4, జులై 2012, బుధవారం

సియం కిరణ్ కుమార్ రెడ్డి విజయ గాథలు?!

మా  ఫ్యామిలీ మద్యం వ్యాపారానికి దూరంగా ఉంటే ఈసారి జిల్లాలో మద్యం లైసెన్స్‌లు అడిగే వాడే లేడు. మద్యం షాపులు పొందాలన్నా, వద్దనుకున్నా మనం రింగయ్యామంటే సిఎం కూడా గింగిరాలు తిరగాల్సిందే’’అంటూ పకపకా నవ్వాడు బొత్స సత్తిబాబు.
పిఎ వచ్చి సార్ ‘‘సిఎం వచ్చారు, క్యాబినెట్ స్టార్ట్ అయ్యేట్టుగా ఉంది’’ అని చెప్పాడు.‘‘ మనం రాందే క్యాబినెట్ సమావేశం స్టార్ట్ చేసేంత సీనుందా? మీడియా బ్రదర్స్‌తో పిచ్చాపాటి మాట్లాడుతున్నాను’’ అని లేచాడు. 



‘‘ఇదంతా ఆఫ్‌ది రికార్డ్ బ్రదర్! నేను సిఎంను అస్సలు ఖాతరు చేయనని మీకుతెలిసినట్టు రాసుకుంటే రాసుకోండి కానీ నా మాటగా వద్దు. ’’ అని మళ్లీ నవ్వి క్యాబినెట్‌కు బయలు దేరారు సత్తిబాబు సిఎం వచ్చి అప్పటికే పది నిమిషాలైంది. బొత్స రాకపోవడంతో అసహనంగా అటూ ఇటూ చూస్తూ దేనికోసమో వెతుకుతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రయత్నించారు. బొత్స రాగానే అంతా అలర్ట్ అయ్యారు. సిఎం క్యాబినెట్ సమావేశం ప్రారంభ సూచికగా చిన్నగా దగ్గి ఉపన్యాసం ప్రారంభించారు. మీ అందరికి ఇప్పుడో ముఖ్యవిషయం. హై కమాండ్‌తో ఇప్పుడే మాట్లాడాను. మనందరి పని తీరు పట్ల హై కమాండ్ చాలా సంతృప్తితో ఉంది అనగానే అంతా ఫక్కున నవ్వారు. సిఎం చిన్నబుచ్చుకున్నారు. ‘‘నేను సీరియస్‌గా చెబితే జోక్ అనుకుంటారు, జోకు చెప్పినప్పుడు సీరియస్ అనుకుంటారు. ఇలా అయితే నేనసలు మాట్లాడను’’ అని అలిగారు.


 ‘‘ అదేంటి సార్ మాజీ సిఎం ఎప్పుడూ నవ్వకపోవడం వల్లనే ఓడిపోయారని, మీరు అందరినీ నవ్వించడానికి అలా మాట్లాడుతున్నారని అనుకున్నాం కానీ నిజ్జంగా మీ మీద ఒట్టు మీరు సీరియస్‌గా మాట్లాడుతున్నారని అనుకోలేదు’’ అని మంత్రి దానం నాగేందర్ పలికారు. ‘‘అందరి సంగతి వదిలేయండి సార్ సీరియస్‌గా మాట్లాడేప్పుడు ఇది సీరియస్ అని జోక్‌గా మాట్లాడేప్పుడు ఇది జోక్ అని ఇప్పటి నుంచి చిన్న హింట్ ఇచ్చారనుకోండి ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ అస్సలు రాదు’’ అని నాగేందర్ సలహా ఇచ్చారు.


‘‘సరే ఇది జోక్ అని నవ్వుకోకండి సీరియస్ విషయం. ఉప ఎన్నికల ఫలితాలను చూశాక, హై కమాండ్‌తో మాట్లాడాక నా బుర్రలో అద్భుతమైన ఆలోచనలు వచ్చాయి. మన విజయగాథలను ప్రజలకు చెప్పాలి. మనకింకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనమే గెలుస్తాం దీనిలో నాకెలాంటి సందేహం లేదు కానీ భారీ మెజారిటీ కోసమే ఈ ప్రయత్నం ’’అని కిరణ్ అనగానే కొంత మంది నవ్వు ఆపుకోలేకపోయారు. కొందరు సీరియస్‌గా ఉన్నట్టు నటించేశారు. రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విజయాలు నా సొంతం. మీడియా మద్దతు నేను సాధించాను.ప్రతిపక్షం మద్దతు కూడా సాధించానని అంతా నమ్ముతారు. ఇవి సామాన్యమైన విజయాలు కావు ఆలోచించండి ఇలాంటి విజయగాథాలు ఎన్నో తెలుస్తాయి.’’


‘‘ విజయగాథలా?’’అంటూ బొత్స నవ్వారు.
‘‘మీ ప్రయత్నాల్లో మీరుండండి. రచయితలకు కొరత లేదు, డబ్బుకు కొదవ లేదు.ప్రతి విజయానికి తగిన బహుమతి పిహెచ్‌డి విద్యార్థులను పట్టుకోండి మన విజయగాథలను పరిశోధించమని చెప్పండి. ఇక వెళ్లండి ’’అని సిఎం అందిరికీ చెప్పి పంపించేశారు.
***
మంత్రులు, నాయకుల నుంచి కుప్పలు తెప్పలుగా ప్రభుత్వ విజయాలపై లేఖలు అందాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.
*ఎన్టీఆర్ 228 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని సిఎం అయితే, బాబు కొట్టుకొచ్చిన 150మంది ఎమ్మెల్యేలతో సిఎం కాగా, 180 మందితో వైఎస్‌ఆర్ సిఎం అయితే కిరణ్ కనీసం ఒక్కరి మద్దతు కూడా లేకుండా సిఎం కావడానికి మించిన విజయగాధ ఏముంటుంది?
* పిసిసి నేత మద్యం మాఫియాపై సిఎం విచారణ జరిపించడం. హై కమాండ్ వద్దకు వెళ్లి ఇద్దరూ రాజీ పడడం.
* ప్రత్యర్థిని అరెస్టు చేయడం కోసం ముందస్తుగా సొంత మంత్రిని అరెస్టు చేయడం, ఏ మంత్రి ఎప్పుడు విచారణకు వెళతారో, ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియని పరిస్థితి.
* అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఎన్నికల్లో పరాజయ పరంపర. డిపాజిట్ల గల్లంతు
*పోలీసు అధికారి విచారణ జరిపితే హోంమంత్రి విచారణకు హాజరు కావడం.
* బయట ఉన్న నాయకుల కన్నా జైలులో ఉన్న నాయకునికే జనంలో, అధికార పక్షం నాయకుల్లో క్రేజీ ఎక్కువగా ఉండడం.
* చట్టాలు ఎంత తక్కువగా ఉంటే అది అంత మంచి పాలన అంటారు. ఆ మాటను స్ఫూర్తిగా తీసుకుని అసలు ప్రభుత్వమే లేదు అనిపించేట్టుగా ప్రభుత్వ పాలన సాగించడం.


* ఒక మంత్రి మంత్రుల అవినీతిపై కోర్టుకెళ్లడం. సిఎల్‌పి నాయకునిపై సిఎల్‌పి కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌రావు ప్రతి రోజు ధ్వజమెత్తడం మనలోని ప్రజాస్వామ్యా విజయానికి సాక్షం.
* ప్రభుత్వాన్ని పడగొడతాం అని ప్రతిపక్షం నుంచి బెదిరింపులు వస్తాయి, కానీ ప్రభుత్వం పడిపోతుందేమో అని ప్రతిపక్షం భయపడేట్టు చేయడం సిఎం సాధించిన అతి పెద్ద విజయం.
***
ఈ విజయాలతో సామాన్య ప్రజలకేం సంబంధం అంటారా? అవును ప్రజలతో సంబంధం లేని పాలన సాగించడం ఈ ప్రభుత్వం సాధించిన గొప్ప 
విజయం 

5 కామెంట్‌లు:

  1. * ప్రభుత్వాన్ని పడగొడతాం అని ప్రతిపక్షం నుంచి బెదిరింపులు వస్తాయి, కానీ ప్రభుత్వం పడిపోతుందేమో అని ప్రతిపక్షం భయపడేట్టు చేయడం సిఎం సాధించిన అతి పెద్ద విజయం.
    ***extraordinary observation sir

    రిప్లయితొలగించండి
  2. మరికొన్ని మచ్చుతునకలు:

    - అన్ని స్కీములు (స్కాములు?) ఏలిన వారి పేరుపై కాకుండా దేశచరిత్రలోనే మొదటిసారి ఒక పథకానికి రాష్ట్ర ముఖ్య మంత్రి పేరుతొ తోక పెట్టడం
    - రాష్ట్రాన్ని ఏలేది ముఖ్యమంత్రా గవర్నరా అన్న సందేహం ఎవరికీ రాదు (because everyone knows the answer)
    - శాసనసభ లోపలే ఒక ప్రతిపక్షసభ్యునిపై మంత్రి చెయ్యి చేసుకోవడం

    రిప్లయితొలగించండి
  3. ఇసుక మాఫియాకి, మందు మాఫియాకి, కాంట్రాక్టర్ల మాఫియాకి జై కొట్టడం విజయంకాదూ.
    పిల్లలికి పరీక్షలు పెట్టమని కోర్టు చెబితే పెట్టలేమని చెప్పడం, ప్రయివేటు కాలేజీలను ఏమీ చేయలేకపోవడం, రైతు వ్యవసాయం చేయకుండా చేయడం ఇవన్నీ ఘన విజయాలు కాదూ. ప్రచారం చెయ్యాలిసిందే.

    రిప్లయితొలగించండి
  4. ప్రతిపక్షంతో కుమ్మక్కు అవ్వడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఏ దేశ చరిత్రలోనూ జరిగి ఉండదని నా గట్టి నమ్మకం!! ఇంత సృజనాత్మకమైన ఆలోచన వచ్చినందుకూ, భావితరాలకు ఒక కొంగ్రొత్త trend ను set చేసినందుకూ కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు, కానీ అధికారానికి దూరం అవుతారని అనుమానం!!

    రిప్లయితొలగించండి
  5. యధా కేంద్రం,
    తధా రాష్ట్రం.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం