3, అక్టోబర్ 2012, బుధవారం

రాజకీయ జీవుల జీవ వైవిధ్యం...కాంగ్రెస్‌ను మించిన జీవ వైవిధ్యం ప్రపంచంలో లేదు .

ఒక చేతితో తమ కన్నబిడ్డలను టెక్నో స్కూల్‌లో చేర్పించడానికి అప్లికేషన్ ఫారంను మరో చేత్తే తమను కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించడానికి దరఖాస్తు తీసుకుని ఇంటికి బయలు దేరిన సగటు మధ్యతరగతి జీవికి జీవితానికి మించిన జీవ వైవిధ్యం ఏముంటుంది. కళ్లు తెరిచి, మనసు పెట్టి చూస్తూ మన జీవితమే పెద్ద జీవ వైవిధ్యం కాదా?
ఐశ్వర్యారాయ్‌ను మోహించి తల్లిదండ్రులు చూపించిన అమ్మాయితో అడ్జస్ట్ అవుతూ నువ్వే నా పాలిట ఐశ్వర్యారాయ్‌వి అని అతను, నువ్వే నా కలల రాకుమారుడు హృతిక్ రోషన్‌వు అని ఆమె ఒకరికొరకు పైకి చెబుతూ, పైన సంతృప్తి, లోన అసంతృప్తితో జీవించడం జీవన వైవిధ్యమే.!
***

మానవ జీవితంలో పిట్టలు, పక్షులు, జంతువులు అన్నింటికి భాగస్వామ్యం ఉండాలని చెప్పడానికి శత్రు దుర్భేద్యమైన కోటలో సదస్సు నిర్వహించారు. రాజధాని నగరంలో జూబ్లీ హీల్స్ దాటిన తరువాత కొంత దూరం వెళ్లాక అనుమతి లేనిదే చీమలు కూడా దూరని ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య జీవ వైవిధ్య సదస్సు నిర్వహించడం మన వ్యవస్థలోని జీవన వైవిధ్యం. చెట్లు కొట్టేసి, పురుగు పుట్రను ఖాళీ చేయించి అద్భుమైన భవనాలు నిర్మించి వందల కోట్లు ఖర్చు చేసి జీవులను రక్షించాలని సదస్సు నిర్వహించడం కూడా జీవన వైవిధ్యమే.
***

ఐదేళ్లకోసారి అధికారంలోని పార్టీని మర్చేయాలని ఐదేళ్లపాటు ఎదురు చూసే మధ్యతరగతి జీవితాన్ని మించిన జీవన వైవిధ్యం ఎక్కడ కనిపిస్తుంది. సినిమా తారల జీవితంలోని వైవిధ్యం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగే రోజుల్లో వాణిశ్రీ తానేమిటో తానే మరిచిపోయానని చెప్పుకున్నారు. పూర్తిగా పాత్రల్లో లీనమై పోతూ తనను తాను మరిచిపోయానన్నారు. శ్రీరాముడు, రిక్షా రాముడు, డ్రైవర్ రాముడు ఒకదానికొకటి సంబంధం లేదు కానీ ఎన్టీఆర్ అన్నింటిలోనూ లీనమైనటించారు. శ్రీరాముడు అంటే ఇలానే ఉండేవారేమో అనుకున్నారు. రిక్షా రామున్ని చూసి రిక్షా తొక్కేవాళ్లంతా ఇలానే ఉంటారనుకున్నారు. రిక్షావాడు మరోలా కనిపిస్తే నమ్మబుద్ధి అయ్యేది కాదు. వీడెవడో దొంగోడేమో రిక్షా వాడు రిక్షారాముడిలో ఎన్టీఆర్‌లా ఉండాలి కదా? అనిపించేది. పాపం ఆయన అన్ని పాత్రల్లో నటించి చివరకు వాస్తవాలను గ్రహించలేక ఎదుటి వారి నటనను గుర్తుపట్టలేక జీవిత చరమాంకంలో ఘోరంగా దెబ్బతిన్నారు. ఎన్టీఆర్ జీవితం నటనలో జీవించే వాళ్లు ఎదుటివారి నటనను గ్రహించలేరు అనే జీవిత పాఠం నేర్పించింది.

 పాత్రవేరు నువ్వు వేరు అని తెలిసేప్పటికీ పుణ్యకాలం తీరిపోతుంది. శ్రీదేవి, జయప్రద, జయసుధ, డ్రీమ్‌గర్ల్ హేమామాలినికి వారి వారి కాలాల్లో కుర్ర కారు ఆ పేర్లు వింటేనే పడి చచ్చేవాళ్లు. వీళ్లను పెళ్లిచేసుకుందామనే ఆశ ఉన్నా అవకాశం లేదని తెలిసి అలాంటి అందగత్తెలనే పెళ్లి చేసుకుంటామని భీష్మించుకునే వాళ్లు. కొన్ని లక్షల మంది కుర్ర కారు హృదయాలను దోచిన ఇంత అంతగత్తెలకు పెళ్లి కోసం పెళ్లికాని యువకులు దొరక్కపోవడం ఆ దేవుడు చూపించిన జీవన వైవిధ్యమేమో! అంత అందగత్తెలైనా వాళ్లంతా అప్పటికే పెళ్లయి పెద్దపెద్ద పిల్లలు ఉన్న మగాళ్లకు రెండో భార్యలుగా ఉండాల్సి వచ్చింది.హేమామాలినికి పెళ్లికాని యువకుడు దొరక్కపోవడం ఏమిటో? శ్రీదేవి వయసు పిల్లలున్న బోనీ కపూర్‌కు శ్రీదేవి భార్య కావడం ఏమిటో?
***

ఏదో నిధులున్నాయని ఇప్పుడు జీవ వైవిధ్యం అంటూ పాశ్చాత్యులు హడావుడి చేస్తున్నారు కానీ మన దేవుళ్లు జీవ వైవిధ్యాన్ని ఎప్పుడో గ్రహించారు. చాలా మంది దేవుళ్లకు పశుపక్షలు వాహనాలుగా ఉండేవి. తొలి పూజలందుకునే గణపతికి ఏకంగా ఏనుగు ముఖం ఉంది కదా? జీవ జాలం తోడుగా ఉండడం కాదు తమలో భాగం అని దేవతలు నిరూపించారు. మారీచుడు బంగారు జింకగా మారినా? రాక్షసులు పక్షులుగా మారినా జీవ వైవిధ్యమే. దేవతల తరువాత జీవ వైవిధ్యం ప్రాధాన్యతను తెలుగునాట సినిమా రంగంలో ఎక్కువగా గుర్తించింది విఠలాచార్య. హీరోలు, హీరోయిన్ల కన్నా ఆయన సినిమాలో పశుపక్షులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. వాటితో విసిగిపోతే ఆయన దెయ్యాలను నమ్ముకున్నారు, కానీ జీవ వైవిధ్యన్ని వదులుకోలేదు.
***

వీరందరి కన్నా జీవ వైవిధ్యన్నా తమ జీవితంలో భాగంగా చేసుకున్నది మాత్రం కచ్చితంగా రాజకీయ నాయకులే. కోట్లు సంపాదించి ఆదాయం పన్ను కట్టమంటే నా దగ్గరేముంది బూడిద అని అంటారో నేత. అప్పుడే వివేకానంద రూపంలో కనిపించి ఆ వెంటనే మినాక్షి శేషాద్రితో శృంగార పాటలు, కాషాయ రూపం పక్కన పారేసి వృద్ధాప్యంలో వివాహం ఇదే కదా! జీవన వైవిధ్యం. తరువాత కాషాయ దస్తులను ఎర్ర రంగులో ముంచడం ఇదే కదా జీవన వైవిధ్యం. ఊసరవెల్లి ప్రమాదంలో పడినప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్లు క్షణ క్షణం జీవన వైవిధ్యం చూపకపోతే ఔట్ డేటెడ్ నాయకులవుతారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అనాలి, సీట్లు పెరిగే చాన్సుంటే ఆ వెంటనే రాష్ట్ర విభజన కోసం నడుం బిగించాలి.
ప్రపంచ దేశాలు భారత దేశాన్ని జీవ వైవిధ్య రాజధానిగా ప్రకటించేశాయి. ఏ ఉద్దేశంతో చేసినా వారు చాలా సరైన పనే చేశారనిపిస్తోంది. విదేశీ పాలనకు వ్యతిరేకంగా వందల ఏళ్లపాటు పోరాడిన చరిత్ర ఉన్న ఈ దేశీయులు ఇటలీ వనితికు దశాబ్దాల నుంచి పట్టం కట్టడానికి మించిన జీవన వైవిధ్యం ప్రపంచంలో ఇంకెక్కడుంటుంది. ఆమె నోరుమెదపరు. కానీ కనుసన్నల్లోనే దేశాన్ని పాలిస్తున్నారు. కాంగ్రెస్‌ను మించిన జీవ వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అధికారపక్షం, ప్రతిపక్షం, అభిమాన పక్షం, వెన్నుపోటు పక్షం, గోతులు తీసే పక్షం, నీతులు చెప్పే పక్షం అన్నీ అందులోనే ఉంటాయి.

5 వ్యాఖ్యలు:

 1. మురళి గారు,

  ఎప్పటిలాగే చాలా చాలా బాగా రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అన్ని పక్షాలూ కాంగ్రెస్ లోనే ఉంటాయనిక్ చెప్పారుక్ చూడండి, అద్భుతం!!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చక్కటి వైవిధ్యాన్ని చూపించారు మీ రచనలో.ఎక్కడో చెట్లు కొట్టేసి పురుగూ పుట్రనూ ఖాళీ చేయించి సదస్సునిర్వహిస్తున్నారని మీరు బాధ పడుతున్నారు గానీ వాటన్నిటినీ భర్తీ చేసే తోడేళ్లూ జిత్తుల మారి గుంటనక్కలూ నిరంతరం ద్వేషమనే విషాన్ని విరజిమ్మే కాలనాగులూ, దేన్నైనామింగి హరాయించుకోగల కొండచిలువలూ ఏదీ పట్టించుకోకుండా నిద్రించగల మంటిబుక్కడాలూ శవాలనే కాదు శ్మశానాలనే మింగేసే రాబందులూ..ఉహ్..మీకెంత జీవవైవిధ్యం కావాలన్నా అందించ గలరు.ఇవి మీరు చెప్పిన మూడురంగులలోనే కాదు పసుపు,ఎరుపు,గులాబీ లాంటి అన్నిరంగులలోనూ లభ్యం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Pantula gopala krishna rao గారు ధన్యవాదాలు .. కాంగ్రెస్స్ పార్టీ సర్వ పార్టీలకు పుట్టినిల్లు .అన్ని పార్టీ లా నాయకులు అక్కడే శిక్షణ పొంది బయటకు వచ్చారు . జీన్స్ ద్వారా అవలక్షణాలు అన్ని పార్టీలకు వస్తాయి కదా

   తొలగించు
 4. Avinash Vellampally గారు, UG SriRam గారు ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం