26, జులై 2012, గురువారం

మన్మోహన్ కన్నా రాహుల్ సమర్దుడా ?



 వేదాల్లో ఉంది అంటే గతం లో మనకు అది తిరుగు లేనిది అని చెప్పినట్టు .. ఇప్పుడు ఆమెరికా మాటనే మనకు వేద వాక్కు .. టైం  పత్రిక ఇటివల మన్మోహన్  సింగ్ వైపల్యాల నాయకుడిగా కవర్ పేజి స్టొరీ ప్రచురించింది .. పేరుకు ఆయన ప్రధాన మంత్రే అయినా పెత్తనం అంతా సోనియా గాంధీ దే .. క్రమంగా మన్మోహన్ ప్రతిష్ట మసక బారేట్టు చేశారు  . అదే సమయం లో రాహుల్ గాంధీ వెలుగులోకి వస్తున్నారు .. టైం లో  మన్మోహన్ సింగ్ వైపల్యం గురించి కవర్ స్టొరీ రావడం , అదే సమయం లో అమ్మి చెబితే కీలక బాద్యతలు స్వికరించడానికి రాహుల్  సిద్ధం అనే  ప్రకటన ఒకే సారి రావడం యాదృచ్చికమేనా ? మన్మోహన్ సింగ్ విఫలం చెందారు అనుకుంటే .. రాహుల్ గాంధీ ఆయన కన్నా సమర్దుడా? 



 సోనియా గాంధీ తనయుడు, కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. రాహుల్ పగ్గాలు చేపట్టేందుకు రాజకీయంగా ఇదే సరైన తరుణం అని కాంగ్రెస్ అధినాయకత్వం కూడా గుర్తించింది.
42 ఏళ్ల బ్రహ్మచారి అయన రాహుల్ - నెహ్రూ కుటుంబం నాలుగవ తరం నాయకునిగా కాంగ్రెస్ పగ్గాలు తద్వారా ఈ దేశ పాలనా పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌గాంధీ సిద్ధమవుతున్నారనేది స్పష్టం. ఇక తేలాల్సింది ముహూర్తం మాత్రమే. దీని కోసం రాహుల్‌గాంధీ ఎనిమిదేళ్ల లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యునిగా వారసత్వ హక్కు అతనికి దానంతట అదే వస్తుంది, కానీ మారిన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎనిమిదేళ్ల రాజకీయ శిక్షణ తీసుకున్నారు. 42 ఏళ్ల వయసు దాటినా ఆయన తన పెళ్లికి తొందరపడడం లేదు కానీ ఆయన పట్ట్భాషేకానికి కాంగ్రెస్ నాయకులు తొందర పడిపోతున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్ని ప్లాప్‌షోలు ప్రదర్శించినా ఆయన పట్ట్భాషేకాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాహుల్ తన భుజస్కందాలపై వేసుకున్నా పెద్దగా ఫలితం చూపలేకపోయారు.



 బీహార్‌లో అరవీర భయంకరంగా యుద్ధం సాగించి గతంలో కన్నా తక్కువ సీట్లు గెలిపించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమేధీ పార్లమెంటు నియోజక వర్గంలోని ఎమ్మెల్యే సీట్లను సైతం గెలిపించలేకపోయారు. అయినా రాహుల్‌కు ఎదురు లేదు.
సోనియా గాంధీ ఆరోగ్యానికి సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. కుమారుడికి తొందరగా పట్ట్భాషేకం చేసి బాధ్యతలు అప్పగించడానికి ఆమె ఆసక్తి చూపుతున్నారు. యుద్ధ రంగంలో విజయం సాధించాలంటే తన శక్తి సామర్ధ్యాల కన్నా ప్రత్యర్థి బలహీనతలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మన దేశంలోని రాజకీయ రంగంలో జరుగుతున్నది అదే. యుపిఏ ఎన్ని కుంభకోణాల్లో కూరుకుపోతున్నా యుపిఏను ఢీకొనే స్థాయిలో బిజెపి కానీ మరో కూటమి కానీ లేదు. ప్రత్యర్థుల ఈ బలహీనతే కాంగ్రెస్‌కు కలిసొస్తోంది. రాహుల్‌కు ప్రభుత్వంలో, పార్టీలో కీలక బాధ్యతలు లభించడం ద్వారా ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పలేం కానీ కచ్చితంగా దేశ రాజకీయాల్లో యువశకం మొదలవుతుందని చెప్పవచ్చు. అనివార్యంగా అన్ని రాజకీయ పార్టీలు యువశక్తిని బయటకు తీయక తప్పదు. 



ప్రధానమంత్రిగా ఉన్నపుడు బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టిన చంద్రశేఖర్ కాలంలో అధికారంలోకి వచ్చి పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించింది మన్మోహన్‌సింగ్. అలాంటి మన్మోహన్ సింగ్ యుపిఏ వన్‌లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సంస్కరణవాదులు మరింతగా సంతోషించారు. ఇప్పటివరకు సంస్కరణలు సూచించిన నాయకుడే స్వయంగా వాటిని అమలు చేసే స్థానంలో నిలవడం వారికి సంతోష కలిగించింది. యుపిఏ వన్ మొత్తం అంతా బాగుంది అనే పాజిటివ్ వేవ్‌లోనే సాగింది. అదే మన్మోహన్‌సింగ్, ఆయన్ని తెరవెనుక నుంచి నడిపించింది అదే సోనియాగాంధీ. గతంలో ఎప్పుడూ లేనన్ని కుంభకోణాలు బయటపడ్డాయి. మన్మోహన్‌సింగ్ ప్రతిష్ట, అంతకన్నా వేగంగా కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారుతున్న సమయంలో రాహుల్‌గాంధీ కీలక బాధ్యతలు చేపట్టడానికి సన్నద్ధం అవుతారనే వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. అమ్మ చెబితే సరే అంటూ అబ్బాయి కూడా సానుకూల సంకేతాలు ఇస్తున్నారు. నేనొక్కడినే ఇంతభారం మోయలేను, మంత్రివర్గంలో చేరి కొంత భారం పంచుకో అని మన్మోహన్‌సింగ్ ఎప్పుడో రాహుల్‌గాంధీకి ఆఫర్ ఇచ్చారు. మన్మోహన్‌సింగ్ తిరుగుబాటు చేసే నాయకుడు కాదు, తిరుగుబాటు చేయడానికి పెద్దగా ప్రజాభిమానం లేదు. ఆ విషయం ఆయనకూ తెలుసు. తన పక్కన చోటు కాదు ఏ రోజు కావాలంటే ఆ రోజు తన కూర్చున్న సీటే యువరాజు కోసం త్యాగం చేయడానికి సదా సిద్ధంగా ఉన్న రాజభక్తుడతను. రాహుల్‌గాంధీ కోసం మన్మోహన్ సింగ్ సదా సిద్ధంగా ఉంటారు.


రాహుల్ కన్నా ముందు రాజకీయాల్లో ప్రియాంక గాంధీ వారసురాలిగా వస్తారని విస్తృతంగా ప్రచారం సాగింది. ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయంటూ బాగానే ప్రచారం సాగింది. వాస్తవానికి రాహుల్‌తో పోలిస్తే ప్రియాంకలో ప్రజలు ఆకట్టుకునే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కుటుంబ రాజకీయంలో ఏం జరిగిందో కానీ హఠాత్తుగా ప్రియాంక తెరమరుగయ్యారు. రాహుల్ తెరపైకి వచ్చారు. ఇప్పుడు రాహుల్ కోసం క్రమంగా మన్మోహన్‌సింగ్ తెరమరుగు అయ్యే రోజులు సమీపించాయా ?

25, జులై 2012, బుధవారం

రాహుల్ కు మము బ్రోవమని చెప్పవే సోనియమ్మా

రాజేశ్ అంటూ రెండు చేతులు పైకెత్తి కెవ్వున కేక పెట్టిందావిడ. నన్ను వంటరి దాన్ని చేసి వెళ్లి పోయావా? రాజేశ్... గట్టిగా ఏడవ సాగింది. తెర రెండు ముక్కలైంది. కృష్ణ కళ్లలో నీళ్లు నిండాయి. శూన్యంలోకి చూస్తూ తనలో తానే మాట్లాడుకోసాగాడు.


 అది చూసి అనుపమ గట్టిగా నవ్వింది పిచ్చి కృష్ణ ఎందుకేడుస్తున్నావు. రాజేశ్ చనిపోగానే షాక్ తిన్నావు కదూ ఏం మాట్లాడాలో తెలియడం లేదు కదూ! ఇనుప రేకులు సీరియల్ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రారంభమైంది. మా అమ్మ ఈ సీరియల్ ఫ్యాన్, ఆ తరువాత నేను ఫ్యాన్ నయ్యాను. ఇప్పుడు నువ్వు కూడా.. అయినా అంతగా ఏడవాల్సిన అవసరం లేదు రాజేశ్ ఈ సీరియల్ తమిళ్‌వెర్షన్ రాత్రే చూశాను డైలాగులు అర్ధం కావు కానీ విషయం అర్ధమైంది నిజానికి రాజేశ్ చనిపోడు. రాజేశ్ చనిపోయాడని గంగ కల కంటుంది. నిద్ర నుంచి లేచి గట్టిగా ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వు చూసింది గంగ కల మాత్రమే. రెండు వారాల వరకు ఈ సస్పెన్స్ కొనసాగించి ఇది కల అని రెండు వారాల తరువాత చూపిస్తారు. తమిళ సీరియల్స్ మన కన్నా రెండు ఎపిసోడ్లు ముందున్నాయి అని అనుపమ చెప్పుకుపోతూనే ఉంది.


 నువ్వేం చెబుతున్నావో నాకస్సలు అర్ధం కాలేదు అని కృష్ణ అయోమయంగా చూసాడు. అత్తా మామల దొంగాట సీరియల్‌లో గోపిలానే ఎంత అమాయకంగా ముఖం పెట్టావు కృష్ణ నాకు తెలియదనుకున్నావా? ఇనుప రేకులు సీరియల్‌లో రాజేశ్ చనిపోయాడనే కదా నీకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి అని అనుపమ అడిగింది. ఇవి కన్నీళ్లు కావు అనుపమ ఆనంద భాష్పాలు న్యూస్ చానల్‌లో ఆ వార్తను చూసినప్పటి నుంచి నాకు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, అనందంతో మనసు గెంతులేస్తోంది. అందుకే ఇలా పిచ్చిపిచ్చిగా కనిపిస్తున్నాను అంతే కానీ అదేదో పిచ్చి సీరియల్‌లో పిచ్చోడెవడో చచ్చిపోయాడని పిచ్చిదెవరో ఏడిచినందుకు నేనేడవడం లేదు అని కృష్ణ చెప్పాడు.


మీకు కన్నీళ్లు తెప్పించిన ఆ వార్త ఏమిటో? అని అనుపమ వెటకారంగా అడిగింది. అమ్మ చెబితే చేస్తాను. ఈ కాలంలో ఈ మాట ఒక యువకుడి నోటి నుండి రావడం ఊహింగలవా? అనుపమా? అందులోనూ 42 ఏళ్ల సీనియర్ యువకుడు. పదేళ్ల పిల్లలకు మనం పని చెబితే మాట వినకుండా తుర్రు మంటున్నారు. అలాంటిది నెహ్రూ కుటుంబానికి చెందిన గాంధీ పేరు తగిలించుకునే ఆ కుటుబం వారసుడు ఈ వయసులో కూడా తల్లి చాటు బిడ్డలా అమ్మ చెబితే వింటాను అనగానే నా మనసు పులకించి పోయింది, నా కళ్లు ఆనంద భాష్పాలు రాల్చాయి. అప్పుడెప్పుడో ప్రధానమంత్రి సింగు గారు బాబు నా ఒక్కడి వల్ల కావడం లేదు, కాస్త పాలనా పగ్గాలు చేతపట్టి సహకరించు అని కోరితే ఇంత కాలానికి ఆ దరఖాస్తు పరిశీలించి మా అమ్మ చెబితే వింటాను అంకుల్ అని యువరాజు ప్రకటించాడు.


 ఆస్తి కోసం తల్లిదండ్రులు ఎప్పుడు పోతారా? అని ఎదురు చూసే పిల్లలు, మామను పక్కుకు తప్పించి అధికారం చేపట్టే అల్లుళ్లు ఉన్న ఈ కాలంలో రా రమ్మని పిలిస్తే అమ్మ చెబితే వింటాను అనే కొడుకు ఉంటాడా?


రాష్ట్రం కోసం నేను ఒకే కొడుకును కన్నాను అని అప్పుడెప్పుడో చంద్రబాబు గారు చెప్పినప్పుడు రాష్ట్రం కోసం జీవితాలను త్యాగం చేసే మహానాయకులు పుట్టిన పుణ్యభూమిలో నేను పుట్టాను అని ఇదే విధంగా కన్నీళ్లు కార్చాను. 56ఏళ్ల వయసులో హీరో పాత్రను కొడుక్కు త్యాగం చేసి ప్రజలకు సేవ చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నప్పుడు ఆయన త్యాగ నిరతికి ఇదే విధంగా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇంత కాలానికి మళ్లీ కన్నీళ్లు తెప్పించాడు రాహుల్ బాబు. అమ్మ చెబితే వింటాను ఎంత తీయని మాట. ఎంత కాలానికి విన్నానీ మాట. అప్పుడెప్పుడో ఎన్టీరామారావు సినిమాల్లో నటించే కొత్తలో అమ్మాయిలు పెళ్లి చూపుల్లో అమ్మా నాన్న ఎలా చెబితే అలా వింటాను అనేవాళ్లు. ఇప్పుడు వాళ్లే సంబంధాలు చూసుకుని మీరు ఒకే అంటే సరే లేదంటే నేనే ఒకే అంటా అనేస్తున్నారు.


 వంద కోట్లు దాటిన భారతీయుల బరువు బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ బాబు అమ్మ చెబితే వింటాను అంటున్నారు. అందుకే నా కళ్లు చెమ్మగిల్లాయి అని కృష్ణ చెప్పుకుపోతుంటే అనుపమ కూడా కన్నీళ్లు ఆపుకోలేక పోయింది. 


మీరు ఇనుప రేకులు సీరియల్ హీరో చనిపోయాడని ఏడుస్తున్నారను కున్నాను కానీ మీ కన్నీళ్ల వెనుకు ఇంత చరిత్ర ఉందని ఊహించలేకపోయానండి. పిజ్జా తినవద్దే అని చిలక్కు చెప్పినట్టు చెబితే చిన్నది అమ్మ చెబితే వినాలా? అంటూ కావాలని పెద్ద దాన్ని కూడా తీసుకొని పిజ్జా కార్నర్‌కు వెళ్లిందండి. పిజ్జాల కోసమే తల్లిదండ్రుల మాటను ఖాతరు చేయని పిల్లలున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద దేశాన్ని పాలించే బాధ్యతను కూడా అప్ప చెబితే వింటాను అనడం చూస్తుంటే ఆ బాబు త్యాగంతో దేశం పులకించి పోయి తీరుతుందండి. రాహుల్ బాబే కాదు ఆయన మనవడు కూడా ఇంకో వందేళ్ల తరువాత కూడా ఆ వంశం వాళ్లే ఈ దేశాన్ని పాలించాలి. ఇదే నా శాపం.. సారీ నా దీవెన... 


అప్పుడెప్పుడో భీష్ముడు ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు. తన కుటుంబం కోసం ఆయన బ్రహ్మ చారిగా ఉంటే ఆయన్ని కీర్తిస్తున్నారు కానీ రాహుల్ బాబు దేశాలు, ఖండాలను దాటి ఎంతో నల్లపిల్లను, ఆఫ్రికా పిల్లను కూడా గాఢంగా ప్రేమించి దేశాన్ని పాలించాల్సిన బాధ్యతను భుజస్కంధాలపైకి ఎత్తుకోవడానికి చివరకు పెళ్లి కూడా చేసుకోలేదు. మన దేశానికి కావలసింది ఇలాంటి త్యాగ పురుషులే అంటూ అనుపమ కళ్లు తుడుచుకుంది.
రాహుల్ బాబు అమ్మ ప్రేమ చూసి మీకూ కళ్ళు  చెమ్మ గిల్లాయా ?

18, జులై 2012, బుధవారం

రాజకీయ భారతం లో అల్లుళ్ళ పర్వం ... మన భాగ్య విధాత బాబు అల్లుడా ?బాలయ్య అల్లుడా ?

ఆషాడ మాసంలో కొత్త అల్లుడి కష్టాలు అనుభవించిన వారికే తెలుస్తాయి. ఇలాంటి వింత ఆచారం తెలుగువారికే ప్రత్యేకం. పెద్దింటల్లుడు, అల్లుడుగారు, అబ్బో ఒకటా రెండా తెలుగునాట అల్లుడిపై ఉన్నన్ని సినిమాలు మరే భాషలోనూ కనిపించవు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనితో మొదలు పెడితే అల్లుడి సామెతలు లెక్కలేనన్ని.
ఒక నవాబు మహాభారతం మొత్తం విని ఏక్ బూడా....ఒక వృద్ధుడు, ఒక యువకుడు మాత్ర మే మహావీరులు మిగిలిన వారంతా తుక్కు అని తేల్చేశాడు ఉర్దూలో. భీష్ముడు,అభిమన్యుడు మాత్రమే మహావీరులన్నమాట! అభిమన్యుడు కడుపులో ఉండగానే పద్మవ్యూహాం గురించి సగం తెలుసుకున్నాడు. కృష్ణుడు వచ్చి అక్కడితో ఆపివేయించాడంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి సులభంగానే వెళ్లగలిగినా, బయటకు రాలేకపోయాడు. శ్రీకృష్ణుడికి అభిమన్యుడు స్వయాన మేనల్లుడు. అల్లుడి శక్తిసామర్ధ్యాలు తెలుసు కాబట్టే అభిమన్యుడ్ని అంతకు మించి తెలుసుకోకుండా చేయడంలో మామ విజయం సాధించాడని అంటారు. కంసుడికి అల్లుడి సామర్ధ్యం సరిగా తెలియకనే కదా! ప్రాణాలు హరీమనిపించుకున్నాడు. అల్లుడిగా మామపై విజయం సాధించిన ఘన చరిత్ర వల్లనే శ్రీకృష్ణుడు అల్లుడి శక్తిని పరిమితం చేశాడేమో అని కొందరి అనుమానం. దీనికి వ్యాసుడు చెప్పిన కారణాలు ఏమైనా రాజకీయ విశే్లషకులు, మన విశే్లషకులు మాత్రం అభిమన్యుడి వ్యవహారంలో కృష్ణ మామ కుట్ర ఉందని అనుమానిస్తారు. చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. శిశువు అయినా అల్లుడు ప్రాణాలకు ముప్పు అని కంసుడు భయపడి జాగ్రత్తలు తీసుకున్నా, అల్లుడి చేతిలో హతం కాక తప్పలేదు.
స్వతంత్ర భారతంలో నెహ్రూ శకం నుంచే అల్లుడి చరిత్ర మొదలవుతుంది. నెహ్రూతో పాటు ఆయన అల్లుడు ఫిరోజ్ గాంధీ సైతం పార్లమెంటు సభ్యుడు. అయినా ఆయన మామ ప్రభుత్వంపై నిప్పులు చెరిగే వారు. ఆయన మరణం రాజకీయాల్లో కొందరి ఆలోచనల్లో ఒక మిస్టరీ.

సోనియమ్మా ఇటలీ తెలివి తేటలతో అల్లుడి సమస్యను మొదట్లోనే పరిష్కరించుకున్నారు . కోడలి సమస్య ఆమెకు ఇంకా రాలేదు  


అన్నపేరుకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయినట్టు, అల్లుడు పదానికి బాబు పెట్టింది పేరు. రాజకీయాల్లో అల్లుడు గారు అనగానే కాంగ్రెస్ వారికి సైతం చంద్రబాబే గుర్తుకు వస్తారు. అమ్మ (ఇందిరమ్మ) ఆదేశిస్తే మామపై పోటీ చేస్తానని 82లో చంద్రబాబు సవాల్ చేశారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఏ విషయం అయినా చంద్రబాబు కుండ బద్ధలు కొట్టినట్టు చెంప చెళ్లుమనిపించేట్టు, జీవితంలో మరిచిపోని విధంగా చెప్పగలరు. ఉచిత విద్యుత్ వల్ల విద్యుత్ తీగలు బట్టలారేసుకోవడానికి పనికి వస్తాయని చెప్పినా, కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని చెప్పినా ఆయన ఒక్కసారి చెబితే జీవితంలో మరిచిపోని విధంగా చెబుతారు. సినిమాల్లో దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ డైలాగులను ఒకసారి వింటే మరువలేం, రాజకీయాల్లో ఆయన అల్లుడు గారి డైలాగులూ అంతే పవర్‌ఫుల్ . పాపం మామగారికే ఆయన పవర్ అర్ధం కాలేదు. ఓడిపోయాక ఆయన టిడిపిలోకి వస్తానని దరఖాస్తు చేసుకుంటే మా అల్లుడు గారు వస్తున్నారు అని సమావేశంలో ఎన్టీఆర్ చెప్పగానే ముక్తకంఠంతో అంతా ఒకేసారి వద్దూ అనేశారట! పాపం వాళ్లంతా అల్లుళ్లతో ఎంత విసిగివేసారిపోయిన నాయకులో కదా? ఎన్టీఆర్ మాత్రం చిన్నబుచ్చుకుని, నాదెండ్ల భాస్కర్‌రావు, జానారెడ్డి, ఉపేంద్ర, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి ఒకరికి తెలియకుండా ఒకరిని ఒప్పించి అల్లుడిగారి స్వగృహ ప్రవేశానికి స్వాగతం పలికారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పార్టీ వీడి మరో పార్టీకి వెళ్లినప్పుడు పలికే తొలి డైలాగు ‘సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది’. ఈ డైలాగు ఒక్క బాబు విషయంలో మాత్రమే న్యాయమైనది. ఎందుకంటే అల్లుడికి మామగారిల్లు సొంతిల్లే కదా!
అస్తవ్యస్థంగా ఉన్న దేశానికి ఒక దిశ చూపిన నెహ్రూ లాంటి దార్శనికుడే అల్లుడితో బెంబేలెత్తిపోయారు. అలాంటిది ఎన్టీరామారావుకు ఇద్దరు అల్లుళ్లు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం మొత్తం ఇద్దరు అల్లుళ్ల రాజకీయాలతో సతమతమయ్యారు. నడుచుకుంటూ ఆలసిపోయిన వ్యక్తి సైకిల్‌పై లిఫ్ట్ అడిగి, కొంత దూరం వెళ్లాక సైకిలే ఎత్తుకెళితే ఎలా ఉంటుంది? పాపం అలాంటి పరిస్థితిలోనే అల్లుడి దెబ్బకు ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసిపోయింది. రాజకీయాలను కాచి వడపోయడం వల్ల వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడికి బయ్యారం అప్పగించి,కొడుక్కు రాజకీయం రాసిచ్చారు 



సినిమా రంగంలోనే ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేయాలో రిహార్సల్స్ చేయడం లోనే  చిరంజీవి కాలం గడిచిపోయింది. ఆయన ముఖ్య మంత్రి అయితే ఆ పదవి ఎలా కొట్టి వేయాలా అనే ఆలోచనలతోనే చిన్నల్లుడి జీవితం తెల్లారింది ..  మామ అల్లుళ్ళు ఇద్దరినీ రాజకీయం దెబ్బతీసింది .


 రాజకీయాలే ఊపిరిగా పీల్చుకునే కెసిఆర్‌ను ఆయన మేనల్లుడు మించి పోతాడేమో అనే సందేహం పార్టీలో చాలా మందిలో కనిపిస్తుంది. చంద్రబాబుకు ఒకే ఒక కొడుకు కాబట్టి అల్లుడి బాధ లేదని ఆయన అభిమానులు అనుకున్నారు.


నుదుటిపై రాసిపెట్టి ఉంటే ఎలాగైనా తప్పదేమో! సొంతల్లుడు లేకపోతేనేం అల్లుడి వరుస అయ్యే జూనియర్ ఎన్టీఆర్ బాబు భవిష్యత్తు రాజకీయాలను ప్రశ్నార్ధకంగా మార్చారు. నన్ను గెలిపించండి సాధ్యం కాకపోతే మా అబ్బాయిని ఆదరించండి అంటూ బాబు త్యాగానికి సిద్ధపడుతున్న సమయంలో అల్లుడు నేనున్నాను అంటున్నారు. బావకోసం తండ్రిని త్యాగం చేసిన బాలకృష్ణ ఇప్పుడు అల్లుడు లోకేశ్ కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని త్యాగం చేసేందుకు రిహార్సల్స్ చేస్తున్నారు.


ఒలింపిక్ కాగడాను ఒకరి నుంచి మరొకరికి అందించినట్టుగాఅల్లుడి సమస్య ఒకరి నుంచి ఒకరికి వారసత్వంగా వస్తోంది  తెలుగు రాజకీయం. తెలుగు ప్రజలు అల్లుడి కుమారుడిని ఆదరిస్తారా? అల్లుడిగారి అల్లుడిని ఆదరిస్తారా? కాలమే తేల్చాలి. భవిష్యత్తు తెలుగు కిరీటం బాలకృష్ణ అల్లుడిదా? బాబు అల్లుడిదా? తేలాలంటే వేచి చూడాలి.


ముక్తాయింపు:ఏదీ శాశ్వతం కాదు. అల్లుడూ ఒకనాటికి మామ అవుతాడు.

11, జులై 2012, బుధవారం

పబ్లిక్ అంటే ఎవరు?

‘‘మనిషి పుట్టుక రహస్యాన్ని విప్పి చెప్పే దైవ కణాన్ని శాస్తవ్రేత్తలు కనిపెట్టేశారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని పబ్లిక్ నాడి కణాన్ని మనం పసికట్టేస్తే, ఏ ఎన్నికల్లో వాళ్లు ఎవరికి ఓటు వేస్తారో? ఎవరిని ఎందుకు గెలిపిస్తారో, ఎందుకు ఓడిస్తారో తెలిసిపోతుంది. పబ్లిక్‌ను పట్టుకుని కొన్ని ప్రశ్నలు వేసి వారి మనసులోని మర్మాన్ని కనిపెట్టామంటే దాన్ని రాజకీయ పక్షాలకు ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఖర్చు ముఖ్యం కాదు మన నాయకులకు గెలుపు సీక్రెట్ ముఖ్యం.
సరే పబ్లిక్‌తో మాట్లాడదాం పదా?’’ ‘‘ఇంతకూ వాళ్ళెక్కడుంటారంటావు’’
‘‘ఇందుగలడందు లేడను సందేహం వలదు ఎందెందు వెదికినా పబ్లిక్ అందందు కనిపించును’’


‘‘బాబూ మురికి వాడ ముఖేష్ పబ్లిక్ గురించి కొంత చెబుతావా? ఏమీ లేదు. పబ్లిక్ ఎవరిని ఎందుకు అభిమానిస్తుంది? ఎందుకు వ్యతిరేకిస్తుంది? అసలు పబ్లిక్ ఉద్దేశం ఏమిటి?’’
‘‘సార్ ఈ ప్రజలకు అస్సలు దిమాక్ ఉండదు. పబ్లిక్ పిచ్చోళ్లు. ఎవడో ఏదో చెబితే వాడి మాటలు నమ్మి ఓటేస్తారు? ఐదేళ్ల వరకు వాడు కనిపించడు, మస్త్ సంపాదించుకుంటాడు’’?
‘‘ఓహో అలాగా బాగా మాట్లాడుతున్నావు’’
‘‘నన్ను టీవి చానల్స్‌లో చూళ్లేదా? సార్ మా కాలనీలో నీళ్లు రాకపోయినా, కూరగాయల రేట్లు ఎక్కువున్నా మేం ఎలా బతకాలి అంటూ చానల్స్‌లో గొంతు చించుకుని అరిచేది నేనే సార్.’’


మురికివాడ ముఖేష్‌తో మాట్లాడాక ఒక విషయం తెలిసింది. మురికి వాడల్లో ఉండేవాళ్లు పబ్లిక్ కాదు ... మరి పబ్లిక్ ఎక్కడ దొరుకుతారో అని రోడ్డుపై చూస్తుంటే వెతకబోయిన తీగ కాలికి తాకినట్టు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అని రాసి ఉన్న ఆర్టీసి బస్సు కంటి చూపుకు తాకింది. పరిగెత్తుకెళ్లి బస్సెక్కి తంతే బూరెల బుట్టలో పడ్డట్టు పబ్లిక్‌లో పడ్డాను. తపస్సు మొదలు పెట్టగానే దేవుడు ప్రత్యక్షమైనట్టు అంత మంది పబ్లిక్‌ను చూడగానే సంతోషం వేసింది.
ముందు పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారో వింటే సందేహం తీరిపోతుందని వారి మాటలను ఆలకించాను.


‘‘ఈ పబ్లిక్ ఎప్పుడేం చేస్తారో, ఎవరిని ఎందుకు గెలిపిస్తారో అస్సలు అర్ధం కాదు . పబ్లిక్ సార్.. పబ్లిక్ వీళ్లకు దిమాకుండదు, ఎవరేం చెప్పినా నమ్మేస్తారు, గొర్రె కసాయోడినే నమ్మినట్టు వీళ్లు నమ్ముతారు. పబ్లిక్ అంతే..’’ బస్సులో ఉన్న వాళ్లంతా పబ్లిక్‌ను తిడుతున్నారు అంటే బస్సులో ఉన్నవాళ్లంతా పబ్లిక్ కాదు.
ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే, అసలు పబ్లిక్ ఎవరో తెలుసుకోవలసిన పరిస్థితి వచ్చి పడింది. ..
గూగుల్‌లో దొరకని సమాచారం ఉండదు, హైదరాబాద్‌లో ఆటోవానికి తెలియని పబ్లిక్ ఉండరని బాబూ ఆటో జానీ పబ్లిక్ విషయం కాస్త చెబుతావా?
‘‘సార్ ఈ పబ్లిక్‌ను చూస్తే పిచ్చికోపం వస్తుంది. మేం చార్మినార్ వైపు వెళ్లే పనిలో ఉంటే వాళ్లేమో సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళదామంటారు. మా ఆటో మా ఇష్టం అంతే కానీ వాళ్లు చెప్పిన చోటుకు మమ్మల్ని రమ్మనడం న్యాయమా?’’
‘‘సరే నీ గోడు తరువాత ముందు పబ్లిక్ గురించి చెప్పు...’’
‘‘పబ్లిక్‌కు దిమాక్ ఉంటే ఇలా ఎందుకుండేది’’
‘‘హమ్మయ్య నీ మాటతో ఒక విషయం తెలిసింది. ఆటో వాళ్లు పబ్లిక్ కాదన్నమాట!’’
రవి చూడనిది కవి చూస్తాడనేది పాత మాట. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ చిలిపి కాల్స్‌ను కూడా జర్నలిస్టులు చూసేస్తున్నారు కాబట్టి వీరికి తెలియంది లేదు.
‘‘జర్నలిస్టు గారూ అసలు పబ్లిక్ ఇలా ఎందుకు ఓటేస్తుందంటారు?’’
‘‘వీళ్లకు... ’’..
‘‘అబ్బా ఏదైనా కొత్తగా చెబుతారేమో అనుకుంటే మీరూ సేమ్ డైలాగా?’’


‘‘కుల సంఘం మీటింగ్ అని బోర్డు కనిపిస్తోంది. కుల సంఘంలో ఉన్న రాజకీయ చైతన్యం మరెక్కడా ఉండదంటారు సరే అక్కడికి వెళదాం.’’
‘‘మన కులం వాళ్లు దేశానికి, రాష్ట్రానికి తమ జీవితాలను దారపోశారు. పబ్లిక్‌కు ఇంత కృతజ్ఞత కూడా లేదు. మన కులం వాళ్లను కాదని, మన వ్యతిరేక కులం వారిని ఆదరిస్తే సహించేది లేదు ’’
‘‘ఓహో వీళ్ల కులం వాళ్లు పబ్లిక్ కాదన్నమాట!’’
ఈ మధ్య సోషల్ సైట్స్‌లో పబ్లిక్ యమ యాక్టివ్‌గా ఉంటున్నారట! ఇదిగో పబ్లిక్ ఎన్నికల్లో పబ్లిక్ ఎందుకిలా చేస్తున్నారంటారు?
ప్రశ్నకు వందల మంది సమాధానం చెప్పారు. అందరి మాటల్లోని అర్ధం ఒకటే పబ్లిక్‌కు తెలివిలేదు.
అంటే సోషల్ సైట్స్‌లోని వాళ్లు కూడా పబ్లిక్ కాదన్నమాట
మేధావి గారూ, ఎన్‌జివో, నిరుద్యోగి, రాజకీయ నాయకుడు, డాక్టర్, ఇంజనీర్, ఐటి ఉద్యోగి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎ టు జడ్ కులాలు, ఆస్తికుడు, నాస్తికుడు, జైలులో ఉన్న నాయకులు, జైలు బయట ఉన్న నాయకులు, జైలుకు వెళ్లకుండా తప్పించుకున్న నాయకులు ఏంటీ మీరందరి సమాధానం ఇదేనా?
మార్నింగ్ వాకింగ్ లో ,  అర్ధరాత్రి  పబ్బుల్లో అందరి మాట ఇదేనా ? 


సందేహాలకు సమాధానం లభించకుండానే ఈ జీవితం ముగుస్తుందా? దేవుని విగ్రహానికి తల బాదుకోవాలనిపిస్తోంది. హే భగవన్ ఇంతకూ పబ్లిక్ ఎక్కడున్నారయ్యా? అని నిలదీస్తే,


‘‘పిచ్చివాడా! పబ్లిక్ అంటూ ఆకాశంలో ఎక్కడో ఉండరు. పబ్లిక్ పిచ్చివాళ్లు అని చెప్పిన మురికివాడ ముఖేష్ నుంచి జూబ్లీహిల్స్ కోటీశ్ వరకు వీళ్లంతా కలిస్తేనే పబ్లిక్. ఎవరికి వారు నేను తప్ప అంతా పబ్లిక్ అనుకుంటున్నారు అదే మీతో వచ్చిన తంటా! మీ గురించి మీకే తెలియదు ఇక భగవంతుడ్ని కనుగొంటారా?’’అని ఆకాశవాణి పలికినట్టు వినిపించింది  .
ముక్తాయింపు ... నువ్వొక్కడివే జనం కాదు... నువ్వూ జనమే 

5, జులై 2012, గురువారం

గొంతులో కిచ.. కిచ .. కార్పొరేట్ యంగటర్క్‌లపై వెరైటీ సర్వే

మూడు పదుల వయసు దాటకముందే ఆరు అంకెల జీతాలు అందుకుంటున్న కార్పొరేట్ కుర్రకారుకు -జీతానికి తగ్గట్టుగానే మానసిక ఒత్తిళ్లూ ఉంటాయన్నది వాస్తవం. ఇదొక్కటే తీవ్రమైన సమస్య అనుకునే వాళ్లూ చాలామందే ఉంటారు. నమ్మకాలకు తగ్గట్టుగానే పలు సర్వేలు సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. అయితే ఇటీవల ఒక సంస్థ కాస్త వెరైటీ కోసం ఇంకాస్త భిన్నమైన సర్వే నిర్వహించింది.


 రొటీన్ అయిపోయిన -మానసిక ఒత్తిడి అంశాన్ని పక్కనపెట్టి ‘వృత్తివల్ల గొంతుకొచ్చిన కష్టమేంటి?’ అనే అంశంపై ఓ పెద్ద సర్వే నిర్వహించింది. కన్ను నొప్పో, కాళ్ల నొప్పుల గురించో అయితే పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ, ‘వృత్తికీ గొంతుకీ లింకేంటి?’ అంటూ సర్వేలో కుర్రాళ్లు కూడా ఉత్సాహంగానే పాల్గొన్నార్ట. సర్వేలో సింపుల్‌గా తేల్చిన సారాంశం ఏంటంటే -‘కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. వృత్తిరీత్యా గొంతు చించుకుంటే నోటి మాటకు తాళం పడుతుంది. వా...’ అంటూ కార్పొరేట్ కుర్రాళ్లు వాపోయారని. సమస్య సిల్లీగా అనిపించినా, సబ్జెక్ట్ మాత్రం కాస్త సీరియస్సే అంటున్నారు కార్పొరేట్ యంగటర్క్‌లు. ఎందుకంటే మానసిక ఒత్తిడి సమస్య ఎలా ఉన్నా, వృత్తిరీత్యా ఎక్కువ మాట్లాడాల్సిరావడం, గొంతుచించుకోవాల్సిన ప్రాజెక్టు టార్గెట్ల వల్ల -వోకల్ కార్డ్స్ శ్రమకు గురై కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయట. ముఖ్యంగా బిపివో కంపెనీల్లో పని చేసే ఎక్కువ మంది యూత్, ఈ సమస్య బారిన పడుతున్నారని సర్వే తేల్చిచెప్పింది.


 సగటున పదిమంది ఎగ్జిక్యూటివుల్లో కనీసం నలుగురు ఇలాంటి గొంతు సంబంధ సమస్య ఎదుర్కొంటున్నారన్నది సర్వే తేల్చిన సారాంశం. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంద’ని మనకో సామెత ఉంది. అంతేకాదు ‘నోరు జారితే, వీపు పగులుతుంద’న్న సామెతా ఉంది. ఈ రెండు సామెతల సమాంతరార్థం -సున్నితంగా మాట్లాడాలని. కానీ, పరుగుల కాలంలో, టార్గెట్ ఓరియంటెడ్ వృతుల్ని చేపట్టాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో -సున్నితమైన అంశాన్ని కూడా గొంతు చించుకుని చెప్పాల్సి వస్తుందని కుర్రాళ్లు గగ్గోలు పెడుతున్నారు. వోకల్ కార్డ్స్‌ను అరగదీస్తే తప్ప, వ్యవహారాన్ని చక్కబెట్టే పరిస్థితి లేదన్న ఆవేదన సర్వేలో పంచుకున్నార్ట. ‘బిపివో రంగంలో ఉన్న యువతరంలో -త్రోట్ ఇన్‌ఫెక్షన్ అనేది సర్వసాధారణం’ అని 22 నుంచి 35 ఏళ్ల వయసులో ఉన్న 300మంది ఎగ్జిక్యూటివ్‌లను ప్రశ్నించి ఒక నిర్ణయానికి వచ్చారు. 


ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో బ్రాండ్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే గోపాల్ ఏం చెప్తున్నాడంటే -‘ఒక్కరోజులో నేను ఎక్కువ ఫోన్ కాల్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, క్లయింట్ల సందేహాలకు సమాధానం చెప్పడం, వారిని ఒప్పించడానికి ఎక్కువ సేపు మాట్లాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కూడా. ఇలాంటి పరిస్థితుల వల్ల గొంతులో మార్దవం తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కోసారి గొంతు నొప్పితో విపరీతంగా బాధపడుతుంటాను. అయినాకానీ, వృత్తిపరమైన చాలెంజ్‌లు అధిగమించడానికి మళ్లీ మళ్లీ మాట్లాడక తప్పదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అలా గొంతులో సమస్య తలెత్తినప్పుడు ఏదోక మెడిసిన్ తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలిగినా, మళ్లీ మామూలే’ అంటాడు పాతికేళ్ల గోపాల్. బిపివో రంగంలోవున్న, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో పని చేస్తున్న, కార్పొరేట్ కళాశాలల్లో అధ్యాపక వృత్తి కొనసాగిస్తున్న వాళ్లనే ప్రధానంగా లక్ష్యం చేసుకుని సర్వే జరిపామన్నది నిర్వాహకుల మాట. -‘దేశంలో మహిళలు, పురుషులు అన్న భేదం లేకుండా గొంతు సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో 35 శాతం మంది ఈ సమస్యతో బాధ పడుతున్నవాళ్లే. 62.7 శాతం మేనేజర్లు, జనరల్ మేనేజర్లు గట్టిగా మాట్లాడటం వల్ల గొంతుకు సంబంధించి సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరి మాటల్లో సున్నితత్వం లేకుండా, గరుకుగా మారుతోందట! తమ గొంతులో మార్ధవం మాయం కావడం, బండగా మారడం వల్ల గొంతుమీద వాళ్లకే ఒక్కోసారి చిరాకు పుడుతుందన్న విషయాన్ని సర్వేలో తేటతెల్లం చేశారు. కాల్ సెంటర్స్‌లో ప్రతి పదిమంది సిబ్బందిలో ఇద్దరు గొంతులో సున్నితత్వం కోల్పోయి బండ గొంతులతోనే కనిపిస్తున్నార్ట. అయితే, గొంతులో ఇలాంటి మార్పులకు గట్టిగా మాట్లాడటం, ఎక్కువ మాట్లాడటం ఒక్కటే కారణం కాదన్నది ఇఎన్‌టి నిపుణులు చెప్తోన్న మాట. ప్రధానంగా యువత గట్టిగా మాట్లాడటమే కాకుండా, పొల్యూషన్, ఒత్తిడివంటి అంశాలు కూడా గొంతులో మార్పునకు కారణమవుతోందని అంటున్నారు. అయితే, ఈ పరిస్థితికి బెదిరిపోవాల్సిన పనిలేదన్నది నిపుణుల మాట. 


ఈ అంశంలో వైద్య రంగం చాలా ముందుకెళ్లిందని, ఇసిజి వాయిస్ బాక్స్ ద్వారా ఒక వ్యక్తి ఏవిధంగా మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడితే బాగుంటుందని చెప్పవచ్చని కూడా సూచిస్తున్నారు. ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, తల్లుల గొంతు సమస్య ఇతరులకు ఇబ్బందికరంగా మారుతోంది. చాలామంది పిల్లలకు పాఠాలు చెప్పాలి కాబట్టి సాధారణంగా ఉపాధ్యాయులు గట్టిగా మాట్లాడతారు, వారికి అదే అలవాటుగా మారుతుంది. చివరకు ఇంట్లో వారితో మాట్లాడినా, బంధువులు, మిత్రులతో మాట్లాడినా ఇదేస్థాయిలో గట్టి గొంతుతో మాట్లాడతారు. ఇక పిల్లల ప్రవర్తనతో విసిగి వేసారిపోయి తల్లులు కూడా పెద్ద గొంతు అలవాటు చేసుకుంటున్నారు. అదేస్థాయిలో అందరితో మాట్లాడటం అలవాటైపోతుంది. అయితే, సిగరెట్, ఆల్కాహాల్ లాంటి అలవాట్లు కూడా గొంతు సమస్యలకు కారణమేనని సర్వేలో తేల్చారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలోవున్న వాళ్లది ఒత్తిడితో కూడిన జీవితం. సరైన సమయంలో సరైన తిండి అలవాట్లు ఉండవు. దీనివల్ల అసిడిటీ సమస్య తలెత్తి అది గొంతు సమస్యగా మారుతుంది. ఇలాంటి సమస్యను ప్రారంభంలోనే గుర్తించి తగు చికిత్సతో పాటు అలవాట్లు మార్చుకోవాలి. లేకపోతే ప్రమాదకరమైన సమస్యగా మారవచ్చన్నది నిపుణులు చెప్తోన్న మాట. గాయకులు, టీచర్లు, రాజకీయ నేతల్ని గొంతుకు సంబంధించి హై రిస్క్ గ్రూప్‌గా గుర్తించారు. కొన్నిసార్లు వయసు కూడా గొంతు సమస్యకు కారణమవుతున్నట్టు గుర్తించారు. పొగ, మద్యం తాగేవారు, క్యాన్సర్ పేషెంట్లకు సైతం గొంతు సమస్య ఎక్కువగా ఉంటోంది.


 తరుచుగా గొంతు సమస్య వస్తుంటే పరీక్ష చేయించుకోవాలి. చిన్న సమస్య అయినప్పుడు గొంతును ఎక్కువగా ఉపయోగించకుండా వౌనంగా ఉండటం వల్ల సమస్య పరిష్కారమవుతుంది. సమస్య సీరియస్‌గా ఉందనిపిస్తే తక్షణం నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించాలి. ఆపరేషన్, స్పీచ్ థెరపీ ద్వారా సీరియస్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమస్య తలెత్తినపుడు కొద్దిపాటి జాగ్రత్తలైనా తీసుకోకపోతే, గొంత గరగర, గొంతులో కిచకిచ సమస్యల నుంచి తప్పించుకోలేమన్నది నిపుణులు చెప్తోన్న మాట. కాదనలేం కదా!

4, జులై 2012, బుధవారం

సియం కిరణ్ కుమార్ రెడ్డి విజయ గాథలు?!

మా  ఫ్యామిలీ మద్యం వ్యాపారానికి దూరంగా ఉంటే ఈసారి జిల్లాలో మద్యం లైసెన్స్‌లు అడిగే వాడే లేడు. మద్యం షాపులు పొందాలన్నా, వద్దనుకున్నా మనం రింగయ్యామంటే సిఎం కూడా గింగిరాలు తిరగాల్సిందే’’అంటూ పకపకా నవ్వాడు బొత్స సత్తిబాబు.
పిఎ వచ్చి సార్ ‘‘సిఎం వచ్చారు, క్యాబినెట్ స్టార్ట్ అయ్యేట్టుగా ఉంది’’ అని చెప్పాడు.‘‘ మనం రాందే క్యాబినెట్ సమావేశం స్టార్ట్ చేసేంత సీనుందా? మీడియా బ్రదర్స్‌తో పిచ్చాపాటి మాట్లాడుతున్నాను’’ అని లేచాడు. 



‘‘ఇదంతా ఆఫ్‌ది రికార్డ్ బ్రదర్! నేను సిఎంను అస్సలు ఖాతరు చేయనని మీకుతెలిసినట్టు రాసుకుంటే రాసుకోండి కానీ నా మాటగా వద్దు. ’’ అని మళ్లీ నవ్వి క్యాబినెట్‌కు బయలు దేరారు సత్తిబాబు సిఎం వచ్చి అప్పటికే పది నిమిషాలైంది. బొత్స రాకపోవడంతో అసహనంగా అటూ ఇటూ చూస్తూ దేనికోసమో వెతుకుతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రయత్నించారు. బొత్స రాగానే అంతా అలర్ట్ అయ్యారు. సిఎం క్యాబినెట్ సమావేశం ప్రారంభ సూచికగా చిన్నగా దగ్గి ఉపన్యాసం ప్రారంభించారు. మీ అందరికి ఇప్పుడో ముఖ్యవిషయం. హై కమాండ్‌తో ఇప్పుడే మాట్లాడాను. మనందరి పని తీరు పట్ల హై కమాండ్ చాలా సంతృప్తితో ఉంది అనగానే అంతా ఫక్కున నవ్వారు. సిఎం చిన్నబుచ్చుకున్నారు. ‘‘నేను సీరియస్‌గా చెబితే జోక్ అనుకుంటారు, జోకు చెప్పినప్పుడు సీరియస్ అనుకుంటారు. ఇలా అయితే నేనసలు మాట్లాడను’’ అని అలిగారు.


 ‘‘ అదేంటి సార్ మాజీ సిఎం ఎప్పుడూ నవ్వకపోవడం వల్లనే ఓడిపోయారని, మీరు అందరినీ నవ్వించడానికి అలా మాట్లాడుతున్నారని అనుకున్నాం కానీ నిజ్జంగా మీ మీద ఒట్టు మీరు సీరియస్‌గా మాట్లాడుతున్నారని అనుకోలేదు’’ అని మంత్రి దానం నాగేందర్ పలికారు. ‘‘అందరి సంగతి వదిలేయండి సార్ సీరియస్‌గా మాట్లాడేప్పుడు ఇది సీరియస్ అని జోక్‌గా మాట్లాడేప్పుడు ఇది జోక్ అని ఇప్పటి నుంచి చిన్న హింట్ ఇచ్చారనుకోండి ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ అస్సలు రాదు’’ అని నాగేందర్ సలహా ఇచ్చారు.


‘‘సరే ఇది జోక్ అని నవ్వుకోకండి సీరియస్ విషయం. ఉప ఎన్నికల ఫలితాలను చూశాక, హై కమాండ్‌తో మాట్లాడాక నా బుర్రలో అద్భుతమైన ఆలోచనలు వచ్చాయి. మన విజయగాథలను ప్రజలకు చెప్పాలి. మనకింకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనమే గెలుస్తాం దీనిలో నాకెలాంటి సందేహం లేదు కానీ భారీ మెజారిటీ కోసమే ఈ ప్రయత్నం ’’అని కిరణ్ అనగానే కొంత మంది నవ్వు ఆపుకోలేకపోయారు. కొందరు సీరియస్‌గా ఉన్నట్టు నటించేశారు. రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విజయాలు నా సొంతం. మీడియా మద్దతు నేను సాధించాను.ప్రతిపక్షం మద్దతు కూడా సాధించానని అంతా నమ్ముతారు. ఇవి సామాన్యమైన విజయాలు కావు ఆలోచించండి ఇలాంటి విజయగాథాలు ఎన్నో తెలుస్తాయి.’’


‘‘ విజయగాథలా?’’అంటూ బొత్స నవ్వారు.
‘‘మీ ప్రయత్నాల్లో మీరుండండి. రచయితలకు కొరత లేదు, డబ్బుకు కొదవ లేదు.ప్రతి విజయానికి తగిన బహుమతి పిహెచ్‌డి విద్యార్థులను పట్టుకోండి మన విజయగాథలను పరిశోధించమని చెప్పండి. ఇక వెళ్లండి ’’అని సిఎం అందిరికీ చెప్పి పంపించేశారు.
***
మంత్రులు, నాయకుల నుంచి కుప్పలు తెప్పలుగా ప్రభుత్వ విజయాలపై లేఖలు అందాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.
*ఎన్టీఆర్ 228 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని సిఎం అయితే, బాబు కొట్టుకొచ్చిన 150మంది ఎమ్మెల్యేలతో సిఎం కాగా, 180 మందితో వైఎస్‌ఆర్ సిఎం అయితే కిరణ్ కనీసం ఒక్కరి మద్దతు కూడా లేకుండా సిఎం కావడానికి మించిన విజయగాధ ఏముంటుంది?
* పిసిసి నేత మద్యం మాఫియాపై సిఎం విచారణ జరిపించడం. హై కమాండ్ వద్దకు వెళ్లి ఇద్దరూ రాజీ పడడం.
* ప్రత్యర్థిని అరెస్టు చేయడం కోసం ముందస్తుగా సొంత మంత్రిని అరెస్టు చేయడం, ఏ మంత్రి ఎప్పుడు విచారణకు వెళతారో, ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియని పరిస్థితి.
* అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఎన్నికల్లో పరాజయ పరంపర. డిపాజిట్ల గల్లంతు
*పోలీసు అధికారి విచారణ జరిపితే హోంమంత్రి విచారణకు హాజరు కావడం.
* బయట ఉన్న నాయకుల కన్నా జైలులో ఉన్న నాయకునికే జనంలో, అధికార పక్షం నాయకుల్లో క్రేజీ ఎక్కువగా ఉండడం.
* చట్టాలు ఎంత తక్కువగా ఉంటే అది అంత మంచి పాలన అంటారు. ఆ మాటను స్ఫూర్తిగా తీసుకుని అసలు ప్రభుత్వమే లేదు అనిపించేట్టుగా ప్రభుత్వ పాలన సాగించడం.


* ఒక మంత్రి మంత్రుల అవినీతిపై కోర్టుకెళ్లడం. సిఎల్‌పి నాయకునిపై సిఎల్‌పి కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌రావు ప్రతి రోజు ధ్వజమెత్తడం మనలోని ప్రజాస్వామ్యా విజయానికి సాక్షం.
* ప్రభుత్వాన్ని పడగొడతాం అని ప్రతిపక్షం నుంచి బెదిరింపులు వస్తాయి, కానీ ప్రభుత్వం పడిపోతుందేమో అని ప్రతిపక్షం భయపడేట్టు చేయడం సిఎం సాధించిన అతి పెద్ద విజయం.
***
ఈ విజయాలతో సామాన్య ప్రజలకేం సంబంధం అంటారా? అవును ప్రజలతో సంబంధం లేని పాలన సాగించడం ఈ ప్రభుత్వం సాధించిన గొప్ప 
విజయం