29, డిసెంబర్ 2017, శుక్రవారం

మనుస్మృతి ఉంటే ఇస్తారా!

‘ఆ సణుగుడు ఏంటి? ఏం కావాలో స్పష్టంగా అడుగు?’’
‘‘ఒకటి ఎక్స్‌ట్రా ఉంటే ఇస్తావేమోనని’’
‘‘రెండు రోజులు అయితే నూతన సంవత్సరం నువ్వు దేనికోసం వచ్చావో తెలియనంత అమాయకుడినేం కాదు. స్పష్టంగా అడగమంటున్నాను?’’
‘‘మనసు లాగుతోంది ... ఉండలేకపోతున్నాను.. ’’
‘‘నువ్వు ఇంట్లో   గుమ్మడివి బయట దేవదాసులో అక్కినేనివి. ఇంకెంత కాలం ఈ డబుల్ రోల్. మేమంతా తాగుబోతులం . నువ్వేమో శ్రీరామ చంద్రుడివని కలరింగ్ .. స్పష్టంగా నోరు తెరిచి అడుగు? ’’
‘‘మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉందో నీకు తెలియదా? నా నోటి నుంచి చెప్పించాలని ప్రయత్నిస్తున్నావు? ’’
‘‘సిగ్గెందుకు ఏ బ్రాండ్ కావాలి? ఎన్ని కావాలి చెప్పు’’
‘‘బ్రాండ్ ఏదైనా ఫరవాలేదు. ఒక్కటి కావాలి చాలు. రెండు రోజుల్లో పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను. ’’
‘‘ విస్కీనా? బ్రాందీనా? రమ్మునా ? ఏం కావాలి చెప్పు’’
‘‘అడుగడుగునా దొరికే వాటి కోసం నేను నీ దగ్గరకెందుకు వస్తాను. అవి నాకెందుకు? ’’
‘‘కొబ్బరి బోండంలో విస్కీ పోసుకుని తాగే నీ తెలివితేటలు నాకు తెలియవనుకోకు. న్యూ ఇయర్ వేడుకలకు అవి లేనిదే ఉండలేవు. ఎందుకురా? ఈ డబుల్ స్టాండర్డ్స్ . ఏం కావాలో అడగలేని జీవితం కూడా ఒక జీవితమేనా?’’
‘‘అపార్థం చేసుకున్నావు’’
‘‘మరింకేం కావాలి?’’
‘‘అదేరా నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిదేమీ ఉండదు. ఒకే ఒక కాపీ ఇప్పించు. రెండు రోజుల్లో నీకు తిరిగి ఇచ్చేస్తాను. నీమీద ఒట్టు’’
‘‘అదే ఏంటో చెప్పు ఏడువు’’
‘‘్ఢల్లీ నుంచి మన గల్లీ వరకు అంతా అదే నామస్మరణ మనుస్మృతి. మీసాలు కూడా రాని కుర్రాళ్లు మనుస్మృతిని చదివి జీర్ణం చేసుకుని తగలబెడుతున్నారు. ఇంత వయసొచ్చినా చదవలేదంటే ఎంత సిగ్గుచేటు. విశాలాంధ్ర నుంచి నవోదయ వరకు ఎక్కడా మనుస్మృతి దొరకడం లేదు. మనుస్మృతి ఉందా? అని అడిగితే ఏదో ఈ కాలంలో మనుస్మృతి ఎక్కడ దొరుకుతుంది అని పిచ్చోణ్ణి చూసినట్టు చూస్తున్నారు. ఇరానీ హోటల్‌కెళ్లి సాంబార్ ఇడ్లీ అడిగితే క్యా పూచ్ రా అని సర్వర్ ఆశ్యర్యపోయినట్టు చూస్తున్నారు. పుస్తకం లేకపోయినా కనీసం ఫిడిఎఫ్ కాపీ ఉన్నా పంపండిరా అందులో ఏ ముందో చదువుతాను. ’’
‘‘ఓహో ఇందాక నసుగుతున్నది మనుస్మృతి కోసమా? నిజంగా నీమీద ఒట్టు చిత్రంగా వామపక్ష భావాలున్న వారితోపాటు బిజెపి భావాలున్న వాళ్లు సైతం ఒక్కసారిగా మనుస్మృతిపై ప్రేమ పెంచుకుని తగలబెడుతుంటే నీకన్నా ముందే నాకూ ఆసక్తి కలిగింది. ఓ పుస్తకం ఎలాగైనా సంపాదించి అందులో ఏ ముందో చదువుదామని ప్రయత్నించి విఫలమయ్యాను.’’
‘‘అదేంటిరా? మరి అంత చిన్న చిన్న కుర్రాళ్లు కూడా చదువుల సారమెల్లా గ్రహించితిని తండ్రీ అన్నట్టు మనుస్మృతిని దించి గుట్టల కొద్ది తగలబెడుతుంటే ఇంత పలుకుబడి ఉన్న మనకు దొరక్కపోవడం ఏంటో? ’’
‘‘పుస్తకం అయితే ఇప్పించలేను కానీ ఐడియా ఇవ్వగలను. రాజుగారింట్లో పెళ్లికి ఊరి వారంతా పాలు పోసిన కథ గుర్తుందా? ’’
‘‘ఎందుకు గుర్తు లేదు. ఆ బిందెలో అందరూ పాలు పోస్తే నేనొక్కడిని నీళ్లు పోస్తే ఎవరికి తెలుస్తుందని అంతా నీళ్లే పోస్తారు. ఆ కథ మనుస్మృతిలోదా? తెలియదే’’
‘‘చెప్పేది పూర్తిగా విను. మనం ఓ చౌరస్తాలో నిలబడి కొన్ని తెల్లకాగితాలు కాల్చి మనుస్మృతిని తగలబెట్టినట్టు ప్రకటిద్దాం. ఎంత ప్రయత్నించినా మనకు దొరకని మనుస్మృతి కాపీలు వారికెలా దొరుకుతాయి. నా అనుమానం ఈ ఐడియానే వాళ్లు అమలు చేస్తున్నారు.’’
‘‘అలా చేసినా మనుస్మృతి చదవలేదనే నా బాధ అలానే ఉండిపోతుంది కదా?’’
‘‘ఓ పని చేద్దాం. మన చిన్ననాటి మిత్రుడు పాండురంగం గుర్తున్నాడు కదా? వాడికున్న పలుకుబడి నీకు తెలియదేమో! దేన్నయినా సాధించగలడు. వాడిని కలుద్దాం పని ఐపోతుంది. నాకో కాపీ నీకో కాపీ సరేనా? ’’
***
‘‘పాండురంగం ఇల్లంతా సందడిగా ఉంది. వరుసగా క్యూలో నిలబడి మరీ అతనికి బోకేలు ఇస్తున్నారు. మా వాడి షష్ఠిపూర్తి ఉత్సవమా? అంటే అదీ కాదు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉంది. ఏమై ఉంటుంది?’’
‘‘రావోయ్ రా! ఏంటో ఇలా వచ్చావు. వట్టి చేతులతోనే వచ్చావు. నువ్వూ ఓ బోకే తీసుకు రాలేకపోయావా?’’
‘‘ఏరా పాండురంగం మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందా? మాట మాత్రమైనా చెప్పలేదు. వారం రోజులు ఢిల్లీ వెళ్లి వచ్చాను. అందరినీ పిలిచి లంగోటి ఫ్రెండ్‌ను మాత్రం మరిచిపోయావు. ’’
‘‘ అబ్చాయి పెళ్లి కాదు. అమ్మాయి సీమంతం కాదు. వారం రోజులు సీటీలో లేవు కదా? అందుకే నీకు విషయం తెలియదు. టీవి వార్తలు చూడలేదా? ’’
‘‘చూడలేదు. ప్రపంచ రికార్డు ఏమైనా సృష్టించావా? ఏంటి? ’’
‘‘ఎసిబి వలలో తిమింగలం అని చూపిన వార్తనే మళ్లీ మళ్లీ చూపించారు నా గురించే. ఎసిబి వలలో చిక్కిన చేప అంటూ చెప్పడం రొటీన్‌గా మారిందని వెరైటీ కోసం ఎసిబికి చిక్కిన తిమింగలం అని చూపించారు. దాంతో టీవిలో చూపించిన దాని కన్నా ఎక్కువగా ఎన్నో వేల కోట్లు దగ్గర ఉండి ఉంటాయాని బంధువులు, స్నేహితులు అంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. కోట్లు ఉన్నాయి కానీ వాళ్లు అనుకుంటున్నట్టు వేల కోట్లు లేవు. ఇన్ని కోట్లు సంపాదించినా రాని గుర్తింపు ఎసిబి దాడితో వచ్చింది. ’’
‘‘పాండురంగం టీవిలో చూడగానే ఎంత సంతోషించానోయ్ మన వంశం పరువు నిలిపావు. వాళ్లెవరో వీళ్లెవరో ఎసిబి వలలో చిక్కారు అని టీవిల్లో చెబుతుంటే మన వంశం పేరు ఒక్కసారి కూడా వినిపించక ఎంత మదనపడిపోయానో? మన వంశం పేరు నిలిపేవాడు ఒక్కడైనా లేడా? అని బాధపడని రోజు లేదు. ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం మాత్రం జరగలేదు. చిన్న చిన్న చేపలకే వాళ్లు అంత సంబరపడుతున్నారు. మన వంశంలో ఏకంగా తిమింగలమే ఉంది. చరిత్ర సృష్టించాలన్నా తిరగ రాయాలన్నా మన వంశం వల్లే అవుతుంది. నీ బాబాయ్‌ని అని ఇప్పుడు గర్వంగా చెఫ్పుకుంటాను.’’
‘‘్థ్యంక్స్ బాబాయ్ ’’
‘‘పాండురంగం అసలు నేను నీ దగ్గరకు ఎందుకొచ్చానంటే నీ వల్ల సాధ్యం కానిదే ఏదీ లేదని అంతా అనుకుంటాం. మనుస్మృతి కాపీ ఒకటి ఎలాగైనా సంపాదించి పెట్టాలోయ్’’
‘‘మీరంతా చెబుతుంటే నాకూ చదవాలనిపిస్తోంది. సంపాదన మార్గం చెప్పమని ఎప్పుడూ అడుగుతావు కదా? నీకో బ్రహ్మాండమైన ఐడియా! వేటపాలం గ్రంథాలయానికి వెళ్లు. అక్కడ ప్రాచీన తాళపత్ర గ్రంథాలు మొదలుకొని, పాత గ్రంథాల వరకు అన్నీ దొరుకుతాయి. మనుస్మృతి సంపాదించు, పబ్లిష్ చేయి, హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. వారం రోజుల్లో సంపన్నుడివి అవుతావు. మరెవరికీ ఈ ఐడియా రాక ముందే రంగంలోకి దిగు. లెఫ్ట్, రైట్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలవరిస్తున్న పుస్తకం మనుస్మృతి మార్కెట్‌కు ఢోకా లేదు.’’

ప్రపంచం చాలా ముందుకు వచ్చేసింది .. ఇంకా ముందుకు వెళుతోంది . కొందరు ఇంకా మనుస్మృతి వద్దే ఆగిపోయారు . ఎవరిష్టం వారిది 
బుద్దా మురళి (జనాంతికం 29-12-2017)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం