16, జనవరి 2013, బుధవారం

నాస్తిక దేవుని వారసత్వ కష్టం!

రాజకీయాల్లో ఆస్తులు సంపాదించడం సులభమే. దాన్ని వారసులకు కట్టబెట్టడం ఇంకా సులభం. అధికారాన్ని సంపాదించడం కష్టం. సంపాదించిన అధికారాన్ని వారసులకు అప్పగించడం అంత కన్నా కష్టం. పరమ శివుని నుంచి పరమ నాస్తికుడు కరుణానిధి వరకు. ఔరంగజేబు నుంచి బాబు వరకు. రాజుల కాలం నుంచి రాజశేఖరుని కాలం వరకు, బాల థకరెలు, పెద రాయుళ్ళు  అందరూ ఈ సమస్య ఎదుర్కొన్న వారే. ఏ కాలంలోనైనా వారసులకు అధికారం అప్పగించడం పాలకులకు ఎప్పుడూ కష్టమే. దేవుళ్లకే ఈ కష్టాలు తప్పనప్పుడు నాస్తిక దేవుళ్లకు తప్పుతాయా?


దశరథరాముని కాలం నుంచి తారక రాముని కాలం వరకు అందరూ ఎప్పుడో ఒకప్పుడు దైవలీలలకు ఆశ్చర్యపోయిన వారే. నాస్తికుడైన కరుణానిధికి ఆలయం నిర్మించి దేవునిలా కొలవడం ఏమిటి? అచ్చం దేవుడికి వచ్చిన సమస్యనే ఆయనకు రావడం ఏమిటి? ఆలయం నిర్మించారనే సంతోషం ఆయన్ని ఉబ్బితబ్బిబ్బు అయ్యేట్టు చేస్తుంటే వారసుని ఎంపికలో వంటింటి తిరుగుబాటు ఆయనకు ముసలి వయసులో కునుకు లేకుండా చేస్తోంది.
కరుణానిధి  సామాన్య కుటుంబంలో పుట్టారు. తల్లి యుక్త వయసులో ఉండగా, దేవాలయంలో నృత్యాలు చేసే వారు. ఆలయ నర్తకికి జన్మించిన కరుణానిధికి యుక్తవయసు వచ్చాక నాస్తికుడయ్యారు.
తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె ఏ విషయంలోనైనా పోటాపోటీగా ఉంటాయి. ఇద్దరికీ సొంత చానల్స్ ఉన్నాయి, సొంత ఆస్తులున్నాయి, సొంత మీడియా ఉంది. ఇద్దరికీ సొంత పార్టీలు ఉన్నాయి.


ఎంజిఆర్‌ను దైవంగా భావించే తమిళ భక్తులు  ఆయనకు ఏకంగా ఆలయాలు నిర్మించారు. మా రాజకీయ దేవుడు నాస్తికుడైతేనేమి ఏ విషయంలోనూ ప్రత్యర్థి కన్నా తక్కువ కారాదని కరుణకు సైతం ఆలయం నిర్మించారు. బహుశా ప్రపంచంలో ఇదే తొలి నాస్తికుని దేవాలయం కావచ్చు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో సమిరెడ్డిపల్లి గ్రామంలో కరుణానిధికి కళైంగనైర్ తిరుకోవిళ్ పేరుతో ఆలయం నిర్మించారు. డిఎంకెకు చెందిన జిల్లా పంచాయితీ కౌన్సిలర్ జిఆర్ కృష్ణమూర్తి ఈ ఆలయం కోసం ఐదు సెంట్ల భూమి సేకరించారు. రెండేళ్ల క్రితం ఆలయ నిర్మాణం పూర్తయింది. కరుణ నాస్తికుడు కదా? అని ప్రశ్నిస్తే, ‘కరుణానిధిని దేవునిగా భావించి ఆలయం నిర్మించడం అనేది మా ఇష్టం.. ఆయన తనను తాను దేవునిగా భావిస్తారా? లేదా? అనేది ఆయనిష్టం’ అంటూ కృష్ణమూర్తి కట్టె విరగకుండా పాము చావకుండా చెప్పుకొచ్చారు.


కరుణానిధి వచ్చే ఏడాదికి 90 ఏళ్లకు చేరుకుంటారు. తన కుమారుడు, 60 ఏళ్ల యువనాయకుడు స్టాలిన్‌ను డిఎంకెకు తన వారసునిగా ప్రకటించారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న కరుణధి హృదయం సముద్రమంత విశాల మైంది. కొడుకులు, కూతురు, అల్లుళ్లు, మేనల్లుళ్లు సమస్త సన్నిహిత బంధుజనానికి రాష్ట్రంలో లేదా కేంద్రంలో మంత్రి పదవులు ఇప్పించారు. వ్యాపారాలు అప్పగించారు. ఆస్తుల విషయంలో ఆయన తన సంతానంలో ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు. ఆడపిల్ల కదా అనే చిన్నచూపు చూడలేదు. మూడవ భార్య కుమార్తె కనిమొళిని ఎంపిని చేశారు, భారీ కుంభకోణంలో భాగస్వామ్యం కల్పించారు. కరుణానిధి యువకుడిగా ఉన్నప్పుడు భక్తిని ఎంతగా వ్యతిరేకించారో, వయసు మీరాక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాలకు అంతగా పెద్దపీట వేశా రు. కమ్యూనిస్టు ఒక్కసారి వ్యాపార వేత్తగా మారితే మహామహా పెట్టుబడి దారులే వారి ధాటికి దిమ్మతిరిగి పోతారు(తెలుగునాట రాజకీయాల్లో తెర వెనుక చక్రం తిప్పే వ్యాపా ర సామ్రాట్టులు ఒకప్పుడు కమ్యూనిస్టులే). అలానే నాస్తికునిలో భక్తి ప్రవేశించినందంటే భక్తాగ్రేసురులు కూడా రేస్‌లో వారిని పట్టుకోలేరు. ఏ ముహూర్తాన కరుణానిధి దేవుడయ్యారో కానీ అప్పటి నుంచి ఆయనకు దేవుని సమస్యలు తప్పడం లేదు.


గణాలకు అధిపతిని ఎవరిని చేయాలని పరమ శివుని ముందు ప్రశ్న ఉదయించినట్టుగానే పార్టీకి ఎవరిని అధిపతిని చేయాలనే ప్రశ్న కరుణానిధి ముందుకు వచ్చింది. లోకం చుట్టి ఎవరు ముందు వస్తే వారికే పదవి అంటాడు శివుడు. తండ్రి నా సంగతి తెలిసి కూడా ఇలాంటి షరతు పెడతావా? మరో మార్గం లేదా? అని ప్రశ్నిస్తే, సులభ మార్గం చెప్పారు. బొజ్జగణపయ్య అక్కడే ఉండి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి గణాధిపత్యం సంపాదించేస్తాడు. అళగిరి ఢిల్లీలో చక్రం తిప్పితే స్టాలిన్ మద్రాస్ మేయర్‌గా, డిప్యూటీ సిఎంగా తల్లిదండ్రుల వద్దనే ఉండి భూ కుంభకోణాల్లో తన ప్రతిభ చాటి వారసత్వ అధికారం  కొట్టేశారు.


అధికారంలో లేడు కాబట్టి సరిపోయింది ఇదే పని అధికారంలో ఉన్నప్పుడు చేస్తే రచ్చరచ్చ అయి ఉండేది. కరుణకు ముగ్గురు భార్యలు, అళగిరి, స్టాలిన్ ఇద్దరూ ఒక తల్లి పిల్లలే. అన్నను పక్కన పెట్టి తమ్ముడు స్టాలిన్‌కు వారసత్వం కట్టబెట్టడం ఏమిటని అళగిరి అలిగారు. పార్టీకి వారసున్ని ప్రకటించడానికి ఇదేమన్నా మఠమా? అంటూ అళగిరి ప్రశ్నించడం చూస్తుంటే ఆయన అమాయకత్వానికి నవ్వుకోవాలో, జాలి పడాలో అర్ధం కాదు. మొత్తం కుటుంబ సభ్యులను కేంద్రంలో, రాష్ట్రం లో ఖాళీల భర్తీకి పంపిస్తుంటే ఇది రాజకీయ పార్టీనా? మఠమా అనే ప్రశ్న అప్పుడు రాలేదాయనకు!
ఇదేం శాపమో పాపులర్ నేతలందరికీ ఈ వారసత్వ సమస్య తప్పడం లేదు.
కోర్కెలు తీర్చుకోవడానికి 40 రోజుల అయ్యప్ప దీక్ష మాదిరిగా నాస్తిక దేవుని భక్తులు తమ దేవుని సమస్య కోసం ఏదైనా నాస్తిక మండల  దీక్ష చేపడితే ఫలితం ఉంటుందేమో!

8 కామెంట్‌లు:

  1. :) అవును.. ఆయనని విశాల హృదయం! ఆయన బిడ్డల్లో అందరికీ అన్యాయం చేయలేదు. వారి అర్హతలకనుగుణంగా ధన,కనక,వస్తు,కిరీట,రాజ్యాదులతో సత్కరించారు.. అళగిరి, స్టాలిన్ సవతి తమ్ములనుకుంటున్నానే ఇప్పటిదాకా? సొంత అన్నదమ్ములా?

    రిప్లయితొలగించండి
  2. అవునండి కృష్ణ ప్రియ గారు మొదట నేను అలానే అనుకున్నాను. మొదటి భార్య , కుమారుడు ప్రమాదం లో మరణించారు .. వీరిద్దరూ రెండవ భార్య సంతానం

    రిప్లయితొలగించండి
  3. మఠమా అని ఎందుకు అన్నాడు అంటే, కరుణానిధి కి కంచి కామకోటి పీఠం లో స్వాముల వారి వారసుల ఎంపిక మీద అసూయ ఉండేది. అంత పెద్ద మఠంలో పెద్ద స్వామి తన వారసుడు అంట్టు ఒకరి పేరు ప్రతిపాదిస్తే, దానిని మిగతావారు ఆమోదించటమే కాక, ఏమాత్రం అసంత్రుప్తి లేకుండా బ్రాహ్మణులు, భక్తితో ఆనిర్ణయాన్ని ఎలా గౌరవిస్తారు అని ఆశ్చర్యపోతూండేవాడు. ఆయన కు బ్రాహ్మణులపైన వ్యతిరేకత తెలిసిందే కనుక కిండలుగా ఆయన పార్టిలో ఎదైనా వివాదాలు రేగినపుడు మాది ప్రజల పార్టి అసంతృప్తులు ఉంటాయి, మఠం కాదు అని అంట్టుండేవాడి. ఇప్పుడు కొడుకు కూడా అదే మాట అన్నాడు.

    రిప్లయితొలగించండి
  4. దేవుళ్ళ కధలన్నీ ఇలా జనం నుంచే పుట్టాయా :)

    రిప్లయితొలగించండి
  5. మౌళి గారు ఏమో నండి దేవుడికి ఎరుక

    రిప్లయితొలగించండి
  6. నిజానికి ఈ సమస్య ఈ నాస్తిక దేవుడిదే కాదు. ఈ రోజుల్లో ఇద్దరు కొడుకులున్న ప్రతి తల్లి తండ్రిదీ ను , యెంత చెట్టుకా గాలి :)

    వినాయకుడు అన్ని కధల్లో విలన్ అవుతున్నాడు (నిజం కూడా అదే అనిపించేలా )

    రిప్లయితొలగించండి
  7. అయితే ఈ ద్రవిడ పార్టీ మరో సారి రెండు ముక్కలు అవుతుందన్నమాట.
    అన్నీ పంచుకున్నవాళ్ళు పార్టీని కూడ పంచుకుంటారు.

    రిప్లయితొలగించండి
  8. ఏమిటో నండీ.. మన దేశంలో పార్టీలు,సంపాదించుకున్న ఆస్తులకి యువ నాయకత్వం మినహా వేరే దారి ఉన్నట్లు లేదు. యువ నాయకత్వం వర్ధిల్లాలి నాస్తికత్వం వర్ధిల్లాలి. మఠ సంప్రదాయం అన్ని చోట్ల మంచిది. లేకపోతే పడే పడే ఎన్నికల ఖర్చు,

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం