7, నవంబర్ 2012, బుధవారం

ప్రతి నాయకుడి మదిలో కొలువై ఉండే ప్రేయసి

దురద వేసినప్పుడు మెదడు చెప్పకపోయినా గోళ్లు తమ పని తాము చేసుకుపోతాయి. అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఇదే. వయసొచ్చాక ప్రేమ కూడా అంతే ప్రేమించాలనిపించేస్తుంది. ప్రేమ కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మన కేంద్ర మంత్రి శశిథరూర్ ప్రేమంటే తెలుసా? నీకు అంటూ నరేంద్ర మోడీని ప్రశ్నించే సరికి ఆయన నీళ్లు నమలాల్సి వచ్చింది.

 ఎదుటి వాడి బలానికి మన బలం సరిపోదని లెక్క తేలితే బలహీనతపై దృష్టి పెట్టాలి. అప్పుడు లెక్క తేలుతుందనే లెక్క శశిథరూర్‌కు బాగా తెలుసు. ప్రేమ ఆ సబ్జెక్ట్‌లో థరూర్‌కు విశేషమైన ప్రావీణ్యం ఉంది. ఆ సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీ పట్టాలా ఆయన వెన్నంటే అందాల కొత్త భార్య సునంద పుష్కర్ సాక్ష్యంగా పక్కన కనిపిస్తారు. 50 కోట్ల ప్రేయసిని ఎక్కడైనా చూశారా? అంటూ శశిథరూర్‌పై నరేంద్ర మోడీ చురక అంటించారు. ఐపిఎల్ టీంల కేటాయింపు సమయంలో ఎలా జరిగిందో తెలియకుండా సునంద ఖాతాలో 50 కోట్లుచేరిపోయాయి. అది కాస్తా వివాదంగా మారి చివరకు మంత్రి పదవి ఊడింది. అయినా అందమైన భార్య పక్కన లేకుండా ఏ సింహాసనం ఉంటే ఏం లాభం అనుకుని థరూర్ తన ప్రేయసి కోసం మంత్రి పదవిని లెక్క పెట్టలేదు. మంత్రి పదవి ఊడబెరికితే ఆయన ప్రేమించడమే కాదు పెళ్లి కూడా చేసుకుంటాను అని ఒక అడుగు ముందుకేసి చేసుకొని చూపించారు. ముందే చెప్పుకున్నాం కదా దురద పెట్టినప్పుడు గోక్కుంటే ఎదుటి వాడు చూస్తున్నాడా? పరువు పోతుందా? లాభమా నష్టమా? అనే లెక్కలు గుర్తుకు రావు. గోళ్లు తమ విధినిర్వహణలో మునిగిపోతాయి. ప్రేమా అంతే మంత్రి పదవి పోతుందా?మళ్లీ వస్తుందా? రాకపోతే ఎలా అనే భవిష్యత్తు ప్రణాళికలు ఉండవు.

 ప్రే మించగానే ఎక్కడ లేని శక్తి వస్తుంది. అయతే హనీమూన్ ముచ్చట తీరిన తరువాత థరూర్‌కు మళ్లీ మంత్రి పదవి లభించింది. ఒకవైపు ప్రేమిస్తూనే మరోవైపు ఆయన రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. పోయిపోయి మోడీతో పెట్టుకున్నారు. ఈయన 50 కోట్ల ప్రేయసి గురించి మోడీ చేబితే, నా ప్రేయసి ఖరీదు 50 కోట్లకన్నా ఎక్కువే అని శశిథరూర్ ప్రకటించేశారు. ఐనా ప్రేమిస్తే ప్రేయసి విలువ తెలుస్తుంది కానీ మోడీకేం తెలుసు? అని మోడీ బలహీనతపై దెబ్బకొట్టారు. చిన్నప్పటి నుం చి ఆర్‌ఎస్‌ఎస్‌లో వయసులోకి వచ్చాక బిజెపిలో, మధ్య వయసులో ముఖ్యమంత్రి పదవిలో బిజీబిజీగా ఉన్న మోడీకి ఇక ప్రేమించడానికి సమయమెక్కడిది? డ్యూయె ట్లు పాడే ఓపికెక్కడిది.

 రాజరికపు జిత్తులతో రణ రంగపు టెత్తులతో సతమతవౌతున్న మా మదిలో మదనుడు సందడి చేయుట చిత్రం అని దుర్యోధనుడిగా అన్నగారు ఆశ్చర్యపోవడం మనం చూడలేదా? అయ్యో ఇది కేవ లం అన్నగారి నటన మాత్రమే అని తేలిగ్గా తీ సుకోకండి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ము దిమి వయసులో ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా లక్ష్మీపార్వతితో ప్రేమలో పడలేదా? బహిరంగ సభల్లోనే ఆకుచాటు పిందె తడిసే స్టెప్పులు వేయలేదా? నటన ప్రభావం ఆయనపై ఉందో, ఆయన ప్రభావం నటనపై ఉందో కానీ చివరకు ప్రేమ కావాలా? కుర్చీ కావాలా? తేల్చుకో అని అల్లుడు వార్నింగ్ ఇస్తే ప్రేమ కోసం కుర్చీని కూడా వదులుకున్నారు కదా? అన్నగారు లక్ష్మీపార్వతి కోసం ఒకే ఒక్కడుగా ఉండే ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుంటే, శశిథరూర్ ఆరు డజన్ల కేంద్ర మంత్రుల్లో ఒకరిగా ఉండే కేంద్ర మంత్రి పదవి వదులుకోవడంలో వింతేముంది. మీ ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణాల్లో మునిగిపోయిందని తిట్టినా, ఏమన్నా సహిస్తాం కానీ మా నాయకుల ప్రేమను చిన్న చూపు చూస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు. నీకసలు ప్రేమం టే తెలియదు అని థరూర్ అంటే ఆయన వద్దకు వెళ్లి ప్రేమ పాఠాలు నేర్చుకోవాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు. ఇటీవల కాం గ్రెస్ నేతగా కన్నా పూరాతత్వ పరిశోధకునిగానే దిగ్విజయ్‌సింగ్ ఎక్కువగా గుర్తిం పు పొందారు. ముంబైలో బీహారీలపై బాల్‌థాకరే మండిపడితే, అసలు జీన్స్‌ను చూశాను థాకరేలు వచ్చింది బీహార్ నుంచే అని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక, ఇక రాదని తేలాక ఆయన పరిశోధనల్లో మునిగిపోయారు. ఆయన చరిత్రను తవ్వితీసి మోడీకో ప్రేయసి ఉందని అమె పేరు యశోధ అని చెప్పారు. దీనికి గూగులే సాక్షమన్నారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయని గ తంలో మనం గర్వంగా చెప్పుకున్నట్టు అన్నీ గూగుల్‌లోనే కనిపిస్తున్నాయి. మోడీ భార్య పేరు అని గూగుల్ సెర్చ్‌లో చూడగానే యశోధ అని పేరు కనిపించింది. తరువాత చాలా మంది పనిలో పనిగా రాహుల్‌గాంధీ భార్య పేరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏకంగా కొలంబియాకు చెందిన జునిట అనే ముద్దు గుమ్మ పేరే కాదు అందమైన ఫోటో కనిపిస్తోంది. మరి ఆ ప్రేమ సంగతి ఏమిటి? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తే, రాజకుటుంబ రహస్యాలు బయటకు చెబుతామా? మాట్లాడతామా? అని ప్రభు భక్తిని ప్రదర్శిస్తున్నారు. అయినా మన నాయకులకు ప్రేమ గురించి కొత్తగా నేర్పించాల్సిన అవసరం ఉందా? 

అస లు ప్రేమించని నాయకుడెవరు? అందరికీ ఓ ప్రేమ కథ ఉంటుంది. ఏ నాయకుడి మనసులోకైనా తొంగి చూడగలిగితే వారు ప్రేమించే ప్రేయసి కనిపిస్తుంది? నాయకుడెవరైనా కావచ్చు కానీ వారు ప్రేమిం చే ప్రేయసి మాత్రం ఒకరే? ఎవరు? అనే అనుమానమా?
ఇంకెవరు కుర్చీనే ఆ ప్రేయసి.
రాజకీయ నాయకులు కుర్చీనే మనసా వాచా కర్మన ప్రేమిస్తారు. ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తారు, ప్రాణాలు తీస్తారు.

1 కామెంట్‌:

  1. ================================
    దురద పెట్టినప్పుడు గోక్కుంటే ఎదుటి వాడు చూస్తున్నాడా? పరువు పోతుందా? లాభమా నష్టమా? అనే లెక్కలు గుర్తుకు రావు. గోళ్లు తమ విధినిర్వహణలో మునిగిపోతాయి.
    ===========================

    :-D

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం