రాగాలు రాళ్ళను కరిగిస్తాయి, వర్షాలు కురిపిస్తాయి . మరి జీవితం లో ఆందోళనా రాగం ఎక్కు వయితే ఏమవుతుంది ? అది జీవితాన్నే కరిగించేస్తుంది
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. 80వ దశకంలో కుర్రకారును ఊపు ఊపేసిన పాట అది. ఆ కాలంలో యువతకు పెద్ద టార్గెట్ -ఉద్యోగం సంపాదించడం. ఆ పాట నేటి యువతకు సిల్లీగా అనిపించొచ్చు. కాలం మారింది. కుర్రకారు కోరికలు మారాయి. సంస్కరణలు దేశంలో ఊహించని పెను మార్పులు సంభవిస్తున్నాయి. కానీ -చిత్రంగా లావవుతున్న కోర్కెల చిట్టా, అందుకు అనుగుణంగా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఏ కుర్రాడినైనా కదిపి చూడండి. మంచి జీవితానికి ఊహల్లో రూపురేఖలు ఎలా ఉన్నాయో రాసిమ్మనండి. అందులో తప్పని సరిగా కనిపించేది -సకల సౌకర్యాలు కలిగిన లగ్జరీ ఇల్లు. సెలబ్రిటీని తలదనే్న సహచరి. అంతకుముందు -కార్పొరేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం. పెద్ద కారు. ఏటేటా కుటుంబంతో విహార యాత్రలు. ఆనందాన్ని రెట్టింపు చేసే స్నేహ బృందం. భలే! సరే ఇవన్నీ సమకూరాయి అనుకుందాం. అప్పుడు జీవితం సంతృప్తికరంగా ఉంటుందా? సారీ.. అవునని బలంగా చెప్పలేరు. ఏదో తెలీని ఆందోళన. ఎక్కడో ఏదో జరిగిపోతోందన్న కలవరం. ఎందుకూ? అని ప్రశ్నిస్తే ‘ఉన్నదానికంటే ఇంకేదో కావాలనే తాపత్రయం’. ‘ఒకే ఒక్క చాన్సివ్వండి’ అని స్టూడియో గేటుదగ్గర ఏడ్చిన వాడు కూడా, చాన్స్ దొరికాక ‘సూపర్ స్టార్’కు లంగరేస్తాడు.
మంచి శక్తి సామర్థ్యాలను వెలికి తీసే పదునైన ఒత్తిడి, సందర్భోచిత ఆతృత మంచిదే. కానీ ఎక్కువ సందర్భాల్లో ఇదే కుర్రకారులో ఆందోళనగా రూపాంతరం చెందుతుంది. మానసిక, శారీరక అనారోగ్యాలకు హేతువవుతోంది. -‘పట్టణ ప్రాంతాల్లో 98శాతం భారతీయ యువత తీవ్రమైన ఆందోళన, గాబరాతోనే కాలం గడిపేస్తోంది’ అన్నది ఇటీవలి అధ్యయనాలు తేల్చిన సారాంశం. ఈ మితిమీరిన ఆందోళనే ముందు రక్తపోటు, తరువాత గుండెపోటుకు దారి తీస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ఆర్థిక సంస్కరణల తరువాత దేశంలో కచ్చితంగా సంపద పెరిగింది. సంతోషానికి, సుఖమయ జీవనానికి సంపదే మూలం అనుకుంటే, మరి దేశంలో సంతోషం సూచి పైకి చూపించాలిగా. నిజానికి అలా జరగలేదు. సంపదను మించి ఆందోళన, ఆతృత మానసిక రోగాలను పెంచాయి. ఇది సర్వేల సాక్షిగా నిజం. ఈతరం కన్నా వారి తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు సంతోషంగా జీవించారు. ఇది అందరూ అంగీకరించేదే. అది తెలుసుకుని కూడా, గాబరాకు గురవుతున్న యువత మాత్రం ఏదో జరిగిపోతుందనే భయం, ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, ఆనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నారు.
ఒక్క విషయం తెలుసా.. గుండెపోటుకు కారణాల్లో 34 శాతం ఇలాంటి సమస్యలే. ఇది వైద్యులు చెప్తోన్న మాట. 34 ఏళ్ల పవన్ ఒక బహుళ జాతి కంపెనీలో ఎగ్జికూటివ్. తల్లిదండ్రులకు ఇల్లు ఉంది. అదికాక, సొంతంగా ఇల్లు కట్టాడు. ‘బాగానే సంపాదిస్తున్నాను. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాను. తరుచూ కుటుంబంతో విహార యాత్రలకు వెళ్తాను. కానీ ఏదో తెలియని వెలితి, ఆందోళన వెంటాడుతోంది. ఇది నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది’ అంటున్నాడు. గతంలో ఎప్పుడూ లేనన్ని యోగా సెంటర్లు, ధ్యాన కేంద్రాలు చుట్టూ కనిపిస్తున్నాయి. వాటిద్వారా ఉపశమనం పొందేందుకు కేంద్రాల వద్దకు క్యూ కడుతూనే ఉన్నారు. బహుశ, అంతకంతకూ పెరుగుతోన్న ఆందోళనే వీటి అవసరాలు పెరగటానికి కారణమై ఉండొచ్చు. ‘అలుపెరుగని పరుగే అంతిమ విజయం అనుకుంటూ, ‘ఏదో ఏదేదో’ కోసం పరుగులు తీస్తున్న వాళ్లంతా జీవితాన్ని ఓడిపోతున్నామన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు’ అంటారు డాక్టర్ మానస. ఫలానాది సాధించాలి, సాధిస్తామా? లేదా? సాధించిన విజయం నిలబెట్టుకుంటామా? అనే అతి ఆలోచనలు సైతం ఆందోళనను పెంచుతాయి. పదేపదే అదే అంశాన్ని తీవ్రంగా ఆలోచిస్తూ, దానిపైనే దృష్టి కేంద్రీకరించిన క్రమంలో చిన్న సమస్యలు కూడా పెద్ద శిరోభారానే్న మోసుకొస్తాయి. మనిషి ఆందోళనతో ఉన్నప్పుడు సహజంగా ఉండలేడు. అయోమయాన్ని ప్రదర్శిస్తాడు. తననుంచి తానే దూరంగా పరుగులు తీస్తుంటాడు. ప్రతికూల ఆలోచనలతో సతమతం అవుతుంటాడు. ఇతరులపై ఆధారపడే తత్వం, కోపం ఎక్కువవుతాయి. నిస్సహాయుడవుతాడు. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు ‘ఏదోక వ్యసనానికి’ దగ్గరవుతారు. అంతేకాదు, హాఠాత్తుగా బరువు పెరగడమో తగ్గడమో జరుతుంది. కంటినిండా నిద్రకు దూరమై, అనారోగ్యం ఒడికి చేరతాడు. సిల్లీగా అనిపించినా, మానసిక నిపుణుడు ఒకరు చెప్పిన విషయం ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్లంతా -చేరాల్సిన సమయం కంటే ఇంటికి ఆలస్యంగా చేరతారట. నలుగురితో కూర్చుని భోజనం చేస్తూనే ఈ క్షణం గురించి ఆలోచించటం మానేసి రెండు రోజులు ముందునాటి ప్రణాళికలపై దృష్టి పెడతారు.
ఒకప్పటి పరిస్థితి వేరు. చేరాల్సిన సమయానికే ఇంటికి చేరుకుని, కుటుంబంతో హాయిగా గడిపేవారు. ఇప్పటి జనరేషన్ అయితే -‘ఈ క్షణంలో జీవించడం ఎప్పుడో మర్చిపోయింది. రెండురోజుల ముందు గురించి ఆలోచిస్తుంది. తినాల్సింది ఒంటరిగా తినేస్తూ, నలుగురితో కలిసి చేయాల్సిన పనులు ఒంటరిగా చేసేస్తుంటే ఆందోళన పెరిగిపోక ఏమవుతుంది. మనం అలవాటు చేసుకుంటున్న క్రెడిట్ కార్డులు, ఈజీ మనీ వ్యవహారాలు కూడా ఆందోళన పెరగడానికి ప్రధాన కారణం అవుతున్నాయంటున్నారు మానసిక నిపుణులు. ఎవరికి వారు -ఆందోళనతో ఇబ్బంది పడుతున్నామేమో తెలుసుకోవడానికి వైద్యులు కొన్ని ప్రమాణాలు నిర్ణయించారు. మీరు ఏ దిక్కుకైనా తీక్షణంగా చూస్తున్నపుడు -పట్టపగలే కళ్ల ముందు లీలగా చుక్కలు కదులుతున్నాయా? మీ హృదయ స్పందన మీకు వినిపిస్తుందా? మెడ భాగంలో చరచూ నొప్పికి గురవుతున్నారా? చాలా ఎక్కువగా నిద్ర పోవడం లేదా తక్కువగా నిద్రపోవడం జరుగుతుందా? అర్ధరాత్రి మెలుకువ వచ్చేస్తోందా? ఆందోళన కలిగించే కలలు రావడంతో హఠాత్తుగా మేల్కొంటున్నారా? కడుపులో తరచూ గడబిడ ఉంటుందా? ఎక్కువగా తుమ్ములు, శరీరం మొత్తం నొప్పిగా ఉంటుందా? ఇలాంటి సమస్యలు -మీలో పెరిగిపోతున్న ఆందోళనకు సంకేతాలు. ఆ పరిస్థితి నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలు కూడా సూచిస్తున్నారు వైద్యులు.
అవేంటంటే.. ముందుగా అత్యాశ వదులుకోవాలి. తాహతుకు మించిన ఆలోచనలు తలనొప్పి వ్యవహారమేనట. ఏ పనినైనా పూర్తి చేయాలనుకుంటే సరైన అంచనాలు రూపొందించి సానుకూల ధోరణితో అడుగులు వేయమని హెచ్చరిస్తున్నారు. ఆలోచించండి. సాధించిన దానితో సంతోషంగా ఉన్నానని మీకు మీరే సంకేతాలు ఇచ్చుకోండి. చేసే పనిలో ఆనందాన్ని అనుభవించండి. శక్తిని సరిగా అంచనా వేసుకొని, ఆ మేరకే లక్ష్యాలు నిర్దేశించుకోండి. రోజుకు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారో కాగితంపై రాసి చూసుకోండి. ఉద్యోగం, సంపాదన, పని ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఎంత సంపాదించి ఏం ప్రయోజనం. ఆ విషయాన్ని గుర్తెరికి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. ఎదుటివాడి జీవితంతో నిన్ను పోల్చుకుని ఏడ్చేకంటే, మనదైన సంతోషాన్ని గుర్తు చేసుకుని ఆనందంగా జీవించండి. జీవితం ఒక్కటే. దాన్ని ఏడిపించొద్దు అన్నాడో సినీ కవి. ఈ తత్వం బోధపడితే జీవితం కోసం జీవించొచ్చు. లేదంటే బతుకంతా -ఆందోళనారోగమే!
బాగా రాశారు మురళిగారూ! మీరు రాసినవన్నీ అక్షరసత్యాలు.
రిప్లయితొలగించండి"శక్తిని సరిగా అంచనా వేసుకొని, ఆ మేరకే లక్ష్యాలు నిర్దేశించుకోండి." ఇది నిజమండి. బాగుంది.
రిప్లయితొలగించండిchalaa bagaa raasaaru ,
రిప్లయితొలగించండి