5, మార్చి 2014, బుధవారం

పాదుకా పట్టాభిషేకం

 ఆ నేత ఇంటికి యార్లీ వస్తున్నాడంటే, ఓడిపోయి దశాబ్దం కావస్తున్నా దేశ దేశాల ప్రముఖ నేతలు రోజూ కలుసుకోవడానికి వస్తూనే ఉంటారనిపించింది. తీరా ఆ వచ్చింది యార్లగడ్డ లక్ష్మీనారాయణ. స్టైల్‌గా యార్లీ అని మార్చుకుంటే ఈనెవరో ఒబామాకు అత్యంత సన్నిహితుడో, క్లింటన్ వేలువిడిచిన మేనల్లుడేమో అనుకుంటాం. పేరులో ఇంత మతలబు ఉంది. నాయుడమ్మ అనే పేరు ఆయన మేధస్సునేమైనా తగ్గించింది అని వాదించేవాళ్లు లేకపోలేదు. ఆయన మేధస్సుతో ప్రపంచంలో గుర్తింపు పొందాక నాయుడమ్మా అనే పేరును మనం గుర్తించాం కానీ అలా కాకపోతే ఆ పేరును గుర్తించే వాళ్లమా? ఒక్కో సీజన్‌లో ఒక్కో రకమైన పేర్ల హవా సాగుతుంది. రాము, కృష్ణ, వెంకటేశ్వర్లు, హనుమంతు వంటి పేర్లు ఐదారు దశాబ్దాల క్రితం ఒక ఊపు ఊపాయి. ఆ కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో హీరో పేరు గోపి అయితే వాళ్లింట్లో పని చేసే వ్యక్తి పేరు మాత్రం కచ్చితంగా రంగయ్య తాతానే అయి ఉండి తీరాలి. హిందీలో మాత్రం హీరో ఇంట్లో పని చేసే వ్యక్తి పేరు రామూ కాకా అనే ఉండేది.


ఆ కాలంలో వీరవెంకట సత్యవరప్రసాద్ లాంటి చాంతాడంత పొడుగు పేర్లుంటే ఈ కాలంలో రెండక్షరాలు, లేదా మూడును మించి కనిపించడం లేదు. ఖర్చులో పొదుపు పాటించక పోయినా నేటి తరం పేర్లలో మాత్రం చాలానే పొదుపు పాటిస్తోంది.


పక్కింటి పెళ్లాం ఎదురింటి మొగుడు, ఆవిడా మా ఆవిడే, నీ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది లాంటి చిత్రమైన పేర్లు ఒక దశలో తెలుగు సినిమాను ఏలేశాయి. తెలుగు అధికార భాష కాకముందు తెలుగు సినిమాల పేర్లు తెలుగులోనే ఉండేవి. అధికార భాషగా తెలుగును కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాక తెలుగు సినిమాలన్నీ ఇంగ్లీష్ పేర్లతోనే వస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలు మాత్రం తెలుగు పేర్లతో వస్తున్నాయి.
ఒక సినిమా హిట్టయితే అదే పేరును, కథను కొంచం అటూ ఇటూ మార్చి మరో వరుసగా సినిమాలు తీసినట్టు రాజకీయ పార్టీలు సైతం అదే మార్గం అనుసరించేవి. కాంగ్రెస్ పేరును వందలాది కాంగ్రెస్‌లు వచ్చాయి. జనతా మొదట క్లిక్కై, కనుమరుగై అనేక పార్టీలు పుట్టాయి. అందులో ఒకటి భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ మినహా అలా పుట్టిన మిగిలిన పార్టీలన్నీ ప్రాంతీయ జనతా పార్టీలుగానే మిగిలిపోయాయి. సామాన్యుడి వాహనం అని ఎన్టీఆర్ సైకిల్‌ను నమ్ముకున్నారు, ఆర్థిక సంస్కరణల తరువాత దేశంలో సైకిళ్లు తగ్గి కార్లు పెరిగాయి. సైకిల్ పార్టీ పరిస్థితి కూడా సైకిల్ మాదిరిగానే మారింది.


సామాన్యుడిని ఆకట్టుకునే పేర్ల విషయంలో నేతలు పోటీ పడుతున్నారు. మూడు దశాబ్దాల పాటు బెంగాల్‌లో పాతుకు పోయిన కమ్యూనిస్టు కోటలను చెయ్యి ఏమీ చేయలేకపోయంది. మూడు దశాబ్దాల పాలన వల్ల ఆ కోట పడిపోవడానికి సిద్ధంగా తయారైంది. ఆ సమయంలో మమతక్క గడ్డిపోచ కాంగ్రెస్( తృణముల్ కాంగ్రెస్)పేరుతో కాంగ్రెస్, కమ్యూనిస్టులను కలిపి మట్టికరిపించారు.
ఇదేదో బాగానే ఉందనుకుని కేజ్రీవాల్ సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని పేరు పెట్టడం కాదు సామాన్యుడే మా పార్టీ పేరు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టేసి అధికారం చేజిక్కించుకున్నాడు.


జగన్మోహనుడైన శ్రీమహావిష్ణువు ఒక్కో రాక్షసుడ్ని సంహరించడానికి ఒక్కో అవతారం ఎత్తినట్టుగా, కాంగ్రెస్‌ను సంహరించడానికే తాను అవతారం ఎత్తానని జగన్ గట్టి నమ్మకం. సోనియాను ఇటలీకి పంపించేద్దాం, కాంగ్రెస్ కాళ్లు నరికేద్దాం అంటూ ఆయన హూంకరిస్తున్నారు. ఏ కాంగ్రెస్ కాళ్లు నరకాలని ఆయన గర్జిస్తున్నారో, ఆయన పార్టీ పేరులో ఆ కాంగ్రెస్ కొలువై ఉండడటం రాజకీయ విచిత్రం.
ఎన్నికల ముందు కొత్త కొత్త చానల్స్ వచ్చినట్టుగానే కొత్త కొత్త పార్టీలు తెరపైకి వస్తాయి. తాము మద్దతు ఇచ్చిన పార్టీ అధికారంలోకి వస్తే చానల్ బతికి బట్టకడుతుంది లేదంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని మొక్కినట్టే.


మమత దీదీ, కేజ్రీ సోదరుని కన్నా ప్రత్యేకంగా ఉండాలని కిరణ్ కుమార్ ఆలోచిస్తున్నట్టున్నారు. ఆయన రాజకీయ సలహాదారులు రాజకీయంగా తెలివైన సలహాలు ఇవ్వకపోయినా పేర్ల విషయం మాత్రం మంచి సలహాలే ఇస్తు న్నారు. సీమాంధ్ర ప్రజలంతా జై సమైక్యాంధ్ర అని నినాదాలతో హోరెత్తించారు కదా ఇదే టైటిల్‌తో రాజకీయ సినిమా విడుదల చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని అనుకుంటున్నారు. కేజ్రీవాల్ చేతిని దెబ్బతీసేందుకు చీపురును నమ్ముకుంటే ఈ రెండు పని చేయాలంటే ఉండాల్సింది కాళ్లే కదా అని కిరణ్ పెట్టబోయే కొత్త పార్టీ గుర్తు పాదుకలైతే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట! కిరణ్ పార్టీ గెలిస్తే అన్ని మీడియా అంతా పాదుకాజపట్ట్భాషేకం అని చక్కని శీర్శికతో అదర గొట్టవచ్చు. గుర్రం నాడి దొరికింది ఇక గుర్రం దొరికితే చాలు అన్నట్టు పత్రికలకు మంచి శీర్షిక చిక్కిందని జనం పాదుక పట్ట్భాషేకం చేస్తారా? అనుమానమే.


శ్రీరాముడు అడవులకు వెళితే, భరతుడు వచ్చి నీవు వెనక్కి రాకపోయినా కనీసం నీ పాదులకైనా ఇస్తే వాటిని సింహాసనంపై పెట్టి పాలిస్తాను అని తీసుకెళతాడు. ఇది అన్నపై భక్తి అని వాల్మికి రాస్తే, అదేం కాదు అడవిలో శ్రీరామునికి కనీసం చెప్పులు కూడా లేకుండా భరతుడు చేసిన రాజకీయ కుట్ర అని విమర్శకులంటారు.రాజకీయాల్లో పాదుకలను తక్కువగా అంచనా వేయవద్దంటారు. సాధారణ గృహిణిగా తన పాదాలకున్న చెప్పును తీసి విసిరివేయడంతో ఏకంగా కేంద్ర మంత్రి వరకు ఎదిగిన రేణుకా చౌదరి పాదుక చరిత్ర తెలిసిందే కదా? రాజకీయాల్లో ఆమె పెట్టిన పెట్టుబడి ఒక్క చెప్పు మాత్రమే. కిరణ్ సైతం పాదుకలను నమ్ముకుని చూద్దాం అదృష్టం కలిసొస్తే పాదుకా పట్ట్భాషేకం లేదంటే కాసు బ్రాహ్మానందరెడ్డి పార్క్‌లో పాదుకలను వేసుకొని చక్కగా మార్నింగ్ వాక్ చేయెచ్చు.  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం