25, సెప్టెంబర్ 2013, బుధవారం

మము బ్రోవమని చెప్పవే...శ్రీ మతుల రాయ బారం

మంత్రి మారయ్యకు 53 రోజుల నుంచి కంటిమీద కునుకు లేదు. చట్టానికి చిక్కకుండా ఇంత కాలం కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఏమవుతుందో అనే దిగులు పట్టుకుంది. నానా గడ్డికరిచి సంపాదించుకున్న భూమి తనది కాకుండా పోతుందా? అనే ఆలోచన నిద్ర పోనివ్వడం లేదు. భగవంతుడా నాకింకేమీ వద్దు నేను సంపాదించుకున్న అక్రమాస్తులు ఇలా ఉంటే చాలు అని దేవుడిని మొక్కుకోని రోజు లేదు. ఆలీబాబా 40 దొంగలు కథ లో 40 మంది దొంగలు కొల్లగొట్టిన సొమ్మంతా గుహలో దాచిపెట్టినట్టు, రాజకీయాల్లో కొల్లగొట్టిన సొమ్మంతా భూమిపై పెట్టాడు. ఏదైనా తగ్గొచ్చు, పెరగవచ్చు కానీ భూమి మాత్రం పెరగదుఅని భూమిని నమ్ముకుంటే ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆలోచనలతో ఆందోళన, దాంతో వైరాగ్యం కలుగుతోంది. ఇవన్నీ కలిపి కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిద్ర రాకపోవడంతో అర్ధరాత్రి టీవి చూస్తుం టే మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ రామదాసు కీర్తన వినిపించింది. మారయ్య ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. సమస్యకు పరిష్కారం లభించిందనిపించింది. మహాభక్తుడు రామదాసు సైతం శ్రీరాముడిని అనేక రీతుల్లో కీర్తించి, బతిమిలాడి చివరకు అటు నుంచి నరుక్కు వద్దామని ఆయన్ని వదిలేసి సీతమ్మను నమ్ముకున్నాడు, సక్సెస్ అయ్యాడు.ఈ టెక్నిక్ కొత్తదేమీ కాదు. శ్రీకృష్ణుడంతటి శక్తివంతుడు కీలక సమయాల్లో ఈ టెక్నిక్‌నే నమ్ముకున్నాడు కదా? వరం వల్ల నరకాసుడిని శ్రీకృష్ణుడు చంపలేడు. సత్యభామ మాత్రమే చంపగలదు. యుద్ధం చేసి చేసి స్పృహ తప్పితే సత్యభామ ఆయుధం చేపట్టి నరకాసురుడిని వధిస్తుంది. మనతో కానప్పుడు మముబ్రోవమని వేడుకోవడం శ్రీకృష్ణుడికే తప్పనప్పుడు భక్తులు, కుటుంబరావులు అలా వేడుకుంటే తప్పేముంది. అవన్నీ ఆలోచిస్తూ మార య్య ఏ ప్లాన్ అయినా చిత్తుకావచ్చు కానీ మముబ్రోవమని అటు నుంచి నరుక్కు వచ్చే ప్లాన్ ఫెయిల్ అయ్యే చానే్సలేదు లేదనుకున్నాడు. ఓ కేకేసి మారమ్మను పిలిచాడు. తన గదిలోకి వెళితే తన ప్రపంచం ఏదో తాను అన్నట్టుగా ఉండే మారయ్య నుంచి అంత ప్రేమగా పిలుపు వినగానే మంత్రిగారి భార్య మారమ్మ పులకించి పోయింది. *** ఇదీ విషయం ఇదిగో మంత్రుల ఇంటి ఫోన్ నంబర్లు మంత్రులందరి భార్యలతో మాట్లాడు అని విషయం మొత్తం చెప్పాడు మారయ్య . ‘‘మీరేమీ అనుకోనంటే ఓ మాట చెబుతానండి అని మారమ్మ లాలనగా అడిగింది. ‘‘డార్లింగ్ నువ్వు చెబుతానని అనడం నేను వినకపోవడమా? చెప్పు ఎంత సేపైనా వింటాను. ’’అని మురిపెంగా పలికాడు మారయ్య. ‘‘మీ ప్రభుత్వం రాకముందు బాబుగారు అధికారంలో ఉన్నప్పుడు నాకెప్పుడు అలాంటి అవకాశం వస్తుందా? అని ఎదురు చూసే దాన్ని. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సభ్యుడు ఎవరు మరణించినా ఆయన భార్యకు టికెట్ ఇచ్చి గెలిపించుకునే వారు. ఈ ఒక్క విషయంలో నాకు బాబుగారంటే ఎనలేని గౌరవం ఏర్పడింది. పుణ్యాత్ముడు... గొప్ప మానవతా వాది కాకపోతే మరొకరైతే అలా చేస్తారా? తమ పార్టీ సభ్యులే కాకుండా చివరకు తమ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే మరణించినా వాళ్ల భార్యకు టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విశాల హృదయుడు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న ఇంద్రారెడ్డి చనిపోతే ఆయన భార్యకు టికెట్ ఇచ్చేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించాడు. అలాంటి అదృష్టం నాకెప్పుడు వస్తుందా? అని ఎంతో కాలం ఆశగా చూశాను. అధ్యక్షా అని పలకడానికి రిహార్సల్స్ కూడా చేశాను. ఆరోజు కోసం పట్టుచీర కూడా కొన్నాను. అప్పుడు నా ఆశ నెరవేరకపోయినా ఢిల్లీ పెద్దలను కలిసేందుకు మీ అంతట మీరే పంపిస్తున్నారు.. అందరం కలిసి వెళతాం ’’ అని మారమ్మ చెప్పింది. ‘‘ఎంత అమాయకంగా కనిపిస్తావు... ఇంత లా ఆలోచించావా?.. నేను సంపాదించించేది, సంపాదించింది నా ఒక్కడి కోసమా? నీ కోసం నీ పిల్లల కోసం కాదా? ’’ అని మారయ్య వాపోయాడు. వెళ్లడానికి మీరు సిద్ధం కండి... ఈ లోపు అపాయింట్‌మెంట్ తీసుకుంటా?’’అని చెప్పా డు. *** ‘‘సార్ మేం మంత్రుల భార్యలం. హైదరాబాద్ వదిలితే బతకలేం.. మా జిల్లాలో రోగం వస్తే చూపించుకోవడానికి ఆస్పత్రి లేదు. సౌకర్యాలు లేవు. మాలాంటి గొప్పవారు అక్కడ నివసించడానికి ఏ మాత్రం ఇష్టపడరు. ఆడవారు చెబితే వింటారని మేం వచ్చాం అని అంతా కోరస్‌గా చెప్పారు’’ ‘‘మీ వారు ప్రాతినిధ్యం వహించే నియోజక వర్గం ఏదమ్మా!’’ ‘‘మా ఆయన ఫలానా శాఖ మంత్రి. నియోజక వర్గం అంటే ఏంటి సార్?’’ ‘‘మంత్రి కావడానికి ముందు ఏదో ఒక నియోజక వర్గం నుంచి గెలుస్తారు అదమ్మా!’’ ‘‘ఏమో సార్ మాకు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ తప్ప నియోజక వర్గం అంటే తెలియదు.’’ ‘‘సరేనమ్మా మీ అందరికీ నేనో విషయం చెబుతాను అలా చేయండి సరేనా? ’’ 
‘‘సరే సార్!’’ 
*** 
మంత్రులు భార్యల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
‘‘ఏమైంది ? ఏమన్నారు??’’ అని ఉత్సుకత ఆపుకోలేక ప్రశ్నించారు. 
‘‘డిల్లీ ఆయన మాకో పని చెప్పారు. సొంత జిల్లాకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇంత కాలం ఏం చేశారని మీ చోక్కా పట్టుకుని నిలదీయమన్నారండి’’ అని అంతా కోరస్‌గా పలికారు.
డామిట్ కథ అడ్డం తిరిగింది ..  డిల్లీ పెద్దలు మన  వంటింటి లోనే విప్లవం తెచ్చారంటే ... ఇక నియో కవర్గం ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో  అనుకున్నారు మంత్రులు .. 

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం