12, మే 2017, శుక్రవారం

జగన్ మోదీ జుగల్ బందీ

‘‘నీకీ విషయం తెలుసా..?’’
‘‘చెప్పదలుచుకున్న విషయం వాస్తవమే అనే నమ్మకం నీకుంటే చెప్పు..’’
‘‘ఏ కాలంలో ఉన్నావోయ్..? వాట్సప్‌లో వచ్చింది చెప్పడమే తప్ప నిజానిజాలు ఎవడిక్కావాలి? సరే ముందు విషయం విను. తనపై ఉన్న కేసుల విషయమే వైకాపా అధినేత జగన్ దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు’’
‘‘అంటే మోదీ కేసులను ఎత్తేసే దుకాణం పెట్టారా? మోదీ న్యాయమూర్తి కాదు, కనీసం న్యాయవాది కూడా కాదు, ప్రధానమంత్రి అయిన ఆయన కేసులెలా ఎత్తేస్తారు?’’
‘‘మరీ అమాయకంగా మాట్లాడకు.. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చు ’’
‘‘వామ్మో పెళ్లయిన బ్రహ్మచారి.. మిగిలిన నాయకుల్లా కాదు నిప్పులాంటి మనిషి అనుకున్నాం. ఈయనా అంతేనా? కేసులు ఎత్తెయడానికి తలూపడంపై మీరు ఉద్యమించాల్సిన అవసరం ఉంది’’
‘‘ఏయ్ ఆగు.. నేనేం చెబుతున్నాను.. నువ్వేమంటున్నావ్. కేసులు ఎత్తేయించుకోవడానికే మోదీ వద్దకు జగన్ వెళ్లాడంటున్నాం.. కానీ మోదీ కేసులు ఎత్తేశాడని చెప్పడం లేదు. మిత్రపక్షంగా ఉండి, అసలే కష్టాల్లో ఉన్న మేం మోదీని అంత మాటంటామా? ’’
‘‘ ఔను! అంటే ఊరుకోవడానికి ఆయనేమన్నా కాంగ్రెస్ నాయకుడా? అసలే గుజరాతీ.. ఆపై బిజెపి.. ఆయనతో వ్యవహారం అల్లాటప్పా కాదు. గోదాముల్లో బూజు పట్టిన కేసుల దుమ్ము దులిపి బయటకు తీస్తున్నారు. తమిళనాడులో పట్ట్భాషేకానికి సిద్ధమవుతున్న చిన్నమ్మ తలవంచక పోవడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదేదో ‘ప్రత్యామ్నాయ కూటమి’కి సిద్ధం అవుతుంటే బిహార్ మాజీ సిఎం, ఆర్‌జెడి పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చేత- ఎప్పుడో దశాబ్దాల క్రితం మింగిన గడ్డిని ఇప్పుడు కక్కిస్తున్నారు. దశాబ్దాల కేసులు బయటకు తీసే చాన్స్ ఉన్నప్పుడు- తాజా లైవ్ స్టోరీ ‘ఓటుకు నోటు’ కేసును బయటకు తీయడం పెద్ద కష్టమా?’’
‘‘మనలోమాట.. జగన్‌కు మోదీ అపాయింట్‌మెంట్ ఎందుకిచ్చినట్టు?’’
‘‘జగన్- చంద్రబాబుకు ప్రత్యర్థి కానీ మోదీకి కాదు. లాజిక్ అర్థం చేసుకోవాలి. మిత్రుడి శత్రువు శత్రువే అనేది రాజుల కాలం నాటి రాజకీయం. మిత్రుడి శత్రువు కూడా మిత్రుడే అనేది ప్రజాస్వామ్య రాజకీయం. త్వరలో రాష్టప్రతి ఎన్నికలూ ఉ న్నాయి. ఒక్కరిని నమ్ముకుని వారి చేతిలో మన జుట్టు ఉంచడం కన్నా ఇద్దరినీ చేరదీసి, ఇద్దరితో ఆడుకోవడం తెలివైన రాజకీయం. మోదీ తెలివైన నాయకుడు.’’

‘‘మోదీ సంగతి వదిలేయండి ! ‘పవన్ కళ్యాణా? ఆయనెవరు? ఆయన సినిమా ఒక్కటి కూడా చూడలేదం’టూ విజయనగరం రాజుగారు భలే దెబ్బకొట్టారు కదూ!’’
‘‘అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమ కాలంలో- తర్వాత ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ ఈ మాట అంటే ఓ అర్థం ఉంది. ఒకే డైలాగు అన్ని కాలాల్లో అందరికీ పని చేయదు. ఎన్టీఆర్‌కు ‘దాన వీర శూర కర్ణ’ లాంటి డైలాగులు బాగుంటాయి. మహేశ్ బాబుకు చిన్న చిన్న డైలాగులు సరిపోతాయి. వారి డైలాగు వీరికి, వీరి డైలాగు వారికి ఇస్తే సిల్లీగా ఉంటుంది.’’
‘‘కెసిఆర్ అంటే తప్పు కాదు కానీ రాజు అంటే తప్పా? ఇదేం న్యాయం ?’’
‘‘ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎలా పని చేస్తుందో ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి గవర్నర్‌కు నివేదిక ఇస్తారు. తెలుసా?’’
‘‘నాకెందుకు తెలియదు బాగా తెలుసు.’’
‘‘కానీ ఒక్క మీ ప్రభుత్వంలో మాత్రం నాయకులు పవన్ కళ్యాణ్‌కు క్రమం తప్పకుండా నివేదికలు ఇస్తుంటారు. అధికారంలోకి వచ్చాక కూడా నివేదికలు ఇస్తున్నారు. చివరకు రాజుగారు ఆ మాట అన్నరోజు కూడా టిటిడి ఇవో నియామకంపై ప్రభుత్వంలో పెద్దలు పవన్‌కు వివరణ ఇచ్చి వచ్చారని పార్టీ వారే చెప్పారు. ఓ వైపు సూపర్ గవర్నర్‌గా గౌరవిస్తూ, పాలనపై నివేదికలు ఇస్తూ మరోవైపు ఆయనెవరో నాకు తెలియదు అంటే అది ‘పంచ్ డైలాగు’ అని మీకు అనిపించవచ్చు కానీ వినేవారికి సిల్లీగా ఉంటుంది. ’’
‘‘తెలంగాణలో కొత్త పార్టీలు వస్తున్నాయి.. అప్పుడుంటుంది మజా. నెల రోజుల్లో తెలంగాణలో విప్లవం వస్తుంది చూడు’’
‘‘కొత్త పార్టీలు రావడం ఏంటి ?ఎప్పుడో వచ్చేశాయి. ఫేస్‌బుక్‌లోనే పుట్టాయి. అక్కడే చీలిపోయాయి. ఇన్నయ్య ఫేస్‌బుక్‌లో కొత్త పార్టీ ప్రకటన చేసి కోదండరామ్‌ను కలుపుకున్నారు. పోస్టు పెట్టిన వెంటనే జెఎసిలో కొందరు తీవ్రంగా ఖండించి అలాంటిదేమీ లేదని ఫేస్‌బుక్‌లోనే సమాధానం ఇచ్చారు. మరో గ్రూపునకు చెందిన చెరుకు సుధాకర్ ఫేస్‌బుక్‌లోనే పార్టీ ప్రకటన చేసి ఇన్నయ్యను, కోదండరామ్‌ను కలుపుకున్నారు. దెబ్బకు దెబ్బ అన్నట్టు సుధాకర్ ప్రకటనను ఇన్నయ్య ఫేస్‌బుక్‌లోనే ఖండించారు.’’
‘‘అంటే’’
‘‘వీళ్ల చిత్తశుద్ధిని తప్పు పట్టలేం. మేధావుల మధ్య ఏకాభిప్రాయం ఉండదు. ఫేస్‌బుక్‌లో ఒక ‘పోస్ట్’ జీవిత కాలం ఎంతో వీరు పెట్టే, పెట్టాలనుకునే పార్టీల జీవిత కాలం అంతే. త్వరలో సంచల ఛానల్ ప్రారంభం అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు కనిపించగానే ఉన్న ఉద్యోగం వదులుకొని వెళ్లవద్దు అని మన కుర్రాళ్లకు చెప్పు. ఆ ‘త్వరలో’ అనేది ఒక జీవిత కాలం గడిచిపోయినా రాదు. టీవిలు చూపించే వంటలు, ఫేస్‌బుక్ లో పుట్టే పార్టీలు చూసేందుకు బాగుంటాయి. దిగితే కానీ లోతు తెలియదు. తింటే కానీ రుచి తెలియదు.’’
‘‘ధర్నా  చౌక్ సంగతేమైంది?’’
‘‘ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చావడం అనే మాట విన్నావా? ’’
‘‘వినలేదు’’
‘‘వీర విప్లవ పార్టీ.. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన సిపిఎంకి పవన్ కళ్యాణ్ అండ దొరికింది. ధర్నా చౌక్ కోసం మా ఉద్యమానికి మీ మద్దతు కావాలని పవన్‌ను పోరాట యోధుడు తమ్మినేని అడిగితే పవన్ సరే అని అన్నారు. దాదాపు రెండు దశాబ్దాల్లో సిపిఎం సాధించిన పెద్ద విజయంగా దీన్ని చెప్పుకో వచ్చు.’’
‘‘జనంలో క్రేజ్ ఉన్న పవన్ మద్దతు వామపక్షాలకు దక్కినందుకు మీకు కుళ్లు..’’
‘‘పాలిటిక్స్‌లో హాస్యం కనుమరుగు కాకుండా కాపాడే వ్యక్తుల, శక్తుల పట్ల నేనేప్పుడూ అభిమానంగానే ఉంటాను. కుళ్లుకునే ప్రసక్తే లేదు.’’
‘‘ధర్నా  చౌక్ ఉద్యమం ఏమవుతుందంటావ్?’’
‘‘ఇంకో రెండేళ్ల పాటు ఈ పార్టీలన్నీ తమ శక్తియుక్తులు ధర్నా చౌక్‌కే పరిమితం చేసేట్టు కెసిఆర్ వ్యూహం పన్నారేమో అని -. రెండేళ్లు గడిస్తే విపక్షాలకు ధర్నా చౌక్, కెసిఆర్‌కు అధికారం ఖాయం . ఎవరు కోరుకున్నది వారికి దక్కుతాయి 
’’
*
-బుద్దా మురళి(జనాంతికం . 12. 5. 2017) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం