పూర్వం గ్రామాల్లో పాటలు పాడుతూ అర్ధ నారీశ్వర రూపాన్ని ప్రదర్శించే వారు .చిన్న గుడ్డ ముక్క అడ్డుగా ఉండేది .ఒక వైపు నుంచి చూస్తే పార్వతిగా , మరో వైపు నుంచి శివునిగా దర్శన మిస్తారు ... ఒకే వ్యక్తి అప్పటి కప్పుడు రెండు భిన్నమైన రూపాలు ప్రదర్శించడం వింతగా అనిపించేది . ఇప్పుడు గ్రామాల్లో ఈ కళా కారులు కనిపించడం లేదు . అదే మాట అంటే కనుల ముందే ఈ కళా కారులు కళా ప్రదర్శన చేస్తుంటే రాజకీయ నాయకులూ అని తిడుతూ కళను గుర్తించడం లేదు ... చిన్న చూపు చూస్తున్నారు అని కొందరి విమర్శ
***
ఒకవైపు నుంచి చూస్తే అందమైన స్ర్తి ప్రతిమలా, మరోవైపు నుంచి చూస్తే పురుషుడిలా కనిపిస్తుంది. సాలార్‌జంగ్ మ్యూ జియంలోని ఈ ప్రతిమ ఎన్నిసార్లు చూసినా అన్ని వయసులవారిని విస్తుపోయేట్టు చేస్తుం ది. అది స్ర్తిమూర్తి ప్రతిమ అని ఒకరు వాదిస్తే, మరొకరు పురుషుని ప్రతిమ అంటారు. ఎవరిది కరెక్టు అంటే ఇద్దరిదీ కరెక్టే అని వాదించవచ్చు, ఇద్దరిదీ తప్పని ఆధారాలు చూపవచ్చు. తెలంగాణపై జరిగిన అఖిలపక్ష సమావేశంలోటిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు ఈ ప్రతిమనే ఆదర్శంగా తీసుకుని తమ వాదనలు వినిపించాయి . టిడిపిది సమైక్యవాదం అని టిఆర్‌ఎస్ చెబుతుంటే కానే కాదు తెలంగాణ వాదం అని తెలంగాణ టిడిపి నేతలు చెబుతున్నారు. సీమాంధ్ర టిడిపి నేతలు వౌనంగా ఉంటున్నారు. మా వాదన సీమాంధ్ర నుంచి చూస్తే సమైక్యవాదంలా, తెలంగాణ నుంచి చూస్తే తెలంగాణ వాదంలా, అచ్చం సాలార్‌జంగ్ మ్యూజియంలోని ప్రతిమలానే ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారు. ఆ మ్యూజియంలో దేశ దేశాల చిత్రవిచిత్రమైన వస్తువులు ఎన్నున్నా ఈ ఆడమగ ప్రతిమ ప్రత్యేకత వేరు. ఒక్కోసారి ఇలాంటి విగ్రహాలతో ఒక ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రతిమను అటు స్ర్తిమూర్తుల ప్రతిమల కేటగిరి లేదా పురుష మూర్తుల కేటగిరి ఏదో ఒకదానిలో చేర్చాలంటే ఎటూ తేల్చుకోలేని ఇబ్బంది వస్తుంది. ఆ ప్రతిమ రెండు కేటగిరిల్లోనూ చేర్చకుండా ఇద్దరూ దూరంగా పెట్టే ప్రమాదం లేకపోలేదు.
***
సుభాష్ చంద్రబోస్ మారువేశాల్లో దేశం ఎల్లలు దాటి బ్రిటీష్‌వారిపై సాయుధ పోరాటానికి ఆయుధాలను సమకూర్చుకున్నాడని చదివితే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది. శివాజీ పళ్లబుట్టలో దాచుకుని మారువేశంలో ఎల్లలు దాటి ముస్లిం రాజులను గడగడలాడించారని మరాఠీలు ఇప్పటికీ శివాజీని వీరత్వానికి మారుపేరుగా చెప్పుకుంటారు. ఆయన ఎన్ని యుద్ధాలు చేసినా మారువేషం వేసుకొని ఉండక పోతే అంతటి క్రేజి వచ్చి ఉండేది కాదేమో!
పూర్వం మన రాజులు కూడా మంత్రితో కలిసి మారు వేషాల్లో దేశమంతా తిరిగి రాజు గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునే వారు. ఎందుకలా రాజు నేరుగా వెళ్లి ప్రజలను సమస్యల గురించి అడగొచ్చు కదా? అంటే టీవిల ముందు ఇప్పుడు నాయకులు చచ్చినా నిజం చెప్పరు. మనసులో మాట అస్సలు బయటపడనివ్వరు కదా? అలానే రాజుల పాలనలోనైనా ప్రజలు నేరుగా రాజు కనిపిస్తే వాస్తవాలు ఆయన ముందు చెప్పలేరు కదా? అందుకే మారువేషాల్లో జనంలోకి వెళ్లేవాళ్లన్నమాట!
రాజరికం అయినా ప్రజాస్వామ్యం అయినా జనం ముందుకు అసలు రూపంతో కాకుండా మారువేశాల్లో వెళ్లడమే రాజకీయం. అంతేనా అంత కన్నా ముందు అసలు పురాణాల్లోనే ఈ మారువేషాల వ్యవహారాలు ఎన్ని లేవు. ఇంద్రు డు మారువేషాల్లోనే కదా కోరుకున్న అందగత్తెలను అనుభవించింది. మహామహా పతివ్రతలను సైతం మారువేషాలతో ఆయన చిత్తు చేశాడు. అంతే కాదు ఎంతో మంది రాక్షసులను దేవుళ్లు మారువేషాలతోనే మట్టికరిపించారు. ఈరోజు మనం రాక్షసుల బారిన పడకుండా బతికి బట్టకడుతున్నామంటే మారువేశాల పుణ్యమే కదా?
క్షీరసాగర మథనంలో అమృతం లభించినప్పుడు అమృతాన్ని రాక్షసులకు కూడా పంచితే అల్లకల్లోలం అయి ఉండేది కదా? మానవుల్లోని రాక్షసులనే భరించలేకపోతున్నాం, ఇక దేవతలనే పీడించిన రాక్షసులు అమృతం తాగి శాశ్వతంగా ఉండి ఉంటే పైకి వెళ్లినా రాక్షస బాధ తప్పేది కాదు. అమృతం పంచేప్పుడు దేవతలకు మాత్రమే అది దక్కేట్టు, రాక్షసులకు చిక్కకుండా చేసేందుకు విష్ణువుకు వచ్చిన ఏకైక ఐడియా మారువేషమే కదా? విష్ణువు అందగత్తెగా వేషం మార్చుకుని అమృతం అంతా దేవుళ్లకే వడ్డించారు. మన నేతలు కూడా అంతే పేదల పెన్నిధిగా వేషం ధరించి పేదలకే అమృతం పంచుతున్నట్టు నటించి తమ అసలు రూపంలో మాత్రం తమ పెద్దలకే అమృతం పంచుకుంటారు. మహామహా రాక్షసులను వధించాలంటే అసలు రూపంలోని శక్తి సరిపోదని తెలిసిన త్రిమూర్తులు ఎన్నోసార్లు మారువేషాలు ధరించాల్సి వచ్చింది. దేవతలే కాదు చివరకు అప్పుడప్పుడు రాక్షసులు సైతం ఇలా వేషాలు మార్చడం ద్వారానే అనుకున్నది సాధించేందుకు ప్రయత్నించారు. సీతను అపహరించడం వర్కవుట్ కావాలంటే సన్యాసి రూపం అవసరం అని రావణుడికి ఐడియా రావడం వల్లనే కదా అపహరణ సాధ్యమైంది. అంత కన్నా ముందు మారువేషం కోసం చిన్న ట్రయల్ వేసి చూశాడు. మారీచుడ్ని మాయాలేడిగా మారువేషంతో పంపిస్తే సీత ఈజీగానే బుట్టలో పడిపోయింది.
మన నాయకులు కూడా అంతే! తమ అసలు వేషం అంతగా వర్కవుట్ కాదనుకున్నప్పుడు మారువేషాలను ఆశ్రయిస్తారు. చార్లీ చాప్లిన్ గ్లోబ్‌తో ఆడుకున్నట్టు దిగ్రేట్ డిక్టెటర్ సినిమా పోస్టర్‌ను తలపించే విధంగా బిల్‌గేట్స్, బిల్ క్లింటన్ పక్కనుండగా, చిటికెల వేలితో ఐటితో ఆటాడుతున్నట్టు ఉన్న బొమ్మ వర్కవుట్ కాదని తేలాక కల్లు ముంత పట్టుకుని, తాటి చెట్టు ఎక్కుతున్న వేషంలో ప్రజలను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. శీతాకాలంలో బతుకమ్మ అడుతున్నారు, బోనాలు ఎత్తుతున్నారు, బీడీలు చుడుతున్నారు, గాజులమ్ముతున్నారు. ఎనె్నన్ని వేషాలో? సాధారణంగా బాల్యంలో పిల్లలకు ఇలాంటి వేషాలు వేసి తల్లిదండ్రులు ముచ్చట తీర్చుకుంటారు. కాలం మారింది. ఇప్పుడు మహా మహానేతలు కూడా ఇలాంటి వేశాలు వేసి జనం ముచ్చట తీర్చి తమ కోరిక తీర్చుకోవాలనకుంటున్నారు.
అజ్ఞాతంలో ఉన్నప్పుడు గద్దర్ కానిస్టేబుళ్లను మంచి చేసుకోవడానికి మాలోని వాడివే మా వాడివే అంటూ ఓ పాట రాసి పోలీసుల మనసు దోచాడు. నక్సలైట్లే మా వాడివి అని ఆడిపాడినప్పుడు ఎంత పోలీసు కఠిన హృదయమైన కరిగి పోకుండా ఉం టుందా? అలానే ఇప్పుడు నేతలు మీ వాడినే మీలోని వాడినే అంటూ చెప్పులు కుడుతున్నా రు, కుండలు చేస్తున్నారు. నాయక్‌ను నేనే, బాబుఖాన్‌ను నేనే అంటున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? వేషాలకు ఓటర్లు పడతారా? అంటే ఏం చెబుతాం?.. ప్రయత్నిస్తే కొత్తగా పోయేదేమీ లేదు ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం