10, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఒక నెలలో మూడు వేషాల్లో వైకాపా

కేవలం నెల రోజుల వ్యవధిలో తెలంగాణ అంశంపై వైకాపా మూడు రకాలుగా మాటలు మార్చి రాజకీయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. చంద్రబాబుకు మాట మార్చడానికి కొంత సమయం పట్టింది. కానీ పెద్దగా రాజకీయ అనుభవం లేని వైకాపా మాత్రం నెల రోజుల్లోనే మూడు రంగులు మార్చి విస్మయపరిచింది. మొదటి తెలంగాణకు అనుకూలం తరువాత సమ న్యాయం ఆవెంటనే సమైక్యాంధ్ర ఒకే నెలలో తెలంగాణపై వైకాపా నిర్ణయాలివి.


 ఈ కాలం లో రాజకీయం అనేది ఫక్తు వ్యాపారం. లాభసాటిగా లేని వెంచర్లను కంపెనీలు మూసివేయడం, లాభసాటిగా లేని బ్రాంచీలు ఎత్తివేయడం సహజం. ఈ సంస్కృతి రాజకీయాల్లో సైతం కనిపిస్తోంది.వైకాపా తెలంగాణా నుంచిఇలానే వైదొలగింది.  మాట తప్పని వంశం అంటూ జగన్ తమ కుటుంబం గురించి గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా మాట తప్పని వంశం అనే గుర్తింపుతోనే జగన్‌కు ప్రజల్లో ఆదరణ లభించింది. వైఎస్‌ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సందర్భంగా కొంత మంది అభిమానులు మరణించడంతో వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నప్పుడే కొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ జరిగింది.


అంతకు ముందు జగన్ కుటుంబం మొత్తం సోనియాగాంధీని కలిసి జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రాధేయపడింది. కారణం ఏమిటో తెలియదు కానీ సోనియాగాంధీ నుంచి ఏ మాత్రం అనుకూల స్పందన కనిపించలేదు.  దాంతో కాంగ్రెస్‌లో తనకు పెద్దగా భవిష్యత్తు ఉండదని మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా మర్రిశశిధర్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిలకు పార్టీలో ఎంతటి గుర్తింపు ఉందో అంతకు మించి తనకు గుర్తింపు లభించే అవకాశం లేదని భావించిన జగన్ కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. దానికి ఓదార్పు యాత్రను ఉపయోగించుకున్నారు. హై కమాండ్ వద్దని చెప్పినా జగన్ వినలేదు. ఆ తరువాత ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లడం, వైకాపా ఏర్పాటు చేయడం, సిబిఐ కేసులు వరుసగా జరుగుతూ వచ్చాయి.
వయసులో చిన్న, రాజకీయ అనుభవం తక్కువే కావచ్చు కానీ మొదటి నుంచి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇడుపుల పాయలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేస్తున్నానని, ఈ యాత్ర చేయడం వల్ల తనకు ఇబ్బందులు తప్పవని, కేసులు, అరెస్టులు ఉంటాయని తెలుసని అయినా వాటికి భయడపను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. జగన్ చెప్పిన ఈ మాటలు జనంలో భాగానే ప్రచారం చూపించాయి. ప్రజల్లో ఏ మేరకు ఈ ప్రచారం ప్రభావం చూపిందనేది ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
లక్ష కోట్లు సంపాదించారని ప్రత్యర్థులు చేసిన ప్రచారం కన్నా, సిబిఐ కేసుల కన్నా మాట తప్పని వంశం అనే ప్రచారమే ఎక్కువ ప్రభావం చూపించింది. అందుకే ఉప ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిచారు. ఒకవైపు వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, మరోవైపు జగన్ దూసుకెళ్లే తత్వం తెలంగాణలో సైతం అంతో ఇంతో ప్రభావం చూపించింది. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం అనే ప్రచారం బలంగా జరగడం, మాట తప్పని వంశంగా వైకాపా గుర్తింపు పొందడం వల్ల తెలంగాణలో సైతం మెల్లగా వైకాపా ఆదరణ పెరగ సాగింది. కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే 2014 ఎన్నికలకు వెళ్లి ఉంటే చాలా మంది కాంగ్రెస్ నాయకులు వైకాపాలో చేరడానికి అవకాశం ఉండేది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో వైకాపాపై ఆశలు పెట్టుకుంది. అటు టిఆర్‌ఎస్‌లో చేరలేని వారికి, కాంగ్రెస్‌పై నమ్మకం లేని వారికి వైకాపా ఆశాజ్యోతిగా కనిపించింది. అలా పార్టీలో చేరిన తెలంగాణ నాయకులు భారీగానే ఖర్చు పెట్టారు.
వైకాపా ఆవిర్భావం తరువాత ఇడుపుల పాయలో 9.7.2011లో జరిగిన పార్టీ ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా వైకాపా నిర్ణ యం తీసుకుంది. చివరకు కేంద్ర హోం మంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సైతం వైకాపా ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చునని సూచించింది. తండ్రిలా రెండు ప్రాంతాల వారికి న్యాయం చేయాలని సూచించారు.
తెలంగాణపై తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి చంద్రబాబుకు కొంత సమయం పట్టింది. కానీ వైకాపా మాత్రం వెంట వెంటనే మాటలు మారుస్తూ తెలంగాణ వైకాపా నాయకులను విస్మయ పరిచింది. తొలుత ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని సూచించిన వైకాపా, సిడబ్ల్యుసి నిర్ణయం వెలువడక ముందే హఠాత్తుగా 17 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించింది. అది వారి వ్యక్తిగత నిర్ణయం అని ప్రచారం చేశారు. అప్పటికి విజయమ్మ, జగన్‌లు రాజీనామా చేయలేదు. కేంద్రం తన నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లదని, తెలంగాణ ఏర్పాటు అనివార్యం అనే సమాచారం తెలియగానే మరో అడుగు ముందుకు వేశారు. విజయమ్మ, జగన్‌లు సైతం రాజీనామా చేశారు. సమ న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. సమ న్యాయం అంటే ఏమిటో చెప్పాలని అన్ని రాజకీయ పక్షాల నుంచి డిమాండ్ వచ్చినా వైకాపా సమాధానం చెప్పలేదు. సీమాంధ్రకు న్యాయం జరగాలంటే  స్పష్టంగా డిమాండ్ చేసే , కేంద్రం ఆ దిశగా ఎలాంటి  చేయకపోతే వైకపా మాటలకు అర్థం ఉండేది .. సమన్యాయం కోసం ఎలాంటి సూచనలు చేయకుండానే వెంట వెంటనే రంగులు మార్చేశారు.   మరో ఆరునెలల్లో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. సీమాంధ్రలో సమైక్యాంధ్ర పేరుతో వైకాపా సాగిస్తున్నది ఎన్నికల ప్రచారమే. తెలంగాణ ఏర్పాటు ఖాయం అని తేలిన తరువాతనే వైకాపా దూకుడు పెంచింది. ఇది గ్రహించి తొలుత తడబడ్డ చంద్రబాబు సమైక్య పోరాటానికి తానే సర్వసైన్యాధ్యక్షుడిని అన్నంతగా ప్రచారం సాగిస్తూ సీమాంధ్రలో పర్యటిస్తున్నారు. బాబు మాట మీద నిలబడడు అని, మాది మాట తప్పని వంశం అని చెప్పుకునే అర్హత వైకాపాకు ఇక ఎక్కడుంది.  ఓదార్పు యాత్ర చేస్తే అరెస్టులు తప్పవని , అరెస్టుకు, కేసులకు కూడా భయపడకుండా కష్టాలన్నీ ఊహించే ఇడుపుల పాయలో ఓదార్పు యాత్రకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పుకునే జగన్, అదే పవిత్ర భూమిలో తెలంగాణా కోసం  ఇచ్చిన మాటకు కొద్దిపాటి సీట్ల కోసం తప్పారు. జగన్ కు వ్యాపారం లో బాగానే అనుభవం ఉండవచ్చు .. ఆయన రాజకీయ జీవితం 2009 లో కాంగ్రెస్ తరపున కడప నుంచి పోటి చేయడం తో ప్రారంభం అయింది ... అంతే నాలుగేళ్ల రాజకీయ జీవితం .. అందులో దాదాపు రెండేళ్ళు కాంగ్రెస్ జీవితం ... మిగిలింది జైలు జీవితం. వ్యాపారాలు చాలా మంది తక్షణ లాభం చూసుకుంటారు . రాజకీయ అనుభవం కన్నా వ్యాపార అనుభవమే ఎక్కువగా ఉన్న జగన్ తెలంగాణా అంశం లో తక్షణ లాభానికే  ప్రాధాన్యత ఇచ్చారు . వ్యాపార కోణం లో ఇది సరైనదే కావచ్చు .

 రజనీకాంత్ , పవన్ కళ్యాణ్ లాంటి కొందరు  సినిమాల పై ఎక్కువ ఆశలు పెట్టుకొని కొనుగోలు చేసి నిండా మునిగిన వారికి కొంత డబ్బు తిరిగి చెల్లించినట్టు వార్తలు వచ్చయి. అలానే జగన్ పై ఆశలు పెట్టుకొని కొంత మందితెలంగాణాలో భారీగానే ఖర్చు చేసి నిండా మునిగారు .. వారికిప్పుడు ఓదార్పు యాత్ర కావాలి .. వారికి కొంతయినా ఖర్చు తిరిగి చె ల్లిస్తారా??   

3 కామెంట్‌లు:

  1. రాష్ట్ర విభజనపై వై‌ఎస్‌ఆర్‌సి‌పి ది ఒకే మాట... ఒకే వైఖరి

    అఖిల పక్షం లో 28 డిసెంబర్ 2012న కేంద్ర హోంశాఖ మంత్రి షిండేకు వై‌ఎస్‌ఆర్‌సి‌పి ఇచ్చిన లేఖ

    'ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలు కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరిగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించమని కోరుతున్నాం’.

    మరి ఇదేనా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం? మరి న్యాయమైన పరిష్కారం అయితే కాంగ్రెస్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయిన ముక్యమంత్రి, మంత్రులు ఎందుకు అన్యాయం అంటున్నారు? టీడీపీ వాళ్ళు కూడా అన్యాయం అంటున్నారు కదా?

    ఎలాంటి షరతులు పెట్టకుండా విభజిస్తే సీమాంధ్రకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించకుండా, 2008 తర్వాత ఇప్పటికీ 6 సార్లు తెలంగాణ ఏర్పాటు చేయండి అని బాబు చెప్పాడు.

    రిప్లయితొలగించండి
  2. సీమంద్రలో వాళ్ళకు ఓట్లు కాబట్టి సీమంద్ర టిడిపి , కాంగ్రెస్ నాయకులు అన్యాయం అంటున్నారు .. తెలంగాణా నాయకులు న్యాయం అంటున్నారు .. నేను చెప్పింది ఇదే కదా .. వైకపా మాట మార్చింది అని నేనురాసాను .. అందరు మార్చారు కాబట్టి అని మీ రంటున్నారు అంతే కదా .. మాట మార్చలేదు అని మాత్రం మీరు అనలేక పోతున్నారు

    రిప్లయితొలగించండి
  3. ఎక్కడ మాట మార్చారండి... మొదటి నుంచే వాళ్ళు అందరిని సంతోష పరిచే విధంగా నిర్ణయం తీసుకోమన్నారు... అంతే కానీ తెలంగాణ ని ఇచ్చేయమని కాదు. అయినా ఎవరు ఎలా పోయినా పర్వాలేదు మాకు మాత్రం పాయసం పెట్టండి అనే మీలాంటి తెలంగాణ వదులుకు ఎలా అర్ధం అవుతుందిలే ? మీ నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించడం మా తప్పు ...

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం