29, సెప్టెంబర్ 2013, ఆదివారం

కీ‘రన్’ఔట్.....ముఖ్యమంత్రి కనిపించే దైవం. ఆయన నోటి నుంచి వచ్చిన మాట జరిగి తీరుతుంది

ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో పలువురు ఉన్నతాధికారులు బయట ఫైళ్లు పట్టుకుని వేచి చూస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో హాలు కిక్కిరిసి ఉంది. అక్కడున్న అన్ని గదుల్లోనూ రాజకీయ దురంధరులు, ఉన్నతాధికారులు కొలువై ఉన్నారు. రాష్ట్ర విభజన ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఇక్కడ ఏదో కీలక పరిణామం చోటు చేసుకోనుందని సుబ్రమణ్యంకు అర్ధమైంది. ఇంతటి కీలక సమయంలో సైతం చిన్ననాటి మిత్రున్ని గుర్తు పెట్టుకుని తనతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉబ్బితబ్బయ్యాడు. ముందుగానే సమాచారం ఉండడంతో అక్కడున్న అధికారి ఒకరు సుబ్రమణ్యంను లోనికి తీసుకు వెళ్లాడు.

గదిలో ఇంకెవరైనా ఉన్నారా? అని సుబ్రమణ్యం ఉండబట్టలేక అడిగాడు. లేదు సాధారణంగా ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఎవరినీ లోనికి అనుమతించరు. ఐదారు గంటల పాటు ఒక్కరే ఉంటారు. మీరు చిన్ననాటి స్నేహితులు కావడం వల్ల మిమ్ములను ఈ సమయంలో కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇలాంటి సమయంలో వెళ్లిన వారు నాకు తెలిసినంత వరకు మీరే మొదటి వారు అని వినయంగా చెప్పాడు. ఐదారు గంటలు ఒంటిరిగా ఏం చేస్తారు అని సుబ్రమణ్యం కుతూహలంగా అడిగితే ఆ అధికారి తెలియదు అన్నట్టుగా తల అటూ ఇటూ ఊపి తెలుసు అన్నట్టుగా ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్లిపోయాడు.
***
సుబ్రమణ్యంను పలకరించి, టీవిలో క్రికెట్ చూస్తూనే ముఖ్యమంత్రి మాటలు మొదలు పెట్టారు. దాయాదుల మధ్య పోరు కాబట్టి ఆట రసవత్తరంగా ఉంది. ముఖ్యమంత్రికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం. తుఫాను వచ్చినా, భూ కంపం వచ్చినా క్రికెట్ అడందే రోజు గడిచేది కాదు. ముఖ్యమంత్రి వైనా క్రికెట్‌పై ఆభిమానం పోలేదన్నమాట అని సుబ్రమణ్యం మాటలు కలిపాడు. సుబ్రమణ్యంకు క్రికెట్‌పై కొద్దిగా అవగాహన ఉంది కానీ ఆసక్తి, పరిజ్ఞానం తక్కువే.
మాట్లాడుకుంటూనే ఇద్దరూ టీవిలో క్రికెట్ చూడడంలో మునిగిపోయారు. ఆట రసపట్టులో ఉంది. ముఖ్యమంత్రి సిక్స్... సిక్స్ అని గట్టిగా అరిచాడు. ఆ వెంటనే చిత్రంగా ప్లేయర్ సిక్స్ కొట్టాడు. సుబ్రమణ్యం చప్పట్లతో అభినందించాడు.
కొద్దిసేపటికి ముఖ్యమంత్రి ఫోర్ ... ఫోర్ అని యధాలాపంగా అన్నాడు. ఫ్లేయర్ బాల్‌ను గట్టిగా బ్యాట్‌తో కొట్టగానే అది దూసుకెళ్లింది. బౌండరీ దాటకుండానే అక్కడున్న ప్లేయర్ పట్టుకుంటాడేమో అని పించింది. బాల్‌ను ఆపినట్టే ఆపాడు. వాడి మొఖం వాడేం ఆపుతాడు అని ముఖ్యమంత్రి అంటుండగానే బాల్ నిజంగానే ఊహించని విధంగా బౌండిరీ దాటింది. గ్రౌండ్‌లో ఉన్న అభిమానుల ఆనందానికి అంతు లేదు. బాల్ బౌండరీ దాటగానే అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సుబ్రమణ్యం ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోయాడు. అతను ఫోర్ కొడతాడని ముందే ఊహించడం అంత చిన్న విషయం కాదు. సుబ్రమణ్యం ముఖ్యమంత్రిని ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇవన్నీ మనకు మామూలే బ్రదర్ ఇంకేంటి విషయాలు అంటూ ముఖ్యమంత్రి దాన్ని సాధారణ విషయంగానే తీసుకుని టీవిలో మునిగిపోయాడు. స్టార్ బ్యాట్‌మెన్ అని లగడపాటి అన్న మాటను టీవిలో చూసి ఏదో మామూలుగానే తీసుకున్నాను కానీ నిజంగానే ముఖ్యమంత్రి స్టార్ క్రికెటర్ అనుకున్నాడు సుబ్రమణ్యం.
బ్యాట్‌మెన్ మంచి ఊపులో ఉన్నాడు ప్రతి బంతిని ఐతే ఫోర్ లేదంటే సిక్స్ అన్నట్టుగా ఇరగ దీస్తున్నాడు. చూస్తుంటే ఈ ఒక్క బ్యాట్‌మెనే మొత్తం మ్యాచ్‌ను ఆడేసేట్టుగా ఉన్నాడని సుబ్రమణ్యం అన్నాడు. తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు చివరి బాల్ వరకు మ్యాచ్ పూర్తయినట్టు కాదు అని ముఖ్యమంత్రి నవ్వాడు.
అన్నీ సిక్స్‌లు, ఫోర్లు కొడుతుంటే ఇంక మ్యాచ్ వన్‌సైడ్ కాకుంటే ఏమవుతుంది అని సుబ్రమణ్యం ఆసక్తిగా అడిగాడు.
వీడి మొఖం మరో రెండు బాల్స్ ఆడగానే, మూడో బాల్‌కు క్లీన్ బౌల్డ్ అవుతాడు అని ముఖ్యమంత్రి చెప్పాడు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చెప్పింది చెప్పినట్టు జరగడంతో సుబ్రణ్యంలో ఆసక్తి పెరిగింది. 

రెప్పవేయకుండా టీవివైపు చూడసాగాడు. మొదటి బాల్‌ను సిక్స్ కొట్టాడు. రెండో బాల్‌లో రెండు రన్లు తీశాడు. ఊపిరి బిగబట్టి మూడవ బాల్ కోసం సుబ్రమణ్యం చూడసాగాడు. అటు ముఖ్యమంత్రి, ఇటు సుబ్రమణ్యం ఇద్దరి మధ్య నిశ్శబ్ధం రాజ్యం ఏలుతోంది. బౌలర్ పరిగెత్తుకు వస్తుంటే ఆ గదిలో సుబ్రమణ్యం గుండె చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దం ఆవహించింది. బ్యాట్‌కు తగిలి బంతి గాలిలోకి లేచింది. సిక్స్ ఖాయం అనిపించిది. కానీ ఊహించని విధంగా బౌండరీ వద్ద క్యాచ్ పట్టుకున్నాడు. కలా? నిజమా? ... సుబ్రమణ్యం ఇంకా తేరుకోలేక పోతున్నాడు. అప్పటి వరకు వీర విహారం చేస్తున్న బ్యాట్‌మెన్ ఔట్ కాగానే గ్రౌండ్‌లో అంతా నిరాశ పడ్డారు. 

నీలో మానవాతీత శక్తులేవో ఉన్నాయి. లేకపోతే రెండు బాల్స్ ఆడిన తరువాత ఔట్ అవుతాడని ఎలా చెప్పగలిగావు. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతోంది. స్టార్‌లకే స్టార్‌వు అంటూ సుబ్రమణ్యం తన స్నేహితున్ని తన్మయంగా చూడసాగాడు. కిరణ్ అంటే పేరులోనే రన్ ఉంది. ఎవరెన్ని రన్స్ చేయగలవో దివ్యజ్ఞానంతో చెప్పగలుగుతున్నావని అభినందించాడు. క్రికెట్ ఒక్కటే కాదు రాష్ట్ర విభజన అయినా ఏదైనా ముఖ్యమంత్రి చెప్పినట్టే జరుగుతుంది అనుకున్నాడు. మిత్రుని వద్ద సెలవు తీసుకుని బయటకు వచ్చాడు.
***
‘‘మీ ముఖ్యమంత్రి కనిపించే దైవం. ఆయన నోటి నుంచి వచ్చిన మాట జరిగి తీరుతుంది’’అంటూ సుబ్రమణ్యం ఆశ్చర్యంగా అధికారులతో తన అనుభవాన్ని చెప్పాడు.
‘‘ మీకు క్రికెట్‌లోనే కాదు ముఖ్యమంత్రి గురించి కూడా పెద్దగా తెలియదనుకుంటాను’’అంటూ అధికారి నవ్వాడు.
మీకలా ఎందుకనిపించింది అని సుబ్రమణ్యం అడిగాడు.
ఇప్పటి వరకు ముఖ్యమంత్రితో కలిసి మీరు చూసింది జూలై 30న అయిపోయిన మ్యాచ్‌ను ఏం జరిగినా రోజూ క్రికెట్ చూడందే ముఖ్యమంత్రికి గడవదు. అందుకే అయిపోయిన మ్యాచ్‌లను కూడా ఆయన రికార్డు చేసుకుని చూస్తుంటాడు  అని ఆ అధికారి నవ్వాడు.
అయిపోయిన మ్యాచ్‌ను రికార్డ్ చేసుకుని అంత ఉత్కంఠతతో చూసేవారుంటారా? అని సుబ్రమణ్యం మరింతగా ఆశ్చర్యపోయాడు. కీ ఎక్కడో ఉంది. ఈయన రన్ ఔటే అనుకున్నాడు సుబ్రమణ్యం.

25, సెప్టెంబర్ 2013, బుధవారం

మము బ్రోవమని చెప్పవే...శ్రీ మతుల రాయ బారం

మంత్రి మారయ్యకు 53 రోజుల నుంచి కంటిమీద కునుకు లేదు. చట్టానికి చిక్కకుండా ఇంత కాలం కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఏమవుతుందో అనే దిగులు పట్టుకుంది. నానా గడ్డికరిచి సంపాదించుకున్న భూమి తనది కాకుండా పోతుందా? అనే ఆలోచన నిద్ర పోనివ్వడం లేదు. భగవంతుడా నాకింకేమీ వద్దు నేను సంపాదించుకున్న అక్రమాస్తులు ఇలా ఉంటే చాలు అని దేవుడిని మొక్కుకోని రోజు లేదు. ఆలీబాబా 40 దొంగలు కథ లో 40 మంది దొంగలు కొల్లగొట్టిన సొమ్మంతా గుహలో దాచిపెట్టినట్టు, రాజకీయాల్లో కొల్లగొట్టిన సొమ్మంతా భూమిపై పెట్టాడు. ఏదైనా తగ్గొచ్చు, పెరగవచ్చు కానీ భూమి మాత్రం పెరగదుఅని భూమిని నమ్ముకుంటే ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆలోచనలతో ఆందోళన, దాంతో వైరాగ్యం కలుగుతోంది. ఇవన్నీ కలిపి కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిద్ర రాకపోవడంతో అర్ధరాత్రి టీవి చూస్తుం టే మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ రామదాసు కీర్తన వినిపించింది. మారయ్య ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. సమస్యకు పరిష్కారం లభించిందనిపించింది. మహాభక్తుడు రామదాసు సైతం శ్రీరాముడిని అనేక రీతుల్లో కీర్తించి, బతిమిలాడి చివరకు అటు నుంచి నరుక్కు వద్దామని ఆయన్ని వదిలేసి సీతమ్మను నమ్ముకున్నాడు, సక్సెస్ అయ్యాడు.ఈ టెక్నిక్ కొత్తదేమీ కాదు. శ్రీకృష్ణుడంతటి శక్తివంతుడు కీలక సమయాల్లో ఈ టెక్నిక్‌నే నమ్ముకున్నాడు కదా? వరం వల్ల నరకాసుడిని శ్రీకృష్ణుడు చంపలేడు. సత్యభామ మాత్రమే చంపగలదు. యుద్ధం చేసి చేసి స్పృహ తప్పితే సత్యభామ ఆయుధం చేపట్టి నరకాసురుడిని వధిస్తుంది. మనతో కానప్పుడు మముబ్రోవమని వేడుకోవడం శ్రీకృష్ణుడికే తప్పనప్పుడు భక్తులు, కుటుంబరావులు అలా వేడుకుంటే తప్పేముంది. అవన్నీ ఆలోచిస్తూ మార య్య ఏ ప్లాన్ అయినా చిత్తుకావచ్చు కానీ మముబ్రోవమని అటు నుంచి నరుక్కు వచ్చే ప్లాన్ ఫెయిల్ అయ్యే చానే్సలేదు లేదనుకున్నాడు. ఓ కేకేసి మారమ్మను పిలిచాడు. తన గదిలోకి వెళితే తన ప్రపంచం ఏదో తాను అన్నట్టుగా ఉండే మారయ్య నుంచి అంత ప్రేమగా పిలుపు వినగానే మంత్రిగారి భార్య మారమ్మ పులకించి పోయింది. *** ఇదీ విషయం ఇదిగో మంత్రుల ఇంటి ఫోన్ నంబర్లు మంత్రులందరి భార్యలతో మాట్లాడు అని విషయం మొత్తం చెప్పాడు మారయ్య . ‘‘మీరేమీ అనుకోనంటే ఓ మాట చెబుతానండి అని మారమ్మ లాలనగా అడిగింది. ‘‘డార్లింగ్ నువ్వు చెబుతానని అనడం నేను వినకపోవడమా? చెప్పు ఎంత సేపైనా వింటాను. ’’అని మురిపెంగా పలికాడు మారయ్య. ‘‘మీ ప్రభుత్వం రాకముందు బాబుగారు అధికారంలో ఉన్నప్పుడు నాకెప్పుడు అలాంటి అవకాశం వస్తుందా? అని ఎదురు చూసే దాన్ని. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సభ్యుడు ఎవరు మరణించినా ఆయన భార్యకు టికెట్ ఇచ్చి గెలిపించుకునే వారు. ఈ ఒక్క విషయంలో నాకు బాబుగారంటే ఎనలేని గౌరవం ఏర్పడింది. పుణ్యాత్ముడు... గొప్ప మానవతా వాది కాకపోతే మరొకరైతే అలా చేస్తారా? తమ పార్టీ సభ్యులే కాకుండా చివరకు తమ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే మరణించినా వాళ్ల భార్యకు టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విశాల హృదయుడు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న ఇంద్రారెడ్డి చనిపోతే ఆయన భార్యకు టికెట్ ఇచ్చేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించాడు. అలాంటి అదృష్టం నాకెప్పుడు వస్తుందా? అని ఎంతో కాలం ఆశగా చూశాను. అధ్యక్షా అని పలకడానికి రిహార్సల్స్ కూడా చేశాను. ఆరోజు కోసం పట్టుచీర కూడా కొన్నాను. అప్పుడు నా ఆశ నెరవేరకపోయినా ఢిల్లీ పెద్దలను కలిసేందుకు మీ అంతట మీరే పంపిస్తున్నారు.. అందరం కలిసి వెళతాం ’’ అని మారమ్మ చెప్పింది. ‘‘ఎంత అమాయకంగా కనిపిస్తావు... ఇంత లా ఆలోచించావా?.. నేను సంపాదించించేది, సంపాదించింది నా ఒక్కడి కోసమా? నీ కోసం నీ పిల్లల కోసం కాదా? ’’ అని మారయ్య వాపోయాడు. వెళ్లడానికి మీరు సిద్ధం కండి... ఈ లోపు అపాయింట్‌మెంట్ తీసుకుంటా?’’అని చెప్పా డు. *** ‘‘సార్ మేం మంత్రుల భార్యలం. హైదరాబాద్ వదిలితే బతకలేం.. మా జిల్లాలో రోగం వస్తే చూపించుకోవడానికి ఆస్పత్రి లేదు. సౌకర్యాలు లేవు. మాలాంటి గొప్పవారు అక్కడ నివసించడానికి ఏ మాత్రం ఇష్టపడరు. ఆడవారు చెబితే వింటారని మేం వచ్చాం అని అంతా కోరస్‌గా చెప్పారు’’ ‘‘మీ వారు ప్రాతినిధ్యం వహించే నియోజక వర్గం ఏదమ్మా!’’ ‘‘మా ఆయన ఫలానా శాఖ మంత్రి. నియోజక వర్గం అంటే ఏంటి సార్?’’ ‘‘మంత్రి కావడానికి ముందు ఏదో ఒక నియోజక వర్గం నుంచి గెలుస్తారు అదమ్మా!’’ ‘‘ఏమో సార్ మాకు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ తప్ప నియోజక వర్గం అంటే తెలియదు.’’ ‘‘సరేనమ్మా మీ అందరికీ నేనో విషయం చెబుతాను అలా చేయండి సరేనా? ’’ 
‘‘సరే సార్!’’ 
*** 
మంత్రులు భార్యల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
‘‘ఏమైంది ? ఏమన్నారు??’’ అని ఉత్సుకత ఆపుకోలేక ప్రశ్నించారు. 
‘‘డిల్లీ ఆయన మాకో పని చెప్పారు. సొంత జిల్లాకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇంత కాలం ఏం చేశారని మీ చోక్కా పట్టుకుని నిలదీయమన్నారండి’’ అని అంతా కోరస్‌గా పలికారు.
డామిట్ కథ అడ్డం తిరిగింది ..  డిల్లీ పెద్దలు మన  వంటింటి లోనే విప్లవం తెచ్చారంటే ... ఇక నియో కవర్గం ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో  అనుకున్నారు మంత్రులు .. 

18, సెప్టెంబర్ 2013, బుధవారం

కొలంబస్ ను మరిపించే నారా బాబు .. అగస్త్య మహాముని లాంటి జగన్ బాబు



‘‘ఏంటి సుబ్బారావు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?’’
‘‘హైదరాబాద్‌ను తలుచుకుని యాదగిరి ’’
‘‘నిజమే ఒక్కసారి హైదరాబాద్‌కు వస్తే వదిలిపెట్టలేరు.
హైదరాబాద్ చాయ్, బిర్యాని మహత్యం అలాంటిది. ’’
‘‘నేను చాయ్ తాగను. కాఫీ తాగుతా ’’
‘‘మరి దేనికి బాధ. భవగద్గీత విన్నావా? ఘంటసాల ఏమన్నాడు
నీవు తీసుకు వచ్చింది ఏమీ లేదు.. నీవు తీసుకువెళ్లేది ఏమీ లేదని అన్నాడా? మరెందుకు బాధ’’
‘‘నా బాధ నీకు అర్ధం కావడం లేదు యాదగిరి’’


‘‘కూకట్‌పల్లిలోని నీ ఫ్లాట్ నీకే ఉంటుంది. హెటెక్ సిటీలోని మీ అబ్బాయి ఉద్యోగం మీ అబ్బాయికే ఉంటుంది. ఎఎస్‌రావునగర్‌లోని నీ రెండు ప్లాట్లు నీకే ఉంటాయి. ఇంక బాధెందుకు? సుబ్బారావు’’
‘‘నువ్వెన్నయినా చెప్పు హైదరాబాద్‌ను త్యాగం చేయాలంటే మనసొప్పడం లేదు’’
‘‘ఒక్క హైదరాబాద్‌కే ఇంత బాధపడితే... ప్రపంచ వ్యాప్తంగా హిందువుల ఆరాధ్య దైవం వెంకన్న కొలువైన తిరుపతి, కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న , సింహాచలం అప్పన్న ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? విశాలమైన సముద్ర తీరాన్ని, రాజకీయ రాజధాని విజయవాడను, సాంస్కృతిక రాజధాని రాజమండ్రిని, మహానగరం విశాఖను వదులుకోవాలంటే నీ సోదరులకు మాత్రం బాధగా ఉండదా? చెప్పు ’’
సీమాంధ్ర సభలో ఆవిడెవరో సీమాంధ్రులను పాండవులుగా, తెలంగాణ వారిని కౌరవులుగా పోలుస్తూ బాగామాట్లాడారట! విన్నా వా? సుబ్బారావు’’


‘‘నిజమే యాదగిరి చాలా బాగా మాట్లాడింది. నా బాధకు ఆ మాటలతో కొంత ఉప శమనం లభించింది’’
‘‘మహాభారతం గురించి నీకు తెలుసు కదా? ఆమె చెప్పినట్టే సీమాంధ్రులు  తెలంగాణ వాళ్లు 
పాండవులు, కౌరవులు అనుకుందాం.
మహాభారత యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయం కోరడానికి వెళ్లినప్పుడు శ్రీకృష్ణుడేమన్నాడు? మీరిద్దరూ నాకు కావలసిన వాళ్లే ఇద్దరికీ సహాయం చేస్తాను అని సమ న్యాయం పాటించాడు కదా? ఆయుధం చేపట్టకుండా తానొక్కడిని ఒకవైపు, తన సైన్యం మొత్తం ఒక వైపు ఉంటుంది ఏది కావాలో తేల్చుకోమన్నాడు కదా? ఆయుధం చేపట్టని శ్రీకృష్ణుడిని పాండవులకు వదిలేసి మహాబల సంపన్నులైన సైన్యాన్ని దుర్యోధనుడు కోరుకుంటాడు.’’


‘‘ఐతే’’
‘‘అలానే ఈ యుద్ధంలో వారికి ఒక్క హైదరాబాద్ దక్కితే.. మీకు అబ్బో చెప్పాలంటే రోజులు సరిపోవు ఒక్కోక్కటి చెప్పమంటావా?’’


‘‘వద్దన్నా చెబుతావు కదా? చెప్పు యాదగిరి వింటాను’’
అప్పుడెప్పుడో 1493లో క్రిస్ట్ఫర్ కొలంబస్ అమెరికా ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఐదువందల సంవత్సరాల తరువాత నారా బాబు... హైదరాబాద్‌ను కనుగొని వరల్డ్ మ్యాప్‌లో చోటు కల్పించాడు కదా? అమెరికా తరువాత అంత గొప్ప ఆవిష్కరణ ఇదే కదా? కాదంటావా?
జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉండడం ఎంత కష్టమో, ఒక్క నిజం కూడా చెప్పకుండా ఉండడం అంత కన్నా కష్టం. మొదటి దానికి హరిశ్చంద్రుడు ప్రతినిధి, రెండోదానికి బాబు. అలాంటి బాబు మీ కోసం నడుస్తుంటే ఇంకేం కావాలి. చెప్పు సుబ్బారావు చెప్పు అలా మౌ నంగా ఉన్నావేమిటి?’’
‘‘నువ్వు చెప్పాల్సింది ముగిశాక చెబుతా?’’


‘‘అంతేనా త్రేతాయుగం నాటి అగస్త్యుడి తరువాత దేన్నయినా జీర్ణం చేసుకోగల శక్తిసంపన్నుడి  అండ మీకుంది కదా? ’’
‘‘ఎవరో ఆ మహనీయుడు? ’’


‘‘రామాయణంలో వాతాపి, ఇల్వకుడు అనే ఇద్దరు రాక్షసులున్నారు. ఇల్వకుడికి మృత సంజీవని విద్య, వాతాపికి కోరిన రూపం ధరించే శక్తి ఉంది. వాతాపి మేకగా మారిపోతే ఇల్వకుడు శ్రాద్ధ కర్మకు భోక్తలకు మేక మాంసం వడ్డించేవాడు. తరువాత మృత సంజీవని విద్యతో వాతాపి భోక్త కడుపు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. భోక్తను ఇద్దరూ భుజించే వారు. ఓసారి అగస్త్యుడికి కూడా అలానే వడ్డిస్తే, విషయం తెలిసిన ఆయన తన తపోశక్తితో జీర్ణం.. జీర్ణం వాతాపి జీర్ణం అంటాడు. దాంతో వాతాపి అగస్త్యుడి కడుపులోనే జీర్ణం అయిపోతాడు. తరువాత ఇల్వకుడ్ని కూడా భస్మం చేస్తాడు’’
‘‘కథతెలుసు....ఇప్పుడు సందర్భమేంటి?’’
అదే చెబుతున్నా జీర్ణం జీర్ణం లక్ష కోట్లు జీర్ణం అంటూ అంత పెద్ద మొత్తాన్ని జీర్ణం చేసుకుని చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా కోర్టు విచారణకు హాజరవుతున్న జగన్‌బాబు అండ మీకుందని చెబుతున్నా. ఇంకా దేన్నయినా జీర్ణం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించదు సన్నగా ఉన్న అతన్ని చూస్తే ..  లక్ష కాదు అందులో పది శాతమే నిజం అనుకున్నా పదివేల కోట్లను జీర్ణం చేసుకోవడం అంటే మాటలా?


‘‘మరదే మండుకొస్తుంది... నేనేదో బాధల్లో ఉంటే రామాయణ, భారతాలు చెబుతావు నా బాధ నీకు అర్ధం కావడం లేదు యాదగిరి’’
‘‘అక్కడికే వస్తున్నాను. ఎప్పుడూ ఫాం హౌస్‌లోనే ఉండే కెసిఆర్ తప్ప వారికెవరున్నారు. చారిత్రక పురుషులు బాబు,జగన్‌లున్నారు. స్టార్ బ్యాట్మెన్ కిరణ్, మెగా స్టార్లు, లగడపాటి, మేకపాటి, రాయపాటి లాంటి కుభేరులు   వీరి తర్వాత వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి కంటిచూపుతో చంపేసే, అడుగు పెట్టగానే సుమోలను గాలిలో లేచేట్టు చేసే మహా మహా హీరోలున్నారు కదా! ఇంకెందుకు బాధ సుబ్బారావు.
’’


‘‘యాదగిరి ఒక విషయం అడగనా? వీరందరినీ మీరు తీసుకుని హైదరాబాద్ మాకిచ్చేస్తారా?’’


‘‘ఆ...’’
‘‘హైదరాబాద్ పోవడం కన్నా వీరందరినీ భరించాల్సి రావడమే మా అసలు సమస్య యాదిగిరి. ఈమాట అంటేనే మీకు మండుతుంది .. మరి వారందరినీ భరించాలంటే  మాకెంత మండాలి. ఇంత కాలం వీళ్ళను ఇద్దరం కలిసి మోశాం ..ఇప్పుడు  మేమోక్కరమే భరించా లంటే?  ’’


ఆరవై ఏళ్లయినా మన మిద్దరం ఒకరినొకరం అర్ధం చేసుకోలేక పోయాం ఇది మాత్రం నిజం.

11, సెప్టెంబర్ 2013, బుధవారం

ఆయనే బతికుంటే...

ఛీ..ఛీ... మరీ ఇంత అధ్వాన్నమా?
ఏమైందేమిటి? అంతగా ఇదై పోతున్నావు
దేశం చెడిపోయింది
అదెప్పుడో జరిగిపోయింది
మరీ ఇంతగా చెడిపోతుందని అనుకోలేదు.
నిజానికి మహాత్మాగాంధీ ఉండాల్సింది మా కాలంలో కాదు ఈ కాలంలో ఉంటే బాగుండేది. నాయకుల్లో మార్పు తీసుకు వచ్చేవాడు.
నీది మరీ అత్యాశ. మహాత్ముడు ఈ రోజుల్లో ఉంటే ఏం చేసేవారో నేను చెప్పాలా?
చెప్పు


రోజుకో మాట మార్చే విలువలు లేని ఈ నాయకులను అసహ్యించుకునే వాడు. నాటకాల రాయుళ్లను మించి నటిస్తున్న వీరిని చూసి ఆగ్రహంతో ఊగిపోయేవారు. జైలులో ఊచలు లెక్కించాల్సిన వారు తమకు వచ్చే సీట్లు ఓట్లు లెక్కిస్తూ కోట్లు స్వాహా చేసిన మన నాయకులను చూసి, అహింను పక్కన పారేసి గన్ను చేతిలో పట్టుకుని నీతి తప్పిన నేతలను తూటాలకు బలి చేసేవాడు.
ఏంటీ మహాత్మాగాంధీ చేతికి కూడా గన్ను ఇచ్చేస్తున్నావు.. నీ ఆలోచన నాకు నచ్చలేదు..
నేను గాంధీని హింసావాదిగా మార్చడం లేదు, నాయకులపై గాంధీకి ఎంత కోపం ఉండేదో చెబుతున్నాను.
అయినా మీ పిచ్చికాకపోతే ఏ కాలానికి తగిన నాయకులు ఆ కాలంలో ఉంటారు కానీ ఇప్పుడు మహాత్ముడు ఉంటే ఏం జరిగేదో ఆలోచిస్తే ఎలా?
అది సరే కానీ వైఎస్‌ఆర్ ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని వాళ్ల అమ్మాయి చెబుతున్నది కదా?
ఆయన ఉండి ఉంటే జగన్‌కు బదులు వైఎస్‌ఆరే ముందు జైలులో ఉండేవారని బాబు బదులిచ్చారు కదా కదా?
ఆ సంగతి వదిలేయ్ నేను చెబుతున్నది విభజన గురించి...
అలాగా నిజంగా వైఎస్‌ఆర్ ఉండి ఉంటే రాష్ట్ర విభజన ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోయేదని నేనంటాను.
హై కమాండ్ తెలంగాణ ఇవ్వాలనుకుంటోంది.. 2009 వరకు మనం బలంగా ఉంటాం అప్పటి వరకు నిర్ణయాన్ని ఆపగలం. 2014లో మన బలం క్షీణిస్తుంది అప్పుడు తెలంగాణను ఆపలేం అని వైఎస్‌ఆరే అంతర్గత సమావేశంలో అన్నట్టు ప్రచారంలో ఉంది కదా?
అందుకే పోలవరం పూర్తి చేయడానికి, హైదరాబాద్‌పై పేచీ పెట్టేందుకు హెచ్‌ఎండిఏ పరిధి పెంచారు.
సర్లే వైఎస్‌ఆర్ సంగతి వదిలేయ్ ఇందిరాగాంధీ ఉండి ఉంటే విభజన జరిగేదే కాదంటాను.. నువ్వేమంటావు.
ఇందిరాగాంధీ ఉండి  ఉంటే .. కిరణ్ లాంటి అంగుష్ఠ మాత్రులు మాట్లాడగలిగే వారా ? ఆమె ఏం చేయాలనుకుంటే అది చేసేవారు .. అవసరం అయితే అత్యవసర పరిస్థితి విధించే వారు .. ఒక్క mla మద్దతు కూడా లేని వాళ్ళు స్వరం పెంచాగాలుగుతున్నారంటే .. ఇందిరాగాంధీ  లేక పోవడం వల్లే ... 


 ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఉండక పోతే బాబు సిఎం అయ్యేవారు కాదు... లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రిగా, ఎన్టీఆర్ ప్రధానమంత్రిగా ఉండేవారు అప్పుడు విభజనే జరిగేది కాదంటాను. మా నాయన సమైక్యవాది ఆయనే ఉండి ఉంటే ఇలా జరిగేదే కాదని హరికృష్ణ కూడా చెబుతున్నాడు కదా?
ఈ ఆలోచన వెన్నుపోటుకు సహకరించినప్పుడు ఉండాలి.
ఆరు నెలలపాటు అధికారం అప్పగిస్తే బాబు సమస్యలు పరిష్కరిస్తానని అంటున్నారు కదా ?

అంటే తొమ్మిదేళ్ళ పాటు అధికారం అప్పగించిన పాపానికి సమస్యలు సృష్టించి ప్రజల మీద కక్ష తీ ర్చుకున్నాడా ?

పోనీ చంద్రబాబు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయకుండా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?
అది త్యాగం కాదు ముందు చూపు..  ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఏడాదికే ఆయన దేవేగౌడలా మాజీగా మిగిలిపోయేవారు కనీసం ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగానైనా ఉన్నారు.
పోనీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు బాబు మద్దతు ఇచ్చి ఉంటే ప్రభుత్వం పడిపోయేది, విభజనే ఉండేది కాదు కదా?
అలా అయితే ప్రభుత్వం పడిపోయాక ... రాష్టప్రతి పాలన విధించి కేంద్రం తన ఇష్టానుసారం విభజన జరిపి ఉండేది కదా?
సర్లే మన మధ్య విభజన గొడవ ఎందుకు కానీ రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడుకుందాం.
సరే
ఒకవేళ గిరీశం ఇప్పుడు బతికుంటే ఏమనుకునేవాడు
రాజకీయ నాయకులందరి ముఖాల్లో తన రూపాన్ని చూసుకుని మురిసిపోయేవాడు.
మరి మధురవాణి ఉండి ఉంటే
సిగ్గుతో ముడుచుకుపోయి ఉండేది
ఎందుకు?
ఈ సమాజానికి ఏదో చేయాలనే తపన పడే తనపై కొందరు కక్ష కట్టి కేసుల్లో ఇరికించారు అంటూ టీవిల ముందు సహజ నటనతో అదరగొట్టే తారా చౌదరిలను చూశాక మధురవాణి సిగ్గుపడకుండా ఉండడం సాధ్యమా?
మరి గురజాడ అప్పారావు ఉండి ఉంటే
ఎక్కడో ఒక గిరీశం ఉంటే ఆ పాత్రతో నాటకం రాశాడు అడుగడుగున గిరీశాలు, లుబ్దావదాన్లు ఉంటే ఇక కన్యాశుల్కం నాటకం రాయడం ఎందుకు అనుకునేవారు. అంటే నేనేం మాట్లాడినా దాన్ని ఖండించాలనే ధృడమైన నిర్ణయంతోనే వచ్చావా?
లేదు...
అంటే దీన్ని కూడా అంగీకరించవా?
అంగీకరించను.
సరే ఇంతకూ తెలంగాణ వస్తుందంటావా? రాదంటావా?
నువ్వు వస్తుందంటే నేను రాదంటాను
నువ్వు రాదంటే వస్తుందని అంటాను
జంజీర్ ఎందుకు బాగా లేదు
జంజీర్‌లో తిరిగి అమితాబ్ నటించినా అట్టర్ ఫ్లాప్ అయ్యేది.
ఆ నాయకులు ఇప్పుడుండి ఉంటే ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలానే ఆ నాటి గొప్ప సినిమాలను మళ్లీ తీస్తే ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలానే ఉంటుంది.
నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా?
సరే అన్నింటిని వ్యతిరేకిస్తున్నానని అంటున్నావు కదా... ఈ ఒక్క మాటతో ఏకీభవిస్తున్నాను.

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఒక నెలలో మూడు వేషాల్లో వైకాపా

కేవలం నెల రోజుల వ్యవధిలో తెలంగాణ అంశంపై వైకాపా మూడు రకాలుగా మాటలు మార్చి రాజకీయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. చంద్రబాబుకు మాట మార్చడానికి కొంత సమయం పట్టింది. కానీ పెద్దగా రాజకీయ అనుభవం లేని వైకాపా మాత్రం నెల రోజుల్లోనే మూడు రంగులు మార్చి విస్మయపరిచింది. మొదటి తెలంగాణకు అనుకూలం తరువాత సమ న్యాయం ఆవెంటనే సమైక్యాంధ్ర ఒకే నెలలో తెలంగాణపై వైకాపా నిర్ణయాలివి.


 ఈ కాలం లో రాజకీయం అనేది ఫక్తు వ్యాపారం. లాభసాటిగా లేని వెంచర్లను కంపెనీలు మూసివేయడం, లాభసాటిగా లేని బ్రాంచీలు ఎత్తివేయడం సహజం. ఈ సంస్కృతి రాజకీయాల్లో సైతం కనిపిస్తోంది.వైకాపా తెలంగాణా నుంచిఇలానే వైదొలగింది.  మాట తప్పని వంశం అంటూ జగన్ తమ కుటుంబం గురించి గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా మాట తప్పని వంశం అనే గుర్తింపుతోనే జగన్‌కు ప్రజల్లో ఆదరణ లభించింది. వైఎస్‌ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సందర్భంగా కొంత మంది అభిమానులు మరణించడంతో వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నప్పుడే కొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ జరిగింది.


అంతకు ముందు జగన్ కుటుంబం మొత్తం సోనియాగాంధీని కలిసి జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రాధేయపడింది. కారణం ఏమిటో తెలియదు కానీ సోనియాగాంధీ నుంచి ఏ మాత్రం అనుకూల స్పందన కనిపించలేదు.  దాంతో కాంగ్రెస్‌లో తనకు పెద్దగా భవిష్యత్తు ఉండదని మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా మర్రిశశిధర్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిలకు పార్టీలో ఎంతటి గుర్తింపు ఉందో అంతకు మించి తనకు గుర్తింపు లభించే అవకాశం లేదని భావించిన జగన్ కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. దానికి ఓదార్పు యాత్రను ఉపయోగించుకున్నారు. హై కమాండ్ వద్దని చెప్పినా జగన్ వినలేదు. ఆ తరువాత ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లడం, వైకాపా ఏర్పాటు చేయడం, సిబిఐ కేసులు వరుసగా జరుగుతూ వచ్చాయి.
వయసులో చిన్న, రాజకీయ అనుభవం తక్కువే కావచ్చు కానీ మొదటి నుంచి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇడుపుల పాయలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేస్తున్నానని, ఈ యాత్ర చేయడం వల్ల తనకు ఇబ్బందులు తప్పవని, కేసులు, అరెస్టులు ఉంటాయని తెలుసని అయినా వాటికి భయడపను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. జగన్ చెప్పిన ఈ మాటలు జనంలో భాగానే ప్రచారం చూపించాయి. ప్రజల్లో ఏ మేరకు ఈ ప్రచారం ప్రభావం చూపిందనేది ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
లక్ష కోట్లు సంపాదించారని ప్రత్యర్థులు చేసిన ప్రచారం కన్నా, సిబిఐ కేసుల కన్నా మాట తప్పని వంశం అనే ప్రచారమే ఎక్కువ ప్రభావం చూపించింది. అందుకే ఉప ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిచారు. ఒకవైపు వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, మరోవైపు జగన్ దూసుకెళ్లే తత్వం తెలంగాణలో సైతం అంతో ఇంతో ప్రభావం చూపించింది. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం అనే ప్రచారం బలంగా జరగడం, మాట తప్పని వంశంగా వైకాపా గుర్తింపు పొందడం వల్ల తెలంగాణలో సైతం మెల్లగా వైకాపా ఆదరణ పెరగ సాగింది. కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే 2014 ఎన్నికలకు వెళ్లి ఉంటే చాలా మంది కాంగ్రెస్ నాయకులు వైకాపాలో చేరడానికి అవకాశం ఉండేది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో వైకాపాపై ఆశలు పెట్టుకుంది. అటు టిఆర్‌ఎస్‌లో చేరలేని వారికి, కాంగ్రెస్‌పై నమ్మకం లేని వారికి వైకాపా ఆశాజ్యోతిగా కనిపించింది. అలా పార్టీలో చేరిన తెలంగాణ నాయకులు భారీగానే ఖర్చు పెట్టారు.
వైకాపా ఆవిర్భావం తరువాత ఇడుపుల పాయలో 9.7.2011లో జరిగిన పార్టీ ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా వైకాపా నిర్ణ యం తీసుకుంది. చివరకు కేంద్ర హోం మంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సైతం వైకాపా ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చునని సూచించింది. తండ్రిలా రెండు ప్రాంతాల వారికి న్యాయం చేయాలని సూచించారు.
తెలంగాణపై తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి చంద్రబాబుకు కొంత సమయం పట్టింది. కానీ వైకాపా మాత్రం వెంట వెంటనే మాటలు మారుస్తూ తెలంగాణ వైకాపా నాయకులను విస్మయ పరిచింది. తొలుత ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని సూచించిన వైకాపా, సిడబ్ల్యుసి నిర్ణయం వెలువడక ముందే హఠాత్తుగా 17 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించింది. అది వారి వ్యక్తిగత నిర్ణయం అని ప్రచారం చేశారు. అప్పటికి విజయమ్మ, జగన్‌లు రాజీనామా చేయలేదు. కేంద్రం తన నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లదని, తెలంగాణ ఏర్పాటు అనివార్యం అనే సమాచారం తెలియగానే మరో అడుగు ముందుకు వేశారు. విజయమ్మ, జగన్‌లు సైతం రాజీనామా చేశారు. సమ న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. సమ న్యాయం అంటే ఏమిటో చెప్పాలని అన్ని రాజకీయ పక్షాల నుంచి డిమాండ్ వచ్చినా వైకాపా సమాధానం చెప్పలేదు. సీమాంధ్రకు న్యాయం జరగాలంటే  స్పష్టంగా డిమాండ్ చేసే , కేంద్రం ఆ దిశగా ఎలాంటి  చేయకపోతే వైకపా మాటలకు అర్థం ఉండేది .. సమన్యాయం కోసం ఎలాంటి సూచనలు చేయకుండానే వెంట వెంటనే రంగులు మార్చేశారు.   మరో ఆరునెలల్లో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. సీమాంధ్రలో సమైక్యాంధ్ర పేరుతో వైకాపా సాగిస్తున్నది ఎన్నికల ప్రచారమే. తెలంగాణ ఏర్పాటు ఖాయం అని తేలిన తరువాతనే వైకాపా దూకుడు పెంచింది. ఇది గ్రహించి తొలుత తడబడ్డ చంద్రబాబు సమైక్య పోరాటానికి తానే సర్వసైన్యాధ్యక్షుడిని అన్నంతగా ప్రచారం సాగిస్తూ సీమాంధ్రలో పర్యటిస్తున్నారు. బాబు మాట మీద నిలబడడు అని, మాది మాట తప్పని వంశం అని చెప్పుకునే అర్హత వైకాపాకు ఇక ఎక్కడుంది.  ఓదార్పు యాత్ర చేస్తే అరెస్టులు తప్పవని , అరెస్టుకు, కేసులకు కూడా భయపడకుండా కష్టాలన్నీ ఊహించే ఇడుపుల పాయలో ఓదార్పు యాత్రకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పుకునే జగన్, అదే పవిత్ర భూమిలో తెలంగాణా కోసం  ఇచ్చిన మాటకు కొద్దిపాటి సీట్ల కోసం తప్పారు. జగన్ కు వ్యాపారం లో బాగానే అనుభవం ఉండవచ్చు .. ఆయన రాజకీయ జీవితం 2009 లో కాంగ్రెస్ తరపున కడప నుంచి పోటి చేయడం తో ప్రారంభం అయింది ... అంతే నాలుగేళ్ల రాజకీయ జీవితం .. అందులో దాదాపు రెండేళ్ళు కాంగ్రెస్ జీవితం ... మిగిలింది జైలు జీవితం. వ్యాపారాలు చాలా మంది తక్షణ లాభం చూసుకుంటారు . రాజకీయ అనుభవం కన్నా వ్యాపార అనుభవమే ఎక్కువగా ఉన్న జగన్ తెలంగాణా అంశం లో తక్షణ లాభానికే  ప్రాధాన్యత ఇచ్చారు . వ్యాపార కోణం లో ఇది సరైనదే కావచ్చు .

 రజనీకాంత్ , పవన్ కళ్యాణ్ లాంటి కొందరు  సినిమాల పై ఎక్కువ ఆశలు పెట్టుకొని కొనుగోలు చేసి నిండా మునిగిన వారికి కొంత డబ్బు తిరిగి చెల్లించినట్టు వార్తలు వచ్చయి. అలానే జగన్ పై ఆశలు పెట్టుకొని కొంత మందితెలంగాణాలో భారీగానే ఖర్చు చేసి నిండా మునిగారు .. వారికిప్పుడు ఓదార్పు యాత్ర కావాలి .. వారికి కొంతయినా ఖర్చు తిరిగి చె ల్లిస్తారా??   

6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

గుండె దడగా ఉందా ?

డాక్టర్ .. డాక్టర్ .. 
ఊ .. చెప్పు 
నిద్రపట్టడం లేదు .. అర్ధరాత్రి మెలుకువ వస్తుంది 
ఏదో  జరుగుతున్నట్టు అనిపిస్తుంది 
ఉలిక్కి పడుతున్నాను .. గుండె దడ 
నిద్ర లేక పోవడం తో జ్వరం 
ఎక్కువగా సెలవులు పెట్టడం వల్ల ఆఫీసులో ఇబ్బంది 
చెప్పండి డాక్టర్ చెప్పండి నేను మామూలు మనిషిని అవుతానా ?
నా జీవితం ముగిసిపోయినట్టేనా ?
చెప్పిందంతా విని డాక్టర్  చీటి  పై ఏదో రాసి ఇచ్చాడు 

అర్థం కావడం లేదు డాక్టర్ ఇదేమైనా వింత జబ్బా 
 ఆవేశ పడకు చెప్పింది విను 
రోజు ఉదయం తెలుగు న్యూస్ చానల్స్లో చూస్తావా ?
అవును డాక్టర్ ఉదయం చానల్స్లో చర్చా  కార్యక్రమం క్రమం తప్పకుండా  చూస్తాను 
ఆ తరువాత 
అన్ని చానల్స్ లో న్యూస్ చూస్తాను .. 
ఈ రోజు నుంచి ఈ అలవాటు మానుకో 
మరేం చేయాలి 
అన్ని చానల్స్ లో  సినిమాల్లోని కామెడి సీన్స్ అరగంట పాటు వేస్తారు ..; అన్ని చూడు  ఇంకా సరిపోక పోతే  24  గంటల జెమిని కామెడి చానల్ చూడు .. ఫలితం ఉండక పోతే నన్ను అడుగు .. 

5, సెప్టెంబర్ 2013, గురువారం

ద్వంద్వార్ధాల రాజకీయాలు - ఒకే అర్ధం తో సినిమాలు

గుర్రం పని గుర్రం గాడిద పని గాడిద చేయాలంటారు. ఇది రాజకీయ వ్యాపారంలో అస్సలు సాధ్యం కాదు. రాజకీయాల్లో  అవసరం అయినప్పుడు గాడిదలా చాకిరీ చేయడం, కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరాక మొరగడం అన్నీ చేయాల్సి ఉంటుం ది. తెలుగునాట నాయకులు నటిస్తుంటే, నటులు రాజకీయం చేస్తారు. సినిమాల్లో చెప్పాల్సిన డైలాగులను రాజకీయాల్లో, రాజకీయ మాటలు సినిమాల్లో చెబుతున్నారు. భూకంపం సృష్టిస్తా, కంటి చూపుతో చంపే స్తా వంటి డైలాగులు అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో రెండు చోట్లా వినిపిస్తున్నాయి. సినిమాల్లో రిటైర్ అయిన వారు నాయకులుగా ఆవతారం దాల్చడం, సినిమాల్లో డైరెక్టర్లుగా, స్రిప్ట్‌రైటర్స్‌గా మంచి ఫామ్‌లో ఉన్న వారు నాయకులకు డైలాగులు రాస్తుండండంతో సినిమాల్లో వినిపించాల్సిన డైలాగులు రాజకీయాల్లో, రాజకీయాల్లో వినిపించాల్సిన మాటలు సినిమాల్లో వినిపిస్తున్నాయి. తెలుగునాట రాజకీయాలు, సినిమాలు అవిభక్త కవలల్లా  కలిసిపొయాయి. 


ఆ మధ్య డబుల్ మీనింగ్ డైలాగులు తెలుగు సినిమాలను ఒక ఊపు ఊపాయి. తెలుగునాట ప్రారంభం అయిన ఈ డబుల్ మీనింగ్ డైలాగుల సంస్కృతి హిందీకి కూడా వ్యాపించింది. దాదా కోండ్కే అనే దర్శక నిర్మాత ఈ డబుల్ మీనింగ్ డైలాగులను ఉత్కృష్ట స్థాయికి తీసుకు వెళ్లారు. అంధేరీ రాత్ మే దియా తేరీ హాత్‌మే, తేరీ మేరీ బీచ్‌మే- ఇలా ఉండేవి ఆయన సినిమాల టైటిల్స్. ఆయన దూకుడు ముందు మహామహుల హిందీ సినిమాలు వెలవెలబోయాయి. అర్థాంతరంగా ఆయన తనువు చాలించి మిగిలిన వారిని బతికించాడు. లేకపోతే ఆయన ధాటికి అంతా మూటాముల్లె సర్దుకునేవారే. రాష్ట్రంలో దాదాపు 1990 నుంచి డబుల్ మీనింగ్ డైలాగులు రాజ్యమేలుతున్నాయి. దాదాపు ఇదే కాలంలో రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగుల కాలం ప్రారంభం అయిం ది. ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఆ కాలంలో చివరకు సినిమా టైటిల్స్ కూడా డబుల్ మీనింగ్‌తోనే ఉండేవి. పక్కింటి పెళ్లాం, ఎదురింటి మొగుడు, ఆయనా మా ఆయనే.. పెళ్లాం ఊరెళితే.. ఇలా ఉండేవి. కొంత కాలానికి డబుల్ మీనింగ్ డైలాగులు ప్రేక్షకులను పెద్దగా కదిలించ లేకపోయాయి. దాంతో నేరుగా సింగల్ మీనింగ్ డైలాగులతోనే నెట్టుకొస్తున్నారు.

 సాధారణంగా సినిమాల్లో వయసు మీరిన తరువాత రాజకీయాలను ఆశ్రయిస్తారు. ట్రెండ్ విషయంలో సైతం ఇదే దోరణి కనిపిస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పుడు రాజకీయాల్లో అనివార్యంగా మారింది. ఒకే మాటకు రెండు అర్ధాలుంటాయి. ఒకటి బూతు అర్ధం అయితే, మరోటి మంచి చెబుతున్నట్టుగానే ఉంటుంది. ప్రేక్షకుల కోసం బూతు అర్ధం. సెన్సార్ వారి కోసం మంచి మాటను అర్ధంగా చూపించి సినిమాలు బాగానే సొమ్ము చేసుకున్నాయి. నాయకులు సైతం ఇలానే డబుల్ మీనింగ్ డైలాగులు వాడేస్తున్నారు.
ప్రజలకే నా జీవితం అంకింతం అంటే బతికున్నంత వరకు దోచుకుంటాను అని అసలు అర్ధం. పునరంకితం అంటే దోచుకోవడానికి మరో ఐదేళ్లు అవకాశం చిక్కిందని గుర్తు చేయడం అన్న మాట! నా దగ్గరేముంది బూడిద అంటే నా డబ్బును ముట్టుకున్నారంటే బూడిద అవుతారని హెచ్చరించడం.
డబుల్ మీనింగ్ విషయంలో చంద్రబాబు అందరి కన్నా ఒక అడుగు ముందే ఉంటారు. ఆయన డైలాగులే కాదు నటన సైతం డబుల్ మీనింగ్స్‌తో ఉంటుంది. నటనలో తల పండిన ఎన్టీఆర్‌కే బోర్లా పడిపోయిన తరువాత కానీ అల్లుడి గారి నటనలో విశ్వరూపం తెలియలేదు. తమ్ముళ్లు కాళ్లు పట్టుకుంటుంటే విధేయత అనుకున్నారు కానీ కాళ్లు లాగేందుకు ప్రాక్టిస్ చేస్తున్నారని అన్నగారికి తెలియలేదు.


ఒకే సభలో రెండు ప్రాంతాల వారికి రెండు రకాలుగా అర్ధం అయ్యేట్టు మాట్లాడడంలో చంద్రబాబు ప్రావీణ్యం ఆత్మగౌరవ యాత్రలో బయటపడుతోంది. ఎన్‌డిఏ తెలంగాణ ఇస్తానంటే అడ్డుకున్నది నేనే, సమైక్యాంధ్ర కోసం మీరు సాగిస్తున్న ఉద్యమంలో చివరి వరకు మీ వెంటే ఉంటాను అని సీమాంధ్ర ప్రజలకు బాబు భరోసా ఇస్తున్నారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని చెప్పడానికి ఇంత కన్నా ఏం కావాలని సీమాంధ్ర నాయకులు మీడియాను నిలదీస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ నాయకుల వద్ద ప్రస్తావిస్తే, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు బాబు కట్టుబడి ఉన్నారు, సీమాంధ్రలో ఉద్యమం సాగుతున్న సమయంలోనూ ఆయన లేఖ ఉపసంహరించుకోకుండా సీమాంధ్రలో పర్యటించడం అంటే అది ఓదార్పు యాత్ర. బాబు తెలంగాణ వాదానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి అని తెలంగాణ టిడిపి నాయకులు బల్లగుద్ది ప్రశ్నిస్తున్నారు. బాబు డబుల్ మీనింగ్ డైలాగులు తలలు పండిన రాజకీయ నాయకులకు సైతం బుర్ర తిరిగేట్టు చేస్తున్నాయి.


తెలంగాణ సెంటిమెంట్‌ను గుర్తిస్తున్నాను అని ఇడుపుల పాయలో జగన్ అనగానే దాన్ని తెలంగాణకు అనుకూలం అని అర్ధం చేసుకుని తెలంగాణ నాయకులు తమ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ కోసం బోలెడు ఖర్చు చేశారు. రజనీకాంత్, పవన్ కళ్యాణ్‌లాంటి హీరోల సినిమాలకు ఇలానే ఆశలు పెట్టుకుని బోర్లా పడితే నిర్మాతలకు ఈ హీరోలు కొంత రిటన్ ఇచ్చారు. జగన్ బాబు తెలంగాణ నేతల విషయంలో ఈ మాత్రం దయ కూడా చూపడం లేదు. మాట తప్పని వంశం అన్నారు కదా? సమ న్యాయం అంటే సమైక్యాంధ్ర అని జగన్ బాబు చెప్పగానే ఊసరవెల్లి సిగ్గుతో ముడుచుకు పోయింది.
ఒకప్పుడు రాము, గుండమ్మ కథ, మంచి కుటుంబం అంటూ సినిమాలకు చక్కని పేర్లు, అంత కన్నా చక్కని కథలుండేవి. ఇప్పుడు పోకిరీ, దొంగనా కొడుకు, లోఫర్, జులాయి, ఇడియట్ వంటి పేర్లున్న సినిమాలకే డిమాండ్. రాజకీయాల్లోనూ అంతే నాయకుడు ఎంతగా చెడిపోతే అంతగా గెలిచే అవకాశం.