24, అక్టోబర్ 2012, బుధవారం

శ్రీశ్రీ.. ... కృష్ణశాస్ర్తీ..నారాశ్రీ

కవిత్వానికి కాలం చెల్లిందని ఎవరన్నారు. వినేందుకు చెవులు, చదివేందుకు కళ్లు ఉంటే కవిత్వానికి కాలం చెల్లిందనే మాట నోటి నుంచి రానే రాదు. ఒక కుర్ర కవి కవిత్వం రాసి పేరున్న రచయితకు చూపిస్తే, ఆయన ఏమీ చెప్పకుండా ఇతనికి కవిత్వం చేసింది అని యువ కవిని అయోమయంలో పడేశాడు. జలుబు చేసింది అన్నంత ఈజీగా ఆయన కవిత్వం చేసింది అని అన్నాడు. మహాప్రస్థానానికి చలం యోగ్యతా పత్రం ఇచ్చినట్టు కవిత్వం చేసిందనే మాట తన కవిత్వానికి యోగ్యతా పత్రమో, వెటకారపు మాటో అర్ధం కాక యువ కవి అయోమయంలో పడిపోయాడు. అమ్మవారు ప్రత్యక్షం కాగానే అప్పటి వరకు నిరక్షరాస్యుడిగా ఉన్న కాళిదాసు అద్భుతమైన కవిత్వం చెప్పేశారు. ఇంత కాలం తరువాత కూడా కాళిదాసును మరిపించే కవి పుట్టిలేదంటారు. అంటే దేవి ప్రత్యక్షం అయితే కవిత్వం చేస్తుందా? చెప్పడం కష్టమే!
***

మరో ప్రపంచం
మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది
పదండి.. ముందుకు..పదండి దూసుకు!
ఇదెవరి కవిత్వం అని కవిని అడిగితే ఎలా ఉంటుంది? అడిగిన వాళ్లను ఎగాదిగా చూస్తారు కదూ? ఔను మరి శ్రీశ్రీ కవిత్వం తెలియంది ఎవరికి?
మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెనె్నల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్లకీ బ్రతుకు పండెనో
ఇదెవరిది చెప్పండి ?
ఇంకెవరిది దేవులపల్లి కృష్ణశాస్ర్తీది


సరే మరి ఇప్పుడు చెప్పండి వేగుచుక్కలా దూసుకొస్తున్న మరో కవి పలుకులు చెబుతాను. అదెవరిదో చెప్పండి.
‘చాంతాడు వేయకుండానే చేతికి తగిలేట్టున్న కన్నీళ్ల చేరువకు అడుగులు వేస్తున్నాను’ వాహ్‌వా అనాలనిపిస్తోంది కదూ? ఒక శ్రీశ్రీ, ఒక దాశరథి, ఒక కృష్ణశాస్ర్తీ, అంతెందుకు తెలుగు కవులంతా కలగలిసిపోయినట్టు అనిపిస్తే, తప్పు లేదు.
మళ్లీ పైకి వెళదాం ఇంతకూ కవిత్వం ఎందుకు చేస్తుంది?
సిద్దార్థుడు ఒక బిక్షకుడ్ని, మరణించిన వ్యక్తి అంతిమ యాత్రను, మొత్తం మీద సమస్యలు, పేదరికాన్ని చూసినప్పుడు కోరికలు లేని సమాజాన్ని సృష్టించాలనే కోరికతో బుద్ధునిగా మారాడు. ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు దేశాన్ని అర్ధం చేసుకోవడానికి మహాత్మాగాంధీ దేశంలో పర్యటించి, చొక్కా తీసేసుకుని సామాన్య జీవితం గడిపారు. దోపిడీ దొంగతనాలు చేసి బతికే వాల్మికి పావురం మరణాన్ని చూసి మహాకవిగా మారాడు కదా? అలానే మన మహాకూటమి నేత నారాశ్రీ (కవి అన్నాక చివర శ్రీ ఉండి తీరాలి) పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి కవిగా మారాడు. మహాకవిగా ఒక్కో అక్షరాన్ని పేర్చుకుంటూ నడుస్తున్నారు. ఆ భావావేశం నుంచి పుట్టిన కవితలోని పంక్తులే ఈ చాంతాడు వేయకుండానే చేతికి తగిలేట్టున్న కన్నీళ్ల చేరువకు అడుగులు వేస్తున్నాను.. అన్న మాట. ఒక్క చిన్న సంఘటనతో రామాయణం రాసే స్థాయికి వాల్మికి చేరినప్పుడు రెండు వందల కిలో మీటర్ల పాదయాత్ర తరువాత తెలుగునేతలో కవిత్వం పొంగి పొర్లుతోందంటే నమ్మకపోవడానికి కారణం అవసరం లేదు.
పూర్వం రాజులు మారువేషాల్లో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి వెళ్లేవారట! వాళ్లు సమస్యలను వెతుక్కోవడానికి మారు వేషాల్లో వెళ్లే వాళ్లు. అయితే ఇప్పుడూ పాలకులు కావాలనుకుంటున్న వాళ్లు మారు వేషంలో ప్రజల్లోకి వెళుతున్నారు. 


మారు వేషం అంటే శ్రీకృష్ణదేవరాయలు, తన మంత్రితో మల్లీశ్వరిలో బాటసారుల్లా భానుమతి, ఎన్టీఆర్‌లను కలిసినట్టు కాదు. ఇక్కడ మారువేషం అంటే లక్ష కోట్లు సంపాదించిన వాళ్లు తమను మించిన అమాయకులు, బాధితులు ప్రపంచంలో లేరని, చేతిలో మత గ్రంధం ఉంటే తప్ప ధైర్యం ఉండదని అమాయకత్వాన్ని నటించే వాళ్లు. వ్యవసాయం అంటేనే చిరాకు పడి ఐటిని ప్రపంచానికి పరిచయం చేసింది తామే అని మనస్ఫూర్తిగా నమ్మి ఇప్పుడు మాత్రం రైతుల ఊపిరే తన ఊపిరి అని రైతు బాంధవ వేషంలో తిరిగే వారన్నమాట! ఏ గ్రామానికి వెళితే ఆ రూపం ధరిస్తూ గ్రామాలు పర్యటిస్తున్న నాయకులకు కవిత్వం పొంగు కొస్తోంది. తెలుగు నేత డైయిలీ సీరియల్‌గా ఆత్మకథ రాస్తున్నారు కాబట్టి ఆయనలోని కవిత్వం మనకు పరిచయం అయింది. చెల్లి మొదలు పెట్టిన యాత్ర అన్న ముగిస్తారో, అమ్మ ముగిస్తుందో చెల్లే ముగించక తప్పదో మనకు తెలియదు కాబట్టి ఆత్మకథ రాయడం లేదు. అలా రాస్తే తెలుగు సాహిత్య జగత్తుకు ఒక గొప్ప మహిళా భావ కవి లభించి ఉండేవారు. యాత్రలు అధికారం కట్టబెడతాయా? లేదా? అనేది మనకు అవసరం లేదుకానీ తెలుగునేతలోని గొప్ప భావకవిని ప్రపంచానికి వెల్లడి చేసింది.

 ఆయన కవిత్వంలో మరో పంక్తి ఆపార్టీ, పార్టీ అంటూ విడగొట్టే రాజకీయాలేంటి? అని ఆయన తన కవిత్వంతో రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నారు. అంటే దీనర్ధం ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు అధికార పక్షం, ప్రతిపక్షం కలిసిపోయాయని ఆయన చెప్పదలుచుకున్నారా?అని వెటకారాలు వద్దు. పార్టీలు వద్దు అంటే అయ్యో ఈసారైనా అధికారంలోకి వస్తారని ఆశలు పెట్టుకుని బోలెడు ఖర్చు చేస్తున్న మా పరిస్థితేం కావాలని తమ్ముళ్లు భయపడతారేమో! రాజకీయాలు, రాజకీయ పార్టీలు వద్దే వద్దు అంటూ ఆయన చెబుతున్న కవిత్వాన్ని ఆస్వాదించండి అంతే తప్ప సొంత నిర్వచనాలు వద్దు. చెల్లి ఆలస్యమెందుకు? నువ్వూ  కవిత్వం రాసి జనం మీదకు వదిలేయ్.

1 కామెంట్‌:

  1. చెప్పేవాడికి వినేవాడు లోకువంట..కాదు రాసేవాడికి చదివేవాడు లోకువ అందులోను పత్రికలలో వ్రాసే పాత్రికేయమిత్రులకి..పాఠకులు లోకువ.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం