‘‘ ఛీ ఛీ.. కలికాలం.. ఇలాంటి గడ్డుకాలం వస్తుందని క లలోనూ ఊహించలేదు. భక్తులకు కష్టాలు వస్తే దేవుళ్లకు మొక్కుకుంటారు. ఆ దేవుళ్లకే కష్టాలు వస్తే..?’’
‘‘సెలబ్రిటీలంతా ఒకే చోట ఉన్నారు. ఇంద్రసభలో దేవుళ్లంతా కొలువైనట్టు ఉంది. మీ అందరినీ ఒకే చోట చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. డైరెక్టర్, హీరోలు, హీరోయిన్‌లు, క్యారక్టర్ ఆర్టిస్టులు, కెమెరామెన్.. వావ్..! సూపర్‌హిట్ సినిమా కాంబినేషన్ మొత్తం ఇక్కడే ఉంది.’’
‘‘రావయ్యా.. రా! ఇక్కడ నీ పొగడ్తలకేం తక్కువ లేదు. కానీ మీ చానల్‌లో మాత్రం మేం డ్రగ్స్ తీసుకునే వార్తలు పదే పదే చూపిస్తారు. నువ్వు లేవగానే టీ తీసుకుంటావ్, ఇంకొకరు కాఫీ తాగందే బెడ్‌మీద నుంచి లేవరు. ఎవరి అలవాటు వారిది. అడగడానికి వీళ్లెవ్వరు?’’
‘‘మా హీరోయిన్ ఆరోగ్యం మీద ఆమె అమ్మ కన్నా పోలీసులకు ఎక్కువ శ్రద్ధ ఉంటుందా? వాళ్ల అమ్మే అడగలేదు. పోలీసులెవరు అడగడానికి? అయినా మేం మీడియాను పిలవలేదు కదా! ఎందుకొచ్చావ్?’’
‘‘మీడియాగా రాలేదు. ఏదో ఫ్రెండ్‌షిప్ కొద్దీ వచ్చా..’’
‘‘ఫ్రెండ్ అనుకుంటే టీవీలో డ్రగ్స్ గురించి అంతసేపు చూపించవు. సర్లే.. డ్రగ్స్ తీసుకుంటావా?’’
‘‘అమ్మో.. ఇప్పుడొద్దు. కాస్త చల్లబడిన తరువాత! మీ విచారణ పూర్తయ్యాకనే! డ్రగ్స్ ప్రస్తావన లేకుండా, మీరు డ్రగ్స్ తీసుకుంటారా? అని ప్రశ్నించకుండా, మీ అమ్మాయి మనోభావాల, మీ అమ్మ ఆవేదన, మీ ఆవిడ భావోద్వేగంపై గంట సేపు ఇంటర్వ్యూ చేశాం కదా! అయినా ఇలా నిష్ఠురం తగునా?’’
‘‘అంతకన్నా ముందు పరువు తీసేట్టుగా చూపించారు కదా? రోజంతా చూపించాల్సిన అవసరం ఉందా? కాంబోడియాలో ట్రాఫిక్ జామ్,ట్రంప్‌కు జలుబు, ఆఫ్రికా అడవుల్లో దొరికిన మూడు తలల నాగుపాము, చైనాలో కొత్త రకం వంకాయ పంట.. ఇలా ఎన్నిలేవు చూపించడానికి? మా సినిమా వాళ్ల గురించే అంతసేపు చూపించాలా?
‘‘నాకు పెళ్లయింది. మా పక్కింటి వాడికి పెళ్లయింది. రాష్ట్రంలో, దేశంలో కోట్లాది మందికి పెళ్లయింది. వాళ్ల పెళ్లి ముచ్చట్లు ఏమీ చూపలేదు. కానీ మీ సినిమావాళ్ల పెళ్ల మొత్తం రోజంతా టీవీలో చూపిస్తారు. అలా ఎందుకు? అని అప్పుడు అడిగి వుంటే బాగుండేదన్నా?’’
‘‘మీ రేటింగ్‌ల కోసం చూపిస్తారు. మా కోసమా?
‘‘ఇది కూడ అంతే. మరిచిపోయా .. పెళ్లిళ్లు, పుట్టిన రోజులే కాదు.. పోయిన రోజు కూడా రోజంతా చూపిస్తారు. గాంధీ జయంతి రోజున గాంధీని గుర్తు చేసుకోకపోయినా, సినీనటుల పుట్టినరోజున మాత్రం గుర్తుంచుకని రోజంతా చూపిస్తాం. ఎందుకంటే మీరు దేవుళ్లు. మీ ఆవిడను మీరు మొదటిసారి ఎక్కడ కలిసారు? మీ అమ్మాయి ముద్దుపేరు ఏంటో ప్రేక్షకులకు చెబుతాం. పరమశివుని కుమారుడు గణపతి అని తెలిసినప్పుడు మీ పిల్లల పేర్లు కూడా జనాలకు తెలియడం ధర్మం.’’
‘‘అసలు మన సిస్టమ్‌లోనే తప్పుంది. మీరు సినిమా హాల్‌కు వెళ్లినప్పుడు ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని వుంటుంది. భారీ బడ్జెట్ సినిమా, లోబడ్జెట్ సినిమా అని వుంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు వెడతారు. అదేవిధంగా మామూలు జనాలను విచారించే చట్టాలలోనే సినిమావాళ్లను విచారించడం ఏమిటి? సినిమా వాళ్లకు ప్రత్యేక రాజ్యాంగం, చట్టం ఉండాలి’’
‘‘ఔను! రాజ్యాంగం రాసిన వారికి ఈ ముందు చూపు లేకపోవడం వల్ల తలెత్తిన సమస్య ఇది..’’
‘‘ఇప్పటికైనా రాజ్యాంగాన్ని మార్చాలి. మోదీకి చెప్పాలి’’
‘‘ఆయన ఛస్తే వినడేమో! ఒకే దేశం, ఒకే చట్టం అంటూ ఇప్పటికే ఉన్న సౌకర్యాలను పీకి పారేయాలని చూస్తున్నాడు..’’
‘‘వినకపోతే సినిమా వారికి ప్రత్యేక దేశం కావాలంటాం. సినిమావాళ్లు లేకపోతే ఈ వెర్రి జనం ఒక్కరోజు కూడా బతకలేరు. మమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దు. ఒక్క నటుడు తలుచుకుంటేనే గతంలో ఓ ప్రాంతీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. మొత్తం సినిమా వాళ్లంతా తలుచుకంటే..?’’
‘‘అలాంటి నట నాయకుణ్ణి మట్టి కరిపించింది రాజకీయ నాయకుడే అయినా చిన్న సమస్యకు అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకులెండి. శ్రీరాముడికే కష్టాలు తప్పలేదు. సీతమ్మపైనే నిందలు వేసారు. మీమీదా అంతే?’’
‘‘వాళ్లతో మాకు పోలికేంటి? వాళ్లు పాతకాలం నాటి దేవుళ్లు.. మేం కలియుగ దైవాలం. మేం కనిపించే దైవాలం. ఏరా..! నేనిక్కడ సీరియస్‌గా మాట్లాడుతునే ఉన్నాను. ఆ హీరోయిన్‌ను గోకుతున్నావ్! ఏ టైంలో ఏం చేయాలో తెలియదా? వాళ్లు ఒక మతం వారికి దేవుళ్లు మేం అందరికీ దేవుళ్లం’’
‘‘గోకడం లేదు సార్! హీరోయిన్ బుగ్గలపై ఎలాంటి మేకప్ వేస్తే బాగుంటుందో రిహార్సల్స్ చేస్తున్నా కెమెరా మెన్ గా ఇవన్నీ చూసుకోవడం నా ధర్మం ...’’
‘‘ఇది షూటింగ్ ఏమో? మేకప్‌మెన్, కెమెరామెన్ గోకినా ఏమనవద్దని ఊరుకున్నాను. మరిచేపోయా! షూటింగ్ కాదు కదా!
‘‘నువ్వే చూశావుకదా! మా హీరోయిన్ ప్రతిక్షణం నటనలో లీనమై ఉంటుంది. అలాంటి హీరోయిన్‌ను కూడా అనుమానించడం అంత పాపం ఇంకోటి ఉంటుందా?’’
‘‘అవును.. మీరు నిరంతరం నటిస్తూనే ఉంటారు.’’
‘‘ప్రజలకు దగ్గర కావడం వల్ల సమస్య కానీ, అదే మద్రాస్‌లో ఉన్నప్పుడు దేవుళ్ల కన్నా మాకే ఎక్కువ క్రేజ్ ఉండేది. తిరుపతి వెంకన్నను గంటలో దర్శనం చేసుకున్నా, మద్రాస్ వచ్చి నటులను దర్శించుకోవడానికి గంటలకు గంటలు పడిగాపులు కాసేవాళ్లు. ఇప్పుడు మేం దగ్గరగా ఉండడం వల్ల కేసుల్లో బుక్కవుతున్నాం.’’
‘‘కలియుగ దైవాలు కళ్లముందు ప్రత్యక్షం అయ్యారని మురిసిపోయి సెల్ఫీ దిగి పోవాలి కానీ.. పోలీసుల ఓవర్ చేస్తున్నారు’’
‘‘కొందరు పోలీసులు నిజంగా బుద్ధిమంతులు. ‘సిట్’ కార్యాలయంలోకి మేం రాగానే ఫోటో దిగి మా ముందే వాళ్ల పెళ్లాలకు ‘షేర్’ చేసి మురిసిపోయారు. ఆ ‘బట్టతల పోలీసు అధికారి’కే మేమంటే ఏంటో తెలియడం లేదు. దేవుళ్లను చూసిన ఫీలింగ్‌తో కాకుండా మామూలు మనుషులను చూసినట్టు చూశాడు. ఎంత అవమానం? ఆ పోలీసు బాసు మీద ఓ సినిమా తీసి.. నేనేంటో చూపిస్తా.’’
‘‘ఓసారి మోహన్‌బాబు చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో ఎన్నికల అధికారిపై కోపం వచ్చి- సినిమాలో నీ సంగతి చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చి మరిచిపోయారు. మీరు మాత్రం ఆ ‘బట్టతల అధికారి’ని విలన్‌గా చూపించి ఓ సినిమా తీయాలి. డ్రగ్స్ కేసులో చివరకు ఆ పోలీసు అధికారి విలన్ అని తేలుతుంది. ఎలా ఉంది ఐడియా?’’
‘‘గుమ్మడి, నాగభూషణం, ప్రభాకర్‌రెడ్డిలతో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి. వెరైటీగా సిఎం విలన్ అని చూపిస్తే..?’’
‘‘గుడ్ ఐడియా.. ఓ అడుగు ముందుకేసి ప్రధాని విలన్ అని చూపితే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది.’’
‘‘విలన్ చేసే డ్రగ్స్ వ్యాపారాన్ని బయటపెట్టే పవర్‌ఫుల్ హీరోయిన్ పాత్ర నాకే. డ్రగ్స్‌లో నాకు బోలెడు అనుభవం ఉంది.’’
‘‘అసలే నిండా మునిగి పోయి ఉన్నాం. రోజులు మారాయి. హీరో ఇంట్లో అర్ధరాత్రి తుపాకీ పేల్చినా ఏమీ కాదు. ఓ టీవీ సీరియల్‌లో అత్త,కోడలి మధ్య కనిపించే అన్యోన్యతలా అధికార, విపక్షాల మధ్య ఆ కాలంలో అనుబంధం ఉండేది. ‘ఆయనే ఉంటే..’ అని ఏదో సామెత చెప్పినట్టు ఆ రోజులు మళ్లీ రావు.’’
‘‘మీరు ఇలా మా బండారం బయటపెట్టి కేసులు పెడితే- మేం అమరావతి వెళ్లిపోతాం అని వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? చచ్చినట్టు ఈ చట్టాల నుంచి మనకు మినహాయిపు ఇస్తారేమో!’’
‘‘మనం వెళ్లిపోతాం అంటే- మీ సినిమాలు మాకు వద్దు అని మెలిక పెడతారు. అసలే పది శాతం సినిమాలకు కూడా లాభాలు రావడం లేదు. మార్కెట్ సగం తగ్గితే వసూళ్లు కూడా సగం తగ్గుతాయి కదా!’’
‘‘ఏంటోయ్ కామన్ మ్యాన్ సినిమా దేవుళ్లను అందరినీ ఒకే చోట చూసి నోటమాట రావడం లేదా? అవాక్కయ్యావు’’
‘‘ స్వర్గంలో ఉండాల్సిన అప్సరస మీ అందరి మధ్యలో ఉందేమిటని ఆశ్చర్యపోతున్నారేమో!’’
‘‘చెప్పవయ్యా.. అలా చూస్తూ ఉండిపోయావేం?’’
‘‘మీలా నటించలేను, మనసులో మాట చెప్పి బాధ పెట్టలేను.. ఏదో కామన్ మెన్‌ను వదిలేయండి.’’
‘‘కాళిదాసును చూస్తే కవిత్వం వచ్చినట్టు సినిమా వాళ్లను చూసి నీకూ డైలాగులు వస్తున్నాయి. చెప్పు ఫరవాలేదు. మేమే కాదు, మమ్మల్ని పూజించే నువ్వు కూడా దేవుడివే.’’
‘‘ఆ గౌరవం అంతా ఆడియా ఫంక్షన్‌లోనే. మీ ఇంటికొస్తే సెక్యురిటీ వాడికి చెప్పి కొట్టిస్తారు.’’
‘‘ఆ సంగతి వదిలేయ్! జరుగుతున్న పరిణామాలపై నువ్వేమంటావు? నిర్మొహమాటంగా చెప్పు.. ఫరవాలేదు.’’
‘‘సినిమాలో నటించండి ఫరవాలేదు. జీవితంలో నటన ఓ భాగం. మీరేమీ సమాజానికి అతీతులు కారు. సమాజంలో మీరూ భాగమే. సినిమా కనిపెట్టకముందు కూడా సమాజం ఉంది. సినిమా లేకపోయినా సమాజం ఉంటుంది. కానీ సమాజం లేకపోతే సినిమా ఉండదు. మేము సమాజానికి అతీతులమని భావించినప్పుడే సమస్య. మేం చట్టానికి అతీతులం అనుకున్నప్పుడే చట్ట వ్యతిరేక పనులను అవలీలగా చేస్తారు లేదా మత్తులో మునిగిపోతారు. చట్టం మాకూ వర్తిస్తుందని అనుకుంటే తప్పు చేయరు’’
‘‘ ఇది చిత్తూరు నాగయ్య కాలం కాదు. పోకిరీల కాలం.. నీతులు చెబితే ఎవ్వడూ వినడు.’’
‘‘అబ్బో.. మీ సక్సెస్ ఫార్ములాతో రోజుకు పది సినిమాల షూటింగ్‌లు ప్రారంభం అయితే నెలకు ఒక్క సినిమా కూడా లాభాలు గడించడం లేదు.’’
‘‘ఇంతకూ ఏమంటావ్ ?’’
‘‘దేవుళ్లం అనే భ్రమ నుంచి బయటపడి మేమూ మనుషులమే అనే వాస్తవంలోకి రమ్మంటాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.’’
*
-బుద్దా మురళి (జనాంతికం 28. 7. 2017)