సినిమా అయినా రాజకీయాలు అయినా ప్రచారం ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది. ప్రచారం అవసరం కూడా. కానీ మితిమీరిన ప్రచారం ఒక సినిమాను నిలబెట్టలేదు. ఒక రాజకీయ పార్టీని గెలిపించలేదు అని పదే పదే రుజువు అవుతూనే ఉంది. కానీ ఈ వ్యవహారం కొందరిని నిండా నష్టాల్లో ముంచేస్తుంది. చిన్న సినిమా విషయంలో ఇటీవల తెలుగు నాట నట్టికుమార్ పేరు బాగా వినిపిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉండి ముగింపునకు నోచుకోని సినిమాలు, షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలను సైతం ఆయన విడుదల చేస్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటి నట్టికుమార్‌ను కొలవెరి నిండా ముంచేసింది. రెండు మూడు కోట్లకు మించి వ్యయం కాని 3 సినిమాలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరో. ధనుష్ వాళ్ల నాన్న కొలవెరి పాట పాపులారిటీని బాగా ఉపయోగించుకుని 3 సినిమా రైట్స్‌ను వివిధ భాషల్లో అమ్ముకున్నారు. ఒక్క తెలుగులోనే ఈ సినిమాను ఆరుకోట్ల 40 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. వీళ్లు చెప్పిన సమాచారం ప్రకారమే తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ఈ సినిమాను 50 కోట్లకు అమ్ముకున్నారు. కొలవెరి పాట పాపులారిటీ తప్ప ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏమీ లేదు.
24 గంటల చానల్స్‌కు ప్రతి నిమిషం ఏదో కొత్తదనం చూపించడానికి తంటాలు పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరో ఒకరి మదిలో మెదిలిన ఐడియా కొలవెరి పాట. ఒకరిని చూసి ఒకరు అన్ని చానల్స్ ఆ పాటను పాపులర్ చేశాయి. దాంతో ఆ చానల్స్‌కు పోయేదేమీ లేదు. కానీ ఒక్క పాటను చూసి డబ్బింగ్ సినిమా హక్కులను ఆరున్నర కోట్లకు కొనేవారు ఆలోచించాలి. అసలే తెలుగు సినిమా పరిశ్రమ సంక్షోభంలో పడిపోయింది. కేవలం ఐదు శాతం సినిమాలో మాత్రమే అంతో ఇంతో లాభాలు గడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత భారీ నష్టం అది వ్యక్తులపైనే కాదు మొత్తం సినిమా పరిశ్రమపై ప్రభావం పడుతుంది.
విపరీతమైన ప్రచారంతో గట్టెక్కుతామనే భ్రమల్లో పడిపోవడం ఇది మొదటి సారేమీ కాదు. ఏకంగా ఎన్టీ రామారావు లాంటి నట రాజకీయ వేత్త ఒక సినిమా ద్వారా మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని కలలు కన్నారు. బహుశా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు లభించినంత ప్రచారం దేశంలో మరే సినిమాకు లభించి ఉండదు. విపిసింగ్ లాంటి జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మీనాక్షి శేషాద్రి మేనకగా నటించింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు విశ్వామిత్రుడి వేషం వేశారు. విశ్వామిత్రుడి గెటప్‌లోనే ఆయన మేనక వీపు మీద ఫైళ్లు పెట్టి సంతకం చేశారు. దేశంలో దాదాపు అన్ని పత్రికలు ఈ ఫోటోను ప్రచురించాయి. ఈ సినిమాకు కాంగ్రెస్ నాయకులు కూడా భయపడిపోయారు. ఈ సినిమా రావడాని కన్నా ముందే దూరదర్శన్‌లో మేనక పై దాసరి నారాయణరావుతో టీవి సీరియల్ తీయించారు. 89 ఎన్నికల్లో ఎన్టీరామారావు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. ఎన్నికల నాటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అప్పటి వరకు పూర్తయిన సినిమానే కొన్ని కొన్ని భాగాలుగా జిల్లాలకు పంపించారు. అప్పుడు టిడిపి అభ్యర్థులు ఈ సినిమా ముక్కలను ప్రచారంలో ఉపయోగించుకోవాలన్నమాట. చివరకు ఈ సినిమా తుస్సు మంది. 89 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. కల్వకుర్తిలో స్వయంగా ఎన్టీఆర్ ఓడిపోయారు. మితిమీరిన ప్రచారమే ఈ సినిమా కొంప ముంచింది.
న్యూస్ చానల్స్ లేక ముందు సినిమా ప్రమోషన్ సాధారణ స్థాయిలోనే ఉండేది. చానల్స్ పెరిగాక ఇప్పుడు అన్ని చానల్స్‌లోనూ ప్రతి సినిమా ప్రచారం అదిరిపోతుంది. అయితే థియేటర్లలో మాత్రం సినిమా పప్పులు ఉడకడం లేదు. కథలో కొత్తదనం ఉంటే తప్ప సినిమాలు బతకడం లేదు. కానీ ప్రచారం మాత్రం అదిరిపోతుంది.
ఇప్పుడు 3 సినిమా తరహాలోనే గతంలో రజనీకాంత్ నటించిన బాబా సినిమా వ్యవహారంలో జరిగింది. ఆ సినిమాకు సైతం మితిమీరిన ప్రచారం కల్పించారు. పోటీ పడి ఆ సినిమా హక్కులు పొందిన వారు నిండా మునిగిపోయారు. వారి పరిస్థితి చూసి రజనీకాంత్‌కే జాలి కలిగింది. దాంతో తన సినిమాతో నష్టపోయిన వారిని కొంత వరకు ఆయన ఆదుకున్నారు. 3 సినిమాపై సైతం ఆదే విధంగా ఆశలు పెట్టుకొని ఎక్కువ మొత్తానికి కొన్నవారు ఆయన వైపు ఆశగా చూస్తున్నారు. 3 సినిమా ఫ్లాప్ కాగానే రజనీకాంత్ ఆ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదనే ప్రకటన చేశారు.
హీరో ధనుష్ ఆదుకుంటామని హామీ ఇచ్చారట! కానీ ఇప్పుడు ధనుష్ కానీ నిర్మాత అయిన వాళ్ల నాన్న కానీ దొరకడం లేదు. ఇది వ్యాపారం బాగా నడుస్తుందనే అత్యాశతో కొని నష్టపోగానే ఆదుకోమని చూడడం ఏమిటో? తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని ధనుష్ సినిమాను ఆరున్నర కోట్లకు కొనుగోలు చేయడం ఏమిటో? సినిమాలే కాదు రాజకీయ పక్షాలు సైతం మితిమీరిన ప్రచారంపై బోలెడు ఆశలు పెట్టుకొని తీరా ఫలితాలు వచ్చాక లబోదిబో మంటున్నారు. ప్రచారం కాదు సినిమాలో సరుకు చూసి ముందడుగు వేయాలి. మితిమీరిన ప్రచారానికి సినిమా వ్యాపారులు పడిపోతున్నారేమో కానీ ప్రేక్షకులు పడిపోవడం లేదని 3 సినిమా ప్లాప్ వ్యవహారం రుజువు చేస్తోంది.
మితిమీరిన ఆత్మ విశ్వాసం - వేలం వెర్రి ..అంటే..ఇలాగే ఉంటాయేమో..నండీ! ఆ అనుభవాలనుండి ఇతరులైనా పాఠాలు నేర్చు కుంటారో లేదో !?
రిప్లయితొలగించండివనజవనమాలి garu మరో సినిమా రాగానే మళ్లీ వేలం వెర్రిగా వెంట పడతారు. స్మశాన వైరాగ్యం లాంటిదే ఇదీ
తొలగించండికొలవెర్రి పాటే; ఒక పనికిమాలిన గొణుగుడే తప్ప ఏముందందులో...? విపరీత అతి ప్రచారం వలన అందరూ అది ఎలా ఉంటుందో అని చూసిన వారే గానీ, మెచ్చుకొనేవారెక్కడన్నా కనపడ్డారా.......? ఆ ఫలితమే ఇప్పుడు ఆ సినిమాలో కనపడింది. ఇదేమన్నా "యూట్యూబు క్లిక్కా"!!! ప్రతీదీ నమోదు కావటానికి. చూసిన ప్రతి ఒక్కరూ "ఫది మందికో వంద మందికో చెప్పినట్లున్నారు సినిమాకి అంత సీను లేదని".
రిప్లయితొలగించండిరాధ కృష్ణ గారు ఆ పాటలో ఏముందో నాకు అర్థం కాలేదు . నవతరం లో అనుకుంటా ఈ పాట చిన్న చిన్న పదాలతో బాగుంది కాబట్టి హిట్టయింది అని ఎవరో పాటల గురించి రాశారు. దాన్ని గూగల్ + లో ఎవరో పోస్ట్ చేస్తే నేను ఓ మాట అన్నాను సినిమా విడుదలయ్యాక , మూడు నెలల తరువాత ఆ పాట వినిపిస్తే అధ్బుత మయిన పాట అని ఒప్పుకున్దామని .. మూడు నెలలు కాదు కదా మూడు వారాల తరు వాతవినిపించలేదు ఆ పాట గురించి తెలియని వాణ్ణి వెర్రి వాడిని చూసినట్టు చూశారు ..
తొలగించండిబయ్యర్లకు అమ్మేముందు చిత్రం చూపించరనుకుంటాను. సరుకు చూడకుండానే ప్రచారం నమ్మి కొనే విధానం వున్నంత కాలం అది వ్యాపారం కాదు - జూదం. జూదంలో మరింత రిస్క్ వుంటుంది. అలాంటప్పుడు డబ్బులు పోనాయి అని వాపోతే అర్ధం వుండదు. సినిమా చూపించాకనే బయ్యర్లు కొనే విధానం రావాలి కానీ అలాంటి డిమాండు ఎక్కడా, ఎవరినోటా వినలేదు!
రిప్లయితొలగించండిశరత్ గారు సినిమా కొనే ముందు బయ్యర్లు చూస్తారు అయితే ఎక్కువగా సినిమా నిర్మాణం ప్రారంభం కాగానే అమ్మకాలు అయిపోతాయి . సాధారణంగా పలానా హిరో సినిమా అనగానే ఒక అంచనా ఉంటుంది. దాని ప్రకారం రేట్ లు పలుకుతాయి. ఒక సినిమాను వినోదం కోసం సినిమా చూసే వ్యక్తి కోణం ఒక రకంగా ఉంటుంది. ఆ సినిమా తో వ్యాపారం చేయాలనీ సినిమా చూసే వాడి కోణం ఒక రకంగా ఉంటుంది. ఆ పాట ను వేలం వెర్రిగా వింటున్నారు కదా అని బాగా హిట్ అవుతుందని ఎక్కువ డబ్బుకు కొన్నారు . శంకరాభరణం, ఆనంద్ లాంటి సినిమా లను చాలా మంది చూసి ఇదెవరు చూస్తారు అని కొనేందుకు ముందుకు రాలేదు
తొలగించండిఅసలు ఆ పాట లో ఎముందనో అంత బాగా నచ్చేసింది కొన్ని వేల మందికి. బాగా రాసారు.
రిప్లయితొలగించండివిశ్లేషణ ఎప్పటిలానే చక్కగా ఉన్నది, మరిన్ని విషయాలు తెలిసినాయి,
రిప్లయితొలగించండిఅతి సర్వత్ర వర్జయేత్ అనే సారాంశం బోధ పడింది,
ఒకప్పటి Megastar మూవీ శంకర్ దాదా ఇంకా శేఖర్ కమ్ముల's "ఆనంద్ " (మంచి కాఫీ లాంటి అబ్బాయి) ఒకే రోజు release అయ్యాయి.
పెద్దగ గా హంగులు ఆర్భాటాలు లేక పోయినా own capabilities రాధాకృష మ్యూజిక్, వేటూరి సాహిత్య౦, శేఖర్ వినూత్నత్వం కమ్మగా సాగిన కథనం అన్నీ సినిమాకు plus points
may be ఆ time లో కాస్త aware గా ఉన్నవాళ్ళు ఆనంద్ feel ని ఎప్పటికీ miss అవ్వరు,
అలానే ఆర్భాటం విషయం లో అప్పట్లో Teja news channel strat చేసేప్పుడు కూడా ! ఇలా చాలా hike create చేసారు కాని పెద్ద ప్రయోజనం లేదు
content is the king అని ఎక్కడో చదివాను, విషయం ఉంటేనే work out అవుతుంది,
otherwise వేస్ట్,
:)
?!