19, మే 2017, శుక్రవారం

‘లో బడ్జెట్’ పార్టీ!లు

‘‘పార్టీ అన్నావు, పదిమందిని పిలిచావు. ఇక్కడ పార్టీకి కావలిసిన ఆయుధాలు ఏమీ కనిపించడం లేదు. ఇంతకూ పార్టీ ఉందా? లేదా?’’
‘‘పార్టీ ఉంది. కానీ- మీరనుకుంటున్న మందు పార్టీ కాదు, నాదగ్గరో బ్రహ్మాండమైన ఐడియా ఉంది. మందు పార్టీతో ఒక్క రోజు కిక్కు.. కానీ అదే కిక్కు ఏళ్ల తరబడి ఉండాలంటే రాజకీయ పార్టీ అవసరం. మనమంతా కలిసి ఓ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం. దాంతో మనకు రోజూ ఆరోగ్యకరమైన, ఆదాయకరమైన కిక్కు’’
‘‘రోజుకో పార్టీ పుడుతోంది. కోన్‌కిస్కా మనం పార్టీ పెడితే పట్టించుకునేదెవరు? మరీ జోక్ చేస్తున్నావ్’’
‘‘నువ్వు పంజాగుట్ట నుంచే వచ్చావు కదా? దారిలో అంబానీ రిలయన్స్ ప్రెష్, బాబు హెరిటేజ్ మాల్, బజాజ్ మోర్ కనిపించాయి కదా? మన గల్లీలోకి వచ్చాక సుబ్బయ్య కిరాణా షాపు ఉంది. అంబానీ రిలయన్స్‌లో ఆకుకూరలు అమ్ముతున్నారని- ఇంటింటికీ తిరిగి గంపలో ఆకుకూరలు అమ్మే మంగవ్వ భయపడి వ్యాపారం మానేసిందా? అంబానీ కస్టమర్లు అంబానీకి, మంగవ్వ కస్టమర్లు మంగవ్వకుంటారు. హెరిటేజ్ కస్టమర్లు హెరిటేజ్‌కు, సుబ్బయ్య తాత కిరాణా షాప్ కస్టమర్లు సుబ్బయ్య కుంటారు. అలానే పెద్ద పెద్ద పార్టీలకు వాళ్ల వ్యాపారం వాళ్లకుంటుంది. మనం పెట్టే చిన్న పార్టీ వ్యాపారం మనకుంటుంది.’’
‘‘అంత ఖర్చు మనం భరించగలమా? ’’
‘‘ఇంకా ఏ లోకంలో ఉన్నావురా? బాహుబలి సినిమా టికెట్ ఖరీదంత ఖర్చు కూడా కాదు పార్టీ పెట్టాలంటే. ఒక్క టికెట్ ఖర్చుతో మనం పది మందిమి కలిసి పార్టీని ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ చేయించుకోవచ్చు.’’
‘‘పార్టీ అంటే సొంత మీడియా ఉండాలి లేదా మీడియా మేనేజ్‌మెంట్ తెలియాలి కదా?’’
‘‘అవి అధికారంలో ఉన్న, అధికారంలోకి రావాలనుకున్న పార్టీలకు కనీస అవసరాలు. అవి బాహుబలి బడ్జెట్ పార్టీలు, మనది లో బడ్జెట్ పార్టీ. ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో ఏ ఖర్చూ లేకుండానే మన పార్టీ సిద్ధాంతాలను జనానికి చెప్పేయవచ్చు. మహా మహా పవర్ స్టార్లే ట్విట్టర్‌లో మూడేళ్ల నుంచి పార్టీ నడిపేస్తున్నాడు. మనం నడపలేమా? ’’
‘‘ఉద్యోగంలో ఉన్నప్పుడు నాలుగు చేతులా సంపాదించి వెనకేసుకున్నాం.. మనం పార్టీ పెడితే సిబిఐ దాడి జరిగే ప్రమాదం లేదంటా వా?’’
‘‘మరీ నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకోకు.. మోదీ పనీపాటా లేకుండా ఉన్నాడనుకున్నా వా? ఒక్క చోట కూడా డిపాజిట్ రాని మన పార్టీని పట్టించుకునేంత తీరిక ఆయనకు లేదు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు కొన ఊపిరితో ఉన్న విపక్షాలు ఏకం అవుదామనే ఆలోచన కూడా రాకుండా చేసేందుకే మమత,లాలూ,చిదంబరంలపై సిబిఐ దాడులు. వీరి కూటమిలోకి ఎవరు వచ్చే అవకాశం ఉంటే వాళ్లపైనా సిబిఐ దాడులు జరుగుతాయి.. కానీ- డిపాజిట్ రాని మనపై కాదు.’’
‘‘డిపాజిట్ కూడా రాదని నువ్వే గ్యారంటీ ఇస్తూ, పార్టీ పెడదామని కూడా నువ్వే అంటున్నావు.. ఇదేం డబుల్ స్టాండర్డ్?’’
‘‘పార్టీ పెడదాం అన్నాను.. కానీ అధికారంలోకి వస్తాం అని చెప్పానా? ఏదో కాలక్షేపం, రిటైర్‌మెంట్ తర్వాత కాసింత ఆదాయం, కాసింత గుర్తింపు కోసం పార్టీ కానీ, అధికారం కోసమా? తెలిసిన వాళ్లుంటే టీవీ చానల్‌లో చర్చలకు పిలుస్తారు . మనవలు, మనవరాళ్లు టీవీలో అదిగో.. మా తాతయ్య.. అని మురిపెంగా చెప్పుకుంటారు. అఖిలపక్ష సమావేశం అని పిలిస్తే మధ్యలో దూరిపోవచ్చు. ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ పిలుస్తుంది. జీడిపప్పు, స్వీట్, సమోసా అధికారులు అందిస్తుంటే తినడంలో ఆ మజానే వేరు.’’
‘‘అంటే జీడిపప్పు కోసం పార్టీనా?’’
‘‘అదొక్కటే కాదు.
రిటైర్ అయ్యాక ఇంట్లో భార్యా పిల్లలు కూడా మనను పట్టించుకోవడం లేదు
కానీ మనం టీవీ లో ట్రంప్ దుందుడుకు తనం కొరియా తెంపరి తనం మోదీ దూకుడు గురించి శూన్యం లోకి చూస్తూ గడ్డం నిమురుకుంటూ మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది ఓ సారి ఊహించుకో . ఎవరైనా చనిపోతే మనమూ సంతాప సందేశం పం పొచ్చు, దేశంలో ఎక్కడేం జరిగినా మనం ఖండిచవచ్చు. హర్షించవచ్చు. ఆ చాన్స్ పార్టీలకే ఉంటుంది. వందల కోట్ల అస్తి పరులకు ఉండదు. త్రిబులెక్స్ సబ్బులకు పట్టణాల వా రీగా డీలర్లను నియమించినట్టు మనం ఔత్సాహికులను పట్టణాల వారీగా నియమించవచ్చు. ’’
‘‘వాళ్లకు డబ్బులివ్వాలేమో అని అనుకోవద్దు.. ఆ అవసరం లేదు. మనం వాళ్లను వాటాలు అడక్క పోతే చాలు లెటర్ హెడ్‌తో వాళ్ల స్వయం ఉపాధి మార్గాలు వాళ్ళు వెతుక్కుంటారు.’’
‘‘ఈరోజుల్లో క్రిమినల్స్‌కు మంచి క్రేజ్ ఉంది కదా? మన పార్టీలోకి కనీసం లోకల్ రౌడీనైనా ఆహ్వానిస్తే బాగుంటుందేమో?’’
‘‘హాజీమస్తాన్ అని పెద్ద స్మగ్లర్. ఆయన ఆత్మకథలతో బాలివుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. నేర సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు. తన పాపులారిటీ చూసుకొని మురిసిపోయి రాజకీయ పార్టీ పెట్టి ఎందుకూ పనికి రాకుండా పోయాడు. అప్పటి వరకు ఆయనంటే భయంతో వణికిపోయిన వారు పట్టించుకోవడం మానేశారు. దీన్ని బట్టి నీకు అర్థం కావలసింది ఏమంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేరాలు చేస్తేనే క్రేజ్ ఏర్పడుంది. నేరాలు చేసి రాజకీయాల్లోకి వస్తే ఎవరూ పట్టించుకోరు. ’’
‘‘మీరంతా ఒప్పుకున్నట్టే కదా? అదే మేధావులు, మాజీ మావోయిస్టులు అయితే ఏకాభిప్రాయం కుదరక పార్టీ ఏర్పాటు వేదికపైనే భిన్నాభిప్రాయాలతో చీలిపోయి. వేదికను రెండు ముక్కలు చేసి చేరో ముక్కతో వెళ్లిపోతారు.’’
‘‘పార్టీ అన్నాక దానికో పేరుండాలి కదా?’’
‘‘బాగా ఆలోచించాను. ప్రజల పార్టీ అని పెడదాం తిరుగుండదు. కానీ- తెలంగాణ రాష్ట్ర సమితి టైటిల్ పక్క రాష్ట్రంలో పని చేయదు. తెలుగుదేశం తమిళనాడుకు విస్తరిద్దాం అంటే పేరే అడ్డంకిగా మారింది. ప్రజల పార్టీ అంటే దేశంలో ఎక్కడైనా బ్రాంచీలు ఏర్పాటు చేయవచ్చు. మహిళలు, పురుషులు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, ఓసి, బిసి, మైనారిటీలకు ప్రాధాన్యత మా పార్టీ సిద్ధాంతం అని ప్రకటించేద్దాం. ’’
‘‘అందరికీ ప్రాధాన్యత అన్నావు కదా ఇక మిగిలింది ఎవరు? ’’
‘‘పెద్ద పెద్ద పార్టీలన్నీ ఇలానే చెబుతాయి. అలా చెప్పడం ఓ ఆనవాయితీ’’
‘‘ పార్టీ రిజిస్ట్రేషన్ ఖర్చు అందరం సమానంగా భరిద్దాం. ఆదాయంలోనూ సమానంగా పంచుకుందాం.. ఈ ఉమ్మడి ప్రకటన మీద మీరంతా సంతకం చేయండి ’’
ఇంత కాలం రాజకీయ పార్టీలు తమ స్వార్థం చూసుకున్నాయి కానీ ప్రజలను పట్టించుకోలేదు. ప్రజల కోసం ప్రజల పార్టీ ఏర్పాటు చేస్తున్నాం అని సగర్వంగా ఉమ్మడి ప్రకటన చేస్తున్నాం. జై ప్రజల పార్టీ..
*బుద్దా మురళి (జనాంతికం 19. 5. 2017)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం