1, జనవరి 2013, మంగళవారం

తెలంగాణా పై ఇక తేల్చాల్సింది కాంగ్రెస్సే

అఖిలపక్ష సమావేశంలోని అభిప్రాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకించడానికి ఇక ఆ పార్టీకి ఏ కారణం మిగలలేదు. కేంద్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిజెపి. నిజానికి ఈ రెండు పార్టీల సంఖ్యా బలం చాలు తెలంగాణ ఏర్పాటు చేయడానికి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల వరకు నిలుపుకోవడంతో పాటు టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలను అడ్డుకోవడానికి తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ ఇంత కాలం ఉపయోగించుకుంది. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తెలంగాణ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయి. నర్మగర్భంగా చెప్పినా, డొంక తిరుగుడుగా చెప్పినా ప్రధాన పక్షాలేవీ సమైక్యాంధ్ర డిమాండ్ చేయలేదు. అభిప్రాయం చెప్పలేదు అంటూ కాంగ్రెస్ ఇక ఇతర పార్టీలపై నెపం నెట్టివేయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలిచినా, చేసే ఉద్దేశం లేకపోయినా ఇక నిర్ణయం ప్రకటించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే.
ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసినప్పుడు మూడు వారాల్లో కమిటీ తన నివేదిక ఇస్తుందని ప్రకటించారు. నాలుగేళ్లు అవుతున్నా ఆ కమిటీ ఉందా? లేదా? ఉంటే కమిటీ నివేదిక ఏమిటో ఇప్పటి వరకు వెల్లడించలేదు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినా, ప్రణబ్ కమిటీ అన్నా, అఖిలపక్ష సమావేశం అని చెప్పినా కాంగ్రెస్ కోరుకున్నది తెలంగాణ వ్యవహారం 2014 వరకు సాగదీయడం మాత్రమే.


అసలు ఒక నాయకుడంటూ లేక చుక్కాని లేని నావలా రాష్ట్రంలో కొట్టుకు పోతున్న కాంగ్రెస్ తెలంగాణ అంశం ద్వారా రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. తెలంగాణ డిమాండ్ అంటూ లేకపోయి ఉంటే వైఎస్‌ఆర్ మరణం తరువాత టిడిపి తిరుగులేని శక్తిగా నిలబడేది. ఆ తరువాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో దూసుకువెళ్లిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశం వల్లనే తెలంగాణలో దూసుకెళ్లలేకపోయిం ది. టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ అంశం స్పీడ్ బ్రేకర్‌గా నిలబడింది. కాంగ్రెస్ కోరుకున్నది ఇదే. అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయాలు చెప్పలేదనో, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయనో, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు అభిప్రాయం చెప్పలేదని చెబుతూనో కాంగ్రెస్ ఇంత కాలం తప్పించుకుంటూ వస్తోంది.


అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దాదాపు అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు ఏదో ఒక రూపంలో సుముఖత వ్యక్తం చేశాయి. ఇతర ప్రాంతాల్లో తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు మాటల గారడి చేయవచ్చు!
రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పక్షాలు టిడిపి, టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు. రాష్ట్రంలో ఉనికి స్వల్పమే అయినా జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. ఈ పార్టీలన్నీ తెలంగాణకు సానుకూలత వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పడం కాదు నిర్ణయాన్ని అమలు చేయాల్సిన స్థానంలో ఉంది. ఆ పార్టీ నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేయడం కాదు, నిర్ణయాన్ని అమలు చేయాలని అన్ని పార్టీలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకురావలసిన పరిస్థితి.
ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న సిపిఎం తమ పార్టీది సమైక్యాంధ్ర విధానపరమైన నిర్ణయం అని, అయితే తెలంగాణ ఏర్పాటును తాము అడ్డుకోమని స్పష్టంగా ప్రకటించింది. తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరింది కూడా. ఇక పాత నగరంలో ఒక మతానికి పరిమితం అయిన ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదన చేసింది. చివరకు ఈ రెండు పార్టీలు సైతం సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామని కానీ చెప్పలేదు. టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ, టిడిపి పార్టీలు తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాయి.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న టిడిపి 2008లో ప్రణబ్ కమిటీకి లేఖ రాసింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని అఖిలపక్షంలో వెల్లడిస్తే,సీమాంధ్రలో తమకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2008 లేఖను ప్రస్తావించింది. దీని ద్వారా ఇటు తెలంగాణ ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, ఇది కొత్త నిర్ణయం కాదు ఎప్పుడో 2008లో తీసుకున్న నిర్ణయం కదా అని సీమాంధ్ర నాయకులను బుజ్జగించడానికి టిడిపి ప్రయత్నించింది. 2008లో తాము తీసుకున్న నిర్ణయాన్ని జత చేస్తూ, తెలంగాణకు అనుకూలత వ్యక్తం చేసింది. ఇక లేఖ అందజేసి మాట్లాడిన టిడిపి ప్రతినిధి కడియం శ్రీహరి తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందే, రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తప్ప మరో అభిప్రాయం లేదని కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. కడియం శ్రీహరి టిడిపి ప్రతినిధిగానే అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు. రెండు ప్రాంతాల నాయకులు విలేఖరుల సమావేశాల్లో రెండు వైఖరులను వెల్లడించడం సహజమే కానీ కడియం పార్టీ ప్రతినిధిగానే అఖిలపక్ష సమావేశంలో వైఖరి వెల్లడించారు. అఖిలపక్షానికి వచ్చే ప్రతినిధులను పార్టీ అభిప్రాయాలను వెల్లడించమని హోంమంత్రి కోరారు కానీ లిఖిత పూర్వకంగా అభిప్రాయం చెప్పమని ఏమీ కోరలేదు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా టిడిపి పాత లేఖను తిరిగి ఇస్తే, తెలంగాణలో టిడిపిని చావుదెబ్బతీస్తేనే తమ పార్టీకి ప్రయోజనం అనే భావనతో ఉన్న టిఆర్‌ఎస్ టిడిపి స్పష్టమైన వైఖరి చెప్పలేదని విమర్శిస్తోంది. టిడిపి తన స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని హోంమంత్రి ప్రకటిస్తే, అప్పుడు టిడిపిని తప్పు పట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ సమావేశంలో స్పష్టమైన వైఖరి వెల్లడించి, 2008 లేఖను తిరిగి ఇవ్వడం ద్వారా టిడిపి తెలంగాణకు స్పష్టంగానే అనుకూలత వ్యక్తం చేసింది.


ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం సమైక్యవాదన వినిపించలేదు. పార్లమెంటు సమావేశంలో జగన్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సోనియాగాంధీ సమక్షంలోనే సమైక్యాంధ్ర కోసం టిడిపి ఎంపిల ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అలాంటిది కీలకమైన అఖిలపక్ష సమావేశంలో మాత్రం సమైక్యాంధ్ర వాదన వినిపించలేదు. రాష్ట్ర విభజన బాధ్యతను కేంద్రంపైనే నెట్టివేసి, ఆర్టికల్ 3 ప్రకారం ఆ అధికారం కేంద్రానికే ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని నేరుగా డిమాండ్ చేయకపోయినా తెలంగాణ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదనే విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభిప్రాయం ఉంది. అయతే టిడిపి కంటె తెలంగాణలో తనకే పట్టు ఉంటుందన్న నమ్మకం కూడా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇదే సమయంలో సీమాంధ్రలో పార్టీ బలహీన పడకుండా ఉండాలంటే మొత్తం బాధ్యతను కాంగ్రెస్ మీద నెట్టేస్తే సరిపోతుందన్న భావన ఆ పార్టీది. అదీ కాకుండా సీమాంధ్రలో తనకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సానుకూ లత వ్యక్త్తం చేయడంతో ఆ పార్టీలో లుకలుకలు బయలుదేరితే వాటిని తనకు అనుకూలంగా మలచుకోవాలన్న వ్యూహం కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. నిజానికి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అప్పుడే తెలుగుదేశం సీమాంధ్ర నేతల్లో అసంతృప్తులు బయలు దేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ. ఒకరకంగా పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలో బలపడటం మాట అట్లావుంచి సీమాం ధ్రలో పార్టీపై పడే ప్రభావం తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. ఇక్కడ రాజకీయ చతురత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానంలో కనిపి స్త్తున్నది.
చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అఖిలపక్ష సమావేశంలోనైనా, ఆ తరువాత పార్లమెంటు సమావేశాల్లోనూ కొన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని చెప్పారు. అలాంటి అనుమానం ఏమైనా ఉంటే అఖిలపక్షం తరువాత షిండే అదే చెప్పి ఉండాల్సింది.


కాంగ్రెస్ ఇద్దరు ప్రతినిధుల్లో ఒకరు సురేష్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, సమైక్యాంధ్రను కొనసాగించాలి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ గాదె వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. గాదె వెంకటరెడ్డి మొదటి నుంచి సమైక్యవాదన వినిపిస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ప్రతినిధులను ఎంపిక చేసింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాదు. అధిష్ఠానమే. కాంగ్రెస్ హై కమాండ్ అనుమతితోనే కాంగ్రెస్ ప్రతినిధులు రెండు అభిప్రాయాలను వెల్లడించారు. అధిష్ఠాన వర్గం నిర్ణయించిన కాంగ్రెస్ ప్రతినిధిగా అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన గాదె వెంకటరెడ్డి చెప్పిన విషయం కాంగ్రెస్ నిర్ణయంగా భావిస్తారు
కానీ గాదె చెప్పినట్టు ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా భావించరు. అఖిలపక్ష సమా వేశం జరిగిన తరువాత హైదరాబాద్‌కు వచ్చిన గాదె వెంకటరెడ్డి టీవి ఇంట ర్వ్యూలో హైకమాండ్‌తో మాట్లాడాను, సమావేశంలో ఏం చెప్పాలని అడిగాను. మీ అభిప్రాయం మీరు చెప్పి, చివరకు అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పండి అని చెప్పారని స్వయంగా గాదె చెప్పారు. దీన్నిబట్టి చూస్తే 2014 ఎన్నికల వరకు ప్రత్యర్థులను తెలం గాణ అంశం ద్వారా ఇబ్బంది పెట్టాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు సాగుతు న్న దనిపిస్తోంది.


మూడు వారాల్లో నివేదిక అంటూ వేసిన ప్రణబ్ కమిటీకే నాలుగేళ్లయినా దిక్కుమొక్కూ లేదు. అలాంటిది హోంమంత్రి నెల రోజుల్లో అని చెప్పగానే నెలలో ఏదో చేసేస్తుందనే నమ్మకం తెలంగాణ కోరుకునే వారిలో కనిపించడం లేదు. నెలలో ఏదో అయిపోందని చెప్పలేం అలానే ఏమీ కాదని కూడా చెప్పలేని పరిస్థితి. ఎన్నికల నాటికి కాంగ్రెస్ తనకు లాభసాటిగా ఉండే నిర్ణయం తీసుకుంటుంది. ఈ లాభం ఎన్నికల నాటికి వేసుకునే లెక్కల్లో ఎటు మొగ్గితే లాభం అని తేలితే అటు వైపుకు అనుకూలంగా ఉంటుందనడంలో ఏమా త్రం సందేహం లేదు.

2 వ్యాఖ్యలు:

  1. కాంగ్రెస్ ది వెయ్యి నాలుకల వ్యవహారం, ఈ వేళ కొత్తా. వారు దేనినీ తేల్చరు అన్నీ ముంచుతారు అదే వారి అలవాటు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. kastephale గారు ఇంత కాలం కాంగ్రెస్ ముంచితే ఇప్పుడు కాంగ్రెస్ ను ముంచె రోజులు వచ్చాయి

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం