25, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలంగాణా అస్తిత్వాన్ని విలీనం చేస్తారా ?

డెబ్బయవ దశకంలో జరిగిన జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు ఏడాది రెండేళ్లకు మించి సాగలేదు. ఎంత ఆవేశంగా వచ్చాయో అంతే చప్పున చల్లారాయి. మలి దశ తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతం అవుతూ 13 ఏళ్ల తరువాత కూడా సగర్వంగా తలెత్తుకొని నిలవడానికి ప్రధాన కారణం ఇది ఆస్తిత్వ పోరాటం.


ఉద్యమం విజయవంతం అయ్యాక ఇప్పుడు టిఆర్‌ఎస్ కాంగ్రెస్ విలీన చర్చ సాగుతోంది. భౌగోళిక తెలంగాణను సాధించుకోవడం అంటే పది శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు, సాధించిన తెలంగాణను సమున్నత స్థాయిలో నిలబెట్టడానికి పునర్నిర్మాణం జరపడం 90 శాతం లక్ష్యం అని ప్రొఫెసర్ జయశంకర్ తరుచుగా అనే వారు. ఇప్పుడు తెలంగాణ సాధించారు. లక్ష్యం ముగిసినట్టేనా? మిగిలిన 90 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది?


‘‘సీమాంధ్ర పార్టీల అవసరం మనకు లేదు, స్వీయ అస్తిత్వం కోసం తెలంగాణ పార్టీ అవసరం’’ అని పలు సందర్భాల్లో కెసిఆర్ బహిరంగ సభల్లో చెబుతూ వచ్చారు. సాధించిన తెలంగాణను గమ్యం చేర్చేందుకు ఇదే పోరాట పటిమ చూపిందేకు తెలంగాణ పార్టీ ఉండాల్సిందే. అది టిఆర్‌ఎస్ కావచ్చు, కొత్తగా తెలంగాణ కోసం పుట్టే పార్టీలు కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశం అస్తిత్వ పోరాటం. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో అన్యాయం వల్లనే ఉద్యమం అంటే ప్యాకేజీలతో ఈ సమస్య పరిష్కారం అయ్యేది. ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఎన్ని 610జివోలు జారీ చేసినా ఎవరూ తమ అస్తిత్వాన్ని వదలుకోవడానికి సిద్ధపడరు. తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి చివరకు తెలంగాణ అనే పదానికే అవమానం జరినప్పుడు, చివరకు తన గడ్డమీద తానే పరాయి దిగా నిలిచినప్పుడు అస్తిత్వ వాదంగానే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగింది. తెలంగాణలోని ప్రతి పల్లె ప్రతి కులం, ప్రతి మనిషి ఈ పోరాటంలో తానున్నానని చాటి చెప్పాడు. అస్తిత్వ వాదంతోనే ఉద్యమం సాగినప్పుడు తెలంగాణ సాకారం అయినప్పుడు తెలంగాణకు సొంత రాజకీయ పార్టీ ఉండా లా? అనే ప్రశ్న ఉదయించడమే విడ్డూరం. 

తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎన్టీఆర్ రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు భాష, సంస్కృతి కోసం పెద్దగా చేసిందేమీ లేదు. పైగా అప్పటి వరకు తెలుగు సంస్కృతి కోసం అంతో ఇంతో కృషి చేసిన నాటక , సంగీత అకాడమీ, సాంస్కృతిక అకాడమీ, అధికార భాష సంఘం వంటి వాటినన్నింటిని రద్దు చేశారు. సాధారణ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు ఆవిర్భవించిన టిడిపిని ప్రజల ఆదరించడానికి తెలుగువారి ఆస్తిత్వ పోరాటం ఎంత మాత్రం కాదు. అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజలకు పీకల లోతు కోపం ఉంది. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. మేం వేదిక మొత్తం సిద్ధం చేసిన తరువాత అందులో ఎన్టీఆర్ వచ్చి కూర్చున్నట్టు అయింది అని ఆనాటి రాజకీయాలను విశే్లషిస్తూ బిజెపి నేత కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు ఒక సారి వ్యాఖ్యానించారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది, తనకు ప్రజల్లో విపరీతమైన సినిమా గ్లామర్ ఉంది. దీంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ విజయం సాధించగలిగింది.


ఎలాంటి సినిమా గ్లామర్ లేదు , రాజకీయాల్లో నాలుగేళ్లపాటు మంత్రిగా పని చేసిన అనుభవం, సొంత జిల్లాలో గుర్తింపు తప్ప పక్క జిల్లాలో సైతం పెద్దగా గుర్తింపులేదు, తెలంగాణ వాదాన్ని నమ్ముకొని కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో 13 ఏళ్లపాటు అలుపెరగని పోరాటం చేయడం, చివరకు అసాధ్యం అనుకున్న తెలంగాణ కలను సాకారం చేశారు. కెసిఆర్ వెనక ఉన్న అసలైన బలం తెలంగాణ అస్తిత్వ పోరాటం. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినా, రాజీనామా చేసినా, పదే పదే ఉప ఎన్నికల్లో పోటీ చేసినా, ఒకసారి కాంగ్రెస్‌తో మరోసారి టిడిపితో చేతులు కలిపినా అన్నింటికీ తెలంగాణ వాదులు సరేనన్నారు. కెసిఆర్ ప్రతి వ్యూహం సరైనదే అనే ఉద్దేశం తో కాదు... కెసిఆర్‌తోనే తెలంగాణ అస్తిత్వ వాదానికి గుర్తింపు లభిస్తుందనే గట్టి నమ్మ కం.. కెసిఆర్‌పై తెలంగాణ వారికే కాదు..... సీమాంధ్రులకు సైతం గట్టి నమ్మకం. అందుకే కెసిఆర్‌ను తెలంగాణకు గుర్తింపుగా తెలంగాణ వాదులు భావిస్తే, తెలంగాణను వ్యతిరేకించే సీమాంధ్ర నాయకులు సైతం కెసిఆర్‌నే తెలంగాణకు ప్రతిరూపంగా భావించారు. 

సీమాంధ్రులు తెలంగాణకు వ్యతిరేకంగా కెసిఆర్‌పై ఎక్కువ పెట్టిన బాణాలన్నీ, చేసిన విమర్శలన్నీ, రాసిన రాతలన్నీ తెలంగాణలో కెసిఆర్ ప్రభావాన్ని పెంచడానికి ఉపయోగపడ్డాయి. అంతకు ముందు హేమా హేమీలు అనుకున్న ఎంతో మంది నాయకులు పోటీగా తెలంగాణ వాదం వినిపించినా తెలంగాణ అంటే కెసిఆరే అనే తెలంగాణ వాదులు భావించడం వల్ల ప్రత్యామ్నాయం వైపు కనె్నత్తి చూడలేదు. విజయశాంతి, నరేంద్ర, గద్దర్, దేవేందర్‌గౌడ్ లాంటి వారిని కెసిఆర్‌కు ప్రత్యామ్నాయంగా నిలపాలని మీడి యా తీవ్రంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మీడియా కులం కార్డును ప్రయోగించినా దాన్ని తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. ఒకటి రెండు శాతానికి మించని కెసిఆర్ సామాజిక వర్గం ఏదనేది తెలంగాణ వారు పట్టించుకోలేదు, సీమాంధ్ర మీడియా, నాయకులు ఈ అంశానే్న ప్రధానంగా ఎత్తి చూపించినా పట్టించుకోలేదు. చివరకు విజయశాంతి, నరేంద్రలు తమ పార్టీలను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాల్సి వచ్చింది. దేవేందర్ గౌడ్ తన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. మీడియా బలం, ఆర్థిక బలం, రాజకీయ బలం ఉన్న సీమాంధ్ర వర్గాన్ని ఎదుర్కోవడానికి కెసిఆరే తెలంగాణ వారికి ఏకైక దిక్కుగా కనిపించారు. తమ అస్తిత్వాన్ని తాము ఇష్టపడం, తమ అస్తిత్వానికే సవాల్‌గా మారిన పరిస్థితులను ఎదుర్కోవాలన్న కసితో తెలంగాణ వారు కెసిఆర్ నాయకత్వానికి కొండంత అండగా నిలిచారు. పదే పదే రాజీనామాలతో తెలంగాణపై ఎంత అభిమానం ఉందో చూపించాలని కోరినా విసుక్కోలేదు. తీరా ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తరువాత టిఆర్‌ఎస్‌ను ఎలాగైనా కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కొందరి ప్రయత్నం. ఇది కాంగ్రెస్‌పై ప్రేమతో కాదు... టిడిపిని ఎలాగైనా అధికారంలోకి తీసుకు రావాలని, ఆ పార్టీ బాగుపడేట్టు చేయాలనే కోరికతో..


ఈ రెండు పార్టీలు విలీనం కాకపోతే ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వేల ప్రకారం తెలంగాణలో టిఆర్‌ఎస్ మొదటి స్థానంలో, కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలుస్తుంది. ఇక మూడవ, నాలుగవ స్థానం కోసం టిడిపి, వైకాపా, బిజెపి పోటీ పడాలి. అలా కాకుండా టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అయితే టిడిపి, బిజెపి కలిసే అవకాశాలు ఉంటాయి. దాంతో వాళ్లు రెండవ స్థానంలో బలమైన ప్రత్యర్థులుగా నిలుస్తారు. టిడిపి మేలు కోరే వారికి కావలసింది ఇదే. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కెసిఆర్ మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోవలసిందే, వెంటనే విలీనం చేయాలి అంటూ టిటిపి నాయకులు విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి డిమాండ్ చేయడం రాజకీయ విడ్డూరం.


ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని తెలంగాణ ఏర్పాటు చేసినందుకు తనకు రాజకీయ ప్రయోజనం ఉండాలని, టిఆర్‌ఎస్ విలీనం వల్ల అది సాధ్యం అవుతుందని కాంగ్రెస్ భావిస్తూ ఉండవచ్చు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన టిఆర్‌ఎస్ ఇతర పార్టీల వలే ఒక కుటుంబ పార్టీ కాదని, పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ వాదం కోసం ఎంతో మంది తెలంగాణ వాదులు చేసిన కృషి వల్ల టిఆర్‌ఎస్ ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకుందని గ్రహించాలి. ‘‘నియోజక వర్గానికో జగ్గారెడ్డి ఉంటాడు, మనం తెలంగాణ సాధించి కాంగ్రెస్‌లో విలీనం అయితే ఈనగాచి నక్కల పాలు చేసినట్టు ఇలాంటి వారికి తెలంగాణ అప్పగించినట్టు అవుతుంది’’, అని గతంలో పార్టీ నేతలతో కెసిఆర్ అన్నట్టు వార్తలు వచ్చాయి.


ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని జనంలోకి తీసుకువెళ్లినట్టుగా కెసిఆర్ తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఉపయోగించలేదు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం టిఆర్‌ఎస్‌ను తెలంగాణ ఆత్మగౌరవ నినాదంగానే భావించారు. ఒకవైపు అభివృద్ధి సాధించడంతో పాటు మరో వైపు తెలంగాణ సంస్కృతి, కళలు, తెలంగాణ ఆస్తిత్వం నిలిచిపోయేట్టు, మహోన్నతంగా వెలిగిపోయేట్టు చేయాల్సిన బాధ్యత టిఆర్‌ఎస్‌పై ఉంది. విలీనం వల్ల ఇది సాధ్యం కాదు. తెలంగాణ జాగృతి సంస్థ చొరవ వల్ల గత దశాబ్ద కాలంలో తెలంగాణలో మళ్లీ బతుకమ్మ పండుగ సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. తెలంగాణ ఉద్యమమే లేకపోయి ఉంటే మహానగరంలో కాదు మారుమూల పల్లెలో సైతం బతుకమ్మ బిక్కుబిక్కుమంటూ కనిపించీ కనిపించకుండా దాక్కునేది. ఒక చిన్న సంస్థ ఆ పని చేసినప్పుడు తెలంగాణ సంస్కృతి తలెత్తుకునేట్టు తెలంగాణ ప్రభు త్వం చేయలేదా? ప్రాంతీయ సంస్కృతులపై జాతీయ పార్టీలు పెద్దగా దృష్టి పెట్టలేవు. అవి ప్రాంతీయ పార్టీల వల్లనే సాధ్యం. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు చూపించాలనుకుంటే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చు. ఎంపి సీట్లు ఎన్ని వచ్చినా కాంగ్రెస్‌కే భరోసా ఇవ్వవచ్చు. కానీ విలీనం చేస్తే ఇంత కాలం సాగించిన అస్తిత్వ పోరాటానికి అర్ధమే లేకుండా పోతుంది. తెలంగాణ ఆస్తిత్వమే లేకుండా పోతుంది. ఆస్తిత్వ పోరాటాన్ని గౌరవించాలనుకుంటే తెలంగాణకు సొంత రాజకీయ పక్షాలు అవసరం. అది టిఆర్‌ఎస్ కావచ్చు, మరే పార్టీ అయినా కావచ్చు కేవలం తెలంగాణ కోసమే పని చేసేట్టుగా ఉండాలి. 
టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అయితే ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికైనా తెలంగాణ కోసం మరో బలమైన పార్టీ వస్తుంది. రాజకీయంగా చూసినా విలీనం తప్పుడు వ్యూహం అవుతుంది. తమిళనాడు తరహాలో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సొంత రాష్ట్రానికి ప్రయోజనం కలగాలి అంటే తెలంగాణ పార్టీ ఉండాల్సిందే. కొత్త రాష్ట్రం తప్పటడుగులు తప్పవు అలాంటి సమయంలో కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేకపోతే మరిన్ని కష్టాలు తప్పవు. తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్తును టిఆర్‌ఎస్ చేతిలో పెట్టినప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది.

5 కామెంట్‌లు:

  1. Fully agreed.

    తెలంగాణా రాగానే సమస్యలు తీరిపోవు. సమస్యలను పరిష్కరించే క్రమంలో ఒక అడ్డంకి తొలిగింది అంతే.

    రిప్లయితొలగించండి
  2. "కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన టిఆర్‌ఎస్ ఇతర పార్టీల వలే ఒక కుటుంబ పార్టీ కాదని,"
    అదేంటి ... మరి కె.టి.ఆర్, హరీష్ రావు,...

    రిప్లయితొలగించండి
  3. Murali garu, very good analysis. Yes its a requirement for developoing the state

    రిప్లయితొలగించండి
  4. Meeredho telangana kcr poratam valla vachindhane bramalo vunnaru, adhi kevalam partyni congresslo kaluputhanu Anna hamee valla vachindhane vishayam gurthu pettukondi , oka vela telangana ivvakunte trs oka 50 ,seats gelichedhi

    రిప్లయితొలగించండి
  5. kutumba party kabatty motham kutumbanni ventesukone soniya ni kalavadaniki velladu alla velladam valla TRS nayakule chala gurru ga vunnaru

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం