16, ఆగస్టు 2011, మంగళవారం

తెలుగు కమెడియన్స్ తో పోటీ పడుతున్న తెలుగు నేతలు .. లండన్ అల్లర్లు మన విజయమా?

నాయకుడనే వాడు ప్రజలకు మార్గదర్శకం చేయాలి. సాధ్యం కానప్పుడు ప్రజలు చూపిన మార్గంలో పయనిస్తాడు. కానీ కొందరు నాయకులు మాత్రం ప్రజలకు వినోదం కలిగించే కమెడియన్లుగా మారిపోతున్నారు.
‘‘ఈ రోజు ఖద్దరు వేసుకొని, శాలువా కప్పుకొని షోకిల్లా రాయుడిలా వచ్చారేమిటి?‘‘ ‘‘మా అధినాయకుడు ఇక్కడ లేడు కదా అందుకే కాస్తా రిలాక్స్‌గా ఉన్నాం. అలా అని మా నాయకుడు డ్రెస్ గురించి పట్టించుకుంటారని కాదు’’ అంటూ ఆ నాయకుడు కెమెరా ముందే తల దువ్వుకుంటూ ఫోజులిస్తున్నాడు. ఇదేదో ఆ నాయకుడికి తెలియకుండా రహస్యంగా చిత్రీకరించింది కాదు! కెమెరా ముందే సాగిన తంతు. ఈ దృశ్యం ఏ చానల్‌లో, ఏ కార్యక్రమంలో వస్తుందో అతనికి తెలుసు. ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకునే అతనలా ఫోజులిచ్చాడు. ఇది సాక్షి చానల్ డింగ్‌డాంగ్‌లో ప్రసారమైన ఒక దృశ్యం. ఆ నాయకుడు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాజకీయ నాయకులను చానల్స్ చివరకు హాస్య పాత్రల్లోకి దించుతున్నాయి. మంత్రుల స్థాయి వాళ్లు సైతం ఇదే మార్గంలో పయనిస్తున్నారు. కొందరు వారంతట వారే ఇలా మారితే, కొన్ని చానల్స్ వీరిని ఆ మార్గంలోకి తీసుకు వస్తున్నాయి. వారు చూపిస్తున్నారని కాదు కానీ నిజంగానే నాయకులు ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. కొంత మంది నాయకులు చానల్స్‌లోని ఇలాంటి కామెడీ కార్యక్రమాల్లో తాము కనిపించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా మాట్లాడుతున్నారు.
మంత్రి శంకర్‌రావు న్యూస్ చానల్స్‌కు కామెడీ కింగ్‌గా తయారయ్యాడు. తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం, వేణుమాధవ్ లాంటివారికి ఎంత క్రేజ్ ఉందో తెలుగు న్యూస్ చానల్స్ కామెడీ కార్యక్రమాల్లో శంకర్‌రావుకు అంత క్రేజ్ ఉంది. శంకర్‌రావు పాత్రలేని పొలిటికల్ కామెడీ కార్యక్రమం కనిపించదు. ఆయన తరువాత సిపిఐ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో మారెప్ప, గోనె ప్రకాశ్‌ల హడావుడి కనిపించేది.
నల్లకళ్లద్దాలు పెట్టుకున్న శంకర్‌రావును అదేంటి సార్ మీరు అచ్చం కరుణానిధిలా ఉన్నారని అడిగితే, కరుణానిధి తెలుగువాడే, జయలలిత తెలుగే, నేనూ తెలుగువాడినే అని కళ్లద్దాలు సర్దుకుంటూ సమాధానం చెప్పారు. నిజానికి ఈ ప్రశ్నలు వేయడం, ఆయనలా చెప్పడం అంతా న్యూస్ చానల్స్‌లోని కామెడీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకునే సాగుతుంది.

 దాదాపు  అన్ని తెలుగు న్యూస్ చానల్స్‌లోనూ రాజకీయ నాయకులను హాస్యపాత్రల్లో చూపించే కార్యక్రమాలు ఉన్నాయి. సాక్షి చానల్‌లో డింగ్‌డాంగ్‌లో స్వయంగా ఆ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ముందో, తరువాతనో చేసే చిత్రమైన చేష్టలను ఈ కార్యక్రమానికి ఉపయోగించుకుంటున్నారు. మిగిలిన చానల్స్ ఆయా నాయకుల వేషాలతో కామెడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అన్ని తెలుగు చానల్స్‌లో రాజకీయ నాయకులను కమెడియన్లుగా మార్చేశారు. అన్ని చానల్స్‌లో శంకర్‌రావు పాత్ర తప్పనిసరి. సాక్షి డింగ్‌డాంగ్‌ను దృష్టిలో పెట్టుకునే టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య కొన్ని డైలాగులు చెబుతున్నారు. కొన్ని చర్యలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి..
 ఆయన చెప్పులు మొదలుకుని దుస్తులు, డైలాగులు, అన్నీ చిత్రంగా ఉంటాయి. మాయదారి మల్లిగాడు సినిమాలో కృష్ణ కాస్ట్యూమ్స్ ఎంత ప్రత్యేకంగా ఉంటాయో, రాజకీయాల్లో ఆయన డ్రెస్సులో అంత ప్రత్యేకత ఉంటుంది. ప్రతి వారం చానల్స్ కామెడీ కార్యక్రమాలకు ఆయన మంచి ముడిసరుకు అందిస్తున్నారు. సాక్షి డింగ్ డాంగ్‌ను నిర్వహిస్తోంది హాస్య నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం. ఆయన స్వతహాగా హాస్యనటుడు కాబట్టి ఆయన నవ్వించడం పెద్ద విశేషమేమీ కాదు కానీ ఆయన కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు పాత్ర మాత్రం ఆయన్ని మించిపోయి నవ్వించగలగడమే బాధాకరం. నారాయణ తిట్లు, సామెతలతో శంకర్‌రావుకు పోటీ రావాలని తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
* * *
ధరలు పెరిగాయని తెలుగు మహిళలు నగరంలో ధర్నా చేశారు. అందులో ఒక మహిళలకు ప్రణబ్‌ముఖర్జీ వేషం వేసి అంతా కలిసి ఆమెను చితగ్గొట్టారు. ఏమిటీ నాటకాలు అంటే మరేం చేస్తాం సార్ మేం ఎంత పెద్ద కార్యక్రమం చేసినా టీవీల్లో చూపించరు, ఇలాంటి తలతిక్క పనులేవో చేస్తేనే టీవీల్లో కనిపిస్తాం అని నిర్వాహకుల సమాధానం. వారు ఊహించినట్టుగానే ఈ కార్యక్రమం డింగ్‌డాంగ్‌లో చాలా సేపు చూపించారు.



 నిద్రమబ్బులో...... న్యూస్


ఐ న్యూస్‌లో ఇన్‌సైట్ పేరుతో గురువారం ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని చూశాక వారి మాటలకు ఒళ్లు జలదరించింది. లండన్‌లో అల్లరి మూకలు దాడులకు దిగుతున్నాయి. ఈ దాడుల్లో లండన్ నగరాన్ని లూటీ చేశారు. ముగ్గురు ఆసియా వాసులను హత్య చేశారు. దీనికి సంబంధించి ఏ మాత్రం అవగాహన లేని వారు ఐ న్యూస్‌లో ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో తన దేశం గెలిస్తే వార్తలు ఎలా చూపిస్తారో ఈ అంశంపై ఐ న్యూస్ అలానే ఈ కథనాన్ని రూపొందించింది. ఎంతో కాలం భారతీయలను తెల్లవారు బానిసలుగా చూస్తే ఇప్పుడు తెల్లవారిపై నల్లవారు ప్రతీకారం తీర్చుకున్నారట!


 ఇంగ్లాండ్ చేసిన పాపాలు ఇన్నాళ్లకు పండాయి, ఇంగ్లీష్ వాడు మటాష్, నల్లవాళ్ల సత్తా చూస్తున్న తెల్లదొరలు, ఇవీ లండన్ నగరంలోని దాడులపై ఐ న్యూస్ ఉపయోగించిన వ్యాఖ్యలు. ఎంతటి అజ్ఞాని నుండి కూడా ఈ అంశంపై ఇలాంటి వ్యాఖ్యలను ఊహించలేం. అక్కడ ఆసియావాసులు, భారతీయులపై కూడా దాడులు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భారతీయులు గుమికూడి తమకు తాము రక్షణ కల్పించుకుంటున్నారు. ఇదేదో భారతీయులు ఇంగ్లాండ్‌పై యుద్ధం చేసి జయించినట్టుగా పిచ్చి వ్యాఖ్యానాలేమిటో? చానల్ వారికే తెలియాలి. ఇలాంటి దాడులకు కారణం ఏమిటని సామాజిక శాస్తవ్రేత్తలతో చర్చించాల్సిన అంశాన్ని ఏమాత్రం అవగాహన లేని వారికి అప్పగించినట్టుగా ఉంది.
* * *
జగన్ ఆస్తులపై విచారణకు హైకోర్టు సిబిఐని ఆదేశించింది. విచారణకు ఆదేశించింది తప్ప ఆవినీతి నిరూపణ జరగలేదు, శిక్ష పడలేదు, కానీ ఈ విషయం తెలియగానే ఈటీవి2, స్టూడియో ఎన్‌లో ఉత్సాహం ఉరకలు వేసింది. జగన్ అవినీతి నిరూపితం అయిందని ఈటీవి2 సొంత వ్యాఖ్యానాలను జోడించింది. ఈ చానల్స్ జగన్ జైలుకు వెళ్లినట్టు, తమ అభిమాన నాయకుడు సిఎం అయిపోయాడన్నంత ఆనందాన్ని ప్రదర్శించాయి.

4 కామెంట్‌లు:

  1. ఆంధ్రభూమి దిన పత్రికకు సలాం

    రిప్లయితొలగించండి
  2. I am Presently Living in London....Those roits were not communal roits.....in only one county named Burming Ham 3 asians were attacked....

    the roiters did not attacked people mostly...they attacked on shopping malls and looted them...and tried to loot ATMs....

    actually our Indian Media responded a bit later...when the roits were coming to an end our media has shown the matter as that was happening at that time.....but actually roits were happend 4 days severly and later it become normal......

    రిప్లయితొలగించండి
  3. బాగా చెప్పారండి. మన నాయకులకి, న్యూస్ చాన్నేల్ వాళ్లకి, పత్రికల వాళ్లకి కావాల్సింది ప్రజా క్షేమం కాదు, డబ్బు, అధికారం,డబ్బు, అధికారం, డబ్బు, అధికారం ..... అంతే.....

    రిప్లయితొలగించండి
  4. "ఇంగ్లాండ్ చేసిన పాపాలు ఇన్నాళ్లకు పండాయి, ఇంగ్లీష్ వాడు మటాష్, నల్లవాళ్ల సత్తా చూస్తున్న తెల్లదొరలు'...........ఇది నిజమా? చీ చీ చీ...మరీ ఇంత దిగజారిపోతున్నామా!

    ఇందులో మీరు వ్యంగ్యం జోడించలేదంటే మీరెంత బాధపడుంటారో అర్థమవుతున్నాది. ఈ విషయాలు చదివితే నాకూ అలాగే ఉంది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం