11, జులై 2012, బుధవారం

పబ్లిక్ అంటే ఎవరు?

‘‘మనిషి పుట్టుక రహస్యాన్ని విప్పి చెప్పే దైవ కణాన్ని శాస్తవ్రేత్తలు కనిపెట్టేశారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని పబ్లిక్ నాడి కణాన్ని మనం పసికట్టేస్తే, ఏ ఎన్నికల్లో వాళ్లు ఎవరికి ఓటు వేస్తారో? ఎవరిని ఎందుకు గెలిపిస్తారో, ఎందుకు ఓడిస్తారో తెలిసిపోతుంది. పబ్లిక్‌ను పట్టుకుని కొన్ని ప్రశ్నలు వేసి వారి మనసులోని మర్మాన్ని కనిపెట్టామంటే దాన్ని రాజకీయ పక్షాలకు ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఖర్చు ముఖ్యం కాదు మన నాయకులకు గెలుపు సీక్రెట్ ముఖ్యం.
సరే పబ్లిక్‌తో మాట్లాడదాం పదా?’’ ‘‘ఇంతకూ వాళ్ళెక్కడుంటారంటావు’’
‘‘ఇందుగలడందు లేడను సందేహం వలదు ఎందెందు వెదికినా పబ్లిక్ అందందు కనిపించును’’


‘‘బాబూ మురికి వాడ ముఖేష్ పబ్లిక్ గురించి కొంత చెబుతావా? ఏమీ లేదు. పబ్లిక్ ఎవరిని ఎందుకు అభిమానిస్తుంది? ఎందుకు వ్యతిరేకిస్తుంది? అసలు పబ్లిక్ ఉద్దేశం ఏమిటి?’’
‘‘సార్ ఈ ప్రజలకు అస్సలు దిమాక్ ఉండదు. పబ్లిక్ పిచ్చోళ్లు. ఎవడో ఏదో చెబితే వాడి మాటలు నమ్మి ఓటేస్తారు? ఐదేళ్ల వరకు వాడు కనిపించడు, మస్త్ సంపాదించుకుంటాడు’’?
‘‘ఓహో అలాగా బాగా మాట్లాడుతున్నావు’’
‘‘నన్ను టీవి చానల్స్‌లో చూళ్లేదా? సార్ మా కాలనీలో నీళ్లు రాకపోయినా, కూరగాయల రేట్లు ఎక్కువున్నా మేం ఎలా బతకాలి అంటూ చానల్స్‌లో గొంతు చించుకుని అరిచేది నేనే సార్.’’


మురికివాడ ముఖేష్‌తో మాట్లాడాక ఒక విషయం తెలిసింది. మురికి వాడల్లో ఉండేవాళ్లు పబ్లిక్ కాదు ... మరి పబ్లిక్ ఎక్కడ దొరుకుతారో అని రోడ్డుపై చూస్తుంటే వెతకబోయిన తీగ కాలికి తాకినట్టు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అని రాసి ఉన్న ఆర్టీసి బస్సు కంటి చూపుకు తాకింది. పరిగెత్తుకెళ్లి బస్సెక్కి తంతే బూరెల బుట్టలో పడ్డట్టు పబ్లిక్‌లో పడ్డాను. తపస్సు మొదలు పెట్టగానే దేవుడు ప్రత్యక్షమైనట్టు అంత మంది పబ్లిక్‌ను చూడగానే సంతోషం వేసింది.
ముందు పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారో వింటే సందేహం తీరిపోతుందని వారి మాటలను ఆలకించాను.


‘‘ఈ పబ్లిక్ ఎప్పుడేం చేస్తారో, ఎవరిని ఎందుకు గెలిపిస్తారో అస్సలు అర్ధం కాదు . పబ్లిక్ సార్.. పబ్లిక్ వీళ్లకు దిమాకుండదు, ఎవరేం చెప్పినా నమ్మేస్తారు, గొర్రె కసాయోడినే నమ్మినట్టు వీళ్లు నమ్ముతారు. పబ్లిక్ అంతే..’’ బస్సులో ఉన్న వాళ్లంతా పబ్లిక్‌ను తిడుతున్నారు అంటే బస్సులో ఉన్నవాళ్లంతా పబ్లిక్ కాదు.
ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే, అసలు పబ్లిక్ ఎవరో తెలుసుకోవలసిన పరిస్థితి వచ్చి పడింది. ..
గూగుల్‌లో దొరకని సమాచారం ఉండదు, హైదరాబాద్‌లో ఆటోవానికి తెలియని పబ్లిక్ ఉండరని బాబూ ఆటో జానీ పబ్లిక్ విషయం కాస్త చెబుతావా?
‘‘సార్ ఈ పబ్లిక్‌ను చూస్తే పిచ్చికోపం వస్తుంది. మేం చార్మినార్ వైపు వెళ్లే పనిలో ఉంటే వాళ్లేమో సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళదామంటారు. మా ఆటో మా ఇష్టం అంతే కానీ వాళ్లు చెప్పిన చోటుకు మమ్మల్ని రమ్మనడం న్యాయమా?’’
‘‘సరే నీ గోడు తరువాత ముందు పబ్లిక్ గురించి చెప్పు...’’
‘‘పబ్లిక్‌కు దిమాక్ ఉంటే ఇలా ఎందుకుండేది’’
‘‘హమ్మయ్య నీ మాటతో ఒక విషయం తెలిసింది. ఆటో వాళ్లు పబ్లిక్ కాదన్నమాట!’’
రవి చూడనిది కవి చూస్తాడనేది పాత మాట. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ చిలిపి కాల్స్‌ను కూడా జర్నలిస్టులు చూసేస్తున్నారు కాబట్టి వీరికి తెలియంది లేదు.
‘‘జర్నలిస్టు గారూ అసలు పబ్లిక్ ఇలా ఎందుకు ఓటేస్తుందంటారు?’’
‘‘వీళ్లకు... ’’..
‘‘అబ్బా ఏదైనా కొత్తగా చెబుతారేమో అనుకుంటే మీరూ సేమ్ డైలాగా?’’


‘‘కుల సంఘం మీటింగ్ అని బోర్డు కనిపిస్తోంది. కుల సంఘంలో ఉన్న రాజకీయ చైతన్యం మరెక్కడా ఉండదంటారు సరే అక్కడికి వెళదాం.’’
‘‘మన కులం వాళ్లు దేశానికి, రాష్ట్రానికి తమ జీవితాలను దారపోశారు. పబ్లిక్‌కు ఇంత కృతజ్ఞత కూడా లేదు. మన కులం వాళ్లను కాదని, మన వ్యతిరేక కులం వారిని ఆదరిస్తే సహించేది లేదు ’’
‘‘ఓహో వీళ్ల కులం వాళ్లు పబ్లిక్ కాదన్నమాట!’’
ఈ మధ్య సోషల్ సైట్స్‌లో పబ్లిక్ యమ యాక్టివ్‌గా ఉంటున్నారట! ఇదిగో పబ్లిక్ ఎన్నికల్లో పబ్లిక్ ఎందుకిలా చేస్తున్నారంటారు?
ప్రశ్నకు వందల మంది సమాధానం చెప్పారు. అందరి మాటల్లోని అర్ధం ఒకటే పబ్లిక్‌కు తెలివిలేదు.
అంటే సోషల్ సైట్స్‌లోని వాళ్లు కూడా పబ్లిక్ కాదన్నమాట
మేధావి గారూ, ఎన్‌జివో, నిరుద్యోగి, రాజకీయ నాయకుడు, డాక్టర్, ఇంజనీర్, ఐటి ఉద్యోగి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎ టు జడ్ కులాలు, ఆస్తికుడు, నాస్తికుడు, జైలులో ఉన్న నాయకులు, జైలు బయట ఉన్న నాయకులు, జైలుకు వెళ్లకుండా తప్పించుకున్న నాయకులు ఏంటీ మీరందరి సమాధానం ఇదేనా?
మార్నింగ్ వాకింగ్ లో ,  అర్ధరాత్రి  పబ్బుల్లో అందరి మాట ఇదేనా ? 


సందేహాలకు సమాధానం లభించకుండానే ఈ జీవితం ముగుస్తుందా? దేవుని విగ్రహానికి తల బాదుకోవాలనిపిస్తోంది. హే భగవన్ ఇంతకూ పబ్లిక్ ఎక్కడున్నారయ్యా? అని నిలదీస్తే,


‘‘పిచ్చివాడా! పబ్లిక్ అంటూ ఆకాశంలో ఎక్కడో ఉండరు. పబ్లిక్ పిచ్చివాళ్లు అని చెప్పిన మురికివాడ ముఖేష్ నుంచి జూబ్లీహిల్స్ కోటీశ్ వరకు వీళ్లంతా కలిస్తేనే పబ్లిక్. ఎవరికి వారు నేను తప్ప అంతా పబ్లిక్ అనుకుంటున్నారు అదే మీతో వచ్చిన తంటా! మీ గురించి మీకే తెలియదు ఇక భగవంతుడ్ని కనుగొంటారా?’’అని ఆకాశవాణి పలికినట్టు వినిపించింది  .
ముక్తాయింపు ... నువ్వొక్కడివే జనం కాదు... నువ్వూ జనమే 

7 వ్యాఖ్యలు:

 1. సార్ ప్రతివాడికి తను తప్పించి మిగిలినవాళ్ళంతా పబ్లిక్.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా బాగా చెప్పారు!! "నేను తప్ప అందరూ పబ్లిక్కే" అనే మనస్తత్వం వల్లే దేశంలో ఇంత స్థాయిలో దోపిడీ జరుగుతున్నా అందరూ మన్ను తిన్న పాముల్లా నిద్ర పోతున్నారు. "నేనూ పబ్లిక్కే!!" అన్న భావం పెరిగితే తప్ప దేశంలో మార్పు రాదు!!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. brilliant sir.
  ఒక చిన్న పిట్ట కథ. చాన్నాళ్ళ కిందట స్కిట్లూ నాటికలూ రాస్తుండే కాలంలో పర్యావరణరక్షణ గురించి ఒక వ్యంగ్య నాటిక రాసి ప్రదర్శించాను. అందులో "ఆం ఆద్మీ"గా ఇక్కడి ఒక తెల్ల పిల్లాణ్ణి నటింపచేశాను. జనాలకి మంచి మజా వచ్చిందారోజు ప్రదర్శన.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నారాయణ స్వామి గారు ఇక్కడ తెలుగమ్మాయి అని అదేదో రాష్ట్రానికి చెందిన హిరోయిన్ తో సినిమా వచ్చింది . అలానే మీరు అక్కడి తెల్ల పిల్లాడితో ఇక్కడి అం అద్మిని చూపించారా ? ఏం చేస్తాం మహాత్మున్నే హాలి ఉడ్ నుంచి తెచ్చుకున్నాం ( ద.. హా )

   తొలగించు
 4. @ kastephale@ Avinash వెల్లంపల్లి@ జలతారువెన్నెల@ Narayanaswamy S. గారు నచ్చినందుకు ధన్యవాదాలు . ఒకరిని విమర్శించడమే కాదు నన్ను నేను ( నేనూ పబ్లిక్ నే ) విమర్శించుకోవాలని రాశాను .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Very informative , and quality telugu contetnts are in your website.If you like to get more traffic for free.Submit your new posts to webtelugu.com

  No need to sign up , just login with your facebook account and start posting your contents on webtelugu . We will also spread your news via facebook and twitter , and also helps you to increase your alexa rank.  http://www.webtelugu.com/

  Thanks

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం