29, జనవరి 2018, సోమవారం

బసంత్‌లో రాజకీయ చిత్రాలు




తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగించేందుకు బసంత్ టాకీస్‌లోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నో సెంటిమెంట్ సినిమాలు తెరపై ప్రదర్శించిన చోటే సజీవ సెంటిమెంట్ సినిమా ప్రదర్శించారు. ఎన్టీఆర్‌ను దించే ఎపిసోడ్‌లో వైస్రాయ్ హోటల్‌కు లభించినంత గుర్తింపు కీలక పరిణామాలకు వేదికైనా ఇతర ప్రాంతాలకు లభించలేదు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగిస్తూ ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ బసంత్ టాకీస్‌లో జరిగిన సమావేశంలోనే తీర్మానం ప్రవేశపెట్టారు. 

మానవ సంబంధాలు, కుటుంబసభ్యుల మధ్య అనురాగా లు, రాగద్వేషాలు, వెన్నుపో ట్లు, అధికారం, డబ్బు కోసం అయినవారిపై నే కుట్రలు.. కష్టాలు, కన్నీళ్ల సెంటిమెంట్లు ఇవన్నీ సినిమాలో చూస్తూ.. అది తెర అని, మనం చూసేది సినిమా అని తెలిసినా.. ఆ నాటకీయతలో లీనమై ప్రేక్షకులుగా మనం కూడా భావోద్వేగాలకు గురవుతుంటాం. సినిమాలు ప్రదర్శించే టాకీసులో అలాంటి అరుదైన దృశ్యాలు కళ్ళముందు నిజంగానే జరుగుతుంటే.. ప్రేక్షకులుగా సినిమా చూసి న కుర్చీలోనే నిజమైన ఆ సంఘటనలు చూసే అరుదైన అవకాశం కాచిగూడలోని బసంత్ టాకీస్‌లో లభించింది.

కాచిగూడ మెయిన్‌రోడ్‌కు సంబంధం లేకుండా గల్లీలో ఉండే ఈ టాకీసు అప్పట్లో ఇళ్ల మధ్య ఉండేది. ఇప్పుడు ఏకంగా అపార్ట్‌మెంట్‌గా మారిపోయింది. మూగ మనసులు, జీవనతరంగా లు, జీవనజ్యోతి, బలిపీఠం, ఆలుమగలు వంటి సెంటిమెంట్ కథాబలం ఉన్న సినిమాలు ప్రదర్శించిన బసంత్‌లో అంతకన్నా బలమైన సెంటిమెంట్ దృశ్యాలు చోటుచేసుకున్నాయి.
ఆ దుష్టున్ని బంధించండి అని జానపద సినిమాల్లో వృద్ధరా జు ఆదేశించగానే సైనికులు ఆ రాజునే బంధిస్తారు. తన వెనుక జరిగిన కుట్రలను ఆ రాజు అప్పటివరకు గుర్తించడు. గుర్తించినా ఏమీ చేయలేని దశలో గుర్తిస్తాడు. సైన్యాధ్యక్షుని కుట్రలను ఛేదిం చి తల్లిదండ్రులను విడిపించిన యువరాజుల కథలు.జానపద సినిమాల్లో సైన్యాధ్యక్షుల కుట్రలను ఛేదించిన యువరాజుల సినిమాలను మార్నింగ్ షోలుగా, విలన్లను మట్టికురిపించిన హీరోల సినిమాలు రెగ్యులర్ షోలుగా ఎన్నో ప్రదర్శించిన ఈ టాకీసులో అలాంటి సంఘటనలు నిజంగానే జరుగడం విశేషం.

బసంత్ టాకీస్ ఇక నడిచే అవకాశం లేదని గ్రహించాక తెర ను శాశ్వతంగా దించేసి ఫంక్షన్‌హాలుగా మార్చారు. అంతకన్నా లాభసాటి ఆలోచన రాగానే దానిని అపార్ట్‌మెంట్‌గా మార్చారు. బసంత్ టాకీస్ అపార్ట్‌మెంట్‌గా అవతారమెత్తక ముందు కీలకమైన రాజకీయ పరిణామాలు అక్కడ చోటుచేసుకున్నాయి. ఎన్టీ రామారావును అధికారం నుంచి దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సంఘటన అనగానే అందరికీ వైస్రాయ్ హోటల్ గుర్తుకు వస్తుంది. అంతకన్నా కీలక పరిణామం బసంత్ టాకీస్‌లో చోటుచేసుకున్నది.ఒక కుమారుడు తన తండ్రిని ఒక పదవి నుంచి తొలిగించి బోరున ఏడ్చింది ఇక్కడే. ఒక అల్లుడు మామ పదవిని కైవసం చేసుకొని బావమరిదిని ఓదార్చింది ఇక్కడే.

తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగించేందుకు బసంత్ టాకీస్‌లోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నో సెంటిమెంట్ సినిమాలు తెరపై ప్రదర్శించిన చోటే సజీవ సెంటిమెంట్ సినిమా ప్రదర్శించారు. ఎన్టీఆర్‌ను దించే ఎపిసోడ్‌లో వైస్రాయ్ హోటల్‌కు లభించినంత గుర్తింపు కీలక పరిణామాలకు వేదికైనా ఇతర ప్రాంతాలకు లభించలేదు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగిస్తూ ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ బసంత్ టాకీస్‌లో జరిగిన సమావేశంలోనే తీర్మానం ప్రవేశపెట్టారు. అక్కడివరకు ఉత్సాహంగా వచ్చిన హరికృష్ణ తన తండ్రిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలిగిస్తూ తీర్మానం చదివి దుఃఖం ఆపుకోలేకపోయారు. సినిమాలు ప్రదర్శించే వేదికపైనే ఏడ్చేశారు. సినీ ప్రేక్షకులు సీట్లపైన మీడియా, పార్టీ నాయకులు ఇప్పుడు ఏమవుతుంది? హరికృష్ణ దుఃఖం వ ల్ల ఎన్టీఆర్‌ను దించేయాలనే నిర్ణయం మార్చుకుంటారా? ఏం చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా చంద్రబాబు హరికృష్ణ భుజంపై చేయివేసి అనునయించారు. బాబు సకాలంలో స్పందించి హరికృష్ణ కన్నీటిని నిలిపివేయించారు. ఆ తర్వాత అశోక గజపతిరాజు, ఇతర నాయకులు అనునయించారు. తం డ్రిని కుమారుడు గద్దెదించినట్టు చరిత్ర పుస్తకాల్లో, సినిమాల్లో కనిపించే దృశ్యం బసంత్‌లో కనిపించింది.

తక్కువ బడ్జెట్‌తో అద్భుత కథాబలంతో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తూర్పుపడమర, నీడ వంటి సినిమాలు బసంత్‌లో విజయవంతంగా ప్రదర్శించారు.ఇక్కడి నుంచే దాసరి నారాయణరావు రాజకీయ పార్టీ ఏర్పాటుచేయాలనీ ప్రయత్నించారు. అది విడుదలకు నోచుకోని సినిమాగానే మిగిలిపోయింది. చిరంజీవి కన్నా ఓ దశాబ్దకాలం ముందే దాసరి రాజకీయపార్టీ ఏర్పాటుకోసం ప్రయత్నించారు. బసంత్ టాకీస్‌లో దాసరి అభిమాన సంఘాల రాష్ట్ర సమావేశం జరిగింది. అందరి అభిప్రాయాలూ తీసుకొని అక్కడే దాసరి పార్టీ ప్రకటిస్తారని తొలుత సమాచారం ఇచ్చారు. అభిమానులు పార్టీ పెట్టాల్సిందేనని సూచించారు. మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాశరావు అప్పటికప్పుడు ఏ సామాజికవర్గం ఓట్లు ఎక్కడ ఎన్ని ఉన్నాయి. దాసరి పార్టీ పెడితే ఎన్ని సీట్లు వస్తాయో ఆ టాకీసులోనే మీడియాకు లెక్కలు చెప్పారు. దాసరి అభిమానులకు నివేదిక ఇచ్చారు. పార్టీ ఏర్పాటు చేయలేదు. కానీ అక్కడ మాత్రం ఉత్సాహపూరిత వాతావరణం కనిపించింది. పురజనుల కోరికపై దాసరి పార్టీ ఏర్పాటును కొద్దిరోజులు వాయి దా వేస్తున్నారని దాసరి తరపున గోనె మీడియాకు లీకేజీ ఇచ్చా రు. కానీ మీడియా మాత్రం దాసరి పార్టీ విడుదల కావడం లేద ని రాశాయి. దాసరి రాజకీయ సినిమా విడుదల కాకుండానే దాసరి జీవితం ముగిసింది. బసంత్ టాకీస్ కనుమరుగైంది. అప్పుడప్పుడు హిందీ సినిమాలు ప్రదర్శించినా బసంత్‌లో ఎక్కువగా తెలుగు సినిమాలు ప్రదర్శించేవారు.
 
సినిమా టాకీస్‌లో జనం అంతంత మాత్రమే కాగా సైకిల్‌స్టాండ్‌లో సైకిళ్ల సంఖ్య ఇంకా తక్కువగా ఉండేది. టాకీసుకు పక్కనే వెదురుబొంగులు అమ్మేవారు, అనధికారికంగా సైకిల్‌స్టాండ్ నిర్వహించేవారు. టాకీసులోని సైకిల్ స్టాండ్‌కన్నా తక్కువధర, టికెట్ దొరక్కపోతే రిటన్ తీసుకువెళ్ళవచ్చుననే సౌకర్యం కల్పించడంతో ఎక్కువమంది అనధికార స్టాండ్‌లోనే సైకిల్ పార్క్ చేసేవారు. ఇప్పుడంటే ఓ కుటుంబం సినిమాకు వెళ్లాలంటే ఓ వెయ్యి రూపాయలు కావాలి. ఆ రోజుల్లో ఓ ఐదు రూపాయలుంటే చాలు సైకిల్ స్టాండ్, ఇంటర్‌వెల్ ఖర్చుతో సహా. శోభన్‌బాబుకు సోగ్గాడు అనేది మరో పేరుగా మారిపోయిం ది. ఆ సినిమా విడుదల సందర్భంగా శోభన్‌బాబు తన సన్నిహితులతో ఈ సినిమా తర్వాత ఈ సినిమా పేరే తనపేరుగా మారిపోతుందని చెప్పారట. దానికి తగ్గట్టుగానే శోభన్‌బాబును అప్పటి నుంచి సోగ్గాడు శోభన్‌బాబు అని పిలిచారు. సోగ్గాడు సినిమా బసంత్‌లో 1975లో 110 రోజులు ఆడింది.శోభన్‌బాబు విజయవంతమైన ఎన్నో సినిమాలు ఇందులో ప్రదర్శించారు. ఇద్దరు అమ్మాయిలు, కన్నవారి కలలు, చక్రవా కం, రాధాకృష్ణ, దీపారాధన, ప్రతీకారం వంటి సినిమాలు బసంత్‌లో విజయవంతంగా ప్రదర్శించారు.

బసంత్ టాకీస్ కు భారీ కటౌట్ లు ఏర్పాటు చేసే వారు . వై యం సీఏ నుంచి కాచిగూడ కు వెళ్లే వారికి ఆ కటౌట్ లు కనువిందు చేసేవి . ఆ ప్రాంతం లో కన్నడ వారు ఎక్కువగా ఉండడం తో అప్పుడప్పుడు ఉదయం పూట కన్నడ సినిమా ప్రదర్శించే వారు .  లవకుశ ,బసంత్ లో ఏడాది పాటు నడిచింది . దేవుడు చేసిన మనుషులు కూడా ఏడాది ప్రదర్శించారు . 
సినిమా చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనూ బసంత్‌కు స్థానం ఉంది. ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రదర్శించిన బసంత్ మారిన పరిస్థితులను తట్టుకోలేక మూతపడి, బసంత్ అపార్ట్‌మెంట్‌గా కొత్తరూపు సంతరించుకున్నది.
-బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 29-1-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం