30, మార్చి 2014, ఆదివారం

రాఖీ సావంత్ ఇజం వర్ధిల్లాలి

మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలా! ... జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవునరా! అని ఘంటసాల గొంతుతో శ్రీకృష్ణుడు ఎంత చెప్పినా మనం మాత్రం మత్తు వదల లేదు. అదే లే ... లే... లేలే నా రాజా!.. నన్ను లేపమంటవా? అంటూ పాడితే ఎంత నిద్రలో ఉన్నవారైనా లేచి కూర్చుంటారు. అదే పని ఇప్పుడు రాఖీ సావంత్ పార్లమెంటులో చేయబోతున్నారు. ఎంపిలు పార్లమెంటులో నిద్రపోతున్నారు తప్ప ప్రజల సమస్యలపై మాట్లాడడం లేదు. వారిని నిద్రలేపడానికే నేను పార్లమెంటులోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నానని రాఖీసావంత్ ప్రకటించారు. జనగణమన జాతీయ గీతం పాడేప్పుడు కూడా కెమెరామెన్లు, జర్నలిస్టులు కాస్సేపు వౌనంగా ఉండలేరు. కానీ రాఖీ సావంత్ ఈ మాటలు చెబుతున్నప్పుడు వారంతా కన్నార్పకుండా ఆమెనే చూస్తుండి పోయారట! ఆమె వేసుకున్న డ్రెస్సు వల్ల అని కొందరంటే కాదు జాతి నిద్ర లేపడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం పట్ల ఆకర్శితులై వౌనంగా వింటూ పోయామని ఒకాయన అన్నాడు. ఎంపిలను నిద్ర పోకుండా చేయాలనుకుంటున్న ఆమె సిద్ధాంతానికి రాఖీసావంత్ ఇజం అని పేరు పెట్టుకుందాం. ఏదో స్టార్ హోటల్‌లో ఆమె పార్టీని ప్రారంభించి చిన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాలు రాఖీసావంత్ ఇజం ఆవిర్భావానికి దారి తీసిన కారణాలు చెబితే బాగుండు సరే ఇప్పుడు కాకపోయినా తరువాతైనా చెప్పకపోతుందా?
పూవు పుట్టగానే పరిమళించినట్టు ..... పూవు సంగతి వదిలేసి రాఖీసావంత్ దగ్గరకొద్దాం. దగ్గరకంటే ఆమె దగ్గరకు కాదు వాళ్ల దగ్గరకు వెళ్లాలని ప్రయత్నిస్తే బౌన్సర్లు ఉంటారు. ఈడ్చి బయటకు పారేస్తారు.
రాఖీసావంత్ తొలుత క్లబ్బుల్లో డ్యాన్స్ చేసేవారు. ఎంత తాగిన వారైనా ఆమె డ్యాన్స్‌లతో హుషారుగా ఈలలు వేస్తూ యమ యాక్టివ్‌గా ఉండేవారు. అర్ధరాత్రి దాటినా నిద్ర పోయేవారే కాదు. సమాజాన్ని నిద్ర పోకుండా చేస్తున్న తనలోని శక్తి గురించి సావంత్‌కు అప్పుడే తెలిసొచ్చింది. ఈ చైతన్యాన్ని క్లబ్బుల్లో కొద్దిమందికే పరిమితం చేయకుండా విస్తరించాలని అనుకున్నారు. అటు నుంచి సినిమాల్లో ఐటెం గర్ల్‌గా ఐటెం సాంగ్స్ అవతారం ఎత్తారు. సినిమా కథ నచ్చక నిద్రలోకి జారుకునే వారు సైతం రాఖీసావంత్ ఐటెం సాంగ్స్ వచ్చిందంటే ఈలలు వేసి ఉత్సాహంగా గెంతులేసేవారు. ఒకవైపు తన అభిమానులు ఐటెం సాంగ్స్‌తో ఉత్సాహంగా గెంతుతుంటే కొందరు ప్రజాప్రతినిధులు చట్టసభల్లో నిద్ర పోవడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది.
తెలుగు నేతలు తొలి సంతకం అంటుంటే ఆమె మాత్రం తనను గెలిపిస్తే కత్రినా కైఫ్ నడుములాంటి రోడ్లు వేయిస్తానంటోంది. అమలు అవుతుందా? లేదా తరువాత కానీ ఆమె తొలి హామీ ఎంత సెక్సీగా ఉందనుకుంటున్నారు అభిమానులు. రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరుతో రాఖీసావంత్ ఇజంతో సొంత పార్టీని ఏర్పాటు చేశారు. అలానే ఒక ఇజం అంటూ దొరికినప్పుడు ఏదో ఒక పార్టీలో ఎందుకు చేరాలి, సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటే పోయేదేముంది. అనుకుంది ఆమె. ఎంతో మంది అధికారులు, వ్యాపారుల భార్యలు ఈ పార్టీలో చేరుతున్నారట, పార్టీ గుర్తు మిర్చి.. రాఖీకి మంచి టేస్ట్ ఉంది. ఏ సినిమాలో అయినా నిజంగానే ఆమె మిర్చి అంతా ఘాటుగా ఉంటుంది. ఆమెకు తగ్గట్టు మిర్చి గుర్తు ఎంచుకుంది. పార్టీకి ఆమె ఉపాధ్యక్షురాలే. అధ్యక్షురాలు ఎవరో? సన్నిలియోన్ అయితే బాగుండు అని కొందరి కోరిక. అప్పుడు మన ఎంపిలు పార్లమెంటులోనే కాదు ఇంటికి వెళ్లిన తరువాత కూడా నిద్రపోరు.
కమ్యూనిజం, క్యాపిటలిజం అంటూ ఎప్పుడో పుట్టిన రెండు సిద్ధాంతాల దగ్గరే ఆగిపోయారు. ఇంత కాలం అయినా కొత్త ఇజాల కోసం ఎవరూ ప్రయత్నించలేదు. కమ్యూనిజంకు కాలం చెల్లింది టూరిజం ఒక్కటే మిగిలింది అని అధికారంలో ఉన్నప్పుడు బాబు కొత్త ఇజం కనిపెట్టారు. ప్రజలు దాన్ని సరిగా స్వీకరించకుండా ఆయనకే కాలం చెల్లిందని చెప్పి ఇంటికి పంపించేశారు. ఆయన కూడా పదేళ్ల తరువాత అధికారం నిజం ఇజం అబద్ధం అనే ఇజంను నమ్ముకున్నారు..ఇప్పుడు పవన్ ఇజం అంటూ కొత్త ఇజం పుట్టింది. ఇంకేం మన కష్టాలన్నీ ఈ ఇజంతో తీరిపోతాయి అని అభిమానులు అనుకుంటుంటే... మేం ఎన్నికల్లో పోటీ చేయం, ప్రశ్నించడానికే మా ఇజం పరిమితం అంటున్నాడాయన! ప్రశ్నించడానికే అయితే ట్విట్టర్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో రాంగోపాల్‌వర్మలా ప్రశ్నిస్తే సరిపోతుంది కదా?పార్టీ ఎందుకు అని కొందరి ప్రశ్న. ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఎదుటివాడి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అది పవన్ ఇజం సిద్ధాంతానికి వ్యతిరేకం ఎదుటివారిని ప్రశ్నించడమే తప్ప ఎదుటి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడమే ఆయన ఇజం ప్రత్యేకత.
అన్నా హజారే ఉద్యమ సమయంలో పూనంపాండే అని ఒక మోడల్ వెలుగులోకి వచ్చారు. చాలా మందికి నిద్ర లేకుండా చేశారు. రాజకీయ ఉద్యమం ద్వారానే వెలుగులోకి వచ్చిన ఆమె కూడా పార్టీ పెడితే బాగుండు. ఆ మధ్య జస్పాల్ భట్టీ గోటాల పార్టీ ( కుంభకోణాల పార్టీ) అని ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన పోయారు. ఉండి ఉంటే గోటాల ఒక ఇజంగా మంచి గుర్తింపు పొంది ఉండేది. కాంగ్రెస్, బిజెపి లాంటి సీనియర్ పార్టీలు రాఖీసావంత్ కన్నా ముందున్నా ఎవరిని ఎప్పుడు ఎంపిక చేయాలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. డ్రీమ్‌గర్ల్‌ను పార్లమెంటుకు పంపాం ఇంకేం చేయాలి అని వాళ్లంటున్నారు. 60 ఏళ్ల హేమా మాలిని డ్రీమ్ బామ్మ అవుతుంది కానీ డ్రీమ్ గర్ల్ ఏమిటి? రాఖీసావంత్‌ను చట్టసభలకు పంపి ఉంటే ఇప్పుడు రాఖీసావంత్ ఇజం మీకు సవాల్ విసిరి ఉండేదా?
సినిమా నాలుగు రోజులు నడవాలంటే మధ్యలో ఐటెం సాంగ్స్‌ను జొప్పిస్తారు. రాజకీయాల పట్ల ప్రజలకు వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో రాజకీయాల్లోనూ ఐటెం సాంగ్స్ ద్వారా ఉషారెత్తిస్తున్నారు. కెవ్వు కేక ఐటెం సాంగ్ గబ్బర్‌సింగ్ సినిమా సూపర్ హిట్ కావడానికి ఎంతగా ఉపయోగపడిందో తెలిసిందే, ఇప్పుడా పాటనే టిడిపి సైతం నమ్ముకుంది. మా బాబు అభివృద్ధి చేశాడని ఎన్ని పాటలు ప్రచారంలో పెట్టినా పట్టించుకోవడం లేదు. దాంతో వాళ్లు కూడా ఇప్పుడు కెవ్వు కేక ఐటెం సాంగ్ ద్వారా టిడిపి మహోన్నత ఆశయాలను జనాలకు వివరిస్తున్నారు. వీరంతా కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తే ? అప్పుడు చూడాలి పార్లమెంటును... రాఖీ సావంత్ ఇజం , పవన్ ఇజం లాంటి ఆధునిక ఇజాలన్ని కలిస్తే పుట్టే కొత్త ఇజం చేతిలో నవ భారతం భవిష్యత్తు ??? ఒక సారి మీరే ఉహించుకోండి 

28, మార్చి 2014, శుక్రవారం

అతడే ఒక సైన్యం! సినిమా రాజకీయాలకు కాలం చెల్లిందా ? ఎన్టీఆర్ , చిరంజీవిల కన్నా పవన్ గొప్పా ?

           పవన్ కల్యాణ్ పార్టీపై పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా వాళ్లు రాజకీయాల్లో చేయగలిగింది ఏమీ లేదని నిరూపణ అయి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తుంది. సినిమా రాజకీయ బంధాలపై ఎన్టీఆర్‌కు ముందు ఎన్టీఆర్ తరువాత అనే విభజన అవసరం. సినిమా వాళ్లంతా ఎన్టీఆర్‌కు ముందునాటి పరిస్థితినే అంచనా వేసుకుంటున్నారు. కానీ ఇది ఎన్టీఆర్ తరువాత కాలం అని ఎన్నికల్లో బోల్తాపడ్డాక కానీ వారికి అర్ధం కావడం లేదు. ==== 

మరోస్టార్... 
మరో పార్టీ... 
తారల రాజకీయ ప్రవేశం తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త కాదు.. తెలుగు రాజకీయాలకూ నటలు కొత్త కాదు... . ఇలాంటివి టాలీవుడ్ ఎన్నో చూసింది. ఒక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే కథ ఎలా ఉంటుందో, హీరోకు భవిష్యత్తు ఉంటుందా? దర్శకుని సత్తా ఏమిటి? ఈ సినిమా నడుస్తుందా? అనే ప్రశ్నలు అందరి మనసులను తొలిచి వేస్తుంటాయి. టీవి కెమెరాల ముందు ‘ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాత రిచ్‌గా తీశాడు, హండ్రెడ్ డేస్ గ్యారంటీ, ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తుంది. చరిత్ర సృష్టిస్తుంది ’అంటూ నవ్వు ముఖాలతో ఎంత చెప్పినా మనసులో సందేహాలు తొలుస్తూనే ఉంటాయి. ప్రశ్నల్లో మార్పు ఉండొచ్చు కొత్త సినిమా అయినా కొత్త పార్టీ అయినా ఇది నిలబడుతుందా? సినిమా అయితే కలెక్షన్ల పంట పండిస్తుందా? అనే ప్రశ్న రాజకీయాలకు వచ్చేసరికి ఓట్ల పంట పండిస్తుందా? సీట్లు తెస్తుందా? అని మారుతుంది. ప్రశ్నలు మారుతాయి కానీ సందేహాలు అక్కడా ఇక్కడా అవే. 

కొత్త సినిమా పేరు జన సేన టైటిల్ బాగానే ఉంది. ఈ సినిమాకు హీరో, దర్శకుడు, నిర్మాత అంతా పవన్ కల్యాణే... బినామీలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది కానీ ఇంతోటి సినిమాకు బినామీలు అవసరమా? అనే ప్రశ్నపుట్టి ఆ ప్రచారం నిజం కాదేమోననిపిస్తోంది. ఆడియో రిలీజింగ్ పంక్షన్ అదిరిపోయింది. అభిమానులతో పదే పదే చప్పట్లు కొట్టించింది. నన్ను మాట్లడనివ్వండి, మాట్లాడక ముందే చప్పట్లు కొడితే ఎలా అని పవన్‌తో పదే పదే అనిపించేంతగా అభిమానులు అభిమానం ప్రదర్శించారు. కానీ, ఒక సిద్ధాంతం లేదు, పోసుకోలు కబుర్లు తప్ప చెప్పిందేమీ లేదు అని అభిమానేతర వర్గాల నుంచి నెగిటివ్ టాకే ఎక్కువగా వినిపించింది. తెలుగు సినిమా పరిశ్రమ హిట్ల కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తోంది. హిట్ సినిమాలు ఎన్ని ఎక్కువ వస్తే సినిమా పరిశ్రమ అంతగా కలకలలాడుతుంది. 

రాజకీయ రంగంలో సినిమా పరిశ్రమ మెగాహిట్‌ను చవి చూసి మూడు దశాబ్దాలు దాటిపోయింది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ఇచ్చిన హిట్ తరువాత మరో హిట్టే లేదు. ఆరుపదుల వయసులో హీరోగా నటించే అవకాశాలు ఉండవని గ్రహించి ఎన్టీరామారావు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాలం కలిసి రావడంతో ఎన్టీఆర్‌కు రాజకీయాల్లోనూ మంచి హిట్టు లభించింది. ఆ తరువాత ఎంతో మంది స్టార్లు రాజకీయ రంగంలో క్యారక్టర్ ఆర్టిస్టులుగా సహాయ పాత్రలకే పరిమితం అయ్యారు కానీ రాజకీయాల్లో హీరోగా వెలుగొందలేదు. ఎంతో మంది మాజీ హీరోలు, హీరోయిన్లు, సహాయ నటులు ఏదో ఒక పార్టీలో చేరి తాము సినిమాల్లో హీరోలం అయినా రాజకీయాల్లో మాది సహాయక పాత్రే అని నిరూపించుకున్నారు. స్వయం కృషితో మెగాస్టార్‌గా తెలుగు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన చిరంజీవి సైతం రాజకీయాల్లో సహాయ నటుని పాత్రలకే పరిమితం కావలసి వచ్చింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేని ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను బతికించే బాధ్యత భుజాన వేసుకుని సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం హీరో అని నిరూపించుకునేందుకు చిరంజీవి సన్నద్ధం అవుతున్న సమయంలో ఆయన ఆశలపై పిడుగు పడ్డట్టుగా సొంత తమ్ముడే కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో చిరంజీవిది క్యారక్టర్ ఆర్టిస్ట్ పాత్రనే. సీమాంధ్రలో కాంగ్రెస్‌ను ఒడ్డున పడేస్తే ఆయన రాజకీయాల్లో హీరోనే అవుతారు. సహాయ నటునికి హీరోగా నటించే అవకాశం దక్కినప్పుడు సొంతింటి వారి నుంచే పోటీ వస్తే ఎలా ఉంటుందో చిరంజీవి పరిస్థితి అలానే ఉంటుంది. చిరంజీవికి సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు అప్పగిస్తే, ఆయన తమ్ముడు పవన్ కాంగ్రెస్‌కు హోటావో దేశ్‌కో బచావో అంటూ కాంగ్రెస్ వ్యతిరేకతే ఒక సిద్ధాంతంగా భావించి రాజకీయ ప్రవేశం చేశారు. 

పవన్ కల్యాణ్ పార్టీపై పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా వాళ్లు రాజకీయాల్లో చేయగలిగింది ఏమీ లేదని నిరూపణ అయి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తుంది. సినిమా రాజకీయ బంధాలపై ఎన్టీఆర్‌కు ముందు ఎన్టీఆర్ తరువాత అనే విభజన అవసరం. సినిమా వాళ్లంతా ఎన్టీఆర్‌కు ముందునాటి పరిస్థితినే అంచనా వేసుకుంటున్నారు. కానీ ఇది ఎన్టీఆర్ తరువాత కాలం అని ఎన్నికల్లో బోల్తాపడ్డాక కానీ వారికి అర్ధం కావడం లేదు. సినిమా నటుడైన ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సినిమా వారెవరూ రాకపోయినా ఆయన్ని అధికారంలోంచి దించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నారా చంద్రబాబునాయుడు హయాంలోనే తెలుగు సినిమా రంగం రాజకీయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపింది. స్టార్ డైరెక్టర్ రామా నాయుడు, నిర్మాత అశ్వినీదత్, హీరో రాజేంద్ర ప్రసాద్, జయప్రద, జయసుధ, రోజా పాత తరం హీరోయిన్ శారద, క్యారక్టర్ ఆర్టిస్ట్ సత్యనారాయణ, మురళీమోహన్, ఎవిఎస్, బ్రహ్మానందం, బాబూమోహన్ వంటి హేమా హేమీలు ఎంతో మంది చంద్రబాబు హయాంలో రాజకీయాల్లోకి వచ్చా రు. వీరిలో చాలా మంది చట్టసభలకు పోటీ చేశారు. ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ హయాంలో ఒక్క రావుగోపాలరావు, మోహన్‌బాబు మాత్రమే చెప్పుకోదగిన వారు టిడిపిలో కనిపించే వారు. 2004 ఎన్నికల ప్రచార సమయంలో టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సినిమా వారితో కలకలలాడేది. సినిమా వాళ్ల ప్రభావం రాజకీయాలపై ఎంత వరకు ఉంటుంది అనేది 2009 ఎన్నికల్లో ప్రజలకు బాగా తెలిసి వచ్చింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరోలైన చిరంజీవి కుమారుడు, మేనల్లుడు ఫ్యామిలీ ప్యాకేజీలా విస్తృతంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈ సినిమా దిగ్గజాలు ఒకవైపు మరోవైపు తెలుగుదేశం తరఫున దాదాపుగా మొత్తం సినిమా రంగం నైతిక మద్దతు, నంబర్ వన్ హీరోగా వెలిగిపోతున్న జూనియర్ ఎన్టీఆర్, లెజెండ్ బాలకృష్ణ వంటి వారి మద్దతుతో టిడిపి మహాకూటమి అంటూ మహా ఆర్భాటంగా ప్రచారంలో దూసుకెళ్లింది. ఈ రెండు సినిమా కూటములను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఓడించి, సినిమా గ్లామర్ కన్నా రాజకీయ గ్లామర్ ఎన్నో రేట్లు శక్తివంతమైనదని నిరూపించారు. ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల జనాకర్షణ ముందు సినిమా స్టార్ల జనాకర్షణ వెలవెలబోయింది. కుటుంబ హీరోలతో కలిసి రోడ్డుపైన పడ్డా చిరంజీవికి దక్కింది 18 సీట్లే, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కాళ్లకు బలపం కట్టుకుని తిరిగినా టిడిపిని అధికారంలోకి తీసుకు రాలేకపోయారు. 

తోచీతోచనమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్లిందట! ఇప్పుడు పవన్ కల్యాణ్ పరిస్థితి అలానే ఉంది. యోగా చేశాడట! కరాటే నేర్చుకున్నాడు, ఎంతో చదువుకున్నాడు, అయితే సంతృప్తి కలగలేదట! దాంతో చివరకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చాడట! సినిమా అంటే ఎవరో పెట్టుబడి పెడతారు, ఏర్పాట్లు చేసేవారు ఎవరో ఉంటారు. మెదడుకు పదును పెట్టి డైలాగులు రాసేవారు ఒకరు, దర్శకత్వం వహించేది మరొకరు. అంతా సిద్ధం కాగానే దర్శకుడు చెప్పినట్టు నటించి వెళ్లిపోతే హీరో బాధ్యత తీరిపోతుంది. రాజకీయం అలా కాదు. రాజకీయాల్లో ఎవరి నటనకు వారే బాధ్యులు. రాజకీయాల గురించి ప్రజలు ఎంత విమర్శించినా, మేధావులు ఎంత వ్యతిరేకించినా, అది చాలా కష్టసాధ్యమైన రంగం. సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ సైతం రాజకీయాలను అర్ధం చేసుకోలేక చివరకు ఘోరపరాజయం పాలై, మానసిక ఆవేదనతో తనువు చాలించారు. నటన తెలుసు కానీ రాజకీయం తెలియక పోవడం వల్ల సొంత అల్లుని చేతిలోనే పరాభవం తప్పలేదు. రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్‌కు రాజకీయ రంగం ఆవేదననే మిగిల్చింది. 

పరిస్థితులు కలిసి వచ్చాయి, శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్ తప్పు చేయరు అని గట్టిగా నమ్మే ప్రజలు. వీటన్నిటికన్నా అప్పుడు కాంగ్రెస్‌పై అప్పుడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎన్టీఆర్‌కు కలిసి వచ్చింది. అలాంటి ఎన్టీఆరే చివరకు రాజకీయా ఎత్తుగడల ముందు ఓటమి అంగీకరించక తప్పలేదు.  ఎన్టీఆర్ సినిమా గ్లామర్ టిడిపి ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకోవడానికి ఉపయోగ పడింది .. ఆ తరువాత అది ఫక్తు రాజకీయ పార్టీగానే నిలబడింది .. గ్లామరే శాశ్వతంగా నిలబెడితే స్వయంగా  ఎన్టీఆర్  లో చిత్తరంజన్ అనే సామాన్య కాంగ్రెస్ నేత చేతిలో 1989 లో ఒడేవారు  కాదు . 

 ఎన్టీఆర్, చిరంజీవిలతో పోలిస్తే పవన్ కల్యాణ్ ఎంత? అభిమానులు ఉండవచ్చు, హీరోలు ఏం మాట్లడినా వారు కేరింతలు కొట్టవచ్చు కానీ రాజకీయ పార్టీకి ఇదొక్కటే సరిపోదు. రాజకీయాలే కాదు చివరకు సినిమా సక్సెస్ కావాలన్నా ఒక్క అభిమానులతోనే సరిపోదు. అభిమానంతో ఒక్కో అభిమాని రెండుమూడు సార్లు సినిమా చూసినా అది సక్సెస్ కాదు. జనం మెచ్చితేనే నాలుగు రోజులు నడుస్తుంది. జన సేన అని రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు పవన్ ఈనెల 14న ప్రకటించారు. పార్టీ పెట్టాలా? వద్దా అని 13న సాయంత్రం వరకు ఆలోచించారట! ఈ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలో? వద్దో ఇంకా నిర్ణయించుకోలేదట! మంత్రి, ముఖ్యమంత్రి వంటి పదవులు తనకు తుచ్చమైనవట! ఇవన్నీ స్వయంగా పవన్ తన పార్టీ ప్రకటన సమయంలో వెల్లడించిన విషయాలు. ఇంత అస్థిరమైన ఆలోచనలు ఉన్న నాయకున్ని నమ్మే తమ రాజకీయ జీవితాలను పణంగా పెట్టి వచ్చే వారెవరుంటారు. ఒకవైపు తెలంగాణ ఏర్పడాలని చెబుతూనే మరోవైపు విభజన తీరు నచ్చక కాంగ్రెస్‌ను ఓడిస్తాడట! విభజన తరువాత సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది దాని కోసం ఈయనలాంటి పవర్ స్టార్ కృషి చేయడం ఎందుకు? 

ప్రజారాజ్యం సమయంలో తెలంగాణ బాధ్యత తీసుకున్నది పవన్ కల్యాణే. తెలంగాణలో ఆ సమయంలోనే ఆయన విస్తృతంగా పర్యటించారు. సామాజిక తెలంగాణ అనే నినాదంతో ప్రచారం చేశారు. అంతా చేస్తే తెలంగాణలో వారికి వచ్చినవి రెండు సీట్లు మాత్రమే. అన్నతమ్ముడు, కుటుంబం అంతా కలిసి ప్రచారం చేస్తేనే రెండు సీట్లు వస్తే ఇప్పుడు పవన్ ఒక్కడు చేసేదేముంది? చేస్తే వచ్చేదేముంది. పవన్ పార్టీ ఏర్పాటు వార్తలు చూసి వివిధ రాజకీయ పక్షాలు తొలుత కొంత సీరియస్‌గానే తీసుకున్నాయి. పవన్ రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చూశాక తేలిగ్గా నవ్వుకున్నారు. స్పందించాల్సిన అవసరం లేదనకున్నారు. బయ్యర్లు కొనేందుకు కూడా ముందుకు రాని శంకరాభరణం తెలుగు సినిమా చరిత్రలో రికార్డు సృష్టించింది, సూపర్ హిట్టవుతుంది, అధికారం కట్టబెడుతుంది అనుకున్న ఎన్టీఆర్ సినిమా బ్రహ్మార్షి విశ్వామిత్ర సినిమా అట్టర్ ఫ్లాపైంది, టిడిపి ఓడిపోయింది. ఏమో ఎవరు చెప్పొచ్చారు, బయ్యర్లు ముందుకు రావడం లేదని మీరనుకుంటున్న పవన్ రాజకీయ సినిమా కూడా అలానే హిట్టవ వచ్చు అనేది సినిమా అభిమానుల ఆశ. తన పార్టీ గురించి తానే సీరియస్‌గా ఆలోచించలేనప్పుడు ప్రజలు సీరియస్‌గా ఎందుకు తీసుకుంటారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ విజయాన్ని చూశాక ప్రత్యామ్నాయ రాజకీయ పక్షాల పట్ల ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. కానీ దురదృష్టం మన రాష్ట్రంలో డజన్ల కొలది పార్టీలు పుడుతున్నా, అలాంటి ఆశలు రేకెత్తించే పార్టీలు మాత్రం కనిపించడం లేవు. పేర్లలో తేడా తప్పా ఇప్పుడున్న పార్టీలన్నీ ఒకటే. కొత్త పార్టీలు రావాలి, జనం కోసం పని చేసేవిగా ఉండాలి. కొత్త తరం ఆశలు నెరవేర్చేలా? ఉండాలి. అంత సామర్ధ్యం పవన్ పార్టీకి ఉందనే నమ్మకం కలగడం లేదు. అంత శక్తి లేనప్పుడు పవన్ పార్టీ గురించి చర్చ ఎందుకు? అంటే సినిమా నటుల పట్ల ప్రజల్లో సహజమైన ఆసక్తి ఉంటుంది. ఈ చర్చ కూడా దానిలో భాగమే. అంతే తప్ప వారిని జనం సీరియస్‌గా తీసుకుంటున్నారా? లేదా అనేది అనేక ఎన్నికల ఫలితాలు తేల్చాయి. మరోసారి తేల్చనున్నాయి. 

పోటీ చేస్తానో లేదో అని స్వయంగా పవనే పార్టీ ప్రకటన సమయం లో  చెప్పాడు కాబట్టి పోటీ చేస్తే ఆయన బలమెంతో రెండు నెలల్లో తేలిపోతుంది. చేయకపోతే మరో ఐదేళ్లపాటు ఆయన ప్రచారానికి ఢోకా లేదు. మొత్తం మీద బయ్యర్లు జనసేనపై ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దని సలహా.

27, మార్చి 2014, గురువారం

దేశంలో -తొలి మహిళా హోంమంత్రి

ఒక్క నిర్ణయం -జీవితానే్న మార్చేస్తుంది.
సంక్షోభం సమయంలో సమయస్ఫూర్తిగా తీసుకున్న చిన్న నిర్ణయం -ఆమె రాజకీయ జీవితాన్ని వెయ్యిమైళ్లు ముందుకు తీసుకుపోయింది. దేశంలోనే -తొలి మహిళా హోంమంత్రిని చేసింది.
చంద్రబాబు సీఎం పీఠంపై ఉన్నపుడు -పార్టీ ఎమ్మెల్యే ఎవరు మరణించినా భార్యకు టికెట్ ఇచ్చే సంస్కృతి తెచ్చారు. దాని ప్రకారం -ఒక దశలో 12 మంది వితంతువులు సభలోకి ప్రవేశించారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంద్రారెడ్డి మరణించారు. సొంత పార్టీ వారేకాకుండా ఇతర పార్టీ ఎమ్మెల్యే మరణించినా టికెట్ తమ పార్టీ నుంచే ఇస్తాననే ప్రతిపాదనతో బాబు ముందుకొచ్చారు. 


జిల్లాలో చక్రం తిప్పుతున్న దేవేందర్‌గౌడ్, మేనల్లుడు మహేందర్‌రెడ్డి, బంధువులంతా తెదేపా టికెట్ తీసేసుకో.. 2020 వరకూ ఆ పార్టీకి ఢోకాలేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వైఎస్సార్ -నా మాట నమ్మండి. తెదేపా పనైపోయింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. బాగా ఆలోచించండి! -అని ఇచ్చిన సలహా ఆమె రాజకీయ జీవితానికి సోపానంగా మారింది. సంక్లిష్ట పరిస్థితిలో సమయస్ఫూర్తి నిర్ణయం తీసుకున్న ఆమె -సబితా ఇంద్రారెడ్డి. కాళ్లదగ్గరకు వచ్చిన చాన్స్ వదులుకున్నారని అంతా జాలి చూపినా -ఆమె ధైర్యం వీడలేదు. కాంగ్రెస్ తరఫునే పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. పోటీ చేశారు, విజయం సాధించారు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పదేళ్లపాటు మంత్రిగా ఉన్నారు.


దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ ప్రభుత్వంలో పని చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా భర్త రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్నందున రాజకీయాల్లో ఆమె ఎలాంటి ఇబ్బందీ పడలేదు. ఇంద్రారెడ్డి భార్యగా రాజకీయాల్లో ప్రవేశించి -సొంత వ్యక్తిత్వంతో ధృడంగా, స్వతంత్రంగానే వ్యవహరించారు.
వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్సార్‌ను ముఖ్యమంత్రిని చేసిన పాదయాత్రకు తొలి అడుగు పడింది చేవెళ్ల నుంచే. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొత్త పథకమైనా చేవెళ్ల నుంచే ప్రారంభించేవారు. వైఎస్సార్ రెండోసారి విజయం సాధించాక రచ్చబండను తిరుపతి నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ -ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
చేవెళ్ల నుంచి రెండుసార్లు, మహేశ్వరం నుంచి ఒకసారి విజయం సాధించారు సబిత. వైఎస్ ప్రభుత్వంలో గనుల మంత్రిగా పని చేశారు. ఆకాలంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై సిబిఐ కేసు ఎదుర్కొంటున్నారు. బిఎస్సీ చదివిన సబితా ఇంద్రారెడ్డి ఉన్నంత వరకు గృహిణిగానే ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మరణించిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్‌ను దించేసే సమయానికి ఆయన హోంమంత్రి. భార్యాభర్తలు ఇద్దరూ రెండు వేర్వేరు పార్టీల ప్రభుత్వాల్లో హోంమంత్రులుగా పని చేసిన రికార్డు ఉంది. 


సబితకు ముగ్గురు పిల్లలు. కుమారుడు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హోంమంత్రిగా ఉన్న ఆమె ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆదేశాలను పట్టించుకోని పోలీసులు, ముఖ్యమంత్రి ఒత్తిడి, తెలంగాణవాదుల విమర్శలు వీటి మధ్య ఆమె ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. గనుల కేటాయింపుపై సిబిఐ కేసు వల్ల సబిత 2013లో మంత్రి పదవికి రాజీనామా లేఖ ఇచ్చారు.

26, మార్చి 2014, బుధవారం

మారువేషాల్లో మారీచులు!

కల్తీ జీవితంలో భాగంగా మారినప్పుడు అసలునే అనుమానంగా చూడాల్సి వస్తుంది అది లోక సహజం. అసలూ నకిలీ కవలపిల్లల్లా కలిసిపోయాయి. మీరు చూస్తున్నది అసలైన బిజెపి కాదు నకిలీలు ఆక్రమించుకున్న బిజెపిని అని ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులు జస్వంత్ సింగ్ కంటతడిపెట్టి మరీ చెబుతున్నారు. ఇదే మాట మరో రకంగా అద్వానీ చెబితేనే దిక్కులేదు, జస్వంత్ చెబితే పట్టించుకునేదెవరు? అసలు, నకిలీలను గుర్తిం చే బాధ్యత వాజ్‌పాయికి అప్పగించవచ్చు కదా? అంటే ఆయన అసలునే గుర్తించే స్థితిలో లేరు ఇక నకిలీనేం పట్టుకుంటురనే సమాధానం వస్తోంది. 

శ్రీరాముడ్ని నమ్ముకుని ఒక దశలో కమలం పువ్వును వెనక్కి పంపి శ్రీరాముడినే పార్టీ గుర్తుగా మార్చుకుంది బిజెపి . అచ్చం శ్రీరాముడికి వచ్చిన సమస్యనే ఇప్పుడు బిజెపికి వచ్చిపడింది. అప్పుడు శ్రీరాముడు నకిలీని గుర్తించలేక మాయలోపడిపోతే ఇప్పుడు శ్రీరాముని భక్తులు నకిలీని గుర్తించి కూడా మాయలో పడ్డారనేది బాధితుల ఆవేదన.
ఒక ప్రక్షిప్త కథలో మారీచునితో రావణుని సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. రావణుడు మారీచుడ్ని పిలిచి ఓరే అబ్బాయ్ నేను సీతను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను. శ్రీరాముడి ఉండగా అది సాధ్యం కాదు.... నీవు బంగారు లేడిగా మారి సీతకు కనబడు. ఆమె నిన్ను పట్టుకు రమ్మని శ్రీరామున్ని పంపుతుంది తరువాత కథ నేను చూసుకుంటాను. అయితే శ్రీరాముడు చాలా తెలివైన వాడు సుమా జాగ్రత్త అని చెబుతాడు. రావణుడు చెప్పినట్టే పని ముగించుకుని వచ్చిన మారీచుడు. బాస్ మీరూ శ్రీరాముడి గురించి మరీ ఎక్కువగా చెప్పారు. బంగారు లేడి ఉంటుందని నమ్మిన శ్రీరాముడు తెలివైన వాడంటారేంటి అని అడుగుతాడు.
ప్రొఫెసర్ జ్ఞానాన్ని మరో ప్రొఫెసరే అంచనా వేయాలి కానీ ఏడో తరగతి కుర్రాడికి ఆ పని చేబితే ఏంటో పిచ్చి ప్రొఫెసర్ అనుకుంటాడు నువ్వు అలానే అనుకుంటున్నావని చెప్పి మారీచుడ్ని పంపించేస్తాడు రావణుడు. 


అది సరే మరి శ్రీరాముడు బంగారు లేడిని ఎందుకు నమ్మాడు అంటే అలా నమ్మితేనే కదా? సీతాపహరణ జరుగుతుంది, రావణ సంహారం జరగాలంటే అలా నమ్మి తీరాలి. మారీచుడు బంగారు లేడి వేషంలో వస్తే లోక కల్యాణం కోసమే సీతారాములు నమ్మారు.


దశాబ్దకాలం పాటు బిజెపి వాళ్లు జై శ్రీరాం అని నినాదం ఇచ్చారు. ఆ నినాదంతోనే అధికారం అనుభవించారు. జై శ్రీరాం నినాదం ఒకప్పుడు దేశ మంతా మారుమ్రోగింది. ఇప్పుడా శ్రీరాముడ్ని ఎక్కడో బంధించేసినట్టున్నారు. జై శ్రీరామ్ నినాదాలకు బదులు ఇప్పుడు హర హర నమో అనే నినాదాలు వినిపిస్తున్నాయి. నమో నమో అని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తే మంచిదే కదా? అని పెద్దలకు అనుమానం రావచ్చు, కానీ పిలుస్తున్నది కనిపించని దేవున్ని కాదు, వాళ్ల దృష్టిలో ఇప్పుడు మోడీనే కనిపించే దేవుడు అందుకే ఆయన్ని హర హర నమో అని పిలుస్తున్నారు. శ్రీరాముని జన్మభూమి అయోధ్య కన్నా పరమ శివుడు కొలువైన వారణాసి అందరి నోళ్లలో నానుతోంది.


శ్రీరాముడ్ని మించి నమో భక్తి చూపడం దేశానికి మంచిది కాదని హర హర నమో అన డం తగదనేది సాధువులు సన్యాసులు చెబుతున్నారు. శ్రీరాముడ్నే పక్కన పెట్టిన వారికి సాధుసంతులను పక్కన పెట్టడం ఓ లెక్కా! ఈ పూనకం చూస్తుంటే నమోనే అసలైన దేవుడు అని వాదించేట్టుగా ఉన్నారు.
అడుగడుగునా మారువేషాల్లో వస్తున్న వారిని జనం నమ్ముతున్నారంటే గత్యంతరం లేక మాత్రమే కానీ లోక కల్యాణం కోసం కాదు. వర్షాకాలంలో అంటు రోగాలు పిలవకపోయినా వచ్చినట్టు ఎన్నికల కాలంలో మారువేషాల్లో మారీచులు అడుగడుగునా కనిపిస్తారు. నా గుండెను చీల్చి చూడండి సోనియాగాంధీ కనిపిస్తుంది. నా గుండెను పిండి చూడండి చేతి గుర్తులు కనిపిస్తాయి అని వీర గీతాలు ఆలపించిన నాయకులు హఠాత్తుగా తెలుగు భవన్‌లో ప్రత్యక్షం అవుతున్నారు. అదేంటయ్యా అంటే ఇదే అసలైన కాంగ్రెస్ భవన్ అంటున్నారు. విన్నవాడికి బుర్ర తిరిగిపోతోంది. ఏది అసలైన టిడిపినో, ఏది అసలైన కాంగ్రెసో, ఏది నకిలీదో అర్ధం కాని పరిస్థితి. ఇప్పుడున్నది నిజమైన కాంగ్రెస్ కాదు అందుకే నేను పార్టీ మారుతున్నాను అంటూ గల్లా అరుణ టిడిపిలో చేరిపోయారు. ఆమె మాట్లాడిందాని ప్రకారం ఇప్పుడున్న టిడిపినే నిజమైన కాంగ్రెస్ అన్నమాట! టిడిపిలో కాంగ్రెస్ విభాగం ఏర్పాటు చేయవచ్చు కదా? అని ఒకరు ప్రశ్నిస్తే మా అధ్యక్షుడితో సహా మెజారిటీ కాంగ్రెస్ వాళ్లే ప్రత్యేక విభాగం ఎందుకు అని సమాధానం చెబుతున్నారు.


మిత్రుడి కోసం దుర్యోధనుడు అర్ధరాజ్యం ఇచ్చేస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం జగన్ కోసం కొండా సురేఖ ప్రజాస్వామ్యంలో రాజ్యం లాంటి పూర్తి మంత్రిపదవినే త్యాగం చేశారు. తెలంగాణ వాదులపై వీరోచిత పోరాటం చేశారు. ఆమెను మించిన పోరాట యోధురాలు మరొకరు లేరని టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు..... టికెట్ రాక బయటకు పోయే వాళ్లు ఇది నకిలీ టిఆర్‌ఎస్ అంటున్నారు. టిఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ నకిలీ తెలంగాణ పార్టీలని టిఆర్‌ఎస్ తేల్చేసింది.
ఏకపక్షంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించింది కదా ! రండి ఎన్నికల్లో మీ సంగతి చూపిస్తామని సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. పాత సినిమాల్లో ముఖంపై నల్లని పులిపిరి పెట్టుకుని ఇదే మారువేషం అనేవారు. ఇప్పుడు అలానే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పులిపిరిలానే తెల్ల దుస్తుల స్థానంలో పచ్చ దుస్తులు వేసుకోని మారువేషాల్లో వస్తున్నారు. పాపం ఓటర్లు ఇంకేం శిక్షిస్తారు.


మారువేషాన్ని గుర్తించినా ప్రేక్షకుడు వౌనంగా సినిమా చూసినట్టు మారువేషాల్లో వచ్చిన నేతలను జనం భరించాల్సిందే! ఇది నకిలీ వేషగాళ్ల కాలం. ఓటుకు దూరంగా ఉంటే నకిలీ నాయకులు నకిలీ ఓట్లు వేసుకుని గెలిచేయగలరు. అందుకే మనది నకిలీ ప్రజాస్వామ్యం అని ఎన్నికలను బహిష్కరించాలనే వారి వాదన.

ఆశావాది నీలకంఠాపురం

బలహీనమైన నేతకైనా బలమైన గొంతుండాలి. అప్పుడే రాజకీయాల్లో రాణించగలం. రాజకీయాన్ని నెగ్గుకు రాగలం. చిత్రమేమంటే రఘువీరాకు గొంతే కాదు, ఇంటి పేరూ గంభీరమే. అదే -నీలకంఠాపురం. ఈ పేరు వినగానే ఓ తెలుగు సినిమాలో శక్తివంతమైన పాత్ర ఇంటి పేరు గుర్తుకొచ్చేట్టుగా ఉంది కదూ!
నీలకంఠాపురం రఘువీరారెడ్డి. అనంతపురం జిల్లాలో బలమైన నాయకుడు. వైఎస్సార్‌కు నమ్మిన బంటుగా చివరి వరకూ నిలిచారు. వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా కుడి భుజంగా గుర్తింపు పొందిన ఇద్దరు ముగ్గురు నేతల్లో రఘువీరా కూడా ఒకరు. వైఎస్సార్ మరణం తరువాత జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నాక తొలుత పార్టీ మారేది ఈయనేనని అంతా అనుకున్నారు. వార్తల్ని ప్రచారంలో పెట్టారు. అయితే, నేను పార్టీ మారితే నన్ను సమాజం నుంచే వెలివేయండి -అని ధైర్యంగా ప్రకటించారు రఘువీరా. 


కాంగ్రెస్‌లో పుట్టాం. కాంగ్రెస్ గాలి పీలుస్తూ పెరిగాం. కాంగ్రెస్ ఉన్నంత వరకూ అక్కడే ఊపిరి తీసుకుంటాం -అంటూ ప్రకటించారు. ఇలా ప్రకటించిన వీర కాంగ్రెస్‌వాదులు చాలామంది -విభజన తరువాత ఒకరి తరువాత ఒకరు పార్టీ గోడ దూకారు. అప్పటి వరకూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు పంచన చేరారు. రాష్ట్భ్రావృద్ధి బాబు వల్లే సాధ్యమంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా టీవీ తెరలపై మొహమెత్తేలా చెప్పుకొస్తున్నారు. కానీ -రఘువీరా మాత్రం అక్కడే ఉన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసినా, ఎలా ఉన్నా ఫరవాలేదని ధైర్యంగా కాంగ్రెస్ నాయకత్వం చేపట్టారు.
పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు సారథ్యం చేపట్టేందుకు ఎవరైనా ముందుకొస్తాడు. ప్రతికూలతను ఎదురొడ్డి నిలిచిన వాడే నాయకుడని నమ్మడమే కాకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో, ఢిల్లీలో ఉన్నవారికి సైతం తెలుసు. అలాంటిది సీమాంధ్రకు నాయకత్వం వహిస్తున్న రఘువీరారెడ్డికి తెలియదని అనుకోలేం. కానీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవిని ఆయన చాలెంజ్‌గా తీసుకున్నారు. అధికారానికి వచ్చేస్తాం అనే ప్రగల్భాలేమీ పలకడం లేదు. పదేళ్లపాటు అధికారం అనుభవించిన వారు పార్టీ సమస్యల్లో ఉన్నప్పుడు అవకాశవాదం ప్రదర్శించారని మాత్రమే జనంలోకి వెళ్లేట్టు చేస్తున్నారు. నాయకత్వం వహించే అవకాశం లభించినప్పుడు ఏటికి ఎదురీదడానికి సిద్ధపడటమే నాయకుని లక్షణం. అలాంటి నాయకత్వ లక్షణాలు తనకు పుష్కలంగా ఉన్నాయని చాటి చెబుతున్నారు రఘువీరా. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌కు కష్టాలే. సీనియర్లు కొత్త పార్టీని చూసుకున్నారు. ఇంకా పోయేదేమీ లేదు కొత్తగా నిర్మించుకొని ముందుకెళ్తామనే సానుకూల దృక్ఫథంతో వెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారపక్షంలో ఉన్నా ప్రత్యర్థులపై గంభీరమైన కంఠంతో విరుచుకుపడే నీలకంఠాపురం ఇప్పుడు పార్టీ వీడి వెళ్లిన సొంత మనుషులపై అవకాశవాదులు అని విరుచుకు పడుతున్నారు.


అనంతపురం జిల్లా మడకశిర, కల్యాణదుర్గం నియోజక వర్గాల నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు రఘువీరా. అదే నియోజక వర్గంలోని నీలకంఠాపురంలో 1957 ఫిబ్రవరి 12న జన్మించారు. రఘువీరారెడ్డి తండ్రి కావేరప్ప ఈ గ్రామానికి 30 ఏళ్లపాటు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. కుమారుడు అమృతవీర్, కుమార్తె అమిత్‌వీర్. భార్య సునీత గృహిణి. 1987లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కాంగ్రెస్‌లో చేపట్టిన తొలి బాధ్యత. 1999, 2004లో మడకశిర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

2009లో కల్యాణదుర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 నుంచి మంత్రిగానే ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకునిగా ఉన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. నాయకత్వ లక్షణాలతోపాటు దైవభక్తి ఎక్కువే. నీలకంఠాపురం గ్రూఫ్ ఆఫ్ టెంపుల్స్‌కు చైర్మన్. మార్చి 11 , 2014న ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి చేపట్టారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అయిందని తెలిసినా బస్సు యాత్ర జరుపుతున్నారు. నాయకత్వం వహించేవారు ఆశావాదిగా ఉండాలి. రఘువీరారెడ్డి ఆశావాది.

25, మార్చి 2014, మంగళవారం

వై యస్ ఆర్ అలా దెబ్బ తీశాడు చిరంజీవిని .. కొందరి వాడు

నర్సాపూర్ దగ్గర గ్రామం -మొగల్తూరు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినూరు. సొంతిల్లూ ఇక్కడే ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన తరువాత.. -ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అక్కడికెళ్లారు. సొంతూళ్లో.. సొంతింటిని గ్రంథాలయం ఏర్పాటుకు ఇవ్వని ఈయన రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేస్తాడంటే నమ్ముతున్నారా? -అంటూ సెటైర్ వేశారు. అది చిరంజీవి గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. ‘హమ్మో రాజకీయాలు’ అనుకున్నాడు. రాజకీయ ఆట అంటే ఏమిటో ఆ దెబ్బతో మెగాస్టార్‌కు తెలిసొచ్చింది. చిరంజీవి ఇంటిని గ్రంధాలయంగా మార్చాలని  చాలా కాలం క్రితం  గ్రామస్తులు అడిగితే , చిరంజీవి ఒప్పుకోలేదు .. ఇంటిని అమ్మేశారు 


చిరంజీవి ‘అందరివాడు’ -హీరో. మేమూ అలాగే అనుకుంటే -ఆంధ్రావాడని నిరూపించాడని తెలంగాణ వాళ్లు తెగుడుతారు. మావాడూ కాదు -మంత్రి పదవి కోసం సీమాంధ్రను దగా చేసిన మోసగాడంటూ సీమాంధ్రులూ తిడతారు.


ఇదీ రాష్ట్రంలోని -రెండు ప్రాంతాల్లో చిరంజీవి పరిస్థితి. సినిమాల్లో మామాలు స్థాయిలో అడుగుపెట్టి మెగాస్థాయికి చేరుకున్న చిరంజీవి -రాజకీయాల్లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయారు. అన్నా నువ్వు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి. నా మరణమైనా నీలో కదలిక తీసుకురావాలి -అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడో అభిమాని ఖమ్మంలో. బహుశా.. భారతదేశంలో ఎక్కడా -పొలిటికల్ పార్టీ పెట్టమని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాగడా పెట్టి వెతికినా కనిపించదు. ఎన్టీఆర్ తనంతట తానే పార్టీ పెట్టాడు. కానీ చిరంజీవిని మాత్రం ఎంతోమంది అభిమానులు కోరితేనే పార్టీ పెట్టారని చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అల్లు బావ అరవింద్ చెప్పుకొచ్చారు. నిజమే కానీ -పార్టీ పెట్టాక అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఖమ్మంలో ఒక్క సీటు కూడా రాలేదు. ఇదీ, ఇదే నిజం.
53 ఏళ్ల వయసు అంటే ఒక ఉద్యోగి తన బాధ్యతలు పూర్తి చేసుకోవాలి. రిటైర్‌మెంట్ వయసు దగ్గరపడుతోంది అని కంగారుపడుతుండాలి. కానీ -రాజకీయ నేతకు అది నవ యవ్వనం. మరి సినిమా హీరోకు ఆ వయసు సంధియుగం. చరిష్మా కుంగి.. హీరోగా అవకాశాలు తగ్గి.. ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన తరుణం. ఎన్టీఆర్ హయాంలో హీరోల రిటైర్‌మెంట్ వయసు 60ఏళ్లు. చిరంజీవి కాలానికి అది 53ఏళ్లకు దిగింది. తనకున్న అపారమైన ఇమేజ్ ఒకవైపు, హీరోగా అవకాశాలు తగ్గిపోతున్న పరిస్థితి మరోవైపు.. రెంటినీ బేరీజు వేసుకుని ఇదే సరైన సమయమనుకుని చిరంజీవి 2008లో ప్రజారాజ్యం జెండా ఎగరేశారు. హీరో దారి మళ్లడానికి అది సరైన వయసు కావచ్చు, కానీ రాజకీయ రంగంలో అది సరైన సమయం కాదని ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. ఒకవైపు తన పథకాలతో జనంలో వైఎస్సార్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. బలమైన ప్రతిపక్షంగా తెదేపా తన స్థానాన్ని పదిలపర్చుకుంది. ఈ రెండు పక్షాలకు బలమైన మీడియా మద్దతూ ఉంది. ఇలాంటి అననుకూల పరిస్థితిలో రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి -తన లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు.


అంతా రెడీ అయ్యాక షాట్‌కు పిలిస్తే చెప్పినట్టు చేసి మెప్పించటం -నటన. అన్నిటికీ బాధ్యత వహించి అందరినీ మెప్పించటం -రాజకీయం. ఈ రెంటికీ తేడా తెలిసి సారాన్ని గ్రహించే సరికి జెండా పీకేయాల్సిన సమయం ఆసన్నమైంది. తెల్ల ఏనుగులాంటి ప్రజారాజ్యాన్ని నడపడం వల్లకాదని గ్రహించిన తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం పొంది కేంద్ర మంత్రి అయ్యారు. చిరంజీవి ఉదంతం సినిమా వాళ్లకు జ్ఞానోదయం కలిగించే చక్కని అంశం. తెరమీద గ్లామర్ సీన్లు చూసి చప్పట్లు కొట్టే అభిమాన జనమంతా పోలింగ్ బూత్‌కు పరిగెత్తుకొచ్చి ఒటువేసే జనం కాదని సినిమా వాళ్లందరికీ తెలిసి వచ్చేట్టు చేశారు చిరంజీవి. రీల్ హీరోలు.. రియల్ హీరోల మధ్య వ్యత్యాసం ‘చిరు’-సన్నివేశంతో సినిమా వాళ్లకు అర్థమైనట్టే.
ముక్తాయింపు: అందరివాడు కాదు మోసగాడంటూ -విభజన తరువాత తిట్టిపోస్తున్న సీమాంధ్రలోనే కాంగ్రెస్‌ను గెలిపించే ప్రచార బాధ్యతలు చిరంజీవి మోయాల్సి రావడం.  

24, మార్చి 2014, సోమవారం

ప్రజలకు అందుబాటులో ఉండడమే ఆయన తప్పు .... అలాయ్ బలాయ్ దత్తన్న

2004 ఎన్నికల సమయం. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ పైన కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ. ఎవరూ ముందుకు రావడం లేదు. నగరంలో ప్రముఖ నాయకుడని దానం నాగేందర్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే.. ‘నన్ను బలిపశువు చేయాలని చూస్తున్నారా? మీ ఆటలు సాగవు’ అని విమర్శించి పార్టీ మారి తెదేపాలో చేరారు. -‘అదేంటి దత్తన్న మీద పోటీ చేయడానికి కాంగ్రెస్‌లో ఎవరూ లేరా? ప్రజాస్వామ్యం అన్నాక ఎవరో ఒకరు పోటీ చేయాలి’ అని కమలం పెద్దన్న వెంకయ్యనాయుడే ఆశ్చర్యపోయారు. చివరకు అంజన్‌కుమార్ యాదవ్‌ను వెతికి పట్టుకొచ్చి మరీ పోటీ చేయించారు. అయితే ఏమైంది? అసలు పోటీనే లేదనుకున్న దత్తాత్రేయ ఓడిపోయారు. పెద్దగా పరిచయం లేని అంజన్‌కుమార్ యాదవ్ అనూహ్యంగా గెలిచారు.
ఎందుకలా జరిగింది! దత్తాత్రేయ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లా? -అంటే కాదు. అనుకున్న దానికంటే -ఎక్కువ అందుబాటులో ఉండటమే దత్తన్నకు అసలు సమస్య.


నమ్మి ఓటేస్తే.. గెలిచాక ఐదేళ్ల వరకూ కనిపించ లేదు. ఇదీ -దేశంలో ఏమూలకు వెళ్లినా రాజకీయ నేతల గురించి వినిపించే కామన్ ఫిర్యాదు. కానీ దత్తన్న విషయంలో మాత్రం సరిగ్గా దీనికి రివర్స్. ఎప్పుడూ నియోజక వర్గంలోనే ఉంటారు. ఇలాగైతే కష్టం.. ఇదీ ఆయనపై వినిపించే విమర్శ. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇలాంటి ఫిర్యాదులను బహిరంగంగానే ఎదుర్కొన్నారు. దత్తన్న -కేంద్ర రైల్వే మంత్రి కాదు.. సికింద్రాబాద్ మంత్రి. ఎప్పుడూ సికింద్రాబాద్‌లోనే ఉంటారన్న విమర్శలు తప్పలేదు. బిజెపిని ఇతర పార్టీలు అంటరాని పార్టీగా చూస్తారు. కానీ దత్తాత్రేయ ఏటా నిర్వహించే ‘అలాయ్ బలాయ్’లో మాత్రం అన్ని పార్టీల నేతలూ కనిపిస్తారు. ఆయన నిర్వహించే అలాయ్ బలాయ్‌లోనే కాదు.. తన వ్యక్తిత్వం ద్వారా అందరి అభిమానం సంపాదించుకున్న నాయకుడు -దత్తన్న.


2004లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత సచివాలయంలో ముఖ్యమంత్రి పేషీ వద్ద కనిపించిన ఓ సన్నివేశమిది. కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావు తొలిసారి ఎన్నికైన ఎంపీ అంజన్‌కుమార్‌ను అధికారులకు పరిచయం చేస్తూ -బండారు దత్తాత్రేయ మంచి నాయకుడు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయనపై గెలిచిన ఎంపీ అంజన్‌కుమార్ -అని పరిచయం చేశారు. పార్టీలకు అతీతంగా అంతా దత్తన్నను అభిమానిస్తారు.
బండారు అంజయ్య, ఈశ్వరమ్మ దంపతులకు 1946 జూన్ 12న హైదరాబాద్‌లో దత్తాత్రేయ జన్మించారు. 1980 నుంచి బిజెపిలో ఏదోక పదవిలో ఉంటూనే ఉన్నారు. బ్రహ్మాచారిగానే గడపాలనుకున్నారు. 43 ఏళ్ల వరకూ అలాగే గడిపారు. -‘పెళ్లంటూ చేసుకుంటే దత్తాత్రేయ బావనే చేసుకుంటా’నని మరదలు వసంత ఎదురు చూడటంతో.. 43 ఏళ్ల లేటు వయసులో 1989లో పెళ్లికి తలూపారు దత్తన్న. అయితే పెళ్లి తరువాత దత్తాత్రేయకు రాజకీయాల్లో కాలం కలిసొచ్చింది. అంతకుముందు అనేకసార్లు పోటీ చేసినా విజయం దక్కలేదు. పెళ్లి తరువాత ’91 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలుపొందారు. 96,98లో  గెలిచాక కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి పదవి చేపట్టారు. తరువాత రైల్వే శాఖకు మారారు. ’96లో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖలు రాయడం మొదలు పెట్టారు. ఒకదశలో లేఖోద్యమమే నడిపారు. బాబు, వైఎస్సార్‌ల హయాంలో రాసిన వందలాది లేఖలను పుస్తకంగానూ ప్రచురించారు. ఉస్మానియా వర్సిటీలో బిఎస్సీ చదివిన దత్తన్నకు రాజకీయంగా ఎంతటి పాపులార్టీ ఉందంటే.. ఒకదశలో సికింద్రాబాద్ బరిలో ఆయనకు ఎదరు నిలిచేందుకు సాహసించిన నేత లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి దత్తన్నకు -ఇప్పుడు సికింద్రాబాద్ సీటుకే చెక్ పెట్టే ప్రయత్నాలు బిజెపిలో సాగుతున్నాయి. దటీస్.. దత్తన్న!

23, మార్చి 2014, ఆదివారం

అతని జీవితం సినిమా కథ ... దొర గడీని కొన్న డాలర్ లక్ష్మయ్య


నేతా శ్రీ 6
అది ఖిలాషాపురం గ్రామం. మొత్తం ఊరిని శాసిస్తున్నట్టుగా సగర్వంగా తలెత్తుకుని నిలిచినట్టున్న ఊరి దొరగారి గడీ (పెద్ద భవనం). భవనం నుంచి రేడియోలో చక్కని పాటలు వినిపించేవి. ఓ కుర్రాడు రేడియో పాటలు వినడానికి తెల్లారకముందే భవనం గోడకు చెవి ఆనించేవాడు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని, అలా ఎదిగి ఆ భవనాన్ని, అందులోని రేడియోను కొని కాలుమీద కాలేసుకుని పాటలు వినాలని కలలుగన్నాడు. ఆ తరువాత కలలకే పరిమితం కాలేదు.వాటిని సాకారం చేసుకోవాలని కంకణం కట్టాడు. యువకుడిగా తన చదువు అతన్ని సంపన్నుడిని చేసింది. విదేశాలకు వెళ్లాడు, డాలర్లు సంపాదించాడు.. సొంతూరికి వచ్చాడు. వచ్చీ రాగానే భవనం గురించి వాకబు చేశాడు. అమ్మకానికి ఉందని తెలియగానే కొనడానికి ముందుకొచ్చాడు. అప్పటి వరకు రెడ్డిగారిదైన భవనం అప్పటి నుంచి ఆ యువకుడిది అయింది. భవనం అమ్మాక నాకు ఆ రేడియో కూడా కావాలని, ఎంతకైనా సరే కొంటానని ముచ్చట పడి రేడియోనూ కొన్నాడు. ఇదేదో సినిమా కథ అనిపిస్తుంది కదూ! అలా అనిపించొచ్చుగానీ, ఇది సినిమా కాదు. పొన్నాల లక్ష్మయ్య సొంత కథ. స్వయంకృషితో చదువును నమ్ముకుని ఉన్నతస్థాయికి ఎదిగిన ఒక గ్రామీణుడి కథ. ఆ ఇంటిని ఏనాటికైనా కొనాలనే తన లక్ష్యమే తనకు చదువుపై ఆసక్తి పెంచిందని, అమెరికాకు వెళ్లేలా చేసిందని చెప్పుకుంటారు ఆయన. ఏదైనా అనుకుంటే సాధించేంత వరకూ వదిలిపెట్టను అంటారాయన! ఆయన జీవితం లో మొదటి సగం సినిమా హీరో జీవితాన్ని తలపింప జేసే విధంగా ఉన్నా , ఇంటర్వెల్ తరువాత రాజకీయ జీవితం లో మాత్రం  ఆయన మరీ ఫన్నిగా వ్యవహరించారు .. తెలంగాణా  కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత సీరియస్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు . 

చిన్ననాటి లక్ష్యం వేరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం ఉన్నా, అది అంత సులభం కాదు.


ఇంటి పేరు పొన్నాల. ఆయన పేరు లక్ష్మయ్య. జనగామలో ఆయన గురించి తెలిసినవారు మాత్రం డాలర్ లక్ష్మయ్య అంటారు. ఒకప్పుడు రూపాయి కోసం ఆశగా ఎదురు చూసిన ఆయన తరువాత డాలర్ లక్ష్మయ్యగా మారారు. బాల్యంలో పేదరికాన్ని అనుభవించిన లక్ష్మయ్య కసితో చదివి ఇంజనీరింగ్ డిగ్రీతో అమెరికా వెళ్లి మాస్టర్ డిగ్రీతోపాటు డాలర్లతో తిరిగొచ్చాడు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితం, మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం, నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నిక. అయినా ఆయన చర్యలు మాత్రం సీరియస్ పాలిటిక్స్ నడుపుతున్నట్టుగా ఉండవు. మంత్రిగా ఉంటూ స్విమ్మింగ్ చేస్తూ కెమెరాలకు ఫోజులిస్తాడు. కెమెరాల కోసం ఆయన చేయని చిలిపి పని లేదు.
వరంగల్‌లో 94 సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు సాగుతున్న కొంతసేపటికి పొన్నాల లక్ష్మయ్య లేచి విలేఖరులకు నమాస్కారం చేసి వెళ్లిపోసాగారు. అదేంటి ఇంకా సగం కూడా ఓట్ల లెక్కింపు జరగలేదు, అప్పుడే వెళ్లిపోతున్నారేంటని అడిగితే -‘చివరి వరకు ఉండటం వృధా. ఫలితం తేలిపోయింది. ప్రజల తీర్పు అలా ఉంది.. ఆమోదించాల్సిందే’ అంటూ వెళ్లిపోయారు. సాధారణంగా నాయకులకు చివరి ఓటు వరకూ గెలుపుపై ఆశ చావదు. కానీ ఎప్పుడూ బోళాగా నవ్వుతూ ఉండే పొన్నాల అంత హుందాగా ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే ఓటమి అంగీకరించడం ప్రత్యేకంగా నిలిచింది.


కాంగ్రెస్‌లో ఎవరికి వారే హీరోలు. ఎవరూ ఎవరి మాటా వినరు. అలాంటిది కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఈ పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్‌కు పొన్నాల లక్ష్మయ్య సారథి. అంటే -తెప్పతో నడి సంద్రంలో సాహసాలు చేయడం లాంటిదే. అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేని పార్టీలు సైతం ‘పవర్లోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి’ అంటూ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో.. ‘మా పార్టీ అధ్యక్షుడే బీసీ’ అని చెప్పుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు. 1945 ఫిబ్రవరి 1న వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో జన్మించిన పొన్నాలకు ఇద్దరు కుమారులు.

20, మార్చి 2014, గురువారం

కుండబద్ధలు కొట్టే సిల్లీ నేత టిజి వెంకటేష్

నేతా  శ్రీ 5 

కర్నూలులో రాయలసీమ హక్కుల ఐక్యవేదిక తొలి బహిరంగ సభ. జనం పెద్ద సంఖ్యలోనే వచ్చారు. వేదిక ఎందుకు ఏర్పాటు చేశారో? వెంకటేశ్ ఏం చెబుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెంకటేశ్ ఒక కుండను తీసుకొచ్చి వేదిక ముందు పెట్టాడు. జనంలో మరింత ఆసక్తి పెరిగింది. కొద్దిసేపటి తరువాత వెంకటేశ్ పెద్ద కర్రను పట్టుకుని ముందుకొచ్చాడు. ఆయన ముఖాన్ని చూసిన వారు ఎవరిపైనో దాడికి వచ్చాడనుకున్నారు. కర్రను పైకి లేపి బలంగా కుండపై కొట్టాడు. అది బద్దలైంది. ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు. అప్పుడు మైకు వద్దకొచ్చిన టీజీ వెంకటేశ్ -నేను ఏంచెప్పినా కుండబద్దలు కొట్టి చెబుతాను -అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. రాజకీయాల్లో ఆయన సిల్లీ పనులకు ఇదో ఉదాహరణ. ఆయన సీరియస్‌గా చెప్పాలనుకున్నారో, మీడియా దృష్టిని ఆకట్టుకోవాలని ప్రయత్నించారో కానీ జనం అంతా ఆయన చర్యను సిల్లీగానే తీసుకున్నారు.


రాముడు- భీముడు సినిమాలో రాముడు అమాయకంగా కనిపిస్తే, భీముడు అందరినీ చితగ్గొడుతుంటారు. రెండు పాత్రల్లోనూ ఎన్టీఆర్ ఇమిడిపోయారు.
సరిగ్గా టీజీ వెంకటేశ్ కూడా అంతే. వ్యాపారాల్లో అయన ఎంత సీరియస్‌గా ఉంటారో, రాజకీయాల్లో అంత సిల్లీగా ఉంటారు. ఆ వెంకటేశ్ ఈ వెంకటేశ్ ఒకరేనా? అని చూసిన వారు ఆశ్చర్యపోవాలి.
ఆదోనికి చెందిన టీజీ వెంకటేశ్ రాయలసీమకు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబం. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడుల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. విజయవంతమైన వాణిజ్య వేత్తకు ఏ సమయంలో ఏం చేయాలో బాగా తెలుసు. రాజకీయాల్లో సైతం టీజీ వెంకటేశ్ ఈ సూత్రాన్ని చక్కగా పాటిస్తున్నారు.


టి డిపి ఎమ్మెల్యేగా ఉంటూనే బిజెపికి చేరువయ్యారు. కర్నూలులో టిడిపి ఎమ్మెల్యేగా బిజెపి సమావేశాలకు హాజరయ్యారు. 2004లో ఓడిపోగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై రోశయ్య మంత్రివర్గంలో మంత్రి అయ్యారు, కిరణ్ మంత్రివర్గంలోనూ స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పని ఖాళీ అయిందని భావించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వ్యాపారవేత్తగా ఇప్పుడు మళ్లీ టిడిపిలో చేరారు. సీమాంధ్రను అభివృద్ధి చేయగల సామర్థ్యం బాబుకే ఉందని చెబుతున్నారు. బాబును వీడివెళ్లిన పదేళ్ల తరువాత ఆయన బాబు సామర్థ్యాన్ని గుర్తించారు.


తన పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగుల్లో మద్యం, సిగరేట్ తాగే అలవాటు లేనివారికి ప్రత్యేక ప్రోత్సహాకాలు ఇచ్చారు.
కర్నూలులో కెఇ కృష్ణమూర్తి వర్గంతో రాజకీయ వైరం. చివరకు కేబుల్ టీవీలకు సైతం ఈ వైరం ప్రాకింది. సై అంటే సై అంటూ నెలకు ఐదు రూపాయలకే కెబుల్ టీవీ కనెక్షన్ ఇచ్చి ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీ గూటిలో ఉన్నారు. పవర్ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తున్న టీజీ వెంకటేశ్ పవర్ పాలిటిక్స్‌ను బాగానే వంటబట్టించుకున్నారు.

19, మార్చి 2014, బుధవారం

భక్త హనుమాన్!

నేతా శ్రీ 4
విహెచ్.. వి హనుమంతరావు అనగానే గుర్తుకొచ్చేది యువజన కాంగ్రెస్. సరిగ్గా 42ఏళ్ల క్రితం ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1972 బ్యాచ్ యూత్ కాంగ్రెస్ లీడర్లతో సమావేశం నిర్వహించాలనీ ప్రయత్నించారు. యువజన కాంగ్రెస్‌కు అది స్వర్ణయుగం అంటారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు తాలుకా స్థాయిలో యువజన కాంగ్రెస్ నాయకుడు. హనుమంతరావు సార్థక నామధేయుడు. 1992నుంచి ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యులుగానే ఉన్నారు. ఇందిరమ్మ కుటుంబం పట్ల వీరవిధేయతే ఆయన రాజకీయ జీవితానికి పునాది... శాసన మండలి సభ్యునిగా, మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.
రాజీవ్ గాంధీ హత్య జరిగి ఉండకపోతే ముఖ్యమంత్రి పదవిలో ఆయన్ని తెలుగు లాలూప్రసాద్ యాదవ్‌గా చూసి ఉండేవాళ్లం. 


2004లో టిడిపిని ఓడించి వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో వైఎస్‌ గాలి చండ ప్రచండంగా వీస్తోంది. మధ్యాహ్నా సూర్యుడిగా వెలిగిపోతున్నాడు. అలాంటి సమయంలో సైతం వి హనుమంతరావుకు రాజ్యసభ సభ్యత్వం లభించింది. వైఎస్ కూటమికి ఇది ఏమాత్రం మింగుడుపడని విషయం. హైకమాండ్ వద్ద హనుమంతరావుకు ఉన్న పలుకుబడికి నిదర్శనం ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉన్నా, అద్భుతంగా ఉన్నా ఎలా ఉన్నా ఆయన మాత్రం కాంగ్రెస్ నాయకత్వానికి వీర విధేయుడిగానే ఉన్నారు. హనుమంత్ జీ అంటూ రాజీవ్‌గాంధీ ఆయన్ని ముద్దుగా పిలిచే వారు. ముఖ్యమంత్రిగా నేదురుమల్లిని మార్చాల్సి వచ్చినప్పుడు రాజీవ్‌గాంధీ ఓటు హనుమంతుకే. అయినా ఎక్కువమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో ముఖ్యమంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. ఆయన మాటలకు మేకప్ ఉండదు, చేతలకు పాలిష్ ఉండదు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఈనాటి రాజకీయాలకు ఇది ఏమాత్రం సరిపోని తత్వం.

ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పనుల కోసం వచ్చిన వారితో ఆయన కార్యాలయం కిక్కిరిసిపోయి ఉంది. ఎక్సైజ్ అధికారి ఒకరు తానెంత మంచి వాడో, తనలాంటి వారి వల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనమో చాలాసేపు చెప్పుకొచ్చారు. తనను కోరుకున్న జిల్లాకు బదిలీ చేయడం వల్ల జిల్లాకు ఎంతో ప్రయోజనం అంటూ చెప్పుకొచ్చాడు. అంతా విన్న హనుమంతరావు ఫోన్ తీసుకుని వారి ఉన్నతాధికారికి ఫోన్ కలపమని చెప్పి ఇదిగో వీడికి మీరు బదిలీ చేసిన జిల్లాలో పెద్దగా గిట్టుబాటు కాదట! ఇంకో జిల్లాకు బదిలీ చేయండి అంటూ ఒక్క నిమిషంలో ముగించారు. ఆ మాటలతో ఆ అధికారితోపాటు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. 

ఓసారి పాలమూరు జిల్లాలో కారులో అనుచరుడితో కలిసి వెళుతున్నారు. తాము వెళ్లాల్సిన ప్రాంతం సమీపిస్తుండగానే ఏరా ఇక కారు అద్దాలు తీయమంటావా? పిసిసి అధ్యక్షుని పక్కన కూర్చొని వస్తున్నానని అందరికీ తెలవాలి కదరా! అంటూ తానే కారు అద్దాలు పైకి తీశాడు. ఆ అధికారి మనసులోని మాట, ఈ కార్యకర్త మనసులోని మాట అదే -కానీ పైకి చెప్పలేరు. హనుమంతరావు నిర్మోహమాటంగా చెప్పుతారు. అదే రాజకీయాల్లో ఆయన స్టయిల్. కోట్లు సంపాదించి సమాజం ఎక్కడికెళుతుంది అనే డైలాగులు చెప్పేరకం కాదు... ఆయన మాటల్లో, చేతల్లో ఏమాత్రం నటన కనిపించదు. కానీ ఆయన మాట్లాడినప్పుడు నటులను మించిన కామిడీ పండుతుంది. 

హైకమాండ్ అడ్రస్ 10 జనపథ్ అయితే వీరభక్త హనుమాన్‌ది 11 జనపథ్. 1948లో అంబర్‌పేటలో జన్మించిన హనుమంతరావు ఆర్థికంగా జూబ్లీహిల్స్ స్థాయికి చేరుకున్నా అంబర్‌పేటను వదలలేదు 65 ఏళ్ల హనుమంతరావు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌ఆర్, జగన్, కిరణ్ ఎవరినైనా సరే నిర్మోహమాటంగా తిట్టిన చరిత్ర ఆయనకు సొంతం.

ఫ్యామిలీ పాలిట్రిక్స్

ఫ్యాక్షన్ సినిమాలు, కంటి చూపుతో చంపే చిత్రాలు ఎన్నొచ్చినా ఫ్యామి లీ సినిమాలకు ఢోకా లేదు. సిని మా, రాజకీయం, వ్యాపారం ఏ రంగమైనా కావచ్చు ఫ్యామిలీ టైప్ అయితే ఢోకా లేదు. దేశంలో కెల్లా అత్యంత సంపన్నుడు అంబా నీ కుటుంబంలో వ్యాపార విభేదాలు వచ్చినా సంసార పక్షంగానే వాటిని పరిష్కరించుకున్నారు. అన్నాదమ్ములిద్దరు అమ్మ చెప్పినట్టుగానే విన్నారు. కోర్టుకు వెళ్లి ఉంటే ఇప్పుడు అంబానీ బ్రదర్స్ దేశంలో కెల్లా సంపన్నులు అని కాకుండా దేశంలో అత్యధిక లాయర్ ఫీజులు చెల్లించిన అన్నాదమ్ములుగా రికార్డు సృష్టించి ఉండేవారు. తాత స్టూడియో అధినేత, తండ్రి నిర్మాత, తనయుడు హీరో. ప్యా మిలీ నుంచి ఇంత బాగా కో ఆపరేషన్ ఉంటే ఆ హీరోకు ఎదురేముంటుంది. ప్యామిలీ ఎం టర్‌టైన్ మెంట్ సినిమాలకు మినిమం గ్యా రంటీ ఉన్నట్టుగానే ఫ్యామిలీ రాజకీయాలకు ఢోకా లేదు.


***
‘‘ఏమండీ మా చిన్నాన్న కొడుక్కు మీరు టికెట్ ఇవ్వకపోతే వంటింట్లో కిరోసిన్ పోసుకుని తగలబడతాను, మీపై గృహ హింస కేసు పెడతాను మీ ఇష్టం’’ అని పంకజాక్షి కన్నీళ్లు కారుస్తోంది. ఆగవే పంకజం అసలే అన్ని ఎన్నికలు ఒకేసారి వచ్చి పడడంతో, ఎవడు మన పార్టీలో ఉన్నాడో, ఎవడు బయటకు వె ళ్లాడో, తెలిక నా బుర్ర వేడెక్కి పోతే నువ్వోటి. చిన్నింటి సంగతి ఎవరికీ తెలియదు. ఇక్కడైతే ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు అని వచ్చా ను. నువ్వు కూడా ఇలా ప్రాణాలు తోడేస్తే ఎలా పంకజం’’ అని వేడుకున్నాడు.


‘‘ మీరు ఏమైనా చేసుకోండి వాడికి టికెట్ ఇవ్వాల్సిందే. ఇదే మీ పెద్ద భార్య అడిగితే కాదంటారా? అంతేలేండి  చిన్నిలన్నా , చిన్న  భార్య అన్నా ఎవరికైనా చిన్న చూపే  చివరకు మీరు కూడా ఇ లా అవమానిస్తారని అనుకోలేదు’’అని పం కజం కన్నీళ్లు పెట్టుకుంది.
‘‘్ ప్యామిలీ టైప్ లో  ప్రయత్నిస్తే టికెట్ రాకుండా ఎక్కడికి పోతుంది. దశరథుడంతటి వాడు కైక ఏడుపుతో దిగివచ్చాడు నేను చెబుతున్నాను టికెట్ గ్యారంటీ’’ అని పంకజం తన బంధువులకు ఫోన్ చేసి చెప్పింది.


***
పార్టీ ఆఫీసుకు ఫోన్ చేస్తే రణగొణ ధ్వని తప్ప ఏమీ వినిపించడం లేదు. ‘‘సార్ రహస్య స్థావరం నుంచి మీరు ఇక్కడికి రాకపోవడమే మంచిది. టికెట్ ఇవ్వకపోతే కిరోసిన్ పోసుకుంటామని చాలా మంది వచ్చా రు’’ అని పిఎ చెప్పాడు.
పరాంకుశం విషయాలు తెలుసుకోవాలని టీవి ఆన్ చేశాడు.
టీవి లో బ్రేకింగ్ న్యూస్ అంటూ తన ఇంటినే చూపిస్తున్నారు. అమ్మా కిరోసిన్ బాబూ కిరోసిన్ అంటూ ఓ కుర్రాడు సైకిల్‌పై కిరోసిన్ డబ్బాలు పెట్టుకుని అమ్ముతున్నాడు. కిరోసిన్ డబ్బాకు ఐదువందలు అడిగితే మీ అమ్మ సొమ్మేదో ఎత్తుకెళుతున్నట్టు అలా చూస్తున్నారు అని ఆ కుర్రాడు మండిపడుతున్నాడు. ఇదిగో కావాలంటే తీసుకో లేకపోతే వెళ్లిపో, నా బేరాలు పాడు చేయకు అంటూ చిరాకు పడుతున్నాడు. 


క్యూలో ఉన్న మరో వ్యక్తి ఏమ్మా ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదు. ఐదు వందల ఖర్చుకు అంత ఇదైపోతే ఇక రాజకీయాల్లో ఏం నెగ్గుకొస్తావు అని ఆ మహిళపై చిరాకుపడుతున్నాడు. ఐదు వంద లు చెల్లించి ఆమె ఆ కుర్రాడిని మెల్లగా అడిగింది. అసలే ఎండలు బాగున్నాయి, కొంపదీసి మీద పోసుకోగానే మండిపోదు కదా? అంది. కావాలంటే చూడు అగ్గిపుల్ల గీసి పై న వేసినా మండదు. నాదీ గ్యారంటీ అని చెప్పా డు. కిరోసిన్ డబ్బాను తలపై పెట్టుకుని కొద్ది సేపు మీద పోసుకుని కొద్ది సేపు నిలబడితే చాలు బ్రేకింగ్ న్యూస్‌లు అంటూ టీవిల్లో లక్షల రూపాయల ప్రచారం వస్తుంది. ’’అని కుర్రాడు భరోసా ఇచ్చాడు.


ఉరితాళ్లు బాబు ఉరితాళ్లు .. 50 రూపాయలకే ఉరితాళ్లు అంటూ మరో చిన్నకుర్రాడు అరుస్తున్నాడు. ఉరి వేసుకోవడానికో స్తంభం ఉండాలి, వీధిలో లైవ్ షోకు ఉరితాడు ఉపయోగపడదు. చచ్చీ చెడి స్తంభం వెతుక్కున్నా, పొరపాటు జరిగిందా? మనం ఉండం శరీరం మాత్రం వేలాడుతుంది. ఉరితాడును నమ్ముకుంటే రాజకీయ జీవితానికి ఉరేసుకున్నట్టే. ఇది వర్కవుట్ కాదు అని ఉరితాళ్లు అమ్మే కుర్రాడిని అంతా నిరుత్సాహ పరుస్తున్నారు.


****
అధ్యక్షుడు రిమోట్‌తో మరో చానల్‌కు వెళ్లాడు. అనంతపురంలో టిడిపి నాయకురాలు రమాదేవి కిరోసిన్ డబ్బా నెత్తిన పెట్టుకుని ఎవరింటి ముందు తలపై పోసుకోవాలో అర్ధం కాక అందరి ఇళ్లకు వెళుతోంది. నిన్నటి వరకు పార్టీని మా భుజస్కందాలపై మోస్తున్నామని చెప్పిన నాయకులు ఒక్కసారిగా ఆ బాధ్యత మాది కాదంటే మాది కాదు అంటూ తప్పించుకోవడంతో ఆమెకు దిక్కుతోచడం లేదు. ఖమ్మం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీలో పోటీకి బి ఫారం ఇవ్వకపోతే కిరోసిన్ పోసుకుని కాల్చుకుంటాను అంటూ శ్రీదేవి అనే కాంగ్రెస్ నాయకురాలు బెదిరిస్తున్నారు. టీవి లో ఇలాంటి వార్తలన్నీ చూశాక పరాంకుశం కు ఆలోచనలో పడ్డాడు. ఒక్క ఐడియా తమ పార్టీ జీవితానే్న మార్చేస్తుంది అనుకున్నాడు.



***
టికెట్ కోసం సిన్సియర్‌గా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డవారు పార్టీలకు అతీతంగా తమ వివరాలు పంపాలని పరాంకుశం ఒక ప్రకటన ఇచ్చాడు.
తమ ఆత్మహత్యా ప్రకటన, కిరోసిన్ ఒంటిపై పోసుకున్న దృశ్యాలు, టీవిలో వచ్చిన వార్తల దృశ్యాల వీడియోలతో చాలా మంది అధ్యక్షునికి వివరాలు అందజేశారు.
***
అసలే రాష్టప్రతి పాలన కావడంతో పోలీసులు చురుగ్గా స్పందించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నేతలపై ఆత్మహత్యా యత్నం కేసులు పెట్టారు. వారే అందించిన ఆధారాలు ఉండడంతో పగడ్బందీగా కేసులు నమోదు చేశారు.

***
ఆశా వాహులంతా ఆత్మ హత్యా యత్నం కేసుల్లో బుక్కవ్వడం తో అన్ని పార్టీల అధ్యక్షులు ఊపిరి పిల్చుకొని ప్రశాంతంగా అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు 

18, మార్చి 2014, మంగళవారం

మీడియా డార్లింగ్... నారా బాబు

నేతా శ్రీ 3 .....                     మీడియా డార్లింగ్ ... అది బాబుకు ఇంగ్లీష్ మీడియా పెట్టుకున్న ముద్దు పేరు  . ’95లో ఆయన అధికారాన్ని లాక్కున్న తరువాత ప్రధానంగా మీడియా ప్రచారంపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఒకవైపు కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలి. మరోవైపు ప్రజల్లో విశేషమైన గ్లామర్ ఉన్న ఎన్టీఆర్‌ను మరిపించాలి. -అంటే మీడియానే శరణ్యం అని భావించారు. మీడియా రంజక పాలన సాగించారు. ఆ కాలంలో బాబుకు వచ్చిన ముద్దు పేరు -మీడియా డార్లింగ్. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నారు. అధికారం కోల్పోయి పదేళ్లు. అయినా ఇప్పటికీ ముద్దుపేరును ఆయన నిలబెట్టుకుంటున్నారు. 

2004లో ఘోరమైన ఓటమి. 2009లో మహా కూటమితో మహా పరాజయం. అయినా మీడియా ప్రచారంలో మాత్రం ఎప్పుడూ ఆయనదే పైచేయి. ఈ క్షణంలో కూడా ఏదోక చానల్‌లో ఆయన దర్శనమిస్తారు.
మీడియాకు సామాజిక బాధ్యత ఉండాలంటారు బాబు. రాష్ట్రంలో మీడియా మాత్రం పార్టీల వారీగా సామాజిక బాధ్యత నిర్వర్తిస్తోంది. నిజానికి బాబు ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నంత దుర్మార్గుడు కాదు. మీడియా చెబుతున్నంత మంచివాడూ కాదు. ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్‌కు జనాకర్షణ మాత్రమే తెలిసుండవచ్చు. కానీ చంద్రబాబుకు రాజకీయాలు తెలుసు. తెలుసు కాబట్టే జనాకర్షణ లేకపోయినా ఆకట్టుకునే విధంగా మాట్లాడలేకపోయినా, అధికారం దూరమై పదేళ్లవుతున్నా -ఇంకా వార్తల్లో నేతగానే నిలిచారంటే ఆయనలోని రాజకీయ చతురతే కారణం.


రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం. ఈ విషయంలో మాత్రం బాబు గ్రాఫ్ చాలా వీక్. అందుకే ఆయన ప్రత్యర్థులు దీనిపైనే గురి చూసి కొడుతుంటారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారనే మాట, విశ్వసనీయత లేదనే విమర్శలను ఆయన జీవిత కాలమంతా ఎదుర్కోక తప్పదు. ప్రచారం ద్వారా ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చునని, ఎలాంటి మాయనైనా చేయవచ్చునని నిరూపించారు బాబు. మంచి జరిగితే అది తనవల్లేనని, చెడు జరిగితే ఇతరుల వల్ల అని బ్రహ్మాండమైన ప్రచారం చేయగలరు. నిజానికి ఆయన ఒక రాజకీయ యంత్రం . వ్యక్తిగా ఎవరిపైన ప్రేమ ఉండదు. ద్వేషం ఉండదు. రాగద్వేషాలకు అతీతుడు. తన రాజకీయ జీవితానికి ఉపయోగరం అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు. పనికిరాడు అనుకుంటే ప్రచారంతో పాతాళానికి తొక్కగలరు. మసీదులు కూల్చే పార్టీ అని బిజెపిపై 96లో నిప్పులు చెరిగి మజ్లిస్ నాయకులను మించి విమర్శలు చేసిన బాబు, 98 ఫలితాలను చూసి బిజెపితో అంతే ఉత్సాహంగా చేతులు కలిపారు.
2004లో ఓడిపోగానే మీవల్లే ఓడిపోయానంటూ నెపం బిజెపిపైకి నెట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీపై నిప్పులు చెరిగి, హైదరాబాద్‌లో అడుగు పెట్టనిచ్చేది లేదని హూంకరించిన బాబు, ఇప్పుడు మోడీని మహాత్మాగాంధీతో పోల్చేందుకు ఏమాత్రం మోహమాట పడటంలేదు. మోడీ, గాంధీ ఇద్దరూ గుజరాత్‌లోనే పుట్టారని మోడీని ఆయన సమక్షంలోనే ఆకాశానికెత్తారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని డిమాండ్ చేసిన నాయకులు అలా గాంధీతో పోల్చడం మోడీకి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ బాబు మాత్రం వీటన్నిటికి అతీతుడు.... నిజానికి ఆయనకు మోడీపై ఒకప్పుడు ద్వేషం లేదు. ఇప్పుడు ప్రేమ లేదు. ఆయన మాటలన్నీ రాజకీయ లెక్కల్లో భాగంగానే ఉంటాయి. 


మేధావులను నడిచే గ్రంథాలయం అంటారు. బాబును నడిచే రాజకీయం అనొచ్చు. ముఖ్యమంత్రి పదవి కోసం బాబు ఎంతో తపిస్తున్నారో, అది అంత దూరంగా జరుగుతోంది. ఆ తపనే లేకపోతే ఆయన రాజకీయాల్లో ఉండలేరు. ఆ తపన కనిపిస్తే జనం ఆదరించడం కష్టం. బాబు ప్రస్తావన లేని రాష్ట్ర రాజకీయ చరిత్ర అసంపూర్ణం.

17, మార్చి 2014, సోమవారం

జనసేనాని

నేతాశ్రీ 2

24 రంగాలు కలిస్తే సినిమా! మరి ఎన్ని రంగాలు కలిస్తే రాజకీయం ? మహా మహానటులనే బోల్తా కొట్టిస్తుంది రాజకీయం. రాజకీయం కళా? కలనా?అంటే ఎవరికి తోచిన అర్ధం వాళ్లు చెప్పుకోవచ్చు కానీ అన్నీ కలిస్తేనే రాజకీయం. తలపండిన వారిని సైతం పిచ్చివాళ్లను చేసి ఆడించే రాజకీయ రంగంలో బుడ్డొడు ఏం చేస్తాడు.


చె గువేరా సినీనటుడు పవన్ కల్యాణ్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు. పవన్ చెగువేరాను నరనరాన జీర్ణం చేసుకున్నాడు. చెగువేరాకు బాగా నచ్చిన నవల డాన్ క్విక్సోట్. ఈ నవలలో హీరో క్విక్సోట్ రోసి నంటి అనే బక్కచిక్కిన గుర్రం ఎక్కి స్పెయిన్ దేశమంతా తిరిగి అన్యాయాన్ని ఎదిరిస్తూ, అనాధలను ఆదుకుంటూ ప్రజలను రక్షిస్తుంటాడు.
సరిగ్గా ఇలానే తెలుగు ప్రజలను రక్షించాలని పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ ఏర్పాటు  చేశారు . జనసేన పేరుతో రాజకీయ పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జనసేనాధిపతిగా ఆయన నిలవాలనుకుంటున్నారు. నవల కాబట్టి రచయిత ఇష్టం వచ్చినట్టుగా హీరో వీరోచిత కార్యాలు చేస్తారు. రాజకీయాల్లో అది సాధ్యమా? మహామహా మెగాస్టార్లనే బోర్లాపడేసిన రంగమిది. 

మనం బుడ్డొడు అని ముద్దుగా పిలుచుకున్నట్టు అర్జెంటినాలో చె అని పిలుచుకుంటారు.  చె  అంటే బుడ్డోడు అని. చెగువేరా పేరు అలా ఏర్పడిందే. చెగువేరాను ఇష్టపడే ఈ బొడ్డుడు రాజకీయాల్లో ఏం చేస్తాడు.
ఆవేశం ఒక్కటే రాజకీయాల్లో రాణించడానికి సరిపోతుంది అనుకుంటే అది పవన్‌కు బోలెడుంది. నాలుగు పదుల వయస్సున్న పవన్ కల్యాణ్ అన్న చాటు తమ్మునిగా సినిమాల్లోకి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. మిగిలిన హీరోల్లా కాకుండా సమాజం గురించి ఆలోచించడం, బాగా చదవడం, ఏదో చేయాలనే తపన సినిమా రంగంలో పవన్‌ను ప్రత్యేకంగా నిలిపింది. ఎంతో మందిని ఆదుకునే మంచి మనసున్న నటుడు అంటారు తెలిసిన వారు.


కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి కామన్ మ్యాన్ ప్రోటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినా, ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టి కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడదీసి కొడదామని తిట్టినా అది ఆవేశం నుంచి వచ్చిన చర్యలే.
రాజకీయాల్లో రాణించాలంటే సర్వకళల్లో ఆరితేరి ఉండాలి. కెమెరా స్టార్ట్ యాక్షన్ అనే మాటలు వినగానే నటిస్తే నటులకు సరిపోతుంది కానీ రాజకీయాల్లో అలా కాదు. నిశ్శబ్దంలోనూ, చిమ్మ చీకటిలో, నిద్రలోనూ, మెలుకువగా ఉన్నప్పుడు నిత్యం ప్రతి క్షణం నటిస్తూనే ఉండాలి. అది నటన అని ఏ మాత్రం తెలియకుండా నటించేంత సామర్ధ్యం ఉండాలి. అలా ఉన్నవాళ్లే రాజకీయ నాటక రంగంలో రాణిస్తారు. ప్రజారాజ్యంను చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత పవన్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సొంత బృందంతో రాజకీయాల్లోకి వస్తున్నారు.   ప్రశ్నించడం కోసం జనసేన పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట! పవన్‌ను అభిమానించే వారు, వ్యతిరేకించే వారు అంతా అనుకునే మాట పవన్ రాజకీయాల్లో ఇమడలేడు అని ఈ సంగతి కాలమే తేల్చాలి.

15, మార్చి 2014, శనివారం

తెలంగాణను సీమాంధ్ర నాయకుల రాజకీయ ప్రయోగశాలగా మార్చొద్దు

బిడ్డ చచ్చినా పురిటి కంపు పోలేదన్నట్టు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడినా... తెలంగాణను ప్రయోగశాలగా మార్చే కుట్రలు మాత్రం ఆగిపోలేదు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంస్కరణలు దేశంలో జోరుగా అమలవుతున్న కాలం అది. ఒంగ మంటే మోకాళ్లపై నిలిచి మొక్కుతున్నారని ఓ కవి అన్నట్టు తెలుగునాట అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి తెలంగాణను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంస్కరణల ప్రయోగ శాలగా మార్చేసింది. ఒకవైపు కరవు మరోవైపు సంస్కరణల పుణ్యం తెలంగాణ రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురిగొల్పింది.


ఆ సంస్కరణల నుంచి విద్యుత్ ఉద్యమం, విద్యుత్ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి, తెలంగాణ ఉద్యమం, చివరకు అది తెలంగాణ ఆవిర్భావానికి దోహదం చేసింది. ఇప్పుడు తెలంగాణ దేశంలోని 29వ రాష్ట్రం. బెర్లిన్ గొడ ముక్కలు జేబులో పెట్టుకుని తిరుగుతూ రెండు రాష్ట్రాలు కలిపేస్తాం అని, కోర్టుకెళ్లి రెండు రాష్ట్రాలను కలిపి ఏకం చేస్తాం అని మేధావులు ఎవరేం మాట్లాడినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దేశంలోని 28 రాష్ట్రాల వలెనే ఇదొక రాష్ట్రం. పగటి కలలు కంటున్నారా? లేక తమ పార్టీ పేరు జై సమైక్యాంధ్రకు న్యాయం చేసే విధంగా అలా మాట్లాడుతున్నారా? కారణం ఏదైనా కావచ్చు. కానీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటాం అనేది పాత మాట. తెలంగాణ ఏర్పడిపోయింది. గతంలో తెలంగాణను ప్రయోగశాలగా మార్చింది ఒక్క నాయకుడే అయితే ఇప్పుడు తెలంగాణను రాజకీయ ప్రయోగశాలగా మార్చేందుకు చాలా శక్తులే పని చేస్తున్నాయి. సంబరాలు జరుపుకునే కాలం కాదిది, తెలంగాణ సాధించిన శక్తులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన కాలం ఇది. టిడిపి చరిత్రలోనే వరుసగా రెండు సార్లు ఎప్పుడూ ఓడిపోలేదు. రెండు సార్లు ఓడిపోయిన తరువాత కూడా టిడిపి శాసన సభాపక్షం నాయకునిగా, టిడిపి అధ్యక్షునిగా చంద్రబాబునాయుడే కొనసాగారు.
తెలంగాణ ఉద్యమం సాగుతున్న కాలంలో తెలంగాణ పార్టీలో తెలంగాణ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నాగం జనార్దన్‌రెడ్డి లాంటి వారు కోరితే బాబు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీలో విలేఖరుల సమావేశంలో టీ ఇవ్వాలా? భోజనంలో ఏ ముండాలి అనేది కూడా నిర్ణయించే సర్వఅధికారాలు అధినేతకే ఉంటాయి. అలాంటి పార్టీలో తెలంగాణ టిడిపి ఫోరం అనేది అనధికారిక ఫోరమే అయినా తెలంగాణలో పార్టీని రక్షించుకోవడానికి అని బాబు ఆదేశాలతోనే దాన్ని ఏర్పాటు చేశారు. తొలి కన్వీనర్ నాగం జనార్దన్‌రెడ్డి, ఆయన రాజీనామా చేసి పార్టీ వీడి వెళ్లిన తరువాత ఎర్రబెల్లి దయాకర్‌రావును కన్వీనర్‌గా నియమించారు. డిసెంబర్ 9 ప్రకటన తరువాత దాదాపు ఐదేళ్లపాటు ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమానికి టిడిపి తరఫున నాయకత్వం వహించింది ఇద్దరూ అగ్రవర్ణాల వారే. ఒకరు రెడ్డి కాగా, రెండవ వారు టిడిపి నాయకులు నిత్యం దొరల పాలన అంటూ విమర్శలు చేస్తారు. ఆ వెలమ సామాజిక వర్గానికే చెందిన దయాకర్‌రావుకు బాబు బాధ్యతలు అప్పగించారు. అలాంటి బాబు ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణలో సామాజిక న్యాయం సాధిస్తానని అంటున్నారు. తెలంగాణలో టిడిపికి అధికారం అప్పగిస్తే బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇస్తున్నారు. తెలంగాణలో టిడిపి విజయావకాశాలపై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. కానీ తెలంగాణను ఇలాంటి ప్రకటనలతో రాజకీయ ప్రయోగశాలగా మార్చి అస్తవ్యస్తంగా మార్చాలనే వ్యూహం దీనిలో కనిపిస్తోంది. 

సామాజిక న్యాయంపై బాబుకు అంత ప్రేముంటే ఫోరం కన్వీనర్‌గా ఒక బిసిని ఎందుకు నియమించలేదు. మొన్నటికి మొన్న తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది తన సొంత సామాజిక వర్గానికి చెందిన గరికపాటి రామ్మోహన్‌రావుకు. ఆయన ఇతర ప్రాంతానికి చెందిన వారు కావచ్చు కానీ గత మూడు దశాబ్దాల నుంచి తెలంగాణలో పార్టీకి సేవ చేశారు. గతంలో అనేక సార్లు వరంగల్ జిల్లా శాసన సభ్యులంతా గరికపాటి పేరును సిఫారసు చేశారు. అయినా బాబు పట్టించుకోలేదు కానీ తీరా తెలంగాణ ఏర్పడిన తరువాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి అవసరమైనన్ని ఎమ్మెల్యే సీట్లు ఇకపై వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. అందుకే ఇంత కీలకమైన సమయంలో తెలంగాణకు చెందని గరికపాటిని తెలంగాణ నుంచి తెలంగాణ ఏర్పడిన సమయంలో రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. ఈ ఎంపికతో తెలంగాణలో టిడిపి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు బాగానే అంచనా వేసినట్టు స్పష్టమవుతోంది.
ఎలాగూ తనకు దక్కనప్పుడు విధ్వం సం సృష్టించాలి అన్నట్టుగా టిడిపి నాయకత్వ వైఖరి ఉంది. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రెండు రాష్ట్రాలది కొత్త కాపురమే. కొత్త కాపురంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రానికి బలమైన నాయకత్వం అవసరం. సీమాంధ్రలో ఇదే వాదన వినిపిస్తున్న చంద్రబాబు తెలంగాణకు వచ్చే సరికి మాత్రం మనం ఎలాగూ గెలవం అనే ఉద్దేశంతో టిడిపి గెలిస్తే బిసినే సిఎంను చేస్తాను అని ప్రకటిస్తున్నారు. తెలంగాణ టిడిపికి కమిటీకి ఒక బిసి నాయకుడ్ని అధ్యక్షుడిగా నిర్ణయించి ఈ ప్రకటన చేసినా బాగుండేది. ఫోరం కన్వీనర్‌గా ఒక బిసిని నియమించలేరు కానీ సిఎంను చేస్తాను అని హామీ ఇస్తున్నారు. సామాజిక న్యాయం తెలంగాణకు మాత్రమే కావాలా? సీమాంధ్ర ప్రజలు చేసుకున్న అన్యాయం ఏమిటి? సీమాంధ్రకు సామాజిక న్యాయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు చంద్రబాబునాయుడుదే. అంతే కాదు చివరకు ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు నిర్వహించిన రికార్డు సైతం ఆయనదే. ఇది సరిపోలేదా? ఇంకెంత కాలం కావాలి. సీమాంధ్రలో ఎన్ని పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ వైకాపా, టిడిపిల మధ్యనే ఉంటుంది. ఐతే జగన్ లేదంటే బాబే అక్కడ గెలిచేది. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న సీమాంధ్రలో సామాజిక న్యాయం చేస్తానని, ఒక బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని ఎందుకు ప్రకటించడం లేదు? దేవేందర్ గౌడ్ అనారోగ్యం వల్ల తెలంగాణ బిసి నాయకుడ్ని ఎంపిక చేసుకోవడం కష్టమే, కానీ సీమాంధ్రలో టిడిపికి బలమైన బిసి నాయకులు ఉన్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ బాధ్యతలు నిర్వహించిన కె.ఇ. కృష్ణమూర్తి వంటి హేమాహేమీలైన బిసి నాయకులు ఎందరో ఉన్నారు. ఇంత పెద్ద రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సి రావడం ఇబ్బందిగానే ఉందని ఆయనే చెప్పుకొచ్చారు. రెండు ముక్కలను పాలించిన వాళ్లు ఒక్క ముక్కతో అసంతృప్తి చెందే బదులు సామాజిక న్యాయం కోసం సీమాంధ్ర, తెలంగాణలో బిసిలను ముఖ్యమంత్రిని చేస్తాను అనే హామీ ఇవ్వవచ్చు కదా? 

2020 వరకు పాలించాలని కలలు కన్న ఆయనకు ఎంత కాలం పాలించినా సంతృప్తి అనేది ఉండ దు. సామాజిక న్యాయంపై ఆయనకు నిజంగా ఆసక్తి ఉండి చేసిన ప్రకటన కాదు. ఎలాగు గెలవని చోట ప్రత్యర్థులను, తనను వ్యతిరేకించిన ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టాలనే ఒక ఎత్తుగడ తప్ప మరోటి కాదు.
బాబు ప్రకటన వెలువడగానే కాంగ్రెస్ సైతం తెలంగాణలో ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించింది. పైగా రెండు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలకు బిసిలనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులను చేసింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు అని గతంలో కెసిఆర్ చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ అటు కాంగ్రెస్, ఇటు టిడిపి టిఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రకటనలతో ప్రయోగాన్ని చేస్తున్నారు. ఈ ప్రయోగం సఫలం అయితే ఆ పార్టీలకు కొన్ని సీట్లు వస్తాయి, విఫలం అయితే మేం వద్దన్నా తెలంగాణను సాధించుకున్నారు కదా? ఇప్పుడు అనుభవించండి అని మనసారా సంతోషించవచ్చు.
పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. కొత్త రాష్ట్రానికి తొలి ఐదేళ్లు అత్యంత క్లిష్టమైనవి. పొరుగున ఉన్నది లాబీయింగ్‌లో అత్యంత శక్తివంతులు. పొరుగు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సీమాంధ్రలో అధికారంలోకి వచ్చే పార్టీ వారితో సన్నిహితంగా ఉండే అవకాశాలే ఎక్కువ. తెలంగాణలో ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత, రైతాంగం బంగారు తెలంగాణ కోసం కలలు కంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు బలమైన నాయకత్వం కావాలి. హైదరాబాద్‌ను రియల్ ఎస్టేట్‌గా, తెలంగాణను ప్రయోగశాలగా, తమకు అధికారం కట్టబెట్టే ప్రాంతం గా మాత్రమే చూసిన, చూస్తున్న వారి మాటలను పట్టించుకోవలసిన అవసరం లేదు. తెలంగాణ సాధించిన వారికి సాధించిన తెలంగాణను సక్రమ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. అన్నాదమ్ముళ్ల పంచాయితీలో వద్దని ఎంత వారించిన వినకుండా తమ్ముడు విడిపోయినప్పుడు స్వయంగా అన్నకూడా వాడు చెడిపోతే బాగుండు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. అప్పుడు చెబితే విన్నావా? వద్దంటే విడిపోయావు అని చెప్పాలని తహతహలాడుతుంటారు. బాగు పడితే వాడు మా తమ్ముడే , నేను వేసిన పునాదులపై నడిచి బాగానే బాగుపడ్డాడు అని చెప్పుకుంటాడు.
తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు ఏది ప్రయోజనమో తెలంగాణ పార్టీలు ఆ నిర్ణయం తీసుకోవాలి. పొరుగు వారు తెలంగాణను ప్రయోగశాలగా మార్చేందుకు ఎంత మాత్రం అవకాశం ఇవ్వవద్దు. బలమైన నాయకత్వం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయాలి. తెలంగాణను మళ్లీ ప్రయోగశాలగా మార్చాలని ప్రయత్నిస్తున్న వారి అసలు స్వరూపాన్ని బహిర్గతం చేయాలి
.

13, మార్చి 2014, గురువారం

దివాకర్ ట్రావెల్స్ .. గాంధీ భవన్ టూ ఎన్టీఆర్ భవన్


కుటుంబం దెబ్బతిన్నప్పుడు గుర్తుకు వచ్చేది మేనమామ. మేనమామ అంటే తల్లి తరువాత తల్లిలా ఆదరిస్తాడు, తండ్రిలా భరోసా ఇస్తాడు. మాటల్లోనే కాదు చేతల్లోనూ దీన్ని రుజువు చేశారు అనంతపురం సీనియర్ నాయకుడు జెసి దివాకర్‌రెడ్డి. కరవు జిల్లా అనంతపురంలో అపరకుబేరుడు. తన కింద పని చేసే సాధారణ ఉద్యోగితో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టించిన మహనీయుడు. మైన్స్, ట్రాన్స్‌పోర్ట్, రాజకీయం వంటి అనేక వ్యాపారాల్లో ఆరితేరిన వారు. రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు వోల్వా బస్సును బహుమతిగా ఇస్తానని బహిరంగంగా ఆఫర్ చేసిన మహాదాత. ఆయన చితికి పోవడం ఏమిటని? సందేహం రావడం సహజమే. చితికి పోయింది ఆయన కాదు. ఆయన వోల్వా బస్సు తగలబడి అర్ధశతకం మంది అసువులు బాసినా ఆయన బస్సులు గంట కూడా నిలువలేదు. వ్యాపారం ఆగలేదు. 

చితికిపోయింది ఇంత కాలం ఆయన్ని ఆదరించి పెద్దవాన్నిచేసిన పార్టీ. కుటుంబం చితికి పోతే మేనమామను ఆశ్రయిస్తారు. అలానే రాజకీయ పార్టీ చితికిపోతే మేనమామ పార్టీనే కదా ఆశ్రయించాల్సింది. జెసి ఆదే చేశారు. సొంతంటిలో కన్నా అమ్మ పుట్టిల్లు అయిన మేనమామ ఇంటిలో మరింత స్వేచ్ఛ ఉంటుంది. అనంతపురంలో కాంగ్రెస్, టిడిపి నాయకులు కత్తులు దూసుకున్నా, పీకలు తెగ్గోసుకున్నా జెసి మాత్రం తాను కాంగ్రెస్‌లో ఉన్నా టిడిపితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలే నెరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడ్డా కింద పడకుండా ఉండడం వెనుక మ్యాజిక్ ఏమిటో జెసినే చెప్పారు. బాబు కాంగ్రెస్‌కు మేనమామ లాంటివారు, అండగా నిలవడం మేనమామ బాధ్యత అందుకే మా బాబు మేనమామలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడని చెప్పుకొచ్చారు. విభజనతో కాంగ్రెస్ పరిస్థితి అడవి గాచిన వెనె్నలగా మారిపోవడంతో మేనల్లుడు జెసి మేనమామను నమ్ముకుని టిడిపికి దూకేశారు. పరిటాల రవి హత్య సమయంలో జెసి పాత్ర ఉందని బాబు గగ్గొలు పెట్టాడు కదా? కార్యకర్తలను చంపించాడన్నారుకదా మరి ఎలా చేర్చుకుంటున్నారు అనే ప్రశ్నలు వంద వచ్చాయి. 

అన్నాదమ్ములే కోపం వచ్చినప్పుడు ఎన్నో తిట్టుకుంటారు. పార్టీలు అన్నాక అలాంటివి సాధారణం. మేనల్లుడు కష్టాల్లో ఉన్నప్పుడు మేనమామ పిలిచి ఆదరించడంలో విశాల హృదయాన్ని చూడాలి కానీ పాత కక్షలనుకాదు. ఒకే వేదికపై పరిటాల భార్య సునీత, జెసి దివాకర్‌రెడ్డి కూర్చోని రాష్ట్ర సంక్షేమం కోసం పాటు పడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎమ్మెల్యేలుగానే కాదు మంత్రులుగానే వారిద్దరు ఒకే వేదికపై కూర్చుంటారు. ఆరుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జెసి దివాకర్‌రెడ్డి 69 ఏళ్ల వయసులో పసుపు కండువాతో కొత్త పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నారు