23, నవంబర్ 2012, శుక్రవారం

.తెలుగు హీరోల కడుపున హీరోయిన్లు ఎందుకు పుట్టరు?

పులికడుపున పులే పుడుతుంది ఇదో సినిమా డైలాగు. హీరో కడుపున హీరోనే పుడతాడు. ఇది వాస్తవం. మరి హీరోయిన్ కడుపున హీరోయిన్ పుడుతున్నప్పుడు హీరో కడుపున హీరోయిన్ ఎందుకు పుట్టడం లేదు. ఇందులో ప్రత్యేక కారణం ఏమీ లేదా? లేదు అని ఎవరైనా అంటే నమ్ముదామా? ఇప్పుడు తెలుగు చిత్రసీమను మూడు నాలుగు కుటుంబాలు ఏలేస్తున్నాయి. హీరోలు, నిర్మాతలు, స్టూడియో అధినేతలు ఆ కుటుంబాల నుంచే పుట్టేస్తున్నారు. తెలుగు సినిమా వారికి ఏమిటో ఈ ప్రత్యేకత ఒక్క హీరో కడుపులో కూడా ఒక హీరోయిన్ పుట్టక పోవడం ఆశ్చర్యంగానే ఉంది. చివరకు కొందరు కామెడీ స్టార్లకు సైతం హీరోలు పుట్టారు కానీ హీరోయిన్లు పుట్టలేదు. ఎన్టీఆర్ కుమారులు హీరోలుగా వెలుగు వెలిగారు. కుమారుల కుమారులు సైతం ఇప్పుడు ఏలేస్తున్నారు. ఆ ఒక్క కుటుంబం నుంచే ఆరడజను మంది హీరోలు పుట్టారు. అక్కినేని కుటుంబంలోనూ అంతే కుమారుడి కుమారులే కాదు కుమార్తెలకు సైతం హీరోలు పుట్టేస్తున్నారు. 

అన్నగారు 82లో ఇంత కాలం తనను ఆదరించిన తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే తపనతో బాలకృష్ణను సినిమా రంగానికి అంకితం చేసి తాను రాజకీయాల్లోకి వెళ్లారు. ఇప్పుడు బాలకృష్ణకు తెలుగు ప్రజలకు ఏదో చేయాల్సిన వయసు వచ్చేసింది. తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయడానికి, తాను రాజకీయ ప్రవేశానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ తరువాత స్వయం కృషితో సినిమా రంగంలోకి వచ్చిన చిరంజీవి కుమారుడు సైతం హీరో అయ్యారు.


హిందీలో చాలా మంది హీరోల కుమార్తెలు హీరోయిన్లుగా నటించారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం కాదు టాప్ స్థాయికి వెళ్లిన వాళ్లు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ కిరీటాన్ని అలంకరించిన తొలి స్టార్ రాజేష్‌కన్నా , మాజీ హీరోయిన్ డింపుల కాపాడియ కుమార్తె హీరోయిన్‌గా చాలా సినిమాల్లోనూ నటించారు. ఇప్పుడు టాప్ స్థాయిలో ఉన్న కరిష్మాకపూర్, కరీనా కపూర్‌లు హీరో కడుపున పుట్టిన హీరోయిన్లు. ధర్మేంద్రా, హేమామాలిని జంట ఒకప్పుడు హిందీ సినిమా రంగానే్న ఏలారు. హేమా మాలిని తన కుమార్తెలను హీరోయిన్లుగా చేయడానికి బాగానే ప్రయత్నించారు. తొలుత విలన్‌గా ఆ తరువాత హీరోగా సంచలం సృష్టించిన షాట్‌గన్ శతఘ్న్ సింన్హా కుమార్తె హీరోయిన్‌గా వెలుగొందారు. హిందీలోనే కాదు చివరకు పొరుగున ఉన్న తమిళనాడులో సైతం కొందరు హీరోల కుమార్తెలు హీరోయిన్‌లు అవుతున్నారు. ప్రయోగాలకు పెట్టింది పేరయిన కమల్‌హాసన్ కుమార్తె శృతి హాసన్ తెలుగు, హిందీ సినిమాల్లో టాప్ రేంజ్‌కు వెళ్లారు.


కానీ చిత్రంగా తెలుగు నాట మాత్రం హీరోలకు, హీరోల బంధువులకు సైతం హీరోలే పుడుతున్నారు కానీ ఒక్క హీరోయిన్ కూడా పుట్టడం లేదు.
పాత తరం నటుడు అమర్‌నాథ్ కుమార్తె శ్రీలక్ష్మి హాస్యనటిగా స్థిరపడ్డారు. వారసత్వంగా కాకుండా బతుకు తెరువు కోసమే ఆమె నటి అయ్యారు. అంతా పోగొట్టుకుని హైదరాబాద్ నగరంలో ఒక అభిమాని ఆశ్రయం ఇస్తే బతుకు వెళ్లదీస్తున్న సమయంలో బతుకుతెరువు కోసం సినిమాల్లోకి వెళతాను అంటే తండ్రి చెప్పిన మొదటి మాట వద్దు అంటూ సినిమా రంగం ఎలాంటిదో చెప్పుకొచ్చారు. ఈ మధ్య జయమాలిని ఒక ఇంటర్వ్యూలో ఆ పాప కూపంలోకి నా పిల్లలను తీసుకు వచ్చే ఉద్దేశం లేదని చెప్పింది. హీరో కృష్ణ నటునిగా కొనసాగుతున్నప్పుడు కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్‌గా నటిస్తుందని ఒక ప్రకటన వచ్చింది. కృష్ణ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. ఆ తరువాత మంజుల సినిమాలు నిర్మిస్తూ తన కోరిక నెరవేర్చుకున్నారు. మోహన్‌బాబు కుమార్తె సినిమాలు తీస్తున్నారు, హీరోయిన్‌గా కాకుండా ఇతర పాత్రల్లోనటిస్తున్నారు. మోహన్‌బాబు ఎన్నో సినిమాలు నిర్మించారు. ఎందరికో నటులుగా అవకాశం ఇచ్చారు. అంటే మంచు లక్ష్మికి హీరోయిన్‌గా నటించాలనే ఆసక్తి లేకపోవడం వల్లనే అవకాశం కల్పించలేదని అనుకోవాలా?


జయమాలిన తరువాత వాంప్‌గా ఒక వెలుగు వెలిగిన అనురాధ కుమార్తె తల్లిలానే వాంప్‌గానే కొన్ని సినిమాల్లో కనిపించారు. 80-90 ప్రాంతాల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రాధ కుమార్తె ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తోంది.


నాన్నా మా వారు ఈసారి దసరాకు మీనాన్న మోటర్ సైకిల్ కొనిచ్చి తీరాల్సిందే అంటున్నాడు అంటూ మధ్య తరగతి కుటుంబరావు కుమార్తె భర్త కోరిక చెప్పినంత సులభంగా ఇప్పుడు ఒకనాటి మాజీ హీరోల కుమార్తెలు నాన్నా మా వాడు హీరోగా నటించాలని ముచ్చటపడుతున్నాడు ఎలాగైనా ముచ్చట తీర్చాలి అని అడుగుతున్నారు. ముచ్చట తీర్చుకుంటున్నారు. ఒకరి తరువాత ఒకరు హీరోల వంశంలో హీరోలు పుడుతున్నా హీరోయిన్లు పుట్టక పోవడం చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్న ఫ్యూడల్ మనస్తత్వం తెలియడం లేదా?


తెలుగు సినిమా రంగంలో స్ర్తిలకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో దీన్ని బట్టి తెలియడం లేదా? కొడుకును హీరోగా చేయడానికి తంటాలు పడుతున్న వృద్ధ హీరోలు కుమార్తెల విషయంలో అలా చేయడం లేదంటే సినిమా రంగంలో స్ర్తిలకు ఇచ్చే గౌరవం గురించి వారికి బాగా తెలుసు కాబట్టి అంతే కదా? కాదంటారా?

8 కామెంట్‌లు:

  1. వాళ్ల కడుపు పనికిరానిది కాబట్టి.

    రిప్లయితొలగించండి
  2. ఇప్పుడు హీరోయిన్లంటే నటనకోసం కాదు . విప్పెసి ఎగరటానికే . కాబట్టీ చూస్తూ చూస్తూ కడుపుకు కూడుతిన్న వాడెవడు కూతురిచే అంగాంగ ప్రదర్శన చేపిమ్చటానికి ఇష్టపడడు. ఫ్యూడల్ మనస్తత్వం అనరు దానిని. తండ్రితత్వం అది. అదిలేనివాడిసంగతి వేరు . డబ్బుసంపాదిస్తే చాలు కూతురిచేత కురచగుడ్డలుకట్టించడానికిష్టపడే అంతటీ హృదయవైశాల్యం ఇంకా పెరగలేదు అందరిలో మన అద్రుష్టం కొద్దీ .

    రిప్లయితొలగించండి
  3. తెలుగు వాళ్లకి దర్శకేందృడి సినేమాల వలన హీరోయిన్ లని ప్రత్యేక గ్లామరస్ దృష్ట్టితో చూడటం మూడు నాలుగు దశాబ్దాలుగా అలవాటైపోయింది. తెలుగు ప్రేక్షకులు హీరో కి నటాన రాకపోయినా భరిస్తారు, కాని హీరోయిన్ అందంగా లేకపోతే ప్రపంచ వ్యాప్త తెలుగు వారు తట్టుకోలేరు. మన హీరో ల కూతుర్లు ఎంత అందంగా ఉంటారో ఎవరు చూడోచ్చారు. ఆమధ్య నాగేశ్వర రావు మనుమరాలు హీరొయిన్ గా పవన్ కల్యాణ్ మొదటిసినేమాలో చేసింది. ఆమే అందం చూసి ప్రేక్షకులు దడుచుకొన్నారు. సినేమా పెద్ద ప్లాప్ అయింది. మేగాస్టార్ గారి అమ్మాయిలు హీరొయిన్ గా పెట్టి తీస్తే ధైర్యం ,సాహసం,తెగువ ఇండస్ట్రిలో ఎవరికి లేవను కొంటాను. నాగార్జున కు కూతురే లేదు. వెంకటేష్ భార్యను తీసుకొని కనీసం ఒక ఫంక్షన్ కి హాజరైనట్లు చూడలేదు (ఆయన పిల్లల వివరాలు నాకుతెలిదు ). బాలయ్య కూతుర్లు పోటోలు చూస్తే వాళ్లు మంచి పొడుగు ఉన్నట్టు అర్థమౌతుంది. చాలా మంది తెలుగు హీరోలు వాళ్ల అంత పొడుగు ఉన్నట్లు లేదు. అదికాక వాళ్లు చదువుకు ప్రాముఖ్యత ఇచ్చినట్టు ఉన్నారు. డబ్బున్న వాళ్ళు ఓపికగా పెద్ద చదువులు చదువుకొంట్టున్నరంటే ఆనందించ దగ్గ విషయమే కదా! ఇక హీరోల కొడుకులకు పెద్ద చదువులు అబ్బిఉండకపోవచ్చు. చిన్నపటి నుంచి గెంతులు వేయటం,ఒళ్లు పెంచుకొవటం, గుర్రాలు, కార్లు తోలటం అలవాటు చేసుకొన్నారు. అవి అన్ని మన తెలుగు సినేమాలో బాగా ఉపయోగపడతాయి కనుక హీరొలు గా అయ్యారనుకోవచ్చుకదా!

    రిప్లయితొలగించండి
  4. మన తెలుగువాళ్ళు పెట్టిన పెద్ద పెద్ద కంపెనీలలోనే ప్రొఫెషనలిజం తక్కువ.
    ఇక హిపోక్రసీ మయమైన సినిమా పరిశ్రమలో ఏముంటుంది?

    రిప్లయితొలగించండి
  5. అవును. నందమూరి వంశం, అక్కినేని,కృష్ణ,చిరంజీవి కుటుంబాల నుండి మొదలు పెడితే, బ్రహ్మానందం, MS ల కుటుంబాల దాకా, అలాగే నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు,దర్శకులు ఒకరేంటి, అందరూ వాళ్ల మగపిల్లల్ని మాత్రమే తెస్తున్నారు వాళ్ల ఆడపిల్లలు మాత్రం సినీ ఫీల్డ్ కి దూరమే. అంటే వాళ్లు పని చేసే ఫీల్డ్ మీద వాళ్లకే నమ్మిక లేదు.

    అయినా తెలుగు సినిమా హీరోయిన్ అవ్వాలంటే.. తెలుగు వాళ్లు కాకూడదని ఒక బేసిక్ రూల్ ఉంది కదా..

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం