23, జనవరి 2013, బుధవారం

విష పురుషులు

తాను నమ్మిన సిద్ధాంతం కోసం సోక్రటీసు విషం తాగాడని చరిత్ర పుస్తకాల్లో చదివినప్పుడు మనసు మూలల్లో ఎక్కడో ఇది నిజంగా జరిగిందా? అలా విషం తాగినప్పుడు సోక్రటీసు ఏం ఆలోచించారు. అప్పుడాయన ముఖ కవళికలు ఎలా ఉన్నాయి. అంటూ బోలెడు సందేహాలు రావడం సహజమే! వాటికి ఇంత కాలానికి సమాధానాలు లభించాయి. విషం తాగిన కలియుగ సోక్రటీసులు లెక్కలేనంత మంది మన కళ్ల ముందే కనిపిస్తున్నారు. విషం తాగడమే కాదు, తమ వాళ్లతో విషం తాగిస్తున్నారీ, అభినవ సోక్రటీసులు, పరమ శివుళ్లు. మనవాళ్లు వట్టి వెధవలు అని చెప్పిన గురజాడ నాయకుల గురించి చెప్ప మంటే మాత్రం మనవాళ్లు మహాపురుషులోయ్, విష పురుషులోయ్ అని గర్వంగా ప్రకటించి ఉండేవారు. 

ఆ తరువాత వచ్చే అమృతం కోసం పరమశివుడు విషాన్ని గరళంలో దాచుకున్నాడు. మన రాజకీయ పుణ్య పురుషులు మాత్రం విషాన్ని తాగడమే కాకుండా ఆ విషపు నిల్వను తమ కడుపులో పులియబెట్టి తమ తరువాత వారసత్వ సంపదగా తమ సంతానానికి అందిస్తున్నారు. అమృత మథనంలో సముద్రాన్ని చిలికినప్పుడు విషం వస్తే పరమ శివుడు దాన్ని తన కంఠంలో దాచిపెట్టుకుంటాడు. కంఠం లో విషాన్ని పెట్టుకున్నది శివుడు దేవుడైతే, విషం తాగి, విషం పంచుతూ, విషం చిమ్మే నాయకులు పరమ పురుషులు.


అందగత్తెలను విష కన్యలుగా మార్చే రాజకీయ చాణుక్యులు చాలా మందిని జానపద సినిమాల్లో, కథల్లో మనం బోలెడు మందిని చూశాం. విష కన్యల విషయంలో నిజానిజాలు ఏమిటో కానీ విష పురుషులకు మాత్రం మనకు కొదవ లేదని తేలిపోయింది.
***



‘‘్చీ...చీ  ..్.. ఇంత చేదుగా ఉంది మీరేమిటండి రోజూ ఈ మందు అంతగా ఎలా తాగుతారు’’అని భార్య చీదరించుకుంటే
‘‘చూశావా? పారు నేనేదో మందు కొట్టి సుఖపడుతున్నానని అనుకుంటావు అంత చేదు విషం తాగడానికి నేనెంత కష్టపడతానో నీకేం తెలుసు పారూ ’’అంటూ మందుదాసు వాపోవడం పాత జోకు. వీళ్లు విష పురుషులు కాదు ప్రభుత్వం పాలిట కామధేనువులు, అక్షయ పాత్రలు. సీమాంధ్ర , తెలంగాణ ఉద్యమాల్లో ఏది భారీ ఉద్యమం అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ప్రభుత్వ ఖజానాను నింపే ఈ వీరి మద్య ఉద్యమ ఉధృతిపై ఎవరికీ మరో మాట ఉండడానికి వీలు లేదు. మరీ తెల్లవారు జామునే తాగడం మొదలు పెట్టావా? అంటే లేదు రాత్రి నుంచి కంటిన్యూ అవుతున్నాను అని చెప్పే ఇలాంటి కార్యశూరుల వల్లనే ఖజానా నిండుతోంది. మనం చెప్పుకునేది ఇలాంటి పుణ్యపురుషుల గురించి కాదు విషాన్ని అమృతంలా జీర్ణం చేసుకున్న విష పురుషుల గురించి.


***
అధికారం విషం లాంటిదట! అనధికారికంగా 110 కోట్ల మందిపై అధికారం చలాయిస్తున్న సోనియాగాంధీ చెప్పిన మాట ఇది. జైపూర్ చింతన శిబిరంలో కాంగ్రెస్‌లో నంబర్ 2గా బాధ్యతలు స్వీకరిస్తూ రాహుల్‌గాంధీ గంభీరమైన ఉపన్యాసం చేస్తూ వాళ్ల అమ్మ చెప్పిన ఈ మాట మనకు చెప్పారు. ఆయన నంబర్ టూ అయితే మన్మోహన్‌సింగ్ నంబర్ ఎంత?
మన వ్యవస్థలో అధ్యక్షుడు రబ్బర్ స్టాంపే, అసలైన అధికారం ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. అదే ఇంగ్లాండ్‌లో రాణి డమీ అయితే ప్రధాని చేతిలో అసలైన అధికారం ఉంటుంది. అమెరికాలో అధ్యక్షుని చేతిలో సర్వాధికారం ఉంటుంది. మరి మన దేశంలో ఇప్పుడు అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ ప్రధానమంత్రి వౌనముని. మరి దీనే్న విధానం అనాలో? అదో సమస్య. 


కొన్ని ఇళ్లల్లో అత్తగారి  పెత్తనం చూసి  రాజ్యాంగేతర శక్తి అంటూ అల్లుడు గారు మనసులోనే కుమిలిపోవడం తప్ప ఏమీ అనలేడు. చుట్టు పక్కల వారికి అదో పెద్ద వినోదం. ప్రధానిని డమీగా మార్చి నంబర్ వన్ అమ్మ నంబర్‌టూ గా బ్రహ్మచారి యువరాజుకు పట్ట్భాషేకం చేశారు. ఈ విషం కోసం పాపం ఆ రాజకీయ పసికూన ఎంత కాలం నుంచి ఆశగా ఎదురుచూస్తున్నారో? అప్పుడెప్పుడో అమ్మగారికే ఆ విషం తాగే చాన్స్ వచ్చింది. ఇటలీ మాత ఇండియా విషం  తాగడమా! ఇది చూస్తూ బతకడం కన్నా విషం తాగి తనువు చాలించడం మేలు అన్నట్టుగా సుష్మాస్వరాజ్ శిరోముండనంతో నిరసనకు సిద్ధం అయ్యారు. 

అమ్మ మనసు మార్చుకుని విషాన్ని తాత్కాలిక ప్రాతిపదికన మన్మోహన్‌కు ఇవ్వక తప్పలేదు. ప్రజాస్వామ్యంలో అధికారం ఐతే అత్యధిక ప్రజాభిమానం ఉన్న నాయకుడి చేతిలో ఉంటుంది లేదంటే ఎలాంటి జనాకర్షణ లేకుండా ఎలాంటి ప్రమాదం లేదనుకున్న వారి చేతిలో వచ్చి పడుతుంది. విషం తాగించడానికి రెండో కేటగిరి కింద మన్మోహన్‌కు మించిన నాయకుడు అమ్మకు కనిపించలేదు.

 పాముకు తలపై ఉండే నోటిలో, తేలుకు చివరలో ఉండే తోకలో విషం ఉంటే మనిషికి నిలువెల్లా విషమే అని సుమతీ శతక కారుడు చెప్పింది రాజకీయ విష పురుషుల గురించే కావచ్చు.
విషానికున్న పవర్ తెలియక చాలా మంది భయపడతారు కానీ ఒక్కసారి విషం అలవాటు అయిందా? దాన్ని మించిన అమృతం ఉండదు. కావాలంటే రాజకీయ నాయకులను చూడండి విషానికి అలవాటు పడిన వీళ్లు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులకు కూడా బాధపడకుండా వేల కిలో మీటర్లు నడిచేస్తారు. విషం కోసం ఒకరు జైలులో నుండే ఉద్యమిస్తారు. తమ తరువాత తమ విషం ఎవరు తాగాలో నిర్ణయించుకునే అధికారం కూడా నాయకులకు ఉండదు ఎందుకంటే ఆ విషం కూడా నాయకుల చుట్టూ వారసులు విషవలయంగా తిష్టవేసుకొని ఉంటారు . 


తల్లికడుపులో ఉన్న భవిష్యత్తు నాయకులు, రుద్ర భూమిలో సేద తీరుతున్న గత కాలపు నేతలు మినహా ఈ విషం కోసం అందరూ అర్రులు చాచే వా రే. విషానికున్న ఆకర్శణ శక్తి అలాంటిది.

3 కామెంట్‌లు:

  1. మీరేమో అలా రాశారు కాలేజ్ సూర్యం గారు కాంగి కుటుంబపాలనకు వంత పాడుతూ మూడు వ్యాసాలు రాశారు. కాంగ్రెస్ మీద శ్రుతిమించిన ఆయన అభిమానం,ప్రేమ,వాత్స్యల్యం చూస్తూంటే కళ్లలో నుంచి ఆనంద భాష్పాలు వస్తున్నాయి. ఐదు తరాల నుంచి ప్రధాన మంత్రి పీఠం ఒక్క కుటుంబం చేపడుతూంటే దానిని వదిలి బి జె పి లో, డి యం కె లో కుటుంబపాలన లేదా అంట్టూ కాంగ్రెస్ పార్టి మీద తన అభిమానాన్ని చాటుకొంట్టున్నారు. ఆయన గారు ఇంకా ముందుకెళ్లి వాజ్ పాయ్ కొడుకు ఉంటే బి జె పి లో వంశపాలన కొనసాగి ఉండేది కదా అని పైత్యం ప్రదర్శించాడు. ఆయనకు గుర్తుకు రానిదేమిటంటే అద్వానికి కూతురు ఉంది. శరద్ పవర్ లాగా ఆయన కూతురిని రాజకీయలలోకి తీసుకొచ్చాడా? కనీసం నిర్మలా సీతారమన్,స్మ్రుతి ఇరానిల స్థానలకి కూడా ఆయన కూతురిని ప్రమోట్ చేసుకోవాలని చుడలేదే! వాటిని వదలి బి జె పి లో ఉన్న చోటా మోటా నాయకుల వారసులను కాంగీ లోని వారసత్వ నాయకులతో సమానం గా పోల్చటం హాస్యాస్పదం. అది కాలేజ్ సూర్యం గారికే చెల్లింది.

    http://kbhaskaram.blogspot.in/2013/01/1.html
    http://kbhaskaram.blogspot.in/2013/01/2.html
    http://kbhaskaram.blogspot.in/2013/01/blog-post_22.html

    రిప్లయితొలగించండి
  2. ఓ రి నాయనోయ్ గారు మనకు నచ్చినా నచ్చక పోయినా ఈ దేశం లో సిద్ధాంతాలు ఉన్నది బిజెపి, కమ్యూనిస్టుల కు మాత్రమే ..nenu raasindi vishanni preminche anni party la nayakula gurinchi .

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం