24, మార్చి 2014, సోమవారం

ప్రజలకు అందుబాటులో ఉండడమే ఆయన తప్పు .... అలాయ్ బలాయ్ దత్తన్న

2004 ఎన్నికల సమయం. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ పైన కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ. ఎవరూ ముందుకు రావడం లేదు. నగరంలో ప్రముఖ నాయకుడని దానం నాగేందర్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే.. ‘నన్ను బలిపశువు చేయాలని చూస్తున్నారా? మీ ఆటలు సాగవు’ అని విమర్శించి పార్టీ మారి తెదేపాలో చేరారు. -‘అదేంటి దత్తన్న మీద పోటీ చేయడానికి కాంగ్రెస్‌లో ఎవరూ లేరా? ప్రజాస్వామ్యం అన్నాక ఎవరో ఒకరు పోటీ చేయాలి’ అని కమలం పెద్దన్న వెంకయ్యనాయుడే ఆశ్చర్యపోయారు. చివరకు అంజన్‌కుమార్ యాదవ్‌ను వెతికి పట్టుకొచ్చి మరీ పోటీ చేయించారు. అయితే ఏమైంది? అసలు పోటీనే లేదనుకున్న దత్తాత్రేయ ఓడిపోయారు. పెద్దగా పరిచయం లేని అంజన్‌కుమార్ యాదవ్ అనూహ్యంగా గెలిచారు.
ఎందుకలా జరిగింది! దత్తాత్రేయ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లా? -అంటే కాదు. అనుకున్న దానికంటే -ఎక్కువ అందుబాటులో ఉండటమే దత్తన్నకు అసలు సమస్య.


నమ్మి ఓటేస్తే.. గెలిచాక ఐదేళ్ల వరకూ కనిపించ లేదు. ఇదీ -దేశంలో ఏమూలకు వెళ్లినా రాజకీయ నేతల గురించి వినిపించే కామన్ ఫిర్యాదు. కానీ దత్తన్న విషయంలో మాత్రం సరిగ్గా దీనికి రివర్స్. ఎప్పుడూ నియోజక వర్గంలోనే ఉంటారు. ఇలాగైతే కష్టం.. ఇదీ ఆయనపై వినిపించే విమర్శ. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇలాంటి ఫిర్యాదులను బహిరంగంగానే ఎదుర్కొన్నారు. దత్తన్న -కేంద్ర రైల్వే మంత్రి కాదు.. సికింద్రాబాద్ మంత్రి. ఎప్పుడూ సికింద్రాబాద్‌లోనే ఉంటారన్న విమర్శలు తప్పలేదు. బిజెపిని ఇతర పార్టీలు అంటరాని పార్టీగా చూస్తారు. కానీ దత్తాత్రేయ ఏటా నిర్వహించే ‘అలాయ్ బలాయ్’లో మాత్రం అన్ని పార్టీల నేతలూ కనిపిస్తారు. ఆయన నిర్వహించే అలాయ్ బలాయ్‌లోనే కాదు.. తన వ్యక్తిత్వం ద్వారా అందరి అభిమానం సంపాదించుకున్న నాయకుడు -దత్తన్న.


2004లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత సచివాలయంలో ముఖ్యమంత్రి పేషీ వద్ద కనిపించిన ఓ సన్నివేశమిది. కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావు తొలిసారి ఎన్నికైన ఎంపీ అంజన్‌కుమార్‌ను అధికారులకు పరిచయం చేస్తూ -బండారు దత్తాత్రేయ మంచి నాయకుడు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయనపై గెలిచిన ఎంపీ అంజన్‌కుమార్ -అని పరిచయం చేశారు. పార్టీలకు అతీతంగా అంతా దత్తన్నను అభిమానిస్తారు.
బండారు అంజయ్య, ఈశ్వరమ్మ దంపతులకు 1946 జూన్ 12న హైదరాబాద్‌లో దత్తాత్రేయ జన్మించారు. 1980 నుంచి బిజెపిలో ఏదోక పదవిలో ఉంటూనే ఉన్నారు. బ్రహ్మాచారిగానే గడపాలనుకున్నారు. 43 ఏళ్ల వరకూ అలాగే గడిపారు. -‘పెళ్లంటూ చేసుకుంటే దత్తాత్రేయ బావనే చేసుకుంటా’నని మరదలు వసంత ఎదురు చూడటంతో.. 43 ఏళ్ల లేటు వయసులో 1989లో పెళ్లికి తలూపారు దత్తన్న. అయితే పెళ్లి తరువాత దత్తాత్రేయకు రాజకీయాల్లో కాలం కలిసొచ్చింది. అంతకుముందు అనేకసార్లు పోటీ చేసినా విజయం దక్కలేదు. పెళ్లి తరువాత ’91 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలుపొందారు. 96,98లో  గెలిచాక కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి పదవి చేపట్టారు. తరువాత రైల్వే శాఖకు మారారు. ’96లో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖలు రాయడం మొదలు పెట్టారు. ఒకదశలో లేఖోద్యమమే నడిపారు. బాబు, వైఎస్సార్‌ల హయాంలో రాసిన వందలాది లేఖలను పుస్తకంగానూ ప్రచురించారు. ఉస్మానియా వర్సిటీలో బిఎస్సీ చదివిన దత్తన్నకు రాజకీయంగా ఎంతటి పాపులార్టీ ఉందంటే.. ఒకదశలో సికింద్రాబాద్ బరిలో ఆయనకు ఎదరు నిలిచేందుకు సాహసించిన నేత లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి దత్తన్నకు -ఇప్పుడు సికింద్రాబాద్ సీటుకే చెక్ పెట్టే ప్రయత్నాలు బిజెపిలో సాగుతున్నాయి. దటీస్.. దత్తన్న!

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయానికి స్వాగతం