13, అక్టోబర్ 2023, శుక్రవారం
జర్నలిస్ట్ లారా మీరెటువైపు ? జర్నలిస్ట్ జ్ఞాపకాలు -100
జర్నలిస్ట్ లారా మీరెటువైపు ?
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -100
--------------------------------------
రచయిత లారా మీరెటు వైపు అంటూ 1970 లో వినిపించిన ప్రశ్న 53 ఏళ్ళ క్రితం సాహిత్యంలో ఓ సంచలనం . అప్పుడు నేను ఇంకా స్కూల్ లో కూడా లేను కానీ ఆ ప్రశ్న గురించి ఆ తరువాత కూడా చాలా సార్లు చదివాను . అప్పటి వివాదం , అప్పటి చర్చ లోతుల్లోకి వెళ్ళలేను కానీ .. ఈ మధ్య వచ్చిన సినిమా పాట ఆ వైపు నుంటావా ? ఈ వైపు నుంటావా అని రంగస్థలంలో రాం చరణ్ ప్రశ్నకు మూలం ఈ ప్రశ్న నే కావచ్చు . పైకి ప్రశ్న లానే ఉన్నా అందులో ఒక రకమైన బెదిరింపు కూడా ఉంది అనిపిస్తోంది . విప్లవ రచయితల సంఘం రచయిత లారా మీరెటువైపు అని అడిగిన ప్రశ్నలో మా వైపున ఉంటే ఒకే లేకుంటే అంతే అన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ చదువు చదివిన నాలాంటి వ్యక్తికి అనిపిస్తోంది .
రచయితలు అంటే కొందరు అటు కొందరు ఇటూ అన్నట్టు , మరి కొందరు ఎటో తెలియనట్టు ఉండడం వల్ల అదో సంచలనం , సమాధానం కావలసిన ప్రశ్న . మరి జర్నలిస్ట్ లారా మీరెటు అంటే ?
********************
జర్నలిస్ట్ లారా మీరెటువైపు అని ప్రశ్నిస్తే జర్నలిస్ట్ లే కాదు , పత్రికలు చదివే పాఠకులు , ఛానల్స్ చూసే ప్రేక్షకులు కూడా క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు . కొందరు మేం తటస్థులం అని నటిస్తుంటారు . ఓ నిమిషం మాట్లాడితే ఏ పార్టీ తటస్తులో తేలిపోతుంది . తెలంగాణకు చెందిన ఓ ఛానల్ ఓనర్ తెరాస , కాంగ్రెస్ బీజేపీల మధ్య పొద్దు తిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు . ఆ ఛానల్ ఓనర్ ఎటు మారితే ఛానల్ అటు మారుతుంది .
జర్నలిస్ట్ తనకు ఇష్టం వచ్చినట్టు రాస్తారు అనుకుంటాను కానీ యజమాని ఇష్టం వచ్చినట్టు రాయాలి , రాస్తారు . కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి , జీతాలు ఇచ్చి మీడియా సంస్థలను నడిపేది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకో , ప్రజల స్వేచ్ఛ కోసమో కాదు .
డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 1950 ప్రాంతంలోనే సబ్బుల వ్యాపారం ఎలానో మీడియా వ్యాపారం కూడా అంతే , దీనికి పెద్దగా విలువలు అంట గట్టకండి అన్నారు . మీడియాది వ్యాపారం అని జర్నలిస్టులకు , యజమానులకు , సంపాదకులకు , యూనియన్ నాయకులకు తెలియదా ? అంటే పాఠకులకే తెలిసినప్పుడు వారికి తెలియకుండా ఎందుకు ఉంటుంది . దేవతా వస్త్రాల కథలా అందరూ నటించేస్తుంటారు .
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు మీడియా మొత్తం వివిధ పార్టీలకు అనుబంధంగా పని చేస్తోంది .
యజమాని ఏ పార్టీకి అనుబంధంగా పని చేస్తే ఆ మీడియా జర్నలిస్ట్ తనకు నచ్చినా నచ్చక పోయినా ఆ పార్టీకి ప్రయోజనం కలిగించే కోణం లోనే పని చేయాలి .
*******
95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అనేక వార్తల్లో , వ్యాసాల్లో నేను ఆంధ్రభూమిలో వెన్నుపోటు అని రాశాను . ఆ వెన్నుపోటులో మీడియా పాత్ర కూడా ఉంది . వారి పత్రిక తరపునే కాకుండా చిత్తశుద్ధితో వెన్నుపోటు కు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు ఈ మధ్య ఒక వ్యాసంలో 95 సంఘటన ప్రస్తావిస్తూ వెన్నుపోటు అని రాశారు . అది వెన్నుపోటు అని గ్రహించడానికి ఆ జర్నలిస్ట్ కు పాతికేళ్ళు పట్టిందా ? అంటే కాదు 95లో వెన్నుపోటుకు సహకరించిన మీడియాలో ఉన్నారు . పాతికేళ్ల తరువాత వెన్నుపోటు అని రాసినప్పుడు జగన్ మీడియాలో ఉన్నారు .
నేను వెన్నుపోటు అని రాశాను అని స్వతంత్రంగా రాశాను అని కాలరెగిరిస్తే ఓ జర్నలిస్ట్ మిత్రుడు అది మీ పత్రిక పాలసీ కాబట్టి అలా రాయగలిగావు అంతే తప్ప అది మీ మీడియా ఇచ్చిన స్వేచ్ఛ కాదు అంటే ఆలోచిస్తే అతని వాదనలో కూడా నిజం ఉంది అనిపించింది . ఒక్కో సారి యజమాని జర్నలిస్ట్ ఒకే కోణం లో ఉంటే అదృష్టమే . బాబు వెన్నుపోటు సమయంలో మేనేజ్ మెంట్ , ఎడిటర్ , నేనూ వెన్నుపోటు అనే భావించడం వల్ల రాతలకు ఇబ్బంది కలుగలేదు . 2001 తెలంగాణ ఉద్యమం వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది . నేనేమో తెలంగాణ కోరుకున్న వాడిని , యాజమాన్యం కొన్ని కారణాల వల్ల మనం సమైక్యాంధ్ర అంది . ఎడిటర్ తెలంగాణ అనే మాట వినడానికే ఇష్టపడని వారు . ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎడిట్ పేజీలో వారం వారం రాసే పొలిటికల్ కాలం లో ధైర్యం చేసి తెలంగాణ ఎందుకు అవసరమో రాశాను . అది పబ్లిష్ అయ్యాక ఆఫీస్ లో తెలంగాణ మిత్రులు మెల్లగా ఏంటీ మన పత్రికలో తెలంగాణ గురించి అని మెల్లగా అభినందించి వెళ్లేవారు ... ముందుగా ఊహించినట్టుగానే ఎడిటర్ నుంచి ఫోన్ .. అక్షింతలు .. ఇంకోసారి నాకు చూపకుండా పంపవద్దు అని వార్నింగ్ .. నిజానికి నేను అంతకన్నా ఎక్కువ నష్టానికి మానసికంగా సిద్దమై ఉన్నాను . ఉద్యమం ఉదృతం అయ్యాక తెలంగాణ గురించి రాసుకొనే అవకాశం లభించింది . ఎడిటర్ సమైక్యాంధ్ర కోసం రాస్తే నేను తెలంగాణ కోసం రాశాను . పత్రికల్లో కొంత మేరకు యాజమాన్యం స్వేచ్ఛ ప్రసాదించినా , మాకు వద్దంటే వద్దు అని ఎడిటర్ , యజమాని ఏం కోరుకుంటే అదే రాద్దాం అనుకునేవాళ్లనూ చూశాను . 95లో వెన్నుపోటు గురించి రాసే అవకాశం భూమిలో ఉన్నా చాలా మంది ఉపయోగించుకోలేదు . అలానే తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక రాసే అవకాశం ఉన్నా స్వేచ్ఛను ఉపయోగించుకొని వారు ఉన్నారు . ఎడిటర్ పేపర్ కు తానే ఓనర్ అన్నట్టు వ్యవహరించేవారు .. ఆంధ్రభూమి యాజమాన్యం పెద్దగా జోక్యం చేసుకునేది కాదు . దీనివల్ల కొంత వరకు రాయాలన్నది రాసే అవకాశం లభించింది ...
*****************
రాష్ట్ర విభజన తరువాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊహించని విధంగా మీడియా రాజకీయ పార్టీలను మించి రాజకీయ అభిమానం చూపుతోంది . బాబు అరెస్ట్ తరువాత ఛానల్స్ లో కొందరు యాంకర్లు మాట్లాడుతున్న మాటలు పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడలేరు . పార్టీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు సైతం యాంకర్ల పార్టీ భక్తి చూసి ఈర్ష పడేట్టుగా ఉంది . రెండు రాష్ట్రాల్లో కూడా మొత్తం మీడియా రాజకీయ పార్టీలకు అనుబంధంగానే ఉంది . కొన్ని మీడియాలను ఏకంగా పార్టీలే నడుపుతుంటే , కూని మీడియాలేమో పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి . సొంతంగా పార్టీలు నడిపే మీడియా పార్టీకి శాశ్వతంగా కట్టుబడి ఉంటుంది . పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా పార్టీ మారదనే నమ్మకం లేదు . మారుతూ ఉంటుంది .
రాజకీయ పార్టీల్లో , మావోయిస్టుల్లో కోవర్ట్ లు ఉన్నట్టే మీడియాలో కూడా కోవర్ట్ లు ఉంటారు . ఒక పార్టీ మీడియాలో ఉంటూ ప్రత్యర్థి పార్టీ కి సమాచారం చేరవేస్తారు . ఆ మధ్య ప్రభూత్వ ఉద్యోగులను ఓ మీడియా యజమాని బాబు ముందే తిడుతుంటే రికార్డ్ అయి బయటకు వచ్చింది ఇలానే . ఆ వీడియో టీడీపీకి కలిగించింది .
***********
జాతీయ స్థాయిలో కొన్ని మీడియాలను బీజేపీ మరి కొన్నింటిని కాంగ్రెస్ బహిష్కరించింది . దానితో కాంగ్రెస్ సానుభూతి పరులు అంటూ ఎవరో ఒకరిని డిబేట్ లో కూర్చోబెట్టి చర్చ రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు . రాహుల్ గాంధీ అదానీ పై ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే , దానిని ప్రశ్నలతో రసాభాస చేయమని ndtv ఒక జర్నలిస్ట్ ను పంపితే , అతను నా వల్ల కాదు అని రాజీనామా చేశారు . మేనేజ్ మెంట్ చెప్పినట్టు చేస్తేనే ఉద్యోగం లేదంటే బయటకు వెళ్ళాలి .
సామాజిక మాధ్యమాల పుణ్యమా ? అని మీడియా లోని వ్యవహారాలు బయటకులు వస్తున్నాయి . ప్రతి మీడియాకు రాజకీయ అనుబంధం ఉంది .. కొందరు అనుబంధం కోసం పార్టీలకు దరఖాస్తు చేసుకున్నా వీరికి అంత సీన్ లేదు అని పార్టీలు పట్టించుకోవడం లేదు .
గతం లో ఓ కొత్త మీడియా వస్తుందే అంటే ఎడిటర్ ఎవరు ? అనే ప్రశ్న వినిపించేది .. ఇప్పుడు ఓనర్ ఏ పార్టీ అనే ప్రశ్న వినిపిస్తుంది .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం