ప్రభుత్వానికి ఒళ్లు మండిపోయింది. ఎంత ప్రభుత్వంలో ఉన్నవాళ్లయినా ఒళ్లు మండిపోకుండా ఉంటుందా? చిన్నా చితక ఉద్యోగులు, నాయకులకే ఇలాంటి మాటలు వింటే చిరాకేస్తుంది అలాంటిది ఇంత పెద్ద దేశాన్ని పాలించే వారికెంత మంటగా ఉంటుంది. వాళ్లూ మనుషులే వాళ్ల శరీరంలో ప్రవహించేది ఒరిజినల్ రక్తమే . ఒళ్లు మండకుండా ఎలా ఉంటుంది? ఒక్క వ్యక్తి ఉద్యోగం పీకేస్తేనే విలవిలలాడిపోతారు కదా? అలాంటిది మొత్తం వ్యవస్థ ఉపాధినే దెబ్బతీయాలని ప్రయత్నిస్తే ఎవరికైనా ఒళ్లు మండిపోకుండా ఉంటుందా?
ఎంత రిమోట్ కంట్రోల్‌తో నడిచే ప్రభుత్వం అయితే మాత్రం వాళ్లకూ చీమునెత్తురు ఉంటుంది? వ్యవస్థనే నిర్మూలించాలనుకుంటే వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది. అవినీతి మా జన్మ హక్కు. స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజే మా ఈ స్వాతంత్య్రాన్ని హరించాలని హజారే ప్రయత్నిస్తే ఎలా ఊరుకుంటాం. ఐదు శాతమో పది శాతమో అవినీతిని నిర్మూలించమంటే అర్ధం చేసుకోవచ్చు కానీ వంద శాతం నిర్మూలించాల్సిందే అంటే ఈ వ్యవస్థ ఏం కావాలి. ప్రజాస్వామ్యంలో అవినీతే ప్రభుత్వానికి ఊపిరి. అలాంటి ఊపిరిని నిలిపివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేయడమే కదా!
ఏదో తెలియక మా వాళ్లు మీ పార్లమెంటు మీద దాడి చేశారు, మీ తాజ్ మహల్ హోటల్‌పై దాడి చేశారు, ఓ వంద మందిని పొట్టన పెట్టుకున్నారు ఏమనుకోకుండా క్షమించేయండి అంటే సరే ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండవా అని క్షమించేస్తాం. ఇంట్లో కాఫీ పొడి ఐపోతే అక్కయ్య గారూ ఒ కప్పు కాఫీ పొడి బదులిస్తారా? అని అడగమా? నెలాఖరులో తోటి వారిని ఓ వందుంటే ఇస్తావా? అని అడిగేందుకు మొహమాటపడతామా? అలానే పొరుగు దేశం నుండి అష్టకష్టాలు పడి ప్రయాణం చేసి వచ్చిన వాళ్లు ఎంతో సాసహంతో మన పార్లమెంటు మీద దాడి చేసి ఎంతో మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుని పట్టుపడ్డవాళ్లకు క్షమాబిక్ష పెట్టేయమంటే మనకేమీ పెద్ద బాధ అనిపించదు. వారిని అల్లుళ్లలా చూసుకొని వదిలేయమంటే వదిలేద్దాం .... కానీ అవినీతిని నిర్మూలించండి అంటూ ఆయనెవరో పనీ పాట లేనాయన హడావుడి చేస్తే ఏ ప్రభుత్వమైనా ఎందుకు సహిస్తుంది. అరెస్టు చేసి తిహారు జైలుకు తరలించింది. మంచి పని చేసింది. ఆయనేమన్నా తనను తాను కసబ్ అనుకుంటున్నాడా? జైలులో స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పించడానికి. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఇలాంటి వారిని అస్సలు క్షమించకూడదు. మొత్తం దేశాన్ని నాశనం చేస్తారు. 120 కోట్ల మంది ప్రజలు బుద్ధిమంతుల్లా ఎవరికే పని పడ్డా చక్కగా నిర్ణీతమైన లంచం ఇచ్చి తమ పని తాము చేసుకుపోతుంటే తగుదునమ్మా అని ఆయనెవరో వచ్చి ఎక్కడా అవినీతి ఉండడానికి వీలు లేదంటే ఎలా? ఆ మాట అనడానికి ఆయననెవరు. లంచం ఇవ్వడం, తీసుకోవడం మా జన్మహక్కు. మా హక్కులను కాలరాచే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు. సత్రంలో తింటూ గుళ్లో పడుకునే ఆయనకేం తెలుసు సంసారుల సమస్యలు.
అవినీతి ఉండాలని పాలకులు, పాలితులు అంగీకరిస్తే వద్దనడానికి నువ్వెవరు? అసలలా అనేందుకు నీకెంత గుండె ధైర్యం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు మా ప్రధాని ఎంతో చక్కగా చెప్పాడు. అయినా ఆయనకు అర్ధం కాలేదు. అవినీతిని నిర్మూలిస్తే అభివృద్ధి ఆగిపోతుంది.. నా చేతిలో ఏమైనా మంత్రదండం ఉందా? అంటూ ఆయన చెప్పిన తరువాత కూడా అర్ధం చేసుకోకపోతే ఎలా? చిన్నపిల్లాడికి కూడా అర్ధమయ్యేట్టుగా అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా ప్రధాని చెబితే అంత పెద్ద మనిషి అన్నా హజారేకు అర్ధం కాకపోతే ఎలా? అవినీతిని పూర్తిగా నిర్మూలించాల్సిందే అని అన్నా హజారే ప్రభుత్వాన్ని భయపెడితే కొన్ని కోట్లమంది భయంతో వణికిపోయారు. కొంపదీసి ప్రభుత్వం నిజంగానే అవినీతిని ఎన్‌కౌంటర్ చేసేస్తుందా? అని భయపడ్డారు. ఎన్‌కౌంటర్ చేయాల్సింది అవినీతిని కాదు అవినీతిపై సాగే ఉద్యమాన్ని అనే విషయాన్ని ప్రభుత్వం బాగానే గ్రహించింది.
అందుకే ఆయన్ని అరెస్టు చేసి, తిహార్ జైలుకు పంపింది. అన్నా హజారేకు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా దీనికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. లక్షా 76వేల కోట్ల రూపాయల 2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి సూత్రధారి రాజా, కరుణానిధి గారాల పట్టి కనిమొళి, కల్మాడి వంటి మహ మహా నేతలు కొలువు తీరిన జైలులో కొంతసేపు ఉండనిచ్చినందుకు హజారే ప్రభుత్వానికి కొద్దిగానైనా విశ్వాసం చూపడం లేదు. త్వరపడి విడుదల చేశారుకానీ, హజారేను కనీసం ఆరునెలలైనా అక్కడే ఉంచి ఉండాలి. ఎందుకంటే ఆరునెలల్లో వారు వీరవుతారంటారు కదా! పెద్దగా చరిత్ర లేని హజారేకు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం రికార్డు సృష్టించిన వారి సరసన ఉండే అదృష్టం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదా?
అన్నా హజారే వ్యవహారాన్ని డీల్ చేయడంలో ప్రభుత్వం తప్పుచేసిందని రాజకీయ అభిమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటో ఆ తప్పు అంటే.. అన్నాదీక్ష మొదలు పెట్టగానే ఎక్కడెక్కడి వారు మద్దతు ప్రకటించారు కదా! చంద్రబాబు, మాయావతి, జయలలిత, అమర్‌సింగ్ వంటి మహనీయులున్నారు. జగన్, గాలి జనార్దన్‌రెడ్డి వంటి పిల్ల మహానీయులున్నారు. ఢిల్లీలో హజారే దీక్షకు అనుమతించి, ఆ పక్కనే ఈ మహనీయులు, పిల్ల మహనీయుల కోసం ప్రత్యేకంగా మరో టెంటు ఏర్పాటు చేసి అందరినీ ఒకే చోట కూర్చోపెడితే? అప్పుడు దెబ్బకు దయ్యం దిగివచ్చేది. బాబోయ్ నేను దీక్ష చేయను వదిలేయండి అని హజారే ప్రభుత్వాన్ని వేడుకునే వారు కదా! ఇప్పటికైనా పోయిందేమీ లేదు. తీహార్ జైలు నుండి హజారేను బయటకు తీసుకు వచ్చి దీక్షకు కూర్చోపెట్టాలి. ప్రభుత్వం ఈ మహనీయులందరినీ ఆయనతో పాటు కూర్చోబెట్టాలి. అన్నాకు దీక్ష చేసే అధికారం ఉన్నట్టే ఆయనతో పాటు దీక్ష చేసే అధికారం ఈ మహనీయులకు ఉంది తీరాల్సిందే . ప్రభుత్వం ఇప్పటికైనా వజ్రాయుధాన్ని గుర్తించి అన్న పై ప్రయోగించి తనను తను రక్షించుకొని , కోట్లాది మంది అవినీతి పరులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది!
ప్రభుత్వ చేతకానితనాన్ని బగా ఎండగట్టారు.
రిప్లయితొలగించండి"అవినీతి ఉండాలని పాలకులు, పాలితులు అంగీకరిస్తే"....
ఎంత దురద్రుష్టకర పరిస్థితి.
Excellent.
రిప్లయితొలగించండిదేశ స్వాతంత్ర్యం కోసం అష్టకష్టలూ పడ్డ మహనీయులు ఈ రోజు బ్రతికుంటే నేటి ఈ పరిస్థితి చూసి ఎందుకు పోరాడామా మనం అని కన్నీరు పెట్టుకుందురు.
స్వాతంత్ర్య సమర యోధులు ముది వయసులో పింఛను కోసం అమాత్యుల కాళ్ళమీద పడి పూట గడవడం కష్టంగా ఉందని ఏడవాల్సిన పరిస్థితి కల్పించిన వ్యవస్థ మనది.
అవినీతిని నిర్మూలిద్దామన్నందుకు ఒక నిస్వార్ధ వృధ్ధుడిని తీహార్ జైలుకి తరలించిన ప్రభుత మనది.
నల్లడబ్బు లెక్కలు చెప్తే అది దాచుకున్న వారి ప్రతిష్టకు భంగం కలుగుతుందని లెక్కలు బయట పెట్టడానికి నిరాకరించిన ఘనత మనది.
అన్నా హజారే, ఈ వయసులో ఈ ప్రజాస్వామ్య దేశంలో రేపటి మా కోసం పోరాడుతున్న మీకు జరిగిన అవమానానికి సిగ్గుతో తలవంచుకుంటున్నాం.