31, అక్టోబర్ 2012, బుధవారం

సుబ్బలక్ష్మి- జాలిమ్ లోషన్ -ప్రజాస్వామ్యం- పాదయాత్ర

ఫార్ములా వన్ రేస్‌లను గుర్తుకు తెస్తున్న ట్టుగా ఓబి వ్యాన్‌లు పరుగులు తీస్తున్నాయి. తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరంపైకి చేరినప్పుడు, చంద్రునిపై కాలు పెట్టినప్పుడు, అమెరికాను కనిపెట్టినప్పుడు కూడా అంత హడావుడి ఉండకపోవచ్చు. ఇంటి ముందు డజన్ల కొద్ది ఓబి వ్యాన్లు వచ్చి ఆగినా ఇంటి యజమానురాలు కించిత్ కూడా చలించకుండా ఇది మాకు మామూలే అన్నట్టుగా ఉంది. సుబ్బలక్ష్మి గారితో మేం మాట్లాడాలి అని టీవి వాళ్లు అడిగారు. కుదరదు ఇప్పుడు ఆమె బిజీగా ఉంటుంది. మరో గంట తరువాత రండి అంది. సుబ్బలక్ష్మి వంట పాత్రలన్నింటిని కడుగుతోంది. విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే ఎవరొప్పుకుంటారు. గంట వరకు ఆగడం అంటే కుదరదు అక్కడ లైవ్‌కు ఏర్పాట్లు చేసుకున్నాం. అంటూ కోరస్‌గా వేడుకున్నారు. చివరకు ఇంటి యజమానురాలికి, చానల్స్‌కు మధ్య జరిగిన ద్వైపాక్షిక, శిఖరాగ్ర చర్చల్లో ఒక ఒప్పందానికి వచ్చారు. సుబ్బలక్ష్మి అలా వంట పాత్రలు కడుగుతూనే ఉంటుంది, వీరు ఆమెను అడగాల్సినవి అడగవచ్చు. 

సుబ్బలక్ష్మి గారూ మీ కోసం సుబ్బిగాడు వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని బెదిరిస్తున్నాడు. అని టీవి వాళ్లు కోరస్‌గా అడిగారు. అదంతా టీవిలో లైవ్‌గా చూశాను కొత్త విషయాలేమన్నా ఉంటే చెప్పండి అని సుబ్బలక్ష్మి ఎంతో అనుభవం ఉన్న హైకమాండ్ లీడర్ రేంజ్‌లో అనేక ప్రశ్నలకు ఒకే ముక్కలో తేల్చి చెప్పింది.
 మీ అమ్మ గారిని చూసి నిజం చెప్పడానికి భయపడుతున్నారా ? 
మా అమ్మగారి జీవితం తెరిచిన పుస్తకం ..నా  జీవితం కడిగిన గిన్నె ..
 సుబ్బి గాడి  మీద ఫిర్యాదు చేస్తారా ?
చట్టం తన పని తను చేసుకుపోతుంది 
ప్రజలకు మీరిచ్చే సందేశం ?
ప్రజలే నా  దేవుళ్లు వారికే నా జీవితం అంకితం 
అంటే ఇంటింటికి  వెళ్లి ఉచితంగా అంట్లు తోముతరా ?

ఆ ప్రశ్న వేసిన అతన్ని సుబ్భాలక్ష్మి కోపంగా చూసి .. మా మనోభావాలు దెబ్బతిస్తున్నారు .. అంది 
 అతను కొత్త వదిలేయండి అని మిగిలిన వారు సర్ది చెప్పారు 
అప్పటి వరకు మౌనంగా ఉన్న యజమాను రాలు మా సుబ్బి రోజు అన్ని న్యూస్ చానల్స్ చూస్తుంది అని అసలు విషయం చెప్పింది 
అందుకేనా ఉస్కో అంటే ఉస్కో అంటుంది అని అనుకున్నారు 
సాధారణంగా మీ సందేశం ఏమిటి అని అడుగుతాం కానీ ఎందుకో మీకు మాత్రం మా సందేశం చెప్పాలనిపించింది 
ఆరోగ్యంగా ఉండాలంటే న్యూస్ చానల్స్ ఎక్కువగా చూడకండి అని ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారు 
.కొన్ని ప్రశ్నలకు నో కామెంట్ అని కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది అని అంది. 

ఆమెను నేను లవ్ చేస్తున్నాను, ఆమె ఐ లవ్ యూ చెప్పకపోతే వాటర్ ట్యాంక్ నుంచి దూకి చచ్చిపోతాను అని సుబ్బిగాడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. బస్టాప్‌లో అడవారు కనిపిస్తే, ఎవరినైనా నేను టైమ్ ఎంతయింది మేడం అని అడిగితే కుష్టువాడినో, ముష్టివాడినో చూసినట్టు చూసేవాళ్లు. కానీ సుబ్బలక్ష్మి మాత్రం నవ్వుతూ రెండు మూడు సార్లు టైమ్ చెప్పేది. లవ్ చేస్తుందనడానికి ఇంత కన్నా ఇంకేం సాక్షం కావాలని సుబ్బిగాడు ప్రశ్నించాడు. 

అమ్మగారు కొత్త వాచ్ కొనడంతో పాతది నాకిచ్చింది. జీవితంలో మొదటి సారి వాచ్ పెట్టుకోవడం వల్ల ఎవరు టైమ్ అడిగినా చెబుతాను అంతే తప్ప లవ్‌గివ్ ఏమీ లేదని పాలగినె్నను బూడిదతో గట్టిగా తోముతూ చెప్పింది సుబ్బలక్ష్మి.
***
 ‘‘ఏంటీ టీవిలో అంతగా మునిగిపోయారు ?’’ అని తాయారు మొగున్ని అడిగింది. 

‘‘్భలే లవ్ స్టోరీ వ స్తుంది. ఇటు రా అని భర్త పిలిచాడు.

 సుబ్బిగాడు వాటర్ ట్యాంక్ చివ రి వరకు వెళ్లాడు. ఏక్షణంలోనైనా బ్యాలెన్స్ తప్పి పోయి పడిపోతాడమేమో అనిపిస్తోంది. చీకట్లు ముసురుకుంటున్నాయి. ఉదయం నుంచి సుబ్బిగాడు ఏమీ తినలేదు. అప్పటి వరకు అతన్ని న్యూసెన్స్ కేసుగా చూసిన వాళ్లు క్రమంగా అతనిపై జాలి చూపడం మొదలైంది. వారి ప్రేమ ఫలిస్తుందా? లేదా? అని టీవి వాళ్లు ఎస్‌ఎంఎస్ సర్వే నిర్వహిస్తే, ఉదయం 10 శాతం మంది అనుకూలంగా చెబితే, రాత్రి అయ్యే సరికి అది 70 శాతానికి చేరుకుంది. 

చూడోయ్ తాయారు వాడు చాలా తెలివైన వాడు వాడికి తెలియకుండానే ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోరాటం చేస్తున్నాడు. వాడు గనుక రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడు అంటూ కుటుంబ రావు చెప్పుకొచ్చాడు.

 ‘‘వాడి ముష్టి ప్రేమకు ప్రజాస్వామ్యానికి లంకె ఏమిటి? ’’అని తాయారు చిరాకు పడింది. అదేనోయ్ ప్రజాస్వామ్యం. ముందు తనను తాను హింసించుకుని, అధికారంలోకి వచ్చాక ప్రజలను హింసించడమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం చెబుతాను విను. రాజ్యాలు పుట్టక ముందే తనను తాను హింసించుకోవడం ద్వారా విజయం సాధించవచ్చునని చాలా మంది మహానుభావులు నిరూపించారు.

 రావణుడు తన తలలను తాను తెగ్గోసుకుని శిక్షించుకోవడం వల్లే కదా శివుడు వరాలను ప్రసాదించింది. అన్నగారి పాతాళాబైరవిలో మాంత్రికుడేం చేశాడు. తన చెయ్యిని, చివరకు తలను కోసి అర్పించడం వల్లనే కదా అమ్మ దయతలిచి వరమిచ్చింది. పాదయాత్రకు వెళ్లే ముందు బాబుగారేమన్నారు. నన్ను నేను శిక్షించుకుంటున్నాను అన్నారు కదా? ఎసి జీవులు మన కోసం వందల కిలోమీటర్లు నడవడం అంటే శిక్షించుకోవడమే కదా? తల కోసుకుంటే శివుడు వరమిస్తాడని రావణుడికి తెలుసు, అమ్మ వరమిస్తుందని పాతాళా బైరవిలో ఎస్వీఆర్‌కూ తెలుసు. అప్పుడు వైఎస్‌ఆర్‌కు తెలుసు, ఇప్పుడు బాబు, షర్మిలకూ తెలుసు. ప్రజాస్వామ్యం అంటే ఇదే? భారతీయులకు జాలి ఎక్కువ. తమ జీవితం దుర్భరంగా ఉన్నా, తమ నాయకుల కష్టాన్ని చూడలేని జాలి గుండెలు.అధికారం లేక తమ నాయకులు నీటిలో నుంచి తీసిన చేపలా విల విల లాడి  పోవడం  చూసి తట్టుకోలేరు .. ’’ అని కుటుంబరావు వివరించాడు. .

 ‘‘సుబ్బిగాడి ప్రేమ సక్సెస్ అవుతుందా? పాదయాత్రతో ఎవరికి అధికారం లభిస్తుంది? ’’తాయారు ఆసక్తిగా అడిగింది. 

హిచ్‌కాక్ సినిమాల్లో, తెలుగు రాజకీయాల్లో ఎప్పుడే మలుపు తిరుగుతుందో చెప్పలేం. సుబ్బిగాడికి పోటీగా మరో అప్పిగాడెవడన్నా రైలు పట్టాలపై తల పెట్టి లవ్ చేస్తావా? చావనా అని సుబ్బలక్ష్మికి వార్నింగ్ ఇవ్వవచ్చు. మరో నేత మరింత జాలి కోసం ప్రయత్నించవచ్చు.
 గజ్జిని బట్టి జాలిమ్ లోషన్. జాలిని బట్టి రాజకీయాల్లో గెలుపు ఓటములు అని కుటుంబరావు ముగించాడు. రోజంతా చుపిందే చూపడం తో వీక్షకులు చానల్ మార్చడం ప్రారంభం కాగానే టీవీల వాళ్లు సుబ్బిగాడి ప్రేమకథను వదిలేసి మరో కథ వేటలో పడ్డారు.

3 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం