5, జులై 2012, గురువారం

గొంతులో కిచ.. కిచ .. కార్పొరేట్ యంగటర్క్‌లపై వెరైటీ సర్వే

మూడు పదుల వయసు దాటకముందే ఆరు అంకెల జీతాలు అందుకుంటున్న కార్పొరేట్ కుర్రకారుకు -జీతానికి తగ్గట్టుగానే మానసిక ఒత్తిళ్లూ ఉంటాయన్నది వాస్తవం. ఇదొక్కటే తీవ్రమైన సమస్య అనుకునే వాళ్లూ చాలామందే ఉంటారు. నమ్మకాలకు తగ్గట్టుగానే పలు సర్వేలు సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. అయితే ఇటీవల ఒక సంస్థ కాస్త వెరైటీ కోసం ఇంకాస్త భిన్నమైన సర్వే నిర్వహించింది.


 రొటీన్ అయిపోయిన -మానసిక ఒత్తిడి అంశాన్ని పక్కనపెట్టి ‘వృత్తివల్ల గొంతుకొచ్చిన కష్టమేంటి?’ అనే అంశంపై ఓ పెద్ద సర్వే నిర్వహించింది. కన్ను నొప్పో, కాళ్ల నొప్పుల గురించో అయితే పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ, ‘వృత్తికీ గొంతుకీ లింకేంటి?’ అంటూ సర్వేలో కుర్రాళ్లు కూడా ఉత్సాహంగానే పాల్గొన్నార్ట. సర్వేలో సింపుల్‌గా తేల్చిన సారాంశం ఏంటంటే -‘కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. వృత్తిరీత్యా గొంతు చించుకుంటే నోటి మాటకు తాళం పడుతుంది. వా...’ అంటూ కార్పొరేట్ కుర్రాళ్లు వాపోయారని. సమస్య సిల్లీగా అనిపించినా, సబ్జెక్ట్ మాత్రం కాస్త సీరియస్సే అంటున్నారు కార్పొరేట్ యంగటర్క్‌లు. ఎందుకంటే మానసిక ఒత్తిడి సమస్య ఎలా ఉన్నా, వృత్తిరీత్యా ఎక్కువ మాట్లాడాల్సిరావడం, గొంతుచించుకోవాల్సిన ప్రాజెక్టు టార్గెట్ల వల్ల -వోకల్ కార్డ్స్ శ్రమకు గురై కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయట. ముఖ్యంగా బిపివో కంపెనీల్లో పని చేసే ఎక్కువ మంది యూత్, ఈ సమస్య బారిన పడుతున్నారని సర్వే తేల్చిచెప్పింది.


 సగటున పదిమంది ఎగ్జిక్యూటివుల్లో కనీసం నలుగురు ఇలాంటి గొంతు సంబంధ సమస్య ఎదుర్కొంటున్నారన్నది సర్వే తేల్చిన సారాంశం. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంద’ని మనకో సామెత ఉంది. అంతేకాదు ‘నోరు జారితే, వీపు పగులుతుంద’న్న సామెతా ఉంది. ఈ రెండు సామెతల సమాంతరార్థం -సున్నితంగా మాట్లాడాలని. కానీ, పరుగుల కాలంలో, టార్గెట్ ఓరియంటెడ్ వృతుల్ని చేపట్టాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో -సున్నితమైన అంశాన్ని కూడా గొంతు చించుకుని చెప్పాల్సి వస్తుందని కుర్రాళ్లు గగ్గోలు పెడుతున్నారు. వోకల్ కార్డ్స్‌ను అరగదీస్తే తప్ప, వ్యవహారాన్ని చక్కబెట్టే పరిస్థితి లేదన్న ఆవేదన సర్వేలో పంచుకున్నార్ట. ‘బిపివో రంగంలో ఉన్న యువతరంలో -త్రోట్ ఇన్‌ఫెక్షన్ అనేది సర్వసాధారణం’ అని 22 నుంచి 35 ఏళ్ల వయసులో ఉన్న 300మంది ఎగ్జిక్యూటివ్‌లను ప్రశ్నించి ఒక నిర్ణయానికి వచ్చారు. 


ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో బ్రాండ్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే గోపాల్ ఏం చెప్తున్నాడంటే -‘ఒక్కరోజులో నేను ఎక్కువ ఫోన్ కాల్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, క్లయింట్ల సందేహాలకు సమాధానం చెప్పడం, వారిని ఒప్పించడానికి ఎక్కువ సేపు మాట్లాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కూడా. ఇలాంటి పరిస్థితుల వల్ల గొంతులో మార్దవం తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కోసారి గొంతు నొప్పితో విపరీతంగా బాధపడుతుంటాను. అయినాకానీ, వృత్తిపరమైన చాలెంజ్‌లు అధిగమించడానికి మళ్లీ మళ్లీ మాట్లాడక తప్పదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అలా గొంతులో సమస్య తలెత్తినప్పుడు ఏదోక మెడిసిన్ తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలిగినా, మళ్లీ మామూలే’ అంటాడు పాతికేళ్ల గోపాల్. బిపివో రంగంలోవున్న, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో పని చేస్తున్న, కార్పొరేట్ కళాశాలల్లో అధ్యాపక వృత్తి కొనసాగిస్తున్న వాళ్లనే ప్రధానంగా లక్ష్యం చేసుకుని సర్వే జరిపామన్నది నిర్వాహకుల మాట. -‘దేశంలో మహిళలు, పురుషులు అన్న భేదం లేకుండా గొంతు సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో 35 శాతం మంది ఈ సమస్యతో బాధ పడుతున్నవాళ్లే. 62.7 శాతం మేనేజర్లు, జనరల్ మేనేజర్లు గట్టిగా మాట్లాడటం వల్ల గొంతుకు సంబంధించి సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరి మాటల్లో సున్నితత్వం లేకుండా, గరుకుగా మారుతోందట! తమ గొంతులో మార్ధవం మాయం కావడం, బండగా మారడం వల్ల గొంతుమీద వాళ్లకే ఒక్కోసారి చిరాకు పుడుతుందన్న విషయాన్ని సర్వేలో తేటతెల్లం చేశారు. కాల్ సెంటర్స్‌లో ప్రతి పదిమంది సిబ్బందిలో ఇద్దరు గొంతులో సున్నితత్వం కోల్పోయి బండ గొంతులతోనే కనిపిస్తున్నార్ట. అయితే, గొంతులో ఇలాంటి మార్పులకు గట్టిగా మాట్లాడటం, ఎక్కువ మాట్లాడటం ఒక్కటే కారణం కాదన్నది ఇఎన్‌టి నిపుణులు చెప్తోన్న మాట. ప్రధానంగా యువత గట్టిగా మాట్లాడటమే కాకుండా, పొల్యూషన్, ఒత్తిడివంటి అంశాలు కూడా గొంతులో మార్పునకు కారణమవుతోందని అంటున్నారు. అయితే, ఈ పరిస్థితికి బెదిరిపోవాల్సిన పనిలేదన్నది నిపుణుల మాట. 


ఈ అంశంలో వైద్య రంగం చాలా ముందుకెళ్లిందని, ఇసిజి వాయిస్ బాక్స్ ద్వారా ఒక వ్యక్తి ఏవిధంగా మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడితే బాగుంటుందని చెప్పవచ్చని కూడా సూచిస్తున్నారు. ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, తల్లుల గొంతు సమస్య ఇతరులకు ఇబ్బందికరంగా మారుతోంది. చాలామంది పిల్లలకు పాఠాలు చెప్పాలి కాబట్టి సాధారణంగా ఉపాధ్యాయులు గట్టిగా మాట్లాడతారు, వారికి అదే అలవాటుగా మారుతుంది. చివరకు ఇంట్లో వారితో మాట్లాడినా, బంధువులు, మిత్రులతో మాట్లాడినా ఇదేస్థాయిలో గట్టి గొంతుతో మాట్లాడతారు. ఇక పిల్లల ప్రవర్తనతో విసిగి వేసారిపోయి తల్లులు కూడా పెద్ద గొంతు అలవాటు చేసుకుంటున్నారు. అదేస్థాయిలో అందరితో మాట్లాడటం అలవాటైపోతుంది. అయితే, సిగరెట్, ఆల్కాహాల్ లాంటి అలవాట్లు కూడా గొంతు సమస్యలకు కారణమేనని సర్వేలో తేల్చారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలోవున్న వాళ్లది ఒత్తిడితో కూడిన జీవితం. సరైన సమయంలో సరైన తిండి అలవాట్లు ఉండవు. దీనివల్ల అసిడిటీ సమస్య తలెత్తి అది గొంతు సమస్యగా మారుతుంది. ఇలాంటి సమస్యను ప్రారంభంలోనే గుర్తించి తగు చికిత్సతో పాటు అలవాట్లు మార్చుకోవాలి. లేకపోతే ప్రమాదకరమైన సమస్యగా మారవచ్చన్నది నిపుణులు చెప్తోన్న మాట. గాయకులు, టీచర్లు, రాజకీయ నేతల్ని గొంతుకు సంబంధించి హై రిస్క్ గ్రూప్‌గా గుర్తించారు. కొన్నిసార్లు వయసు కూడా గొంతు సమస్యకు కారణమవుతున్నట్టు గుర్తించారు. పొగ, మద్యం తాగేవారు, క్యాన్సర్ పేషెంట్లకు సైతం గొంతు సమస్య ఎక్కువగా ఉంటోంది.


 తరుచుగా గొంతు సమస్య వస్తుంటే పరీక్ష చేయించుకోవాలి. చిన్న సమస్య అయినప్పుడు గొంతును ఎక్కువగా ఉపయోగించకుండా వౌనంగా ఉండటం వల్ల సమస్య పరిష్కారమవుతుంది. సమస్య సీరియస్‌గా ఉందనిపిస్తే తక్షణం నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించాలి. ఆపరేషన్, స్పీచ్ థెరపీ ద్వారా సీరియస్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమస్య తలెత్తినపుడు కొద్దిపాటి జాగ్రత్తలైనా తీసుకోకపోతే, గొంత గరగర, గొంతులో కిచకిచ సమస్యల నుంచి తప్పించుకోలేమన్నది నిపుణులు చెప్తోన్న మాట. కాదనలేం కదా!

7 కామెంట్‌లు:

  1. రోజుకి ఎనిమిది గంటల చొప్పున పదిహేను సంవత్సరాలు గొంతుతోనే ఉద్యోగం చేశాను,మామూలుగా మాట్లాడినది కాక, టెలిఫోన్ ఆపరేటర్ గా మరేమో అప్పుడిలా అనిపించలా.ఇది ఒక ఎక్జిక్యూటివ్ లకి మాత్రమే వచ్చేదేమో! :)

    రిప్లయితొలగించండి
  2. kastephale garu పొల్యూషన్ ప్రభావం కూడా ఉంటుంది కదండీ ...

    రిప్లయితొలగించండి
  3. ఏం చేద్దా మండీ ,

    మరీ 'గొంతెమ్మ' కోరికలు ఎక్కువై పోయే !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  4. Exactly Kottapali garu మరి టీచర్లు, డాక్టర్లు, లాయర్ల సంగతేంటి?
    ప్రతిదానికీ కార్పొరేట్ ఉద్యోగులు అంటూ మూస సమాచారం వ్రాయడం అవగాహనా రాహిత్యం లేదా ఓ రకమయిన పైశాచిక ఆనందం అనిపిస్తోంది!


    http://100telugublogs.blogspot.com


    .

    రిప్లయితొలగించండి
  5. జీడి పప్పు గారు మీరు వంద తెలుగు బ్లాగ్స్ అని రాశారు... ఇందులో ఒక్క తమిళ బ్లాగ్ కూడా లేదు ఇది మీ పైశాచిక ఆలోచన అని ఎవరన్నా అంటే ఏమంటారు ... వంద తెలుగు బ్లాగ్స్ అన్నప్పుడు ఎలాంటి వైనా అందులో తెలుగు బ్లాగ్సే ఉంటాయి కానీ తమిళమో, కన్నడ బ్లాగ్స్ ఉండవు కదా ... అలానే వాళ్ళు కార్పొరేట్ ఉద్యోగులు పై సర్వే చేశారు ..

    రిప్లయితొలగించండి
  6. జీడి పప్పు గారు మీరు వంద తెలుగు బ్లాగ్స్ అని రాశారు... ఇందులో ఒక్క తమిళ బ్లాగ్ కూడా లేదు ఇది మీ పైశాచిక ఆలోచన అని ఎవరన్నా అంటే ఏమంటారు "

    మోకాలికు, బోడిగుండుకు లింకెట్టి లంకెట్టడమంటాను మురళి గారు :)
    http://100telugublogs.blogspot.com

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం