27, ఫిబ్రవరి 2013, బుధవారం

ఇచ్చట రెడీమేడ్ డైలాగులు లభించును

ఇప్పుడు మీకో ప్రశ్న..
ఇది పిరికి పందల చర్య. ఈ మాటను ఎవరంటారు


1. భార్యమీద ప్రతీకారం తీర్చుకొనే ధైర్యం లేక భర్త కూరలో ఉప్పు ఎక్కువ వేసినప్పుడు భార్య అనే మాట.
2. చదువుకోమని విద్యార్థులను మందలించినందుకు ఎవరోతన బైక్‌కు పంక్చర్ చేసినప్పుడు లెక్కరర్ అనే మాట.
3.తాగుబోతు భర్త భార్యను చితగ్గొట్టినప్పుడు పక్కింటి వారి మాట.
4. ఉగ్రవాదులు బాంబులు పేల్చి అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడల్లా ప్రధానమంత్రి చెప్పే డైలాగ్.
అన్ని సమాధానాలు కరక్టే అనిపిస్తాయి కానీ నాలుగవ సమాధానం వచ్చే సరికి మరో ఆలోచనే లేకుండా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది.


 సరే ఇంకో ప్రశ్న.
నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది
ఈ మాట ఎవరంటారు?
1. జేబులు కొట్టేస్తూ పట్టుపడిన పిక్‌పాకెటర్
2. బ్రోతల్ హౌస్‌లో పట్టుపడిన విటుడు, వేశ్య.
3.గజదొంగ గంగులు
4.్భరీ కుంభకోణంలో పట్టుపడిన రాజకీయ నాయకుడు/ ప్రముఖ వ్యక్తి.
పొట్టకూటి కోసం చిన్న చిన్న నేరాలు చేసే వాళ్లు సిగ్గుతో ముడుచుకుపోతారు కానీ ఏకపాత్రాభినయంలా డైలాగులు చెప్పరు. పట్టుపడిన తరువాత కూడా న్యాయ వ్యవస్థ గురించి, నీతుల గురించి అద్భుతమైన డైలాగులు చెప్పే ధైర్యం, సామర్ధ్యం ఉండేది ప్రముఖులకు మాత్రమే.
షోలే లో అరె వో సాంబా కితినే గోలిహై అని గబ్బర్ సింగ్ అడగ్గానే కాలియా ఏం చెబుతాడో, ఆ తరువాత గబ్బర్ సింగ్ ఏమంటాడో, ఎలా నవ్వుతాడో అందరికీ తెలుసు కానీ ఆ డైలాగు విన్నా కొద్దిగా వినబుద్ధవుతుంది. 1975లో వచ్చిన ఆ సినిమా డైలాగులు ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి కానీ విసుగెత్తించవు. మన నాయకులు కొన్ని డైలాగులను మొదటి సారి చెబుతున్నంత ఉత్సాహంగా చెబుతారు, మనమూ అంతే ఉత్సాహంగా వింటాం. 


పేదరిక నిర్మూలన, సమ సమాజ స్థాపనే నా ధ్యేయం, రైతుల కష్టాలు చూస్తుంటే నా కడుపు తరుక్కు పోతుంది ఇవి నిత్య నూతనమైన డైలాగులు. దేవతలకు వైధవ్యం లేదట! అలానే తమ ఈ మాటలకు ఎప్పుడూ మరణం లేకుండా మన నాయకులు దేవుడి నుంచి వరం పొందారు. నాయకులకు ఎన్ని వరాలున్నా వారి సమస్యలు చూస్తే మాత్రం జాలి వేస్తోంది. షోలే ఎంత గొప్ప సినిమా అయినా, ఇంకా నడుస్తూ ఉన్నా ఆ సినిమా కోసం సలీం జావేద్‌లు మళ్లీ మళ్లీ డైలాగులు రాయడం లేదు, కథ రాయడం లేదు కదా! మరి నాయకులకు ఈ సౌకర్యం కల్పించాల్సిన అవసరం లేదా? అసలే మాట్లాడే అలవాటు లేని మన్మోహన్‌సింగ్ దేశంలో ఎక్కడ బాంబుల పేలుళ్లు జరిగినా నెలకోసారి ఇది పిరికిపందల చర్య అంటూ అదే డైలాగు మళ్లీ మళ్లీ చెప్పడం ఎంత కష్టం. ఒకసారి చెబితే దాన్ని రికార్డు చేసుకుని బాంబులు పేలిన వెంటనే దీన్ని టీవి చానల్స్‌కు పంపించలేరా? ఇంకా కావాలంటే దోషులు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు, మా సహనాన్ని అసమర్ధతగా భావించవద్దు. తీవ్ర వాదం పీచమణిచేస్తాం అంటూ కొన్ని డైలాగులు అదనంగా చేర్చవచ్చు.


కాలం చాలా మారిపోయింది. అన్నీ రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయి. పెళ్లికి అమ్మాయి అబ్బాయి ఉంటే చాలు అవసరమైన డబ్బు చెల్లిస్తే పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసేసే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు గల్లీ గల్లీల్లో కనిపిస్తున్నాయి. మీ బంధువులెవరెవరిని పిలవాలో, ఎవరికెలా మర్యాద చేయాలో అనే దిగులే లేదు. అన్నీ వాళ్లే చేసేస్తారు. క్విక్ మ్యారేజెస్‌లు క్విక్ విడాకులకు దారి తీస్తాయోమో అని కొందరి నిరాశా వాదుల అనుమానం. దానికి ఇబ్బందేమీ లేదు. పెళ్లయినట్టు ఆధారాలు ఉంటే చాలు క్విక్ విడాకులు ఇప్పించే సంస్థలకూ కొదవ లేదు. మా ఇంట్లో పొయ్యిలో నుంచి వారం రోజుల నుంచి పిల్లి లేవడం లేదు అని ఎవరైనా అంటే పాత కాలం వాళ్లు పాపం ఎంత దయనీయమైన పరిస్థితి అని సానుభూతి చూపుతారు. కానీ విషయం తెలిసిన వారు మాత్రం మీకేంటి భార్యా భర్తలు ఇద్దరూ బాగా సంపాదిస్తారు, వారం అయినా నెల అయినా పొయ్యిలో నుంచి పిల్లిని లేపాల్సిన అవసరం లేదు అని అసూయ పడతారు. కూరలన్నీ రెడిమెడ్‌గా వండి గ్రాముల చొప్పున అమ్మేస్తున్నారు. గుత్తొంకాయ కూర వండానోయ్ మామా అంటూ చిన్నది పాట పాడి మరీ చెప్పేది. ఇప్పుడు అపార్ట్‌మెంట్ కిందకు దిగి చూస్తే చాలు వంకాయే కాదు దాని బాబు లాంటి కూరలు కూడా రెడీమేడ్‌గా అమ్మేస్తున్నారు.

 అన్నీ రెడీమేడ్‌గా లభిస్తున్నప్పుడు రాజకీయ నాయకులకు ఈ సౌకర్యం లేకపోవడం అన్యాయం. అందుకే సందర్భానికి తగ్గ డైలాగులను వాళ్లు ముందుగానే రికార్డు చేసి పంపించాలి. ఈరోజు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టగానే రాష్ట్రానికి అన్యాయం అంటూ భారీ డైలాగులు రికార్డు చేసి ముందే పంపించాలి. ప్రతి సంవత్సరం వీటినే వాడుకోవాలి. సాధారణ  బడ్జెట్ రాగానే  కొత్త సీసాలో పాత సారా, దిశా దశా లేని బడ్జెట్ అంటూ ప్రతిపక్షం. నా జీవితంలో ఇంత అద్భుతమైన బడ్జెట్ చూడలేదు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చి అద్భుమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు అని అధికార పక్షం చెప్పాలి. అంకెల గారడీ తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదని వామపక్షాల రికార్డు వినిపించాలి.

 ఓరుూ సామాన్యుడా!నీ వంతుడైలాగు కూడా ముందే చెప్పేయ్! అని అడిగితే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వీళ్ల మాటలను పట్టించుకోవడమే మానేసి నా కర్మ అనుకుంటున్నాను. ఇంతోటి దానికి నా డైలాగు కూడా అవసరమా అని సామాన్యుడు విసుగ్గా చెప్పి  వెళ్లిపోయాడు.

10 వ్యాఖ్యలు:

 1. వామ్మో, వామ్మో,ఫుల్ ఫైర్ బ్రాండ్!

  పొట్టకూటి కోసం చిన్న చిన్న నేరాలు చేసే వాళ్లు సిగ్గుతో ముడుచుకుపోతారు కానీ ఏకపాత్రాభినయంలా డైలాగులు చెప్పరు!

  అదురహో!

  ఇక ఆ 'వేత్త'లకి ఆ వెసులు బాటు గురించి - రికార్డెడ్ స్టేట్ మెంట్ లో లేదు మజా ! ఎవర్ ఫ్రెష్ (ఓల్డ్) డైలాగ్స్ వుయ్ వాంట్~

  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబి గారు నాది కుడా అదే డిమాండ్ .. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు , ఉగ్రవాదాన్ని ఎలాగు అనచలేరు కనీసం డైలగులన్నా మార్చవచ్చు కదా

   తొలగించు
 2. ప్రజలు తమ శక్తిని అమ్ముకో గలిగే శక్తికి వచ్చారు, అదే రాజకీయ నాయకుల భయం అదే జరిగితే వాళ్లకు Tax పంట పండదు, అందుకే ఆ మాటలు మీ చేత పలికించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రాష్ట్రానికి అన్యాయం, కొత్త సీసాలో పాత సారా, దిశా దశా లేని బడ్జెట్, నా జీవితంలో ఇంత అద్భుతమైన బడ్జెట్ చూడలేదు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చి అద్భుమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు........hahahahahahahaha..... baagaa ceppaaru.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా పవర్ఫుల్ గా రాశారు. సూపర్!

  >>అసలే మాట్లాడే అలవాటు లేని మన్మోహన్‌సింగ్ దేశంలో ఎక్కడ బాంబుల పేలుళ్లు జరిగినా నెలకోసారి ఇది పిరికిపందల చర్య అంటూ అదే డైలాగు మళ్లీ మళ్లీ చెప్పడం ఎంత కష్టం. ఒకసారి చెబితే దాన్ని రికార్డు చేసుకుని బాంబులు పేలిన వెంటనే దీన్ని టీవి చానల్స్‌కు పంపించలేరా?<<

  పూర్వం బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వరదలు, భూకంపాలు (లైబ్రరీ షాట్స్ అంటారు) ఒకేరకంగా ఉండేవి. నాకెందుకో మన్మోహన్‌సింగ్ పై ఆల్రెడీ ఈ షాట్స్ ఉన్నాయని అనుమానం!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళి గారు చాల బాగా వ్రాసారు.
  'చట్టం తన పని తానూ చేసుకు పోతుంది' అని పి .వి. నరసింహ రావు చాల సందర్భాలలో అన్నట్లు పేపర్ లో వచ్చేది. బహుసా అదే నెమో మొదటి రెడీమేడ్ డైలాగ్.

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం