16, ఏప్రిల్ 2018, సోమవారం

విలువలకే ప్రాధాన్యం





డబ్బుకు మనం విలువ ఇస్తే- అది మనకు విలువ ఇస్తుంది. మనం నిర్లక్ష్యం వహిస్తే ధనం తానేంటో చూపిస్తుంది. అసామాన్య విజయాలు సాధించిన కొందరి జీవిత అలవాట్లను తెలుసుకుంటే మనపై వారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.
చేతిలో చిల్లిగవ్వ లేని హీరో అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. ‘డబ్బు లేని నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావ’ని తండ్రి ప్రశ్నిస్తే- ‘మిస్టర్ కుటుంబరావ్.. డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఆరునెలల్లో నీ కన్నా ఎక్కువ సంపాదించి చూపిస్తాను’ అని ఏమీ లేని బికారి హీరో కోటీశ్వరుడైన హీరోయిన్ తండ్రిని చాలెంజ్ చేసి, తాను ముందుగా చెప్పినట్టుగానే ధనం సంపాదించి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. ఇది సినిమా కథ. ఇలాంటివి సినిమాల్లోనే సాధ్యం అవుతాయి కానీ నిజజీవితంలో అలా ఉండదు. జీవితంపై ఎలాంటి అవగాహన లేకుండా ఆవారాగా తిరిగే హీరో సినిమాలో కోటీశ్వరుడు అవుతాడేమో కానీ నిజ జీవితంలో అలా జరగదు.
మనం నడిచే దారే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇన్ఫోసిస్ సుధామూర్తి ప్రేమ- జీవితం సినిమా కథ లాంటిదే. ఐతే సినిమాలో హీరో చాలెంజ్ చేసి సంపాదించి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. కానీ సుధామూర్తి దంపతులు సామాన్యులుగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, తమ జీవిత విధానం ద్వారా సంపన్నులు అయ్యారు. ఎంతటి సంపన్నులు అంటే వాళ్ల కంపెనీలో ఓ పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు కేవలం పదేళ్లలో కోటీశ్వరులు అయ్యారు. వేల కోట్ల ఆస్తి ఉన్న ఆ దంపతులను చూస్తుంటే- మధ్యతరగతి కుటుంబీకుల్లా కనిపిస్తారు. అలా కనిపించడమే కాదు, వారి జీవిత విధానం కూడా అలానే ఉంటుంది.
సుధామూర్తి ఇచ్చిన పదివేల రూపాయల పెట్టుబడితో నారాయణమూర్తి ‘ఇన్ఫోసిస్’ సంస్థను ప్రారంభించి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. ఒకరు ఇంటి బాధ్యత, ఇంకొకరు కంపెనీ బాధ్యత పంచుకుని జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగారు.
ఖరీదైన చీర కొనుక్కోవడానికి కూడా ఇష్టపడిన సుధామూర్తి ఇంట్లో సుమారు 20 వేల పుస్తకాలున్నాయి. ఇంటి కోసం కొనడమే కాదు, కర్నాటకలో దాదాపు 60వేల గ్రంథాలయాలకు ఈ దంపతులు ఉచితంగా పుస్తకాలు అందజేశారు. వీరి పెళ్లి ఖర్చు కేవలం ఎనిమిది వందల రూపాయలు. ఆ ఖర్చును చెరి సగం భరించామని సుధామూర్తి నవ్వుతూ చెబుతుంటారు.
అసామాన్య విజయాలు సాధించిన వారు ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉండరు. అందరిలానే వీరికీ రోజుకు ఇరవై నాలుగు గంటలే ఉంటాయి. అందరిలానే రెండు చేతులు, రెండుకాళ్లే ఉంటాయి. కానీ 24 గంటలూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆలోచనలే మనిషిని ఉన్నత స్థాయికైనా, పతనానికైనా తీసుకువెళతాయి. మనం ఎలాంటి ఆలోచనలతో వెళుతున్నామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
సినిమా రంగంలో అత్యున్నత స్థానం నుంచి అధఃపాతాళానికి పడిపోయిన ఎందరో మహానుభావుల గురించి మనకు తెలుసు. దీనికి భిన్నంగా ఒక సామాన్యురాలు అత్యున్నత స్థాయికి చేరుకున్న సుధామూర్తి ఎందరికో స్ఫూర్తిదాతగా నిలిచారు.
ఆడవారి షాపింగ్ మీద ఉన్నన్ని జోకులు మరే అంశంపై ఉండవేమో! గంటల తరబడి మహిళలు షాపింగ్‌లో కాలం గడుపుతారనే పేరు. వారు అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వడం సాధారణమే. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్న మహిళ షాపింగ్‌కు వెళితే ఎలా ఉంటుందో అని మనం ఏవేవో ఊహించుకుంటాం. కానీ, ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి భార్య, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి గత 20 ఏళ్ల నుంచి కనీసం ఒక చీర కూడా కొనలేదు. పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్లిన వారు తమకు ఇష్టం అయిన ఏదో ఒక దాన్ని అక్కడ వదిలేయడం సంప్రదాయం. ఎక్కువ మంది తమకు నచ్చిన ఆహార పదార్థాన్ని వదిలేస్తారు. సుధామూర్తి మాత్రం షాపింగ్ అలవాటును వదిలేశారు. అప్పటి నుంచి కొత్తగా చీరలేమీ కొనలేదు.
‘అక్రమాల ద్వారానే డబ్బు సంపాదిస్తారనే ఆలోచన తప్పు. ధర్మ బద్ధంగా కూడా ధనం సంపాదించవచ్చు’ అని ఇన్ఫోసిస్‌ను ప్రారంభించినప్పుడు తన మిత్రులను ఉద్దేశించి నారాయణమూర్తి చెప్పిన మాట. చెప్పడమే కాదు, ఆయన ఆచరణలో చూపించారు. విలువలకు కట్టుబడిన ‘ఇన్ఫోసిస్’ సంస్థ ఐటి రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా నిలిచింది.
భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ‘ఇగో’ల పోరాటం కాదు. ఒకరికొకరు చేయుతనివ్వడం. సుధామూర్తి వల్లనే తాను విజయం సాధించానని, తన విజయంలో ఆమెదే ముఖ్యపాత్ర అని నారాయణమూర్తి చెబుతారు. విచ్చలవిడిగా ధనం ఖర్చు చేసి, ఖరీదైన కార్లలో తిరగడమే సంపన్నత కాదు. వందల కోట్ల ఆస్తి ఉన్నా సామాన్యుల్లానే జీవిస్తూ, తాము సంపాదించిన డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంపూర్ణ జీవితం గడుపుతున్న సుధామూర్తి, నారాయణమూర్తి దంపతుల జీవితం ఆద్భుతం. డబ్బుకు మనం విలువ ఇస్తే అది మనకు విలువ ఇస్తుందని ఈ దంపతుల జీవితాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఏ రంగంలోనైనా సకాలంలో అడుగు పెట్టడం ముఖ్యం అంటారు నారాయణ మూర్తి. 1971లోనే ఐటి రంగం అభివృద్ధిని ఊహించి ఆ రంగంలో అడుగు పెట్టడమే కాకుండా ఘన విజయం సాధించి, విలువలతో జీవనం సాగిస్తున్నారు. విలాసాలతో ఎంతో మంది సంపన్నులు బికారులుగా మారిపోయిన ఈ కాలంలో సామాన్యులకే కాదు, సంపన్నులకూ వీరి జీవితం ఆదర్శప్రాయం.
-బి.మురళి

3 కామెంట్‌లు:

  1. బాగా వ్రాశారు. నారాయణమూర్తి గారు దేశానికి అద్యక్షుడు అవ్వవలిసింది. కొద్దిలో, ఒక్క చిన్న పొరబాటు వల్ల, తప్పిపోయింది.

    రిప్లయితొలగించండి
  2. ఈ మధ్యనే చదివాను. సుధా మూర్తి గారు ఎక్కడికో వెడుతూ, ఎయిర్ పోర్టులో బిజినెస్స్ క్లాస్ చెక్ ఇన్ వైపు వెళుతుంటే, అక్కడ ఉన్న వనితామణి ఒకరు ఆవిడ సాదా సీదా ఆహార్యం చూసి, ఇక్కడ కాదు, అక్కడ...అక్కడికి అని ఎకానమీ క్లాసువైపు చూపించిందిట. సుధా మూర్తి గారు ఇవ్వేమీ పట్టించుకోకుండా చెక్ ఇన్ చేసి వెళ్ళి విమానంలో కూచున్నారుట. ఎకానమీ క్లాసును చూపించిన వనితామణికి మర్నాడు. పెద్ద మీటింగుకు వెళ్ళి అద్యక్ష స్థానంలో కూచుని ఉన్న సుధా మూర్తి గారిని చూసి, పది జీవితాలకు సరిపడా షాక్ తిన్నదట.

    రిప్లయితొలగించండి
  3. Sir,
    Pleas check this "ఖరీదైన చీర కొనుక్కోవడానికి కూడా ఇష్టపడిన"...I think You have to replace it with "ఖరీదైన చీర కొనుక్కోవడానికి కూడా ఇష్టపడని"
    regards
    hari.S.babu

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం