19, ఫిబ్రవరి 2013, మంగళవారం

చూపుడు వేలు..


కహానీ 3

‘ఛ.. ఛీ... ఈ దేశంలో ఎవరికీ సివిక్‌సెన్స్ లేదు. కామన్‌సెన్స్ అస్సలు లేదు’ అంటూ తిట్టుకుంటూనే మిత్రుడు సురేష్ ఇంట్లోకి వచ్చాడు రమేష్. మిత్రులు ఇద్దరూ సామాజిక చర్చల్లో మునిగిపోయారు. ఇద్దరి అభిప్రాయాలు ఒకటిగానే ఉన్నాయి.
‘ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికి రాదు. మిలటరీ పాలన వస్తేగానీ జనం దారికి రారు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయాలి. రాజకీయ నేతలంతా దొంగలు. జనం పరమ బద్ధకస్తులు. ఇలాంటి దేశం ఎప్పుడు బాగుపడుతుందో. ఈ దేశాన్ని పూర్తిగా
మార్చేయాలి’ ఇవీ వారి చర్చల్లో దొర్లిన కొన్ని అంశాలు. ‘ఏంట్రా రమేష్ ఎప్పుడూ లేనంత ఆవేశంగా ఉన్నావ్. ఏమైందేమిటి?’ అంటూ అప్పటి వరకూ వారి మాటలు వింటూ పత్రిక చదువుతున్న సురేష్ అన్న సందీప్ ముందుకొచ్చాడు. ‘ఏ పనీ సమయానికి చేయరు. ఒక్కరూ మాట మీద నిలబడరు. చట్టాన్ని గౌరవించరు. నిబంధనలు పాటించరు’ అంటూ రమేష్ తన అసహనం వ్యక్తం చేశాడు.

 ‘నీకో జోక్ చెప్పనా’ అంటూ సందీప్ అక్కడి వాతావరణాన్ని తేలిక పరచడానికన్నట్టు సరదాగా అడిగాడు. సమాధానం కోసం ఎదురు చూడకుండానే జోక్ చెప్పాడు. ఒక యువకుడు డాక్టర్ వద్దకెళ్లి తనకు విచిత్రమైన జబ్బు ఉందని చెప్పాడు. ‘శరీరమంతా ఎక్కడ ముట్టుకున్నా నొప్పి వేస్తుంది. కానీ శరీరంలో ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. నొప్పి
భరించలేకపోతున్నా’ అని డాక్టర్‌ను కలిశాడు. నొప్పి ఎక్కడని డాక్టర్ అడిగితే, ఎక్కడ ముట్టుకున్నా నొప్పి అంటూ ముఖాన్ని చూపుడు వేలితో ముట్టుకున్నాడు. అబ్బో నొప్పి అని మెలికలు తిరిగిపోయాడు. కాళ్ల మీద, చెంపల మీద, వీపుమీద అన్నిచోట్లా ముట్టుకుంటూ.. నొప్పి నొప్పి అని అరుస్తున్నాడు. డాక్టర్ అతనే్న పరీక్షగా చూసి నవ్వాడు. నొప్పితో బాధపడుతున్న తనను డాక్టర్ చూసి నవ్వడంతో అతనికి మండుకొచ్చింది. ‘బాబూ నీ శరీరానికి వచ్చిన సమస్యేమీ లేదు. శరీరంలో నొప్పి లేదు. రోగం లేదు. నీ ఆలోచనలోనే తేడా ఉంది’ అని చెబుతూ అతని చూపుడు వేలిని పట్టుకుని చూశాడు.

ఇదిగో సమస్య ఇక్కడుంది. నీ చూపుడు వేలికి గాయమైంది. గాయంతో ఉన్న వేలితో శరీరంలో ఎక్కడ ముట్టుకున్నా నొప్పి లేస్తోంది. అది శరీరం సమస్య కాదు, నీ చూపుడు వేలి నొప్పి’ అని డాక్టర్ చెబితే అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. పెన్సిల్ చెక్కుతుంటే చూపుడు వేలికి గాయమైందని. అరే వేలికి గాయమైతే మొత్తం శరీరాన్ని అనుమానించాను అనుకున్నాడు’ అని సందీప్ ముగించాడు. రమేష్‌కు విషయం అర్ధమై ఆలోచనలో పడ్డాడు. తరువాత సిగ్గుపడ్డాడు. దేశాన్ని మార్చడం కాదు మారాల్సింది ముందు తానే అని మనసులోనే అనుకుని వౌనంగా ఉండిపోయాడు.
 అందరినీ  మార్చేద్దాం అని బయలు దేరిన వాళ్ళంతా ముందు తాము మారితే లోకం  దానంతట అదే  మారేది .

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం