30, అక్టోబర్ 2023, సోమవారం
తెలంగాణ లో టీడీపీ చరిత్ర అలా మొదలై ఇలా ముగిసింది ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -103
తెలంగాణ లో టీడీపీ చరిత్ర అలా మొదలై ఇలా ముగిసింది ..
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -103
---------------------------------------
తెలంగాణ లో జరిగే 2023 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు . రాజమండ్రి జైలులో ఉన్న బాబు ములాఖత్ లో తెలంగాణ టీడీపీ నాయకులకు ఈ విషయం చెప్పారు . ఆ పార్టీ ఉనికి తెలంగాణలో అంతంగా మాత్రమే . పోటీ చేసినా చేయక పోయినా పెద్దగా ప్రభావం ఉండదు . ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రభావం ఎంతో టీడీపీ ప్రభావం అంతే ఉటుంది . ఐతే నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఈసారి పోటీ చేయడం లేదు అంటే . తెలంగాణలో ఆ పార్టీ చరిత్ర ముగిసినట్టు . తెలంగాణలో 1999 ఎన్నికలే టీడీపీ గెలిచిన చివరి ఎన్నికలు . 24 ఏళ్ళ నుంచి తెలంగాణ లో పెద్దగా ప్రభావం లేదు . ఐతే ఈ సారి పోటీ చేయడం లేదు అంటే తెలంగాణలో టీడీపీ చరిత్ర అధికారికంగానే ముగిసినట్టు . వారం క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షడు తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని ప్రకటించారు . ఆరు నెలల క్రితం ఖమ్మంలో టీడీపీ బహిరంగ సభ జరిగింది . పాత టీడీపీ వారంతా టీడీపీలోకి వచ్చేయండి అని బాబు పిలుపు ఇచ్చారు . ఈ పిలుపును అందుకొని ఎవరెవరు రాబోతున్నారో తెలుగు ఛానల్స్ వారం రోజుల పాటు చర్చలతో ఉదరగోట్టాయి . ఒక్కరూ రాలేదు . పైగా బాబైనా పార్టీ మారుతాడేమో కానీ ఈయన మారడు అని పేరున్న రావుల చంద్ర శేఖర్ రెడ్డి కూడా టీడీపీని వీడి వెళ్లారు . తెలంగాణ జనంలో టీడీపీకి లేకపోవచ్చు కానీ మీడియా గుండెల్లో బాబు గూడు కట్టుకొని ఉన్నారు . ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని ప్రచారం చేసే దమ్మున్న మీడియా టీడీపీకి ఉంది . ఎన్నికల్లో పోటీ చేస్తేనే రాజకీయ పార్టీకి ఉనికి . పోటీకి దూరం కావడంతో అధికారికంగా తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టే . పార్టీ పుట్టుక నుంచి ముగింపు వరకు పలు కీలక సంఘటనల్లో ప్రత్యక్ష సాక్షిని ..
*****
క్లిక్ మని ఫ్లాష్ వెలగగానే ఎన్టీఆర్ ఒక్కసారిగా ఆ ఫోటో గ్రాఫర్ వైపు కోపంగా చూశారు .
మార్వాడి షాప్ లో కనిపించే పరుపు గద్దె మీద ఎన్టీఆర్ కూర్చొని ఉన్నారు . పక్కన నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నారు . ఫోటో గురించి నాదెండ్ల ఏదో చెప్పే సరికి ఎన్టీఆర్ మాములు అయ్యారు .
ఇది 1982లో రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ ను టీడీపీ నాయకుడి పాత్రలో తొలిసారి చూసిన సందర్భం . అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను . పదవ తరగతి పరీక్షలు రాస్తున్న కరీం నగర్ జిల్లాకు చెందిన మిత్రుడు భూపాల్ తీసుకువెళితే రామకృష్ణ స్టూడియోకు వెళ్ళాను . కొత్తగా పెట్టిన టీడీపీలో జిల్లాల వారిగా నాయకులతో ఎన్టీఆర్ సమావేశం . ఆ రోజు కరీం నగర్ సమావేశం కావడంతో తనకు తెలిసిన వారు టీడీపీలో చేరుతున్నారని , వారితో ఎన్టీఆర్ సమావేశం ఉంది వెళదాం అంటే స్టూడియోలోకి వెళ్ళాను . దాదాపు ఓ వందమంది ఉండవచ్చు . అంతకు ముందు దివిసీమ తుఫాన్ బాధితుల కోసం ఎన్టీఆర్ అక్కినేని బృందం విరాళాలు సేకరిస్తుంటే సికింద్రాబాద్ దర్గా వద్ద రేఖా ఎంపోరియం లోకి వెళ్లి విరాళాలు తీసుకుంటుంటే చూశాను . కానీ టీడీపీ ఏర్పడ్డాక ఎన్టీఆర్ ను 82లో రామకృష్ణ స్టూడియోలో చూశాను .
84లో లో ఎన్టీఆర్ కు నాదెండ్ల వెన్నుపోటు తరువాత రామకృష్ణ స్టూడియో వద్ద పిట్టగోడ ఎక్కి వెంకయ్య నాయుడు బీజేపీ కార్యకర్తలు చేసిన ఉపన్యాసం , ఉద్యమం చూశాను . ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో టీడీపీ కన్నా బీజేపీ హడావుడి ఎక్కువ ఉండేది . ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం లో స్టూడియో వద్ద బీజేపీ నాయకులదే ఎక్కువ హడావుడి . ఆ సమయంలో నేను అక్కడ ఎందుకు ఉన్నానో గుర్తు లేదు కానీ.. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అప్పుడు ఆ స్టూడియో వద్దనే ఉన్నాను . చాలా మంది రోడ్డు మీద నిలబడి చూశారు . ఆ మరుసటి సంవత్సరం ఒక వైపు కాలేజీకి వెళుతూనే 1985 నుంచి ఉదయం స్థానిక విలేకరిగా టీడీపీని దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది .
విద్యార్థిగా , జర్నలిస్ట్ గా టీడీపీ పుట్టుక నుంచి మహోజ్వలంగా వెలిగిపోవడం , ఆరిపోవడం వరకు అన్ని కీలక పరిణామాలను దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది .
ఎన్టీఆర్ ను దించేసిం వైస్ రాయ్ ఎపిసోడ్ నుంచి తెలంగాణ ఏర్పాటుతో టీడీపీ నిర్వీర్యం కావడం వరకు ఆంధ్రభూమి నుంచి టీడీపీ రిపోర్టర్ గా అన్ని పరిణామాలను చూశాను .
***
ఎం ఎల్ ఏ క్వార్టర్ లో టీడీపీ పుట్టిన సందర్భంలో అక్కడ లేను కానీ అటు నుంచి రామకృష్ణ స్టూడియోలో సమావేశాలు ప్రారంభం నుంచి .. తెలంగాణ లో పార్టీ శకం ముగియడం వరకు అన్నీ చూశాను .
తెలంగాణ ఏర్పడినా 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి ఎన్నికలు జరిగాయి . ఒక ప్రాంతీయ పార్టీ ఒకే రాష్ట్రంలో ఉంటుంది . రెండు రాష్ట్రాల్లో ఉండదు . ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల విభజనను అంత త్వరగా జీర్ణం చేసుకోరు . ఆ ఎన్నికల్లో టీడీపీ పది స్థానాల్లో గెలిచింది . ఓటుకు నోటు తెరాస కు వరంలా మారింది . 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ , టీడీపీ మహాకూటమి మీడియాతో కలిసి అధికారంలోకి వచ్చేస్తున్నారు అనే భావన కలిగించడంలో విజయం సాధించారు . మంత్రివర్గాలను కూడా ఏర్పాటు చేసేసుకున్నారు . ఫలితాల్లో బోల్తా కొట్టారు . ప్రచారంలో బాబు సింహా భాగం ఆక్రమించారు . తీరా రెండు సీట్లకు పరిమితం అయ్యారు . 150 డివిజన్ లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీకి ఒక్క టంటే ఒక్క కార్పొరేటరే గెలిచారు . ఓటుకు నోటు కేసులు , పరాజయాలతో తెలంగాణ టీడీపీ నాయకులు తెరాస , కాంగ్రెస్ , బీజేపీ ఏదో ఒక పార్టీలో సర్దుకున్నారు . రిటైర్డ్ అయిన వారి కాలక్షేపం క్లబ్ తరహాలో ఎన్టీఆర్ భవన్ కొద్ది మందికి పరిమితం అయిపొయింది .
*****
ఎందుకు పోటీ చేయడం లేదు ..
రాజకీయ పక్షాలు నిజం చెప్పవు .. వారు చెప్పెది నిజం కాదు . ఐతే ఎందుకు పోటీ చేయడం లేదు అనే దానిపై నిజం చెప్పడం లేదు .. అబద్దం చెప్పడం లేదు . మరో ఆరు నెలల్లో ఆంధ్రాలో ఎన్నికలు . టీడీపీకి అవి చావుబతుకుల పోరాటం . తెలంగాణ లో అన్ని చోట్ల డిపాజిట్లు పోవడం ఖాయం .. డిపాజిట్లు పోతే ఆంధ్ర లో ఆ ప్రభావం పడుతుంది . బాబు జైలుకు వెళ్లిన తరువాత ఆంధ్ర కన్నా తెలంగాణలోనే నిరసన కార్యక్రమాలు ఎక్కువగా జరిగాయి . ఒక సామాజిక వర్గం వారాంతపు ఆట విడుపులా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మీడియా మాత్రం జనప్రవాహం అని చెబుతోంది . డిపాజిట్లు పోతే ఓస్ సానుభూతి ఇంతేనా ? అని ఆంధ్ర లో గాలి పోతుంది .
మరో వైపు ఈ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లించాలి అని టీడీపీ అనుబంధ మీడియా ప్రయత్నాలు . టీడీపీ పోటీలో ఉంటే ఆ వర్గం అటు ఓటు వేయాలో ఇటు వేయాలో గందరగోళం . బి ఆర్ యస్ కన్నా రేవంత్ రెడ్డి అధికారం లో ఉంటే తానే అధికారంలో ఉన్నట్టు బాబు భావించడానికి అవకాశం ఉంటుంది . ఎలాగూ గెలిచే అవకాశం లేని ఒకటి రెండు శాతం ఓట్లతో పోటీ చేయడం కన్నా పోటీకి దూరంగా ఉండడం ప్రయోజనం అని టీడీపీ తెలంగాణలో తమ పార్టీకి మంగళం పాడింది . నిజానికి తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో మంగళం పాడారు . ఇప్పుడు టీడీపీ కూడా మంగళం పాడింది .
***
ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన గండిపేట కుటీరం , హిమాయత్ నగర్ లోని టీడీపీ కార్యాలయం ( ఎన్టీఆర్ ది , బాబుది తొలి పార్టీ కార్యాలయాలు హిమాయత్ నగర్ లో దగ్గర దగ్గరే ఉన్నాయి ) ఎన్టీఆర్ భవన్ ఇవన్నీ ఒకప్పటి జ్ఞాపకాలు .
విశాలమైన , అత్యంత ఖరీదైన ఎన్టీఆర్ భవన్ అక్కడే ఉంటుంది కానీ తెలంగాణలో టీడీపీ రాజకీయాలు ఉండవు . తెలంగాణ ఉద్యమ కాలం లో టీడీపీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది .. ఇక్కడే ఉంటుంది అని బాబు చెప్పేవారు . ఇక్కడ పుట్టినా ఇప్పుడు ఆంధ్ర కే పరిమితం .
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఎదురుగా విశాలమైన స్థలం కేటాయిస్తే .. బాబు దానిని ఎన్టీఆర్ భవన్ పేరుతో టీడీపీకి కేటాయించుకున్నారు . పేరుకు ఎన్టీఆర్ విధానాల పై అధ్యయనం , ప్రచారం కోసం ఈ భవన్ అని చెప్పినా పూర్తిగా టీడీపీ కోసం భవన్ ఉండేది . తెలంగాణలో ఇప్పుడు పార్టీ లేదు . విశాలమైన ఎన్టీఆర్ భవన్ మాత్రమే మిగిలింది .
- బుద్దా మురళి
19, అక్టోబర్ 2023, గురువారం
కంట్రీ క్లబ్ లో బతుకమ్మ .. నుంచి బాబు కోసం -బతుకమ్మ పూజ వరకు జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 102-------------
కంట్రీ క్లబ్ లో బతుకమ్మ .. నుంచి బాబు కోసం -బతుకమ్మ పూజ వరకు జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 102-----------------------------
ఏమన్నా విశేషాలు ఉన్నాయా ? అని కాల్ చేస్తే మా పిల్లలు బతుకమ్మ ఆట చూద్దాం అంటే కంట్రీ క్లబ్ కు తీసుకువచ్చాను అని అటు నుంచి సమాధానం వచ్చింది . ఇప్పుడు కాదుదాదాపు రెండు దశాబ్దాల క్రితం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు .. చిత్తూరు జిల్లా నగిరికి చెందిన ఏఎం రాధాకృష్ణ ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా ఉండేవారు . ఇంటికి వెళ్లేప్పుడు టీడీపీకి సంబంధించి ఏమన్నా వార్తలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం అలవాటు . 1987లో రిపోర్టర్ గా ఉద్యోగంలో చేరాక పండుగలు , పబ్బాలు అంటూ ఏమీ లేవు . అన్ని రోజులు దాదాపు ఒకేలా గడిచిపోయేవి . 95లో హైదరాబాద్ వచ్చాక వారాంతపు సెలవు తప్ప ఏదీ గుర్తుండదు . తెలంగాణ ఉద్యమం దాదాపు అప్పుడే ప్రారంభం అయింది . బతుకమ్మ పండుగా ఎలా ఉంటుందో చూపడానికి కంట్రీ క్లబ్ తమ క్లబ్ లో బతుకమ్మ ఆడించింది . ప్రాంతం ఏదైనా కావచ్చు , పండుగలు , ఆటలు అంటే పిల్లలకు ఇష్టం. బతుకమ్మ ఆట చూపడానికి కంట్రీ క్లబ్ కు వచ్చాము అని రాధాకృష్ణ చెప్పిన తరువాత ఆలోచనలో పడిపోయాను .
బాల్యం అంతా కవాడిగూడ , బోలాక్ పూర్ , పద్మశాలి కాలనీ ల మధ్య గడిచిపోయింది . ఈ ప్రాంతాలు హుసేన్ సాగర్ కు రెండు కిలో మీటర్ల పరిధిలోనే ఉంటాయి . ఈ ప్రాంతాల్లో బాల్యంలో బతుకమ్మ సందడిగా ఆడేవారు . ఆ రోజుల్లో హుసేన్ సాగర్ ఇప్పటిలా ఉండేది కాదు . ఒకప్పుడు తాగునీటికి ఉపయోగించిన చెరువు . బట్టలు ఉతుక్కునే వారు , స్నానాలు చేయడం చూశాను . బతుకమ్మ పండుగ రోజుల్లో హుసేన్ సాగర్ కళకళ లాడేది . కవాడి గూడా , బోలాక్ పూర్ వంటి ప్రాంతలు దగ్గరే కాబట్టి బతుకమ్మ ఆడి హుసేన్ సాగర్ లో బతుకమ్మ విడిచేవారు . అక్క చెల్లెళ్ళతో చాలా సార్లు అలా వెళ్ళాను . ఏదో మంత్రం వేసి మాయం చేసినట్టు నగరంలో బతుకమ్మ మాయమైంది .గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ మొదటి నుంచి అలానే ఉన్నా నగరంలో మాయమైంది అలాంటి బతుకమ్మ ను చూడాలి అంటే చివరకు కంట్రీ క్లబ్ కు వెళ్లాలా ? అనిపించింది ... స్వతంత్ర పోరాట కాలం లో తిలక్ గణపతి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించి స్వతంత్ర పోరాటం జరిపారు . తెలంగాణ ఉద్యమానికి దీనిని స్ఫూర్తిగా తీసుకున్నారు .
*****
కవిత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలకు తిరిగి పూర్వ వైభవం లభించింది . బడుగుల బతుకమ్మ అంటూ వామపక్ష బావాలు గలవారు పోటీగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . పేరు ఏదైతేనేం బతుకమ్మ అంతటా మళ్ళీ కనిపించింది . గతంలో హైదరాబాద్ కాలనీల్లో బతుకమ్మ అంటే తెలియదు అన్నట్టు ఉండేవారు . తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పుడు కాలనీల్లో కూడా బతుకమ్మ కనిపిస్తోంది . బతుకమ్మ చూడాలి అంటే హనుమకొండ లోనే చూడాలి అనేవారు . ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు నగరంలోనూ బతుకమ్మ కనిపిస్తోంది . ఉద్యమానికి బతుకమ్మ ను ఉపయోగించుకున్నప్పుడు ప్రత్యర్థుల రాజకీయం సహజమే . బతుకమ్మ తెలంగాణ కు మాత్రమే చెందిన వేడుక కాదు విజయవాడలో కూడా ఆడుతారు అంటూ కొందరి వాదన . ఇదిగో ఆధారాలు అని కొందరు వ్యాసాలు రాస్తే , లగడ పాటి రాజ్ గోపాల్ విజయవాడలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . అప్పుడు టీడీపీలో నర్రా విజయలక్ష్మి అనే మహిళా నాయకురాలు ఉండేవారు . లగడపాటి రాజ్ గోపాల్ అన్న బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారు వెళుతున్నాను అంటూ మీడియా ముందు హడావుడి చేసి విజయవాడ వెళ్లారు . తెలంగాణ ఏర్పడిన తరువాత లగడపాటి అన్నగారు విజయలక్ష్మి చెల్లిని బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారో లేదో , చెల్లి వెళ్లారో లేదో తెలియదు . తెలంగాణ వచ్చాక విజయవాడలో లగడపాటి బతుకమ్మ వేడుకలు జరిపినట్టు వార్తలు అయితే రాలేదు .
****
తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక చంద్రబాబు , బాలకృష్ణ లు కూడా బతుకమ్మ పూజ చేశారు . బోనం ఎత్తారు . ఐనా తెలంగాణ వచ్చింది . ఉద్యమ కాలం లో ట్యాంక్ బండ్ పై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడాలని ఏర్పాట్లు చేస్తే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆడేందుకు వీలు లేదు అని ఆంక్షలు విధించింది . జాగృతి కోర్ట్ కు వెళ్లి అనుమతి తెచ్చింది . తెలంగాణ ఏర్పడిన తరువాత అదే ట్యాంక్ బండ్ పై అధికారికంగా ప్రభుత్వమే పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరిపింది . సీఎం తో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు ఆ వేడుకల్లో పాల్గొన్నారు . ***స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు . బాబు విడుదలను కోరుతూ ట్యాంక్ బండ్ పై ఈ రోజు టీడీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతున్నారు . కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . తిరుపతి వెంకన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల దేవుడే కాదు . ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ మొక్కుతారు . బతుకమ్మ అందరి పండుగ అనుకుంటే సంతోషమే .. అది గుజరాతీ పండుగా నా ? ఇది బిహారీ పండుగ , తెలంగాణ , ఆంధ్ర పండుగ అని కాదు ఎన్ని పండుగలు చేసుకునే వీలుంటే అన్ని చేసుకోవచ్చు జీవితం పండుగ మాయం అవుతుంది .
- బుద్దా మురళి
15, అక్టోబర్ 2023, ఆదివారం
కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది . జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 101
కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం
ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది .
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 101
చదువుకొనే రోజుల్లో ఒక పాట బాగా పాపులర్ . శోభన్ బాబు కారులో వెళుతుంటే వాణిశ్రీ పడుతుంది. కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ. మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. ఇదీ పాట . ఇదేమీ ప్రేమికులు పాడుకున్న డ్యూయెట్ కాదు . అక్షర సత్యం .. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . ఇప్పుడెందుకు ఈ పాట అంటే . 2013 సాధారణ ఎన్నికలకు ఈ ఉదయం 55 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే తొలుత నాగర్ కర్నూల్ నియోజక వర్గం పేరు ఆసక్తిగా చూశాను . నాగం జనార్దన్ రెడ్డి పేరుకు బదులు రాజేష్ రెడ్డి అనే పేరు కనిపించగానే .. నాగంతో రెండు దశాబ్దాల సంఘటనలు గుర్తుకు వచ్చాయి . ఆ రోజుల్లో బాబు నంబర్ వన్ ఐతే దేవేందర్ గౌడ్ , నాగం జనార్దన్ రెడ్డి నంబర్ టూ అన్నట్టుగా ఓ వెలుగు వెలిగారు . ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా ముగింపు నాకు వచ్చింది .
తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా ఉంది నాగం పరిస్థితి అని గతంలో ఓ సారి రాశాను .
రాజకీయా నాయకులు , అధికారులు , ఉద్యోగులు , వారూ వీరు అని కాదు కాలం మారుతుంది అనే విషయం , మారింది అనే విషయం అందరూ గుర్తించాలి .. లేక పోతే మరీనా పరిస్థితులను తట్టుకోలేక మానసిక ఆందోళన పాలవుతాం . అందుకే ఆ పాట గుర్తుకు వచ్చింది . ఆ పాట ఓ జర్నలిస్ట్ గా నాకూ వర్తిస్తుంది . మీకూ వర్తిస్తుంది .
************* 2004 ఎన్నికలకు ముందు మంత్రి వర్గ సమావేశం . ఆ రోజుల్లో మంత్రి వర్గ సమావేశం అంటే ఇన్ సైడ్ సమాచారం కోసం కనీసం పది మంది మంత్రులనైనా కలవాల్సి వచ్చేది . మంత్రివర్గ సమావేశం ముగిసింది అని తెలియగానే సచివాలయం లోకి వస్తూ తొలుత నాగం జనార్దన్ రెడ్డి ఛాంబర్ లోకి ఇద్దరు ముగ్గురం జర్నలిస్ట్ లం వెళ్ళాం . లోపలి వెళుతూ నాగం కనిపించగానే ఏంటీ ఈ రోజు కేబినెట్ లో ఊపేశారట ! అని పలకరిస్తే ఆయన మురిసిపోయారు . మేము వెళ్లే సరికి ఛాంబర్లో వాళ్ళ నియోజక వర్గంలోని గ్రామం వాళ్ళు ఏదో పని కోసం వచ్చి ఉన్నారు . 2004 ఫలితాలు ఎలా ఉంటాయి అని నాగం అడిగితే , ఎలాంటి అనుమానం వద్దు మీ పార్టీ ఓటమి ఖాయం అని లెక్కలు చెప్పాను ..
నువ్వు ఇలా చెబుతున్నావు కానీ , ఊరినుంచి వచ్చారు వీళ్ళతో ఇప్పుడే మాట్లాడాను గెలుస్తాం బాగుంది అంటున్నారు అని నాగం చెప్పారు .
నేను లోపలి వస్తూనే ఏమన్నాను , క్యాబినెట్ లో ఊపేశారట కదా ? అన్నాను . నిజానికి ఈ రోజు క్యాబినెట్ జరిగింది అన్న విషయం తప్ప ఎవరు వచ్చారు , ఏం మాట్లాడారు నాకేం తెలియదు . నేరుగా మీ వద్దకే వచ్చాను . కేవలం ఇన్ సైడ్ సమాచారం కోసం మీ వద్దకు వచ్చి ఊపేశారట అని పొగిడాను . ఇదేమి పైరవీ కాదు , మీరు చెప్పక పోతే ఇంకో 30 మంది మంత్రులు ఉన్నారు . ఐనా మిమ్ములను పొగిడాను . సమాచారం కోసమే నేను మిమ్ములను పొగిడినప్పుడు , మీతో పని కోసం మీ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు గెలుస్తామని చెప్పక పోతే ఓడిపోతాం అంటారా ? అని చెబితే పక పక నవ్వారు .
********
బాబు హయాంలో నంబర్ 2 గా నాగం ఓ వెలుగు వెలిగిపోతున్న కాలం లో రేవంత్ రెడ్డి తెరాస లో సాధారణ కార్యకర్త . అటు నుంచి రేవంత్ టీడీపీలోకి వచ్చారు . అప్పుడూ నాగం నంబర్ 2 నే .. తెలంగాణ ఉద్యమం ఉదృతం అవుతుండడంతో నాగం కు ఎటూ పాలుపోలేదు . తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ , రెడ్డిగా వై యస్ ఆర్ రాజశేఖర్ రెడ్డిపై ధ్వజ మెత్తుతూ టీడీపీ లో తన స్థానం సుస్థిరం అనుకున్నారు .
కోదండరాం రెడ్డి నాయకత్వంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయ్యాక ఓ రోజు నాగం తెలంగాణ రెడ్డి నాయకునిగా కోదండరాం ఎమర్జ్ అవుతున్నారు అని కంగారు పడ్డారు . తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో సభలో బాబును వ్యతిరేకించినట్టు మాట్లాడి , సంచలనం రేకెత్తించి , కొద్ది సేపు సభలో విడిగా కూర్చొని తరువాత వెళ్లి బాబు పక్కన కూర్చోగానే అదే జిల్లాకు చెందిన మరో నేత ..తిరుగుబాటు చేసిన వారు అలానే ఉండాల్సింది బాబు పక్కన కూర్చోగానే నాగం ది అయిపొయింది ఆయనకు అర్థం కావడం లేదు అన్నారు .
టీడీపీలో తాము వెలిగిపోతున్నప్పుడు కెసిఆర్ ఎక్కడో ఉన్నారు , ఆయన నాయకత్వంలో ఎలా పని చేయాలి అని అటు వెళ్ళలేదు . ఇటు కోదండరాం నాయకునిగా వెలుగులోకి వస్తున్నాడు అని తెలంగాణ పేరుతో ఉద్యమ సంస్థ ఏర్పాటు చేశారు . అటు నుంచి బిజెపి , బీజేపీలో అసంతృప్తి అటు నుంచి కాంగ్రెస్ . టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారు . ఐనా టికెట్ పై ఆశలు పెట్టుకొని అలానే ఉన్నారు . నా లాంటి నాయకుడు కెసిఆర్ నాయకత్వంలో పని చేయడం ఏమిటీ అనుకున్న నాగం చివరకు తెరాస లో చోటా నాయకుడిగా పని చేసిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక . రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లో పని చేశారు . రేవంత్ రెడ్డి టికెట్ఐ లు ఇచ్చే స్థానంలో ఉండగా .. నాగం టికెట్ అడిగే స్థానం లో ఉన్నారు . ఐనా టికెట్ దక్కలేదు .
***********
ఉద్యమ కాలం లో చాలా మంది నాయకులకు చర్చల్లో ఓ మాట చెప్పేవాడిని .
ఆంధ్రభూమిలో వెజ్ బోర్డు సిఫారసులు అమలు చేస్తారు . మంచి జీతాలు ఉంటాయి . నాకు భూమిలో దాదాపు ఏడు వేల రూపాయల జీతం వచ్చే రోజుల్లో ఏబీకే ప్రసాద్ సంపాదకునిగా సుప్రభాతం అని పక్ష పత్రిక వచ్చేది . రవిప్రకాష్ అందులో దాదాపు మూడు వేల రూపాయలకు రూపాయలకు ఉద్యోగం చేసేవారు . టివి 9 తో రవిప్రకాష్ ఎక్కడికో వెళ్లిపోయారు . భూమిలో ఏదన్నా తేడా వస్తే , ఎక్కడ ఉద్యోగం వచ్చినా చేస్తా కానీ అప్పుడు నాకు ఏడు , నీకు మూడు వేలే జీతం అంటే ఇంట్లో కూర్చోవలసి వస్తుంది అనే వాడిని . .. కాలం కారుతుంది . అలా మారుతుంది అని గ్రహించాలి , స్వీకరించాలి లేకపోతే తిరునాళ్లలో తప్పిపోయినట్టు అవుతుంది .
- బుద్దా మురళి
13, అక్టోబర్ 2023, శుక్రవారం
జర్నలిస్ట్ లారా మీరెటువైపు ? జర్నలిస్ట్ జ్ఞాపకాలు -100
జర్నలిస్ట్ లారా మీరెటువైపు ?
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -100
--------------------------------------
రచయిత లారా మీరెటు వైపు అంటూ 1970 లో వినిపించిన ప్రశ్న 53 ఏళ్ళ క్రితం సాహిత్యంలో ఓ సంచలనం . అప్పుడు నేను ఇంకా స్కూల్ లో కూడా లేను కానీ ఆ ప్రశ్న గురించి ఆ తరువాత కూడా చాలా సార్లు చదివాను . అప్పటి వివాదం , అప్పటి చర్చ లోతుల్లోకి వెళ్ళలేను కానీ .. ఈ మధ్య వచ్చిన సినిమా పాట ఆ వైపు నుంటావా ? ఈ వైపు నుంటావా అని రంగస్థలంలో రాం చరణ్ ప్రశ్నకు మూలం ఈ ప్రశ్న నే కావచ్చు . పైకి ప్రశ్న లానే ఉన్నా అందులో ఒక రకమైన బెదిరింపు కూడా ఉంది అనిపిస్తోంది . విప్లవ రచయితల సంఘం రచయిత లారా మీరెటువైపు అని అడిగిన ప్రశ్నలో మా వైపున ఉంటే ఒకే లేకుంటే అంతే అన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ చదువు చదివిన నాలాంటి వ్యక్తికి అనిపిస్తోంది .
రచయితలు అంటే కొందరు అటు కొందరు ఇటూ అన్నట్టు , మరి కొందరు ఎటో తెలియనట్టు ఉండడం వల్ల అదో సంచలనం , సమాధానం కావలసిన ప్రశ్న . మరి జర్నలిస్ట్ లారా మీరెటు అంటే ?
********************
జర్నలిస్ట్ లారా మీరెటువైపు అని ప్రశ్నిస్తే జర్నలిస్ట్ లే కాదు , పత్రికలు చదివే పాఠకులు , ఛానల్స్ చూసే ప్రేక్షకులు కూడా క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు . కొందరు మేం తటస్థులం అని నటిస్తుంటారు . ఓ నిమిషం మాట్లాడితే ఏ పార్టీ తటస్తులో తేలిపోతుంది . తెలంగాణకు చెందిన ఓ ఛానల్ ఓనర్ తెరాస , కాంగ్రెస్ బీజేపీల మధ్య పొద్దు తిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు . ఆ ఛానల్ ఓనర్ ఎటు మారితే ఛానల్ అటు మారుతుంది .
జర్నలిస్ట్ తనకు ఇష్టం వచ్చినట్టు రాస్తారు అనుకుంటాను కానీ యజమాని ఇష్టం వచ్చినట్టు రాయాలి , రాస్తారు . కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి , జీతాలు ఇచ్చి మీడియా సంస్థలను నడిపేది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకో , ప్రజల స్వేచ్ఛ కోసమో కాదు .
డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 1950 ప్రాంతంలోనే సబ్బుల వ్యాపారం ఎలానో మీడియా వ్యాపారం కూడా అంతే , దీనికి పెద్దగా విలువలు అంట గట్టకండి అన్నారు . మీడియాది వ్యాపారం అని జర్నలిస్టులకు , యజమానులకు , సంపాదకులకు , యూనియన్ నాయకులకు తెలియదా ? అంటే పాఠకులకే తెలిసినప్పుడు వారికి తెలియకుండా ఎందుకు ఉంటుంది . దేవతా వస్త్రాల కథలా అందరూ నటించేస్తుంటారు .
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు మీడియా మొత్తం వివిధ పార్టీలకు అనుబంధంగా పని చేస్తోంది .
యజమాని ఏ పార్టీకి అనుబంధంగా పని చేస్తే ఆ మీడియా జర్నలిస్ట్ తనకు నచ్చినా నచ్చక పోయినా ఆ పార్టీకి ప్రయోజనం కలిగించే కోణం లోనే పని చేయాలి .
*******
95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అనేక వార్తల్లో , వ్యాసాల్లో నేను ఆంధ్రభూమిలో వెన్నుపోటు అని రాశాను . ఆ వెన్నుపోటులో మీడియా పాత్ర కూడా ఉంది . వారి పత్రిక తరపునే కాకుండా చిత్తశుద్ధితో వెన్నుపోటు కు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు ఈ మధ్య ఒక వ్యాసంలో 95 సంఘటన ప్రస్తావిస్తూ వెన్నుపోటు అని రాశారు . అది వెన్నుపోటు అని గ్రహించడానికి ఆ జర్నలిస్ట్ కు పాతికేళ్ళు పట్టిందా ? అంటే కాదు 95లో వెన్నుపోటుకు సహకరించిన మీడియాలో ఉన్నారు . పాతికేళ్ల తరువాత వెన్నుపోటు అని రాసినప్పుడు జగన్ మీడియాలో ఉన్నారు .
నేను వెన్నుపోటు అని రాశాను అని స్వతంత్రంగా రాశాను అని కాలరెగిరిస్తే ఓ జర్నలిస్ట్ మిత్రుడు అది మీ పత్రిక పాలసీ కాబట్టి అలా రాయగలిగావు అంతే తప్ప అది మీ మీడియా ఇచ్చిన స్వేచ్ఛ కాదు అంటే ఆలోచిస్తే అతని వాదనలో కూడా నిజం ఉంది అనిపించింది . ఒక్కో సారి యజమాని జర్నలిస్ట్ ఒకే కోణం లో ఉంటే అదృష్టమే . బాబు వెన్నుపోటు సమయంలో మేనేజ్ మెంట్ , ఎడిటర్ , నేనూ వెన్నుపోటు అనే భావించడం వల్ల రాతలకు ఇబ్బంది కలుగలేదు . 2001 తెలంగాణ ఉద్యమం వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది . నేనేమో తెలంగాణ కోరుకున్న వాడిని , యాజమాన్యం కొన్ని కారణాల వల్ల మనం సమైక్యాంధ్ర అంది . ఎడిటర్ తెలంగాణ అనే మాట వినడానికే ఇష్టపడని వారు . ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎడిట్ పేజీలో వారం వారం రాసే పొలిటికల్ కాలం లో ధైర్యం చేసి తెలంగాణ ఎందుకు అవసరమో రాశాను . అది పబ్లిష్ అయ్యాక ఆఫీస్ లో తెలంగాణ మిత్రులు మెల్లగా ఏంటీ మన పత్రికలో తెలంగాణ గురించి అని మెల్లగా అభినందించి వెళ్లేవారు ... ముందుగా ఊహించినట్టుగానే ఎడిటర్ నుంచి ఫోన్ .. అక్షింతలు .. ఇంకోసారి నాకు చూపకుండా పంపవద్దు అని వార్నింగ్ .. నిజానికి నేను అంతకన్నా ఎక్కువ నష్టానికి మానసికంగా సిద్దమై ఉన్నాను . ఉద్యమం ఉదృతం అయ్యాక తెలంగాణ గురించి రాసుకొనే అవకాశం లభించింది . ఎడిటర్ సమైక్యాంధ్ర కోసం రాస్తే నేను తెలంగాణ కోసం రాశాను . పత్రికల్లో కొంత మేరకు యాజమాన్యం స్వేచ్ఛ ప్రసాదించినా , మాకు వద్దంటే వద్దు అని ఎడిటర్ , యజమాని ఏం కోరుకుంటే అదే రాద్దాం అనుకునేవాళ్లనూ చూశాను . 95లో వెన్నుపోటు గురించి రాసే అవకాశం భూమిలో ఉన్నా చాలా మంది ఉపయోగించుకోలేదు . అలానే తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక రాసే అవకాశం ఉన్నా స్వేచ్ఛను ఉపయోగించుకొని వారు ఉన్నారు . ఎడిటర్ పేపర్ కు తానే ఓనర్ అన్నట్టు వ్యవహరించేవారు .. ఆంధ్రభూమి యాజమాన్యం పెద్దగా జోక్యం చేసుకునేది కాదు . దీనివల్ల కొంత వరకు రాయాలన్నది రాసే అవకాశం లభించింది ...
*****************
రాష్ట్ర విభజన తరువాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊహించని విధంగా మీడియా రాజకీయ పార్టీలను మించి రాజకీయ అభిమానం చూపుతోంది . బాబు అరెస్ట్ తరువాత ఛానల్స్ లో కొందరు యాంకర్లు మాట్లాడుతున్న మాటలు పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడలేరు . పార్టీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు సైతం యాంకర్ల పార్టీ భక్తి చూసి ఈర్ష పడేట్టుగా ఉంది . రెండు రాష్ట్రాల్లో కూడా మొత్తం మీడియా రాజకీయ పార్టీలకు అనుబంధంగానే ఉంది . కొన్ని మీడియాలను ఏకంగా పార్టీలే నడుపుతుంటే , కూని మీడియాలేమో పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి . సొంతంగా పార్టీలు నడిపే మీడియా పార్టీకి శాశ్వతంగా కట్టుబడి ఉంటుంది . పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా పార్టీ మారదనే నమ్మకం లేదు . మారుతూ ఉంటుంది .
రాజకీయ పార్టీల్లో , మావోయిస్టుల్లో కోవర్ట్ లు ఉన్నట్టే మీడియాలో కూడా కోవర్ట్ లు ఉంటారు . ఒక పార్టీ మీడియాలో ఉంటూ ప్రత్యర్థి పార్టీ కి సమాచారం చేరవేస్తారు . ఆ మధ్య ప్రభూత్వ ఉద్యోగులను ఓ మీడియా యజమాని బాబు ముందే తిడుతుంటే రికార్డ్ అయి బయటకు వచ్చింది ఇలానే . ఆ వీడియో టీడీపీకి కలిగించింది .
***********
జాతీయ స్థాయిలో కొన్ని మీడియాలను బీజేపీ మరి కొన్నింటిని కాంగ్రెస్ బహిష్కరించింది . దానితో కాంగ్రెస్ సానుభూతి పరులు అంటూ ఎవరో ఒకరిని డిబేట్ లో కూర్చోబెట్టి చర్చ రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు . రాహుల్ గాంధీ అదానీ పై ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే , దానిని ప్రశ్నలతో రసాభాస చేయమని ndtv ఒక జర్నలిస్ట్ ను పంపితే , అతను నా వల్ల కాదు అని రాజీనామా చేశారు . మేనేజ్ మెంట్ చెప్పినట్టు చేస్తేనే ఉద్యోగం లేదంటే బయటకు వెళ్ళాలి .
సామాజిక మాధ్యమాల పుణ్యమా ? అని మీడియా లోని వ్యవహారాలు బయటకులు వస్తున్నాయి . ప్రతి మీడియాకు రాజకీయ అనుబంధం ఉంది .. కొందరు అనుబంధం కోసం పార్టీలకు దరఖాస్తు చేసుకున్నా వీరికి అంత సీన్ లేదు అని పార్టీలు పట్టించుకోవడం లేదు .
గతం లో ఓ కొత్త మీడియా వస్తుందే అంటే ఎడిటర్ ఎవరు ? అనే ప్రశ్న వినిపించేది .. ఇప్పుడు ఓనర్ ఏ పార్టీ అనే ప్రశ్న వినిపిస్తుంది .
- బుద్దా మురళి
11, అక్టోబర్ 2023, బుధవారం
ఎన్నికల ఖర్చు మాయాజాలం ఒక్కరూ పాటించరు .. ఒక్కరిదీ రుజువు కాదు..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -99
ఎన్నికల ఖర్చు మాయాజాలం
ఒక్కరూ పాటించరు .. ఒక్కరిదీ రుజువు కాదు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -99
------------------------------
2009 - 10 కాలం లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి . తెలుగుదేశం శాసన సభా పక్షం కార్యాలయం వద్ద నిలబడి కడప జిల్లాకు చెందిన శాసన సభ్యులు లింగారెడ్డి నేనూ ఏదో మాట్లాడుకుంటుంటే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ శాసన సభ్యులు రాజు అని గుర్తు ఆవేశంగా సభ నుంచి వస్తూ ఇలాంటి వారున్న సభలో నేను శాసన సభ్యునిగా ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను అని ఆవేశంగా ప్రకటించారు . ఏ మైంది అని పలకరిస్తే జగన్ వేల కోట్ల అవినీతి , అలాంటి అవినీతి పరుని గురించి సభలో చర్చ - విలువలు ఎక్కడికి పోతున్నాయి .. ఇలాంటి వారున్న సభలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను - సంక్షిప్తంగా ఇదీ అతని ఆవేదన . అతనికి నన్ను నేను పరిచయం చేసుకొని , మీ జేబులో ఉన్న ఒక్క రూపాయి గురించి కూడా అడిగే అధికారం నాకు లేదు . కానీ మనం విలువల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాను . మీకు ఇష్టం అయితే చెప్పండి ఎన్నికల్లో మీరు ఎంత ఖర్చు చేశారు అని అడిగాను . అతను కాసేపు అలానే ఉండి పోయి , ఐతే అవినీతి గురించి ప్రశ్నించే హక్కు నాకు లేదా అని అడిగారు . అది కాదు ఎన్నికల్లో నిబంధనల మేరకే ఖర్చు చేసిన వారు ఎవరైనా ఉన్నారా ? అని నాకు పరిచయం అయిన అందరినీ అడుగుతున్నాను , తెలుసుకోవాలి అని ఆసక్తి అంతే అన్నాను . చెప్పు పరవాలేదు , మురళి మన ఫ్రెండే అని లింగా రెడ్డి తాను ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో చెప్పారు . ఎక్కువ ఖర్చు చేస్తే అవినీతిని ప్రశ్నించే హక్కు లేదా అని ఆ రాజుగారు మళ్ళీ అడిగారు . ఇలాంటి సభలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను అన్నారు కదా ? నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఖర్చు చేసిన మీకు నైతికంగా అసలు సభలోకి వెళ్లే హక్కే లేదు . డబ్భు లేని వ్యక్తి సభ లోకి వెళ్లలేక పోయారు , డబ్బు ఎక్కువ ఖర్చు చేసి మీరు వెళ్లారు . మీ సభా ప్రవేశమే అనైతికం .. మీరే ఏ ఒక్కరు కూడా నిబంధనల మేరకు ఖర్చు చేయరు అని చెప్పాను . విచిత్రం యేమిటంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నిబంధనల మేరకు ఖర్చు చేయరు . ఇలా ఎక్కువ ఖర్చు చేశారు అని ఒక్కరంటే ఒక్కరి విషయంలోనూ రుజువుకాలేదు , రుజువు చేయలేరు .
ఉమ్మడి రాష్ట్రంలో ఆసక్తితో దాదాపు 50-60 మందిని ఖర్చు గురించి అడిగి నిర్ధారించుకున్నాను . వార్త రాయడం కోసం కాదు ఆసక్తి కొద్ది తెలుసు కోవాలి అని అడుగుతున్నాను అంటే చాలా మంది చెప్పారు . తరువాత తెలంగాణ ఉద్యమం , అంతటా ఉద్రిక్త వాతావరణం వల్ల ఎన్నికల ఖర్చు గురించి మనసు విప్పి మేట్లడుకోలేదు . 294 మందిని ఖర్చు గురించి అడగలిగాని ఉండేది . 50-60 మందితోనే ఆగిపోయాను .
*********
రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వార్త టివి లో చూస్తుంటే ... ఆ వెంటనే మరో ఆసక్తికరమైన వార్త .. ఖమ్మం జిల్లాలో లో ఓ వ్యక్తి డబ్బు తీసుకోని వెళుతుంటే తనిఖీ చేస్తున్న పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు . ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చినందున ప్రజాస్వామ్యాన్ని ధన స్వామ్యం నుంచి కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారన్నమాట . ఎన్నికల కమిషన్ చాలా సేపు మీడియాతో మాట్లాడింది . అది పూర్తి కాక ముందే టివి ముందు నుంచి రంగంలోకి దిగిన పోలీసుల ఉత్సాహాన్ని చూశాక మన ప్రజాస్వామ్యం పోలీసుల వల్ల భద్రంగా ఉంది అనిపించింది .
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంత ఖర్చు చేయవచ్చునో తెలుసా ?
2014 వరకు అయితే 28 లక్షలు , 2022 లో పెంచిన దాని ప్రకారం ఇప్పుడు 40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు . జోక్ కాదు నిజం అందరూ ఇంతే ఖర్చు చేస్తారు , చేయాలి .
ఇంతకన్నా ఎక్కువ ఖర్చు చేసినట్టు తేలితే శాసన సభ్యత్వం రద్దు అవుతుంది .
దేశంలో ఏ ఒక్కరు కూడా ఈ పరిధికి లోబడే ఖర్చు చేయడం సాధ్యం కాదు . అలా అని పరిధికి మించి ఖర్చు చేశారు అని ఒక్కరి విషయంలోనూ రుజువు చేయడం సాధ్యం కాదు . ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థి కూడా పరిమితిని మించి ఖర్చు చేశాడు అని రుజువు కాలేదు . .ఆ మధ్య యనమల రామకృష్ణులు ఓ టివి ఇంటర్వ్యూలో ఎన్నికల్లో తాను చేసిన భారీ ఖర్చు గురించి చెప్పారు . అది విని వైయస్ ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో తెగ హడావుడి చేశారు . యనమల పని అయిపోయినట్టే ఇదిగో ఆధారం అని .. తరువాత ఏమైందో ఎవరూ పట్టించుకోలేదు .
నామినేషన్ దాఖలు చేసే ఒక్క రోజే ఇంతకు మూడింతలు ఖర్చు అవుతుంది .
******
ఢిల్లీలో ఎన్నికల కమిషన్ మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు రంగంలోకి దిగి దారులను దిగ్భందం చేసి వెతికితే నోట్ల కట్టలు దొరుకుతాయి . మీడియాలో బోలెడు ప్రచారం . బేగం బజార్ లో నిలబడి వాహనాలు వెతికితే రోజుకు కొన్ని కోట్లు దొరుకుతాయి . అలా డబ్బులు తీసుకువెళ్లే వారు ఎన్నికల్లో పంచడానికి కాదు . వారికి కనీసం ఎన్నికల షెడ్యూల్ వచ్చింది అని కూడా తెలియదు . బేగం బజార్ లో రోజూ నగదు రూపంలోనే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది . ఒక్క బేగం బజార్ అనే కాదు ఇలా తనిఖీల్లో దొరికే డబ్బు కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి సంబంధం ఉండదు . వ్యాపారాలు , వ్యక్తిగత అవసరాల కోసం అలా డబ్బు తీసుకువెళుతున్న వారే వారంతా .. ఇంకా వివిధ పార్టీల అభ్యర్థులే తేలనప్పుడు ఎవరు ఎవరికి పంచుతారు డబ్బులు .
2004 , 2009 ఎన్నికల్లో కొందరు ఏకంగా రెడీ మెడ్ సిమెంట్ మిక్సర్ భారీ వాహనాల్లో కూడా డబ్బు పంపినట్టు ఎన్నికలల్లో చురుగ్గా పాల్గొన్న వారు ఎన్నికలు అయ్యాక చెప్పిన మాట .
ఎన్నికల సంస్కరణలు అంటే చాలా మంది శేషన్ పేరు గుర్తు చేసుకుంటారు . ఒకరు మరో కోణంలో చూశారు . శేషన్ కన్నా ముందు గోడల మీద రాతలతో తక్కువ ఖర్చుతో ప్రచారం జరిగేది . శేషన్ పుణ్యమా అని గోడమీద రాతలు మాయం ఆయాయ్యి కానీ ఖర్చు భారీగా పెరిగింది .
ఎన్నికల ఖర్చు రాసి , ఆడిట్ చేసి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలి .
ఎన్నికల ఖర్చు పరిమితిలో సగం ఈ ఆడిటర్ పీజుకే కేసరిపోతుందేమో ..
- బుద్దా మురళి
5, అక్టోబర్ 2023, గురువారం
ఆ నేత మరణం తీరని లోటు ... జర్నలిస్ట్ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది .. ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 98
ఆ నేత మరణం తీరని లోటు ... జర్నలిస్ట్ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది ..
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 98
----------------------------------------
ఎవరైనా రాజకీయ నాయకుడు మరణిస్తే .. ఆ వార్తలు చదివితే పత్రిక ఏదైనా కావచ్చు , నాయకుడు ఎవరైనా కావచ్చు , ప్రకటన ఇచ్చింది ఎవరైనా కావచ్చు ఒక వాఖ్యం అన్నింటిలో కామన్ గా కనిపిస్తుంది . ఆ నాయకుడి మరణం తీరని లోటు అనే మాట లేకుండా వార్త ఉండదు . అలానే జర్నలిస్ట్ మరణిస్తే సిటీ పేజీలో , జిల్లాల్లో ఐతే జిల్లా పేజీలో తప్పని సరిగా కనిపించే మాట . మరణించిన కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది . ఆ మాట చదవగానే వైరాగ్యంతో కూడిన నవ్వు వస్తుంది .
********
1993 నాటి మాట .. 30 ఏళ్ళ క్రితం నల్లగొండ జిల్లా లో ఆంధ్రభూమి రిపోర్టర్ గా చేస్తున్నప్పుడు మిర్యాలగూడలో యూనియన్ సమావేశం . హైదరాబాద్ నుంచి యూనియన్ రాష్ట్ర నాయకులు రావాలి . ఆలస్యం అవుతోంది . వారు వచ్చే వరకు మౌనంగా ఉండలేరు కదా ? అప్పటి వరకు జిల్లా స్టాప్ రిపోర్టర్ లు మాట్లాడితే బాగుంటుంది అని సలహా ఒకరి తరువాత ఒకరు మాట్లాడుతున్నారు . నన్నూ మాట్లాడమన్నారు. అప్పటివరకు మాట్లాడిన అనుభవం లేదు . నాలుగు మంచి మాటలు చెప్పేందుకు ఇబ్బంది ఏముంది అని మైకు తీసుకోని .... మీరు ఫుల్ టైం పని చేయాల్సిన స్టాఫ్ రిపోర్టర్ లు కాదు , పార్ట్ టైం పని చేయాల్సిన లోకల్ విలేకరులు . మా ఏరియానే ప్రపంచం , ప్రపంచాన్ని మేమే శాసిస్తున్నాం అనే భావన వద్దు . మేనేజ్ మెంట్ కు కోపం వచ్చినా , ఎవరికి కోపం వచ్చినా మీ పార్ట్ టైం ఉద్యోగానికి భరోసా ఉండదు . పైగా మీకు వచ్చే డబ్బు అంతంత మాత్రమే . ఇది పార్ట్ టైం అని గుర్తుంచుకొని , ఏదైనా ఉపాధి మార్గం చూసుకోవాలి . ఒకరికి చేయి చాపే స్థితిలో ఉండకూడదు . ఆ నాయకుడు తెలుసు , ఈ నాయకుడు తెలుసు అని చెప్పుకోవడానికి బాగుంటుంది , అవేవి జీవితానికి ఉపయోగపడవు . నీ జీవితం నీకు ముఖ్యం . అందరూ నమస్తే అన్నా అంటున్నారని మురిసిపోవడం కాదు . జీవితానికి ఉపయోగపడే ఉపాధి చూసుకొని , పార్ట్ టైం విలేఖరులుగా ఏదో ఆసక్తి ఉంటే పని చేయండి. చాలా మంది మరణిస్తే అంత్యక్రియలకు చందాలు వసూలు చేయడం చూశాను . ఉపాధి చూసుకోవడం , ఉపాధి పొందే నైపుణ్యం పెంచుకోవడం ముఖ్యం అంటూ ఉపన్యాసం ఇస్తున్నాను ... నేను అలా మాట్లాడుతుండగానే రాష్ట్ర నాయకులు వచ్చారు . నా ఉపన్యాసంలో కొంత విన్నారు . ఎంత విన్నా ఏదో ఒక ఉపాధి చూసుకోండి అనే మాటనే తిప్పి తిప్పి చెప్పాను ..
రాష్ట్ర నాయకులు వస్తూనే ఇది జర్నలిస్ట్ ల యూనియన్ మీటింగ్ హక్కుల కోసం పోరాటాల గురించి ఉపన్యాసాలు ఉండాలి , ఉపాధి గురించి కాదు అని నాకు ఓ చురక అంటించారు..
ఆ తరువాత జర్నలిస్ట్ అంటే ఏమిటీ ? యూనియన్ ఏమిటీ ? ఉద్యమాలు , త్యాగాలు అంటూ యూనియన్ నాయకులు బాగా మాట్లాడారు . నాకూ నిజమే అనిపించింది .
ఆ సమావేశం చివరలో విరాళాలు వసూలు చేశారు . స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ ఒకరు మరణించారు . అంత్యక్రియలు , తక్షణం కుటుంబం గడవడానికి ఏమీ లేదు . దానితో విరాళాలు వసూలు చేశారు .అప్పుడు యూనియన్ నాయకుడి ఉపన్యాసం నాకూ బాగానే నచ్చింది కానీ .. జర్నలిజం అంటే , యూనియన్ అంటే ఏమిటో అద్భుతంగా మాట్లాడిన ఆ యూనియన్ నాయకుడికి చాలానే సైడ్ బిజినెస్ లు ఉన్నాయని ఒకటి రెండు దశాబ్దాల తరువాత కానీ నాకు తెలియలేదు .
**************
మూడు దశాబ్దాల క్రితం నాటితో పోలిస్తే ఇప్పుడు అంత అమాయకులేం లేరు . చాలా మంది స్థానిక విలేకరులు కూడా ముదిరిపోయారు . అలానే చాలా మంది ఊబిలో చిక్కుకు పోయినట్టు అక్కడే ఉండిపోతున్నారు . అక్కడ ఉండలేరు , బయటకు రాలేరు . ఒక్క సారి ఆ గౌరవానికి , నాయకుల నుంచి అన్నా అనే పిలుపునకు అలవాటు పడి అక్కడే కొట్టుమిట్టాడే వారు ఉన్నారు . ఒక ఉద్యోగం లా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్న వారూ ఉంటే ఉండొచ్చు ...
**************
*********
1995-96 లో ఓ రోజు సచివాలయం నుంచి ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వస్తూ ట్యాంక్ బండ్ పై కాసేపు ఆగాను . బైక్ మీద ప్రెస్ అని చూసి ఓ పెద్దాయన వచ్చి ఏ పేపర్ అని అడిగారు . ఆంధ్రభూమి అని చెబితే సీరియస్ గా మీ జర్నలిస్ట్ లను అస్సలు నమ్మొద్దు అని ఏదో గొణిగాడు . ఏమైంది అంటే ఆంధ్రభూమిలో బాబురావు అని జర్నలిస్ట్ ఉండేవారు . అయన మరణించినప్పుడు ఆంధ్రభూమి జర్నలిస్ట్ లు చాలా మంది ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారట ... తరువాత ఎవరూ పట్టించుకోలేదు . ఇదీ ఆయన కోపానికి కారణం .. ఎవడి బతుకు వాడికే కష్టం .. ఇంకా ఇతరుల కుటుంబాలను పట్టించుకునేంత , అండగా ఉండే అంత ఉంటుందా ? ఏదో మాట వరుసకు అలా అంటారు .
******************
నగరంలో లోకల్ విలేకరి ఒకరు మరణించిన వార్తలో .. ఆ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది అనే వార్త చదివాక మిర్యాలగూడ మీటింగ్ , ట్యాంక్ బండ్ సంఘటన గుర్తుకు వచ్చింది.
ఎప్పటిలానే మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది అని ప్రకటించారు . ఎవరికి ఎవరు అండగా ఉండలేరు . ఎవరి బతుకు వారికే సమస్య కనీసం ఇప్పుడు మీడియా అకాడెమీ ఆర్ధిక సహాయం చేస్తోంది . గతంలో అదికూడా లేదు .
*****
నాయకుడు మరణించినా , సినిమా వాళ్ళు మరణించినా వారి మరణం తీరని లోటు అనేది కామన్ డైలాగు . ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మాజీ సీఎం ఒకరు మరణిస్తే ఆఫీస్ లో ఉండగా ఫోన్ రింగ్ అయింది . వి . హనుమంతరావు ఫోన్ చేసి కాంగ్రెస్ రిపోర్టర్ గురించి అడిగితే ఇంకా రాలేదు అని చెబితే సంతాపంలో నాదీ రాసేసుకో .. తెలుసు కదా తీరని లోటు అని రాయి అని ఒక్క ముక్కలో ముగించేశారు .
**************
ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబానికే తీరని లోటు .. ఆ సంగతి జర్నలిస్ట్ మిత్రులు బతికి ఉండగా గ్రహించాలి అని ఆశ ...
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)