19, అక్టోబర్ 2023, గురువారం
కంట్రీ క్లబ్ లో బతుకమ్మ .. నుంచి బాబు కోసం -బతుకమ్మ పూజ వరకు జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 102-------------
కంట్రీ క్లబ్ లో బతుకమ్మ .. నుంచి బాబు కోసం -బతుకమ్మ పూజ వరకు జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 102-----------------------------
ఏమన్నా విశేషాలు ఉన్నాయా ? అని కాల్ చేస్తే మా పిల్లలు బతుకమ్మ ఆట చూద్దాం అంటే కంట్రీ క్లబ్ కు తీసుకువచ్చాను అని అటు నుంచి సమాధానం వచ్చింది . ఇప్పుడు కాదుదాదాపు రెండు దశాబ్దాల క్రితం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు .. చిత్తూరు జిల్లా నగిరికి చెందిన ఏఎం రాధాకృష్ణ ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా ఉండేవారు . ఇంటికి వెళ్లేప్పుడు టీడీపీకి సంబంధించి ఏమన్నా వార్తలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం అలవాటు . 1987లో రిపోర్టర్ గా ఉద్యోగంలో చేరాక పండుగలు , పబ్బాలు అంటూ ఏమీ లేవు . అన్ని రోజులు దాదాపు ఒకేలా గడిచిపోయేవి . 95లో హైదరాబాద్ వచ్చాక వారాంతపు సెలవు తప్ప ఏదీ గుర్తుండదు . తెలంగాణ ఉద్యమం దాదాపు అప్పుడే ప్రారంభం అయింది . బతుకమ్మ పండుగా ఎలా ఉంటుందో చూపడానికి కంట్రీ క్లబ్ తమ క్లబ్ లో బతుకమ్మ ఆడించింది . ప్రాంతం ఏదైనా కావచ్చు , పండుగలు , ఆటలు అంటే పిల్లలకు ఇష్టం. బతుకమ్మ ఆట చూపడానికి కంట్రీ క్లబ్ కు వచ్చాము అని రాధాకృష్ణ చెప్పిన తరువాత ఆలోచనలో పడిపోయాను .
బాల్యం అంతా కవాడిగూడ , బోలాక్ పూర్ , పద్మశాలి కాలనీ ల మధ్య గడిచిపోయింది . ఈ ప్రాంతాలు హుసేన్ సాగర్ కు రెండు కిలో మీటర్ల పరిధిలోనే ఉంటాయి . ఈ ప్రాంతాల్లో బాల్యంలో బతుకమ్మ సందడిగా ఆడేవారు . ఆ రోజుల్లో హుసేన్ సాగర్ ఇప్పటిలా ఉండేది కాదు . ఒకప్పుడు తాగునీటికి ఉపయోగించిన చెరువు . బట్టలు ఉతుక్కునే వారు , స్నానాలు చేయడం చూశాను . బతుకమ్మ పండుగ రోజుల్లో హుసేన్ సాగర్ కళకళ లాడేది . కవాడి గూడా , బోలాక్ పూర్ వంటి ప్రాంతలు దగ్గరే కాబట్టి బతుకమ్మ ఆడి హుసేన్ సాగర్ లో బతుకమ్మ విడిచేవారు . అక్క చెల్లెళ్ళతో చాలా సార్లు అలా వెళ్ళాను . ఏదో మంత్రం వేసి మాయం చేసినట్టు నగరంలో బతుకమ్మ మాయమైంది .గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ మొదటి నుంచి అలానే ఉన్నా నగరంలో మాయమైంది అలాంటి బతుకమ్మ ను చూడాలి అంటే చివరకు కంట్రీ క్లబ్ కు వెళ్లాలా ? అనిపించింది ... స్వతంత్ర పోరాట కాలం లో తిలక్ గణపతి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించి స్వతంత్ర పోరాటం జరిపారు . తెలంగాణ ఉద్యమానికి దీనిని స్ఫూర్తిగా తీసుకున్నారు .
*****
కవిత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలకు తిరిగి పూర్వ వైభవం లభించింది . బడుగుల బతుకమ్మ అంటూ వామపక్ష బావాలు గలవారు పోటీగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . పేరు ఏదైతేనేం బతుకమ్మ అంతటా మళ్ళీ కనిపించింది . గతంలో హైదరాబాద్ కాలనీల్లో బతుకమ్మ అంటే తెలియదు అన్నట్టు ఉండేవారు . తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పుడు కాలనీల్లో కూడా బతుకమ్మ కనిపిస్తోంది . బతుకమ్మ చూడాలి అంటే హనుమకొండ లోనే చూడాలి అనేవారు . ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు నగరంలోనూ బతుకమ్మ కనిపిస్తోంది . ఉద్యమానికి బతుకమ్మ ను ఉపయోగించుకున్నప్పుడు ప్రత్యర్థుల రాజకీయం సహజమే . బతుకమ్మ తెలంగాణ కు మాత్రమే చెందిన వేడుక కాదు విజయవాడలో కూడా ఆడుతారు అంటూ కొందరి వాదన . ఇదిగో ఆధారాలు అని కొందరు వ్యాసాలు రాస్తే , లగడ పాటి రాజ్ గోపాల్ విజయవాడలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . అప్పుడు టీడీపీలో నర్రా విజయలక్ష్మి అనే మహిళా నాయకురాలు ఉండేవారు . లగడపాటి రాజ్ గోపాల్ అన్న బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారు వెళుతున్నాను అంటూ మీడియా ముందు హడావుడి చేసి విజయవాడ వెళ్లారు . తెలంగాణ ఏర్పడిన తరువాత లగడపాటి అన్నగారు విజయలక్ష్మి చెల్లిని బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారో లేదో , చెల్లి వెళ్లారో లేదో తెలియదు . తెలంగాణ వచ్చాక విజయవాడలో లగడపాటి బతుకమ్మ వేడుకలు జరిపినట్టు వార్తలు అయితే రాలేదు .
****
తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక చంద్రబాబు , బాలకృష్ణ లు కూడా బతుకమ్మ పూజ చేశారు . బోనం ఎత్తారు . ఐనా తెలంగాణ వచ్చింది . ఉద్యమ కాలం లో ట్యాంక్ బండ్ పై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడాలని ఏర్పాట్లు చేస్తే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆడేందుకు వీలు లేదు అని ఆంక్షలు విధించింది . జాగృతి కోర్ట్ కు వెళ్లి అనుమతి తెచ్చింది . తెలంగాణ ఏర్పడిన తరువాత అదే ట్యాంక్ బండ్ పై అధికారికంగా ప్రభుత్వమే పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరిపింది . సీఎం తో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు ఆ వేడుకల్లో పాల్గొన్నారు . ***స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు . బాబు విడుదలను కోరుతూ ట్యాంక్ బండ్ పై ఈ రోజు టీడీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతున్నారు . కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . తిరుపతి వెంకన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల దేవుడే కాదు . ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ మొక్కుతారు . బతుకమ్మ అందరి పండుగ అనుకుంటే సంతోషమే .. అది గుజరాతీ పండుగా నా ? ఇది బిహారీ పండుగ , తెలంగాణ , ఆంధ్ర పండుగ అని కాదు ఎన్ని పండుగలు చేసుకునే వీలుంటే అన్ని చేసుకోవచ్చు జీవితం పండుగ మాయం అవుతుంది .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం