతున్నా! మంచి సంప్రదాయమైన కుటుంబం కావాలని సవాలక్ష కండిషన్లు పెట్టారు. ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం చాలా కష్టంరా! చూస్తుంటే కన్యాశుల్కం మళ్లీ వచ్చేట్టుగా ఉంది. అబ్బాయికి, నాకు సరిపోయే సాంప్రదాయ మాస్క్‌లు ఓ రెండుంటే ఇవ్వు. పెళ్లిచూపులు అయిపోగానే ఇస్తాను.’’
‘‘అయ్యో.. దానికేం భాగ్యం..? ఉంటే ఇచ్చే వాడినే, నిన్ననే మా బామ్మర్ది తీసుకెళ్లాడు. ఏదో పెళ్లికి వెళ్లాలి అని చెప్పాడు.. బహుశా ఇలాంటి అవసరమే కావచ్చు. ఇంట్లో సాంప్రదాయబద్ధంగా ఉంటూ బయట ఇష్టం వచ్చినట్టు ఉండే టైప్ మాస్క్‌లు పక్కింట్లో ఉన్నాయి.. కావాలంటే తెచ్చిస్తాను.’’


‘‘వద్దులేరా? అవి నా దగ్గరా ఉన్నాయి. పూర్వం రోజులే వేరు. క్షణాల్లో ముఖం మార్చి చూపించే వాళ్లం. పొల్యూషన్ పెరిగిపోయి ఇంట్లోంటి బయటకు అడుగు పెట్టాక అందరి ముఖాలు ఒకేలా కనిపిస్తున్నాయి. ఆధార్ కార్డులో ముఖానికి, రోడ్డుపైకి వచ్చాక మన ముఖానికి తేడా లేకుండా పోయింది. ముఖం చూసి మనిషిని అంచనా వేయడం చాలా కష్టమైపోతోంది. అదేదో వర్మ సినిమాలో పరేష్ రావల్ భార్యను కిడ్నాప్ చేసి చంపడానికి తానే ఏర్పాటు చేసి, భార్య కిడ్నాప్ అయిందని తెలిసి ఒకవైపుముఖంలో బాధ.. మరోవైపు సంతోషం ఎంత బాగా చూపించాడు. తెలుగులో ఇలా క్షణాల్లో ముఖం మార్చి బ్రహ్మానందం కూడా బాగా చూపిస్తాడు. క్షణాల్లో ముఖం మార్చే నటనలో ఒకరిద్దరు నటుల పేర్లే చెప్పుకుంటాం కానీ మనం ఈ మాస్క్‌ల అవసరం లేకుండా ఎంత నాచురల్‌గా ముఖం మార్చేవాళ్లం. ఆ రోజులే వేరు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది.. ఏ మూడ్ చూపాలనుకుంటే ఆ మూడ్‌కు తగ్గ మాస్క్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి.. కానీ, ఎంతైనా ఒరిజినల్ ఒరిజినలే.. మాస్క్ మాస్కే. సరేరా? ఉంటాను. నీతో కలిసి మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందిరా!’’
‘‘ఏరా చిదంబరం.. ఆమాస్క్ తీసేసి ఈ మాట చెప్పు.. ’’
‘‘నువ్వు భలే జోకులేస్తావురా! అర్జంట్ పునుంది. వెళతాను’’
‘‘ఏమండీ.. నిజంగా యూపిలో అలాంటి జీవోలు వచ్చాయా?’’
‘‘ఎవడికి తెలుసు? వస్తే ఎవిడిక్కావాలి, రాకుంటే పోయేదేంటి? చిదంబరం గాడు కాసేపు సంతోషంగా ఉండాలి అంటే ఇవే మాట్లాడాలి.. నాక్కావలసింది అంతే’’
‘‘మమీ. పరీక్ష బాగా రాశా! మమీ.. ఐ లవ్‌యూ మమీ.. ఈ శారీలో ఎంత అందంగా ఉన్నావు మమీ.. నీ వల్ల శారీకే అందమొచ్చింది మమీ’’
‘‘ఏరా బడుద్దాయ్.. ఇంట్లోకి వచ్చేప్పుడు ఆ మాస్క్ తీసి రావాలి అని ఎన్నిసార్లు చెప్పాలి. వంటగదిలోకి మాస్క్‌తో అలా వచ్చేయడమేనా? ’’
‘‘సారీ మమీ.. ఈరోజు గర్ల్‌ప్రెండ్‌ను కలిసేందుకు ఈ మాస్క్ వేసుకుని వెళ్లాను. కలిసిన సంతోషంలో అలానే ఇంట్లోకి వచ్చాను. ఇలా ప్రేమగా మాట్లాడుతున్నానేంటా? అని నాకే అనిపించింది.’’
‘‘వావ్..’’


‘‘ఏమైందండీ.. అలా కేక పెట్టారు’’
‘‘ఒక్కొక్కరితో మాట్లాడేప్పుడు ఒక్కో రకం మాస్క్ తొడుక్కుంటూ అసలు నా ఒరిజినల్ మాస్క్ ఏంటో మరిచిపోయాను. ఇప్పుడేం చేయాలి? సాదాసీదా కుటుంబాలకు చెందిన మనమే ఇన్ని మాస్క్‌లు మెయింటెన్ చేస్తుంటే- పాపం కోట్ల మందిని పాలించే నాయకులు అనే్నసి మాస్క్‌లు ఎలా మెయింటెన్ చేస్తారో?’’
‘‘ఎంతచెట్టుకు అంత గాలి. ఎంత పెద్ద మనిషికి అన్ని మాస్క్‌లు. ఈ లోకంలో బతకాలి అంటే ముందు మన ఒరిజినల్ ముఖం మర్చిపోవాలి. అందరూ చేసేది అదే. ఒరిజినల్ ముఖం ఏదనే ఆలోచన మానేసి- సమయానికి తగు మాస్క్ అంటూ హాయిగా పాడుకొండి’’

‘‘ ఆ రోజుల్లో మాత్రలు వేసుకున్నారా ? అని అడిగే వారు . ఇవి మాస్క్‌లు  వేసుకున్నారా ? అని అడిగే రోజులు  
బుద్దా మురళి (జనాంతికం 5-5-2017) *