17, అక్టోబర్ 2012, బుధవారం

కాపీ కొడదాం రండి..


ఏరా పరీక్ష ఎలా రాశావు?
బాగానే రాశాను కానీ ... ఏమవుతుందో అని భయంగా ఉందిరా?
బాగా రాశాక భయమెందుకు?
ఔను అస్సలు కాపీ కొట్టకుండా రాశాను. అందుకే భయం. కాపీ కొట్టి ఉంటే మినిమం గ్యారంటీ ఉండేది.

ఆ విద్యార్థి భయంలో అర్ధం ఉందని రెండో విద్యార్థి నిజమే అని తలూపాడు. చిన్న వయసు నుంచే కాపీ అనేది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అసలు కాపీ అనేది లేకపోతే ఈ ప్రపంచం ఎంత స్లోగా సాగేదో కదా? ఆపిల్, సామ్‌సంగ్ కంపెనీల మధ్య కాపీ పోరు వల్ల బోలెడు మేలు జరిగింది కదా?
ఆమె చీర నా చీరకన్నా తెల్లగా ఉందే ఎలాగబ్బా అనే ధోరణి నుంచి కొత్త సృష్టికి లేదా ఉన్నదానికి కాపీ సృష్టి జరుగుతుంది.
పోటీ ఎంత ఎక్కువగా ఉంటే కాపీ అంత వేగంగా విస్తరిస్తుంది. రాజకీయాల్లో ఇప్పుడు పోటీ బాగా పెరిగిపోయింది. అలాంటప్పుడు కాపీ సైతం అంతే స్పీడ్‌గా పెరిగిపోవాల్సిందే!

 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆసలు ఆలోచన నాదే వైఎస్‌కు నేనే చెప్పాను అని బొత్స చెబితే, ఆ పథకం రూపకల్పన చేసిందే నేనే, వైఎస్‌ఆర్ ఆ పథకాన్ని కాపీ కొట్టి ఎక్కువ ప్రచారం చేసుకుని తనదని చెప్పుకున్నారని బాబు వాపోయారు. 50 మంది విద్యార్థులుండే తరగతి గదిలో ఎవరిది చూసి ఎవరు కాపీ కొట్టారో తేల్చుకోవడం పేపర్లు దిద్దే టీచర్లకు కష్టం కావచ్చు కానీ ప్రజలు మాత్రం ఎ పథకం ఒరిజినల్ ఎవరిదో? ఎవరు కాపీ కొట్టారో బాగానే గ్రహించేస్తున్నారు. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. ఇద్దరు మనుషులు ఒకరినొకరు ఇష్టపడేందుకే వెయ్యి అబద్ధాలు ఆడినా తప్పులేదనే మినహాయింపు ఉన్నప్పుడు కోట్ల మంది ఓటర్ల ఓట్లు కొల్లగొట్టడానికి నాయకులు ఎన్ని కోట్ల అబద్ధాలు చెప్పడానికి మినహాయింపు ఉండాలి. క్యాలుక్యులేటర్‌కు సైతం అందని లెక్క ఇది. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. కక్కురావడం కాదు ముక్కు చీదినా ఈ మధ్య ప్రభుత్వాలు పడిపోయి మధ్యంతర ఎన్నికలొస్తున్నాయి. జయలలిత, మాయావతి, మమత లాంటి వారికి తుమ్ము, దగ్గు రాకుండా చూసుకోవడానికి గతంలో బిజెపి, కాంగ్రెస్ చాలా తంటాలు పడ్డాయి. ఎలర్జీలు ఉన్నవారిని నమ్ముకుంటే నట్టేట మునుగుతామని గ్రహించి ఈ మధ్య వీళ్లతో సంబంధం లేకుండా బతికేసే మాత్రలను యుపిఏ కనిపెట్టేసింది.

 వాహనాలకు స్టెప్నీ ఉన్నట్టు ఈ మధ్య ప్రభుత్వాలు కూడా మద్దతు విషయంలో ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంటే ఔట్ సోర్సింగ్ అన్నమాట! ఉద్యోగులు తోక జాడిస్తే గతంలో మాదిరిగా లాకౌట్ ప్రకటించాల్సిన అవసరం లేదు. ఔట్ సోర్సింగ్ ద్వారా పని కానిచ్చేయవచ్చు. ప్రభుత్వాలు సైతం ఈ ఔట్ సోర్సింగ్‌ను బాగానే నమ్ముకున్నాయి. చిన్నా చితక పార్టీలను, పార్టీల్లో కొందరు సభ్యులను బయటి నుంచి మద్దతు కోసం అట్టిపెట్టుకున్నారు. దేశ రాజకీయాలకు తొలిసారి బయటి నుంచి మద్దతు మార్గాన్ని పరిచయం చేసింది మన మన బాబుగారే...! దీన్ని కాంగ్రెస్ వాళ్లు కాపీ కొట్టి ప్రభుత్వాలను నిలబెట్టుకున్నారు. మధ్యంతర ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని అన్ని పార్టీల వాళ్లు ధీమాగా ఉన్నారంటే బయటి నుంచి మద్దతు సిద్ధాంతాన్ని నమ్ముకునే కదా? దీనికి బాబుపై కృతజ్ఞత చూపాల్సిన కాంగ్రెస్ ఆయనే్న ఎంత మాటంది. బాబు కాపీ రాయుడట! ఈ మాట అనడానికి వారికి మనసెలా ఒప్పింది? కేంద్రంలో తమ ప్రభుత్వం నిలబడింది బాబు కనిపెట్టిన ఫార్ములాతోనే అనేది గుర్తుకు రాలేదా?
ఒకటా రెండా బాబు ఐడియాలు ఎన్నో కాపీ కొట్టేస్తున్నారు. నగదు బదిలీ పథకం మా అబ్బాయిది, ఉచిత విద్యుత్, ఫీజులు, ఆరోగ్యశ్రీ, మైనారిటీ రిజర్వేషన్లు, రెండు రూపాయల బియ్యం పథకాలన్నీ నావే కాపీ కొట్టేశారని వాపోతున్నారు. చివరకు నా పాదయాత్రను సైతం షర్మిల కాపీ కొట్టేశారంటున్నారు. పాదయాత్ర ఐడియా మా నాన్నది అని ఆమె చెబుతుంటే కాపీ రైట్‌కు కాలం చెల్లింది... ఇప్పుడు కొత్తగా పాదయాత్ర రైట్ బాబుగారిదే అని ఆ పార్టీ వాళ్ల వాదన. ఎప్పుడు మొదలు పెట్టామని కాదు విజయవంతంగా కాపీ కొట్టామా? లేదా? అనేది ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యం.
బజాజ్ స్కూటర్స్ హవా నడిచే కాలంలో స్కూటర్ తయారై ఇంకా మార్కెట్‌లోకి వెళ్లక ముందే పంజాబ్‌లో నకిలీ పార్ట్స్ తయారు అయ్యేవి. వాటిని నిరోధించలేమని గ్రహించాక చివవరకు కంపెనీ వాళ్లే వాళ్లకు రుణాలు ఇచ్చి కాస్త నాణ్యమైన పార్ట్స్‌ను తయారు చేయండి అని వేడుకున్నారు. స్కూటర్లు కాదు అసలు సృష్టి ప్రారంభం అయినప్పుడే కాపీ అనేది మొదలైంది. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని విశ్వామిత్రుడు ప్రయత్నించాడు అంటే కాపీ అక్కడి నుంచే పతాక స్థాయికి వెళ్లినట్టు కదా? సరే మార్కెట్ శక్తులు సహకరించక పోవడం వల్ల విశ్వామిత్రుడి ప్రతి సృష్టి అంతగా విజయవంతం కాక త్రిశంకు స్వర్గంగా నిలిచిపోయింది. రాజకీయాల్లో సైతం కాపీ అనేది ప్రతిసారి ఉపయోగపడుతుందనే గ్యారంటీ లేదు. పార్టీ ఏర్పాటు, విధానాలు, పచ్చ రంగు, ప్రత్యేక వేదిక, సబ్సిడీ పథకాలు అన్నీ తమిళనాడు నుంచి కాపీ కొట్టుకొచ్చినా తెలుగునాడు పార్టీ బాగానే సక్సెస్ అయింది.

శ్రీకృష్ణుడి కాలంలోనూ ఈ కాపీ వ్యవహారం సాగింది. పౌండ్రక వాసుదేవుడు అచ్చం శ్రీకృష్ణుడిలా తయారై, వీధుల్లో తిరిగే వారట! ఈ పాత్ర విషయంలోనే ఎన్టీఆర్‌కు, ఎంఎస్‌రెడ్డికి గొడవ జరిగిందంటారు. ప్రచారంలో గోబెల్స్ మన నేతలకు మార్గదర్శకుడు. ఆయన విధానాలు కాపీ కొట్టినా గోబెల్స్ దిగివచ్చి ఈ ప్రచారం చూస్తే ఆయనే విస్తుపోయేంతగా అలా ముందుకు వెళుతున్నారు మన నేతలు.
అన్ని వేదాల్లోనే ఉన్నాయి  వేదాలనుంచే కాపి కొట్టేశారు అని ఆధునిక పరిజ్ఞానం పై కొందరి అభిప్రాయం 

5 కామెంట్‌లు:

  1. ఆహా! బాగుందండి కాపీ ప్రహసనం

    రిప్లయితొలగించండి
  2. 'కాఫీ' తాగుతూనే పేపర్ చదువుతూ ఆలోచించేది మనకేది బాగుంటుందో 'కాపీ' కొట్టడానికే మురళీ గారు. అవసరమైన మేరకు కాపీ తప్పు కాదు తప్పేది కాదు. దీనిలో నిజానికో సూత్రముంది. అదే ప్రాసెస్ . పాతది లేకుండా కొత్తది లేదు. కేలుక్యులేటర్ నుండే కంప్యూటర్ వచ్చింది. మార్కెట్ లో అయితే పాతదానికంటే కొత్తది మెరుగ్గ ఉంటేనే హిట్ . లేకుంటే ఫట్ . పోస్టు బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. :)) మురళీ గారు పోస్టు బాగుంది.

    దీనిలో నిజానికో సూత్రముంది. అదే ప్రాసెస్ . పాతది లేకుండా కొత్తది లేదు. కేలుక్యులేటర్ నుండే కంప్యూటర్ వచ్చింది.

    'కాఫీ' తాగుతూనే పేపర్ చదువుతూ ఆలోచించేది మనకేది బాగుంటుందో 'కాపీ' కొట్టడానికే మురళీ గారు.

    అవసరమైన మేరకు కాపీ తప్పు కాదు తప్పేది కాదు. మార్కెట్ లో అయితే పాతదానికంటే కొత్తది మెరుగ్గ ఉంటేనే హిట్ . లేకుంటే ఫట్ .

    గీతలో కృష్ణుడు చెప్పినట్లు ఏదీ నీది కాదు.

    రిప్లయితొలగించండి
  4. అసలు ఈ పోస్టు కూడా సమాంతర విశ్వం (parallel universe) లో ముందు ఎవరో ilarum ahddub గారు రాస్తే మీరు కాపీ కొట్టారని స్ఫేస్ సైంటిస్టుల ఉవాచ !!

    రిప్లయితొలగించండి
  5. ఈ వ్యాసం మీరే రాశారా, లేక ఎక్కడి నుంచైనా కాపీ కొట్టారా?? :)

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం