6, ఏప్రిల్ 2018, శుక్రవారం

‘ఆపరేషన్ సులభ్’ నీదీ నాదీ ఒకే కథ..!

‘‘ఒరేయ్.. అర్జంట్‌గా 18 వందల రూపాయలివ్వు’’
‘‘నేనేమన్నా ఎటిఎంను అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు అడిగినన్ని డబ్బులు నీకు ఇచ్చేందుకు?’’
‘‘ఎటిఎం అనుకుంటే నీ దగ్గరకెందుకొస్తాను. ఎటిఎంలో డబ్బులుండవని నాకు తెలియదా? ’’
‘‘పోనీ.. నన్ను బ్యాంకును అనుకున్నావా? ’’
‘‘బ్యాంకు అనుకుంటే ఐదారువేల కోట్ల రూపాయలు తీసుకుని విదేశాలకు చెక్కేయడానికి వెళతా, కానీ కేవలం 18 వందల కోసం బ్యాంకుకు ఎందుకు వెళతాను? అవసరానికి ఆదుకునే మిత్రుడివనే నీ దగ్గరకు వచ్చాను’’
‘‘అది సరే కానీ- ఈ పద్దెనిమిది వందల లెక్క ఏంటి?’’
‘‘విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కావాలి కదా? పాస్ పోర్ట్ కావాలంటే 18 వందలు కావాలి’’
‘‘ఆ మాట నీకెవరు చెప్పారు. ఆన్‌లైన్‌లో వెయ్యి రూపాయలతో పాస్‌పోర్ట్ వస్తుంది.. మరి 18 వందలెందుకు?’’
‘‘రోడ్డు మీద నడిచేప్పుడు సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ మాత్రమే కాదు, గోడల మీద ఏం రాసుందో కూడా చదవాలి. 18 వందలకు పాస్ పోర్ట్ ఇప్పిస్తామని రాసిన గోడమీద రాతలు చూడలేదా? ఆన్‌లైన్‌లో అప్లై చేయడం నాకు రాదు. 18 వందలు ఇస్తే అంతా వాళ్లే చూసుకుంటారు.’’
‘‘ఉద్యోగం లేదు, నాటకాల్లో అవకాశాలు లేవు. పనీపాటా లేదు. నీకెందుకురా.. పాస్‌పోర్ట్?’’
‘‘అమెరికా వెళ్లాలి. దానికి పాస్‌పోర్ట్ ఉండాలి. టైం లేదు. తొందరగా ఇవ్వు’’
‘‘పాస్‌పోర్ట్‌కేం కానీ పద్దెనిమిది వందలిస్తే వారంలో వచ్చేస్తుంది. అమెరికా వెళ్లాలంటే అదొక్కటి సరిపోదు. వీసా కావాలి. ఐనా అంత అర్జంట్‌గా అమెరికా ప్రయాణం ఎందుకో చెప్పొచ్చు కదా?’’
‘‘అది చాలా రహ స్యం.. సారీ.. చెప్పలేను’’
‘‘సారీ... ఎందుకో చె ప్పేంత వరకు డబ్బులు ఇచ్చేది లేదు’’
‘‘సరే చెబుతాను. కా నీ ఇది అత్యంత రహ స్యం. ప్రపంచ చరిత్రను మార్చే రహస్యం. మనిద్దరి మధ్యనే ఉండాలి. ఎవరికీ చెప్పనని మాటిస్తేనే చెబుతాను.’’
‘‘సరే చెప్పి ఏడువ్’’
‘‘ట్రంప్‌ను కలవడానికి అమెరికా వెళ్లలని నిర్ణయించుకున్నా ను. ఆ తరువాత రష్యా వెళతాను. ముందు ఢిల్లీ వెళతా.. రేపే తొప్పాయ పాలెం వెళతాను’’
‘‘నువ్వు మాట్లాడే దానికి అసలేమైనా అర్థం ఉందా? తొప్పాయ పాలెం నుంచి అమెరికా వరకు వెళ్లి ఏం చేస్తావు. ఏంటో.. నీకేదో పిచ్చి పట్టినట్టు అనిపిస్తోంది..’’
‘‘మేధావులు మొదట పిచ్చివాళ్లుగానే కనిపిస్తారు.’’
‘‘ మేధావులు పిచ్చివాళ్లలా కనిపించవచ్చు. కానీ పిచ్చివాళ్లంతా మేధావులు కాదు. సరే విషయం చెప్పు..’’
‘‘నువ్విచ్చే పద్దెనిమిది వందలు కావాలి.. నువ్వు నమ్మినా నమ్మక పోయినా విషయం చెప్పాలి గనుక చెబుతున్నాను. ఒక పెద్ద అంతర్జాతీయ కుట్రను అంతర్జాతీయ మీడియా ముందు బహిర్గతం చేయనున్నా. ఆ దెబ్బతో నా పేరు ప్రపంచంలో మార్మోగిపోతుంది. ప్రపంచాన్ని రక్షించిన సూపర్ మ్యాన్‌గా గుర్తింపు వస్తుంది. ’’
‘‘ముందు అసలు విషయం చెప్పు.. సస్పెన్స్‌లో ఉంచకు’’
‘‘తొప్పాయపాలెం సర్పంచ్‌ను అధికారం నుంచి దించేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. ఆ ప్లాన్ సక్సెస్ కాగానే అదే ఫార్ములాతో రా ష్ట్రాల ముఖ్యమంత్రులను, దేశ ప్రధానిని తప్పిస్తారు. తరువాత ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి- ఇరాన్, ఇరాక్‌ల పాలకులను మార్చి, అటు నుంచి అమెరికా అధ్యక్షుడిని బంధించి, రష్యాను విచ్ఛిన్నం చేసి ప్రపంచాన్ని తొప్పాయ పాలెం అదుపులోకి తీసుకురావడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ విషయాన్ని మన లోకల్ మీడియా అర్థం చేసుకోలేదు. అందుకే అమెరికా వెళ్లి ప్రపంచ మీడియా ముందు వైట్ బోర్డ్‌పై ఈ కుట్ర గురించి పూసగుచ్చినట్టు వివరిస్తా..’’
‘‘ఏరా! మీ ఆవిడతో ఇంట్లో ఏదో గొడవ అని పుట్టింటికి వెళ్లిపోయిందని విన్నాను. సీరియస్ గొడవే జరిగినట్టుంది. నీ తలమీద దెబ్బలు బలంగా తాకాయా?’’
‘‘నేను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నాను. స్పృహలో ఉండే మాట్లాడుతున్నా.. భార్య కొట్టిన దెబ్బలకే బుర్ర పని చేయకుండా ఉండేంత బలహీనుడిని కాను, ఇలాంటి దెబ్బలు నాకేమీ కొత్త కాదు.’’
‘‘నీ మాటలు వింటుంటే ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. కానీ మాటల్లోనే ఏదో తేడా కనిపిస్తోంది.’’
‘‘నమ్మడం కష్టం.. కానీ నేను చెప్పిన కుట్ర నిజం.’’
‘‘సరే నిజమే అనుకుందాం. ఈ కుట్ర సంగతి నీకెలా తెలిసింది?’’
‘‘మొన్న పనిమీద మరో రాష్ట్రానికి వెళుతుంటే బస్సు ఆగింది. లఘుశంక తీర్చుకోవడానికి సులభ్ కాంప్లెక్స్‌కు వెళ్లాను. పక్క వరుసలోని టాయిలెట్‌లో ఎవరున్నారో ముఖం చూడలేదు. కానీ ఇద్దరు వ్యక్తులు తొప్పాయ పాలెం సర్పంచ్‌ను దించేయడం మొదలుకుని ప్రపంచాన్ని తమ గ్రామం గుప్పిట్లోకి తీసుకు రావడానికి ఏమేం చేయాలో మాట్లాడుకున్నారు. వాళ్లు మాట్లాడుకున్న ప్రతి మాట నాకు గుర్తుంది. నా పని ముగించుకుని పక్క వరుసలోని టాయిలెట్‌లోకి వెళ్లే సరికి అప్పటి వరకు మాట్లాడి వ్యక్తి కనిపించలేదు. కానీ అక్కడి గోడల మీద ఏవేవో మాటలు, కుట్రలు రాసి ఉన్నాయి. ‘ఆపరేషన్ సులభ్’ అని ఈ కుట్రకు వాళ్లు పేరు పెట్టుకున్నారు. నేను విన్న ప్రతి మాటను రాసి పెట్టుకున్నా. ‘ఆపరేషన్ సులభ్’తో ప్రపంచాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోవాలని వారు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటా. ఈ ప్రపంచాన్ని కాపాడుతా. ఇదంతా అమెరికాలో ప్రపంచ మీడియాకు వివరిస్తా. ఈ ప్రపంచం నా సేవను గుర్తించుకుంటుంది. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పరవా లేదు. ప్రపంచం కోసం నేనీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’
‘‘నీ మాట నమ్ముతున్నా. నువ్వు విన్నది నిజమే కానీ- సులభ్ కాంప్లెక్స్‌లో వినబడే మాటలు, అక్కడి గోడల మీద కనిపించే రాతలను సీరియస్‌గా తీసుకోవద్దు. నువ్వు చూసిన గ్రామంలోనే కాదు అన్ని చోట్లా టాయిలెట్స్‌లో ఇలాంటి మాటలు వినిపిస్తాయి, రాతలు కనిపిస్తాయి. ఇక ఇంటికి వెళ్లు. మీ ఆవిడకు నేను నచ్చజెబుతాలే.’’
***
‘శివాజీ.. ఇప్పుడు నీ కథ గుర్తుకొస్తుందా? నీదీ నాదీ ఒకే కథ.’

-

 - బుద్దా మురళి(జనాంతికం 4-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం