30, మార్చి 2014, ఆదివారం

రాఖీ సావంత్ ఇజం వర్ధిల్లాలి

మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలా! ... జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవునరా! అని ఘంటసాల గొంతుతో శ్రీకృష్ణుడు ఎంత చెప్పినా మనం మాత్రం మత్తు వదల లేదు. అదే లే ... లే... లేలే నా రాజా!.. నన్ను లేపమంటవా? అంటూ పాడితే ఎంత నిద్రలో ఉన్నవారైనా లేచి కూర్చుంటారు. అదే పని ఇప్పుడు రాఖీ సావంత్ పార్లమెంటులో చేయబోతున్నారు. ఎంపిలు పార్లమెంటులో నిద్రపోతున్నారు తప్ప ప్రజల సమస్యలపై మాట్లాడడం లేదు. వారిని నిద్రలేపడానికే నేను పార్లమెంటులోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నానని రాఖీసావంత్ ప్రకటించారు. జనగణమన జాతీయ గీతం పాడేప్పుడు కూడా కెమెరామెన్లు, జర్నలిస్టులు కాస్సేపు వౌనంగా ఉండలేరు. కానీ రాఖీ సావంత్ ఈ మాటలు చెబుతున్నప్పుడు వారంతా కన్నార్పకుండా ఆమెనే చూస్తుండి పోయారట! ఆమె వేసుకున్న డ్రెస్సు వల్ల అని కొందరంటే కాదు జాతి నిద్ర లేపడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం పట్ల ఆకర్శితులై వౌనంగా వింటూ పోయామని ఒకాయన అన్నాడు. ఎంపిలను నిద్ర పోకుండా చేయాలనుకుంటున్న ఆమె సిద్ధాంతానికి రాఖీసావంత్ ఇజం అని పేరు పెట్టుకుందాం. ఏదో స్టార్ హోటల్‌లో ఆమె పార్టీని ప్రారంభించి చిన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాలు రాఖీసావంత్ ఇజం ఆవిర్భావానికి దారి తీసిన కారణాలు చెబితే బాగుండు సరే ఇప్పుడు కాకపోయినా తరువాతైనా చెప్పకపోతుందా?
పూవు పుట్టగానే పరిమళించినట్టు ..... పూవు సంగతి వదిలేసి రాఖీసావంత్ దగ్గరకొద్దాం. దగ్గరకంటే ఆమె దగ్గరకు కాదు వాళ్ల దగ్గరకు వెళ్లాలని ప్రయత్నిస్తే బౌన్సర్లు ఉంటారు. ఈడ్చి బయటకు పారేస్తారు.
రాఖీసావంత్ తొలుత క్లబ్బుల్లో డ్యాన్స్ చేసేవారు. ఎంత తాగిన వారైనా ఆమె డ్యాన్స్‌లతో హుషారుగా ఈలలు వేస్తూ యమ యాక్టివ్‌గా ఉండేవారు. అర్ధరాత్రి దాటినా నిద్ర పోయేవారే కాదు. సమాజాన్ని నిద్ర పోకుండా చేస్తున్న తనలోని శక్తి గురించి సావంత్‌కు అప్పుడే తెలిసొచ్చింది. ఈ చైతన్యాన్ని క్లబ్బుల్లో కొద్దిమందికే పరిమితం చేయకుండా విస్తరించాలని అనుకున్నారు. అటు నుంచి సినిమాల్లో ఐటెం గర్ల్‌గా ఐటెం సాంగ్స్ అవతారం ఎత్తారు. సినిమా కథ నచ్చక నిద్రలోకి జారుకునే వారు సైతం రాఖీసావంత్ ఐటెం సాంగ్స్ వచ్చిందంటే ఈలలు వేసి ఉత్సాహంగా గెంతులేసేవారు. ఒకవైపు తన అభిమానులు ఐటెం సాంగ్స్‌తో ఉత్సాహంగా గెంతుతుంటే కొందరు ప్రజాప్రతినిధులు చట్టసభల్లో నిద్ర పోవడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది.
తెలుగు నేతలు తొలి సంతకం అంటుంటే ఆమె మాత్రం తనను గెలిపిస్తే కత్రినా కైఫ్ నడుములాంటి రోడ్లు వేయిస్తానంటోంది. అమలు అవుతుందా? లేదా తరువాత కానీ ఆమె తొలి హామీ ఎంత సెక్సీగా ఉందనుకుంటున్నారు అభిమానులు. రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరుతో రాఖీసావంత్ ఇజంతో సొంత పార్టీని ఏర్పాటు చేశారు. అలానే ఒక ఇజం అంటూ దొరికినప్పుడు ఏదో ఒక పార్టీలో ఎందుకు చేరాలి, సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటే పోయేదేముంది. అనుకుంది ఆమె. ఎంతో మంది అధికారులు, వ్యాపారుల భార్యలు ఈ పార్టీలో చేరుతున్నారట, పార్టీ గుర్తు మిర్చి.. రాఖీకి మంచి టేస్ట్ ఉంది. ఏ సినిమాలో అయినా నిజంగానే ఆమె మిర్చి అంతా ఘాటుగా ఉంటుంది. ఆమెకు తగ్గట్టు మిర్చి గుర్తు ఎంచుకుంది. పార్టీకి ఆమె ఉపాధ్యక్షురాలే. అధ్యక్షురాలు ఎవరో? సన్నిలియోన్ అయితే బాగుండు అని కొందరి కోరిక. అప్పుడు మన ఎంపిలు పార్లమెంటులోనే కాదు ఇంటికి వెళ్లిన తరువాత కూడా నిద్రపోరు.
కమ్యూనిజం, క్యాపిటలిజం అంటూ ఎప్పుడో పుట్టిన రెండు సిద్ధాంతాల దగ్గరే ఆగిపోయారు. ఇంత కాలం అయినా కొత్త ఇజాల కోసం ఎవరూ ప్రయత్నించలేదు. కమ్యూనిజంకు కాలం చెల్లింది టూరిజం ఒక్కటే మిగిలింది అని అధికారంలో ఉన్నప్పుడు బాబు కొత్త ఇజం కనిపెట్టారు. ప్రజలు దాన్ని సరిగా స్వీకరించకుండా ఆయనకే కాలం చెల్లిందని చెప్పి ఇంటికి పంపించేశారు. ఆయన కూడా పదేళ్ల తరువాత అధికారం నిజం ఇజం అబద్ధం అనే ఇజంను నమ్ముకున్నారు..ఇప్పుడు పవన్ ఇజం అంటూ కొత్త ఇజం పుట్టింది. ఇంకేం మన కష్టాలన్నీ ఈ ఇజంతో తీరిపోతాయి అని అభిమానులు అనుకుంటుంటే... మేం ఎన్నికల్లో పోటీ చేయం, ప్రశ్నించడానికే మా ఇజం పరిమితం అంటున్నాడాయన! ప్రశ్నించడానికే అయితే ట్విట్టర్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో రాంగోపాల్‌వర్మలా ప్రశ్నిస్తే సరిపోతుంది కదా?పార్టీ ఎందుకు అని కొందరి ప్రశ్న. ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఎదుటివాడి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అది పవన్ ఇజం సిద్ధాంతానికి వ్యతిరేకం ఎదుటివారిని ప్రశ్నించడమే తప్ప ఎదుటి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడమే ఆయన ఇజం ప్రత్యేకత.
అన్నా హజారే ఉద్యమ సమయంలో పూనంపాండే అని ఒక మోడల్ వెలుగులోకి వచ్చారు. చాలా మందికి నిద్ర లేకుండా చేశారు. రాజకీయ ఉద్యమం ద్వారానే వెలుగులోకి వచ్చిన ఆమె కూడా పార్టీ పెడితే బాగుండు. ఆ మధ్య జస్పాల్ భట్టీ గోటాల పార్టీ ( కుంభకోణాల పార్టీ) అని ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన పోయారు. ఉండి ఉంటే గోటాల ఒక ఇజంగా మంచి గుర్తింపు పొంది ఉండేది. కాంగ్రెస్, బిజెపి లాంటి సీనియర్ పార్టీలు రాఖీసావంత్ కన్నా ముందున్నా ఎవరిని ఎప్పుడు ఎంపిక చేయాలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. డ్రీమ్‌గర్ల్‌ను పార్లమెంటుకు పంపాం ఇంకేం చేయాలి అని వాళ్లంటున్నారు. 60 ఏళ్ల హేమా మాలిని డ్రీమ్ బామ్మ అవుతుంది కానీ డ్రీమ్ గర్ల్ ఏమిటి? రాఖీసావంత్‌ను చట్టసభలకు పంపి ఉంటే ఇప్పుడు రాఖీసావంత్ ఇజం మీకు సవాల్ విసిరి ఉండేదా?
సినిమా నాలుగు రోజులు నడవాలంటే మధ్యలో ఐటెం సాంగ్స్‌ను జొప్పిస్తారు. రాజకీయాల పట్ల ప్రజలకు వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో రాజకీయాల్లోనూ ఐటెం సాంగ్స్ ద్వారా ఉషారెత్తిస్తున్నారు. కెవ్వు కేక ఐటెం సాంగ్ గబ్బర్‌సింగ్ సినిమా సూపర్ హిట్ కావడానికి ఎంతగా ఉపయోగపడిందో తెలిసిందే, ఇప్పుడా పాటనే టిడిపి సైతం నమ్ముకుంది. మా బాబు అభివృద్ధి చేశాడని ఎన్ని పాటలు ప్రచారంలో పెట్టినా పట్టించుకోవడం లేదు. దాంతో వాళ్లు కూడా ఇప్పుడు కెవ్వు కేక ఐటెం సాంగ్ ద్వారా టిడిపి మహోన్నత ఆశయాలను జనాలకు వివరిస్తున్నారు. వీరంతా కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తే ? అప్పుడు చూడాలి పార్లమెంటును... రాఖీ సావంత్ ఇజం , పవన్ ఇజం లాంటి ఆధునిక ఇజాలన్ని కలిస్తే పుట్టే కొత్త ఇజం చేతిలో నవ భారతం భవిష్యత్తు ??? ఒక సారి మీరే ఉహించుకోండి 

5 కామెంట్‌లు:

  1. రాఖీ సావంత్ ఇజానికి స్పూర్తి వరంగల్ జిల్లా (sic!) జమ్మికుంట వాస్తవ్యురాలు రాణీ రవీనా తేజస్విని :)

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. ప్రిజం లాంటిది జీవితం.యే ఇజం లోంచీ చూడకు దాన్ని!
    -
    కుక్క పిల్లా అగ్గిపుల్లా సబ్బు బిళ్ళా హీనంగా చూడకు దేన్నీ?

    ------ ఆనాటి కవి సమయాలు!

    ప్రిజాన్ని పగలగొట్టెయ్. కొత్త ఇజాల్ని సృష్టించెయ్.
    -
    నీతీ గీతా జాంతా నై, అన్నీ నీచమైనవేనోయ్.

    ----- ఈనాటి కవి సమయాలు?

    రిప్లయితొలగించండి
  4. "ఎదుటివారిని ప్రశ్నించడమే తప్ప ఎదుటి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడమే ఆయన ఇజం ప్రత్యేకత."

    కరెక్టుగా రాశారు. తరవాత వ్యక్తిగత విషయాలు అడగవద్దని పుట్ నోట్ కూడా పెట్టాడు. అడిగితే మీ వ్యక్తిగత విషయాలు కూడా బయట పెడతామని కాంగ్రెస్ వాళ్ళని అంటున్నాడు. మనకి కావలసిన వినోదం అదే కదా. ఈయనవి వాళ్ళు బయట పెట్టాలి. వాళ్ళవి ఈయన బయట పెట్టాలి. ఇంట్లో ఉన్నవాళ్ళని యెవరూ వ్యక్తిగత విషయాలు అడగరు. ప్రజా జీవితంలోకి వచ్చాక అన్నిటికి, అందరికి సమాధానం చెప్పాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నీ తెలిసినవే గదండీ, కొత్తగా తెలుసుకుని సరదా పడేదేముంది.రహస్యంగా యేదీ చెయ్యలేదుగా. అన్నీ పబ్లీకున టోకుగానే జరిగి పోతున్నయ్. యెంత నీచమయిన పనికయినా నీ ఇష్టం కానీయ్ నీకెవడయినా అడ్డొస్తే మేమున్నాం అని సపోర్టు చేసే జనాలు తయారయ్యారు. మా వాటా మాత్రం మాకు పడేస్తే చాలు.వీరప్పన్ కి అభిమానులూ, రాజకీయ పక్షాల్లోనే స్నేహితులూ ఉండటం మన కళ్ళ ముందే జరిగిందిగా. వీళ్ళూ అంతే.

      ఈ రాజకీయపు చట్రమే సరిగ్గా లేదు.మూలం దగ్గిర కొట్టనంతకాలం ఈ దరిద్రాలు మళ్ళీ మళ్ళీ రిపీత్ అవుతూనే ఉంటాయి.

      Why all these inevitable drastic things are happening again and again.
      English divided this country in such a way that two brethren races became bad neighbors.Now Congress, who boasts of itself as one and only representative of this counties past, present and future divided Andhra in such a away that people sharing a common language also became bad neighbors by the proliferation of hate speech.

      What an Irony? How cruelly history is repeating itself!

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం