21, జులై 2017, శుక్రవారం

అయ్యో.. అమెరికా ఇలా ఉందేమిటి?

‘‘విమానం న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతోంది. సీటు బెల్టు పెట్టుకోమని అనౌన్స్ చేస్తుంటే మీరెంటి సీటుకిందకు దూరారు?’’
‘‘నాకన్నా నీకు ఎక్కువ తెలుసా? ఏడవ తరగతి నుంచే క్లాస్‌బుక్స్‌లో మధుబాబు షాడో డిటెక్టివ్ బుక్స్ చదివామిక్కడ. శత్రువు ఎలాదాడి చేస్తాడో? క్షణంలో ఎనిమిదవ వంతు సమయంలో తప్పించుకోవడం, అర నిమిషంలో 12వ వంతు సమయంలో ఎదురుదాడి ఎలా చేయాలో, నిమిషంలో 14వ వంతు సమయంలో పిడిగుద్దులతో ప్రత్యర్థిని ఎలా మట్టి కరిపించాలో చిన్నప్పుడే చదివాను.’’
‘‘ఎవరైనా దాడిచేస్తే కాలిక్యులేటర్‌లో ఈ లెక్కలు చూసుకుంటారా? ఈ లోపు వాడు మిమ్ములను చితగ్గొట్టి పోతాడు కదా?’’
‘‘నా మీదే సెటైరా? మనసులోనే లెక్కలు వేసుకుంటాం. నువ్వు కూడా సీటు కిందకు దూరు’’
‘‘అది సరే.. విమానం ల్యాండ్ కావడానికి, షాడోకు, సీటు కింద దూరడానికి సంబంధం ఏమిటి?’’
‘‘వయసులో నీకన్నా ఫైవ్ ఇయర్స్ సీనియర్‌ని. 15 ఏళ్ళ నుంచి తెలుగు న్యూస్ చానల్స్ చూస్తూ పెరిగిన బుర్ర ఇది. అమెరికా ఎలా ఉందో మన చానల్స్‌లో రోజూ చూపించారు. న్యూస్ చానల్స్ చూడమంటే హారర్ మూవీస్, హారర్ న్యూస్ నచ్చవుఅని సీరియల్స్ మాత్రమే చూస్తే ఏం తెలుస్తుంది?’’
‘‘మీరు చెప్పారని వాడెవడో అర్నబ్ అని టీవీ నుంచి బయటకు వచ్చి 3డి ఎఫెక్ట్‌లో భయపెడుతున్నట్టు అనిపిస్తే భయం వేసి మళ్లీ చూసే సాహసం చేయలేదు.’’
‘‘మరదే..! అన్నప్రాసన నాడే అర్నబ్ వార్తలు చూస్తే ఎలా? కళ్ళు తెరవగానే రాంగోపాల్‌వర్మ సినిమాలు చూసినట్టు, క్రమంగా అలవాటుపడితే విషం కూడా జీర్ణం అవుతుంది. ముందు తెలుగు న్యూస్ చానల్స్‌కు అలవాటుపడితే, అర్నబ్ కూడా జీర్ణం అవుతాడు.’’
‘‘ఇంతకూ మీరు సీటు కిందకు ఎందుకు దూరినట్టు?’’
‘‘రామాయణం అంతా విన్నాక దుర్యోధనుడికి సీత ఏమవుతుంది అని అడిగారట. నీలాంటి వారెవరో?’’
‘‘రాముడికి సీత ఏమవుతుంది? అని అనాలి.’’
‘‘ఈ తెలివికేమీ తక్కువ లేదు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు అంటే ఎన్టీఆరే కదా? సీత అంటే అంజలీదేవి, గీతాంజలి, జయప్రద నుంచి నయనతార వరకు ఎవరైనా కావచ్చు.. అదన్నమాట విషయం.’’
‘‘మరి సీటు కిందకు?’’
‘‘అదే చెబుతున్నా.. అమెరికా పరిణామాలపై మన న్యూస్ చానల్స్ చూడకపోవడం వల్ల నువ్వు చాలా అజ్ఞానంలో ఉండిపోయావు. శబ్దం వినిపిస్తుంది కదా! అది విమానం ల్యాండింగ్ శబ్దం అనుకుంటున్నావు కదూ! కాదు. తూటాల శబ్దం. అమెరికాలో తూటాలతో ఆడుకుంటారు. ఏ తూటా ఎటువైపు నుంచి వచ్చి తాకుతుందో తెలియదు. న్యూస్ చానల్స్ వల్లనే నాకీ విషయాలు తెలిశాయి. వడియాలు లేనిదే మనం అన్నం తిననట్టు వారికి లంచ్‌లో తూటాలు తప్పనిసరి ఆట. యాంకర్ అందాన్ని చూస్తున్నావా? వార్తలు చూస్తున్నావా? అని నువ్వోసారి అ పార్థం చేసుకున్నావు గుర్తుందా? ఆ న్యూస్ యాంకర్ చెప్పింది ఈ విషయాలు వార్తల్లో. అంత అందంగా ఉన్న అమ్మాయి అబద్ధాలు చెబుతుందా?’’
‘‘అదా విషయం. పోకిరి లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన తన తండ్రికి డ్రగ్స్‌తో సంబంధం ఉందంటే నమ్మే ప్రసక్తేలేదు అంటోంది పూరీ జగన్నాథ్ కూతురు. ఫ్లాప్ సినిమాలు తీసిన డైరెక్టర్లు, హీరోలకు డ్రగ్స్‌తో సంబంధం అంటే నమ్మవచ్చు కానీ హిట్ సినిమాల వాళ్ళకు డ్రగ్స్‌తో ఆ ప్రసక్తే లేదు.’’
‘‘జోకా?’’
‘‘మీతో జోకులా.. లాడెన్ కొడుకు తన నాన్నను టెర్రరిస్ట్ అంటాడా? విజయ్ మాల్యా కుమారుడు తండ్రిది తప్పంటే నమ్ముతాడా?’’
‘‘ఏం చెబుతున్నావో అర్థం కాలేదు. వర్షపు చినుకులు పడకుండా గొడుగు ఎలాగో తూటాలు పడకుండా అమెరికాలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న సౌండ్ వినిపించినా కింద కూర్చోవాలి. పారిపోవాలి.’’
‘‘అబ్బా.. అది నా తుమ్ము. అంత భయపడితే ఎలా?’’
‘‘మనం నడుస్తూ రోడ్డు దాటుతుంటే అల్లంత దూరంలో కారు ఆపాడు అంటే వాడు మనల్ని లేపేయాలని చూస్తున్న జాత్యహంకారి. కాలినడకన వచ్చే వారి కోసం అంత ఖరీదైన కారు ఆపడమా?
‘‘మీ అనుమానంతో చంపేస్తున్నారు. అమెరికాలో కాలినడక వారిని మన దేశంలోలా పనికి మాలిన వారిలా చూడరు. వారికోసం కారు ఆపాల్సిందే.’’
‘‘ఏమోయ్ కాస్త చెయ్యిగిచ్చు. నిజంగా ఇది అమెరికానేనా? గ్రాఫిక్స్‌తోనే రాజధానులను నిర్మిస్తున్నారు. దేన్నీ నమ్మేట్టుగా లేదు. హైదరాబాద్‌లోని బోలక్‌పూర్‌లో కబేళాల నుంచి ఎక్కడ చూసినా రక్తం పారినట్టు, అమెరికాలోనూ అలానే రోడ్లన్నీ రక్తంతో ఎరుపెక్కి ఉంటాయనుకున్నా. కానీ శుభ్రంగా నల్లగా తళతళలాడుతున్నాయి. టీవీల్లో చెప్పినట్టు ట్రంప్ వల్ల మన ఐటి కుర్రాళ్ళు అందరూ హాహాకారాలు చేస్తూ రోడ్లపై వరద బాధితుల్లా ఉంటారనుకున్నాను. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.’’
‘‘మీ ఫేవరేట్ టీవీ యాంకర్ మీద ఒట్టు. మనం అమెరికాలోనే ఉన్నాం. మీపై న్యూస్ చానల్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే కళ్ళతో చూసినా నమ్మలేకపోతున్నారు. అందమైన యాంకర్ వార్తల ప్రభావం అంత త్వరగా పోదు.’’
‘‘నువ్వు మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తున్నావు.’’
‘‘ఏ పార్టీ మీడియాపై?’’
‘‘అవన్నీ ఇప్పుడెందుకులే? ముందు అమెరికా చూద్దాం. అమెరికా ఏదో గొప్పగా అభివృద్ధి చెందిన దేశం అని మనం భ్రమల్లో ఉన్నాం. కానీ వీళ్ళు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళకు మనం ఆన్‌లైన్‌లో పొలిటికల్ క్లాసులు తీసుకోవాలి. కమర్షియల్ ఏరియా, హైవే అదీ ఇదీ అని కాదు. ఎక్కడ చూసినా అడవిలా చెట్లు కనిపిస్తున్నాయి. మనం అడవిలో కూడా చెట్లు కనిపించనంతగా అభివృద్ధి సాధిస్తే, వీళ్ళేమో వెనకబడ్డారు. చెట్లను ఇలానే వదిలేస్తే మనుషులకు చోటు మిగల్చకుండా ఆక్రమించుకుంటాయి. అమెరికా ఇప్పటికైనా మనలా మేల్కొనాలి. ఎ.సి.లతో కూల్‌సిటీల టెక్నాలజీ గురించి మనం ఆలోచిస్తుంటే, చెట్లతో చల్లదనం కోసం వేల ఏళ్ళ క్రితం నాటి పద్ధతులను అమెరికా నమ్ముకొంది.’’
‘‘ఎవరిగోల వారిది.. నయగారా చూద్దాం పద’’
‘‘ట్రంప్‌ను గెలిపించవద్దు అని మా తెలుగు మీడియా మీకు చెప్పింది ఇందుకే? అనుభవించండి. కళ్ళముందు వర్ణవివక్ష చూస్తుంటే రక్తం మరిగిపోతోంది. తెల్లవాళ్ళను వదిలేసి, నల్లవాళ్ళను ఆపేస్తున్నారు.’’
‘‘అన్నిటికీ తొందరే. టికెట్ చూపించమని ఆపుతున్నాడు. వర్ణవివక్ష కాదు. పాడు కాదు.’’
‘‘నువ్వు ఎంత చెప్పినా నమ్మబుద్ధి కావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా పరిచయం లేని వాడు కూడా నవ్వుతూ పలకరిస్తాడు. నవ్వే వాణ్ణి అస్సలు నమ్మకూడదు. మన నుంచి ఏదో ఆశించకపోతే నవ్వుతూ ఎందుకు పలకరిస్తారు? మనవద్ద ఉన్న డాలర్లు లాగేసుకుందామని చూస్తున్నారేమో?’’
‘‘ఆప్యాయంగా పలకరించింది షాప్ ఓనర్ కాదు. మనలాంటి కస్టమర్లే. అలా పలకరించడం వారి సాంప్రదాయం.’’
‘‘మన న్యూస్ చానల్స్‌లో నేను చూసిన అమెరికాకు, కళ్ళతో చూస్తున్న అమెరికాకు సంబంధమే లేదు. ఇది నిజంగానే అమెరికా అంటావా? దేశంలో ఎక్కడ తిరిగినా ఒక్కడూ దాడి చేయలేదు. వైట్‌హౌస్‌కు వెళ్ళినా, వాళ్ళ క్యాపిటల్ సిటీ ఆఫీసుకు వెళ్ళినా ఒక్కరూ ఆపడం లేదు. మనం కనీసం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళినా పదిమంది అడ్డుకుంటారు. ఇక్కడ ఎక్కడా ఒక్క పోలీసు కూడా అడ్డుకోలేదు.
* * *
‘‘మనం అమెరికా యాత్ర ముగించుకొని వచ్చామని స్వాగతం పలుకుతూ ఆకాశంలోకి తారాజువ్వలు విసురుతున్నారు చూశావా?’’
‘‘మీకంత సీన్ లేదు. అలా విసురుతున్న వాళ్ళు కూడా మనతోపాటు అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారే ఉత్సాహంగా వాటర్ బాటెల్స్‌ను ఆకాశంలోకి విసిరేస్తున్నారు. ఖాళీ వాటర్ బాటెల్స్ కారులో నుంచి అలా విసిరి వేయడం మన ఆచారం.’’
‘‘వాళ్ళు విసిరిన బాటెల్‌ను మన బాటెల్‌తో నేను భలే కొట్టానుకదా? ఆకాశంలో.’’
‘‘్భలే కొట్టారు అంకుల్ గురి చూసి.’’
‘‘చూశావోయ్. నా గురిని ఆ కుర్రాడు కూడా మెచ్చుకుంటున్నాడు. అమెరికాలో ఉన్నన్ని రోజులు భ్రమల్లో ఉన్నట్టు అనిపించింది. జాతీయ రహదారులపై కారును ఆపి టాయ్‌లెట్స్‌గా ఉపయోగించడం చూశాక పూర్తి స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్న భావన కలుగుతోంది. చట్టాలను పాటించి బతకడం కన్నా చావడం మేలు ఏమంటావోయ్. కారులో వచ్చి రోడ్డు ప్రక్కన చెత్త పారేయడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం అన్నీ చూశాక ఇప్పుడు మన దేశంలో మనం ఉన్నామని సంతోషంగా ఉంది. నువ్వేమంటావ్?’’
‘‘ గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం గుర్తుకొస్తోంది..’’
‘‘ఎందుకలా?’’
‘‘1920 ప్రాంతంలో గాంధీ శాసనోల్లంఘనకు పిలుపు ఇచ్చాడు. ఉద్యమం హింసాత్మకంగా మారాక మహాత్ముడు తన పిలుపును ఉపసంహరించుకున్నాడు. భారతీయులందరూ ఇప్పటికీ శాసనోల్లంఘన ఉద్యమంలోనే ఉన్నాం. ఇక్కడ చట్టాలు పాటించే వాడు పిచ్చోడు, ఉల్లంఘించే వాడు హీరో, టెర్రరిస్టులను ఆరాధిస్తాం. డ్రగ్స్‌లో మునిగిన హీరోలను పూజిస్తాం. చట్టాలు చేసేవారికి చట్టాలపై గౌరవం ఉండదు. ఎవరి కోసం చట్టాలో వారికే చట్టాలంటే పట్టదు. శాసన ఉల్లంఘన ఉద్యమానికి చరమగీతం పాడేంతవరకు ఈ దేశం ఇంతే.’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్. మనింట్లో మనకు మర్యాదలేమిటి? మన చట్టాలను మనం పాటించడమేమిటి? విదేశాల్లో చట్టాలు పాటించాలి కానీ మన చట్టాలను మనం పాటించాలి అంటే విన్నవారు నవ్విపోతారు!’’
*
-బుద్దా మురళి (జనాంతికం 21. 7. 2017)

కామెంట్‌లు లేవు: