15, అక్టోబర్ 2023, ఆదివారం

కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది . జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 101

కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది . జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 101 చదువుకొనే రోజుల్లో ఒక పాట బాగా పాపులర్ . శోభన్ బాబు కారులో వెళుతుంటే వాణిశ్రీ పడుతుంది. కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ. మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. ఇదీ పాట . ఇదేమీ ప్రేమికులు పాడుకున్న డ్యూయెట్ కాదు . అక్షర సత్యం .. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . ఇప్పుడెందుకు ఈ పాట అంటే . 2013 సాధారణ ఎన్నికలకు ఈ ఉదయం 55 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే తొలుత నాగర్ కర్నూల్ నియోజక వర్గం పేరు ఆసక్తిగా చూశాను . నాగం జనార్దన్ రెడ్డి పేరుకు బదులు రాజేష్ రెడ్డి అనే పేరు కనిపించగానే .. నాగంతో రెండు దశాబ్దాల సంఘటనలు గుర్తుకు వచ్చాయి . ఆ రోజుల్లో బాబు నంబర్ వన్ ఐతే దేవేందర్ గౌడ్ , నాగం జనార్దన్ రెడ్డి నంబర్ టూ అన్నట్టుగా ఓ వెలుగు వెలిగారు . ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా ముగింపు నాకు వచ్చింది . తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా ఉంది నాగం పరిస్థితి అని గతంలో ఓ సారి రాశాను . రాజకీయా నాయకులు , అధికారులు , ఉద్యోగులు , వారూ వీరు అని కాదు కాలం మారుతుంది అనే విషయం , మారింది అనే విషయం అందరూ గుర్తించాలి .. లేక పోతే మరీనా పరిస్థితులను తట్టుకోలేక మానసిక ఆందోళన పాలవుతాం . అందుకే ఆ పాట గుర్తుకు వచ్చింది . ఆ పాట ఓ జర్నలిస్ట్ గా నాకూ వర్తిస్తుంది . మీకూ వర్తిస్తుంది . ************* 2004 ఎన్నికలకు ముందు మంత్రి వర్గ సమావేశం . ఆ రోజుల్లో మంత్రి వర్గ సమావేశం అంటే ఇన్ సైడ్ సమాచారం కోసం కనీసం పది మంది మంత్రులనైనా కలవాల్సి వచ్చేది . మంత్రివర్గ సమావేశం ముగిసింది అని తెలియగానే సచివాలయం లోకి వస్తూ తొలుత నాగం జనార్దన్ రెడ్డి ఛాంబర్ లోకి ఇద్దరు ముగ్గురం జర్నలిస్ట్ లం వెళ్ళాం . లోపలి వెళుతూ నాగం కనిపించగానే ఏంటీ ఈ రోజు కేబినెట్ లో ఊపేశారట ! అని పలకరిస్తే ఆయన మురిసిపోయారు . మేము వెళ్లే సరికి ఛాంబర్లో వాళ్ళ నియోజక వర్గంలోని గ్రామం వాళ్ళు ఏదో పని కోసం వచ్చి ఉన్నారు . 2004 ఫలితాలు ఎలా ఉంటాయి అని నాగం అడిగితే , ఎలాంటి అనుమానం వద్దు మీ పార్టీ ఓటమి ఖాయం అని లెక్కలు చెప్పాను .. నువ్వు ఇలా చెబుతున్నావు కానీ , ఊరినుంచి వచ్చారు వీళ్ళతో ఇప్పుడే మాట్లాడాను గెలుస్తాం బాగుంది అంటున్నారు అని నాగం చెప్పారు . నేను లోపలి వస్తూనే ఏమన్నాను , క్యాబినెట్ లో ఊపేశారట కదా ? అన్నాను . నిజానికి ఈ రోజు క్యాబినెట్ జరిగింది అన్న విషయం తప్ప ఎవరు వచ్చారు , ఏం మాట్లాడారు నాకేం తెలియదు . నేరుగా మీ వద్దకే వచ్చాను . కేవలం ఇన్ సైడ్ సమాచారం కోసం మీ వద్దకు వచ్చి ఊపేశారట అని పొగిడాను . ఇదేమి పైరవీ కాదు , మీరు చెప్పక పోతే ఇంకో 30 మంది మంత్రులు ఉన్నారు . ఐనా మిమ్ములను పొగిడాను . సమాచారం కోసమే నేను మిమ్ములను పొగిడినప్పుడు , మీతో పని కోసం మీ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు గెలుస్తామని చెప్పక పోతే ఓడిపోతాం అంటారా ? అని చెబితే పక పక నవ్వారు . ******** బాబు హయాంలో నంబర్ 2 గా నాగం ఓ వెలుగు వెలిగిపోతున్న కాలం లో రేవంత్ రెడ్డి తెరాస లో సాధారణ కార్యకర్త . అటు నుంచి రేవంత్ టీడీపీలోకి వచ్చారు . అప్పుడూ నాగం నంబర్ 2 నే .. తెలంగాణ ఉద్యమం ఉదృతం అవుతుండడంతో నాగం కు ఎటూ పాలుపోలేదు . తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ , రెడ్డిగా వై యస్ ఆర్ రాజశేఖర్ రెడ్డిపై ధ్వజ మెత్తుతూ టీడీపీ లో తన స్థానం సుస్థిరం అనుకున్నారు . కోదండరాం రెడ్డి నాయకత్వంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయ్యాక ఓ రోజు నాగం తెలంగాణ రెడ్డి నాయకునిగా కోదండరాం ఎమర్జ్ అవుతున్నారు అని కంగారు పడ్డారు . తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో సభలో బాబును వ్యతిరేకించినట్టు మాట్లాడి , సంచలనం రేకెత్తించి , కొద్ది సేపు సభలో విడిగా కూర్చొని తరువాత వెళ్లి బాబు పక్కన కూర్చోగానే అదే జిల్లాకు చెందిన మరో నేత ..తిరుగుబాటు చేసిన వారు అలానే ఉండాల్సింది బాబు పక్కన కూర్చోగానే నాగం ది అయిపొయింది ఆయనకు అర్థం కావడం లేదు అన్నారు . టీడీపీలో తాము వెలిగిపోతున్నప్పుడు కెసిఆర్ ఎక్కడో ఉన్నారు , ఆయన నాయకత్వంలో ఎలా పని చేయాలి అని అటు వెళ్ళలేదు . ఇటు కోదండరాం నాయకునిగా వెలుగులోకి వస్తున్నాడు అని తెలంగాణ పేరుతో ఉద్యమ సంస్థ ఏర్పాటు చేశారు . అటు నుంచి బిజెపి , బీజేపీలో అసంతృప్తి అటు నుంచి కాంగ్రెస్ . టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారు . ఐనా టికెట్ పై ఆశలు పెట్టుకొని అలానే ఉన్నారు . నా లాంటి నాయకుడు కెసిఆర్ నాయకత్వంలో పని చేయడం ఏమిటీ అనుకున్న నాగం చివరకు తెరాస లో చోటా నాయకుడిగా పని చేసిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక . రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లో పని చేశారు . రేవంత్ రెడ్డి టికెట్ఐ లు ఇచ్చే స్థానంలో ఉండగా .. నాగం టికెట్ అడిగే స్థానం లో ఉన్నారు . ఐనా టికెట్ దక్కలేదు . *********** ఉద్యమ కాలం లో చాలా మంది నాయకులకు చర్చల్లో ఓ మాట చెప్పేవాడిని . ఆంధ్రభూమిలో వెజ్ బోర్డు సిఫారసులు అమలు చేస్తారు . మంచి జీతాలు ఉంటాయి . నాకు భూమిలో దాదాపు ఏడు వేల రూపాయల జీతం వచ్చే రోజుల్లో ఏబీకే ప్రసాద్ సంపాదకునిగా సుప్రభాతం అని పక్ష పత్రిక వచ్చేది . రవిప్రకాష్ అందులో దాదాపు మూడు వేల రూపాయలకు రూపాయలకు ఉద్యోగం చేసేవారు . టివి 9 తో రవిప్రకాష్ ఎక్కడికో వెళ్లిపోయారు . భూమిలో ఏదన్నా తేడా వస్తే , ఎక్కడ ఉద్యోగం వచ్చినా చేస్తా కానీ అప్పుడు నాకు ఏడు , నీకు మూడు వేలే జీతం అంటే ఇంట్లో కూర్చోవలసి వస్తుంది అనే వాడిని . .. కాలం కారుతుంది . అలా మారుతుంది అని గ్రహించాలి , స్వీకరించాలి లేకపోతే తిరునాళ్లలో తప్పిపోయినట్టు అవుతుంది . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం