17, ఫిబ్రవరి 2013, ఆదివారం

సాహిత్య,సినీ రాజకీయ అంటు రోగాలు!!


వాస్తు దోషమో, వాతావరణ ప్రభావమో కానీ తెలుగునాట అంటు రోగాల సందడి ఎక్కువే.  సీజనల్‌గా వచ్చే అంటు రోగాల గురించి కాదు. వారసత్వంగా వస్తున్న అంటు రోగాల గురించి. 
తాపీ ధర్మారావు తన సాహిత్య మర్మరాలులో ఆంధ్ర కవుల్లో అంటు రోగాలు అంటూ సాహిత్య అంటు రోగాలను పరిశోధించి మరీ కనిపెట్టారు. ఒక కవిని రాజు పిలిపించి నా కోసం ఒక గ్రంథం రాయమన్నాడంటే అలానే చాలా మంది అదే దారి పట్టారు. ఈ అంటు రోగాలు ఎంతగా వ్యాపించాయంటే అంటు రోగాలు లేకుంటే అది గ్రంధం అనిపించుకోదేమో అని ఆ కాలంలో వ్యాపించిన అంటు రోగాన్ని కవులంతా అనుసరించారని తాపీ వారు వాపోయారు.

 తన గ్రంధంలో ఎవరో ఒక కుకవిని ఒక కవి తిట్టాడంటే ఈ
అంటు రోగం ఆ తరువాత కవులంతా అనుసరించాల్సిందే. తెనాలి రామలింగడు, తిక్కన, అల్లసాని పెద్దన్న రఘునాథ నాయకుడు, చేమకూర కవి వంటి వారంతా  ఈ సాహిత్య అంటు రోగాల పాలైన వారే.

 వీరి గ్రంధాల్లో కుకవిని విమర్శిస్తూ కచ్చితంగా ఒక కవితను రాసి కసి తీర్చుకున్నవారే నంటూ తాపీ వారు వివరించారు. తాపీ వారు ఈ అంటు
రోగాల గురించి కుకవిని విమర్శించే అంశానికే పరిమితం అయ్యారు కానీ సాహిత్యంలో అంటు రోగం వ్యాపించని
ప్రక్రియ ఏముంది. భావ కవిత్వం అంటూ కృష్ణశాస్ర్తీగారు వ్యాపింపజేసిన  అంటు రోగం ప్రభావం తక్కువా?

ఆ కాలంలో జుట్టు పెంచి ప్రేమ కవిత్వం రాయని వాడు కూడా
ఒక కవేనా? అనుకున్నారు కదా? ఒక కవి మేఘంతో ప్రేమ లేఖ పంపితే మరొకరు పావురంతో ఒకరు పిట్టతో ప్రేమ సందేశాలు పంపేవారు. 

ఆర్థిక సంస్కరణల ప్రారంభ కాలంలో  హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్‌లో
ఏదైనా ఒక కంపెనీ షేర్ ధర గురించి  విచారించాడు అనే వార్త బయటకు పొక్కితే చాలు దాని ధర ఆకాశాన్నంటేది. అంతా ఆ షేర్ కోసం ఎగబడేవారు. అలానే సాహిత్యంలో పలనా కవిత్వానికి బాగా పేరొస్తుందనగానే ఓ కాలంలో క్యూ కట్టేవాళ్లు. అది విప్లవ కవిత్వం దిగంబర కవిత్వం, మినీ కవిత్వం, నానీలు, కుల కవిత్వం, మైనారిటీ కవిత్వం పేరేదైతేనేం ఒక్కో కాలంలో సాహిత్యంలో ఒక్కో అంటు రోగం రాజ్యామేలేది. అప్పుడు ఫేస్‌బుక్‌ల
వంటివి లేవు కానీ ఉండి ఉంటేనే కవిత్వంతో నిండిపోయేవి. కవిత్వానికి కాలం చెల్లిపోయిందేమో అనుకుంటున్న కాలంలో వచ్చి ఫేస్‌బుక్ బతికి పోయింది.  సాహిత్యంలోనే కాదు తెలుగునాట  అంటు రోగాలు లేని రంగం లేదు.

సినీ రాజకీయ రంగాల్లో ఈ అంటు రోగాల ప్రభావం మరీ ఎక్కువ. సినిమా రంగంలో అంటు రోగానికి కేంద్ర బిందువు హీరో. అనువంశిక రోగాల మాదిరిగా తెలుగునాట హీరోకు హీరోలు, వాళ్లకు మళ్లీ హీరోలు పుడతారు.
 పాపం తర తరాలుగా ఈ రోగం వారిని వెంటాడుతూనే ఉంటుంది.

 జబ్‌తక్ సూరజ్ చాంద్ రహేగా అప్పారావు తేరా నామ్ రహేగా అంటూ నాయకుడి అభిమానులు కీర్తించి, దశ దిన కర్మ తరువాత ఆతన్ని గుర్తుంచుకునే వారే ఉండరు. కానీ సినిమాల్లో మాత్రం అలా కాదు
ఒక హీరో నానా తంటాలు పడి ఎదిగాడంటే ఆయన కొడుకు, మనవడు, మునిమనవడు, ఇంట్లో పుట్టిన ప్రతి మగ శిశువు ఏదో ఒక నాడు హీరో కావలసిందే. సినిమాల్లో తమ వంశ చరిత్రను మహా గొప్పగా చెబుతుంటారు. అంతేనా చివరకు కథల్లో సైతం ఈ అంటు రోగాల ప్రభావం బాగా కనిపిస్తుంది. 

కంటి చూపుతో చంపే కథకు కాసులు కురిశాయంటే ఈ రోగం మొత్తం చిత్ర సీమను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కథను కొద్దిగా మార్చి కంటి చూపుకు బదులు పంటితో చంపేసే కథలు వస్తాయి. ఒక్క చేతితో ఒకడు
పది మందిని చంపితే, మరో గొప్ప వంశం హీరో ఏకంగా వంద మందిని చంపేస్తాడు. హీరోల బలం విషయం ఎలా ఉన్నా ఈ విషయంలో విలన్ల క్రమశిక్షణ మాత్రం ముచ్చటేసే విధంగా ఉంటుంది. హీరో ఒకరిని కొట్టగానే అతను చెట్టు చిటారు కొమ్మపై పడతాడు. అప్పటి వరకు మరో విలన్ చేతులు కట్టుకుని తన వంత వచ్చే వరకు వేచి చూస్తాడు కానీ మధ్యలో వెళ్లడు. ఎంత క్రమశిక్షణ. అదే రోడ్డుమీద ట్రాఫిక్‌లో నీదే తప్పంటే నీదే తప్పంటూ ఉన్న పది మంది ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఏ మాత్రం క్రమశిక్షణ పాటించకుండా తిట్టుకుంటారు. వీళ్ల కన్నా సినిమాలో చక్కని క్రమ శిక్షణ పాటించి హీరో చేతిలో చిత్తయ్యే విలనే్ల మేలు. ఏదో ఒక సినిమాలో విలన్ ఇలా ప్రవర్తిస్తే అంతా అదే దారిలో వెళతారు. 

కల్లు వ్యాపారం లాభసాటి అనగానే అందరూ కల్లు దుఖాణాలు తెరిచేస్తారు. చేపల చెరువుల్లో డాలర్లు పండుతున్నాయంటే  చెరువుల అంటు రోగం అందరికీ అంటుకుంది. చివరకు చేపలకు ఏదో తెలియని అంటు రోగం అంటుకుని అంతా మునిగిపోయారు.
ఇంజనీరింగ్ కాలేజీలు మంచి లాభసాటి అని తేలగానే ఊరవతల ఉన్న కల్లు పాకలు మాయమయ్య ఇంజనీరింగ్ కాలేజీ అనే బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. ఇది విద్యా వ్యాపారంలోని అంటు రోగం. అన్ని రాష్ట్రాల్లో మాకు కాలేజీలు కావాలని పైరవీలు చేసుకుంటుంటే బాబోయ్ మా కాలేజీలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. దీన్ని రద్దు చేసి మమ్మల్లి కాపాడు అంటూ వేడుకుంటున్నారు. కాలేజీలను ప్రారంభించడం ఒక అంటు రోగంగా వ్యాపిస్తే, మూసివేయాలనే నిర్ణయంలో సైతం అంతే రోగం అంతే వేగంగా విజృంభించింది.

 ఇక రాజకీయాల్లో ఈ రోగం ప్రభావం మరీ ఎక్కువ. ఒకాయన ఉచిత విద్యుత్‌తో అధికారంలోకి వచ్చాడనగానే అప్పటి వరకు ఉచిత విద్యుత్ అంటే ఉరితీస్తాను అని ఘీంకరించినాయన కూడా నిరంతర ఉచిత విద్యుత్ అంటారు. ఒకాయన రోడ్డుపై నడిచి వెళుతుంటే మెడలో అధికార మాల పడిందనగానే మరోకాయన అంత కన్నా ఎక్కువ దూరం నడిచేస్తాడు. ఒకరు ఉచిత కలర్ టీవి అంటే మరొకరు ఉచిత ఎల్‌సిడి టీవి అంటారు. మరొకాయన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ కూడా ఉచితం అంటాడు. ఈ ఉచిత రోగం చివరకు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి సొంతంగా నిద్ర పోతే చాలు మిగతావన్నీ మేం ఇచ్చేస్తాం అని పార్టీలు చెప్పేంత వరకు వెళుతుంది. మరి తిని కూర్చుంటే కొవ్వు పెరుగుతుంది కదా? అనే సందేహం వస్తే ఉచితంగా కొవ్వు తొలగించి ఇంటికే నగదు బదిలీ చేస్తాం అంటారు. ఒకరు కొడుకును రంగంలో దించితే మరొకరు తన కొడుకునే కాదు బంధు వర్గం కొడుకులందరినీ రంగంలో దించుతారు. కడుపు చించు కుంటే కాళ్ళ పై పడుతుంది . అంటు రోగి కానీ దెవరు ? అంటు రోగం వ్యాపించని రంగ మేది ? 

1 కామెంట్‌:

  1. ప్యాషన్ మీద తెలుగు వాళ్ళకుండే ప్యాషన్ ని అంటురోగం అంటూ మహగొప్పగా చురక పెట్టారే మురళీగారు.అన్నట్టు ఈ వ్యాఖ్యలు రాయడం కూడా ఓ అంటురోగం కాదు కదా కొంపదీసి?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం